వాకిలి » మెహెర్
స్కూలెల్లను!
లైన్లో పిల్లలందరి తోపాటు శివగాడు చిన్న చిన్న అడుగులు వేస్తూ గేటు వైపు నడుస్తున్నాడు. వెనకాలున్న పిల్లాడు షూ తొక్కితే పడబోయాడు. లైన్ ఆగిపోయి పిల్లలు ఒకర్నొకరు గుద్దుకున్నారు. కలదొక్కుకుంటూ ఊరికే నవ్వుతున్నారు. ఆయా అరుస్తూ ముందుకొచ్చింది. శివగాడు కోపంగా ముఖంపెట్టి ఫిర్యాదు చెప్పాడు. లైన్లో వాడి ముందున్న పిల్ల చేయిపట్టుకు లాగింది నడవమని.
శివవాళ్ళ నాన్నకి తను లేనప్పుడు శివగాడు బయట ఎలా ఉంటాడో చూడటం ఇష్టం. అందుకని రోడ్డుకి ఇవతలే నిలబడి గేటు కమ్మీల్లోంచి చూస్తున్నాడు. పిల్లల లైను మెట్ల దాగా వచ్చి విడిపోయింది. శివగాడు పైమెట్టు మీద ఆగి పిల్లల భుజాలు తగుల్తుంటే నిలదొక్కుకుంటున్నాడు. బ్యాగ్ స్ట్రాప్స్ లోకి వేళ్లు దూర్చి, ముందుకి వంగి అటూ ఇటూ వెతుకుతున్నాడు. నాన్న కనిపిస్తే ముఖమంతా నవ్వు. మెట్ల మీంచి గెంతి వీధి దాటబోతోంటే నాన్న ‘‘జార్తరా!’’ అని ముందుకొచ్చి ఎత్తుకొన్నాడు.
అక్కడ అమ్మలూ నాన్నలూ పిల్లల్ని ఎత్తుకొంటున్నారు. వాళ్ళ భుజానున్న బాగ్గులు తమ భుజాల మీద వేసుకుంటున్నారు. వేళ్ళు పట్టుకొని నడిపిస్తున్నారు. తలలు చెరుపుతున్నారు. శివా, నాన్నా కూడా వాళ్ళిదరి లోకంలో వాళ్ళున్నారు. నాన్న శివ ముఖంలోకి చూస్తూ అడిగాడు:
‘‘చిన్నిమామా… ఏం చేసేవే ఇవాళ?’’
‘‘ఆ…?’’
‘‘స్కూల్లో ఏం చేశావూ… అంటున్నా’’
‘‘ఏబీ చదుకున్నా. చదుకుంటే… స్కేలు కొట్టింది’’
‘‘టీచరు కొట్టిందా?’’
శివగాడు ఇంకోవైపు చూస్తూ అక్కడ ఎవరో ఉన్నట్టు చూపుడువేలు గాల్లో ఆడించి, ‘‘ ‘దెబ్బపడతయ్!’ చెప్పింది. మెప్పెట్టేసింది ఇక్కడా…’’ అన్నాడు భుజం చూపిస్తూ.
‘‘మరి కొట్టరా, చదూకోపోతే?’’
‘‘స్కూల్ బాలే.’’
‘‘తప్పమ్మా. ఏబీ చదుకోవాలి. ఏబీ చదూకుంటేనే డబ్బులొస్తాయి.’’
‘‘ఆ?’’
‘‘డబ్బులొస్తే ఐస్క్రీమ్, లాలీపాపా కొనుక్కోవచ్చు’’
‘‘లాలీపాప కొనేస్తావా?’’
‘‘ఇప్పుడు కాదే. స్కూలెల్లి ఏబీ చదూకొంటే ఆఫీసెళ్ళి డబ్బులు తెచ్చుకోవచ్చు’’
‘‘లాలీపాప కావాలి.’’
‘‘రేపు కొంటా, స్కూల్ వెళ్తావ్ కదా, అప్పుడు.’’
‘‘స్కూలెల్లను అస్సల’’
‘‘తప్పలా అనకూడదు’’
‘‘స్కూల్ బాలేదే.’’
‘‘సర్సరే… రేపు చూద్దాం. అమ్మ అప్పచ్చి చేసింది తిందాం పద.’’
‘‘…లాలిపాపా?’’
నాన్న తలుపు తీసి లోపలికి వెళ్ళాడు.
అమ్మ వంటింట్లో మూకుట్లో ఏదో తిప్పుతూ వీళ్ళని చూసింది.
నాన్న శివగాడ్ని వొళ్ళో కూచోపెట్టుకొని షూ, సాక్సులు విప్పుతూ, వెనక్కి చూస్తూ చెప్పాడు, ‘‘ఇదిగో నీ కొడుకు స్కూలుకెళ్లడంట.’’
‘‘ఏంటీ అప్పుడే!’’ అంది అమ్మ.
‘‘టీచర్ కొట్టిందట.’’
అమ్మ గరిటె గట్టు మీద పెట్టి హాల్లోకి వచ్చింది. నడుం మీద చేయి వేసి నిలబడింది. స్కూల్లో చేర్చి ఇది నాలుగో రోజే. వాళ్ళ కొడుకు మీద ఇంకోళ్ళు చేయి చేసుకోవడం అంటే ఇంకా అలవాటు కాలేదు ఇద్దరికీ. ‘‘కొట్టిందా? ఏరా నాన్నా.. మిస్ కొట్టిందా?’’
శివగాడు తలూపాడు.
‘‘అదేం పొయ్యేకాలం దానికీ. నువ్వెళ్ళి అడక్కపోయావా?’’
‘‘ఏం అడుగుతామే. టీచర్లన్నాకా ఓ దెబ్బెయ్యరా? నువ్వూ నేనూ తినలేదా?’’
‘‘ఐతే మాత్రం! ఆడెంత ఉన్నాడనీ. వెళ్ళి చెప్పాల్సింది.’’
శివగాడు మధ్యలో మాట్లాడాడు, ‘‘ఏబీ రాయ్… దెబ్బపడతయ్ చెప్పి… స్కేల్ కొత్తింది.’’
అమ్మ వాడ్ని నాన్న వొళ్ళోంచి ఎత్తుకొంది. ‘‘రా నాన్న… నా తల్లే బంగారం. స్కేల్తో కొట్టిందా. ముండ. నువ్వెళ్ళి చెప్పాల్సింది ప్రిన్సిపాల్‌కి.”
‘‘ఏం చెప్తామే. మళ్ళీ చెప్పామని తెలిస్తే వీడి మీదే ఉంటుంది వాళ్ళ దృష్టంతా,’’ అన్నాడు నాన్న.
‘‘నిజమేలే. ఓమ్ తల్లి. చిన్నిముండ. కొట్టదులే, నాన్న చెప్తాడు. గులాబ్ జామ్ చేశా తింటావా?’’ అంటూ వంటింట్లోకి వెళ్ళింది.
‘‘స్కూలెల్లను,’’ అన్నాడు శివగాడు.
నాన్న హాల్లో చొక్కా బొత్తాలు విప్పుకుంటూ గట్టిగా అన్నాడు, ‘‘ఆ వెళ్ళకు! ఇంట్లోనే అడుక్కోడిపెట్టలా కూర్చొనీ, గుడ్లెట్టు. మూడెళ్లి నాలుగొస్తుంది, సిగ్గులేదు మళ్ళా’’.
శివగాడ్ని నడుం మీద పెట్టుకునే అమ్మ గరిటె తిప్పుతోంది. ‘‘ఆ చదివినంతే చదువుతాడు. నువ్వు పెద్ద చదివేసేవా, నేను చదివేసేనా, ఈడిప్పుడు ఊడబొడిచెయ్టానికి. చిన్నపిల్లోణ్ణి పట్టుకుని ఊరికేని. ఏంరా.. బుజిముండా…’’
‘‘వంట తినాలా మనం…?’’
‘‘ఊ… అయిపోయింది. చల్లారేకా, గిన్నెలో పెడతాను. తిందుగానీ.’’
‘‘చాల వేడిగా ఉంతదా…’’
అమ్మ వాడి బొజ్జ మీద రుద్దింది. ‘‘ఆకలేస్తుందా చిచ్చితల్లికి,’’ అంది. వాడికి కితకితలొచ్చి నవ్వాడు.
బయట నెమ్మదిగా చీకటిపడింది. నాన్న లుంగీ కట్టుకుని మంచం మీద వాలాడు. ఆఫీసులో విషయాలు ఆలోచిస్తూ కణతలు నులుముకొంటున్నాడు, బనీన్లోంచి గుండెల మీద రాసుకుంటున్నాడు. చివరికి మోచేతిలో ముఖం పెట్టుకుని కునికాడు. కాసేపటికి వీపు వెనక ఎవరో ఆనుకున్నట్టు అనిపిస్తే మెలకువ వచ్చి చూశాడు. శివగాడు అటు తిరిగి కూర్చున్నాడు. చేతిలో కారుబొమ్మ పట్టుకొని, పైన గోడ మూలలోకి అక్కడేం లేకపోయినా చూస్తున్నాడు.
నాన్నకి వాణ్ణలా చూస్తే ముచ్చటనిపించింది. వాడెంత సేపుకీ కదలకపోతే “చింతల్లీ…” అని పిలిచాడు.
శివగాడు ‘‘ఉం’’ అని తిరిగి చూశాడు.
నాన్న వాడి చంకల్లో చేతులేసి గుండెల మీదికి లాక్కొన్నాడు. వాడు రానన్నట్టు గింజుకుంటూ బరువుగా వచ్చాడు.
‘‘ఏం చూత్తన్నావే? పిచ్చిముండ’’
శివగాడు సిగ్గుగా నవ్వి కారుబొమ్మ వేపు చూశాడు. వాడిలోపల ఏముందో అని నాన్నకి బాధగా అనిపించింది.
‘‘అమ్మేదిరా?’’ అని అడిగాడు.
శివగాడు ‘‘లాల’’ అని బాత్రూం వైపు చూపించాడు, చెంబుడు నీళ్ళు పడిన చప్పుడు వైపుకి.
‘‘బజ్జో కాసేపు’’ అని చంకల్లోకి పడుకోపెట్టుకున్నాడు నాన్న.
శివగాడు కారుబొమ్మ గుండెల మీద పెట్టుకొని నాన్న చంకలో పడుకొని ఫ్యాన్ వైపు చూస్తున్నాడు.
నాన్నకి మళ్ళీ ఆఫీసు గుర్తొచ్చింది. అక్కడ ఉన్న ఇబ్బంది ఏదో ఉండకపోతేనో అనీ, ఆ పరిస్థితిలో తను ఇంకోలా మాట్లాడివుంటేనో అనీ, మళ్ళీ అలాంటి పరిస్థితే వస్తే ‘అప్పుడు ఇలా అనాలి’ అనీ ఆలోచించుకుంటున్నాడు.
మధ్యలో ఒకసారి శివగాడు పిలిస్తే చంకలోకి చూసాడు.
శివగాడి కళ్ళు దగ్గరగా పెద్దగా కనిపించాయి. ‘‘స్కూలెల్లాలా?’’ అంటున్నాడు.
నాన్న వాడి బుగ్గలు నలిగేలా గుండెల మీదికి లాక్కొన్నాడు. ‘‘చదూకోపోతే ఎలారా మరీ,’’ అన్నాడు.
శివగాడు ఇంక ఏడుపుగొంతుతో గట్టిగా మాట్లాడాడు, ‘‘స్కూలు బాలేదే…! బాబులు బాలేదు. ఆంతీ బాలేదు. జారీ బల్ల బాలేదు. బాలేదు అసల!’’
‘‘సర్సరె. రేపటి సంగతి కదా. నేను చెప్తాన్లే టీచరుతోటి. టీచరండీ, మా శివని కొట్టద్దండీ. బంగారుతల్లీ, బాగా చదువుకుంటాడూ అని చెబుతాగా రేపు వచ్చి? చెప్పనా?’’
‘‘వొద్దు’’
‘‘మరి వెళతావా?’’
‘‘వొద్దు, బాలేదసల.’’
అమ్మ బాత్రూంలోంచి కొత్త నైటీలో వచ్చింది. ‘‘ఊరికే ఎందుకు రాపాడించేస్తన్నావు పిల్లోడ్ని పట్టుకొనీ. వెళ్ళాపోతే మానేస్తాడు. ఏది పట్టుకుంటే అదేనబ్బా మనిషికి…,’’ అంది అద్దం ముందర జుట్టు తువ్వాల్తో రుద్దుకుంటూ.
శివగాడు చప్పున నాన్న చంకలోంచి లేచివెళ్లి అమ్మ కాలిని కావలించుకున్నాడు. ‘‘అమ్మా… స్కూలెల్లనే,’’ అన్నాడు పైకి చూస్తూ.
‘‘వెళ్ళద్దు తల్లీ. నాన్న అలాగే అంటాడు బుద్ది లేదు అస్సలు.’’
‘‘స్కూలెలు ఎలు అంతున్నారు,’’ నాన్నని వేలుపెట్టి చూపించాడు.
‘‘నీకేవే, కూర్చొని ఎన్నయినా చెబుతావు. ఐదు వేలు కట్టొచ్చానక్కడ. లెక్కాపత్రం లేకుండా పోతుంది అమ్మా కొడుకులికి. యూనిఫాం అయిపోయింది వచ్చి తీసుకోండని ఆ టైలర్ గాడు రెండోసారి ఫోన్ చేసాడు. జీతం పడనియ్యరా బాబూ అని నా బాధ,’’ అన్నాడు నాన్న.
‘‘అసలు ఫీజంతా ఒకేసారి ధారబోసెయ్యమని ఎవడు చెప్పాడు నీకు. మూడు టెరంలు కట్టొచ్చు. అంతా నాకే తెలుసని బయల్దేరతావు. నోరిప్పి మాట్లాడితే కదా అసలు.’’
‘‘ఓ నెల ఉండొచ్చు, ఓ నెల వుండాపోవచ్చు. ఉన్నప్పుడే కట్టిపడేస్తే వదిలిపోతుంది కదాని.’’
‘‘ఆ… మరిప్పుడు వాడెళ్ళనంటనాడు ఏం చేస్తావు?’’
‘‘అంటాడంటాడు. వాడిష్టమూ, నీ ఇష్టమూని. ఎన్నో రోజని చేరి? ఓ రెండ్రోజులెళ్తే మూడో రోజుకి అదే అలవాటవుతుంది’’
శివగాడు అమ్మ వైపుకీ, నాన్న వైపుకీ మార్చి మార్చి చూస్తున్నాడు. ఇంక తనే మాట్లాడాలని ముందుకొచ్చాడు. ‘‘స్కూలెల్లనసల! బాలేదు స్కూలు. స్కేలు కొత్తింది. మెప్పెస్తుంది,’’ అన్నాడు గట్టిగా.
‘‘నోర్ముయ్యరా. వేషాలు,’’ అని గొణిగి నాన్న మళ్ళీ మోచేతిలో ముఖం పెట్టుకున్నాడు.
ఈలోగా తలుపు దగ్గర్నుంచి, ‘‘పాలండీ!’’ అని వినిపించింది. అమ్మ శివగాడ్ని “ఊండునానా,” అని విడిపించుకుని గిన్నె కోసం వంటగదిలోకి వెళ్ళింది.
శివగాడు మంచం మీద కారు బొమ్మ వైపు చూశాడు. దాన్ని తీసుకోకుండా చేతులు వేలాడేసుకుని గుమ్మం వైపు నడిచి వెళ్ళాడు. పాలాయన వీడ్ని చూసి, ‘‘టిర్రిక్,’’ అని నాలికతో చప్పుడు చేశాడు.
శివగాడు నవ్వనా మాననా అన్నట్టు నవ్వాడు.
‘‘పాలు తాగుతున్నావా రోజూనీ?’’ అని అడిగాడు ఆయన వంగి.
‘‘ఆ?’’
‘‘పాలు… పాలు తాగితే బలమొస్తాది. చూడు కండలు,’’ అని చొక్కా చెయ్యి పైకి లాగాడు.
శివ కూడా చొక్కా చేయి లాగి చేతిని చూపించాడు. ‘‘బలం!’’
తాత ‘‘అబ్బో’’ అన్నాడు.
తర్వాత శివగాడు ముఖం మార్చుకుని తాత దగ్గరికి వెళ్ళి, ‘‘స్కేలు కొత్తింది,’’ అని చొక్కా చేతిని భుజం దాకా లాగి చూపించాడు.
శివ వాళ్ళమ్మ గిన్నెతో వచ్చింది. ‘‘ఇంకో రెండ్రోజు లాగాలండీ, జీతాలింకా పళ్ళేదు. మొత్తం నాలుగు నాగాలు,’’ అంది.
‘‘చూడండమ్మా… చిట్టీలున్నాయి కట్టాల్సినయి,’’ అన్నాడు పాలాయన తలగోక్కుంటూ.
శివ చొక్కా కిందికి లాక్కుని మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. మంచం ఎక్కి, నాన్న వీపుకి వీపు ఆనించి, కారు బొమ్మని కావిలించుకున్నాడు. చాలాసేపు కళ్ళు తెరిచి చూస్తూనే ఉన్నాడు.
ఆఫీసులో గొడవలేవో పెరిగిపెద్దవైపోయినట్టూ, ఉద్యోగం ప్రమాదంలో పడేదాకా వచ్చినట్టూ, ఏవేవో పిచ్చిపిచ్చి కలలొచ్చి నాన్నకి అర్ధరాత్రి ఎప్పుడో మెలకువొచ్చింది. ఇటు తిరిగి చెయ్యేస్తే శివగాడు తగిలాడు. మోచేతి ఊతంతో తలగడ మీద లేచి వాడి ముఖంలోకి చూశాడు. నుదురంతా చెమట చుక్కలున్నాయి. నాన్న వాడి లోకంలోకీ, కలల్లోకీ వెళ్ళాలని ప్రయత్నించాడు, వెళ్ళలేకపోయాడు. కాసేపు నిద్రపోయిన ముఖంలోకి చూశాడు. వాడ్ని మెల్లిగా తలగడ మీదకి లాగి, సందిట్లో పొదువుకొని, వాడి చిన్ని పొట్టని చేత్తో నిమురుతూ మళ్ళీ పడుకున్నాడు.
రెండు రచయితల కథలు
ఆఖరి రూపకం
అతను చనిపోయాడని పేపర్లో జిల్లా పేజీలో చదివాను. ప్రమాదాలూ, నేరాల వార్తల మధ్య వచ్చిన ఆ వార్తలో అతనో రచయిత అని కూడా ఎక్కడా లేదు. “రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి” అన్న హెడింగ్ కింద ఇచ్చిన వివరాల్లో అతని అరుదైన పేరూ, వయసూ, ఉద్యోగమూ ఉన్నాయంతే. మరుసటి వారం సాహిత్య పేజీల్లో స్నేహితుడైన ఒక రచయితా, ఒక విమర్శకుడూ రాసిన నివాళి వ్యాసాలు తప్పితే ఇంకే చప్పుడూ లేదు. అతను రాసింది కూడా తక్కువే మరి. ఐదేళ్ళ క్రితం పన్నెండు కథలతో మొదటి పుస్తకం వచ్చింది. తర్వాత పత్రికల్లో తొలి నవలా, ఐదారు కథలూ అచ్చయ్యాయి. పుస్తకాల షాపులో పేరు చిత్రంగా అనిపించి అతని కథల పుస్తకం కొని చదివాను (“ఇరుక్కున్న రాతలు”). ఆ తర్వాత అతనేం రాసినా వెతికి చదివాను.
కానీ ఇక్కడ చెప్పదల్చుకున్నది అతని కథల గురించి కాదు. పేపరు వార్తలో ఆ ఏక్సిడెంట్ ఎక్కడ జరిగిందో రాసి, చిన్న బ్లాక్ అండ్ వైట్ ఫొటో కూడా వేసారు. రోడ్డు డివైడర్ మీద ఒరిగిపోయిన స్కూటరూ, అసహజమైన భంగిమలో పడి ఉన్న అతని శరీరమూ ఫొటోలో ఉన్నాయి. వెనక కనిపిస్తున్న బడ్డీ కొట్టును బట్టీ, ఆ పక్కన గోడ మీద అంటించిన పోస్టర్లని బట్టీ ఆ చోటు ఎక్కడో నాకు అర్థమైంది. అది మా ఆఫీసుకు దగ్గర్లోనే. ఓ రోజు ఆఫీసు నుంచి త్వరగా బయల్దేరి వెళ్ళి కాసేపు బండి అక్కడ ఆపాను. బడ్డీ కొట్టు దగ్గరకెళ్ళి నిల్చున్నాను. అక్కడ్నించి చూస్తే డివైడర్ మీద కొత్తగా పెచ్చులేచిన గుంట కనిపిస్తోంది. పేపర్లో రాసిందాని ప్రకారం అతను వెంటనే చనిపోలేదు, కాసేపు కొన ప్రాణాలతో ఉన్నాడు. అంబులెన్స్ ఇంకా రాకుండానే; బహుశా చుట్టూ చేరినవాళ్ళు అతని శరీరాన్ని– చెదిరి సున్నితంగా మారి, రక్తం కారిన శరీరాన్ని– ఏం చేయాలో, ఎక్కడకు కదపాలో ఇంకా నిర్ణయించుకోకుండానే చనిపోయుంటాడు. దాదాపు ఇదే టైముకి. ఇప్పుడు ఈ రోడ్డు మీద పెద్ద ట్రాఫిక్ ఉండదు, జనం మసిలేదీ తక్కువే. అతని చుట్టూ చేరినవాళ్ళలో ఈ బడ్డీ కొట్టతనూ, ఇతని కస్టమర్లూ తప్పితే ఇంకెవరూ ఉండుండరు. కొట్టు దగ్గర కూల్ డ్రింక్ తాగుతున్న ఈ మనిషి సీసా అలాగే వదిలేసి పరిగెత్తేవాడా, లేక జిహ్వ చాపల్యం కొద్దీ జరిగింది చూసాకా కూడా మిగిలిన రెండు గుక్కలూ తాగేసి పరిగెత్తేవాడా. టిప్పరూ, స్కూటరూ గుద్దుకున్న శబ్దానికి ఆ చెత్తకుండీ కెలుకుతున్న వీధికుక్క తోకను కాళ్ళ మధ్య దోపుకుని పారిపోయేది. కరెంటు తీగల మీది పావురాలు ఎగిరిపోయేవి. ఎన్నింటినో చూసి కవిత్వం చేసిన అతని కళ్ళు ఆఖరిసారి చూసే దృశ్యం ఇదని రాసిపెట్టి ఉంది. చావు లాక్కొని పోయే ఆఖరి క్షణాల్లో మొత్తం జీవితం అంతా బొమ్మలాటలా కళ్ళ ముందు మెదులుతుందని అంటారు. ఆ మాట నేను నమ్మను. గతాన్ని నెమరు వేసుకోవటం అన్నది తీరుబడి సమయాల్లో చేసే పని. చావంత పెద్ద ప్రయాణం ముందు పెట్టుకుని ఎవరూ ఆ పని చేయరు. అదే స్థితిలో నేనుంటే బహుశా నా వెనక మిగిలిపోయే భార్యాబిడ్డల పరిస్థితి తల్చుకుంటాను, వాళ్ళు బావుండాలని దేవుడ్ని ప్రార్థిస్తాను. అతను మాత్రం ఖచ్చితంగా ప్రార్థించి ఉండడు. అతనికి పెళ్ళాం పిల్లలు లేకపోవటం ఒక్కటే కాదు దానికి కారణం. తన జీవితం ఆధారంగా రాసుకున్నాడనిపించిన మొదటి నవలలో (“తప్పిపోయిన దారులు”) అతను దేవుడి మీద నమ్మకం ఎలా పోయిందో వివరంగా రాసుకున్నాడు. అతనికి పదిహేను పదహారేళ్ళొచ్చే సరికే అబ్బిన నాస్తికత్వానికి సైన్సూ హేతువూ కారణాలు కాదు. ఆ వయస్సులో ఉన్నట్టుండి హద్దుల్ని ఒప్పుకోవటం మానేసిన అతని బుద్ధి- పటాల్లో దేవతల బొమ్మల గురించి పాడు ఆలోచనలు చేయటం, మంత్రాల మధ్యలో బూతులు చొప్పించటం మొదలుపెట్టింది. ఈ ఆలోచనల తిరుగుబాటు అప్పటిదాకా పెద్దల ఒరవడిని అమాయకంగా దిద్దుతూ వచ్చిన అతని మనస్సుని నరక యాతన పెట్టింది. వాటి నుంచి బయటపడటానికి హేతువు కాకతాళీయంగా అందించిన నాస్తికత్వాన్ని ఒక ఆసరాగా అందిపుచ్చుకొన్నాడంతే. ఇలా ఆపద్ధర్మంగా పనికొచ్చిన నాస్తికత్వం సహజంగానే ఎక్కువ కాలం మిగల్లేదు. అలాగని అతని మనసు తిరిగి భక్తి వైపుకీ మరల లేదు (“సొంతిల్లు కూలిపోయింది” అని రాసుకున్నాడు). చివరికి ఏదో మానవాతీతాన్ని నమ్ముతూనే, దాన్ని రాళ్ళ చుట్టూ జరిగే తంతుతో పోల్చుకోలేని స్థితికి వచ్చి ఆగాడు. కానీ మనసులో తిరిగి వెళ్ళలేని పాత భక్తి పట్ల ఒకలాంటి ఎడబాటు మాత్రం మిగిలిపోయింది. కాలేజీలో తనతో పాటు నాస్తికత్వాన్ని జెండాలాగా తిప్పుకు మోసిన ఒక స్నేహితుడు జీవితంలో తర్వాత ఏవో ఒడిదుడుకులు రాగానే చప్పున ఆధ్యాత్మికతకు లోబడిపోయాడనీ, కొన్నాళ్ళ క్రితమే కాశీ వెళ్ళి గంగా స్నానం కూడా చేసొచ్చాడనీ తెలిసినపుడు, అతను ఒక స్నేహితుడ్ని మౌఢ్యానికి కోల్పోయానే అని బాధపడుతూనే, తనకు పూర్తిగా మూసుకుపోయిన ఆధ్యాత్మికత అనే తలుపుల్లోంచి లోపలికి పిలుపందుకున్న స్నేహితుడ్ని చూసి ఈర్ష్య కూడా పడతాడు. అలాంటి మనిషి ఆఖరి క్షణాల్ని ప్రార్థన కోసం ఖర్చుపెట్టి ఉండడు. నమ్మేందుకు ఒక రాయిని పోగొట్టుకుని, తప్పిపోయిన దారుల్లో అనాథలా దేవులాడి, ఎప్పటికో ఆ రాయి స్థానంలో సృష్టి సకలాన్నీ తెచ్చి నిలుపుకున్నాడని అతను తన నవలలోని హీరో గురించి రాసుకున్నాడు (అతనూ రచయితే): “అతని మనసులో పెద్ద మాటలూ, పెద్ద అభిప్రాయాలూ చెరిగిపోయాయి. జీవితం తడుముకుని తల మోదుకోవాల్సిన మొండి శిల కాదనీ, ఏరుకునేందుకు ఎన్నో గులకరాళ్ళను ఒడ్డున విడిచిపెడుతూ పారే ఏటి ప్రవాహమనీ అనిపించింది. మంచనీ చెడనీ, అందమనీ వికారమనీ, సంతోషమనీ విచారమనీ ఇలా భాషతో వేరుచేయటం పోయింది. ప్రకృతి వైనాలూ, కాలం లోంచి సృష్టి నడక, మనుషుల స్వభావాలూ చర్యలూ బంధాలూ నిర్మాణాలూ, వీటి పైన అభిప్రాయపడటం కాదు, ఇష్టపడటమో అసహ్యించుకోవటమో కాదు, ఇవన్నీ ప్రార్థనలో నమ్మకం బరువుతో కంపించే ఉచ్చారణల్లా మారాయి. ఇది అతనికే సొంతమైన ఒక మతమైంది” అని ఉంటాయి ఆ నవల్లో వాక్యాలు. అందుకనే చావు ఎలాగూ ఖాయమని తెలిసిన ఆ క్షణాల్లో అతను పెద్ద పెద్ద విషయాల గురించి ఆలోచించి ఉండడు. గుద్ది వెళిపోతున్న టిప్పర్ వెనక రాసి ఉన్న మాటల్నీ, తన వైపు పరిగెడుతూ వస్తున్న పాదాల్నీ, రోడ్డు మీద కొమ్మల కదిలే నీడల్నీ, ఎగిరిన పావురాల్నీ, ఆ పైన మబ్బుల్నీ మాత్రమే మనసులోకి తీసుకుని ఉంటాడు. బహుశా జీవం ఆర్చుకుపోతున్న అతని మెదడు కణజాలంలో ఏదో పదం, ఏదో వాక్యం, అతనికే చెల్లిన ఏదో రూపకం తళుక్కుమనివున్నా ఆశ్చర్యం లేదు. అతని చావు నన్నిలా కదిలించటానికి కారణం కూడా ఆ రూపకాలే. నాకు ఎంతో దగ్గరగా అనిపించిన ఆ వాక్యాల్ని నిర్మించగలిగే చేవ వున్న ఆ మనసు అర్ధాంతరంగా ఎక్కడా లేకుండా మాయమైపోయిందే అని. అతని మీద వచ్చిన రెండు నివాళి వ్యాసాల్లో కూడా “సమాజ శ్రేయస్సుని కాంక్షించిన అతని కలం ఆగిపోవటం పెద్ద లోటు” లాంటివే రాసారు. అతడ్నించి ఇక అందబోని రూపకాల గురించీ, అతనికే చెందిన చూపు గురించీ ఎవరూ బాధ పడలేదు. వాక్యం వాక్యం ఆగి చదువుకున్నవాడిగా నాకు ఆ చూపు విలువ తెలుసు. అతనికీ తెలిసే ఉంటుంది. తను మాత్రమే చెప్పగలిగే కథలేవో చెప్పకుండానే వెళ్ళిపోతున్నానని.
ఎంత ఒంటరిగా అనిపించి ఉంటుంది! ఇళ్ళల్లో, ఆసుపత్రుల్లో తెలిసినవాళ్ళు చుట్టూ ఉండగా చనిపోవటం వేరు, ఇలా రోడ్డు మీద ఒంటరిగా చనిపోవటం వేరు. కానీ ఇంకోలా ఆలోచిస్తే, చనిపోవటం అంటేనే ఆ చనిపోయే ఒక్కడూ ఒంటరిగా చేయాల్సిన పని. ఎలాగూ ఎవరూ వచ్చి సాయం చేయలేనప్పుడు, ఆ క్షణాన పక్కన ఉన్నవాళ్ళు తెలిసినవాళ్ళయితే ఏంటి, తెలియనివాళ్లైతే ఏంటి. తెలిసినా తెలియకపోయినా, ఆ ఆఖరి ప్రయాణంలో చెంత నుండి సాగనంపే ఆఖరి మనుషులు వాళ్ళే కాబట్టి, వాళ్ళ మీద ఎంతో కొంత ఆత్మీయత కలుగుతుందేమో. ఆ క్షణాన అదే కుటుంబం అనిపిస్తుందేమో. ఏం చేయలేక అతని చావుని ఎదురుచూస్తూ చుట్టూ నిలబడిన వాళ్ళని అతను అలాగే ఆత్మీయంగా అనుకుని ఉంటాడా…. ఒకవేళ పారిపోయిన టిప్పర్ డ్రైవరే అక్కడ వచ్చి నిలబడినా….
బడ్డీ కొట్టు దగ్గర ఒక టీ పుచ్చుకొని, సిగరెట్ తాగి, బండి స్టార్ట్ చేశాను. రోడ్డు మీద రాసుకుంటూ పోయే ట్రాఫిక్ మధ్య వెళ్తున్నప్పుడు, ఒకర్నించి ఒకరికి పొంచివుండే ప్రమాదాలకు వెంట్రుకవాసిలో మాత్రమే దూరంగా తప్పుకుపోతున్నప్పుడు, ఒకసారి చుట్టూ తెప్పరిల్లి చూసుకున్నాను: నన్ను దాటుకొని బైక్ మీద పోయిన కుర్రాడూ, నా వెనక హార్న్ కొడుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవరూ, వారగా ఫుట్పాత్ మీద చెరుకు రసం అమ్మే ముసలాయనా, ఈ పక్క కార్లో కనిపిస్తున్న తండ్రీ కూతుళ్ళూ… ఈ రోడ్డు మీద వెళ్తున్నంత సేపూ ఇదో క్షణక్షణం సభ్యుల్ని మార్చుకునే తాత్కాలిక కుటుంబం కదా అనీ, వీళ్ళలో ఎవరైనా సరే నాకు అత్యంత ఆత్మీయులయ్యే అవకాశం ఉంది కదా అనీ….
నివాళి వ్యాసం
ఎవరో సాహితీ మిత్రుడు ఫోన్ చేసి చెబితే తెలిసింది రామారావుకి- పెద్దాయన చనిపోయాడని. తాను ఎప్పట్నుంచో కలుద్దామని ఎదురుచూస్తున్న మనిషి చనిపోయాడంటే రామారావుకి చాలా నిరాశగా అనిపించింది. వెంటనే ఇంకొంతమంది రచయితలకి ఫోన్ చేశాడు. ఓ నలుగురు కలిసి విశాఖపట్నం బయల్దేరదాం అనుకున్నారు. పొద్దున్న అక్కడికి టీవీ వాళ్ళు రావొచ్చు, కాబట్టి రామారావు తన పచ్చటి కాటన్ లాల్చీని బేగ్లో సర్దుకున్నాడు. ఆటో కట్టించుకుని, డిసెంబరు చలికి స్వెటర్లో కూడా వణుకుతూ, బస్టాండ్కి చేరాడు. మిత్రులందరూ అక్కడ కలిసి బస్సెక్కారు. మూడు గంటల తర్వాత సూర్యాపేటలో భోజనాలకని బస్సు ఆపు చేసినపుడు, నలుగురూ ఒక టేబిల్ దగ్గర కూర్చుని, టిఫిన్ చేస్తూ, పెద్దాయన గురించి మాట్లాడుకున్నారు. తక్కినవాళ్ళు ఆయనతో పరిచయాన్ని నెమరు వేసుకుంటుంటే, రామారావు ఆయన రచనల మీదకి మాటలు మళ్ళించాడు. ఇప్పటికైనా ఆయన రచనా సర్వస్వం ప్రచురిస్తే బాగుంటుందని అన్నాడు. మరో మిత్రుడు- అందులో కథలే కాదు; ఆయన డైరీలూ, ఉత్తరాలూ, ఇంకా ఏమున్నా అన్నీ పబ్లిష్ చేయాలన్నాడు. ఎవరి చేతన్నా మోనోగ్రాఫ్ లాంటిది రాయిస్తే ఎలా ఉంటుందీ అని మాట్లాడుకున్నారు. ఈ పుస్తకాలు వేయటానికి ఎవరి వంతు సాయం వాళ్ళు చేద్దాం అనుకున్నారు.
బస్ బయల్దేరాకా, రామారావు బేగ్ లోంచి శాలువా లాగి తల చుట్టూ కప్పుకున్నాడు. కిటికీ అద్దం దళసరిగా నీలంగా ఉండి బయట ఏమీ కనిపించటం లేదు. రామారావు పెద్దాయన గురించి ఆలోచించాడు. కలిసుంటే తనని ఏమని మెచ్చుకునేవాడో, ఏమని ఆశీర్వదించేవాడో ఊహించుకున్నాడు. రామారావుకి ఇది సాహిత్యంలో “సెకండ్ ఇన్నింగ్స్” అంటారు స్నేహితులు. అతను 80’ల చివర్లో పాతికేళ్ళ వయసులో ఉద్యోగం వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చాడు. చుట్టాల కంపెనీలో ఉద్యోగం చేస్తూ, స్టేట్ సెంట్రల్ లైబ్రరీకీ, చుట్టుపక్కల సాహిత్య సభలకీ వెళ్ళేవాడు. తెలుగు సాహిత్యంలో అప్పుడప్పుడే అస్తిత్వ వాదాలు మొదలయ్యాయి. రామారావు అంతకు పదేళ్ళ మునుపే గనక రాయటం మొదలుపెడితే విప్లవ కవిత్వం రాసేవాడేమో. తొంభైల్లో ధోరణి వేరు కనుక అస్తిత్వ వాదాల తరఫున కవిత్వం రాసాడు. ఐదేళ్లలో మూడు కవిత్వ పుస్తకాలు తీసుకొచ్చాడు. తర్వాత పెళ్లవటంతో జీవితం పెద్ద మలుపు తీసుకుంది. కొన్ని నెలలు పత్రికలో సబెడిటర్గా పనిచేశాడు. అక్కడ “సైద్ధాంతిక విబేధాల” వల్ల ఇన్ఛార్జితో గొడవపడి బయటికి వచ్చేసాడు. తర్వాత ఒక ప్రైవేటు కంపెనీలో సేల్స్ డిపార్టుమెంటులో చేరాడు. అక్కడ పని చేసిన నాలుగేళ్ళ కాలాన్ని రామారావు జీవితంలో అత్యంత గడ్డు కాలంగా ఇప్పటికీ గుర్తుంచుకుంటాడు. ఆ సేల్స్ టార్గెట్స్, ఆ ఎవాల్యుయేషన్ మీటింగ్స్…! కనాకష్టమైన జీతంతో, ఓవర్ టైం పని చేస్తేనే తప్ప రాలని కమీషన్లతో, పిల్లాడికి పాల డబ్బాలు కూడా కొనలేని దరిద్రంలో, ఎలాగో నెట్టుకొచ్చాడు. ఈ నాలుగేళ్ళలోనే రామారావుకి కవిత్వం అనేది లోకంలో ఎంత చిన్న విషయమో అర్థమైంది. ఇక దశాబ్దం ముగుస్తుందనగా, బీహెచ్ఇఎల్ లో పెద్ద ఉద్యోగం చేసే ఓ మావయ్య రామారావుని రియలెస్టేట్ వ్యాపారం వైపు మళ్ళించాడు. అప్పుడే సెల్ ఫోన్లు కొత్తగా వచ్చాయి. రామారావు నంబరు అతని సాహిత్య మిత్రుల ఫోన్లలో కన్నా, అతని వ్యాపార మిత్రుల ఫోన్లలోనే ఎక్కువసార్లు ఫీడయ్యింది. కొత్తల్లో తను వెళ్ళాల్సిన తోవ నుంచి పక్కకు వచ్చేసినట్టు అనిపించేది. ఉన్నచోట మనస్ఫూర్తిగా వేళ్ళూనుకోలేనితనం అతడ్ని రెండుగా విడదీసేది. లోపల్లోపల ఎప్పుడూ ఓ ఇద్దరికి పోట్లాట జరుగుతుండేది. పచ్చదనం చచ్చిన కొమ్మల మీంచి కవిత్వం ఎగిరిపోయింది. ఓ రకంగా ఊపిరి పీల్చుకున్నాడనే చెప్పాలి. వ్యాపారాన్ని వ్యాపారంలా చేయగలిగాడు. కాలం కూడా కలిసొచ్చింది. కుటుంబాన్ని ఓ స్థాయికి తీసుకువచ్చాడు, ఇల్లు కొన్నాడు. అప్పటికి జీవితంలో ఓ నిమ్మళం వచ్చింది. పదిహేనేళ్ళ తర్వాత రామారావు మళ్ళీ సాహితీ మిత్రుల నంబర్లు వెతుక్కున్నాడు. సాహిత్య పేజీల్లో ఈవెంట్స్ కాలమ్ ఫాలో అవుతూ తెలిసినవాళ్ళ పేర్లున్న సభలకి వెళ్ళటం మొదలుపెట్టాడు. మళ్ళీ రాయాలని కూడా ప్రయత్నించాడు. కానీ ఎగిరెళ్ళిన పిట్ట ఎక్కడో తప్పిపోయింది. అప్పుడే రామారావుకి ఒకటనిపించింది: భవిష్యత్తులో తెలుగులో కథని వేలుపట్టుకుని నడిపించే మనుషులకి తీవ్రమైన కొరత ఏర్పడబోతోందని; తెలుగులో ఇప్పుడు రాసేవాళ్ళకంటే, దారీతెన్నూ చూపించాల్సిన వాళ్ళ అవసరం ఎక్కువ ఉందని. అప్పట్నించి రామారావు సాహిత్య విమర్శ వైపు మళ్ళాడు.
బస్సు ఎన్నడూ వినని పేర్లతో ఉన్న బస్టాండుల్లో ఆగుతోంది. ఎవరూ ఎక్కటం లేదు దిగటం లేదు. ఊళ్ళన్నీ ముణగదీసుకుని పడుకున్న ఈ చలివేళలో బస్టాండుల్లో మాత్రం టీ స్టాళ్ళల్లోంచీ, టిఫిన్ హోటళ్ళలోంచీ వేడి వేడి పొగలు వస్తున్నాయి. రామారావుకి పెద్దాయన్ను బతికుండగా కలవలేదన్న దిగులు నెమ్మదిగా పోయింది. తన జీవితంలో అసలైన అధ్యాయం ఇప్పుడే మొదలవబోతోందని అనిపించింది. తాను అనామకంగా చచ్చిపోడు. తొంభైల కవిత్వంపై వచ్చిన సిద్ధాంత గ్రంథాల్లోని ఫుట్ నోట్సుల్లో ఉండే కవుల పేర్ల జాబితాలో రెండు కామాల మధ్య మాత్రమే తన పేరు మిగిలిపోదు. తెలుగు కథ తనని గుర్తుంచుకుంటుంది, స్మరించుకుంటుంది, చనిపోయాకా తన పేరు మీద కథా పురస్కారాలు ఇస్తారు, తన జయంతికో వర్ధంతికో ఏదో ఒక మూల నుంచి అప్పుడే రెక్కలు విదుల్చుకుంటున్న విమర్శకుడెవరో తనని కృతజ్ఞతగా స్మరించుకుంటూ, తన విమర్శనా సంప్రదాయాన్ని ఉగ్గడిస్తూ నివాళి వ్యాసం రాస్తాడు. జయంత్యుత్సవాలు కూడా జరగచ్చేమో ఎవరు చెప్పొచ్చారు. కానీ అంతకుముందు చేయాల్సిన పని ఎంతో ఉంది. తన కార్యక్షేత్రాన్ని ఆలస్యంగానైనా ఇప్పుడే గుర్తించాడు. పాత కథలు చదవాలి. కొత్త కథలు కూడా చదవాలి. ప్రాచ్య పాశ్చాత్య విమర్శనా సిద్ధాంతాల్ని అధ్యయనం చేయాలి. వాటిని అన్వయించాలి. కొత్త కథకుల్ని వెలికి తీయాలి. ఫోన్ చేసి అభినందించాలి. ప్రోత్సహిస్తూ వ్యాసాలు రాయాలి. రామారావుకి వొళ్ళు జలదరించింది. తన జీవితపు మొదటి భాగంలాగా ఈ రెండో భాగాన్ని అయిపు తైపూ తెలీకుండా చేజారిపోనీయడు. ముందు వీలు చిక్కగానే పెద్దాయన నివాళి వ్యాసం మీద పని చేయాలి. రామారావు మనసులో వాక్యాల తర్వాత వాక్యాలు వచ్చి పడుతున్నాయి. ఇక మిగిలిన ప్రయాణమంతా మెలకువగానే గడిపాడు.
మరుసటి రోజు పొద్దున్న వైజాగ్ బస్టాండులో దిగినాక కూడా రామారావులో ఉత్సాహం అలాగే ఉంది. తెలిమంచు వెనకాల నుంచి లీలగా కనిపిస్తున్న వైజాగ్ కొండలూ, వాటి అవతల కనపడకపోయినా భావంగా తెలుస్తున్న సముద్రమూ రామారావు మనసుని ఆహ్లాదంగా పరిగెత్తిస్తున్నాయి. అందరూ బస్టాండు పక్కనే ఉన్న లాడ్జిలో దిగి, స్నానాలవీ కానిచ్చి, ఆటో కట్టించుకుని పెద్దాయన ఇంటికి వెళ్ళారు. ఇంటి ముందు ఫ్రీజర్ బాక్సులో ఉంచిన పెద్దాయన శరీరాన్నీ, టెంటు నీడలో మసలుతోన్న మనుషుల ముఖాల్లో గాంభీర్యాన్నీ చూసాకా గానీ రామారావు మనసు వర్తమాన కాలగతిలోకి నెమ్మదించలేదు. చాన్నాళ్ళ తర్వాత కలిసిన మిత్రులు కూడా జబ్బచరిచి కావలించుకోవటాలవీ లేకుండా పొడి నవ్వులతో పలకరించుకున్నారు. రామారావు టీవీ వాళ్ళ కోసం చుట్టూ చూసాడు. వచ్చి వెళిపోయారా, ఇంకా రాలేదా? ఈ ప్రశ్న ఎబ్బెట్టుగా అనిపించకుండా ఎవరినైనా ఎలా అడగాలో ఆలోచించాడు. ఫ్రీజర్ బాక్సును చుట్టి నడుస్తున్న వరుసలో చేరి నిల్చొన్నాడు. వరసకు ఒక పక్కన ఏడిచి ఏడిచి అలిసిపోయిన ముఖాలు కొన్ని కనిపించాయి. ఒకావిడ వారగా స్తంభానికి ఆనుకుని, నిద్రకాచిన కళ్ళతో, పెద్దాయన ముఖం కేసి చూస్తూ కూడా ఎటో చూస్తున్నట్టుంది– ఆవిడ పెద్దాయన భార్య అని ఊహించాడు. పెద్దాయన తొలి కథల్లో ‘మల్లెల అలక’ అన్న కథ గుర్తొచ్చింది. ఆ కథలో భర్త నెలవారీ పద్దు వేసుకుంటూ అందులో మల్లెపూల ఖర్చుని కూడా చేర్చటం చూసి భార్య అలుగుతుంది. అందులో భార్య పాత్ర వర్ణనని ఈ ముసలామె ముఖంలో వెతుక్కున్నాడు. ఆమె పక్కన కూతుళ్ళూ, మనవలూ కూర్చున్నారు. పెద్దాయన ముఖం ఫొటోల్లో కనిపించిన దేన్నో పోగొట్టుకుని బోసిగా అనిపించింది. రామారావు ఆయనకు నమస్కరిస్తూ, ‘మీ పరంపర కొనసాగుతుంది’ అని మనసులో పట్టుదలగా మాటిస్తూ, ముందుకు కదిలాడు. హాలు గుమ్మం దగ్గర అతని వెంట వచ్చిన మిత్రులు ఒకతనితో మాట్లాడుతున్నారు. రామారావు ఆ గుంపు దగ్గరకు వెళ్ళాడు. మాటల్ని బట్టి అతను పెద్దాయన అల్లుడని తెలిసింది. బయట ఉన్నవాళ్ళలా ఏడ్చేంత బాధలేక అతిథి మర్యాదల బాధ్యతని తీసుకున్నాడు. లోపలికి రమ్మంటున్నాడు. రామారావు అందరితోనూ కలిసి లోపలికి నడిచాడు. హాల్లో నేలంతా పూల రేకలు రాలి ఉన్నాయి. ముగ్గురు నడివయసు మగాళ్ళు సోఫాలో పక్క పక్కన కూర్చుని కూడా ముందుకు వంగి ఎవరికీ వినపడకుండా మాట్లాడుతున్నారు. పిల్లలు ఆ వాతావరణాన్ని లెక్క చేయకుండా అల్లరిగా పరిగెడుతున్నారు. రామారావూ, అతని మిత్రులూ గడపదాటి గుమ్మం వారన నిలబడ్డారు. అల్లుడు పని మనిషిని వెంటబెట్టుకొని వచ్చి టీలు ఇప్పించాడు. ఎదుట గోడ మీద ఇద్దరు భార్యాభర్తల బస్ట్ సైజ్ బ్లాక్ అండ్ వైట్ ఫొటోని చూపిస్తూ ఒక మిత్రుడు, “పెద్దాయన వయసులో చూడు ఆ మీసకట్టూ అదీ…” అంటున్నాడు. అందరూ ఫొటో వైపు చూసారు. ఫొటోలో ఉన్నావిడ మీదకు దృష్టి మళ్ళింది. “అత్తయ్య చనిపోయాకనే ఆయనకి సగం ప్రాణం పోయిందండీ” అంటున్నాడు అల్లుడు. ఇక రామారావు “మరి బయటున్న ఆవిడెవరు” అని అడిగి అభాసుపాలయ్యే సాహసం చేయలేదు. ఢిల్లీ నుంచి వచ్చిన ఈ అల్లుడికి సాహిత్యం గురించి ఏం తెలీదు. రిటైరయ్యాకా హాబీగా చేసిన పనికి ముసలాయనకి ఇంత పేరొచ్చిందా అని ఆశ్చర్యపడుతున్నట్టు ఉన్నాడు. రామారావు మిత్రుల్లో ఒకరు జర్నలిస్ట్ అని తెలిసి జాతీయ రాజకీయాల గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. రామారావు ఆ మాటల్లోకి వెళ్ళలేదు. ఓరగా తెరిచి ఉన్న ఒక గదిలోంచి పుస్తకాల అల్మరా కనిపిస్తోంది. మెల్లగా ఇల్లు చూస్తున్నట్టు అటు ఇటూ నడిచి, ఆ గది వైపు వెళ్ళాడు.
తలుపు తీసుకుని లోపలికి వెళ్తే పవిత్రమైన గర్భగుడిలోకి అడుగుపెట్టినట్టుంది. గోడల నిండా అల్మరాల్లో పుస్తకాలు సర్ది ఉన్నాయి. కిటికీ వెలుగు పడే మూల పెద్ద టేకు టేబిల్ ఉంది. రామారావు మాయలో పడినవాడిలా అటువైపు నడిచాడు. బల్ల మీద పుస్తకాలు ఒద్దికగా పేర్చి ఉన్నాయి. పెన్నుల స్టాండు చుట్టూ అట్టా, కాయితాలూ, ఇంకా ఏదో స్టేషనరీ చక్కగా సర్ది ఉంది. కుర్చీ వీపుకు వేలాడుతూ ఊతకర్ర, టేబిల్ మీద కళ్ళజోడు కనిపించాయి. ఇందాక పెద్దాయన ముఖం బోసిగా ఎందుకు అనిపించిందో ఇప్పుడర్థమైంది. పేర్చిన పుస్తకాల పైనున్న పుస్తకం డైరీలాగా అనిపించింది. రామారావుకి ఆత్రం ఆగలేదు. ఒకసారి తలుపు వైపు చూసాడు. బయట ఇంకా ఏవో మాటలు వినపడుతున్నాయి. చేయి చాపి డైరీ అందుకున్నాడు. తిప్పి చూస్తే అందులో ఏవో కొన్ని పద్దులున్నాయంతే. మధ్యలో ఒక తెల్లకాయితం మడతపెట్టి కనిపించింది. మడత విప్పి చూసాడు. అది ఇంకా పోస్టు చేయని ఉత్తరం. ఒక రచయిత్రి పేరుకు “తల్లీ” అని చేర్చి సంబోధిస్తూ ఉంది. “వసంతాన్ని కోయిలలు ఆహ్వానించినట్టు, శిశిరాన్ని మా ముసలాళ్ల కీళ్ళు ఆహ్వానిస్తాయి సలుపులతో” అన్న వాక్యంతో ఉత్తరం మొదలయ్యింది. రామారావు నవ్వుకుని, ఉత్తరం ఓ సారి పైనుంచి కిందకి చూస్తున్నాడు. చప్పున తన పేరు కనిపించింది. నమ్మకం కలగక మరోసారి చూసుకున్నాడు. ఇంటి పేరుతో సహా తన పేరేనని ఖాయం కాగానే వొళ్ళు జలదరించింది. మళ్ళీ ఒకసారి తలుపు వైపు చూసి, కాస్త జలదరింపు తగ్గేలా ఊపిరి గట్టిగా వదిలి, ఆ వాక్యం మొదట్నుంచీ చదివాడు: “…రామారావు రాసిన ఆ పనికిమాలిన వ్యాసం చదివి నేను సంతోషించానా అని అడుగుతున్నావా? సంతోషం మాట పక్కన పెట్టు. ఎందుకీ వెధవ నేను చనిపోకుండానే నాకు పిండాలు పెడుతున్నాడు అనిపించింది. పైగా పుట్టిన రోజు నాడు! మా తరం వాళ్ళందరం ఏదైనా అచ్చుకి ఇచ్చే ముందు పది విషయాలు పది రకాలుగా ఆలోచించేవాళ్ళం. ఇప్పటివాళ్ళకి అదేం లేకుండా పోయింది. వాడో దొంగ సరుకు. తెలుగు సాహిత్యానికి ఈ పరాన్నజీవుల బాధ ఎప్పుడు తప్పుతుందో. కానీ నాకున్న సమయం తక్కువరా, ఇలాంటి వాటి గురించి బాధపడేందుకు.”
రామారావుకి మోకాళ్ళలో బలం తరుక్కుపోయినట్టు అనిపించింది. మళ్ళీ చదవబోతే అక్షరాలను మసకబారుస్తూ కన్నీళ్ళు ఉబికాయి. ఇప్పటిదాకా లేని ప్రయాణ అలసట బరువుగా తల మీదకు దిగినట్టయింది. తలుపు దగ్గరికి నడిచి, అది గాలికి కదిలివుంటుందని బయటివాళ్ళు అనుకునేంత నెమ్మదిగా మూసి, బోల్టు వేశాడు. మళ్ళీ టేబిల్ దగ్గరకు వచ్చాడు. భవిష్యత్తు మీద కల్పించుకున్న ఆశ అంతా ఒక్కసారిగా మాయమైంది. జీవితం మీద కాసేపటి క్రితం వరకూ ఉన్న రుచి పోయింది. కుర్చీలో కూర్చుని టేబిల్ మీద ఆ ఉత్తరం పెట్టి మళ్ళీ చదివాడు. ఉత్తరంలో మిగిలిన భాగం అంతా వేరే విషయాలున్నాయి. మళ్ళీ మళ్ళీ తన మీద రాసిన వాక్యాలే చదువుకున్నాడు. “వాడో దొంగ సరుకు… వాడో దొంగ సరుకు…”! రామారావుకు పూర్తిగా ఓడిపోయి మట్టికొట్టుకుపోవటం ఎలా ఉంటుందో అలవాటు తప్పిపోయి చాలా ఏళ్ళయింది. ఆ భావం పగతీర్చుకున్నట్టు మళ్ళీ మీద పడింది. కిటికీ లోంచి బయటకు చూస్తూండిపోయాడు. కాసేపటికి కళ్ళు తుడుచుకుంటుంటే నిన్న రాత్రి మిత్రుడన్న మాటలు గుర్తొచ్చాయి: పెద్దాయన కథల్నే కాదు; ఆయన ఉత్తరాలనూ, డైరీలనూ కూడా పబ్లిష్ చేయాలన్న మాటలు. ఒకవేళ ఈ ఉత్తరం పబ్లిష్ చేసినా తన ప్రస్తావన ఎలాగూ తీసేస్తారు. ఐతేమాత్రం నోటి మాటగా ఎంతో కొంతమందికి తెలిసిపోదూ? మంచి తెలియటానికి టైం పడుతుంది కానీ, చెడు వరదలా పాకిపోతుంది. ఒకవేళ ఉత్తరం తనంటే గిట్టని వాళ్ళ చేతుల్లో పడి యథాతథంగా పబ్లిష్ అయిపోతే? “పెద్దాయన ముసలాడైపోయాడు కదా, చివరిదశలో విచక్షణ కోల్పోయి ఏదో రాసుంటాడులే” అనెవరైనా అనుకుంటారా? లేదు, ఎవరూ అలా అనుకోరు. ఇది తన జీవితం మీద, తను సాధించాలనుకుంటున్న భవిష్యత్తు మీద విషపు నీడలా పడుతుంది. పైగా తను ఎవరి మాటల్ని భగవాన్ ఉవాచల్లా ఉదహరిస్తూ ఎన్నో వ్యాసాలు రాసాడో, ఎవరిని ఆకాశానికెత్తుతూ కనీసం రెండు పూర్తి వ్యాసాలు రాసుంటాడో ఆయనే తనని “దొంగ సరుకు” అని తేల్చేసినపుడు ఇక తన ఏ మాటకైనా ఏం విలువ ఉంటుంది. ప్రతీ అణా కానీ డొక్కు సున్నాగాడూ ఆ మాటని పట్టుకుని తన మీదకు ఎక్కుపెడతాడు. “ముసలినాకొడుకు!” రామారావు తెలిసీ తెలియనట్టు ఉత్తరాన్ని కసిగా నలిపేస్తూ గొణుక్కున్నాడు. టేబిల్ మీద మడతపెట్టిన కళ్ళజోడు వైపు చూసాడు. ఆ కళ్ళద్దాల వెనక పెద్దాయన కళ్ళు కనిపించి మాయమైనట్టు అనిపించింది. రామారావులో నాగరిక సభ్యత కొంతసేపు ఎదురు తిరిగింది. ఇలా పరాయివాళ్ళ ఉత్తరాన్ని, అదీ ఒక చనిపోయిన మనిషి ఆఖరిసారి రాసుకున్న ఉత్తరాన్ని, పైగా చేరాల్సిన వాళ్ళకి చేరితే వాళ్ళు ఎంతో విలువగా దాచుకునే వాక్యాలున్న ఉత్తరాన్ని- చింపేయటం సభ్యతేనా అనుకున్నాడు. మళ్ళీ ఉండ విప్పి టేబిల్ మీద సాపు చేశాడు. మళ్ళీ చూపు తన మీద రాసిన వాక్యాలపైకే పోయింది. ఈ ఉత్తరం చింపితే లోపల్లోపల తప్పుచేసానని తొలిచే బాధ కన్నా, ఇది బయటపడితే తనకు బయటి నుంచి కలిగే బాధే ఎక్కువ అనిపించింది. ఉత్తరాన్ని వీలైనన్ని చిన్నచిన్న ముక్కలుగా చింపి జేబులో కుక్కుకున్నాడు.
కాసేపు అలాగే కూర్చున్నాడు. ఇదేగాక, ఇంకెవరికైనా ఉత్తరాల్లో తన గురించి చెడుగా రాసి ఉంటాడా? ఇంకెవరి ముందైనా తన గురించి చెడ్డగా మాట్లాడి వుంటాడా? అవి ఎప్పుడైనా బయటపడితే పెద్దాయనపై తాను ఇన్నాళ్ళు వెల్లడించుకున్న ప్రేమాభిమానాలు ఎంత ఎడ్డి యవ్వారంగా కనపడతాయి! “ఆయన పారించిన అక్షర ప్రవాహాలు తెలుగు కథా మాగాణాన్ని ఎల్లకాలమూ పచ్చగా ఉంచుతాయి” లాంటి వాక్యాలతో పెద్దాయన పుట్టిన రోజుకి తను రాసిన వ్యాసం గుర్తుకుతెచ్చుకుంటే రామారావుకి తన చెవి తనే మెలేసుకుని మొట్టికాయ వేసుకోవాలనిపించింది. ఎంత పిచ్చిగా, అమాయకంగా, భోళాగా ప్రేమనీ అభిమానాన్నీ వ్యక్తం చేసుకున్నాడు. మనుషులిలా ఉంటారని తనకేం తెలుసు. ప్రేమకి ద్వేషం బదులొస్తే ఏం చేయగలం. రేపు రాయబోయే నివాళి వ్యాసం ఇంత అమాయకంగా రాయకూడదు. నివాళి వ్యాసమైనంత మాత్రాన ఊరికే డప్పు కొడుతూ రాయాలని ఏముంది. పెద్దాయన పేరుకి తానో మార్క్సిస్టు రచయితనని చెప్పుకునేవాడే కానీ, ఆయనకి మార్క్సిజం పైన పెద్ద అవగాహన లేదు. కథల్లో కూడా అందరూ బాగుండాలనే, అణచివేతల్ని ఎదిరించాలనే ఉట్టి అభ్యుదయానికే ఆయన మార్క్సిస్టు పదజాలంతో ముసుగు తొడిగేవాడు. ఒక ఇంటర్వ్యూలో వాస్తు కలిసిరాక ఇల్లు మారానని నోరు జారి మార్క్సిస్టు మేధావుల చేత మెత్తగా చీవాట్లు తిన్నాడు. నివాళి వ్యాసమైనంత మాత్రాన ఈ వైరుధ్యాలను ప్రస్తావించకూడదని ఏముంది. ఇలాంటివి రాస్తే కొంతమందికి కోపం రావొచ్చు. కానీ ఇంకెన్నాళ్ళు నంగి నంగి మాటలు! నిజాలు దాయటాలు! రామారావుకి నివాళి వ్యాసంపై ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. మళ్ళీ ఇదివరకటి ఉత్తేజం మనసును ఆవహించింది. జేబులో కాగితం పీలికల్ని స్పర్శసుఖంతో తడుముకుంటూ, గది బయటకు వచ్చి తలుపు వేసాడు.
నీలా టీచరూ ఇంకో పెద్దకళ్ళ అమ్మాయీ
నా చిన్నతనం ఆలమూరులో గడిచింది. నీలా టీచరు నాకు నాలుగో తరగతిలో టీచరు (ఆమెని ఉత్తి ‘నీల’గా ఎపుడూ చూడలేదు. ‘టీచర్’ అన్నది కూడా ఆమె పేరులో భాగమైపోయింది). ఆమెను చూడగానే మొదట ఎవరికైనా తట్టేది ఆమె అందమే. నాకు ఆ ఏడెనిమిదేళ్ళ వయస్సులో కూడా ఆమె చాలా అందగత్తె అని తెలుస్తూండేది; లేక ఆమె రూపం మనసులో ముద్రించుకుపోయి, తర్వాత అందచందాల విచక్షణ ఎపుడో వచ్చాకా వెనక్కి గతంలోకి చూసి ఆలోచించినపుడు, ఆమెది అరుదైన అందమని తెలిసిందో మరి. ఖచ్చితంగా చెప్పలేను. ఒకవేళ అప్పుడే ఆమె అందగత్తె అని తెలిసినా, అప్పటికే నేను ఎంత ముదురైనా, అందమైన ఆడాళ్ళ పట్ల మగాళ్ళలో ఉండే స్పందన ఏదీ ఉండే అవకాశమైతే లేదు. ఈరోజు కాపోతే రేపైనా “టీచర్, పాస్‌కి టీచర్” అని ఏ మనిషి ముందు చిటికెన వేలు నిలబెట్టాక తప్పదో ఆవిడ అందగత్తె అయితే మాత్రం ఏం ప్రయోజనం. ఇవన్నీ కాదు కానీ, ఇంత అందంగా ఉన్న మనిషి మాకు రోజూ కనపడి పాఠాలు చెబుతోందీ, కోపం వస్తే తిడుతుందీ, చేయి చాపమని బెత్తంతో దెబ్బ వేసేంత దగ్గరగా మసులుతుందీ అన్న గర్వం మాత్రమే ఉండేదేమో. అంటే, మాకు టీచరు కావటం అనే కారణం వల్ల తప్ప వేరే ఏ రకంగానూ బడి బయట ఉండే ప్రపంచంలో అలాంటి మనిషితో మసలుకునే అవకాశం లేదని ఆ వయసులో కూడా ఏ మూలో తెలియటం వల్ల కలిగిన అబ్బరం. ఇది మా మగపిల్లలకే కాదు, మా క్లాసు ఆడపిల్లలకూ ఉండేది అనుకుంటాను.
ఆమెది రాజసపు అందం. అప్పటికి ముప్ఫై-ముప్ఫై ఐదేళ్ళు ఉంటాయేమో. గోధుమ రంగు నిగారింపుతో సాయంత్రమయ్యేకొద్దీ కాస్త జిడ్డు తేలి వెలుగులీనే చర్మం. ఆ ఉంగరాల జుట్టుని పొద్దున్న ఎలాగో జడలోకి బిగించినా, సాయంత్రమయ్యేసరికి తల చుట్టూ పల్చని వెంట్రుకల ఆవరణగా రేగిపోయేది. ఆమె అంత అందగత్తె కాకపోయుంటే దాన్ని చింపిరి జుట్టు అనాల్సి వచ్చేది. ఆమె రూపంలో చప్పున కొట్టొచ్చినట్టు కనిపించేది ముక్కు. మాలో చాలామంది పిల్లలు పెద్దయ్యాకా కూడా అలాంటి ముక్కులు ఎక్కడ కనిపించినా వాటికి ‘నీలా టీచరు ముక్కు’ అనే పేరు పెట్టుకుని ఉంటారేమో. అది బాగా కలిగిన కుటుంబాల్లో, పెద్ద కులాల్లో, మంచి రూపసులైన వారు దట్టించి ఉన్న వంశవృక్షాల్లో మాత్రమే కనిపించే ముక్కు. ఎదుట నుంచి కన్నా పక్క నుంచి చూస్తే దాని అందం తెలుస్తుంది. ఆ ముక్కుకి పైనున్న కళ్ళల్లోనూ, కిందున్న మూతిలోనూ, చుట్టూ చెంపల్లోనూ ఏ ప్రత్యేకతా లేదో, లేక ఆ ముక్కు అందం ముందు అవన్నీ దిగదుడుపైపోయి వాటి వైనం జ్ఞాపకంలో మిగల్లేదో. అందానికి దాహపడటం ఇంకా తెలియని నా చిన్నప్పటి కళ్ళు చుట్టూ ఉన్న అందరి ముక్కుల కన్నా వేరేగా ఉందన్న కారణంతో మాత్రమే ఆ ముక్కుని జ్ఞాపకంలో ఉంచుకున్నదని అనుకుంటాను. ఆమె లావనీ, సన్నమనీ చెప్పలేం. వెడల్పాటి అస్థిపంజరం మీద నిండుగా అమరిన దేహం. ఎప్పుడూ నేత చీరలే కట్టుకునేదని గుర్తు. చూపులు మరీ ముసురుకోకుండా అవి కట్టుకునేదేమో.
నీలా టీచరుది రాజుల కులం అని అనుకునేవాడ్ని. నాకెవరైనా అలాగని చెప్పారో, లేక ఆమె రూపాన్ని కథల్లో కనిపించే క్షత్రియ వంశ రాణుల రాజసంతో పోల్చుకుని అలా అనుకున్నానో. ఆమె భర్త ఊళ్ళో ఒక పెద్ద మనిషి. ఆయన పేరు పెద్దబ్బుగారనో, బాబ్జీ గారనో, రాపండు గారనో… ఇలా అసలైన పేరుతో సంబంధం లేకుండా, అసలైన పేరు పెట్టి పిలవటం గౌరవం కాదని ఊళ్ళోవాళ్ళు ఆపాదించే పేర్ల లాంటి పేరు. వాళ్ళ ఇల్లు రథం వీధిలో ఉండేది. విశాలంగా, రెండంతస్థుల్లో.
అసలు నీలా టీచరుకి మేం చదివే ప్రభుత్వ ఎలిమెంట్రీ స్కూల్లో ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. బహుశా ఎంతో నిండైన వ్యక్తిత్వం గల ఆ మనిషి, ఇంటి గేటు దాటి బయటకి వచ్చే అవకాశమే లేని ఆ ఊళ్ళో, వేరే ఏ వ్యాపకమూ లేక ఆ స్కూల్లో పాఠాలు చెప్పటానికి చేరిందేమో. ఆమె వంట చేసి,  బట్టలు ఉతికి, బాత్రూం కడిగి, ఇంక ఆ పరిధికి అతీతంగా ఏ ఆలోచనా లేని మనుషుల్లాంటి మనిషి కాదని ఒక్కసారి చూస్తే చాలు తెలిసిపోతుంది. డబ్బు బాగా ఉండటం వల్ల అలాంటి పనులన్నీ చేసిపెట్టేందుకు పనిమనుషులు ఎలాగా ఉండి ఉంటారు. అదని కాదు. ఎందుకో తర్వాతి రోజుల్లో ఆమెను గుర్తుకు తెచ్చుకుంటే- లౌకికాల్ని మించిన విషయాలకీ, గుంభనంగా దాచుకునే ప్రేమలకీ, లోతుల్లో తొలిచే విషాదాలకీ, భౌతికం కాని అసంతృప్తులకీ, స్వార్థాన్ని దాటిన నునులేత ఆదర్శాలకీ చెందిన మనిషి అని అనిపించేది.
ఒకట్రెండుసార్లు ఆమె ఇంట్లోకి వెళ్ళే అవకాశం నాకు నా చిన్న తమ్ముడి వల్ల వచ్చింది. వాడికి అప్పటికి ఇంకా స్కూల్లో చేరే వయస్సు రాకపోయినా ఊరకే మాతో పాటూ వస్తూండేవాడు. చిన్నప్పుడు వాడు చూట్టానికి ముద్దుగా, తెలివితేటల్లో వయసుకు మించిన ఆరిందాతనంతో ఉండేవాడు. అంటే ఈ కారణాలకే నీలా టీచరు మా వాడ్ని ముద్దు చేసేదని కాదు. ఆ మాత్రం ఆరిందాతనం ఆ పల్లెటూళ్ళో మా చిన్నబడి పిల్లలకు చాలామందికి ఉండేదేమో. కానీ మేం ఊళ్ళో రైతుల పిల్లలమో, పేటలో పిల్లలమో కాదు. ఉద్యోగస్థుల పిల్లలం. మా అమ్మ రెవెన్యూ ఆఫీసులో జూనియరసిస్టెంటుగా పని చేసేది. నాన్న అనే మనిషి ఎపుడో ఏడాదికొకసారి కన్పిస్తూ, చుట్టరికమేంటో అర్థంకాని దూరపు చుట్టంలాగా మాత్రమే మా జీవితాల్లో ఉండేవాడు. అమ్మ అతడ్ని వదుల్చుకునే ప్రయత్నంలో ఉన్నదని తర్వాత్తర్వాత తెలిసింది. బహుశా నీలా టీచరు ఆ పల్లెటూళ్ళో తనలాగా ఉద్యోగం చేసే ఒకావిడ పిల్లలం కాబట్టి మమ్మల్ని ప్రత్యేకంగా చూసి ఇంటికి రానిచ్చిందేమో (కానీ మేమేం ఉద్యోగస్థుల పిల్లల్లా పెరగలేదు. ముఖ్యంగా నేను. అప్పటికే నాకు చాలా బూతులు వచ్చు).
నేను మెట్లు ఎక్కి రెండో అంతస్థులోకి వెళ్ళడం జరిగిన తొలి సందర్భాల్లో అదొకటి. అది కొన్ని తరాల్ని దాటుకుని నిలబడిన ఇల్లని కట్టుబడిలో తెలుస్తుంది. అందులో ఉంటున్న వాళ్ళు తరాలుగా డబ్బుకి ఇబ్బంది లేని జీవితాల్ని గడిపారనీ, ఇక ముందు గడుపుతారనీ కూడా తెలుస్తుంది. మా ఇద్దరు తమ్ముళ్ళనీ ఆమె తీసుకురమ్మంటే నేను తీసుకెళ్ళానో, లేదా స్కూలు తర్వాత ఆమే మమ్మల్ని వెంటబెట్టుకుని వెళ్ళిందో గుర్తు లేదు. మాకు తాగటానికి ఏదో ఇచ్చింది. తర్వాత టేపు రికార్డర్ లో పాటలు పెట్టి మా తమ్ముడు చేసే బ్రేక్ డాన్సు చూసి నవ్వింది. నాకు మా తమ్ముడిలా ఆమె కళ్ళల్లో ప్రత్యేకంగా నిలబెట్టగలిగే ప్రతిభలు ఏమైనా ఉండుంటే బాగుండునని అనిపించింది. కానీ అలా వున్నా ఏం ఒరిగేది కాదేమో. నా మూణ్ణాలుగేళ్ళ తమ్ముడిలా నాది ప్రపంచమింకా ఒరుసుకోని మెత్తటి చర్మమున్న పసి వయస్సు కాదు. పైగా బాల్యపు అమాయకత్వం నా కళ్ళను చాలా త్వరగా వదిలి వెళ్ళిపోయింది.
నీలా టీచరు మా స్కూల్లో ఉద్యోగాన్ని ఏదో కాలక్షేపానికే చేసినట్టు కూడా నాకు అనిపించదు. అందరూ చిన్నబడి అని పిలిచే మా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదు వరకూ చెప్పేవారు. రెండు పెద్ద గదుల్లో, బాచీమటం వేసుకుని కూర్చోవటానికి వీలుగా పీటలంత నేలబారుగా చేసిన బల్లల మీద పిల్లలు కూర్చొనేవారు. రెండు, నాలుగు తరగతులు నీలా టీచర్ చెప్తే, అదే గదిలో పిల్లల్ని ఇంకో వైపు కూర్చోబెట్టి ఒకటో తరగతిని ఇంకో మేడం చెప్పేది. పక్క గదిలో మూడు, ఐదు తరగతుల్ని ఇంకో ఇద్దరు మగ మేస్టార్లు చెప్పేవారు. మా స్కూల్లో ఒక టీవీ ఉండేది. అందులో అప్పుడప్పుడూ పిల్లలు చూడదగిన సినిమాలూ, ఏనిమేటెడ్ పిల్లల పాఠాలూ వీడియో కేసెట్లు తెచ్చి వేసేవారు. ఆ టీవీనీ, వీడియో ప్లేయర్నీ, కేసెట్లనీ స్పాన్సర్ చేసింది నీలా టీచరే.
నా జ్ఞాపకం పదే పదే ఈ చిన్నబడి చుట్టూ తిరగటానికి నీలా టీచరు కన్నా ముఖ్యమైన కారణం ఒకటుంది. ఈ స్కూల్లోనే నేను మొదటిసారి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, ఆ అమ్మాయినే తర్వాత పెళ్ళి చేసుకున్నాను. నేను ముదురేనని చెప్పటానికి ఇదో తిరుగులేని ఋజువు. ప్రేమించటం అంటే ఏంటో తెలిసిపోవటానికి అప్పటికి నేను చూసిన సినిమాలు కూడా మహా అయితే ఓ ఐదారు మాత్రమే అయ్యుంటాయి. ఈ ప్రపంచంలో అదొకటి ఉందని చెప్పే వాతావరణం నా చుట్టూ ఏదీ లేదు. కానీ శ్రీవల్లిని వాళ్ళ నాన్న తీసుకొని వచ్చి నాలుగో తరగతిలో చేర్చిన మొదటి రోజు నుంచే ఆమెని ఇష్టపడటం మొదలుపెట్టాను (అప్పటికి నేను ఐదో తరగతి). ఇది ఎలా జరిగిందీ అని హేతుబద్ధంగా ఆలోచించటం మొదలుపెడితే నాకు నికరంగా తేలేదల్లా హేతువు ఎంత బలహీనమన్నదే. వల్లీ కళ్ళు చాలా అందంగా ఉంటాయి. కిందా పైనా బరువైన కనురెప్పలతో, వాటి మధ్యన కాంతులీనే బరువైన మణులు పొదిగినట్టు ఉబుకుతూ ఉంటాయి. నాకు ఆ తొమ్మిదేళ్ళ పిల్లని ఒకసారి చూడగానే మళ్ళీమళ్ళీ చూడాలనిపించటానికి ఆ కళ్ళు ఏమైనా కారణం అనుకోవచ్చా? కానీ అలాంటి కళ్ళు అందమైనవీ అని తేల్చగలిగే లెక్క ఆ వయసులోనే నాకెక్కడిదీ? ఏమో అప్పటికే పుట్టినప్పటి నుంచీ వేల జతల కళ్ళు చూసి ఉంటాను. ఈ ఒక్క జతా ప్రత్యేకంగా అనిపించి ఉండొచ్చు. మా చిన్నబడిలో ఆ పిల్ల వచ్చి చేరిన మరుక్షణం నుంచీ ఆమె దృష్టిని ఆకట్టుకోవటానికి నేను ప్రయత్నించానని గుర్తుంది. అలాంటి ప్రయత్నాల్లో ఒకటేంటంటే- ఆమె చూస్తున్నదని అనుకుంటూ బ్లాక్ బోర్డు మీద సుద్దతో కృష్ణుడి బొమ్మ గీయటం. నాకు కృష్ణుడి బొమ్మను సులువుగా గీయటం ఎవరో నేర్పారు. రెండు కళ్ళు, కనుబొమ్మల మధ్య ‘యు’ ఆకారంలో నామం, జట్టు మీద ఒక పక్కగా కొప్పు, దాని వెనక వాలినట్టూ నెమలి పింఛం… ఇలా గీశాను. మామూలుగా క్లాసంతా ఉండగా బోర్డు ముందు నిలబడి దాని మీద ఏదైనా రాయటం నాలాంటి బెదురుగొడ్డు పిల్లాడికి చాలా ధైర్యం కావాల్సి వచ్చే పని. పాస్‌బెల్లులో ఆ పిల్ల ఫ్రెండ్స్ తో ఆడుకోవటాన్ని గమనించేవాడిని. నేరుగా వెళ్ళి మాట్లాడవచ్చని తోచలేదు. ఎందుకంటే నా మనసులో ఆమెపై కలుగుతున్నది ఏదో కూడని భావమని నాకు అనిపించేది. కొన్ని రోజుల తర్వాత ఈ విషయాన్ని నా ఫ్రెండ్ తో చెప్పినప్పుడు వాడి రియాక్షన్ కూడా దానికి తగ్గట్టే ఉంది. మేస్టారు లేక ఊరకే అందరం కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు, నాకు ఒకణ్ణే మోయటానికి మరీ బరువైపోతున్న ఈ రహస్యాన్ని ఎవరితోనన్నా చెప్పుకోవాలనిపించింది. పక్కన కూర్చున్న అబ్బాయితో “ఓరే, నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానురా” అని చెప్పేసాను. వాడు “అయ్ బాబోయ్!” అని నవ్వు కలిసిన భయంతో చేత్తో నోరు మూసుకున్నాడు. వాడి వాలకం చూసి నాకూ భయం వేసి ఎవరితోనూ చెప్పవద్దని బతిమాలాను. కానీ ఇది వాడికీ బరువైపోయి మరుసటి రోజే ఎవరికో చెప్పేశాడు. నెమ్మదిగా ఇది క్లాసంతా పాకిపోయింది. ఇది ఎంత ప్రమాదమైన విషయమో తెలియక ఎవడన్నా క్లాసులో లేచి “టీచర్, నాగూ శ్రీవల్లిని ప్రేమిస్తున్నాడంట” అని ఎక్కడ చెప్పేస్తాడోనని హళ్ళిపోయేవాడ్ని. ఎపుడూ అంతదాకా వెళ్ళలేదు కానీ పిల్లల్లో పిల్లల్లోనే అందరికీ తెలిసిపోయింది. ఎంతలా అంటే- ఒక ఏడాది తర్వాత ఈ చిన్నబడిలో ఐదో తరగతి అవగొట్టుకుని, తర్వాత ఆరో తరగతి చదవటానికి మెయిన్ రోడ్డుకి ఆనుకుని ఉన్న పెద్ద బడిలో చేరినపుడు, ఆ ప్రేమ వార్త నాతో పాటూ వచ్చి పెద్దబడిలో చేరిపోయింది (ఇక్కడ ప్రేమని కొటేషన్స్ లో పెట్టాలనిపిస్తుంది కానీ, అసలు అవసరమా అని కూడా అనిపిస్తుంది; మనిషికి చావనేదే లేకపోతే ఖచ్చితంగా అన్ని వయసుల ప్రేమల్నీ కొటేషన్స్ లోనే పెట్టాల్సి వస్తుంది గనుక).
వల్లీ నా కన్నా ఒక క్లాసు తక్కువ కాబట్టి ఇంకా చిన్నబడిలోనే చదివేది. మా తమ్ముళ్ళు కూడా అక్కడే చదువుతున్నారన్న నెపంతో నేను అప్పుడప్పుడూ పెద్దబడి నుంచి బయల్దేరి ఊరి లోపల పెద్ద చెరువునానుకుని ఉండే ఈ చిన్నబడి దాకా పనిగట్టుకు వచ్చి ఆ పిల్లను చూసేవాడ్ని– వీధులమ్మటా పరిగెత్తుకుంటూ, నాలో ఈ భావం నన్ను ఆకాశంలో గాలిపటంలా వెంట లాక్కెళ్తుంటే. ఒక రోజు నీలా టీచర్ నన్ను గమనించి, “ఈ స్కూలు కానపుడు ఎందుకు వస్తున్నావ్ ఇక్కడికి?” అని గదమాయించి పంపేసింది కూడా. ఇంత జరుగుతున్నా, ఆ మొదటి రోజు బోర్డు మీద బొమ్మ గీసి వల్లీ కంట్లో పడటానికి చేసిన ప్రయత్నం తర్వాత, మళ్ళీ ఎప్పుడూ ఆమె కళ్ళల్లో పడాలని ప్రయత్నించ లేదు. నాకు ఆమెని చూస్తే బాగా అనిపించేదంతే. ఆమెని చూడటం కుదరని రోజు, అప్పటికింకా చిన్నబళ్ళోనే చదువుతున్న మా తమ్ముళ్ళు బడి అయిపోయి ఇంటికి వచ్చాకా, “ఒరే వల్లీ ఇవాళ ఏం డ్రస్ వేసుకుని వచ్చిందిరా?” అని అడిగి వేధించేవాడ్ని. అప్పటికే ఆమె గౌన్లూ, పరికిణీ లంగాలూ అన్నీ నాకు గుర్తే. మా తమ్ముళ్ళు ఫలానా డ్రస్ అని చెబితే, ఆ వర్ణన సాయంతో నాకు కనపడని ఆ రోజు ఆమె ఎలా ఉందో ఊహలో చూడగలిగేవాడ్ని. తమ్ముళ్ళిద్దరికీ ఇదేం అర్థమయ్యేది కాదు. వాళ్ళల్లో ఆటల్లో వాళ్ళుండి విసుక్కుంటుంటే వెంటపడి అడగాల్సొచ్చేది. పెద్దన్నయ్య మిగతా వాళ్ళల్లాగాక కొత్తగా ఇదేదో “ప్రేమించటం” అన్న పని చేయగలగటం మాత్రం వాళ్ళకీ గొప్పగానే ఉండేది. నా పెద్దబడి స్నేహితుల్లో కూడా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్న అబ్బాయిగా నాకు గుర్తింపు ఉండేది. అది నాకు ప్రత్యేకంగా, గొప్పగా అనిపించేది. బడిలో ఒక్కడి దగ్గరే కొత్త సైకిలు ఉన్నప్పుడు వాడికి కలిగే బడాయి లాంటిది.
బళ్ళు అయిపోయి మేం ముగ్గురం ఇంటికి వచ్చాకా అమ్మ ఇంకా ఆఫీసు నుంచి ఇంటికి రావటానికి చాలాసేపు పట్టేది. ఒక మూణ్ణాలుగు గంటలు మా అంతట మేం ఇంటి దగ్గర అమ్మ కోసం ఎదురు చూస్తూ గడపాల్సి వచ్చేది. అమ్మ ఆ నాలుగు గదుల ఇంట్లో రెండు గదులకు తాళం వేసి ఇంకో రెండు గదుల్ని మాకోసం వదిలిపెట్టేది. వెలుగు నుంచి చీకట్లోకి రోజు మారుతుంటే ఇంటి చుట్టూ రకరకాల ఆటలు ఆడుకునేవాళ్ళం. వల్లీ తెలిసాకా మాత్రం నేను సాయంత్రాలు తమ్ముళ్ళతో ఆటలు తగ్గించాను. వాళ్ళని ఇంటి దగ్గరే వదిలి, వల్లీ కనిపించే అవకాశమున్న చోట్ల కోసం– అంతకు రెండేళ్ళ క్రితమే అమ్మకు బదిలీ అయితే వచ్చిన ఈ కొత్త ఊరిలో– తెలియని వీధులమ్మటా తిరిగేవాడ్ని. వల్లీని ప్రేమించటం అనేది నాకు ఒక వొళ్ళు జలదరించే సాహసంలాగా అనిపించేది. నా స్నేహితులెవ్వరికీ చేతకాని, పెద్దవాళ్ళు మాత్రమే చేసే పని నేను చేస్తున్నానని అనిపించేది. ఒక రోజు ఆ పిల్లకి తెలియకుండా వెంట వెళ్ళి తన ఇల్లెక్కడో కనుక్కోవటం ఒక సాహసం. ఆ ఇంటి నుంచి ఆమె సాయంత్రాలు బయటికి వచ్చి ఆడే అవకాశమున్న స్థలాల్లో, ఆమె ఎదురయ్యే క్షణం కోసం ఎదురుచూస్తూ తిరగటం ఒక సాహసం. పులి లేనప్పుడు దాని గుహలో సంచరిస్తున్నట్టు భయోద్విగ్నంగా ఉండేది. ఆ అమ్మాయి అనుకోకుండా ఎదురైతే అచ్చం భయమేసినట్టే వొళ్ళు గగుర్పొడిచేది. రాన్రానూ ఆ పిల్ల ఒక ప్రత్యేకమైన, మానవాతీతమైన జీవం అయిపోయింది. నన్ను వశం చేసుకుని ఉన్న చోట ఉండనీయక బలవంతంగా వెంట తిప్పించుకునే భూతం. ఒక పసివాడ్ని లక్ష్యం లేకుండా తెలియని వీధుల్లోకి లాగే శక్తి క్షేత్రం. ఊరిలో దేవీ నవరాత్రులో, అయ్యప్పస్వామి తెప్పోత్సవమో ఇలా ఏవన్నా ఉత్సవాలు జరిగి, అక్కడికి వల్లీ కచ్చితంగా తన ఇద్దరు చెల్లెళ్ళనూ, చిట్టి తమ్ముడ్నీ వెంటేసుకుని వస్తుందనిపిస్తే, నేను అప్పటికే అమ్మ ఇంటికి వచ్చేసినా ఆమెకి ఏదో ఒక అబద్ధం చెప్పి ఆ ఉత్సవానికి చేరుకునేవాడ్ని. అక్కడ మగవాళ్ళు కొత్త చొక్కాలతో, తువ్వాళ్ళు భుజాన్నేసుకునీ, ఆడవాళ్ళు బీరువా పైఅరల్లోంచి తీసిన మడత నలగని చీరల్లో, పూల బుట్టలు చేతపట్టుకునీ తిరిగేవారు; మైకుల్లోంచి దేవుడి పాటలు చుట్టూ ఉన్న అందరూ అరిచి మాట్లాడుకోవాల్సినంత గట్టిగా మోగుతూండేవి; వీధి వారగా పాతిన గెడకర్రల మీదుగా తోరణాల్లా సాగే విద్యుదలంకరణలు నా కళ్ళల్లో వెలుగుతూండేవి; నేను ఆ సందడి మధ్యన, మృగమే చల్లిన మాయలో పడి అడవి మధ్యన దారితప్పిన వేటగాడిలాగా, తిరిగేవాడ్ని. ఆ వాతావరణమంతా నా ప్రేమకు నేపథ్యంగా పని చేయటానికే అలా ఉన్నదని అనిపించేది. ఏ గరగల నృత్యమో, ఏ ఆలయపు క్రతువో, ఆకాశంలో విప్పారే ఏ టపాసుల వెలుగో నా పరుగుని ఆపి కాసేపు నన్ను నిలబెట్టినా, మళ్ళీ వాటన్నింటికన్నా ముఖ్యమైన లక్ష్యం నన్ను నిమంత్రిస్తుంటే తెప్పరిల్లి ముందుకు సాగిపోయేవాడ్ని. గరగరమని ఒరుసుకొనే ఈ చీర మడతలూ, మెరిసే మట్టిగాజుల మధ్య నుంచీ; చెవులు హోరెత్తించేలా వినిపిస్తున్నా ఒక్క ముక్కా అర్థం కాని భక్తి పాటలూ, పూజారి మంత్రాల మధ్య నుంచీ; గుడి గోపురం పక్కన తూములో పారే కొబ్బరి పాలూ నీళ్ళూ, వెలిగే నూనె దీపాల మొహం మొత్తే వాసనల మధ్య నుంచీ, ఇలా ఎంత తిరిగినా, ఎంతసేపవుతున్నా, ఒక్కోసారి ఆ అమ్మాయి కనిపించేది కాదు. అమ్మ నాకు బయట తిరగటానికి ఇచ్చిన సమయం అయిపోయే కొద్దీ నా ఉత్సాహం నీరుగారిపోయేది. అప్పటిదాకా ఆమె ఇక్కడే ఎక్కడో ఉండివుంటుందనే కారణంగా ఎంతో అర్థవంతంగా కనిపించిన ఈ పరిసరాలు డొల్లగా మారిపోయేవి. అప్పటిదాకా ఈ మెలికల వీధులన్నీ ఒక ప్రహేళికలాగా కావాలని ఆమెను ఎక్కడో దాచాయనీ; నన్ను తిప్పించి తిప్పించి, అలిసేదాకా నాతో దోబూచులాడి, నా చిత్తశుద్ధిని పరీక్షించి, చివరికెప్పుడో అనుకోని క్షణంలో ఆమెను నా ముందుకు తోయటం ద్వారా నా వెతుకులాటనీ నా అలసటనీ మరింత వీరోచితమూ సార్థకమూ చేస్తాయనీ అనుకున్న నాకు, నెమ్మదిగా నాదో నిష్పలమైన పరుగని అర్థమయ్యేది. వీధులన్నీ తమ మాయజాలాన్ని జారవిడుచుకొని జడంగా చచ్చిపోయేవి. ఇంకా అక్కడ పూజలైతే జరిగేవి, జనం ఇదివరకటి కన్నా పల్చబడినా అప్పటికీ ఆ వీధులు మిగతా ఊరికన్నా ప్రకాశంగానే వెలిగేవి, అడపాదడపా ఓ తారాజువ్వ చీకటి ఆకాశంలోకి లేచి ఒంటరి చప్పుడు చేసేది. నేను మాత్రం ఆ సందడికి వీపు చూపిస్తూ ఒక్కడ్నీ దూరంగా వచ్చేసేవాడ్ని. వీధి దీపాల కింద తలలు తిప్పి చూసే కుక్కలు; బైట నులక మంచం మీద పడుకుని విసనకర్ర విసురుకుంటూ అలికిడికి తలెత్తిచూసి మళ్ళీ తలగడ సర్దుకుని పడుకునే ముసలాయన; గుడ్డి దీపంతో వెలుగుతున్న ఓ కిటికీ లోపలినుంచి ఆగాగి వినిపిస్తున్న మాటలు; పేడ నీళ్ళ కళ్ళాపులతో నున్నగా మారిన నేల మీద పైకి లేచి కనిపించిన ఒక కంకర్రాయిని తన్నుతూ ఇంటికి వెళ్ళే నేను.
ఒకసారి ఇలాగే ఆమె కనపడని ఉత్సవం నుంచి ఇంటికి నడిచి వస్తూ దారిలో చిన్నబడి దగ్గర ఆగాను. పొద్దున్నపూట పిల్లల మూకుమ్మడి గొంతుల కల్లోలంతో హోరెత్తే ఆ బడి, ఈ రాత్రి పూట మాత్రం, చుట్టుపక్కల గుడ్డిదీపాలతో చప్పుడు లేకుండా ఉన్న ఇళ్ళ కన్నా కూడా చీకటిగా, ఇంకా నీరవంగా ఉంది. చుట్టుపక్కల ఎవరూ లేకపోవటం చూసి, ధైర్యం చేసి బడికి దగ్గరగా వెళ్ళాను. కటకటాల్లోంచి తొంగి చూసాను. ఖాళీ వరండా, మూసి ఉన్న తలుపులూ తప్ప ఏమీ కన్పించలేదు. గోడ వెంట నడుచుకుంటూ బడికి వారకి వెళ్తే పైన ఒక కిటికీ తెరిచి కన్పించింది. అది ఐదో తరగతివాళ్ళు కూర్చునే చోటు పక్కనే ఉన్న కిటికీ. బడి పునాది అంచు కాస్త బయటకొచ్చి ఉంటే దాని మీద ఎక్కి, కిటికీ లోంచి తొంగి చూసాను. అటుపక్క తలుపు చీలిక గూండా సన్నని రేఖలా వచ్చిపడుతున్న వీధి దీపం మసక వెలుగులో ఖాళీ బల్లలు కనిపించాయి. కిటికీ పక్కనే పొడవాటి చెక్కల స్టాండు పైన నల్ల బోర్డు నిలబెట్టి ఉంది. దాని పైన ఏదో లెక్కల పాఠం కనిపిస్తోంది. కిటికీ చువ్వల్ని ఆసరాగా పట్టుకుని, ఒకే కాలు పట్టే ఇరుకు పునాది మెట్టు మీద కాళ్ళు మార్చుకుంటూ, బోర్డు మీద కనిపిస్తున్న అంకెల్ని చూశాను. బహుశా రాఘవయ్య మేస్టారు చెప్పిన ఆ లెక్కల పాఠాన్ని– ఇప్పుడు నా కళ్ల ముందు కనపడుతున్న ఆ అంకెల్నీ, గీతల్నీ– పొద్దున్న క్లాసులో వల్లీ తన కళ్ళతో చూసి ఉంటుంది. బహుశా ఇప్పుడు ఈ రాత్రి ఇదే క్షణాన తన ఇంట్లో కూర్చుని ఇవే లెక్కలపై హోం వర్కు చేస్తూండి వుంటుంది. లేదంటే ఇవే లెక్కల్ని ఎక్కించుకున్న పుస్తకం ఆమె మసలుకునే ఇంట్లో ఏ మూలో ఆమె బ్యాగ్ లో ఉండి వుంటుంది. అవే లెక్కల్ని ఇప్పుడు నా కళ్ళతో నేను చూస్తున్నాను! బడి వెనుక చెరువు మీంచి వణికిస్తూ వస్తున్న తేట గాలికీ, నా వెనుక దూరపు సముద్రంలా వినిపిస్తున్న రావి ఆకుల ఘోషకీ, తుప్పల్లోంచి కీచురాళ్ళ మోతకీ వొళ్ళు జలదరిస్తుంటే, చోటు చాలని ఇరుకు మెట్టు మీద కాళ్లు నొప్పెడుతుంటే ఎక్కువ సేపు నిలబడలేకపోయాను. కానీ ఆమెతో నన్ను కలుపుతూ ఏర్పడిన ఆ చిన్న లంకె, ఆమె లోకంలోకి తెరుచుకున్న ఆ చిన్న ద్వారం– ఆ రోజు ఉత్సవంలో ఆమె కనిపించని దిగులుని తుడిచేయలేకపోయినా– ఇంటికి ఇంకాస్త తక్కువ దిగులుతో వెళ్ళగలిగేట్టు చేసింది.
ఒక్కోసారి ఆమె కనిపించేది కూడా. నేను రావటమే ఆమె కోసం వచ్చినా, ఆమె ఖచ్చితంగా వస్తుందని అనుకునే వచ్చినా, అలా ఆమె హఠాత్తుగా కనిపిస్తే నాకు ఒక అద్భుతం జరిగినట్టే ఉండేది. నేను ఆమె ప్రతి కదలికనీ మళ్ళీ ఆమె కళ్ల ముందు లేనప్పుడు కూడా గుర్తుగా వుండేట్టు అతి శ్రద్ధగా మనసు మీద ముద్రించుకునేవాడ్ని. అయితే ఇన్ని చోట్ల నా సమక్షం తారసపడుతున్నా అది ఆమె గమనింపుకు వచ్చి ఉండదు. ఎందుకంటే తన అల్లరిలో తనుండేది. క్షణం కుదురులేకుండా ఎప్పుడూ ఒక సందడి నుంచి మరో సందడికి పరిగెడుతున్నట్టు ఉండేది (ఆమె వదిలి వెళ్ళిన సందడీ, ఆమె వచ్చి చేరిన సందడీ రెండూ ఆమె పుట్టించినవే అయినా). ఆమె కాళ్ళ చుట్టూ గౌను అంచు ఎప్పుడూ మొదలూ తుదీ లేని అలలా అల్లల్లాడుతూనే ఉండేది. పళ్ళు కనిపించే పెద్ద సిరి నవ్వుతో, క్షణం కళ్ళు తిప్పితే మళ్ళీ అక్కడ కనిపించని చంచలత్వంతో ఒక తుళ్ళింతగా ఉండేది.
అయితే నా బడి తర్వాత చక్కర్లు మాన్పించటానికి అమ్మ మా ముగ్గురన్నదమ్ముల్నీ ట్యూషన్ లో పడేయాలనీ, ఆ విధంగా తను ఆఫీసు నుంచి లేటుగా తిరిగి వచ్చేదాకా మేం కుదురుగా ఉంటామనీ అనుకుంది. చిన్న బడిలో మూడో తరగతికి పాఠం చెప్పే సూర్రావుగారి దగ్గర మా ముగ్గుర్నీ ట్యూషన్లో చేర్చింది. సూర్రావుగారు ఒక హేపీ మనిషి, ఆయనది ఒక హేపీ కుటుంబం. ఆయన భార్యకీ ఆయనకీ మధ్య ఎప్పుడూ మేం పిల్లలమే ప్రేక్షకులుగా ఏదో ఒక పరాచికాల యుద్ధం నడుస్తూండేది. వాళ్ళ మధ్య ఎప్పుడూ తీరని కోపాలు ఉండేవి కాదు. ఆమె కోపాన్ని తగ్గించటానికి ఆయన హ్యూమర్ సాయపడేది. నవ్వించే శక్తితో జీవితాన్ని నెట్టుకువచ్చేసే మనిషని ఇప్పుడనిపిస్తుంది. ఆ ఇంటి గొళ్ళెం తలుపు తీస్తే, కుళాయి పళ్ళెం ఎదురయ్యేది, తర్వాత లోపలికి చిన్న సందుండేది, అది దాటితే పెంకుటింటి వసారాలోకి వచ్చేవాళ్ళం. అక్కడ కూర్చోపెట్టి ట్యూషన్ చెప్పేవాడు. రెండు మూడు రోజులకే ఆ ట్యూషన్‌లో నన్ను కట్టిపడేసినట్టు అనిపించటం మొదలైంది. పైగా ఆయన లెక్కల మీదే శ్రద్ధపెట్టేవాడు. నాకు లెక్కలు వచ్చేవి కాదు. ఏదన్నా లెక్క చేయమంటే, టెక్స్ట్‌బుక్‌ చివరి పేజీల్లో జవాబు చూసి, అక్కడున్న సంఖ్య వచ్చేదాకా కూడికలూ తీసివేతలూ భాగాహారాలూ ఇలా నానా రకాలుగా ఏదో ఒకటి చేసేసి ఆ అంకె రప్పించేవాడ్ని– ఆయన జవాబు చూస్తాడే తప్ప దాన్ని ఎలా రప్పించాననేది గమనించడన్న ఆశతో. ఆయన నేను ఇచ్చిన తెల్లకాయితాల నోటు బుక్కు ఒక చేతిలో పట్టుకుని, రెండో చేత్తో నా చెవితమ్మె పట్టుకుని, కాసేపు వదలకుండా నన్ను దాన్తో పట్టి ఊపుతూ “కిట్టించేసావురా ఎదవకానా” అని తిట్టేవాడు. ఈ బాధ పడలేక ఆ ట్యూషన్ ఎగ్గొట్టేందుకు కుట్రలు పన్నటం మొదలుపెట్టాను. ట్యూషన్‍కి బయల్దేరినట్టే బయల్దేరి, నా పుస్తకాలూ, తమ్ముళ్ళ పుస్తకాలూ కరెంటు స్తంభాలకు ఉండే తుప్పు పట్టిన ఇనుప బాక్సుల్లో దాచేసి, కొత్తగా కట్టిన రామాలయం చుట్టూ గచ్చు మీద పాల కనికెలతో దాడీ ఇప్పి దాడీ వేసే ఆట ఆడుకునేవాళ్ళం. లేదంటే, అప్పుడప్పుడూ ఆ గుళ్ళో టీవీలో అదేపనిగా వేసే లవకుశ లాంటి సినిమాలు చూసేవాళ్ళం. (ఈ కథలో ఇన్ని గుళ్ళు ఉండటం యాదృచ్ఛికం కాదు. దక్షిణ కాశీ అని పిలిచే ఊళ్ళలో ఆలమూరు కూడా ఒకటి.) ఒక్కోసారి ఇంకో ఫ్రెండు తోడు దొరికితే ఊరి చివర పాడుబడిన ఒక రైస్ మిల్లుదాకా పోయేవాళ్ళం. పని చేయని యంత్రాల మధ్య ఆడుకునేవాళ్ళం. అక్కడ దొరికే అభ్రకం పెచ్చుల్ని పగలగొట్టుకుని ఆ మెరుపుల్ని మేం చూసే వీధి నాటకాల్లో నటుల్లాగా చెంపలకి పూతలాగా పూసుకునేవాళ్ళం. ఒక్కోసారి అటూయిటూ తోటలే ఉన్న నిర్మానుష్యపు దారుల్లో నడుస్తూ దెయ్యాల కథలు చెప్పుకునేవాళ్ళం. దొరికితే చెట్టుకు కట్టేస్తారన్న భయం వల్ల ఇంకా రంజుగా ఉండే ఆట కాబట్టి- మామిడి తోటల మీదకి గుంపులుగా వెళ్ళి కాయల్ని దొంగతనాలు చేసేవాళ్ళం. ఇక ట్యూషన్ అయిపోతుందనే టైముకి మళ్ళీ కరెంటు స్తంభాల మెయిన్ బాక్సుల్లోంచి పుస్తకాలు తీసుకుని ఇంటికి వచ్చేసేవాళ్ళం. నెల తర్వాత సూర్రావు మేస్టారికి ఫీజు ఇవ్వటానికి కలిసినపుడు కానీ అమ్మ ముందు మా బండారం బయటపడలేదు.
అమ్మకి అదేదో పాత సినిమాలో ఒక అమ్మ కోరిక లాగా మా ముగ్గుర్లో ఒకడు డాక్టరూ, ఒకడు ఇంజనీరు, ఒకడు కలెక్టరూ అవ్వాలని ఉండేది. కానీ మమ్మల్ని పెద్దగా ప్రైవేటు స్కూళ్ళలో చదివించటానికి తగినంత జీతం గానీ, ఆఫీసు పని వల్ల దగ్గర కూర్చోబెట్టుకుని చదివించేంత టైము గానీ ఉండేవి కాదు. మేం చుట్టుపక్కల పేటల్లో ఉండే పిల్లలతో తిరుగుతూ, బూతు పాటలు నేర్చుకుంటూ, పనికి మాలిన అల్లరి చేస్తూ తిరిగేవాళ్ళం. అప్పుడప్పుడూ మేం తాను అనుకున్న దారిలో ఏ మాత్రం వెళ్ళటం లేదని తెలిసినప్పుడల్లా అమ్మ అగ్నిపర్వతంలా బద్దలైపోయేది. “నువ్వు పెద్దవాడిగా ముందుండి మిగతా ఇద్దరికీ వివరం చెప్పాల్సింది పోయి” అనేది మా ఇంట్లో స్టాకు డైలాగు. మరీ అంత చిన్నప్పటి నుంచీ ఈ బాధ్యతల అవగాహన నాలో కల్పించటానికి చేసిన ఈ అతి ప్రయత్నం ఎదురు దెబ్బకొట్టి ఏం జరిగిందంటే- నేను నిజంగా బాధ్యతలు భుజాన్నేసుకోవాల్సిన వయసు వచ్చినా కూడా ఆ పని చేయలేదు. దానికి అప్పుడప్పుడూ సిగ్గుపడతాను కానీ, సిగ్గుపడి మారాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు (అందుకే నాకు చెల్లెళ్ళు లేనందుకు ఎన్నిసార్లు బాధపడినా, ఉండుంటే వాళ్ళకు పెళ్ళి చేసి సాగనంపాల్సిన బాధ్యత నుంచి తప్పించినందుకు దేవుడికి థాంక్స్ కూడా చెప్పుకుంటాను.)
మేం సుర్రావు మాస్టారి ట్యూషన్‌కి వెళ్ళటం లేదని తెలిసిన సందర్భం అమ్మ అగ్నిపర్వతంలా బద్దలైన, నాకు గుర్తుండిపోయిన, ఒక సందర్భం. అలా బద్దలవటంలో కూడా అమ్మకి ఒక పద్ధతి ఉండేది. ఆరోజూ రోజూలాగే ఆఫీసు నుంచి వచ్చింది. బయట్నించి చూస్తే అమ్మకు విషయం తెలిసిపోయిన జాడలేం లేవు. నెమ్మదిగా సైకిలు స్టాండు వేసి, గచ్చు మీద కబుర్లు చెప్పుకుంటున్న మా వైపు తిన్నగా రాకుండా, ఇంటి వార పొడుగ్గా పెరిగిన కరివేరు చెట్టు వైపు వెళ్ళి, దాని కొమ్మ ఒకటి పీకి, దాని నిండా ఉన్న ఆకుల్ని శ్రద్ధగా తురిమి, తర్వాత నన్ను లోపలికి తీసుకెళ్ళి, నాచేత నాట్యం చేయిస్తూ చితక్కొట్టింది. “నాన్న బుద్ధులు ఎక్కడికిపోతాయ్ దరిద్రుడా” అని చెడ తిట్టింది. తర్వాత కాసేపటికి అంత కోపమూ ద్రవించిపోయి, తను కూడా కళ్ళనీళ్ళు పెట్టుకుని, నన్ను దగ్గరికి తీసుకుని ముద్దు చేసి, ఈసారి మెత్తగా బుద్ధి చెప్పింది, నేను గునుస్తూ గారం గుడుస్తూ వింటూంటే.
ఈసారి మేం ట్యూషన్‌కి సక్రమంగా వెళ్ళేట్టు చేయడానికి అమ్మ ఓ కొత్త పథకం ప్రారంభించింది. ఏరోజుకారోజు ట్యూషన్‍కి వెళ్ళినట్టు సూర్రావు మేస్టారి చేత సంతకం పెట్టించుకుని తారీకు వేయించుకుని రావాలి. అయితే నెల తర్వాత మళ్ళీ ట్యూషన్‌లో అడుగుపెట్టిన నాకు మళ్ళీ ఇంకెప్పుడూ మానేయాలని అనిపించలేదు. ఎందుకంటే అదే ట్యూషన్లో వల్లీ తన చెల్లెళ్ళూ, తమ్ముడితో సహా చేరి కనిపించింది. వల్లీకి మనుషులంటే వాళ్ళెంత మంది ఉంటే అంత సరదా. మేం ముగ్గురం, వాళ్ళు నలుగురు- మాతో స్నేహం చేస్తే మేం పెద్ద జట్టయిపోతాం. తొందర్లోనే నన్ను తన జట్టులో చేర్చుకుంది. నాకు చిన్నప్పుడు యాదృచ్ఛికాలనేవి యాదృచ్ఛికంగా ఎప్పుడో ఓసారి మాత్రమే జరుగుతాయని తెలీదు. అందుకే నేను ఎంతో ఇష్టపడిన ఈ పిల్ల మసలుకునే ఆవరణలోకి నా ప్రయత్నం ఏమీ లేకుండానే వచ్చిపడటంలోని యాదృచ్ఛికతని గొప్పగా అనుకుని సంబరపడిపోలేదు. పుట్టిబుద్ధెరిగి కొన్నాళ్ళే అవటం మూలాన ప్రపంచమంటేనే ఇంత అనీ, మనం అనుకున్నవన్నీ మన మనసెరిగినట్టు ఇక్కడ జరిగిపోతాయనీ అనుకున్నాను. అలాగని ప్రతి రోజూ ట్యూషన్‌కి వెళ్ళేముందు దేవుడి పటం ముందు కళ్ళు గట్టిగా మూసుకుని, “ఓం నమశ్శివాయ, ఈ రోజు వల్లీ ట్యూషన్‌కి వచ్చేలా చేయి, ఓం నమశ్శివాయ ఈ రోజు వల్లీ ట్యూషన్‌కి వచ్చేలా చేయి” అని ప్రార్థించటం మాత్రం మర్చిపోయేవాడ్ని కాదు. ఒకవేళ ప్రార్థించాక కూడా ఆమె రాకపోతే ఆ రోజు ప్రార్థనలోనే ఏదో లోటు చేసానని బాధపడేవాడ్ని. మరుసటి రోజు మనస్సు ఏ పక్కకీ పోనివ్వకుండా ఇంకాస్త శ్రద్ధగా ప్రార్థించేవాడ్ని. అప్పుడే కాదు, ఇప్పటికీ వల్లీకీ నాకూ మధ్యనున్న బంధంలోని సిమ్మెట్రీ దేవుడున్నాడేమోనని అనుమానం కలిగేలా చేస్తుంది. విశ్వం మంత్రజాలమయం అనిపిస్తుంది. మేం ముగ్గురన్నదమ్ములం, వాళ్ళు ముగ్గురక్కచెల్లెళ్ళు– తోకలా ఒక తమ్ముడు. వల్లీ అంటే పెద్దన్నయ్యకి ఇష్టమని అమ్మతో ఎక్కడ చెప్పేస్తారోనని, మా ఇద్దరు తమ్ముళ్ళనీ కూడా మిగిలిన ఇద్దరు అక్క చెల్లెళ్ళనీ ప్రేమించమని చెప్పి చెడగొట్టే ప్రయత్నం చేసేవాడిని. అయితే వాళ్ళు మరీ చిన్నపిల్లలు. మా పెద్ద తమ్ముడికి వల్లీ పెద్ద చెల్లెలంటే వళ్ళు మంట. ఇద్దరూ ఎప్పుడూ కొట్టుకునేవారు. వల్లీ చిన్న చెల్లి మా చిన్న తమ్ముడ్ని మేకపిల్ల ఎక్కించుకునేది. వల్లీ నేనూ అంతకన్నా పెద్దరికంతో ఏం ప్రవర్తించేవాళ్ళం కాదు. ఆమె రమ్మన్న చోటికల్లా వెళ్ళి, ఆడమన్న ఆటల్లా ఆడేవాడ్ని. చివరకు శివాలయంలో దేవగన్నేరు చెట్టు కింద తనతో ఆడపిల్లలా ఉప్పులగుప్ప కూడా తిరిగేవాడ్ని. నాకు ఆ శివాలయం, ఉత్తపుణ్యానికి పూలు రాల్చే ఆ దేవగన్నేరు చెట్టూ అలాగే మనసులో ఉండిపోయాయి. మన వాళ్ళు మాట్లాడితే మల్లెలూ, గులాబీలూ అంటారు కానీ, అటు అందానికి అందమూ, మంచి వాసనకి వాసనా ఉండే ఈ దేవగన్నేరు పూవు పేరెందుకు ఎత్తరో అర్థం కాదు. రేకల అంచులో తెల్లగా ఉండి, బొడ్డులోకి పోయే కొద్దీ మెల్లగా పసుపు రంగులోకి మారే పువ్వు రూపాన్ని అక్షరాల్లో వర్ణించగలను కానీ, బొడ్డులో ముక్కు దూర్చి ఎంత పీల్చినా తనివి తీరని వాసనని ఎలా వర్ణించాలి. పదును అంచులున్న పళ్ల మధ్య దళసరి పూరేకని పెట్టి చిన్నగా కొరికితే పళ్ళకు దారిస్తూ వేరయ్యే రేక మృదుత్వమూ, నాలిక్కి అంటే చిరు చేదూ నాకు తెలుసు. రేకలు పట్టు లేకుండా చప్పున విడిపోతాయన్న మాటేగానీ మిగతా విషయాల్లో నా వరకూ ఈ పువ్వుకి సాటి వచ్చే పువ్వు లేదు. శివాలయంలో వల్లీతో ఆడిన ఆటల వల్లనో ఏమో ఈ పువ్వు ఎప్పుడు చూసినా తర్వాత చాలా ఏళ్ళ దాకా వల్లీయే చప్పున గుర్తొచ్చేది– మళ్ళీ స్వయంగా వల్లీనే నా జీవితంలోకి వచ్చి, ఇక పువ్వుల్లోనూ, అందమైన కళ్ళల్లోనూ, రాత్రి వచ్చి పగలు మరుపులోకి జారిపోయే కలల మనోజ్ఞతలోనూ ఆమెని వెతుక్కోవాల్సిన అవసరం తీరిపోయేంత వరకూ. నిజానికి ఇప్పటికీ మనం యాదృచ్ఛికాల తరచుదనాన్ని తక్కువ అంచనా వేస్తామేమోననిపిస్తుంది. ప్రపంచంలో మనం ఊహించిన దానికన్నా ఎక్కువ సిమ్మెట్రీనే ఉన్నదనిపిస్తుంది.
ప్రతి రోజూ సమయానికన్నా ముందే వచ్చి ట్యూషన్ లో కూర్చుని, వల్లీ వస్తుందా రాదా అని తను వచ్చేదాకా వేరే ఏమీ పట్టనట్టు అయిపోయి, తలుపు బయట అడుగుల చప్పుడు కోసమూ, గొళ్ళెం కదిలిన చప్పుడు కోసమూ ఎదురు చూడటం నా వల్ల కాకపోయింది. కాబట్టి అవసరం లేకపోయినా సందులూ గొందుల్లోంచి చుట్టుతిరిగి వల్లీ వాళ్ల ఇల్లున్న సందులోంచి వెళ్ళటమూ, ఏదో అటుగా వెళ్తూ ఆగినట్టు వల్లీ ఇంటి ముందు ఆగి వాళ్ళనీ మాతో పాటు ట్యూషన్‌కి పిలుచుకుని వెళ్ళటమూ మొదలుపెట్టాను. మొదటి రోజు గడప మీద మునివేళ్ళపై లేచి వాళ్ళ ఇంటి తలుపు గొళ్ళెం కొట్టినపుడు గుండె గట్టిగా కొట్టుకుంది. బుర్ర మీసంతో, ఛాతీ నిండా వెంట్రుకలతో, వంటి మీద లుంగీ మాత్రమే కట్టుకున్నాయన తలుపు తీశాడు. నేను పిరికితనాన్ని దాచుకుని వల్లీని ట్యూషన్‌కి పిలుచుకునివెళ్ళటానికి వచ్చామని చెప్పాను. ఆయనకి ఈ ముగ్గురు డింభకుల్నీ చూసి ఏమనిపించిందో! తన పిల్లల్ని పిలుచుకుని వచ్చేందుకు తలుపుకు అడ్డం తొలిగాడు. లోపల ఒక వాకిలీ, తులసికోట, తులసి కోటకు ఎదురుగా మేం నిలబడిన ద్వారానికి కుడివైపున కాస్త పాడుపడ్డ ఇల్లు. తర్వాతి నుంచీ రోజూ వాళ్ళింటి మీంచి వెళ్తూ వాళ్ళని పిలుచుకుని వెళ్ళేవాళ్ళం. ఒక వర్షం రోజున రెండే గొడుగుల్లో ఆరుగురమూ ఇరుక్కుని తడిసీ తడవకుండా వెళ్ళటం గుర్తుంది. వాళ్ళ ఇల్లున్న వీధి నుంచి బయటకొస్తే శివాలయం వీధిలోకి వస్తాం, శివాలయం చుట్టుతిరిగి పైకి వెళ్తే కమ్మోళ్ళ పెద్ద ఇళ్ళున్న వీధిలోకి వెళ్తాం, తర్వాత గ్రంథాలయం వీధి, తర్వాత విశాలంగా బ్యాంకు వీధి, అది వెళ్ళే కొద్దీ సన్నంగా చివరికి చిన్న వీధిలాగా మారిపోయేది, ఆ చిన్న వీధిలో ఒక పెంకుటింటి ముందాగి గొళ్ళెం తలుపు తీస్తే ట్యూషన్‌లో ఉంటాం.
వల్లీ కొన్నాళ్ళకి చిన్నబడిలో చదువు పూర్తి చేసుకుని నేను చదివే పెద్ద బడికే వచ్చి చేరింది. ఆమె వచ్చేసరికే ఆ స్కూల్లో ఒక ప్రేమికుడిగా నా గుర్తింపు క్లాసులో చాలామంది పిల్లలకి పాకిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఇదే బడిలో చేరటంతో నాకు వెక్కిరింపులు మొదలయ్యాయి. ఆమె కనిపించినప్పుడల్లా మా క్లాసు పిల్లలు కొంతమంది నా వైపు తల తిప్పి చూసేవారు. అప్పుడప్పుడూ పాస్‌బెల్లులో ఆమె అటుగా వెళ్తున్నప్పుడు నన్ను “నాగ-వల్లి” అని గట్టిగా పిలిచి ఏడిపించేవారు.
నాకు బొమ్మలు వేయటం వచ్చు. అలాగే షాపుల మీద ఉండే పేర్లలాగా ఇంగ్లీషులో అందంగా అక్షరాలు రాసేవాడ్ని. ఒకసారి పెద్దబడిలో బెంచీలో నా పక్కన కూర్చున్న ఒక అబ్బాయి ఎందుకో గుర్తు లేదు అలా అందంగా “LOVE” అనే అక్షరాల్ని రాయమన్నాడు. నేను దళసరిగా పెద్దబరిలో రాసి, అక్షరాల వెనుక వాటి నీడలు కిందకి సాగినట్టు షేడింగ్ కూడా ఇచ్చాను. ఇంటి దగ్గర దానికి స్కెచ్ పెన్నులతో రంగులు వేసి తెద్దామని జేబులో పెట్టుకున్నాను. నాకు ప్రేమ లేఖలు అనే కాన్సెప్ట్ తెలియదు. ఎందుకో ఆ సాయంత్రం ట్యూషన్ అయ్యాకా వల్లీవాళ్ళూ, మేం ముగ్గురమూ కలిసి వస్తుంటే, నా పెద్ద తమ్ముడు నా జేబులో ఉన్న ఆ కాయితాన్ని తీసి వల్లీకి ఇచ్చాడు. నేను లాక్కోవటానికి ప్రయత్నించాను. ఆమె అందకుండా పరిగెత్తింది. పరిగెత్తి దూరంగా ఆగి కాయితం విప్పి చూసుకుంది. ఇంటి వైపు పరిగెత్తడం మొదలుపెట్టింది. ఆమె నుంచీ ఆ కాయితాన్ని లాక్కొని ప్రమాదాన్ని ఆపాలని నేను వెనక పరిగెట్టాను. కానీ కాసేపటికి తనని అందుకోలేక, పైగా భయంతో కాళ్ళు కూడా వణుకుతుండటంతో, ఆగి నడుస్తూ వెళ్ళాను. వీధులన్నీ దాటి శివాలయం దగ్గరకు వచ్చేసరికి బయట గోడకి ఆనుకుని ఉన్న మెట్టు మీద కూర్చుని ఉంది వల్లీ, తల వళ్ళో పెట్టుకుని ఏడుస్తూ. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ ఆ ఏడుపు చూస్తే ఎందుకో తను ఇంట్లో ఈ విషయం చెప్పదేమోలే అనిపించింది. ఏడిచే ఆడపిల్లని ఏం చేయాలో నాకు తెలీలేదు. అందుకే తిన్నగా నడుస్తూ తన పక్క నుంచే వెళ్ళిపోయాను.
మరసటి రోజు ఓపక్క గుండెలు గుబగుబ లాడుతుండగానే, మరో పక్క అన్నిటికీ తెగించిన ధైర్యంతో ఆమె ఇంటి తలుపు తట్టాను. తలుపు వల్లీనే తీసింది. ముఖం కోపంగా పెట్టుకుని పక్కకు జరిగి నిలబడింది. తులసి కోట దగ్గర కూరలు తరుగుతూ ఒకామె నన్ను చూసింది. లోపలికి రమ్మంది. ఆమె, వల్లీ అమ్మ, “నువ్వెంత, నీ వయసెంత, నువ్వు చేసే పనులేంటి?” అని మొదలుపెట్టి తిట్టింది. మళ్ళీ ఈ వీధిలోకి వస్తే కాళ్ళూ చేతులూ విరగ్గొడతానని కూడా చెప్పింది. బుద్ధిగా చదువుకోపొమ్మంది.
నాకు అది చాలా పెద్ద అవమానంలా అనిపించింది. ట్యూషన్‌లో వల్లీతో మాట్లాడటం మానేశాను. వాళ్ళింటి మీద నుంచి వెళ్ళటం మానేశాను. కొన్ని రోజులకి వల్లీనే వాళ్ళ చెల్లెలు చేతికి చిన్న చీటీ ఇచ్చి పంపింది. అందులో తన కొక్కిరాయి అక్షరాల్లో “మళ్ళీ ఇదివరకట్లా స్నేహంగా ఉందాం” అని ఉంది. కానీ నాకు మాట్లాడబుద్ధి వేయలేదు. వల్లీ మామూలుగానే నవ్వేది. మా తమ్ముళ్ళతో మాట్లాడేది. కానీ ఒక మనిషిని ఇష్టపడుతున్నాననే దాచుకోవాల్సిన నిజాన్ని తడబడి అలా తన ముందే ఎబ్బెట్టుగా బయటపడి ఒప్పేసుకోవటం, ఆమె మళ్ళీ దాన్ని క్షమించి ఫర్లేదులే నువ్వు చిన్నబుచ్చుకోవటం నేను గమనించనట్టే ఇదివరకట్లా మామూలుగా ఉందాం అన్నట్టు వుండటం నాకు నచ్చక, ఎంతో పరువు తక్కువలాగా అనిపించి మాట్లాడలేకపోయాను. వల్లీ ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తించేది. ఒక్కోసారి జట్టు పీసు కొట్టిన ఫ్రెండ్‌తో మసలుకొన్నట్టు నన్ను చూడగానే ముఖం ఇలా పెట్టుకుని వెళ్ళిపోయేది. ఒక్కోసారి ఉన్నట్టుండి ఎదురైతే నవ్వు ఆపుకోలేకపోయేది.
స్కూల్లో, ట్యూషన్‌లలోనే గాక బయట కూడా ఎదురుపడేవాళ్లం. చిన్నబడి పక్కనుండే రావి చెట్టు కొమ్మలకి అట్లతద్ది రోజున ఉయ్యాళ్లు కట్టేవారు. అదంతా పడుచులూ, పడుచువాళ్ల పండగ. అమ్మాయిలు ఎక్కేసరికి అబ్బాయిలు ఉయ్యాళ్ళని మరింత దురుసుగా ఊపేవారు. ఉయ్యాలకున్న పీట చెరువు అంచు దాటి నీటి మీది దాకా వెళ్ళిపోయేది. బయటపడలేక భయాన్ని దిగమింగుకుని ఏడవలేక నవ్వే ఆడవాళ్ళ ముఖాలూ, అలా దిగమింగుకోలేక వెర్రి కేకలు పెట్టే ఆడవాళ్ళ ముఖాలూ కూడా చూడటానికి బాగుండేవి. అపుడపుడూ సందు దొరకబుచ్చుకుని పిల్లలం దూరేవాళ్ళం. ఆటల్లో కింది బొత్తాం చిరిగిన చొక్కాతో వల్లీ ఉయ్యాలూగుతుంటే పచ్చగా ఆమె పొట్ట కనిపించింది. వినాయక నవరాత్రులకి రథం వీధికి అడ్డంగా తెర కట్టి సినిమాలు వేసేవారు. ఎపుడూ ఒకట్రెండు పాత సినిమాలే తిప్పి తిప్పి వేసేవారు. కానీ మాకు సినిమా మీద పెద్ద దృష్టి ఉండేది కాదు. ఆరు బయట ఆకాశం కింద నడి వీధిన అలా తెల్లని తెరపై పెద్ద పెద్ద ఆకారాలు తేలుతుంటే, ఆ వెలుగులో కింద రోడ్డు ఇసకలో పిల్లలమందరం ఇరుకిరుగ్గా కూర్చుని ఆడుకోవటం ఒక అనుభవం. తెరకి అటు వైపు చూస్తే సినిమా ఒకలానూ, ఇటు వైపు నుంచి చూస్తే మరోలానూ కనిపిస్తుంది. ఇట్నించి చూసినపుడు మన పద్ధతిలో పవిట వేసుకున్న హీరోయిన్, అటు వెళ్ళి చూసేసరికి ఉత్తరాది వాళ్ళలా పవిట తిరగేసి వేసుకుని కన్పిస్తుంది. ఇటు వైపు హీరో కుడి చేత్తో పట్టుకున్న పిస్తోలు, అటు వైపు వెళ్ళేసరికి ఎడం చేతిలోకి మారుతుంది. ఈ సినిమాకి ఒకసారి వల్లీ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి వచ్చింది. ఆమె రావటం నేను చూడకముందే మా ఫ్రెండ్స్‌ చూసేసి గుసగుసగా నాకు చెప్పారు. వీధివార ఒక పెద్ద ఇంటి ఎత్తయిన గచ్చు మీద ఆడవాళ్ల మధ్యన కూర్చుని తెరవంక చూస్తున్న వల్లీ ముఖం వైపు చూస్తూండిపోయాను, ఆమెకి ఎవరో చూస్తున్నారనిపించి నా వైపు తల తిప్పి చూసేవరకూ.
దోబూచులాటలతో ఒక ఏడాది గడిచిపోయింది. ఆ వేసవి సెలవుల్లో చెప్పాపెట్టకుండా వల్లీ్వాళ్ళు ఆలమూరు వదిలి వెళిపోయారు. కొత్త తరగతిలోనూ, అదీ కొత్త స్కూల్లోనూ చేరిన ధ్యాసలో నేను ఆమె లేకపోవటాన్ని పట్టించుకుని బాధపడింది తక్కువే. కానీ ఎదిగేకొద్దీ ఆమె నాలో అంతకంతకూ బలపడింది. యవ్వనంలోకి వచ్చాకా కూడా, నేను ఎవరితోనూ ప్రేమలో లేకుండా నా మనసుని ఖాళీగా ఉంచిన విరామాల్లో, ఆమె నాకు గట్టిగా గుర్తుకువచ్చేది. ఎందుకో అలాంటి అమ్మాయే నాకు నప్పుతుందని నాలో ముద్రపడిపోయింది. నేను చదువయ్యాకా ఇంటి నుంచి బయటకు వచ్చి ఒంటరిగా నగరంలో ఉన్న రోజుల్లో, నాతో పాటు సమాంతరంగా ఎదిగివున్న ఆమె ఊహే నా ప్రేయసి అయ్యేది, నన్ను కాపాడేది. నాకు వాస్తవంలో ఆదర్శంగా అనిపించిన భావాలన్నీ కలల్లో ఆమెకు ఆపాదించబడేవి. ఆమె కలలోకి వచ్చాకా నిద్ర లేచిన పగళ్ళు ఎంతో ఉత్తేజంతో జీవితం పట్ల ప్రేమనీ అనురక్తినీ పెంచేవిగా ఉండేవి. నేను కొత్తగా ఎవరితో ప్రేమలో పడినా వాళ్ళల్లో ఎంతో కొంత ఆమెను వెతుక్కున్నాను. ఎంతైనా నా ప్రేమల వరుసలో ఆమె మొదటిది కాబట్టో మరేమో. ఇంతిలా ఉన్నా ఎప్పుడూ ఆమెని వెతికే ప్రయత్నం చేయలేదు. యాదృచ్ఛికాల మీద పెట్టుకున్న నమ్మకమో, నా జీవితానికి శాపమైన ఒళ్ళు బద్దకమో, ఒకవేళ కలిసినా మున్ముందు ఎంతో అందమైన ఆడపిల్లగా ఎదుగుతుందని నాకు కచ్చితంగా తెలిసిన ఆ అమ్మాయి చుట్టూ ముసురుకునే ఎందరో మగాళ్ళ మధ్య చిన్నప్పడు ఒక ప్రేమలేఖ కాని ప్రేమలేఖ ఇచ్చిన ఈ నల్ల పిల్లాడ్ని ఎందుకు గుర్తుంచుకుంటుందిలేమ్మన్న నిరాశో, ‘పదోతరగతి అయ్యాకా పెళ్ళి చేసుకోవడం’ తన లక్ష్యమని అప్పుడే చెప్పిన పిల్లని వెతికి దొరకబుచ్చుకున్నా ఆమె నాది కావటం అసాధ్యమని తెలియటమో… ఇన్ని కలిసి నన్ను మరీ పట్టుబట్టి ఆమెను వెతక్కుండా చేశాయి.
కానీ మళ్ళీ పంతొమ్మిదేళ్ళ తర్వాత ఆమె కలిసింది. అప్పటి నన్ను గుర్తుంచుకుంది, ఇప్పటి నన్ను ఇష్టపడింది. మా పెళ్ళయి మాకు బిడ్డ పుట్టిన నాలుగేళ్ళకి కానీ మా ఇద్దరికీ ఆలమూరు వెళ్ళడం కుదరలేదు.
బైక్ మీద రావులపాలెం గోదారి దాటి, జొన్నాడ దాటి, ఇంకా వున్న ఇటిక బట్టీలు దాటి, జ్ఞాపకం కన్నా ఎంతో ఇరుకనిపించిన ఆలమూరు వీధుల్లోకి వచ్చాం. చిన్నప్పుడు మా ఇంటి నుండి ఎంతో దూరం అనిపించిన చిన్నబడి ఇప్పుడు చప్పున వచ్చేసింది. రావి చెట్టు కొన్ని కొమ్మల్ని కోల్పోయి, విశాలత్వాన్ని కుదించుకున్నట్టు అనిపిస్తూ, ఉండటమైతే ఉంది. పక్కన చిన్నబడి కూడా ఉంది. సాయంత్రం కాబట్టి బడి మూసి ఉంది. కొంతమంది పిల్లలు ఇంకా స్కూలు యూనిఫారాల్లోనే పక్కనున్న ఇసుక గుట్టల్లో ఆడుకుంటున్నారు. బండి ఆపి వల్లీ నేనూ బడిని చూసుకున్నాం. ఇప్పుడు వర్తమానంలో నిజంగా కళ్ళ ముందున్న పరిసరాలకూ, ఇన్నాళ్ళుగా మా మనసులో ఊహలుగా మెదిలిన పరిసరాలకూ పొంతన కుదరటం లేదు. మా మనసులో ఉన్న చిన్నబడి రూపం ఏదో ఒక్కనాటిది కాదు; వేర్వేరు ఋతువుల్లో వేళల్లో, వేర్వేరు మూలల నుంచి కనిపించిన దాని వేర్వేరు వైనాలన్నీ ఒకదానిపై ఒకటిగా పేరుకున్న దృశ్యాల దొంతర– చిన్నప్పుడు పలక మీద ఒకే అక్షరాన్ని పదే పదే ఒరవడి దిద్దితే ఏర్పడే అక్షరాల దొంతర లాంటిది. అది ఇప్పుడు మా కళ్ళ ముందున్న ఈ ఒక్కనాటి వాస్తవాన్ని మించిన వాస్తవం. బడి వరండాకు అప్పటిలాగే కటకటాలు ఉన్నాయి. తలుపులకు మాత్రం రంగు మారింది. చుట్టూ ప్రహరీ గోడ వచ్చి చేరింది. ఆ కట్టడంలో అప్పటిలాగే మిగిలిన కొన్ని భాగాల్ని చూస్తూంటే మనసులో ఏదో మడత విప్పుకుంటోంది, ఏదో జ్ఞాపకం రెక్కలు విదిలించుకుని లేవబోతోంది. అంతలోనే అదే కట్టడంలో మారిపోయిన భాగాలు కంటపడగానే జ్ఞాపకం రెక్కలు తెగి వర్తమానంలోకి వచ్చి పడుతోంది. ఒక పక్కన కాలంలో వెనక్కి కదులుతున్నట్టు ప్రయాణపు కుదుపూ, మరో పక్క అదంతా భ్రమేనని తేలి ఉన్నచోటే తెప్పరిల్లటం… మన చుట్టూ మనం గిర్రున బొంగరంలా తిరిగి తిరిగి ఒక్కసారే ఆగితే, చలనానికీ స్థిరత్వానికీ మధ్య భౌతికమైన సర్దుబాటులో మెదడు ఎలాంటి గందరగోళానికి గురవుతుందో, అలాంటిదే నా మనసుకు జరుగుతూ చికాకు కలిగింది. శ్రీవల్లి ఫోటోలు తీస్తోంది. ఇసకలో ఆడుకుంటున్న పిల్లలు ఆగి మమ్మల్ని చూస్తున్నారు. బడి ఎదుట ఇళ్ళల్లో పనులు ముగించుకుని కబుర్లు చెప్పుకుంటున్న ఆడవాళ్ళు మా వంక కుతూహలంగా, అనుమానంగా చూస్తున్నారు. తడుముతున్నట్టు ఉన్న వాళ్ళ చూపులూ, ఇక్కడ ఏదీ వెనక్కి తిరిగి రాదని తెలిసిన నిరాశా మమ్మల్ని అక్కడ ఎక్కువ సేపు ఉండనీయలేదు. పరిసరాల మూగతనాన్ని మనసులోనే తిట్టుకుంటూ, “పోదాం పద” అన్నాను. వల్లీ ఈసారి బండెక్కేటప్పుడు రెండు వైపులా కాళ్ళేసి కాక, ఊళ్ళో ఆడవాళ్ళలా రెండు కాళ్ళూ ఒక పక్కకు పెట్టుకుని కూర్చుంది. నెమ్మదిగా వల్లీ పాత ఇంటి మీదుగా పక్కనే శివాలయం వైపు వెళ్ళాం. మంటపం ముందు పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారు. ఆశ్చర్యంగా చుట్టూ పూలను పారేసుకుని దేవగన్నేరు చెట్టు అలాగే నిలబడి ఉంది. వల్లీ కొన్ని పూలు తలలో తురుముకుంది. గుళ్ళోకి ఎవరో వెళ్ళటం చూసిన పూజారి భార్య లోపలికి వచ్చి వల్లీతో మాట్లాడింది. మెట్టినింట్లో అడుగుపెట్టినప్పటి నుంచీ ఇదే ఊళ్ళో జీవితం గడిపేసిన ఆమెకి- ఇలా జ్ఞాపకాల్ని వెతుక్కుంటూ ఇంకో ఊరికి అది తప్ప మరో పనేం లేకుండా రావటమనేది తన తర్వాతి తరం పిల్లలకు మాత్రమే వీలయ్యే ఒక పాషనబుల్ విషయంగా అనిపిస్తున్నదన్న సంగతి దయగా నవ్వుతోన్న ఆమె ముఖ కవళికే చెబుతోంది.
బండి మీద ఇంకొన్ని వీధులు తిరుగుతూ రథం వీదికి వచ్చాం. నీలా టీచరు ఇంటి మీంచీ వెళ్తుంటే మా ఇద్దరికీ ఆమెని చూడాలనిపించింది. ఇంటి గడపకీ, గేటుకీ మధ్యన బోలెడు దూరంతో, పై అంతస్థుకి పెంకుల కప్పుతో ఆ పెద్ద ఇల్లు ఇంకా అలానే ఉంది. తమ దగ్గర చదువుకున్న పిల్లలు పెద్ద ఉద్యోగాల్లో కుదురుకుంటే సంతోషపడే టీచర్లుంటారు కానీ, చదువుకున్న పిల్లల్లో ఓ ఇద్దరు ఒకర్నొకరు పెళ్ళి చేసుకుంటే సంతోషించే టీచర్లు ఉండరనీ, అదొక తుంటరితనంగా చిరాగ్గా కూడా చూస్తారనీ ఇద్దరికీ తెలుసు. కాబట్టి మా ఇద్దరిలో ఎవరో ఒక్కరే ఆమె దగ్గర చదువుకున్నట్టు చెబుదాం అనుకున్నాం. నువ్వంటే నువ్వనుకుంటూ, ఎవరన్నది తేలకుండానే గేటు తోసుకుంటూ లోపలికి వెళ్లాం. ఎవరో వచ్చారని లోపలివాళ్ళు గ్రహించేంత గట్టిగానే గేటు వేస్తూ చప్పుడు చేసాం. ఇంటి చీకట్ల లోంచి ఎవరో కదిలి రావటం కనిపించింది. నాకు ఒక క్షణం ఇక్కడిదాకా వచ్చాకా ఇక వెనక్కి వెళ్ళలేం అనిపించింది. కానీ బయటకు వచ్చిన మనిషి నీలా టీచరు కాదు. ఆమె బంధువు. నీలా టీచరు ఇప్పుడు ఈ ఇంట్లో ఉంటం లేదనీ, ఊరి చివర కొత్తగా ఇల్లు కట్టుకుని అక్కడకు మారిపోయారనీ చెప్పిందావిడ. మాకు నీలా టీచర్ని తప్పకుండా చూడాలనేం లేదు. మా ఇద్దరిలో ఎవరమూ చిన్నప్పటి టీచర్లని మళ్లా కలిస్తే వాళ్ళు “మేం పాఠాలు చెప్పిన తీరు వల్లే కదా ఇదంతా” అని మురిసిపోయేంత పెద్ద ఉద్యోగాలు చేయటం లేదు. మేం ఆనందంగా ఉన్నాం. కానీ మన జనానికి అది పెద్ద సాధించటం కిందకి రాదు. మళ్ళీ బండెక్కి ఇంకొన్ని వీధులు తిరుగుతుంటే మళ్ళీ అదే భావం– పరిసరాలన్నీ ‘మీరసలు ఎందుకొచ్చారిక్కడికీ’ అని ఇబ్బందిగా, నిరసనగా అడుగుతున్నట్టు.
కాసేపు ఏ లక్ష్యమూ లేకుండా బండి మా ఇద్దర్నీ మోసుకుంటూ, హేండిల్‌బార్ మీద నా చేతులు అప్పుడు పుట్టిన బుద్ధికి ఎటు తిప్పితే అటు తీసుకువెళ్తూ చాలా వీధులు తిరిగాం. సూర్రావు మాస్టారు అద్దెకుండి మాకు ట్యూషన్ చెప్పిన ఇల్లు అలానే ఉంది. స్థలం కొనుక్కునేవాళ్ళు సంప్రదించాల్సిన నంబరు ఆ పెంకుటింటి చూరుకి వేలాడదీసి ఉంది. మరికొన్ని వీధులు తిరిగాకా బండి తెలియకుండానే మమ్మల్ని ఊర్నించి బైటకు పోయే రోడ్డు మీదకు తీసుకు వచ్చింది. చూస్తూ పోతుంటే, అసలు ఊరు కూడా ఊర్నించి బయటకు వచ్చేస్తున్నట్టుంది. ఎందుకంటే, ఊరి లోపల అంతా పాతబడినట్టు ఉంటే, ఊరి చివర మాత్రం వరుసగా కొత్తగా కట్టిన ఇళ్ళు చాలా ఉన్నాయి, అవన్నీ ఊరిని వదిలి ఆ రోడ్డు మీదుగా పోతే వచ్చే మండపేట టౌను వైపుగా బారులు తీరి నడుస్తున్నట్టు.
మేము ఒక సందు మలుపు తిరిగి లోపలకు వెళ్ళాం. నీలా టీచరు కొత్త ఇల్లు మోడ్రన్‌గా ఉంది. పాత ఇంటిలా తరాల్ని చూసిన గంభీరత్వంతో కాక, కోణాలన్నీ చక్కగా తీర్చి, ఏ భాగాలకి నప్పే రంగు ఆ భాగానికి వేసుండి, అక్కడక్కడా అద్దాలతో ఉంది. గేటు తాళం వేసి ఉంది. గేటు గ్రిల్ లోంచి లోపల చిన్న తోట కనిపిస్తోంది. కాసేపు ఊహలో నీలా టీచరు ఆ తోటలో తిరుగుతున్నట్టు ఊహించుకున్నాను. వరండాలో ఖాళీగా ఉన్న కుర్చీలో ఆమె కూర్చున్నట్టు ఊహించుకున్నాను. ఇంతలో ఎవరో అబ్బాయొచ్చి ఇంట్లోవాళ్ళు హైదరాబాద్‌ చుట్టాలింటికి వెళ్లారని చెప్పాడు. వల్లీ ఇంక అక్కడ తనకు ఉండబుద్ధేయటం లేదన్నది. బయల్దేరి వచ్చేశాం.
తర్వాత కొన్ని వారాలకి ఒక రాత్రి నిద్రపట్టకపోతే ఎందుకో మళ్ళీ ఆ రోజు మేమిద్దరం నీలా టీచరు ఇంటికి వెళ్ళిన సన్నివేశం గుర్తుకువచ్చింది. అపుడు నా గురించి నాకు ఓ విషయం ఆశ్చర్యమనిపించింది. ఆ రోజు నీలా టీచరు కోసం వెళ్ళిన రెండు ఇళ్ళల్లోనూ, ఆమె కాసేపట్లో మా ముందుకొస్తుందని ఎదురుచూసిన ఆ కొద్ది క్షణాల్లోనూ, ఆ వచ్చే ఆమె నేను చిన్నప్పుడు ఎలా చూసానో అలాగే ఉంటుందనుకున్నాను. పాతికేళ్ళ తర్వాత- ఆ గిరజాల జుట్టు నెరిసిపోయి, ఆ చర్మం వడలిపోయి, ఆ కళ్ళు అలసిపోయీ, కళ్లజోడుతో ఉన్న మనిషి వచ్చే అవకాశం ఉందని నాకు కనీసం తట్టలేదు కూడా. నేను మళ్ళీ ఆమెను కలిసే ప్రయత్నం చేయకపోతే, ఆమె ఎప్పటికీ అలానే ఉండిపోతుంది. చిన్నబడిని రెండోసారి చూసి అంతకుముందు నా జ్ఞాపకంలో ఉన్న పాత చిన్నబడిని కొంతైనా కల్తీ చేసుకున్నాను. నీలా టీచరు రూపాన్ని కూడా అలా కల్తీ చేసుకోవాలా? ఆ రాత్రే ఆమె గురించి ఏదైనా రాయాలనిపించింది. కానీ ఆమెనీ, నన్నూ కలుపుకొని ఒక కథ అంటూ ఏమీ లేదు. అసలు ఆమె రూపం గురించి తప్ప, అంతరంగం గురించి నాకు ఏమీ తెలీదు. ఆమె కళ్ళ వెనుక, కపాలపు చీకట్లలో ఏం జరిగేది. ఆమె సంతోషం తెలిసిన మనిషేనా, లేక దిగులు మనిషా. గదిలో ఒక్కతే ఉన్నప్పుడు ఆమె ఎక్కడకు ఎగిరిపోవాలని అనుకునేది, అసలు ఆ ధ్యాస ఉండేదా. ఆమె ఎవర్నైనా ప్రేమించిందా, లేక బాబ్జీ/ అబ్బుగారు/ రాంపండుని మినహాయించి మరో తోడు లేని, ఆ నిమిత్తమూ అవసరమూ లేని లోకమా. నిజమైన నీలా టీచర్ గురించి అంచనాలు తప్ప నా దగ్గర ఏదీ లేవు. అంచనాలతో సృష్టించే కల్పన నిజమైన నీలా టీచర్‌ని కల్తీ చేస్తుంది. ఆమె కథేమీ నా దగ్గర లేకుండా ఆమె గురించి కథ ఎలా చెప్పటం…
Painting: Kiran. B
ఒరాంగుటాన్
ఆఫీసులో వాడొచ్చి చేరేదాకా అంతా బానే ఉండేది. మేం ఐదుగురం కలివిడిగా సందడిగా ఉండేవాళ్ళం. అసలు అది ఆఫీసు పనేనా అన్నంత సఖ్యంగా చేసుకునేవాళ్ళం. వాడొచ్చి కడివెడు పాలల్లో ఉప్పుకల్లులా కలిసేదాకా.
నలుగురూ నవ్వేచోట గుర్తు రాకూడని మనిషి. పేరెందుకు గానీ, టైపిస్టు కాబట్టి అలాగే పిలుస్తాను. వాడు రాకముందూ టైప్‌ మిషను ఉండేది గానీ, ముసుగేసుకుని ఓ టేబిలు మీద అలా పడుండేది. హెడ్‌ గుమాస్తాగారికి ఎపుడన్నా నడుం లాగినపుడు కుర్చీ లోంచి లేచి అటూయిటూ పచార్లు చేస్తూ ఆ టేబిలు మీద కూర్చుని మాతో కబుర్లు చెప్పేవారు. ఆయన మనవళ్లు ఎపుడన్నా ఆదివారం సరదాగా ఆఫీసుకి వచ్చినపుడు ఆ మిషను మీద కవరు తీసి పేపరెక్కించి ఆడుకునేవారు. లేకపోతే దాని జోలికే ఎవరూ పోయేవాళ్ళు కాదు.
ఒక రోజు ఉన్నట్టుండి పై నుంచి నోటీసు–ప్రతి డిపార్టుమెంటుకీ టైపిస్టుల్ని ఇస్తున్నామని. మేవేం అడగలేదు కదా మాకెందుకని హెడ్‌ గుమాస్తాగారూ, సీనియరసిస్టెంటుగారూ పైవాళ్ళ దగ్గరకెళ్ళి మరీ చెప్పారు. మాటొచ్చింది కదాని చెప్తున్నాను. అసలు మాకు టైపిస్టు అవసరమే లేదు. నా దస్తూరీ ముత్యాల కోవలా ఉంటుందని అంటారు మావాళ్ళంతా. పైగా చాలా వేగంగా కూడా రాస్తాన్నేను. అక్షరదోషాలూ, గ్రామరు మిస్టేకులూ అస్సలుండవు. ఎపుడో నేను చేరకముందు ఒక ముసలాయన ఉండేవాడట టైపిస్టుగా. వాళ్ళావిడకి పాపం అనారోగ్యమైతే వాలంట్రీ రిటైర్మెంటు పెట్టుకునెళ్ళిపోయాడు. అప్పట్నించీ, ఫాను చప్పుడుకే రీసౌండొచ్చే మా పెద్ద హాల్లో ఆ దరిద్రపు టైపు మిషను మోత తప్పిందని మా సర్వేయరుగారంటూ ఉంటారు. ఎపుడో తప్పితే ఆఫీసులో ఉండని ఆయనే అలాగంటే మరి మిగతావాళ్ళ బాధ! అందుకే పైకెళ్ళి మరీ టైపిస్టు అవసరం లేదని చెప్పుకున్నారు. కానీ అందరికీ ఓ రూలూ మీకో రూలూ కుదరదన్నారంట పై వాళ్లు. ఆ తర్వాత రెండ్రోజులకే దిగబడ్డాడు… కొత్త టైపిస్టు.
నేను ఉత్తపుణ్యానికి ఒకళ్ళ గురించి పొల్లుమాటనే మనిషిని కాదు. అందరితో మంచిగా ఉంటాను. తోటి మనుషుల్నీ, చేసే పనినీ ప్రేమిస్తాను. మనసులో ఒకటుంచుకుని, బైటకొకలా మాట్లాట్టం తెలీదు. నేననే కాదు, మా ఐదుగురమూ అంతే. హెడ్‌ గుమాస్తాగారు అప్పుడపుడూ చిరాకొచ్చినపుడు అరిచినా, దాని వెనక పనవటం లేదన్న బాధా, మళ్ళీ అందుమూలాన మేమేవన్నా పైవాళ్ళ నుంచి మాట పడాల్సి వస్తుందేమోనన్న అక్కరా తప్పిస్తే ఇంకేం ఉండదు–ఇంట్లో పిల్లల్ని గదమాయించినట్టే. ఇక సీనియరసిస్టెంటుగారైతే చెప్పనే అక్కర్లేదు. మంచి సరదా మనిషి. ఒట్టి గళ్ళచొక్కాల్లోనే ఇన్ని రంగులూ రకాలూ మార్చొచ్చా అనిపిస్తుంది ఆయన డ్రస్సింగదీ చూస్తే. వాచీ చైను లూజుగా మణికట్టు మీద ఆడించుకుంటా ఆయన మాకు తెలిసిన సంగతుల్నే మళ్ళా జోకుల్లా చెప్పి నవ్విస్తాడు. ఇంక సర్వేయరుగారు వయసుకు తగ్గట్టే కాస్త గంభీరంగా అంటీముట్టనట్టు ఉంటారు. దగ్గరకొచ్చి మెల్లిగా మాట్లాడతారు. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు కాబట్టి ఉద్యోగం చేస్తున్నాడు కానీ ఆయనకా అవసరమే లేదు. నాలుగోవాడు మణి. వాడ్ని మేవెవరం అటెండరు లాగా చూడం. బతికి చెడిన కుటుంబం నుంచొచ్చి ఈ ఉద్యోగం చేస్తున్నాడు. కాస్త పుష్టిగా వయసుకు మించి కనిపిస్తాడు కానీ ఇంకా కుర్రాడే, గెడ్డం ఓ పదిసార్లయినా గీసుండడు. వాడూ సీనియరసిస్టెంటుగారూ కూర్చుని కత్తు కలిపారంటే ఇంక మేం పని పక్కనపెట్టి నవ్వుకుంటా కూచోవాల్సిందే.
మణి వరండాలో కూర్చుంటే ఊసుపోటం లేదని హెడ్‌ గుమాస్తాగారు నా పక్కనే ఓ బల్ల వేయించారు. కానీ వాడందులో కుదురుగా ఓ నిమిషం ఎపుడైనా కూర్చుంటేనా. మొత్తం అన్ని డిపార్టుమెంట్లూ వాడివే అన్నట్టు తిరుగుతాడు. ఎక్కడెక్కడి వార్తలూ మోసుకొస్తాడు. సర్క్యులర్లూ, నోటీసులూ పైన టైపింగ్‌ అవుతుండగానే మాకిక్కడ తెలిసిపోతుంటాయి. వాడి అల్లరి వెనక ఉన్న మరో మనిషి మాత్రం నాకే తెలుసు. వాడి లక్ష్యాలు, బాధ్యతలూ, కష్టాలూ… అన్నీ. ఎన్నో రాత్రుళ్ళు వాడు జీవితంలో పైకి రావటానికి ఏం చేయాలనుకుంటున్నాడో కళ్ళక్కట్టినట్టు చెప్తుంటే నేను అవన్నీ నా జీవితానికి సంబంధమున్నాయే అన్నట్టు విన్నాను.
ఇక నా గురించి పెద్దేంలేదు చెప్పుకోవటానికి. పెళ్ళయిన బ్రహ్మచారిని. ఆ మనిషి వెళ్ళిపోయిందన్న బాధేం లేదు. పనిని ప్రేమిస్తాను. మాట తెచ్చుకోను. సాయంత్రాలు పార్కులో నడవటం, కలం స్నేహితులు కొంతమందికి ఉత్తరాలు రాసుకోవటం, లేదంటే లైబ్రరీ నుంచి పుస్తకాలు తెచ్చుకుని చదువుకోవటం, రేడియోలో పాటలు వింటూ పడుకోవటం. ప్రతీదీ ఏ మోతాదులో ఉండాలో ఆ మోతాదులో ఉంది.
మనుషుల్ని వాళ్ళ రూపం బట్టి అంచనా వేయటం తప్పని నాకు తెలుసు. కానీ నేను గమనించిందేమిటంటే- ఒక మనిషి మనసు అష్టవంకర్లుగా ఉన్నప్పుడు ఆ ప్రభావం నెమ్మదిగా ఆ మనిషి రూపం మీద కూడా పడుతుంది. అందుకే మొదటిసారి చూసినప్పుడే కొత్త టైపిస్టు తేడా కొట్టేడు. చూట్టానికి మనిషి ఎత్తుగా, బలంగానే ఉంటాడు. తన ఎత్తుకి సిగ్గుపడుతున్నట్టు కొద్దిగా ఒంగి నడుస్తూంటాడు. నల్లటి ముఖం కాస్త పెద్దది కావటంతో కళ్ళూ ముక్కూ నోరూ అన్నీ ఖాళీగా సర్దినట్టుంటాయి. బుగ్గల మీద మొటిమల మచ్చలు గుంటలుపడి ఉంటాయి. ఎదర కొంత జుట్టూడిపోయి, నుదుటి మీద నరాలు వానపాముల్లా కదులుతుంటాయి. వేసుకునే బట్టల్లో ఎప్పుడూ ఓ రంగూపాడూ ఉండదు. ఒక చొక్కా వేలాడేసుకుని చేతుల దగ్గర పైకి మడతపెట్టుకుంటాడు. ఎత్తువల్ల పాంటుకి కిందెప్పుడూ చీలమండలు కనిపిస్తుంటాయి. ఇంత వర్ణించినా ఆ మనిషిలో నాకు తేడా కొట్టిందేమిటో చెప్పలేకపోతున్నాను. అతని ఫోటో తీసి చూపించినా అర్థంగాకపోవచ్చు. అతను మసలుకునే తీరులోనే ఆ అందవికారం ఉందేమో. ఎపుడూ ఏదో తడబాటుగా సంకోచంగా ఉంటాడు. కళ్ళల్లో కళ్ళుపెట్టి తిన్నగా చూడలేడు. అన్నీ పక్కచూపులు, దొంగచూపులు. చేరినకొత్తలోవుండే కంగారేమో అనుకున్నాం మొదట్లో. అలవాటయ్యాకా మాలో కలిసిపోతాళ్ళే అనుకున్నాం. కానీ ఆర్నెల్లయినా అదే తీరు. హెడ్‌ గుమాస్తాగారికి తన ధోరణేదో తనది. పనిచేస్తే చాలు ఎవరెలా ఉన్నా పట్టించుకోరు. సీనియరసిస్టెంటు మాత్రం మొదట్లో అతని దగ్గరకు వెళ్ళి సరదాగా పలకరించేవారు. అలాంటప్పుడు అతను ప్రవర్తించే తీరు తేడాగా ఉండేది. ముఖమంతా తెచ్చిపెట్టుకున్న నవ్వుతో ఎంతో ఒదిగున్నట్టు సమాధానాలిచ్చేవాడు. అన్నీ ముక్తసరిగానే ఉండేవి. సీనియరసిస్టెంటు చూసిచూసి పట్టించుకోవటం మానేశారు. మొదట్లో లంచ్‌కి వెళ్ళేటప్పుడు రమ్మంటే మాతోపాటు వచ్చేవాడు. మా వరసలో ఎప్పుడూ చివర్న కూర్చునేవాడు. కలిపించుకుని మాట్లాడేవాడు కాదు. మేం ఏదన్నా కదిపితే మాత్రం ముఖమంతా ఎంతో ఇదిగా మార్చేసుకుని సమాధానం చెప్పేవాడు. అదంతా నటన అని తెలిసిపోయేది. మేం మాట్లాడే మాటల్లో అతనికేం ఇంట్రస్టు లేదని తొందర్లోనే అర్థమైపోయింది. ఎపుడో అరుదుగా అతనే కలగజేసుకుని ఓ మాట అన్నా, అది కూడా ఇంట్రస్టుండి కాదని, తన వంతుగా ఏదోటి మాట్లాడాల్సిన బరువు ఫీలయి మాట్లాడుతున్నాడని మాకనిపించేది. దాంతో పక్కనే కూర్చున్నా పట్టించుకోవటం మానేశాం. అంత పొడవైన చేతులు ఎబ్బెట్టుగా ఊపుకుంటూ మా వెనక నడుస్తుంటే మోయలేని తోకలా అనిపించేవాడు. తర్వాత్తర్వాత మెల్లిగా తనే మాతో భోజనానికి రావటం మానేశాడు.
కానీ అంత పెద్ద హాల్లో ఆ మూల అతని జాడ మరీ పట్టించుకోకుండా ఉండలేం కదా; పైగా ఆ టైప్‌ మిషను చప్పుడోటి. అసలు అతను మాట్లాడకపోవటాన్ని ఆ టైపు టకటకల్తో భర్తీ చేసుకుంటున్నాడేమో అనిపించేది. ఒక్కోసారి మా నుంచి తనని వేరు చేసుకోవటానికి ఆ టైపు చప్పుడుని ఒక గోడలా వాడుతున్నాడేమో అనీ అనిపించేది. మా సీనియరసిస్టెంటుగారు ఏదో జోకేసినపుడో, మా మణి ఏదన్నా ఊళ్ళో విషయం మాట్లాడుతున్నప్పుడో, ఇలా మేం ఐదుగురం ఒక కుటుంబంలా సందడిగా ఉన్నప్పుడల్లా, మాలో కలవాల్సిన అవసరాన్నించి తప్పించుకోవటానికన్నట్టు ఆ టైపు మిషను మామూలుకన్నా జోరుగా టకటకలాడేది, మిషను కేరేజీ డుర్రున వెనక్కి మళ్ళేది. ఎపుడో ఒకసారి ఏదో తప్పనిసరి అవసరం వచ్చి మా టేబిళ్ళ దగ్గరకొచ్చి నిలబడి గొణిగేవాడు. రెట్టిస్తే తప్ప ఏమంటున్నాడో అర్థమయేది కాదు. చెప్పాపోటమే… అప్పుడప్పుడూ అతని మీద జాలేసిన సందర్భాలున్నాయి. సీనియరసిస్టెంటుగారు అతను చేతులు వేలాడేసుకుంటూ నడిచే తీరు చూసి ఒరాంగుటాన్‌ అని పేరు పెట్టారు. ఒకసారి అతను లేనప్పుడు గుప్పిళ్ళు వదులుగా మూసి అతన్లాగ నడిచి కూడా చూపెట్టారు. అప్పుడు నవ్వొచ్చింది గానీ తర్వాత జాలేసింది. మణి కూడా లోకువ కట్టేసాడు. ఒకసారి టైపిస్టు రికార్డు రూమ్‌లోంచి ఏదో ఫైలడిగితే, ”తీసుకోండి సార్‌, ఆ దుమ్ములోకి వెళ్ళటం నా వల్ల కాదు,” అనేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి మణి నా గదికి వచ్చినపుడు వాడి కోసం ఆమ్లెట్టదీ వేస్తూ, ”జీవితంలో ఏం దెబ్బలు తిన్నాడో మనకేం తెలుసురా!” అని నచ్చచెప్పాను. ”నువ్వో అమాయకుడివి, పైకి అలా కనపడేవోళ్ళు చాలా డేంజరు,” అన్నాడు. వాడన్నది నిజమే, నేను ఊరికే అందర్నీ నమ్మేస్తాను.
మనుషులెపుడూ చలాకిగా, కలుపుగోలుగా ఉండాలని నేను అనుకుంటాను. భూమ్మీద పుట్టి పోయేలోగా పదిమందినీ కలేసుకోవాలి, మన పాడె లేచినపుడు అందరూ కన్నీటితో సాగనంపాలి. ఎందుకెపుడూ ఏదో కోల్పోయినట్టుండాలీ? ఓ చిరునవ్వుతో, ఓ ఆప్యాయమైన పలకరింపుతో గెలవలేందెవర్నీ? అదీ నా పద్ధతి. నలుగురూ ఒకలా ఉన్న చోట, ఒకడు ఎడంగా నన్నంటుకోకు నామాలకాకీ అన్నట్టుంటే బాగోదు, నిజమే. అయితే అతనికేం కష్టాలున్నాయో అనుకుని ఉండిపోయాను. సర్వేయరుగారంటే అసలిలాంటియ్యి పట్టించుకోడు. హెడ్‌ గుమాస్తాగారూ పెద్ద పట్టించుకునే మనిషేం కాదు గానీ, ఆ మధ్యోసారి ఆయనకీ ఒళ్ళుమండింది. ఆదివారాలెపుడైనా పనుండి ఆఫీసుకి రావాల్సొస్తే సరదాగా మనవళ్ళిద్దర్నీ వెంటబెట్టకుని రావటం ఆయనకలవాటు. ఒకరోజు ఆళ్ళ పెద్దమనవడు టైపు మిషనుతో ఆడుకుంటుంటే, అపుడే లోపలికొచ్చిన టైపిస్ట్‌ ”ఒయ్యోయ్‌!” అంటూ గదమాయించేడు. నేను అప్పటికీ ”మన సార్‌ మనవడండీ,” అన్నాను కూడా. ”రిబ్బను ఊడొచ్చేసిందండీ,” అంటూ దాన్ని పైకెత్తి చూపించేడు. హెడ్‌ గుమాస్తాగారు అప్పటికైతే ఏమనలేదు. ఫైల్లో తల దూరుస్తూ ”పెట్టుకోవచ్చు లేవయ్యా మాయదారి రిబ్బను,” అని ఊరుకున్నారు. తర్వాత ఓ రెండ్రోజులకి టైపిస్టు కొట్టిన లెటర్లో గ్రామరు మిస్టేకులతో సహా రెడ్డింకుతో నోట్‌ చేసేరు. దగ్గరికి పిలిచి కడిగిపారేసారు. ఆయనకి కోపమొస్తే వీరభద్రుడే! కాయితాలు ఇలాగ మొహం మీదకు ఇసిరికొట్టేశారు. మరెందుకు దూల నోరు కాకపోతే. కిందపడిన పేపర్లన్నీ ఏరుకుని వెళ్ళి సీట్లో కూర్చున్నాడు.
ఆ రోజు సాయంత్రం ఇంటికెళ్ళిపోతున్నప్పుడు ఆఫీసు బైట రావిచెట్ల కిందున్న చప్టా మీద ఒక్కడే కూర్చుని సిగరెట్టు కాలుస్తూ కనపడ్డాడు. నేను దగ్గరికెళ్ళి కాసేపు ఈ మాటా ఆ మాటా మాట్లాడి తిన్నగా అడిగేసాను-
”అసలేంటి మీ ప్రాబ్లెం? ఏమన్నా కుటుంబ సమస్యలా?”
అతను అర్థం కానట్టు ముఖం పెట్టి ”నా ప్రాబ్లెం ఏముంది సార్‌?” అన్నాడు.
”కాదూ, ఎందుకలా డల్లుగా ఉంటారూ. హేపీగా నవ్వుతా ఉండాలండీ. కష్టాలెవరికి లేవు మన ఆఫీసులో… మన మణిగాడు మనసులో ఎన్నెన్ని బరువులు మోస్తా ఎంత సరదాగా ఉంటాడో చూడండి. బీ పాజిటివ్‌ అండీ!” అన్నాను.
వంకర నవ్వు నవ్వి ”నాకు కష్టాలేవీ లేవండీ,” అన్నాడు.
”మరెందుకలా ఎపుడూ ఏదో కోల్పోయినట్టుంటారు? ఇక్కడంతా మనవాళ్ళేనండీ. హెడ్‌ గుమాస్తాగారి మాట కొద్దిగా కటువనేగానీ, మళ్ళీ కష్టం వస్తే మాత్రం ఫస్టు మన పక్కనుండేది ఆయనే,” అన్నాను మంచిగా.
”ఏవండీ, ఆయన అనే పొజిషన్లో ఉన్నాడు, నేను పడే పొజిషన్లో ఉన్నాను. నాకీ ఉద్యోగం అవసరం. ఇది పర్మినెంటు అయ్యేదాకా ఏ ఆఫీసు కాకి నా మీద రెట్టేసినా తుడుచుకుని పోతాను,” అన్నాడు.
అలా మాట్లాడేసరికి నాకు చాలా బాధేసింది. హెడ్‌ గుమాస్తాగారి గురించి ఆయన వెనకాల కూడా ఎప్పుడూ ఓ పొల్లుమాట అనుకుని ఎరగం మేము. మనిషి అలాంటోడు.
”మీ మెంటాల్టీ మార్చుకోకపోతే మాత్రం కష్టమండీ,” అని చెప్పి వచ్చేశాను.
అప్పట్నుంచీ నాకు అతని మీద జాలి కూడా పోయింది. ఎపుడన్నా ఏదో స్టేషనరీ కోసం నా టేబిల్‌ దగ్గరకొచ్చి గొణిగినా లేవనో, ఉన్నా కూడా నాకు కావాలనో చెప్పేసేవాడ్ని. ఒకసారి అలానే అంటే, ”ఏం సార్‌ అన్ని పిన్నులూ వాడేస్తారా మరీని,” అని గొణిగేడు. ”వాడతావాఁ లేదా అన్నది కాదు సార్‌, నాకని ఇచ్చినవి నేను ఓ లెక్కలో ఖర్చు పెట్టుకుంటాను. ఆ లెక్క తప్పటం నాకు ఇష్టం లేదు,” అని నిక్కచ్చిగా చెప్పేశాను. అసలతని జోలికేరాని హెడ్‌ గుమాస్తాగారి గురించే మనసులో అలా అనుకున్నాడంటే, మన గురించి లోపల్లోపల ఏమనుకుంటున్నాడో ఆ మాత్రం ఊహించలేమా!
అంతా సఖ్యంగా మంచితనంతో మసలే చోట ఒకడు మనసు నిండా ఇలాగ విషం నింపుకున్నాడని తెలిస్తే ఎలా ఉంటుంది. ఒక్కోసారి అతని లోపల కుళ్ళు బాగా బైటపడిపోయేది. మా హెడ్‌ గుమాస్తాగారి యాభయ్యో పుట్టిన రోజప్పుడు జరిగిన సంగతి బా గుర్తు. మాకు ప్రతి ఏటా ఆయన పుట్టిన్రోజంటే పండగతో సమానం. పైగా అది యాభయ్యో పుట్టిన్రోజు. అంతకుముందు రోజు రాత్రే సీనియరసిస్టెంటుగారూ, మణీ బండి మీద టౌన్‌ కెళ్ళి పెద్ద కేకు తెప్పించి సర్వేయరుగారింట్లో ఫ్రిజ్‌ ఉంటే అందులో పెట్టివుంచారు. నేనూ, మణీ తెల్లారే ఆఫీసుకొచ్చేసి హాలంతా అందంగా రంగు కాయితాలయ్యీ అతికించాం. హెడ్‌ గుమాస్తాగారొచ్చేసరికి అంతా సిద్ధం చేసుంచాం. ఆయన కేకు కోస్తూండగా, మేం అంతా చుట్టూ నిలబడి బర్త్‌ డే సాంగ్‌ పాడుతుంటే వచ్చాడు టైపిస్టు. కాసేపు ఏం అర్థంకానట్టు చూస్తూ నిలబడిపోతే సీనియరసిస్టెంటుగారు ”రండ్రండి,” అని పిలిచారు. మా మధ్యకు వచ్చి మాతోపాటు చప్పట్లుకొట్టాడు మొక్కుబడిగా, పాటకి నోరు కూడా కదపలేదు. అదే నాకర్థం కాంది! ఏదన్నా అందరూ కలిసికట్టుగా ఓ పని చేస్తున్నప్పుడు అందులో వచ్చి కలిసిపోకుండా పక్కగా నిలబడి ప్రేక్షకుడిలా చూస్తుంటే ఎలా ఉంటాది మిగతావాళ్ళకి, అక్కడికేదో మేమంతా వెర్రోళ్లవన్నట్టు. ప్రతీ ఏటా పుట్టిన రోజుకి హెడ్‌ గుమాస్తాగారు స్వయంగా ఆయన చేతుల్తో కేకు ముక్కల్ని తినిపించడమూ, మేవందరం–సర్వేయరుగారంటే పెద్దాయన కాబట్టి ఆయన తప్ప మిగతా అందరం–వందనంగా ఆయన పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకోవటమూ ఓ ఆనవాయితీగా అలా సాగుతుంది. ఆ ప్రకారంగానే సీనియరసిస్టెంటుగారూ, నేనూ, మణీ వంగి దణ్ణం పెట్టుకున్నాం. ఆయన మొహమాటంగా ”ఎందుకయ్యా ఇవన్నీను,” అంటున్నా కానీ. తర్వాత ఆ పక్కన ఎడ్డావతారంలా నిలబడి చూస్తున్న టైపిస్టుని కూడా సీనియరసిస్టెంటుగారు కాస్త రహస్యంగానే ‘రండి మీరూనూ’ అన్నట్టు సైగ చేసేరు. దానికతను- ఏదో తాయిలం ఇవ్వబోతుంటే మొహమాటపడుతున్నట్టు మొహంపెట్టి ‘ఫర్లేదు ఫర్లేద’న్నట్టు చేతులాడిస్తూ వెనక్కు జరుగుతున్నాడు. వెనకాల ఉన్న మణి కాళ్ళు తొక్కేసరికి మణి అతన్ని కొద్దిగా ముందుకి తోసాడు. అతని చేయి అందిపుచ్చుకుని నేనే చొరవగా ”ఆయన బ్లెస్సింగ్స్‌ తీసుకుంటే మంచిదండీ,” అని ముందుకు లాగబోయాను. అతను నా చేతిని విదుల్చుకున్నాడు. ఇక్కడేదో జరుగుతున్నదని అప్పుడే గమనించిన హెడ్‌ గుమాస్తాగారు ”ఏంటయ్యా ఏంటి?” అని మా మధ్యలోకి వచ్చారు. ”మీ బ్లెస్సింగ్స్‌ తీసుకోమంటే టైపిస్టుగారు మొహమాటపడుతున్నారు సార్‌,” అన్నాడు వెనక నుంచి మణి. హెడ్‌ గుమాస్తాగారు మా వైపు మందలిస్తున్న నవ్వుతో ”ఏంటండి ఇదంతా,” అని, టైపిస్టుతో ”ఏదో వీళ్ళ చాదస్తమయ్యా, అలాంటివేం వద్దు,” అన్నారు. పోనీ అపుడైనా వయసులో పెద్దాయనా, కేడర్లో పెద్దాయనా అనేసి ఓ మారు వంగి ఆయన కాలు తాకుండచ్చు కదా? వాడి కుచ్చు కిరీటమేవైనా ఊడిపోతుందా? అలాగే వెనక్కి తిరిగి వెళ్ళి సీట్లో కూర్చుండిపోయాడు పెద్దమనిషి!
ఆ తర్వాతే నేను మణితోనీ సీనియరసిస్టెంటుగారితోనీ ఆ రోజు రావి చెట్టు దగ్గర హెడ్‌ గుమాస్తాగారి గురించి టైపిస్టు ఏమన్నాడో చెప్పాను. వాళ్ళిద్దరూ అవునా అని బాధపడ్డారు. నేనంటే ఊరుకున్నాను కానీ సీనియరసిస్టెంటుగారు ఊరుకుంటారా! ఆయనైతే మరీని. అప్పుడ్నించీ అదను దొరికినప్పుడల్లా టైపిస్టుకి ఏదో ఒక చురక అంటిస్తూనే ఉండేవారు. మాతో ఏదో ఊళ్ళో విషయం గురించి మాట్లాడుతూనో, లేదంటే ఏదో ప్రొసీజరు డిస్కస్‌ చేస్తూనో ఉన్నట్టుండి టైపిస్టు వైపు తిరిగి ”ఏ సార్‌ అంతేనా?” అని అడిగేవారు. టైపిస్టు కాసేపు అయోమయంగా కలదొక్కేసుకుంటూంటే ఓ ఆటాడుకునేవారు. అప్పుడప్పుడూ మణి కూడా ఆయనకి తోడొచ్చేవాడు.
ఒకసారి టైపిస్టు మా ముందు నుంచీ నడిచి సీటు దగ్గరికి వెళ్తూంటే సీనియర్‌ అసిస్టెంటుగారు ”ఏయ్‌, ఏంటా నడక ఒరాంగుటాన్‌ లాగా!” అని గట్టిగా అన్నారు. టైపిస్టు వెనక్కు తిరిగి చూడగానే, అతనివైపు ఎత్తిన చేయిని చప్పున అక్కడే ఉన్న మణి వైపు తిప్పేశారు, ఆ మాట వాడినుద్దేశించి అన్నట్టుగా. మణిగాడు కూడా చేతులేలాడేసుకుని, కాళ్ళు కొద్దిగా పంగజాపి నడిచాడు. ”రికార్డు రూంలో మెట్లెక్కీ ఎక్కీ తొడలు ఒరుసుకుపోతున్నాయ్‌ సార్‌,” అని ఏదో దొంగమాటతో కప్పిపుచ్చాడు. టైపిస్టు తలతిప్పుకుని వెళిపోయాడు, ఓ వెర్రి నవ్వు కూడా నవ్వేసి. అప్పుడు తననే అంటున్నారని అర్థమయ్యిందో లేదో కానీ, ఇలాంటి జోకుల్నే తిప్పి తిప్పి వాడటం వల్లా, పదే పదే ”ఒరాంగుటాన్‌” అన్న పేరు తనుండగానే వినపడటంతోనీ బహుశా గ్రహించే వుంటాడు. ఒక్కోసారి ఆ పదం వినపడినా, తల కూడా తిప్పకుండా ముఖం మాడ్చుకుని వెళ్ళి సీట్లో కూర్చునేవాడు. నేను అప్పటికీ అన్నాను కూడా సీనియరసిస్టెంటుగారితో, ”సార్‌ ఆపండి సార్‌ మీరు మరీ చిన్నపిల్లాడిలా,” అని. అయినా ఆయన ఏదైనా మనసులో పెట్టేసుకుంటే అంతే ఇక. ఒక్కోసారి అందరికీ టీలు తెప్పించి కూడా టైపిస్టుకి తెప్పించడం మానేసేవారు.
సీనియరసిస్టెంటుగారు సెటైరేసినప్పుడల్లా అతనూ అదేలెక్కలో తిరిగి మాటకు మాటంటే బావుండేది. కానీ అతనేం మనిషో, అంతకంతకూ ముడుచుకుపోయేవాడు. అలాంటప్పుడు మాకు ఇంకా ఇంకా ఏడిపించాలనిపించేది. మొన్నటికి మొన్న మాతో చిట్టీల్లో కలుస్తాడేమోనని అడిగితే కలవనన్నాడు, ఎందుకనడిగితే జీతం డబ్బులు అంత మిగలవని చెప్పాడు. ”ఏవండి రెండు ఫేమిలీసేఁవన్నా మెయింటైన్‌ చేస్తన్నారేటి?” అన్నాడు సీనియరసిస్టెంటుగారు సరదాకి. అందరూ నవ్వేసేం. అతను ముఖం అలాగే పెట్టుకుని సీనియరసిస్టెంటుగారి వైపు చూస్తున్నాడు.
”కానీ మీకే గనక ఇద్దరు పెళ్ళాలుంటే ఆళ్ళకీ ఆళ్ళకీ మధ్య కాలక్షేపం అవ్వాలే తప్ప మీతో మాత్రం కాదండోయ్‌,” అన్నాడు సీనియరసిస్టెంటుగారు.
”సార్‌ మీరు… ఎంతలో ఉండాలో అంతలో… మంచిద్సార్‌… ఎంతలో ఉండాలో అంతలో ఉంటే మంచిదిసార్‌,” అన్నాడు ఆవేశంతో నత్తొచ్చేస్తుంటే.
”అయ్యో ఏంటయ్యా సావీ ఈయన సీరియస్సైపోతున్నారు. రెండు ఫేమిలీసని నేనేదో కాంప్లిమెంటుగా అన్నానండీ,”
”దాని గురించని అంటంలేదు. మీరీ మధ్య చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. నా మీద సెటైర్లయ్యీని. నాకర్థం కావనుకుంట్నారా ఏంటి,”
”బాబూ మణీ కాస్త మంచినీళ్ళు పట్రా ఆయనికి,” అన్నారు సీనియర్‌ అసిస్టెంటు. తర్వాత హెడ్‌ గుమాస్తా వైపు చూసి ‘ఏంటి సార్‌ ఇది మాకు’ అన్నట్టు నవ్వారు.
హెడ్‌ గుమాస్తాగారు పని ఆపి టైపిస్టు వైపే చూస్తున్నారు.
టైపిస్టు ఈసారి దిగ్గున సీట్లోంచి లేచి నుంచొని హెడ్‌ గుమాస్తాగారికేసి చూసి మాట్లాడుతూ, ”సార్‌, ఇలా అంట్నానని మీరేవనుకోవద్దు. ఎవరి మర్యాదాళ్లకుంటాది. ఎలా పడితే అలా మాట్లాడితే ఎలా సార్‌,” అని అడిగాడు న్యాయం చెప్పమని దబాయిస్తున్నట్టు.
హెడ్‌ గుమాస్తాగారికి వీరభద్రుడు పూనేసేడు. ”ఓయ్‌… నువ్వు కూర్చో ముందు. ఎందుకలా రైజై పోతున్నావయ్యా? ఆఫీసన్నాకా అందరూ నీలా మొఖం గంటుపెట్టుకుని కూర్చూనుంటే పన్లవ్వవు. మనుషులు సరదాగా ఉంటే పనీ సరదాగా అయిపోద్ది. ఏంట్నీకేవన్నా మా కన్నా ఎక్కువ జీతవిస్తన్నారా తలెత్తకుండా ఊ సీరియస్‌గా పని చేయమని? కొత్తగా ఒచ్చేవు కాబట్టీ, నీకు చెప్తే తప్ప అర్థవయ్యేట్టు లేదు కాబట్టీ, ఇక్కడ పద్ధతులు చెప్తున్నాను ఇను. ఇప్పటిదాకా మేవెవరం దీన్ని ఆఫీసనుకోలేదు, ఒకరికొకళ్ళం కొలీగ్సనీ అనుకోలేదు. ఇదో ఫేమిలీ, మేం ఫేమిలీ మెంబర్స్‌మి. ఒకళ్ళ మీదొకళ్ళు జోకులేసుకుంటాం, పనీ అలాగే చేసుకుంటాం. ఇప్పటిదాకా అలాగే నడిచింది. నువ్వొచ్చినంత మాత్రాన ఇక్కడ పద్ధతులేవీ మారిపోవు. నువ్వూ నలుగురిలో ఒకడిగా కలిసిపోవటం నేర్చుకో ముందు. కూర్చో,” గద్దించినట్టన్నారు హెడ్‌ గుమాస్తాగారు.
నేనూ నా మాటగా అన్నాను. ”అలాక్కాదండీ, పోనీ మిమ్మల్నేవన్నా దూరం పెట్టేవా మేము. ఎప్పుడూ కలుపుకుందామనే చూసేం కదా. సర్లే మీరు కలాపోయేసరికి ఏమో మీకేం ప్రోబ్లెంస్‌ ఉన్నాయోనని అలా వదిలేసేవంతే,” అనునయంగానే అన్నాను.
”వదిలేయటం అంటే ఇలా అయిందానికీ కాందానికీ ఎటకారాలాడ్డవాండీ?” అనడిగేడు.
సీనియరసిస్టెంటుగారు ”అయ్‌ బాబోయ్‌ బాబూ మీకో దణ్ణం!” అని తల మీద చేతులు చప్పట్లు చరిచి, ”నేను అందరితో ఒకలా ఉండి మీతో ఒకలా ఉండ్లేను. లోపల్లోపల మీరంత ఇదైపోతున్నారని నాకు తెలీదిప్పటిదాకాని. మీకది ఇబ్బందైతే ఇదిగో ఈ రోజు నుంచి నేను నోరు మెదిపితే ఒట్టు,” అని చుట్టూతా అందరి వైపూ ఓసారి చూసి, ”ఏం సార్‌, ఈ రోజు నుంచీ మీరు నా వైపు చూస్తే నేను కనపడతాను, నా గొంతు వినపడితే మాత్రం చెప్పుతీసుక్కొట్టండి. సరేనా,” అన్నాడు.
”మీరెందుకు మీ పద్ధతులు మార్చుకోవాలండీ. అవసరమైతే ఆయనే సీటు బైటేసుక్కూచుంటాడు రేపణ్ణించీ,” అన్నాడు హెడ్‌ గుమాస్తాగారు.
మణి మధ్యలోకొచ్చి చాకచక్యంగా గొడవ సర్దేశాడు. టైపిస్టు మళ్ళీ ఏదో మాట్లాడబోతుంటే, ”సార్‌ సార్‌! కూర్చోండి సార్‌ మీరు. ఎందుకూరికేని ఒకాఫీసులో ఉంటా మన్లో మనం ఆఁ?” అని ఆయన భుజం పట్టుకుని కూర్చోపెట్టేశాడు.
అతను ముఖం ఇలా పెట్టుకుని టైపు టిక్కు టిక్కులాడించేడు. కాసేపు హాల్లో ఆ చప్పుడు తప్ప ఇంకో చప్పుడు లేదు.
సీనియరసిస్టెంటుగారే మళ్ళీ ”ఏదో ప్రతిజ్ఞ అయితే చేస్సేను కానీ, ఊరుకొమ్మన్నంత మాత్రాన ఊరుకునే నోరు కాదు సార్‌ నాది, ఓ జోకు గుర్తొస్తంది చెప్మంటారా?” అనడిగేడు గిల్టీగా మొహం పెట్టి.
అందరం నవ్వేసేం.
టైపిస్టు లేచి పనున్నట్టు బయటికెళిపోయేడు.
ఇవ్వాళ పొద్దున్నే మణి పైనుంచి ఓ వార్త మోసుకొచ్చాడు. ”మన టైపిస్టుగారు డిపార్టుమెంటు మార్పించేమని అర్జీ పెట్టుకున్నారంట సార్‌,” అన్నాడు హెడ్‌ గుమాస్తాగారితో. పైన బంట్రోతు మణికి ఆ లెటర్‌ చూపించాడట. ఆ ఉత్తరంలో చదివిన విషయాల్ని గుర్తున్న మేరకి చెప్పటానికి ప్రయత్నించాడు: ”పూజ్యులైన అయ్యా… మీరు నన్ను నియమించిన విభాగమునందు నాకు అనుకూలముగా లేదు. నా సహోద్యోగులలో కొందరి వల్ల నేను నా విధులు సక్రమంగా నిర్వహించలేకున్నాను. దయచేసి నన్ను వేరే విభాగమునకు బదిలీ కావించగలరు. విధేయుడు, ఫలానా ఫలానా, టైపిస్టు, ఫలానా ఫలానా విభాగం”.
సీనియరసిస్టెంటుగారు ”దయిద్రం ఒదిలింది,” అన్నారు హెడ్‌ గుమాస్తాగారి వైపు చూస్తూ. నాకూ అలాగే అనిపించింది.
హెడ్‌ గుమాస్తాగారి ముఖం ఎర్రబడిపోయింది. ”ఏం వదలటం అండీ. వెళ్తా వెళ్తా అంతా పెంటేట్టేసి వెళ్తేనీ,” అన్నారు.
”అవున్నిజమే సార్‌, ఆ మాట ఆలోచించలేదు,”
”ఏరా మణీ, బంట్రోతు లెటర్స్‌ తీసికెళిపోయేడా?”
”లేద్సార్‌, ఇంకా సార్‌ రాలేదు,”
”పైకి పోయి నేనిమ్మన్నానని చెప్పి ఆ లెటరిలా తీసుకురా!”
మణి పైకి వెళ్లాడు.
”ఆ లెటరు సార్‌ దాకా వెళ్తే మొత్తం డిపార్టుమెంట్లో మన పరువు పోయినట్టే కదా. అంటే, మనవూఁ విషయం చెప్తావనుకోండీ. నాన్‌ కోపరేటివ్‌గా బిహేవ్‌ చేస్తనాడనేసి. కానీ సారు ఓ మాటైతే అడుగుతాడు కదా పైకి పిలిచి. మనం నిలబడి జవాబు చెప్పాలి కదా. ఎంత దయిద్రంగా ఉంటదా సిట్యువేషను?” అన్నారు.
నేనూ అవునన్నాను.
”తత్తుకొడుకున్రానీయండి చెప్తాను,” అన్నారు హెడ్‌ గుమాస్తాగారు.
మణి లెటరు తీసుకువచ్చే లోపలే టైపిస్టు వచ్చేశాడు. వస్తూ విష్‌ చేసేడు కానీ ఎవళం రెస్పాండ్‌ కాలేదు. మణి లెటర్‌ తెచ్చి హెడ్‌ గుమాస్తాగారి చేతుల్లో పెట్టేడు. ఆయన దబ్బపండు చాయ ముఖంలో ఏం తేడా అయినా ఇట్టే తెల్సిపోతుంది. లెటర్‌ చదువుతూ ఎర్రగా అయిపోయిందాయన ముఖం. టైపిస్టు మాత్రం ఇదంతా ఏం తెలీదు కాబట్టి ఏదో తన మానాన టైపు కొట్టుకుంటున్నాడు. హెడ్‌ గుమాస్తాగారు నిశ్శబ్దంగా లేచి టైపిస్టు టేబిల్‌ దగ్గరికి వెళ్లారు. టైపిస్టు ఏంటన్నట్టు లేవబోతుంటే కూర్చోమని సైగ చేసి, తను కూడా పక్కనో స్టూలుంటే లాక్కుని అతనికెదురుగా కూర్చున్నారు.
”ఈ లెటరొకటి కొద్దిగా మార్చి రాయాలి. నేను డిక్టేట్‌ చేస్తాను మీరు కొట్టిపెట్టండి,” అంటూ టైపిస్టు లెటర్ని అతని చేతికే ఇచ్చారు. అదీ హెడ్‌ గుమాస్తాగారంటే!
టైపిస్టు ఆ లెటర్‌ని వినయంగా చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ లెటర్లోకి తొంగి చూస్తానే మెల్లగా లేచి నుంచున్నాడు. ”ఏంటి సార్‌ ఇది, మీ దగ్గిరికి ఎలా వచ్చింది?” అన్నాడు.
హెడ్‌ గుమాస్తాగారు అలాగే బల్ల మీద మోచేతులు నిలబెట్టి వేళ్ళు జతకలిపి అతని ముఖం వంక చూస్తున్నారు.
టైపిస్టు ముఖంలో కంగారు ఇంకా పెరుగుతుంటే మా అందరి వొంకా చూసాడు. మళ్ళీ హెడ్‌ గుమాస్తాగారి వైపే చూసి, ”ఏంటి సార్‌, ఇదెలా వచ్చింది మీ దగ్గిరికి. నేనేదో సార్‌కి రాసుకున్నాను నా ప్రాబ్లెంస్‌…” అన్నాడు.
”ఎలా వచ్చిందో చెప్తాను. ముందు నాకు చెప్పు. సార్‌ నీకేవైనా చుట్టమవుతాడా?”
”లేదు?”
”వేరే రకంగా ఏవన్నా పరిచయమా?”
”లేద్సార్‌…”
”నీ డిపార్టుమెంటు హెడ్‌ ఎవరు?”
”… మీరే”
”మరి రోజూ కళ్ళ ముందుండే నాకు నీ ప్రాబ్లెం ఏంటో చెప్పకుండా నువ్వు తిన్నగా సార్‌కి ఎందుకు ఉత్తరం రాసేవు?”
”మీకు తెలీదాండి, నా ప్రాబ్లం ఏంటో?”
”తెలుసు… నీ ప్రాబ్లెం ఏంటో తెలుసు. అది నీకు నువ్వు తెచ్చిపెట్టుకున్నదే తప్ప బయటివాళ్ళెవరూ బాధ్యులు కాదనీ తెల్సు. కానీ నువ్వేం రాసావ్‌ ఈ లెటర్లో… ఆ? చదువయ్యా పైకి చదువూ? ఆళ్ళ గురించి నాలుగు మంచి మాటలు వినాలనుండదా నీ కొలీగ్స్‌కి?”
టైపిస్టు ఆ లెటర్‌ అలాగే పట్టుకుని చూస్తుంటే హెడ్‌ గుమాస్తాగారే బర్రున స్టూలు వెనక్కి జరుపుకుంటూ పైకి లేచి అతని చేతుల్లోంచి లెటర్‌ లాక్కున్నారు. అందులో రాసున్నది గట్టిగా చదివి వినిపించేరు. మధ్య మధ్యలో ఒక్కో వాక్యం దగ్గర ఆగి, ఒకసారి సీనియరసిస్టెంటుగారికేసి చూస్తూ ”ఇది మీ గురించి ఈయన అభిప్రాయవండీ,” అనీ, ఇంకోసారి నా వైపు తిరిగి, ”ఇదిగో జూనియర్‌ అసిస్టెంటుగారు మీరు తప్పించుకుంటున్నా అనుకుంటున్నారా, చూడండి మీ గురించేం రాసేడో,” అనీ, ఇంకోసారి మణి వైపు చూస్తూ, ”రేయ్‌, ఆఖరికి నిన్నూ వదల్లేదు ఇందులో,” అనీ అంతా చదివి, ”ఇట్లు, మీ విధేయుడు,” అంటూ పూర్తి చేసారు. తర్వాత టైపిస్టు వైపు చూస్తూ ఉత్తరాన్ని ముక్కలు ముక్కలుగా చింపి ఉండలాగా చేసి అతని టేబిలు మీదే ఓ పక్కన పెట్టారు.
”నువ్వు నీ బుర్రలోకి ఏ చెత్తొస్తే ఆ చెత్త రాసేసి సార్‌కి పంపేవు. ఆయన ఈ తలపోటు యవ్వారమేదో నన్నే చూసుకొమ్మని పిలిచి దీన్ని నా చేతికిచ్చారు. నేను అక్కడే చెప్పుండచ్చు- నీకు పని రాదనీ, నలుగురితో కలిసి పన్చేసే గుణం అస్సలు లేదనీని. అక్కడే నిన్ను పీకి పారదొబ్బమని ఓ మాట అనేసి ఉండొచ్చు. కానీ ఒకడి కడుపు కొట్టే పన్లు నేనెప్పుడూ చెయ్యను. అంత నీతిలేని లంజాకొడుకుని కాదు.”
టైపిస్టు, ”మీ గురించేం రాయలేదు అందులో…” అనేదో గొణగబోయాడు.
”నా డిపార్టుమెంటునంటే నన్ను అన్నట్టు కాదా!!” హాలంతా మార్మోగిపోయేలా అరిచేరు హెడ్‌ గుమాస్తాగారు. నాకైతే వళ్ళు జలదరించిపోయింది. సీనియరసిస్టెంటుగారు సీట్లోంచి లేచి, ”సార్‌ సార్‌ మీరు ఆవేశపడొద్దు,” అంటూ దగ్గరకు రాబోతుంటే ఒక చేతో దగ్గరకు రావద్దన్నట్టు ఆపారు హెడ్‌ గుమాస్తాగారు. కొంతసేపు అలాగే నిలకడగా ఊపిరి పీల్చుకుని తర్వాత మాట్లాడేరు. ”నువ్వు చేసింది లత్కోరు పని. ఓ రకంగా ఎడ్డి పని కూడా. ఎందుకంటే ఇదే ఆఫీసులో పదేళ్ళ పైన సర్వీసుంది నాకు. నన్నిక్కణ్ణించి కదిలిద్దామని ఇదిగో ఇంతమంది ట్రై చేసారు. నా ముందూ, నా వీపెనకాలా కూడాని. మరెందుకు ఏం చేయలేకపోయారు? పైకెళ్ళి నువ్వే ఏ డిపార్టుమెంటు వాళ్ళనైనా అడిగి విను నా గురించి ఏం చెప్తారో. నేను ఏ డిపార్టుమెంటులోనైనా ఇలా అడుగుపెడితే ముందు కూర్చోబెట్టి టీ తెప్పించి తర్వాత మాట్లాడతారు. ‘ఏం పుణ్యం చేసుకున్నాం సార్‌ ఇవాళ’ అన్నట్టు రిసీవ్‌ చేసుకుంటారు. నా పేరు పలికితే పనులు చేసిపెట్టే మనుషులున్నారు పైన. ఆఖరికి సార్‌ కూడా ఆయనింట్లో ఏదైనా ఫంక్షనుంటే ఫస్టుకంట ఇన్విటేషనిచ్చేది నాకు. ఏవనుకుంటున్నావ్‌… ఈ సీట్లో కూర్చుని గచ్చకాయలాడుకున్నాననుకున్నావా ఇన్నేళ్ళూని? ఇదిగో ఇదే మొదటిసారీ ఆఖరుసారీని చెప్పటం. నువ్వుంటే ఈ సీట్లో ఉంటావు. లేకపోతే సీటు సర్దుకుని ఇంటికెళిపోతావు. రెండే దార్లు.”
అప్పటికి కాస్త ఆవేశం తగ్గి గొంతు కాస్త అనునయంగా మార్చి మాట్లాడారు. ”కాదయ్యా, నీకు ఇంతకన్నా మంచి డిపార్టుమెంటూ, ఇంతకన్నా మంచి కొలీగ్సూ అసలు వేరే ఎక్కడన్నా దొరుకుతారనుకుంటున్నావా? ఇదే పని నువ్వింకెక్కడైనా చేసుంటే అప్పుడు తెలిసొచ్చును నీకు. నలుగురు మంచోళ్ళ మధ్యన మంచిగా ఉంటానికేంటయ్యా దొబ్బుడాయి? ఆ…? కూర్చో యింక,” అని తన సీటు దగ్గరికి నడిచారు.
నాకైతే తుఫాను వెలిసినట్టే అనిపించింది. ఆయన సీట్లోకెళ్ళి కూర్చున్నాకా కూడా ఎవరం ఏం మాట్లాడలేదు. సీనియరసిస్టెంటుగారే కాసేపటి కదిలించారు, ”జడిపించేహేరు సార్‌ మొత్తానికి,” అంటూను. ”ఆయన అప్పుడపుడూ అయినా అలా విశ్వరూపం చూపిత్తేనేనండీ, మనవిలా ఉండగలిగేది,” అన్నాను నేను.
హెడ్‌ గుమాస్తాగారు మురిపెంగా నవ్వుతూ అన్నారు, ”నన్నెవరూ గిల్లనంత వరకేనండీ,” అని.
ఇందాకే ఒక విషయం జరిగింది. ఏం తోచక సెకండ్‌షో సినిమాకి వెళ్ళాను. ఆ ఎదవ థియేటరు ఊరంతటికీ చివార్న ఉంటుంది. బూతుబొమ్మలు తెచ్చేస్తూ ఉంటారు ఎక్కువగా. కానీ ఈసారి పాత సినిమా మంచిది ఒకటి తెచ్చేరు. పాటలు బాగుంటాయని వెళ్ళాను. జనం వచ్చిందే తక్కువ. వచ్చిన కొద్దిమందీ సినిమా ఇలా వదలగానే సైకిళ్ళెక్కి ఇట్టే మాయమైపోయారు. రిక్షాలు కూడా లేవు. నేను అప్పటికే ప్రింటు బాలేని సినిమాకి ఎందుకొచ్చాంరా దేవుడా అనుకుంటున్నాను. ఇప్పుడు నడిచిపోయే కష్టం ముందుండేసరికి ఇంకా నీరసం వచ్చేసింది. సరే, బాట్రీ లైటు ఊపుకుంటూ నడిచి వెళ్తున్నాను రోడ్డువారని. ఊళ్ళోకి వచ్చేసి, ఒక వీధిలో పోతే కుక్కలుంటాయని గుర్తొచ్చి, ఆ పక్క వీధిలోకి మళ్ళాను. అది మొత్తం ఊరికే చెడ్డపేరు తెచ్చిన వీధి. అడుగుపెడితే ఎవరూ లేరన్నట్టే అనిపించింది కానీ, కాస్త దూరం నడిచేసరికి ఏదో అలికిడి తెలిసింది. ఒకే ఒక్క వీధిలైటు ఆ చివర కనపడుతుంటే బాట్రీ లైటు ఆపేసి వడివడిగా నడుస్తున్నాను. ”ఓసార్‌ ఏవండీ జూనియరుగారు ఆగండాగండి,” అని గట్టిగా వినిపించింది.
వెనక్కి తిరిగి చూస్తే ఓ ఇంటి అరుగు మీద నవారు మంచం తడికెలాగా అడ్డం నిలబెట్టి ఉంది. దాని వెనక నుంచి పంచె అంచుల్ని చేతుల్లో ఊపుతూ వీధిలోకి అడుగుపెడుతున్నాడో మనిషి. నవారు మంచం వెనక ఏవో నీడలు మాట్లాడుకుంటున్నాయి గుడ్డిదీపం వెలుగులో. ఒక నీడేదో గట్టిగా మాట్లాడింది కూడా. దానికి జవాబుగా ”రేయ్‌ నా గ్లాసుగానీ, ముక్కలుగానీ కదిపినట్టు తెలిసిందో…” అని వెనక్కి వేలు ఊపుతున్నాడు టైపిస్టు. నా ముందుకొచ్చి నిలబడ్డాకా గుర్తుపట్టగలిగాను అతని గొంతు కానీ, వాలకం కానీ.
”నమస్తే సార్‌… ఇయ్యేళప్పుడు ఈ వీధమ్మటా ఎల్తన్నారు. ఆఁ ఆఁ…!” అని ఆరా తీస్తున్నట్టు వెకిలిగా నవ్వుతున్నాడు.
అసలు ఆ మనిషి అలా నవ్వగలడనీ, అలా మాట్లాడగలడనీ నేనెప్పుడూ ఊహించలేదు. సినిమా నుంచి వస్తున్నానని చెప్పాను.
”అవునా, సరేమరి పదండి మీరొక్కళ్ళూ ఒంటరిగా ఎల్లగలరా. ఉండండి ఆ లైటు దాకా దింపేహొత్తాను. అసల్రోజులేం మంచిగా లేవు,” అని కికిక్కీ మని నవ్వుతూ వాసన కొడ్తున్న వంటితో నా భుజం చుట్టూ చెయ్యి వేసాడు.
నేను విదిలించుకున్నాను. ”బాగా ఎక్కినట్టుంది,” అన్నాను.
”అయ్యో అదేంటండీ, మనం మనం ఫేమిలీ కదా. మరి ఏదో ఫ్రెండ్లీగా చెయ్యేస్తే తీసేస్తన్నారేంటి?” అన్నాడు.
”ఆలస్యం అయింది కదా. ఇంతకీ మీ ఇల్లు ఇక్కడేనా,” అన్నాను పొరబాట్న.
”ఆ ఇక్కడే. ఈ వీధి వీధంతా మా ఇల్లే. చాలామంది పెళ్లాలున్నారిక్కడ నాకు. మొన్నా లంజొడుకు అన్నాడు కదా… సెకండ్‌ ఫేమిలీ మైంటైన్‌ చేస్తనావా అని. థర్డూ ఫోర్తూ కూడా ఉన్నాయిక్కడ. రండి పరిచయం చేస్తాను,” అని చెయ్యి పట్టుకుని లాగబోయాడు.
”వద్దులెండి. పొద్దున్న కలుద్దాం,” అని నేను వెనక్కి తిరిగి నడిచాను.
అయినా మళ్ళీ వెనకనుంచి వచ్చి చేయేసి మీద వాలిపోతూ వెంట అడుగులేస్తున్నాడు. ”కాదండీ నాకోటి అర్థంకాకడుగుతున్నా చెప్పండి. మీరంతా ఎందుకు ఉంచుకున్న ముండల్లాగా ఎప్పుడూ ఆ హెడ్‌ గుమాస్తాగాడ్ని పిసుకుతూ ఉంటారు,” అంటున్నాడు.
నేను బలం కూడదీసుకుని భుజం చుట్టూ కొండచిలువలాగా చుట్టుకున్న అతని చెయ్యి విప్పదీసి పక్కకి విసిరేసాను. ఆ విసురుకి అంత మనిషీ, పైగా తాగున్నాడేమో, నిలదొక్కుకోలేక లుంగీ తొక్కుకుని తూలి ముందుకి పడ్డాడు మోకాళ్ళ మీద.
ఓ క్షణం ఆగి లేపుదామా అనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకులెమ్మని తిరిగి నడిచాను.
వెనక నుంచి అతని అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. ”రేయ్‌ కొజ్జా నాకొడకా ఆగరా నువ్వలాగ. మీరూ మీ బతుకులూ… త్ఫూ! ఒక్కొక్కడి బాగోతం తెలుసు నాకు. ఏఁ నాకు హెడ్డాఫీసు ఎడ్రస్‌ తెలీదనుకుంటున్నారా ఏంట్రా? ఎక్కడికి ఏం రాయాలో, ఎలా రాస్తే మీకు తగలాల్సిన చోట తగులుద్దో నాకు బాగా తెల్సురా,” అని లేచి వెనకాల నడుస్తూ అరుస్తున్నాడు. ఇందాక అతను దిగొచ్చిన ఇంటి నుంచీ ఇంకెవరో మనుషులు వీధిలోకి వస్తూ నీడల్లాగా కనిపిస్తున్నారు. నాకు భయమేసి కాళ్ళ సత్తువకొద్దీ పరిగెట్టేను.
అతను ఓ చోట ఆగిపోయి విరగబడి నవ్వుతున్నాడు, ”రేయ్‌, కుచ్చిళ్ళు జారిపోతాయేమో నెమ్మదిగా పరిగెట్టు…” అంటున్నాడు.
అదే పరుగు మీద ఇంటికెలా వచ్చానో, తలుపులన్నీ మళ్ళీ మళ్ళీ చూసుకొని గెడవేసి ఎలా మంచం మీదకొచ్చి పడ్డానో తెలీదు. పడుకున్నానన్న మాటేకానీ గుండె దడ తగ్గలేదు. జరిగింది తల్చుకున్నకొద్దీ కసొచ్చేస్తోంది. గొంతంతా కోపంతో బూతుల్తో ఉబ్బరించి నట్టుంది. బుర్ర నిండా చేపలగుంపుల్లాగా ఆలోచనలు తిరుగుతున్నాయి. కిటికీ బయట రాత్రి దాని మానాన అది సాగిపోతోంది. పక్క మీద అటు దొర్లి ఇటు దొర్లి చెమట్లతో కాసేపటికి జ్వరం కూడా మొదలైందనిపిస్తోంది. అయినా మనసు నిలబెట్టి ఆలోచించాను. రేపు ఏంచేయాలీ, అందరికీ జరిగింది ఎలాచెప్పాలీ అన్న ఊహలు కళ్ళముందాడాయి. అబ్బే ఆఫీసు మొదలయ్యేదాకా ఆగితే లాభం లేదు. తెల్లారగానే తిన్నగా హెడ్‌ గుమాస్తా గారింటికి వెళ్ళి చెప్పేస్తాను. పొద్దున్నే ఆయన ఆసనాలవీ పూర్తిచేసి గచ్చు మీద కూర్చొని పేపరు చదువుకుంటుండగా, గేటు తీసుకు వస్తున్న నన్ను చూసి, కొద్దిగా ఆశ్చర్యం కలిసిన నవ్వుతోటి, ”రండ్రండి!” అంటారు పేపరుపక్కన పెడుతూ. తూర్పెండ కటకటాల్లోంచి లోపలకి పడుతుంది. నా చేతిలో వున్న కప్పులోంచి టీ చప్పరించి పక్కన పెట్టేసి గబగబా మాట్లాడుతున్నాను. హెడ్‌ గుమాస్తాగారు పడక్కుర్చీలో వెనక్కివాలి అలవాటుగా చూపుడు వేలి మీద బొటన వేలు తిప్పుతున్నారు. నేను ఎంత మాట్లాడుతున్నా చెప్పాల్సింది ఇంకా నోట్లోంచి వస్తూనే ఉంది. హెడ్‌ గుమాస్తాగారు కూడా- ఇంత స్పష్టంగా, ఇంత విశదంగా మాట్లాడగల నా శక్తిని అబ్బరంగా చూస్తున్నారు. టైపిస్ట్‌ హెడ్డాఫీసు దాకా వెళ్తానంటున్నాడన్న సంగతి చెప్పేశాకా నా గుండెల మీంచి పెద్ద బరువు దిగిపోయినట్టుంది. హెడ్డాఫీసు ప్రస్తావన వచ్చిందో లేదో, హెడ్‌ గుమాస్తాగారు చప్పున ముందుకు వంగారు. ఆ మాటతో ఆయన్ని అలా కదిలించగలిగానన్న తృప్తితో మాట్లాట్టం ఆపాను. ఆయన లోపలి గుమ్మం వైపు తొంగి చూస్తూ, ”రేయ్‌ మణీ!” అని పిలుస్తున్నారు. నేను అప్పటిదాకా నాకు టీ ఇచ్చింది వాళ్ళావిడేమో అనుకున్నాను. మణిగాడు చొక్కా తొడుక్కుంటూ వస్తున్నాడు లోపల్నించి. చాలా గడపలున్నాయి దాటి రావటానికి. ఈలోగానే మేమందరం ఆఫీసులో ఉన్నాం. నేను చూట్టంచూట్టమే హెడ్‌ గుమాస్తాగారు పట్టుకొని దులిపేస్తున్నారు టైపిస్టుని. కానీ నిన్న జరిగిన విషయం గురించి కాదు, ఏదో సర్వే లెక్కలు తప్పు టైప్‌ చేశాడని. హెడ్‌ గుమాస్తాగారి ముఖమంతా ఎర్రగా అయిపోయి నోట్లోంచి బూతులు కక్కేస్తున్నారు. ఆయన కోపం చూస్తోంటే నాకు టేబిల్‌ కిందకి దూరిపోయి దాక్కోవాలనిపిస్తోంది. కానీ నేనక్కడ ఉన్నానని ఆయనకి ఇదివరకే తెలుసు కదా, అప్పుడిక దాక్కోవటం ఏం బాగుంటుంది. ఆయన మాత్రం ఆయనపాటికి–ఇటు నేనూ, అటు సీనియరసిస్టెంటుగారు ఉన్నావని తెలీనే తెలీనట్టు–తిడుతున్నారు. ఆయనకి టైపిస్టొక్కడే కళ్ళ ముందు కనిపిస్తున్నాడు, తల కొద్దిగా వొంచుకొని. ఆయన పేపర్లన్నీ టైపిస్ట్‌ వైపు గాల్లోకి విసిరేస్తున్నారు. ఎగిరిపడుతోన్న పేపర్ల మధ్యన టైపిస్టు వొంగుతున్నాడు కింద పడిన పేపర్లని ఏరుకోవటానికి.
”మాటంటే కోపం వచ్చేస్తుంది. బుసలు కొట్టేస్తున్నావు. అంత పౌరుషం వున్నవాడివి పని సరిగ్గా చేయి,” అంటున్నారు హెడ్‌ గుమాస్తాగారు.
టైపిస్టు వొంగినవాడే మళ్ళీ లేచి ఎదురు సమాధానం చెప్తున్నాడు.
నాకు అతడ్ని రక్షిద్దామనే అతని మీద పడి నోరు నొక్కేయాలనిపించింది. అదే ఉద్దేశంతోనన్నట్టు సీనియరసిస్టెంటుగారు ముందుకొచ్చి టైపిస్టు భుజం మీద చేయి వేసి ”నేను చూపిస్తాను రండి ఫైలు” అని రికార్డు రూమ్‌ వైపు తీసుకెళ్తున్నారు.
టైపిస్టు అటువైపు కదులుతూనే, ”మన పనాండి ఇది? ఆ మణిగాడు చేయాల్సిన పని!” అంటున్నాడు.
వాళ్ళిద్దరు అలా బరువైన రికార్డు రూము తలుపు తోసుకొని లోపలికి వెళ్ళారో లేదో, మణిగాడు, అప్పటిదాకా నా వెనక ఉన్నాడనే తెలీదు, మహవిసురుగా రికార్డ్‌ రూములోకి వెళ్ళి తలుపు వేసేసుకున్నాడు.
హాల్లో ఇప్పుడు హెడ్‌ గుమాస్తాగారూ నేనే వున్నామని అర్థమైంది. ఆయన వైపు భయంగా తల తిప్పాను. ఆయన మాత్రం చాలా ప్రసన్నంగా భరోసాగా నావైపు చూస్తూ, కనిపించీ కనిపించనట్టు నవ్వుతున్నారు. రికార్డు రూము లోపల్నించి పెద్దగా అరుపులూ శోకండాల్లాగా వినిపిస్తున్నాయి. హెడ్‌ గుమాస్తాగారు నెమ్మదిగా లేచారు. వొళ్ళోని అట్టని దాని మీద ఫైలుతో సహా జార్తగా టేబిల్‌ మీద పెట్టి, పేజీలు మారకుండా రూళ్ళ కర్ర ఒత్తుపెట్టి, పొట్ట కింద కాటన్‌ చొక్కా మడతలు సాఫు చేసుకొన్నారు. నా పక్క నుండి నడిచి, రికార్డు రూములోకి వెళ్ళి తలుపు వేసుకున్నారు.
నోరంతా ఎండిపోయినట్టు దాహం దాహంగా అనిపిస్తోంది నాకు. హాల్లో ఒక్కణ్ణీ కూర్చొని గాలికి కొట్టుకుంటున్న కిటికీ రెక్కని చూస్తున్నాను. రెక్క తెరుచుకున్నప్పుడల్లా బైట రావిచెట్టు ఆకులు ఎండలో కనిపిస్తున్నాయి. హాల్లో బల్లల మీద కాయితాలు రెపరెపలాడుతున్నాయి. ఎవరో వెక్కిళ్ళు పెడుతున్న శబ్దం వినిపించినట్టయి అటు చూస్తే టైపిస్టు తన కుర్చీలో కూర్చుని టైపు మిషను వెనకాల మొహం కనపడనివ్వకుండా దాచుకొని ఏడుస్తున్నాడు. టేబిల్‌ కిందకి చూస్తే మటుకు పాంటు కిందనుంచి కాలి మీద పాయలు పాయలుగా కారుతున్న రక్తం నేల మీద పేరుకుపోతోంది. నేను హడిలిపోయి రికార్డు రూము ముందు నిలబడి తలుపులు బాదుతున్నాను. ఎంతకీ ఎవరూ తలుపు తీయటం లేదు. టైపిస్టు లేచి నా దగ్గరికి వస్తున్నాడేమోనన్న భయంతో ఇంకా గట్టిగా బాదుతున్నాను. మధ్యలో అటువైపు చూస్తే ఈ సారి టైపు మిషను దగ్గిర ఒక ఆడ మనిషి కూర్చొని ఉంది. నా భార్య. ఆమె ఏడవటం లేదుగానీ, వేళ్ళు కూడా కనిపించనంత స్పీడుగా ఆమె టైపు చేస్తున్న ఉత్తరం నాకోసమేనని తెలిసిపోయింది. ఈలోగా తలుపు తెరుచుకుంది. సీనియరసిస్టెంటుగారి నవ్వు ముఖం లోపలికి రమ్మంటోంది.
లోపల మసక చీకట్లో ఒక పెద్ద అల్మరా మొత్తం ఓ పక్కకి ఒరిగిపోయి వుంది. ఫైళ్ళన్నీ ఎలా పడితే అలా నేల మీదకి జారిపోయాయి. టైపిస్టు గోడకి ఆనుకుని కూలబడిపోయి రొప్పుతున్నాడు. మణి అతని జుట్టు పట్టుకుని కిందకీ పైకీ గుంజుతున్నాడు. హెడ్‌ గుమాస్తాగారు అతని ముందు నిల్చుని చేతులు నడుం మీద ఆన్చి, ”నీయ్యమ్మా లంఝకొడకా… నీదసలు మనిషి పుట్టుకేనారా,” అని అడుగుతున్నారు. సీనియరసిస్టెంటు గారు తలుపు వేసేసి నా పక్కకి వచ్చి నిల్చున్నారు. నేను ఆయన వైపు చూసేసరికి నవ్వుతూ చేతులు ఒరాంగుటాన్‌ లాగా పెట్టి పక్కలకి ఊగినట్టు నడుస్తూ టైపిస్టు ముందుకెళ్లారు.
టైపిస్టు లేవటానికి ప్రయత్నం చేస్తున్న కొద్దీ మణిగాడు మోకాలు వాడి మెడ మీద వేసి ఇంకా కిందకి నొక్కుతున్నాడు. టైపిస్టు వికృతంగా అరుపుల్లాగా ఏడవటం మొదలుపెట్టాడు. అతని ఏడుపు మొహాన్ని మాకు చూపించటానికి మణి జుట్టుతో అతని తలని వెనక్కి వొంచుతున్నాడు. టైపిస్టు ముఖమంతా చెమట్లూ, కన్నీళ్ళూ, పెదాల దగ్గిర రక్తంతో కలిసిపోయి బందబందగా వుంది. గొంతుకాయ పైకీ కిందకీ కదుల్తోంది. అయినా ఎలాగో బలమంతా కూడదీసుకుని లేచాడు. మీదకు రాబోతున్న సీనియరసిస్టెంటుగారిని గెంటేసి నా పక్కనుంచే తలుపువైపు పరిగెడుతున్నాడు. మా ఆధిక్యమంతా చేతుల్లోంచి జారిపోతోందనిపించింది. నాకు లోపల్నించి ఎక్కళ్ళేని ధైర్యం తోసుకొచ్చింది. ఇంక నన్ను దాటిపోతాడనగా వాడి కాలర్ని వెనక నుంచి పట్టుకున్నాను. ఇంకో చెయ్యి మెడ చుట్టూ బంధం వేశాను. కానీ ఆ ఎద్దులాంటి మనిషి నన్నూ తనతో తలుపు దాకా లాక్కుపోతున్నాడు. నా కాలొకటి తలుపుకి తన్నిపెట్టేసరికి ఇద్దరం నేల మీద పడిపోయాం. అతడ్ని నేలమీద కుదేసి నేను పైకి లేస్తుంటే మణీ, సీనియరసిస్టెంటుగారూ, హెడ్‌ గుమాస్తాగారూ నా వైపు వస్తున్నారు, మెచ్చుకోలుగా చూస్తూ.
(Story revised on December 2018)
painting credit: Henri Matisse
చేదుపూలు
1
పేరుకి మరీ దూరం పోకుండా ప్రసాదు అనుకుందాం. చీకట్లో ఇరుకుమెట్లు అలవాటైన వేగంతో ఎక్కి తన గది ఉన్న అంతస్తుకి చేరుకున్నాడు ప్రసాదు. ఎదురింటి గడప మీద నైటీలో కూర్చుని కూతురికి జడేస్తున్న ఎదురింటావిడ అతడ్ని చూడగానే ముఖం గంటుపెట్టుకుని, విసురుగా లేచి, కూతుర్ని లోపలికి లాక్కువెళ్ళి తలుపు వేసుకుంది. ప్రసాదుకి ఒళ్ళు మండింది: “కొజ్జాది ఈమధ్య ఇలా నంగి నాటకాలెందుకు ఆడుతుందో అర్థం కావటం లేదు.
”చిరుద్యోగులూ, బడ్డీకొట్ల వ్యాపారస్తులూ ఎక్కువగా ఉండే ఈ బిలో మిడిల్‌క్లాసు బస్తీలో, ఒక రంగులుమాసిన పెచ్చులూడిన మూడంతస్తుల బిల్డింగులో, ప్రసాదు పెళ్ళి చేసుకునేంత వయసు వచ్చినా, పెళ్ళాన్ని పోషించేంత జీతం రావటం లేదు కాబట్టి బ్రహ్మచారి జీవితం గడుపుతున్నాడు. నగరం చేరినప్పుడు జవసత్వాలతో ఉన్న ఆశలు తర్వాత వట్టిపోయాయి. ఒక చిన్న డయాగ్నస్టిక్ సెంటరులో లాబ్ టెక్నీషియనుగా పని చేస్తున్నాడు. పగలు రక్తపు ట్యూబులూ, ఉచ్చ బాటిళ్ళు, స్పిరిట్ వాసనలూ, ప్రింటరు చప్పుళ్ళ మధ్య పనివేళల్ని గడుపుతాడు. రాత్రుళ్ళు చాపపై వెల్లకిలా పడుకుని, బీటలు వారిన వ్యక్తిత్వపు పగుళ్ళలోంచి అసమర్థతలు విషప్పురుగుల్లా పెల్లుబుకటాన్ని దృశ్యం ఇంకని కళ్ళతో చూస్తూ, నిద్రలోకి జారుకుంటాడు. ఈ రాత్రీ అంతకుమించి ప్లాన్స్ లేవు. తలుపేయగానే ఎదురింటావిడ సంగతి మర్చిపోయాడు. కర్రీపాయింటు నుంచి తెచ్చిన కూరల పాకెట్లని బల్ల మీద ఉంచి, తడి సిగరెట్టుపీకలూ ఖాళీ క్వార్టరుబాటిళ్ళూ ఉన్న సింకులో బియ్యాన్ని కడిగి, కరెంటు కుక్కర్లో పెట్టాడు. నడుముకి తువ్వాలుతో చాప మీద కూర్చొని పాత ఆదివారం మాగజైన్ తిరగేశాడు.
ఇన్ని గదుల నగరంలో సన్నివేశ వైవిధ్యానికి కొదవేముంది. అందం, మలినం, ఆనందం, దైన్యం గోడలతో వేరైన ఒకే రంగంపై ఏకకాలంలో పరిణమిస్తూ ఉంటాయి. అవతలి జీవితాలు ఫర్నిచర్ జరిపినపుడు మాత్రమే తెలుస్తాయి. మహాఅయితే కొట్లాటలూ, టీవీ పాటలు, పసివాళ్ళ ఏడుపులూ, ప్లంబింగ్ అజీర్తి శబ్దాలు… అసలు లోకమే లీలగా వినిపించే లారీల మోత.
తువ్వాలు పైకి జరిపి మోకాలు గోక్కుంటూ ఎవరో సెలెబ్రిటీ జీవితంలో ఉత్తేజవంతమైన మలుపు గురించి చదువుతోంటే సెల్‌ఫోను మోగింది. “ఎలైజా కరుణ కాలింగ్…” అని రావటం చూశాడు. ఆదివారం మేగజైన్ కప్పిన పరాయి వాస్తవాల పొర చిరిగి, అతని మెదడులో కామపు అర తెరుచుకుంది.
అతనికి ప్రయత్నించి ఆడవాళ్ళని దక్కించుకునే చురుకూ, శ్రద్ధా, ఆత్మవిశ్వాసమూ లేవు. అలాగని నిర్లక్ష్యం చేసేంత నింపాదైన కామమూ కాదు. కొనుక్కునేంత అనైతిక తెగువా లేదు. ప్రయత్నించకపోలేదు. అప్రతిహత కామపు ఈదురు అతడ్ని ఒకసారి రైల్వేస్టేషను వెనుక చీకటి సందుల్లోకి విసిరికొట్టింది. ఒక మైకా మెరుపుల ఆడతనం కనిపిస్తే దాదాపు బేరం తెగేదాకా తీసుకొచ్చాడు. కానీ పని కాకముందే పచ్చనోటు బయటకు తీయటమనే ఎడ్డి పని చేశాడు. బెరుకు వాసన ఇట్టే పసిగట్టే అధోజగత్ వృకోదరుడు ఒకడు ఉన్నట్టుండి నీడల్లోంచి రంగప్రవేశం చేసి నోట్లు లాక్కున్నాడు, వచ్చిన దారిన వెళ్ళమన్నాడు. రొచ్చు పనిలో మళ్ళా ధర్మాగ్రహానికి తావు లేదు కనుక కిమ్మనకుండా వచ్చేశాడు. ఇంకెపుడూ అటు పోలేదు. ఊళ్ళో ఒకసారి నపుంసకత్వానికి బలైన ఒక కొత్తకోడలి ఆరాటానికి పూచిన పువ్వుని ఆమెకు అందుబాటులో ఉన్నాడన్న ఒకేవొక్క అర్హత వల్ల రెండు మూడుసార్లు ఆబగా కోసుకోగలిగాడు (మెట్లకీ, డాబాకీ మధ్యనున్న సన్‌షేడ్ మీద, సన్నజాజి పందిరి మరుగు; కింద కటకటాల గదిలోంచి ఆమె మావగారి దగ్గు వినపడగానే తొట్రుపడి స్ఖలనం). సుఖం తెలిసిన ఆమె ఎపుడో పండగలకి మాత్రమే ఊరొచ్చే ఇంతోసి మగతనం కోసం ఓపిక పట్టలేక అలమటిస్తుంటే, ఈలోపులో తావి తగిలిన మరో తుమ్మెద బలమైన ప్రొబొసిస్ తో ఆమెను తెంపుకుపోయింది.
ఆ తర్వాత ఎలైజా కరుణ వచ్చేదాకా అతనికి మరో ఆడది తెలియదు. అది కూడా సొంత ప్రజ్ఞ కాదు. ప్రసాదుకి చంఘిజ్ ఖాన్ లాంటి మిత్రుడొకడు ఉన్నాడు. పెద్ద అందగాడు కాకపోయినా, చేసేది కారు మెకానిక్కు పనే అయినా, ఏదో సహజాత అభినివేశంతో, సానబెట్టిన అనాది కిటుకులతో చుట్టూ ఆడతనానికి లోటు లేకుండా చూసుకునేవాడు. అతనికి పరిచయమయ్యే నాటికి జీవితంలో మంద తప్పిన దూడ ఎలైజా. అందంలేని కారణంగా ఏ జాణతనమూ అబ్బని బేల కవిత్వం. భర్త ఉత్తపుణ్యానికి వదిలేశాడు. ఒక కెమికల్ ఫాక్టరీలో పని చేస్తూ, ఇంటరు చదువుతున్న కూతురుతో నెట్టుకొస్తుంది. చంఘిజ్ ఖాన్ ఆమెలో అణగారిన ఆశల్ని చెదరగొట్టి లేపి, మర్చేపోయిన మగ ఆసరాని చవి చూపించాడు. వయస్సూ అనుభవాల డిగ్నిటీ అంతా పణంగా పెట్టి అతడ్ని అల్లుకుపోయింది. కానీ ఛంఘిజ్ ఖాన్ తనకే అర్థం కాని దేన్నో ఆడదానిలో వెతుకుతూ, అది దొరక్కపోతే నిరాశ బదులు రెట్టించిన తహతహతో ఇంకో మనిషి వైపు పోతూ ఉండేవాడు. వాడి బాధ వాడిది. ఒకర్ని దాటి వెళిపోయింతర్వాత, కన్నీటి కోసం జబ్బ అందించటం లాంటి మొహమాటాలు పెట్టుకునేవాడు కాదు. ఎలైజా విషయంలో ఆ బాధ్యత కొన్ని మలుపులు తిరిగి ప్రసాదు మీద వచ్చి పడింది. అప్పటికే పేగు తెగిన గుడ్డిదైన్యంతో అగ్గగ్గలాడుతున్న ఎలైజా, ఆ పతనంలో అట్టడుక్కు చేరి ప్రసాదుని తాకింది. కనీసం ప్రసాదు అలా అనుకున్నాడు. మొదట్లో, పులి మిగిల్చిన కళేబరాన్ని వంగొంగి తోక ముడుచుకు తినే హైనా తట్టేది. అయినా ఆమెని చేరువ కానిచ్చాడు. రణవిధ్వంసానంతర శిథిల వనంలా ఉంది అప్పుడు. ఎన్నాళ్ళో కాలేదు, నెల క్రితం. ఫ్యాక్టరీకి కూడా తిన్నగా వెళ్ళలేకపోయేది, కూతురికి ఏం వండి పెట్టేదో ఆమెకే తెలియాలి. అటు అందమూ, ఇటు భద్రజీవితమూ లేని ఈ మనిషి ఏ కొంచెమూ రాటుదేలకుండా జీవితంలో ఇంత దూరం ఎలా రాగలిగిందా అని ఆశ్చర్యమేసేది. ఆమె వున్న పరిస్థితిలో ఏమాశించి ప్రసాదు వైపు వచ్చిందో తెలియదు కానీ, అతను మాత్రం బాధ్యతలేని ఉత్సుకత తోనూ, తర్వాత ఎటూ దక్కే అవకాశమున్న ఒంటి రాపిడి కోసమూ ఆమెను చేరనిచ్చాడు. అది తప్ప ఇవ్వటానికి ఆమె దగ్గర ఏదీ లేదనిపించేది. వయసులో అందంగా ఉండేదేమో, ఇప్పుడు లేదు. నిలువు సిజేరియన్ కోతల కాలం నాటి ఆడది, చర్మంపై మెలనిన్ నీడలు, యోని ముతక పువ్వు.
ప్రసాదు ఫోను ఎత్తి మాట్లాడుతూ చిన్న బాల్కనీలోకి వచ్చాడు. కింద స్ట్రీట్‌లైటు వెలుతుర్లోంచి లజ్జగా తొలగి నీడల్లో తచ్చాడుతోంది ఎలైజా. “ఎవరూ లేరు పైకి రమ్మ”న్నాడు.
కాసేపటికి ఆమె అరిగిన హవాయి చెప్పుల తపతపలు, పట్టీల ఘలఘలలూ గుమ్మం దాకా వచ్చి నెర్వస్ నిశ్శబ్దంతో ఆగాయి. తలుపు తీశాడు. నవ్వుతూ లోపలికి వచ్చింది. ఈ నెల రోజుల్లోనూ వీళ్ళ బంధం తీరు చాలా మారింది. మొదట్లో ప్రసాదు “ఎందుకొచ్చిన గోలరా భగవంతుడా” అనుకునేదాకా ఏడ్చేది. ఒక్కోసారి అతని కింద ఉన్నప్పుడు కూడా. ఇప్పుడైతే చంఘిజ్ ఖాన్ ప్రసక్తే రావటం లేదు.
బల్ల మీద ఉన్న కూరల పాకెట్లు చూసి, “అయ్యో, కూరలు తీసుకునేముందు నాకు చెప్పద్దాయ్యా?” అంటూ చెంగు చాటు నుంచి గిన్నె తీసి ఇచ్చింది. టమటాపులుసు మధ్యలో గోంగూర పచ్చడిముద్ద ఒత్తి ఉంది. ఇద్దరూ గోడకి జారగిలబడి కూర్చున్నారు. ప్రసాదు కడుపు లోనీ, కడుపు కిందా ఆకలితో కాలుతున్నాడు. ఆమె గోమునీ, బెట్టునీ, నప్పని కన్నె హొయళ్ళనీ పట్టించుకునేంత సహనం లేదు.
కొంతసేపటి తర్వాత, లోపలికి వెళ్ళి అన్నం కంచంలో పెట్టి తెచ్చుకుని, చాప మీద కూర్చుని తింటున్నాడు. ఆమె నామకహా ఆచ్ఛాదనలతో బోర్లా పడుకుని తలగడ మీంచి అతను తినటాన్ని చూస్తోంది. చూపులో మురిపెం, మాటలో అల్లరి ఉన్నాయి. అతనికి మాత్రం స్ఖలనానంతర వైరాగ్యంతో అదంతా చిరాకుగా ఉంది.
ఇప్పుడు కాదు, ఆమెకు మరో గాయాన్ని బహుమతిగా ఇచ్చి సాగనంపినపుడూ కాదు, ఆమెను మర్చిపోతున్న కాలానికి “ఆమెను మర్చిపోవడం” అనేంత పెద్ద పేరు కూడా పెట్టకుండా మర్చిపోయినపుడు కూడా కాదు–ఎప్పుడో ఈ కాలాన్ని వెనక్కి తిరిగి చూసేంత దూరానికి చేరుకున్నాకా, జీవితం ఇవ్వగల బహుమతుల్లోని అరిపేదతనం పూర్తిగా తెలిసొచ్చాకా, అప్పుడు మాత్రమే ఆమె పూర్ణ స్వభావంతో గోచరమైంది. వ్యక్తిత్వ మొక్కటే కాదు. అందం కూడా. ముఖ్యంగా ఆమె ముఖం. పక్క మీద ఆత్రం తీరిన తర్వాత ఇద్దరూ ఎదురుబొదురు ఒత్తిగిలి పడుకుని కాసేపు కబుర్లు చెప్పుకునేవారు. ఆ భంగిమలో దేహంపై భూమ్యాకర్షణ ఎప్పటిలా కింద నుంచి కాక పక్కల నుంచి పనిచేయటం వల్ల, ఆమె చెంపలకీ, వాటి మధ్య పొదిగున్న చెమ్మ కళ్ళకీ అపూర్వమైన పసి మెరుగు వచ్చి చేరేది. నవ్వు సాంద్రతరమయ్యేది. వయసు మాయమైపోయేది. ఆమెతో పాటు ఒత్తిగిలి పడుకున్నవాళ్ళకి తప్పితే ఇంకెవరికీ కనిపించని అందమది. ఈ బహుమతి విషయంలో జీవితం అతనితో ఉదారంగానే వ్యవహరించింది. పంపకాలు సమంగా జరగని స్తనాలతో, పొట్టతో, పీలకాళ్ళతో కాక, ఆమె స్వభావానికి అమిరే పసితనంతోనే ఆమెను జ్ఞాపకంలో దాచుకోగలిగాడు.
గోంగూర పచ్చడి ప్రత్యేకమైన శ్రద్ధతో తయారైందని తెలుస్తోంది. తింటూండగా తలుపు చప్పుడైంది. అతను కంగారుపడి ఆమెను కంగారు పెట్టాడు. ఆమె దొరికినవన్నీ చుట్టబెట్టుకుని వంటగదిలోకి పరిగెత్తింది. అతను దేవుడే వచ్చినా ఏదోటి చెప్పి పంపేయాలన్న నిశ్చయంతో తలుపు దగ్గరకు నడిచాడు. చిన్న సందులా దాన్ని తెరిచాడు. ఎదురింటావిడ కూతురు.
“పెన్సిలుందా అంకుల్?” అని అడుగుతూనే, అతని వెనక నుంచి ఏమైనా కనిపిస్తుందేమో అన్నట్టు చూస్తోంది.
లేదని తలుపు వేసేశాడు.
మాలోకంగా బుర్ర గోక్కుంటూ ఇటు తిరిగాడు.
లోపల్నుంచి ఎలైజా అతని పిరికి కంగారును వెక్కిరిస్తూ ఆపుకోలేని లేని నవ్వుతో బయటకు వచ్చి, అరకొరగా వేలాడుతున్న చవక సిల్కుచీర ఆమె వేగానికి ఎన్నో చెంగులై ఎగురుతుంటే, వాస్తవమూ స్వప్నమూ స్మృతీ ఇవన్నీ గడప చేరువే అన్నట్టు అధిగమించి, బతికిన ఎడారి విస్తారంలో అతను ఏరుకున్న చక్కందనపు పేలికల దొంతరలో ఆ క్షణపు తానో మనోజ్ఞ చిత్తరువువై నిలుస్తూ, పిల్లాడ్ని చేసి అక్కున చేర్చుకుంది.
2
మరుసటి రోజు ప్రసాదు ఆలస్యంగా నిద్ర లేచాడు. పక్క మీద కొన్ని వడలిన కనకాంబరాలు తప్పితే ఎలైజాతోసహా రాత్రి జాడలేం లేవు. స్నానానికి సిద్ధమవుతుంటే తలుపు చప్పుడైంది. చొక్కా వేసుకు వెళ్ళి తీశాడు. పక్కింటావిడ. అరవయ్యేళ్ళుంటాయి, పొలుసుల చర్మం, పెదవుల మూలల్లో తెల్లగా ఏదో వికారం, స్నానం చేసినా పాచి కడగనట్టుండే ముఖం. ప్రసాదు ఏమిటని అడక్కముందే మొదలుపెట్టింది. పొద్దున్న ఎదురింటావిడ ప్రసాదుని ఎన్నెన్ని మాటలందో ఏకరువుపెట్టింది. ఇదంతా ఎదురింటి తలుపుకున్న తాళంకప్పకు వినపడినా ప్రమాదమే అన్నట్టు గుసగుసగా మాట్లాడింది. “పడుకున్నావామ్మా! అదే అనుకున్నాను బైటికి రాడేంటా అని. రాత్తిళ్ళు నీ గదికి ఎవరెవరో వస్తున్నారంట. ఇవాళ ఏదోటి తేల్చేస్తా అంటా పోయింది ఆఫీసుకి. అదేదో తేల్చుకున్నాక కదా నోరు పారేసుకోవాలి… అయ్యదాని నోరు అదేం నోరు బాబోయ్! మేము పడతానే ఉన్నాం చూస్తున్నావు కదా. ఆమె నోట్లో పడొద్దు నాయనా, మా బాబువి, జాగ్రత్త” అంటూ, బహుశా తనకున్న సందేహాల్నీ భయాల్నీ కూడా ఎదురింటావిడ మీదకి నెట్టేస్తూ మాట్లాడింది. తెచ్చిపెట్టుకున్న అక్కరతో పెదాలు ముందుకు చాచి, ఏదో నిలకడ లేని మృగాన్ని బెరుగ్గా సవరదీస్తున్నట్టు ఆమె మాట్లాడుతున్న తీరు చూస్తే ప్రసాదుకి ముఖం పగలగొట్టాలనిపించింది. ఆమె చెప్పిన విషయం లోపల్లోపల ఆందోళన కలిగిస్తున్నా, పైకి మాత్రం అదేమంత లెక్కపెట్టతగింది కాదన్నట్టు ప్రవర్తించి, ముక్తసరి జవాబులతో తలుపు మూశాడు.
కానీ ఆ రోజు లాబ్‌లో పని చేస్తున్నప్పుడు ఈ విషయం గుర్తొస్తూనే ఉంది. పరధ్యాసగా ఒక డబ్బాకి స్టిక్కర్ అతికించకుండానే యూరిన్ శాంపిల్ కి ఇచ్చేయబోయాడు. ఫ్రంటాఫీసులో పన్చేసే పిట్టవాటం రిసెప్షనిస్టు కపటంతెలీని చనువుతో తను కొత్తగా వేసుకున్న గోళ్ళ రంగు ఎలా ఉందో చెప్పమని చేతులాడించినపుడు, ఆమె తెల్లటి వేళ్ళకు మట్టిరంగు ఏమాత్రం నప్పకపోయినా బానేవుందన్నట్టు అనాలోచితంగా తలాడించాడు. ఊహల్లో ఎదురింటావిడని రకరకాలుగా ఎదుర్కుంటూనే ఉన్నాడు.
ఆమెతో ఇంట్లో దిగిన కొత్తలోనే ఒకసారి పేచీ అయింది. అన్నీ ఫ్యామిలీసే ఉన్న ఆ అంతస్తులో ప్రసాదు ఒక్కడే బ్యాచిలరుగా దిగాడు. చెరోవైపూ రెండేసి చొప్పున నాలుగువాటాలు ఉంటాయి. మధ్యన ఓ రెండుఅంగల వెడల్పుతో చిన్న ఉమ్మడి నడవా. మిగిలిన మూడిళ్ళ ఆడవాళ్ళూ రోజుకొకరి చొప్పున వంతులు వేసుకుని ఆ నడవాని శుభ్రం చేస్తారు. ఇంట్లో దిగిన కొన్నాళ్ళ దాకా అసలు ఇలాంటి ఒప్పందమొకటి నడుస్తోందన్న సంగతే ప్రసాదు గమనించలేదు. ఒక రోజు ఉదయం లేచేసరికి, బయట ఊడ్చే చప్పుడుతో పాటు గట్టిగా మాటలు కూడా వినిపిస్తున్నాయి. కాసేపటికి తన గురించేనా అన్న అనుమానం కలిగి తలుపు తీశాడు. “ఎవరు పడితే వాళ్ళు స్టయిలుగా తొక్కుకుంటూ పోతున్నారు పైకీ కిందకీ. కడగరూ పెట్టరు. మాకే పట్టిందా ఖర్మ?” అంటూ, ఏ మొక్కుబడి మర్యాదా లేకుండా మొదటి పరిచయంలోనే అతడ్ని బద్ధవిరోధిగా నిలబెట్టేసింది. అంత జోరెందుకో ప్రసాదుకి అప్పుడైతే అర్థం కాలేదు గానీ, సంసారంలో ఇరుక్కుపోయిన ఆమెకి బాదరబందీల్లేని తన బ్రహ్మచారి మనుగడే ఒక వెక్కిరింతలా చిర్రెత్తిస్తుందేమోనని తర్వాత అనిపించింది. ఆ నడవా కడగటంలో పెద్ద అభ్యంతరం ఏమీ లేదు గానీ, “ఈ బండది ఇంత దురుసుగా చెప్తే తను చేయాలా” అన్న మనస్తాపంతో ఏదో తిక్కగా మాట్లాడి తలుపు వేసేశాడు. అలా ఇద్దరి మధ్యా శత్రుత్వానికి శంకుస్థాపన జరిగిపోయింది. ఆమె అంతటితో ఊరుకోలేదు. ఆ మరుసటి రోజు నుంచి ప్రసాదు నిద్ర చెదిరేలా కొబ్బరీను చీపురుతో తలుపు మీద చప్పుడు చేస్తూ ఊడ్చటం, తలుపు సందుల్లోంచి నీళ్ళు లోపలికి చిమ్మేలా కడగటం చేసేది. ఇక భరించలేక, పక్కింటావిడ ఇచ్చిన సలహాతో ఒక పనిమనిషిని పెట్టుకున్నాడు. దొరక్క దొరికిన ఆ అర్భకపు పనిమనిషి అస్తమానూ నాగాలు పెట్టడం వల్ల చాలాసార్లు ప్రసాదే లేచి ఊడ్చాల్సి వచ్చేది. పని నుంచి వచ్చాకా విశ్రాంతిగా గడపాల్సిన గది దగ్గర లేనిపోని తంపులెందుకని ప్రసాదు ఎంత వెనక్కి తగ్గినా, ఎదురింటావిడ మాత్రం జన్మాంతర కక్షలున్నట్టే ప్రవర్తించేది.
అడపాదడపా అటునుంచి అతని ఉనికి అంచుల్ని తాకుతూనే ఉన్న పరుషమైన సెగల వల్ల, ఆమె గురించి కొంతైనా ఆలోచన ఖర్చుచేయక తప్పలేదు. పనిగట్టుకుని అంచనా వేసిందెన్నడూ లేదు గానీ, అంతరంగంపై ఆమె దౌర్జన్యపు చొరబాట్లు వదిలిన ముద్రల్ని బట్టి ఆమె కథ ఒకటి అతని దగ్గర పోగుపడింది. అతన్నే చెప్పమంటే అది పెన్నులో విషం నింపి రాసిన కథే అవుతుంది మరి: ఆమె చూట్టానికి చామనచాయలో బరువైన బంతిలా ఉంటుంది. ఏదో ఉద్యోగం చేస్తుంది; ఇస్త్రీ చీర, హ్యాండుబాగూ, పువ్వుల గొడుగుతో బయల్దేరటాన్ని బట్టి ఏదో ప్రైవేటు గుమాస్తా ఉద్యోగం అనిపిస్తుంది. ఇరుగుపొరుగుతో ఆమె మాటల్లో, తెచ్చిపెట్టుకున్న నాజూకు వినిపించేది; ఆ నాజూకుతనం ఎక్కడ అమరుతుందో ఆ వర్గాన్ని చేరాలన్న ఆశ–గుమ్మం వారనున్న ప్లాస్టిక్ క్రోటన్స్ నుంచి కూతురితో మాట్లాడే కొన్ని ఇంగ్లీషు ముక్కల దాకా–వ్యక్తమయ్యేది. ఇలాంటి పైపై సూచనల్ని బట్టి ప్రసాదు కసిగా ఆమెకో గతాన్ని కూడా ఊహించాడు: బహుశా నాన్న గారాబం కింద మగతోబుట్టువులతో సమానంగా పెరిగి, ఎన్నో ఆశలతో యవ్వనం దాటి, పెళ్ళయిన తర్వాత చుట్టూ ఎటు చూసినా ఇరుకు సరిహద్దులు నిట్రాటల్లా మొలుస్తుంటే, చివరికి ఈ పేద బస్తీలోకి వచ్చి పడి, వేసవిలో బండరాయిలాగా అసంతృప్తితో కాలుతున్నదేమో. ఈ క్రమంలో మృదుత్వం పోగొట్టుకుంది. ఆమె పిలకజడలో పువ్వులుంటాయి, బుగ్గలపై పౌడరుంటుంది, మనిషి కాస్త సౌమ్యురాలై ఉంటే ముఖంలో ఇప్పటికీ కనిపించే ఆడతనపు అవశేషాలు ఎంతోకొంత ప్రభావాన్ని కలిగించేవే; అదేం లేకపోవటంతో, ప్రసాదు ఎపుడైనా తన ఏకాకి ఒగుర్పుళ్ళలో ఊహలకి మరీ కరువాసిపోయి ఆమెకు మానసికంగా బట్టలిప్పినా, సుమో యోధుడు పొజిషన్లోకొచ్చి నిల్చున్నట్టే కనిపించి, అతని గుప్పిట్లోని వేడి బలుపు కాస్తా చల్లగా ముడుచుకుపోయేది. ఆమె భర్త మొదట్లో ఏమన్నా పైచేయికి ప్రయత్నించాడో లేదో తెలియదు కానీ, ఇప్పడు మాత్రం చేతులెత్తేసినట్టే కనిపిస్తాడు. బహుశా అతని ఉద్యోగం కుటుంబానికి ఏమీ ఒనగూర్చేది కాదేమో, లేదా పక్క మీద ఆమెని ద్రవింపజేసే చేవ లేదేమో, లేదా ఆమెని చాచి కొట్టింతర్వాత చివుక్కుమని తిరిగొచ్చే పశ్చాత్తాపాన్ని ఎక్కువకాలం ఎడంగా ఉంచటం చేత కాలేదేమో. మొత్తానికి ఏదో ఒక పాయింటు దగ్గర అతని చేతకానితనాన్ని మారుమాటలేకుండా ఖాయం చేసి, కుటుంబానికి ఆమె పురుషాంగమైంది. ప్రస్తుతం దద్దరిల్లే ఆమె వ్యక్తిత్వ ప్రదర్శనల వెనుక నీడలా నిశ్శబ్దంగా తచ్చాడుతూ ఉంటాడు భర్త.
ప్రసాదుకి బ్రహ్మచారి కొంపలు అలవాటే, బ్రహ్మచారుల గాలే పాతివ్రత్య భంగమన్నట్టు తొలగిపోయే కొందరి చిత్రమైన నకరాలూ కొత్త కాదు. కానీ తానే లక్ష్యంగా కురుస్తున్న ఇంత ధారాళమైన ద్వేషం కొత్త. ఆ ద్వేషం తనకు అందుతోందని ఆమెకు సరిగా తెలిసేలా చేయకపోవటం వల్లనేమో, పదే పదే ప్రదర్శించటానికి తయారయ్యేది. ఈమధ్య మరీ ఎక్కువైంది. దానికి కారణం ఎలైజానే అని తట్టినా తట్టనట్టే ఉన్నాడు. అతను కనపడినపుడు తలుపు వేసుకోవడం, అతని గదికి ఫ్రెండ్ ఎవరైనా వస్తే చాలు లోపల బారు ఓపెన్ కాబోతున్నట్టు ముఖం చిట్లించి జడ్జ్ చేయటం, కూతూహలంగా చూస్తున్న కూతుర్ని ఏదో చెడు ప్రభావాన్నించి కాచుకోవటానికన్నట్టు రెక్కపట్టుకుని లోపలికి లాగేయటం లాంటివి చేస్తోంది. ఆమెలో అంతకంతకూ వికృతంగా ప్రతిఫలిస్తున్న తన రూపం చూసుకున్నప్పుడల్లా అతనికి అసహ్యం వేసేది. ఇద్దరికీ పడ్డ ఈ లంకె వల్ల బయటవున్నప్పుడు కూడా ఆమె గుర్తు రావడం మొదలైంది. అతని ఆలోచనలు లలితంగా సాగుతున్నప్పుడు వాటిపై ఉమ్మేసి వెక్కిరించేందుకు ఆమె మనస్సాక్షి వేషంలో లోపలికి చొరబడేది. అతనిలో పెరిగిన కసికి నిదర్శనం ఒకానొక పగటివూహ: ఆమె ఉద్యోగానికి వీధిలో నడిచి వెళ్తున్నప్పుడు వెనక నుంచి హెల్మెట్ ముసుగులో బైకు మీద వెళ్ళి తల మీద మొట్టడం.
ఆ సాయంత్రం క్లినిక్ నుంచి వస్తున్నప్పుడు ప్రసాదు మనసు తుఫాను సూచనలతో గుబులుగా ఉన్న తీరంలా ఉంది. పెళుసు ధైర్యాన్ని కవచంగా ధరించి ఇంటికి వచ్చాడు. మెట్ల ఎత్తు పెరిగినట్టు బరువుగా ఎక్కాడు.
నడవాలో ఇదివరకూ లేని బల్బు ఒకటి పసుపుగా వెలుగుతూ ఆ చోటుకి కొత్తగా రాత్రి వ్యక్తిత్వాన్నిస్తోంది. ఎదురింటావిడ గడప మీద నైటీలో, జడలో దువ్వెనతో కూర్చుంది, అతడ్ని చూసి కదలబోయిన కూతురి భుజం మీద చేత్తో నొక్కింది. ఆ పిల్ల పెద్దాళ్ళ కోసమన్నట్టు లేని కలవరాన్ని నటించబోయింది కానీ, బాల్యపు దిలాసా వల్ల అది అణిచిపెట్టిన చిరునవ్వుగా మాత్రమే వ్యక్తమైంది. పక్కింటి ముసలావిడ కర్టెన్ పట్టుకుని ఏదో మాట్లాడుతున్నదల్లా పొయ్యి మీద పాలు గుర్తు చేసుకుని వెనుదిరిగి వెళ్ళిపోయింది. వెన్ను మీద దృష్టి బరువు మోస్తూ ప్రసాదు తాళం ఎలాగో తీసి లోపలికి చేరి తలుపు వేశాడు. లైటు వేసి, కూరలు బల్ల మీద పెట్టాడు. రాగానే బట్టలు మార్చుకునే అలవాటు మర్చిపోయి, ఇంకా నడవాలోనే తచ్చాడుతున్న మనసుని మోసుకుంటూ, అలికిడి కాకుండా పచార్లు చేస్తున్నాడు. పక్కింటావిడ పాలు కట్టేసి గుమ్మం దగ్గరికి వచ్చినట్టుంది; ఎదురింటావిడ గొంతు మళ్ళీ మొదలైంది. ఆమె మాటల్లో కొన్ని మూసిన తలుపు దాటి వచ్చి అతని చెవుల్ని కటువుగా తాకాయి: “సిగ్గూశరం”, “సంసారులకొంప”, “మర్యాదగా బతుకుతున్నాం”… ఇలాంటివి. ప్రసాదు లోంచి అప్పటికే ఒకడు బయటికొచ్చి, తలుపు తీసివెళ్ళి, దెబ్బలాడేస్తున్నాడు, ప్రసాదుని కూడా రమ్మని గుంజుతున్నాడు. అతని లోపలి దిటవుతో నిమిత్తం లేకుండా కాళ్ళు వణుకుతుంటే, అదేదో ఆకలి వల్ల అయినట్టు, కుర్చీలో కూలబడి, కూరల పాకెట్టు ఒకటి విప్పి, ఉత్తి బంగాళదుంప వేపుడు తింటున్నాడు. ఆమె ఊదరగొట్టడం ఆపలేదు. కాసేపటికి, ఊపిరి తీసుకోవాల్సి వచ్చిందో, అనదల్చుకున్నదంతా అనేసిందో మరి, నెమ్మదించింది. ప్రసాదు ఊరటగా నిట్టూర్చేంతలోనే, మరి పక్కింటావిడ ఏమని ఎగదోసిందో కానీ, ఉన్నట్టుండి గొంతు పెంచి ఒక మాటంది. అది ప్రసాదు చెవులు రిక్కించకుండానే వినపడింది:
“ఆ… ఊరుకోండాంటీగారూ మీరు! ఎవత్తి పద్ధతైన ఆడదో, ఎవత్తి బోకు లంజో నాకు తెలీదా. ముఖం చూసి చెప్తా.”
అస్తిత్వ కేంద్రంలో గుచ్చుకున్న ఈ అవమానంతో అతని ఛాతీ లోంచి మొదలైన వేడి ప్రకంపన ఒళ్ళంతా రోమాంచితం చేస్తూ కళ్ళల్లో ఎరుపు చారల తడిగా ఉబికింది. అతడ్ని అదుపు చేయాలని అన్ని నరాలూ కలవరంగా మూగుతుండగానే, విచక్షణ వడివడిగా చేరి భుజాన చేయి వేసి ఆపేలోగానే, విసురుగా లేచి, తలుపు తీసి, వాళ్ళ ముందుకొచ్చి నిలబడ్డాడు.
“ఏంటి?” అన్నాడు.
ఆమె గడప మీంచే కళ్ళు చిన్నవి చేసి అంది, “ఏంటేంటి?”
“ఎవరి గురించి మాట్లాడుతున్నారు?”
ఆమె పక్కింటావిడ వైపు తలతిప్పి, “ఏంటాంటీ ఈయన ఆడోళ్ళ మధ్య కొచ్చి దూరుతున్నాడు?” అంది.
పక్కింటావిడ కళ్ళలో ఎదురుచూసిన దొమ్మరాట మొదలైందన్న సంతోషం దొరికేస్తున్నా, మాటలో మాత్రం దయనీ పెద్దరికాన్నీ పలికింపజేస్తూ, నచ్చచెప్తున్నట్టు మూతి ముందుకు తెచ్చి అంది, “అయ్యో చెడ్డగా ఏం అనలేదు బాబూ, అక్కయ్య బాధపడుతుంది, చిన్న కుర్రాడివీ, పెళ్ళదీ అవ్వాల్సినవాడివీ, ఏంటిలా పాడైపోతున్నాడు పాపం అంటూను. ఆమెదంతా ముక్కుసూటి కదా, చెప్పటం చేతకాక–”
ఆమె మాటల్ని మధ్యలోనే కట్ చేస్తూ పైకి లేచింది ఎదురింటావిడ, “ఓ ఆంటీ! ఏంటి అక్కయ్యంటున్నారా! నా తమ్ముడే ఇట్లాంటి వేషాలేస్తే చెప్పుదీసుక్కొట్టి దార్లోకి తెస్తా. ఇది ఫ్యామిలీలుండే చోటు, ఉంటే పద్ధతిగా ఉండమనండి, లేదంటే ఖాళీ చేసి వెళ్ళిపొమ్మనండి. అంతేగాని, లంజలకొంపలో బిహేవ్ చేసినట్టు చేస్తా అంటే ఊరుకునేది లేదు,” అతను అక్కడ లేనేలేనట్టు, పక్కింటావిడతో గట్టిగా పట్టిపట్టి మాట్లాడింది.
“ఊరుకోక ఏం జేస్తావ్. నా ఇంట్లో ఏం జరిగితే నీకెందుకు, ఎవరొస్తే నీకెందుకు. నీ ఇంటికి ఎవరొస్తున్నారో నేను చూస్తున్నానా?” అన్నాడు ప్రసాదు.
“ఇదిగో నువ్వు మాటలు తిన్నగా రానీ,” అతని వైపు తిరిగి చూపుడు వేలు ఆడిస్తూ అంది.
ప్రసాదు అప్పటికే జ్వరప్రలాప దశకు వచ్చేశాడు. “ఏం చేస్తావ్ లేకపోతే?” అంటూ, ఏ క్షణమైనా పట్టు విడిచేట్టున్న కాళ్ళతో, ఒక అడుగు ముందుకు వేశాడు.
పక్కింటావిడ ఇక తన సరదా తీరిపోయినందుకో, లేక పోషించటానికి కొత్త పాత్ర దొరికినందుకో తెలియదు గానీ, ఆ క్షణం ప్రసాదు పాలిట దేవతే అయ్యి మధ్యలోకి వచ్చి కలగజేసుకుంది, “ఓయ్… ఏందల్లా మీరిద్దరూ. ఓయమ్మో నువ్వు లోపలికి పో ముందు,” అంటూ ఎదురింటావిడ భుజం మీద బహుశా అంతకుముందెన్నడూ లేని చొరవతో చేయేసింది. ఆమెని మెత్తగా గుమ్మం వైపు తోస్తోంది.
ఆమె కూతుర్ని నడుముకు చేరవేసుకుని గుమ్మం వైపు కదుల్తూ, యింకా చూపుడువేలు ప్రసాదు కేసి ఆడిస్తూనే, “ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు. పోలీసు కంప్లయింటు ఇస్తా ఏమనుకున్నావో,” అంది. “మీరుండండాంటీ,” అంటూ పక్కింటావిడని విదుల్చుకుని లోపలికి వెళ్ళింది.
పక్కింటావిడ ఈసారి అభాసుపాలైన ప్రసాదు వైపు వచ్చి, అతని వీపును తాకుతూ, అవసరం లేనంత మెల్లగా, “పో నాయనా లోపలికి పో! నేను మాట్లాడతాలే,” అంటూ గుమ్మం వైపు తోస్తోంది.
ప్రసాదు వెనక్కి తగ్గనివాడిలా–తనలాగే ఎదురింటావిడ కూడా తలుపు వెనక నక్కి వింటుందని ఊహించుకుంటూ–గట్టిగా అన్నాడు, “కాదండీ ఎక్కువ చేస్తుందామె. నేను ఎపుడైనా ఆమె జోలికి వెళ్లానా. ఏదో రిక్షావోడితో మాట్లాడినట్టు మాట్లాడుద్దేంటీ?” అనటం అన్నాడే కానీ, మళ్ళీ ఈ మాట మీద రెచ్చిపోయి ఎదురింటావిడ ఎక్కడ తలుపు తీసుకు వస్తుందో అన్న జంకు కలిగింది, “ఉండండి, నేను బయటకు వెళ్తున్నాను,” అంటూ పక్కింటావిడ చేయి తీసేసి మెట్లు దిగి చీకట్లోకి వెళ్ళిపోయాడు. ఆవిడ కాసేపలాగే నిలబడి, అపనమ్మకం నవ్వుతో తల అడ్డంగా ఆడిస్తూ, ఇంట్లోకి వెళ్ళిపోయింది, నడవాలో లైటు ఆరిపోయింది.
ప్రసాదు ఆ రాత్రి టిక్కెట్లు దొరికిన ఏదో థియేటర్లోకి దూరి, సభ్య సమూహం మధ్య వెచ్చగా కూర్చుని, ఎలైజా కరుణ చేసిన పన్నెండు కాల్సూ ఎత్తకుండా కసిగా నొక్కిపారేస్తూ, ఆమెతో సంబంధానికున్న విలువ ఇంకో అద్దెయిల్లు వెతుక్కునే కష్టం పాటి చేస్తుందా అని తర్కించుకుంటూ, తెర మీది దృశ్యాల్నే తప్ప కథ గ్రహించకుండా సినిమా చూడ్డం పూర్తి చేశాడు; రాత్రెప్పుడో మున్సిపాలిటీ వర్కర్లు చలిలో కాఫీలు ఊదుకుంటూ తాగుతున్న వేళకి, ఇక ఆలోచనల దారంచుట్టల్ని విప్పలేక అలసిన బుర్రతో గది చేరి నిద్రపోయాడు.
మరుసటి రోజు పొద్దున్న జరిగిన సన్నివేశాన్ని మాత్రం ఊహించలేదు. తలుపు చప్పుడైతే బిక్కుబిక్కుమంటూనే తీశాడు. బయట ఒక బురఖా ఆవిడ తనని ఇంటి ఓనరుగా పరిచయం చేసుకుంది. ప్రతి నెలా అద్దె ఆమె అకౌంటులో జమ చేసినపుడు ఫోన్లో బొంగురు గొంతు వినడమే తప్ప, మనిషిని ఎప్పుడూ చూడలేదు. బాంకు రశీదులో రాసే పేరుని బట్టి “ఫాతిమా”గా పరిచయం. ఆ బొంగురు గొంతుకీ, ఎందుకో ఆమె పేరుకీ నప్పేట్టే తెల్లగా, బొద్దుగా ఉంది. ఆమె వెంట ఎవరో పన్నెండేళ్ళ పిల్ల ఉంది. తర్వాత ఫాతిమా ప్రవర్తనని బట్టి, తనలాంటి వాడితో మాట్లాడుతోంది కాబట్టి ఆ పిల్లని తోడు తెచ్చుకుందేమో అనిపించింది ప్రసాదుకి. మర్యాదగానే మాట్లాడింది, కానీ చెప్పదల్చుకుంది చెప్పేసింది. ఎదురింటావిడ ఈమధ్య రోజూ ఫోన్లు చేసి ప్రసాదు గదికి ఆడాళ్ళని తెచ్చుకుంటున్నాడనీ, ఫ్రెండ్స్ తో కలిసి తాగుతున్నాడనీ చెప్తోందట. ఆమె పోరు భరించలేకపోతున్నాననీ, నిన్నటికి నిన్న పోలీస్ కంప్లయింటు ఇస్తానని రాద్ధాంతం చేసిందనీ, కాబట్టి ప్రసాదు ఖాళీ చేస్తే ఎవరన్నా ఫ్యామిలీకి ఇచ్చుకుంటాననీ చెప్పింది. చెప్పి వెళ్ళిపోయింది.
ప్రసాదు రోషపు ఊపిర్ల మధ్య చాలాసేపు కదలకుండా కూర్చున్నాడు.
3
కాసేపటికి గట్టిగా నిశ్వసించి కుర్చీ లోంచి లేచాడు, తలుపు తీసి, నడవా దాటి, ఎదురింటావిడ తలుపు తట్టాడు. తలంటిన జుట్టు తువ్వాల్లో చుట్టుకుంది, బొట్టులేని బోసి నుదుటికి అటూయిటూ కనుబొమ్మలు తడిగా అతుక్కుపోయి వున్నాయి. ఆమె వెనకాల ఎవరూ కనపడలేదు. “ఏంటి,” అంది. అతను ఆమెను వెనక్కు నెడుతూ లోపలికి వచ్చి, తలుపు బోల్టు వేసి, “అసలు నేనంటే నీకెందుకే అంత కసీ?” అంటూ ఆమెని అమాంతం మంచం మీదకు తోసి–
–లేదు, అలాంటిదేం జరగలేదు. కొన్నాళ్ళకే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు.
చాలాకాలం తర్వాత, ఒక ఉక్కపోస్తున్న వేసవి సాయంత్రం రన్నింగ్ బస్సు ఎక్కి చోటు లేక నిలబడితే, ఒకావిడ కూర్చోమన్నట్టు పక్కకు జరిగింది. సీటు దొరికిందన్న తొందరలో కూర్చున్నాకా గుర్తుపట్టాడు ఎదురింటావిడని. ఆమె గుర్తుపట్టాకనే కూర్చోమందో, కూర్చున్నాక గుర్తుపట్టిందో తెలీదు గానీ, “ఎక్కడుంటున్నావ్” అని బానే అడిగింది. ప్రసాదు చెప్పాడు. అంతటితో ఆగలేదు. పెళ్ళయిందాని అడిగి, పెళ్ళాంతో మంచిగా ఉంటున్నావా లేక… అని పరాచికమాడి, అప్పటి గొడవల్ని మళ్ళీ గుర్తుకు తెచ్చి, “నాకు నిజంగానే ఓ తమ్ముడు ఉన్నాడు. నువ్వలా చేస్తుంటే నాకు వాడే గుర్తొచ్చి బాధగా ఉండేది” అంటూ–
–లేదు, అలాక్కూడా ఏమీ జరగలేదు. అతను మళ్ళీ ఎదురింటావిడ్ని ఎప్పుడూ చూడలేదు. ఇవి అతనిలోని జెకిల్ అండ్ హైడ్‌లు మూడ్‍ని బట్టి సరఫరా చేసే కొన్ని ఊహలంతే. ఆమె మీద ద్వేషం అలానే ఉంది. ఇప్పటికీ ఆమె ఎపుడైనా జ్ఞాపకం వస్తే, దాంతోపాటే బైకు మీద వెళ్ళి మొట్టినట్టు ఊహ కూడా వస్తుంది. ఎంత స్పష్టంగా అంటే, ఇపుడది ఊహగా కాక జ్ఞాపకంగా మారిపోయింది.
ఆ ఇల్లు మారాకా ఎలైజా కరుణని పూర్తిగా పక్కన పెట్టేశాడు. సిమ్ మార్చినంత సులభంగా మర్చిపోయాడు. కానీ కాలం గడిచిన కొద్దీ ఆమె ప్రభావం నెమ్మదైన వరద మట్టంలా అతని చుట్టూ పెరిగింది. నకళ్ళ వంటి రోజుల్ని అలవాటు మత్తులో నెట్టుకొస్తున్నప్పుడు, కొన్ని క్షణాలు మాత్రం ఆమె చెలికత్తెలై చుట్టుముట్టేవి, గడియారపు పెత్తనం నుంచి అతడ్ని లాఘవంగా తప్పించి తలపులవనంలోని ఆమె చెంతకు చేర్చి మాయమయ్యేవి. తలచుకునేవాడు: “ఎలా ఉంది, ఇప్పటికైనా రాటుదేలిందా, ఒత్తిగిలి పడుకున్న ఆమె అందాన్ని ఇంకెవరైనా కనిపెట్టగలిగారా, కూతుర్ని చక్కగా పెంచిందా, ఆమెకో కొడుకు కూడా ఉంటే ఎంత బాగుండేదీ…” ఇలా అని.
కథ Pdf link: https://www.scribd.com/doc/296927884/Chedupoolu-PDF
Illustration: Anwar