వాకిలి » జాజిమల్లి

బినామి
ఆరోజే మద్దిరావమ్మ సంబరం.

పొరుగూళ్ల నుంచి వచ్చిన చుట్టాలతో నిండిపోయి ఊళ్లో యిళ్లన్నీ విరగకాసిన వేరుశెనగగుత్తుల్లా ఉన్నాయి. పెరళ్లలో పూలతోటలన్నీ కళ్లింతలు చేసుకుని సంబరం చూడడానికి వీధిగుమ్మాల్లో పొందిగ్గా కూచున్నట్టు రంగురంగుల ముగ్గులు.

వాళ్లమ్మతో పాటు చీకట్నే నిద్రలేచి పొదీషనుగా తలంటుస్నానం చేసేసింది బుజ్జి. తల తుడుస్తుంటే చారుమతి నడుంచుట్టూ చుట్టి తలెత్తి మొహంలోకి చూస్తూ ” అమా.. అమా.. ఇవ్వాళ కూడా మనిద్దరమేనా?..మనింటికెవరూ రారా…?!” దిగులుగా అడిగింది. చారుమతి విననట్లుగా మొహం పెట్టి తల తుడిచిన పాత చీరను గట్టిగా దులిపి తీగ మీద ఆరేస్తూ “జుట్టిరబోసుకుని బైటకు వెళ్లమాకు. తలారేవరకూ వరండాలో నిల్చో” అంది.

బుజ్జికి కోపం వచ్చింది.

నడుస్తుంటే గొడుగులా విచ్చుకుంటున్న తుర్రపిట్ట రెక్కల రంగు పట్టులంగా కుచ్చిళ్లను విసురుగా తన్నుకుంటూ వరండాలోకి వచ్చింది. వరండా చీడీలకి కుడిచేతివైపునున్న పూలమొక్కలు రమ్మని తలలూపాయి. సీతమ్మవారి జడబంతుల మొక్క దగ్గరికి వెళ్లి ఒక పువ్వు మీదికి మొహం వంచి ” స్నానం చేసావా?” అంది. మొఖమల్‌ మెరుపుల పువ్వు గాలికి వయ్యారంగా వూగింది.

“చేసేసావా? సరే.. ఓయ్‌.. ఒంటిరెక్క మందారం.. రాధాకృష్ణ పూలచెట్టూ.. విరజాజులూ…కనకాంబరాలూ ..శంఖుమల్లీ..యిట్టా రండి…యివాళ సంబరం కదా! జాంచెట్టు పిన్నివాళ్లింటికి వెళ్లి ఆడుకుందాం పదండి.” బుజ్జి పిలవంగానే పువ్వులన్నీ వొచ్చి ఒళ్లో వాలాయి. వీళ్లను చూడగానే జాంచెట్టు పిన్నిగారు నీడచాప పరిచి జాంపళ్ల ఫలహారం పెట్టింది. అరగంటసేపు బహుపూలపాత్రాభినయం చేసేసరికి విసుగొచ్చి గభాలున లేచి వంటింట్లోకి పరిగెత్తి “అమా.. జుట్టారిపోయింది” అంది.

“జడేస్తాను…పా..దువ్వెన తెచ్చుకో” ఉత్తరపేపు గుమ్మం పైమెట్టు మీద కూచుంది చారుమతి. దువ్వెన, రిబ్బన్లు, కాటుక, ఎనిమిది రంగుల తిలకంబాక్సు తెచ్చుకుంది బుజ్జి.

జుట్టు చిక్కులు తీస్తూ ” పెళ్లయిన ఎన్నో ఏళ్లకి ఎన్నో పూజలుచేస్తే నువ్వు పుట్టావు. నువ్వు యింతున్నపుడు మీ నాన్న పోయాడు. వూరంతా అప్పులే… అన్నీ పోనూ ఏం మిగిలింది? ఈ రెండెకరాలుతప్ప. ఏలూర్లో కాపరం పెట్టమన్నారంతా.. ఆళ్లమాటే యినుంటే ఈ పాటికి అయిక్కిమనిపోయేవాళ్లం. అల్లాలూ బిల్లాలూ చేసి, వున్నది కూడా కాజేత్తారని చుట్టాలెవరినీ జేరనివ్వడంలా”. చారుమతి చెప్పేదంతా బుజికి కంఠోపాఠమే. సగం సగం వింటూ రిబ్బన్ని గులాబీ పువ్వులా చేయడానికి మడతలుపెడుతోంది.

“… నీకు ఒంటిమీదికి ఎనిమిదేళ్లువచ్చాయి. లొడబుచ్చకాయలా వాగుతూ అటూ యిటూ తిరక్కూడదు. అమ్మ చెప్పినట్లు వినాలి. అంతో యింతో చదువు చెప్పించి, నీ పెళ్లిగానీ చేశానంటే…అదుగో..మొగుడు లేకపోయినా చారుమతి కూతురు పెళ్లి ఘనంగా చేసింది అనుకోవాలందరూ”. జుట్టుని ఈతపాయల జడేసి రిబ్బను కుచ్చులు పోస్తూ అంది చారుమతి. ఎప్పటిలాగే తలూపింది బుజ్జి.

ఎడంచేత్తో లేతబుగ్గలు రెండూ ఒత్తి చూపుడు వేలుతో కింది రెప్పలాగి, కుడిచేతి ఉంగరం వేలితో అత్తారుబతంగా కాటుక దిద్దుతుంటే చారుమతి వీపు చుట్టూ చేతులు వేసి, నొక్కుకుపోయిన బుగ్గలతోనే..”అమా..షుట్టాలెవలూ ..లాలా? నిజ్జిమేనా?…” దింపుడు కళ్లం ఆశలా మళ్లీ అడిగింది.

విసుగ్గా చూసింది చారుమతి.

“పాడిందే పాటరా.. పాచిపళ్ల దాసరా.. అని

అదే పట్టుకుంటావే.. ఆయశుద్ధమయిన మాటొక్కటి రాదు నీకు”. ” వేలికి మిగిలిన కాటుక తలకు రాసుకుని, బుజ్జి తల మీద గట్టిగా మొట్టి ” వెళ్లు.. వెళ్లి ఆడుకో ఫో..” అంది.

కాటుకకళ్ల నుంచి కన్నీటిబొట్లు బుగ్గలమీదకి టపటపా జారాయి. ” ఎవళ్లతో ఆడుకోవాలీ..?” గట్టిగా అరిచి పరిగెత్తుకుంటూ వరండాలోకి వచ్చింది. ఓ పక్కగా ఎండుగడ్డితో చుట్టలు చుట్టిన ఎంటిక్కాయ కనిపించింది. కసిగా కాళ్లతో తన్నుతూ, దొర్లిస్తూ, వడ్లపురి చుట్టూ తిరిగింది కాసేపు.

చారుమతి తెచ్చిచ్చిన పాలు బుద్ధిగా తాగేసి, మూతి శుభ్రంగా తుడుచుకుంటూ, ” అమా..మరీ..సరోజిని వాళ్లింటికి వెళ్లి కూసేపు ఆడుకుని ఎమ్మటే వచ్చేత్తానేం…? లయగా కాదనడానికి నోరు రానంత జాలిగా అడిగింది మళ్లీ…

” అక్కడికెందుకే?” ఆళ్లు పిండొంటల బట్టీ పెట్టారు. మళ్లా మీ అమ్మేం వండిందని కూపీలు లాగుతారు. వద్దులే..అయిమావతి వచ్చిందేమో అమ్ములత్తని అడుగు పనయ్యాక అలా బైటకి తీసికెళుతుంది…”

ఖాళీ గ్లాసు తీసుకొని లోపలికి వెళ్లిపోయింది చారుమతి.

అయిమావతి పక్కింటి అమ్ములత్త వాళ్లింట్లో పైబాట్లకి చేస్తుంది. పెళ్లయి కాపురానికి వచ్చింది లగాయితు ఇరవయేళ్లుగా ఆ యింట్లోనే పొద్దుట్నుంచీ సాయంత్రం దాకా రాట్టంలాగా ఆ పని ఈ పనీ చేస్తూ నమ్మకంగా ఉంటోంది. ఆళ్లాయన ఎల్లమంద నేతపని బాగున్నపుడు బాగానే వుండేవాడు. తర్వాత తాగడానికి డబ్బులేనప్పుడే కూలికి వెళతాడు. మిగతా టయిమంతా సాలిపేట మర్రిచెట్టు కింద చీట్లాట కాలక్షేపం చేస్తాడు.

రోజులాగే పిట్టగోడకి యివతలున్న రోటిమీదకి ఎక్కి గోడమీదుగా అమ్ములత్త వాళ్లింటివైపు చూసింది బుజ్జి. విశాలమైన మండువాలోగిలి యిల్లు. యింటికి వంటింటికి మధ్య నాపరాళ్ల చప్టా. రోజూ పొద్దున్నే అయిమావతి అక్కడే చల్ల గుంజకి కట్టిన మజ్జిగ కవ్వానికున్న తాడు రెండు కొసలు పట్టి ముందుకీ వెనక్కీ లాగుతూ…

” కాశికెడదామంటే కదలవే నా కాళ్లూ..

ఢిల్లి కెడదామంటే తిరగదే నా మనసూ..

అదె నా రాచ పుట్టింటికెడదామూ అంటే

నాకాళ్లు పన్నిన్న రథములై నడుచు

నా చేతులుయ్యాల చేరులై వూగు…” అంటూ

వెన్నరాసిన గొంతుతో పాడుకుంటూ ఉంటుంది. చిలుకుడి పని అవ్వగానే ఉసిరికాయంత వెన్నముద్ద తెచ్చి పిట్టగోడకు పూసిన చందమామ నోట్లో పెడుతుంది. గుటుక్కున మింగేసి ” ఎపుడూ ఇదే పాట పాడతావేంటీ?” అంటుంది బుజ్జి. ” మా అమ్మోళ్లింటికి వెళ్లి ఏడు సమ్మచ్చరాలు అయింది బుజ్జమ్మా!”

అంటుంది…అపుడుగానీ అయిమావతి గొంతు వింటే గొడ్లసావిడిలో గేదె పొదుగునుంచి బలవంతంగా లాక్కెళుతున్న పెయ్యిదూడ అరుపులా ఉంటుంది.

అమ్ములత్త వాళ్ళింట్లో చుట్టాల హడావిడి కనిపిస్తోంది గానీ అయిమావతి అలికిడి లేదు. కాసేపు చూసి

‘అయిమాతీ..అయిమాతీ..” పిలిచింది బుజ్జి. ఎవరూ పలకలేదు గానీ ఒకటిన్నర అడుగుల ఎత్తుతో, ఏడుమొగ్గల ఎర్రని తురాయి ఉన్న గోధుమ మచ్చల పందెం కోడిపుంజు తిరగడం ఆపి, కాళ్లు నేలకి నిగడదన్ని మెడదగ్గర ఈకల్ని విదిలించి బుజ్జిని అనుమానంగా చూసింది. రెండు మట్టిపెడ్డలు తీసుకుని దానిమీదకి విసిరి “పోవే కోడిముండా…?” కోపంగా అంది బుజ్జి.

ఇంతలో పెదబాబు మావయ్య బైటికొచ్చి కోడిపుంజునెత్తుకొని మెడ ఈకలు దువ్వి ” యావే బుజ్జీ! మారాజు పుంజుని మట్టిబెడ్డల్తో చంపేద్దావనే!!….” గోరోజినంగా అన్నాడు.

“అయిమాతి…” బిక్కుమని చూస్తూ అంది. పెదబాబు మామయ్య వెనకాలే వచ్చిన అమ్ములత్త.

” ఆ!…అయిమాతీ… చట్టుబండలూ… పనున్నరోజే ఎగ్గొట్టినట్టుంది…చూడూ.. ఏడ్చినదానికీ మొగుడొత్తాడు..ఏడ్వనిదానికీ మొగుడొత్తాడు అన్నట్టు యిద్దరిపనీ అవుతుంది. వెళ్లి అయిమావతిని పిల్చుకురా…” అంది.

” మా అమ్మ తిట్టుద్ది…” చక్రాల్లాంటి కళ్లు భయంగా తప్పింది బుజ్జి.

” మీ అమ్మకి నే చెప్తాలే … పో..”

కాళ్లకి అపుడే జీవం వచ్చినంత ఉత్సాహంగా రెండుచేతుల్తో పట్టులంగా కొద్దిగా పైకి ఎత్తి పట్టుకుని రోటిమీది నుంచి ఒక్క దూకు దూకి, ఎగిరి మండిగాలు దాటుకుని,వరండా మెట్ల మీద చకచకలాడి వీధిగుమ్మం తగలకుండా బైటకి గెంతి, నీటిబోదెలోకి అకస్మాత్తుగా వదిలిన పిల్లనీటిపాయలా జలజలలాడుతూ క్షణంలో సందుమొగకి, మరుక్షణంలో అయిమావతి యింటికి చేరుకుంది బుజ్జి. అలవాటుగా ఎగిరి చూరుకున్న ఎండుతాటాకును తెంపుతుంటే లోపల్నుంచి గట్టిగా ఏవో మాటలు వినబడి తుళుక్కుపడి పక్కనున్న మట్టి అరుగును ఆనుకుని నిలబడిపోయింది.

” ఇదిగో మీ చెల్లిగాని నీతో వత్తానంటే సుబ్బరంగా తీసికెళ్లు. నాకేం మనేద లేదు. కానీ తిరిగి రానక్కరలేదు. అక్కడే అట్టిపెట్టుకోండి. మొదలే బిడ్డాగడ్డాలేని గొడ్డుమోద్ది” ఎల్లమంద అయిమావతి వాళ్లన్నతో తెగేసి చెపుతున్నాడు.

“అవునయ్యో గద్దరిబావో!” మంచానబడ్డ మీ అమ్మాబాబుల్ని, పైసా యింట్లోకివ్వని నిన్నూ బిడ్డల్లా సాకుతోంది గదా గొడ్డుమోద్దే మరి! ఏడేళ్లాయి మా అడబిడ్డని మాకు గాకుండా చేశావు యిపుడు కూడా సంబరానికి కూడా తీసికెళ్ళ నివ్వడం లేదు..అసలకి పెదబాబుగోరు మిమ్మల్ని నమ్మే కదా పొలం అయిమావతి పేర్నపెట్టారు. తర్వాత అడిగినపుడు అది పొలం ఆరికి రాసివ్వకుండా బిగేయడం ధర్మమా? నీదిగాని సొమ్ము అమ్ముకుతింటానంటావ్‌ అది నాయమా? సంతకం పెట్టనందనేసి మా చెల్లిని నానా బాదలు పెడుతున్నావు. రాజా రాజా నీ రాజరికం మానతావా నీ వాజ (వాదం) మానతావా అంటే నా రాజరికం అయినా మానతాగానీ నా వాజ మాత్రం మాననన్నాడట వెనుకటికి ఒకడు. అట్టావుంది నీ యవ్వారం. అసలకి ఆళ పొలం మీద నీకేం కర్తీకం ఉందని యిదంతా?….” నిష్ఠూరంగా అన్నాడు అయిమావతి అన్న.

“అన్నో! కర్తీకవో… కట్టుబండలో.. యిరవయ్యేళ్లనించి ఆ ఇంట్లోబడి రెక్కలు ముక్కలు చేసుకుంటూనే వున్నాను. ఆళకున్న ముప్పయ్యెకరాలకి..సిండ..ఈ మూడెకరాలు ఒక లెక్కా?… నాయం,దర్మం, కర్తీకం నిర్ణయం జెయ్యడానికి మనమెవళం? పొలం అమ్మేసి వూరొదిలి పారిపోదావంటాడు మీ బావ. నా పేర్న పొలం పెట్టినా ఒక్క గింజ దాన్లోది తిన్న పాపాన బోయామా? పొలం అమ్మేసుకుంటే పెదబాబుగోరు సూత్తా వూరుకుంటాడా? సంపేసి శవం జోబీలోంచయినా లాగేసుకుంటాడు…” అయిమావతి మాట్లాడుతుంటే పళ్లు పటపటలాడిస్తూ కూర్చున్న ఎల్లమంద చివాలున లేచి

” నియ్యవ్వ.. యిదంతా పెదబాబుగోరి మీద జడుపే? వలపులు బోతున్నావు గదే వలపులు…” జుట్టు పట్టి వంగదీసి వీపుమీద గుద్దేడు. నేల మీద పడేసి కాళ్లూ చేతుల్తో తన్నుతుంటే అన్న అడ్డుపడబోయాడు. విసిరికొట్టాడు ఎల్లమంద.

” నేను అసుమంటి దాన్ని గాదు…” అయిమావతి దీనంగా ఏదో అనబోతుంటే లాగిపెట్టి మూతిమీద కొట్టాడు.

బొలబొలా రక్తం కారిపోయింది. అరుపులు, ఏడుపులు, పెడబొబ్బలతో యిల్లంతా గల్లంతుగా గోలగోలగా అయిపోయింది. అన్న తన గుడ్డల సంచి తీసుకుని “తల్లో! నీ మొగుడికో దండం, ముక్కదెప్పుళ్లతో ఆగేరకంకాదు ఈడు. నేనున్నానంటే నన్ను అడ్డుపెట్టుకుని నిన్నింకా సంపుకుతింటాడు.” రెండుచేతులె త్తి దండం పెడుతూ బయటికి పరుగుతీసాడు.

అయిమావతి అసాసురాలయిపోయింది. ” అన్నో! నన్ను వొదిలి ఎల్లకురో, నేనూ నీతో వత్తాను… అమ్మని జూడాలిరో..” ఎల్లమందని తప్పించుకుని లబలబలాడుతూ బయటకొచ్చి ‘ ఉయ్యాల చేరుల్లా’ ఊగుతున్న చేతుల్తో అన్న వెనకమాల పరిగెత్తింది.

అప్పటికే రోడ్డెక్కి వడివడిగా వెళ్లిపోతున్నాడు అన్న. ఆయిలో ప్రాణం సోయిలోకి వచ్చినట్టయి నేల మీద కూలబడి తల బాదుకోబోయి బిత్తరచూపులతో గోడకి అంటుకుపోయిన బుజ్జిని చూసి టక్కున ఆపేసింది అయిమావతి.

నల్లమేఘాలతో ఉబ్బిన ఆకాశంలాంటి మొహం, నెత్తుటి నిప్పులు గక్కుతున్న నోరు, చీకట్లో వూగుతున్న చెట్లనీడల్లా ఎదమీద, భుజాల మీద పరుచుకున్న జుట్టు.. అయిమావతిని చూసి బెదురుగా రెండడుగులు వెనక్కివేసి ” అమ్ములత్త,,,” మిగతా మాటల్ని గుటకవేసి మింగుతూ అంది బుజ్జి.

మౌనంగా లోపలికి వెళ్లి పదినిమిషాల్లో బైటకి వచ్చింది అయిమావతి. జుట్టు ముడివేసి మొహం కడుక్కుంది. బుజ్జికి కొంచెం ధైర్యం వచ్చి అయిమావతి దగ్గరికి చేరింది. యిద్దరూ చేతులు చేతులు పట్టుకుని బైలుదేరారు. నడుస్తూ మధ్య మధ్య అయిమావతి మొహం కేసి చూస్తోంది బుజ్జి. అకస్మాత్తుగా ఏ మాంత్రికుడో వచ్చి ఇందాకటి అయిమావతిలా మార్చేస్తాడా అన్నంత భయంతో చూస్తోంది. అయిమావతిలో గడ్డగట్టిన మౌనం, ఎప్పట్లా కవుర్లూ, కతలూ,నవ్వులూ లేవు. మొహం బిగదీసుకుని అట్లా ఉండడం బుజ్జికి నచ్చలేదు. ” ఈతపాయల జడేసింది మా అమ్మ…” కలకదెలుపుతూ అంది బుజ్జి. జడ పట్టుకుని చూసి తలూపింది. అదే మొహం… వానకి ముందు ఉమ్మరింపులా…

దిగాలుగా నడుచుకుంటూ అమ్ములత్త వాళ్లింటికి చేరారు. వీధరుగు మీద నలుగురయిదుగురు రైతులతో కలిసి కూర్చున్నాడు పెదబాబు. అయిమావతిని చూడగానే కళ్లెగరేసి ” వచ్చావెట్టా?! నాపసానిలాగా చీరకుచ్చిళ్లు జారిడిసి పన్లోకొచ్చావ్‌. అయినా నెరవతక్కువ చీరలు కట్టే ఖర్మ నీకేంట్లే… మూడెకరాల ఆసామివి కదా” ఎకసెక్కెంగా అన్నాడు. పక్కనున్నోళ్లు గొల్లున నవ్వారు.

ఆ వజాన అయిమావతి నిల్చున్నపాటుగా నిలువెల్లా జలదరించడం చేతుల లంకెలోంచి గ్రహించింది బుజ్జి. పెదబాబు మావయ్య ఏవన్నాడో అర్థం కాకపోయినా చెడ్డగా ఏదో అన్నాడని మాత్రం అర్థమయింది బుజ్జికి. పెదవి దాటని మాటలేవో గొణుగుతూ చీరకుచ్చిళ్లు బొడ్డున దోపి లోపలికి అడుగేసింది అయిమావతి.

వరండాలోంచి అమ్ములత్త ” వచ్చా?..బక్కచుక్కలు గుంకి బడాయి చుక్క పొడిసింది. అమ్మగారు తెమిలి వచ్చేసరికి” చేతులు బార్లాజాపి గయ్యిమంది.

“ఎల్మంద అయిమాతిని కొట్టాడు…” ఎవరి మీద ఎందుకు కోపమో అర్థం కాక ఉక్రోషంగా అంది బుజ్జి.

బయటి లోపలి గాయాల అయిమావతిని తేరిపార చూసింది అమ్ములత్త. ” ఆ! ఆ !.. వేలు మీద గోరుమొలిత్తే గోల్కొండ వరకు జాబులెల్లాయంట. మొగుడేదో యిట్టా అంటేనే వాసి మొక్కోయిందా? మరి మా బాధలు కడతేర్చేది. ఎవరు? హమ్మా.. హమ్మా.. వందా రెండొందలూ గారు.. మూడెకరాల పొలం.. ఎవరు తిన్నట్లు! నమ్మి నెత్తిన పెట్టుకుంటే తిన్నయింటి వాసాలు లెక్కబెట్టినట్లు ఏడేళ్ల నుంచీ మొగుడూ పెళ్లాలిద్దరూ నాటకాలాడుతున్నారు గదా? ఇదిగో రాసేత్తాను, అదిగో రాసేత్తానంటది. రిజ్రిస్టాపీసుకి రమ్మంటే కదల్దు. పండగపూట మా యింట నవ్వు లేకుండా చేసావు గదే! కులానికి పేదయినా గుణానికి పేదకానోళ్లని యిం…త మందిని చూశాం…” బొయోబొయోలాడుతున్న అమ్ములత్త, అమ్ములత్తలా కనపడలేదు బుజ్జికి.అపుడు ఆమె తనలా లేదు అయిమావతిలా లేదు. అమ్మలాగా కూడా లేదు. పాలేరు బుడ్డోడిని బండబూతులు తిడుతున్నపుడు పెదబాబు మావయ్య మూతిమీద అసహ్యంగా కదిలే మీసంలా వుంది అమ్ములత్త.

పొదుగు బరువుతోపాటు కాడి బరువు కూడా మోయాల్సి వచ్చిన నిస్సహాయమైన ఆవులా కాళ్లీడ్చుకుంటూ లోపలికెళ్లి పనులు అందుకుంది అయిమావతి. బుజ్జి యింటికి వచ్చేసినా మధ్య మధ్య పిట్టగోడమీద మొహం వాల్చి అక్కడేం జరుగుతుందో మూగగా చూస్తూనే వుంది… రోజూ పాడే పాట లేదు మాట లేదు.. అమ్ములత్త మాత్రం చీకుదోమల్లాంటి మాటల్తో అయిమావతి చుట్టూ ముసురుతూనే వుంది.

సాయంత్రం ఏడుగంటలకి సంబరాలు మొదలవుతాయి. ప్రభబండి ఎత్తుతారు. దాని వెనక గణాసార్లు, గ్రామదేవతలూ, భక్తులూ వూరంతా తిరుగుతారు. అయిమావతి సాయంత్రం పనయి యింటికి వెళ్లేముందు చారుమతి దగ్గరకు వచ్చింది. సంబరంలో బండి వెనకమాల తిరగడానికి సవాలక్ష జాగ్రత్తలు చెప్పి బుజ్జిని అయిమావతికి అప్పగించింది.

అయిమావతి యింటికి వెళ్తూ యిద్దరూ తోవలో వున్న సీమచింత గుబురుల దగ్గర ఆగారు. అలసిపోయినట్లు పక్కనున్న రాయిమీద కూర్చుంది అయిమావతి. ఇంకా గడ్డ కట్టిన అదే మొహం. అమ్మ కూడా అపుడప్పుడూ ఇంతే! ఎందుకుంటారో యిట్లా? రాలిపడిన సీమచింతకాయలు ఏరుకుంటూ అనుకుంది బుజ్జి. ఏం చేయాలో తోచక, ఈ లోకంలో లేనట్టుగా ఉన్న అయిమావతి చుట్టూ చక్కర్లు కొట్టింది. మొహంలో మొహం పెట్టి చూసింది. బుగ్గలు వాచిపోయి, కింది పెదవి పగిలి నెత్తుటిముద్దలా వుంది. లంగాలో దోపుకొని తెచ్చిన పౌడరు పొట్లం తీసి గాయం మీద నిమ్మిదిగా రాస్తూ

” అప్పుడు.. అప్పుడూ మనమేం జెయ్యాలంటే.. ఎంటిక్కాయని గా..ట్టిగా తన్నేయాలి. కోడిపుంజు మీద మట్టిబెడ్డలు యిసరాలి. యింకా అట్టా ఏమన్నా జెయ్యాలన్నమాట. అప్పుడు నెప్పేయదు. నమ్మకంగా చెప్పింది బుజ్జి.

పొద్దు వాటారుతోంది. ఆ రోజు సూర్యుడి ఆఖరికిరణం ఆకాశాన్ని ఖాళీచేసి, అయిమావతి మొహంలోకి వచ్చి చేరింది.

సాయంత్రం ఏడు గంటలు.

ఇట్టా చీకట్లు కమ్మగానే అట్టా పెట్రోమాక్సు లైట్లు గుప్పున వెలిగాయి. వూరికి ఈ చివరనున్న మద్దిరావమ్మ గుడి నుంచి ప్రభ బండి ఊరేగింపు మొదలయింది. ఆ చివరనున్న గంగాణమ్మ గుడికి చేరేలోపు ప్రతి యింటివద్దా ఇచ్చే కానుకలూ మొక్కుబళ్లతో బండి నిండిపోతుంది. ఎడ్లబండికి వెదురుబొంగులతో బాగా ఎత్తులో ప్రభని నిలిపారు. ముస్తాబు చేసిన మైసూరెడ్లు మువ్వలు గణగణలాడించుకుంటూ ముందుకు కదిలాయి.

ప్రభబండి ముందు మద్దిరావమ్మ, గంగాణమ్మ, పోలేరమ్మ, చల్లాలమ్మ,మాల్చెమ్మ తల్లులు ఉల్లాసంగా ఆడుతున్నారు. భక్తులు గుగ్గిలం పొగతో వాళ్ల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నారు. పసుపు, బియ్యప్పిండి కలిసిన బండారు, లైట్ల వెలుగులో పసుపు మేఘంలా కమ్ముకుంది. శూలానికి కొమ్మలూ, రెమ్మలుగా యినపతీగలు కట్టి వాటికి నూనెలో ముంచిన గుడ్డలు చుట్టి వెలిగించిన ‘నారశూల’ దివ్యంగా వెలుగుతోంది. పులేషగాళ్లూ, డప్పులోళ్లూ, వాళ్ళ చుట్టూ మూగి చిందేస్తున్నవాళ్లతో వీధులు కిక్కిరిసిపోయాయి.

బండి వెనకమాల గుంపుతో కలిసి నడుస్తున్న బుజ్జి, అయిమావతి మొహాలు మెరిసిపోతునాయి. ఆ పూట అయిమావతి మొహానికి పసుపు రాసి యింత పెద్ద కుంకుమ బొట్టుపెట్టింది. చిలకాకుపచ్చ రంగు అంచున్న పండు మిరపరంగు నేతచీర కట్టి చేతుల్నిండా రంగురంగుల గాజులు వేసుకుని ఎర్రెర్రని కారంబంతి పూలచెండు తల్లో పెట్టుకుంది.

ప్రభబండి, అమ్ములత్త వాళ్ల యింటిముందు ఆగబోతుండగా బుజ్జి చేతిని విడిపించుకుని గుంపుని చీల్చుకుని తుఫాను గాలిలాగా ప్రభబండి ముందు ఆడుతున్న గ్రామదేవతల మధ్యకి దూకింది అయిమావతి.

” ఆపండ్రా..” ఒక్క పొలికేక పెట్టింది. దిక్కులు పిక్కటిల్లినట్లయి ఎక్కడి వాళ్లక్కడ ఆగిపోయి నిశ్చేష్టులయి చూశారు. గుభిల్లున నేల మీద కూలబడి ” ఊ.. ఊ..మ్‌మ్‌…మ్‌…” శరీరాన్ని గుండ్రంగా తిప్పుతూ వూగిపోతోంది అయిమావతి. ఆ ఉగ్రస్వరూపాన్ని చూసి గంగాణమ్మ మద్దిరావమ్మలు సైతం కంపించిపోయి వెనకడుగులు వేశారు.ముసలివాళ్లు ముందుకువచ్చి మోకాళ్లమీద కూలబడి ” అమ్మా! ఎవరు తల్లే!… నువ్వెవరో చెప్పమ్మా…?” వేడుకున్నారు.

“నే…ను.., నల్లమారెమ్మనురా.. మీ గొడ్డూగోదా పిల్లా మేకా అన్నింటిని నమిలి మింగేత్తానురా..” గింగుర్ల గొంతు గాలిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎక్కడి వాళ్లక్కడ పిడుగుపడ్డట్టయ్యారు. ముప్ఫయ్యేళ్ల తర్వాత నల్లమారెమ్మ వూరిమీద వాలింది. ఏం ముంచుకువత్తందోనని అందరూ భయంతో గుసగుసలు పోతున్నారు.

గణాసార్లు తేరుకుని ” ఓ అమ్ములమ్మో… నీ యింటి ముందే కూచుంది అమ్మతల్లి.. శాంతి చేయించకపోతే మీ యింటితోనే అశుభం మొదలవుద్ది.. రాండి… రాండి.. ” కేకలు పెట్టారు.

అమ్ములత్త, పిల్లలు, చుట్టాలు ఉరుకులు పరుగుల మీద వచ్చి పసుపు వేపాకు కలిసిన నీరు బిందెలతో తెచ్చిన నల్లమారెమ్మమ ముందు వారపోసారు. గుగ్గిలం వేసి బండారు జల్లి యింటిల్లపాదీ కాళ్ల మీద పడ్డారు. నల్లమారెమ్మ కనుగుడ్లు పెద్దవి చేసి వీధి గుమ్మం వేపు చూసింది. కదలకుండా అతిశయంగా నిలబడివున్నాడు పెదబాబు.

” ఏం పెదబాబూ.. నల్లమారెమ్మనే శంకిస్తావురా?!” గర్జించింది. ఆ దెబ్బకి అగ్గగ్గలాడుతూ వచ్చి మెడలో వేసుకున్న కండువాని నడుముకి కట్టి నీరు వారపోసి, ముందుకు వంగి జీరాడుతున్న నల్లమారెమ్మ చీరకుచ్చిళ్ల మీదుగా పాదాలనంటి దణ్ణం పెట్టారు.

కళ్లారా చూసింది నల్లమారెమ్మ.

” అమా.. నల్లమారెమ్మ బావుంది కదూ..” చారుమతి చెవిలో గుసగుసలాడింది బుజ్జి. భయంగా చూసి బుజ్జి నోరు అరచేత్తో మూసింది చారుమతి.

అప్పటికీ ప్రభ బండి ముందు నుంచి కదలకుండా వూగిపోతూనే వుంది నల్లమారెమ్మ ” నా ఆకలి తీరలేదురో.. నా ఆశ చావలేదురో.. నాకు తినడానికి యావయినా పెట్టండిరో..’ పంతం పట్టేసింది… ఏం చేయాలో తోచక గుంపునింపులు పడుతున్నారందరూ. డప్పులు లేవు, నృత్యాలు లేవు, వేషాలు లేవు… నల్లమారెమ్మ ధాటికి కకావికలయిపోయారందరూ.

” అమ్మా.. మారెమ్మ తల్లీ.. నువ్వు శాంతించి ముందుకు కదలకపోతే ఊరంతటినీ చల్లగా చూడాల్సిన నీ అప్పచెల్లెళ్లూ అలిగి మాయమయిపోతే మా గతేం కావాలి…?” గణాసార్లు ఆవేదనగా అన్నారు.

” అపచారి దొరకాలిరా.. దొరికిన వాడిని దండించాలిరా!…” రౌద్రంగా పలికింది నల్లమారెమ్మ.

” ఎవరుతల్లే అపచారి? చెప్పు తల్లే! యిట్టా గాదుగానీ మారెమ్మ తల్లే.. నివ్వులే… అపచారి అన్నోడు దొరకడు. మనమే ఎతకాల.. లే.. నారశూల చేతబట్టు. బూవి మీద పాదంమోపు. చిందెయ్యి, ఓరి రఖునాదవో.. ఆ నారశూల యిట్టా తెచ్చి.. మారెమ్మ కుడిచేత బెట్టు.. ఓరి మత్తేసో.. ఆ యాపమండల గుత్తులు ఎడమచేత బెట్టు.. లే మారెమ్మ తల్లీ…” గణాసార్లు నల్లమారెమ్మ మొహం మీదికి గుగ్గిలం పొగ వేసారు.

నల్లమారెమ్మ లేచి నిలబడింది.

వల.. వల.. వలా.. వల…. వల.. వలా… ఊరంతా ఘొల్లున ఘోష పెట్టింది.

భూమి పైకి ఎక్కుపెట్టిన బాణంలా కుడిమోకాలు వంచి గుండెలవరకూ లాగి అరచేయిలా విస్తరించిన గుండ్రని దృఢమైన పాదాన్ని నేల మీదికి మోపింది. .. బండారు కుప్ప లావాలా ఎగిసిపడింది.

” నల్లమారెమ్మ అడుగేసిందిరా! ఒరేయ్‌ మహాలక్ష్ముడూ.. ఓరి సిద్దప్పా… తియ్యండ్రా డప్పులు, కొట్టండ్రా అపచారి చెవులు బద్దలవ్వాలిరా ” గణాసార్లు ఆవేశంగా పలికారు. నల్లమారెమ్మ చేతిలోని వేపమండలు రవరవలాడాయి. ఒంటినున్న ఆభరణాలు గలగలలాడేయి. కాలు మార్చి కాలు మోపుతూ మారెమ్మ వేస్తున్న చిందుకి డప్పులోళ్లు తాళలేక శరీరాలను ముందుకీ వెనక్కీ మెలికలు తిప్పుతున్నారు.

థిం.. థిం… దిద్ధి.. నక.. థిం.. థి..దిద్ధి..నక..

వల.. వల… వలా.. వల..వల..వలా…

ఆరె యెయ్‌..యెయ్‌.. రేసెయ్‌..

ధింధిం దిద్ధినక ధింధిం దిద్ధినక..

యే.. ఏ..ఏ.. దిద్ధినక దిద్ధినక దిద్ధినక….డప్పుల శభ్దాన్ని చీల్చుకొని గుండెలవిసిపోయేలా వినిపించింది ఎవరిదో గొంతు.

” ఓరి ఎల్లమందో! నల్లమారెమ్మ నీకెల్లే గుడ్డురిమి చూత్తంది. ..నీ కాసే వత్తందిరోయ్‌.. లగెత్తరోయ్‌….”