“ఆ, గుర్తుందిలే. ఏదన్నా వండి తీసుకు రమ్మన్నావా?” ఫార్మాలిటీ పూర్తి చేస్తూ అడిగాను.“నిన్ను నువ్వు తెచ్చుకో, చాలు. వండడానికి రామూ ఉన్నాడు.”- రక్షించింది. మా ఆయన విక్రమ్ అయితే,
”మనమే వంటకాలు పట్టికెళ్తే, మరి వాళ్ళింట్లో డిన్నరేమిటింక! నా మొహం.” అని విసుక్కుంటాడు.ప్రతిమకి ఫోన్ చేసాను.“మూడు రోజుల తరువాత రేణుక పుట్టినరోజు. మనందరికీ ఆఫీసుంటుంది కదా అని, పనిలో పనిగా ఆదివారమే పిలిచిందంతే.“ అంది.నాకున్న మతిమరపుతో, “ఓహో, తన పుట్టినరోజా!”-అనబోయి, నాలుక్కరచుకుని,
“గిఫ్టేం కొంటున్నావు?” అడిగాను.“బాబోయ్, తనకి గిఫ్టు కొనడమా! కిందటిసారి నేను సిల్కు చీర కొన్నానా? ఎంత శ్రద్ధగా ఎంచి మరీ కొన్నాను! బాగుందని కానీ థేంక్సు చెప్పడం కానీ లేకపోగా, ఈనాటివరకూ దాని ఊసే ఎత్తలేదు. తనకి ఆ మర్యాదలు తెలిస్తే కదా? ఇంటికి పనికొచ్చే వస్తువేదో తీసుకెళ్తే సరిపోతుంది. నువ్వూ అలాంటిదే ఏదో కొనియ్యి.”- సలహా పడేసింది.
అదీ నిజమే. ఎవరైనా పుట్టినరోజుకో దేనికో పిలిస్తే, రేణుక చేసేది మహా అయితే ఏమిటి? ఏ పదేళ్ళకిందటో కొని, నచ్చక, ఇంట్లో పడేసిన డైనింగ్ టేబిల్ మాట్సో- ఎవరో, ఎప్పుడో తనకి గిఫ్టుగా ఇచ్చిన కుర్తా బట్టనో ఇస్త్రీ చేసి, రిసైకిల్ చేయడమేగా! పోయినసారి నేను తనకి గిఫ్ట్ చేసిన ఫుల్కారీ స్టోల్ గురించిన ప్రసక్తి ఇప్పటివరకూ తేనేలేదు.
పుట్టి పెరిగిన తన బాక్గ్రౌండుని, పెళ్ళయి ఇన్నాళ్ళయినా వదిలిపెట్టలేకపోతోందేమిటో మనిషి!
“ఆ ఊరికి ఈ ఊరెంత దూరమో, ఈ ఊరికీ ఆ ఊరంతే దూరం.”నన్ను నేను సమర్థించుకుటూ, లోకల్ మార్కెట్లో ఉన్న గిఫ్టు ఎంపోరియమ్‌కి వెళ్ళి, ఏడు రాజస్థానీ భరిణలున్న సెట్టు కొని పాక్ చేయించాను.
***
చెప్పుకోడానికి రేణుకది పంచ్‌షీల్ ఎంక్లేవ్‌లో పెద్ద ఇల్లు. భర్త రాజీవుకి తల్లి కట్టించిన అంత పెద్దింటినీ మెయింటైన్ చేసే స్థోమత లేనప్పటికీ, ఒక్క పనిమనిషిని మాత్రమే పెట్టుకుంటే సాగే పని కాదు. మూడంతస్థుల సర్వెంటు క్వార్టరులో వంట చేసే రామూ, అంట్లూ మిగతా పనులూ చేసే వేరే మనిషీ ఉంటారు. ఈకాలంలో కూడా బట్టలుతకడానికి చాకలొకడు మళ్ళీ.
అదంతా పక్కన పెడితే, వాళ్ళ లివింగ్ రూమ్ సదుపాయంగా అనిపించదు. ఇంటిని ఎలా అలంకరించుకోవాలో చెప్పే పుస్తకాలు తెగ చదువుతుంది రేణుక. అలాంటి టివి షోలు చూస్తుంది. లాభం ఉంటే కదా? ఇల్లు చెల్లాచెదురుగానే పడుంటుంది. వాళ్ళ వాష్ రూమ్ ఉపయోగించుకోవాలన్నా, మొహమాటం వేస్తుంది. ఎందుకో కానీ మొక్కుబడి తీర్చుకున్నట్టనిపిస్తుంది తప్ప, స్నేహితులని కలుసుకున్నామన్న సంతోషం కలగదు నాకు.
విక్రమ్, నేనూ- రేణుక ఇంటికి చేరేటప్పటికి ఏడున్నర దాటింది. అప్పటికే ప్రతిమా, భర్త శేఖరూ వచ్చున్నారు. ఎదురుగా కుడిమూల శేఖరూ, రాజీవూ కూర్చున్న వైపుకి విక్రమ్ కూడా దారి తీసాడు. ఎడంవైపు, విడిగా ఒక్కర్తే కూర్చున్న రేణుక దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుని,
“అడ్వాన్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు“ -చెప్తూ, గిఫ్ట్ రాప్ చేసున్న పాకెట్ చేతికందించాను. “అరే, దీని అవసరం ఏముంది? నా పుట్టినరోజుకింకా టైముందిగా!” అన్న మాటలు ఊడిపడవని ఎలాగూ తెలుసు. చిరునవ్వులోకూడా పిసినారితనం చూపిస్తూ, ఏ మాటా ఆడకుండా పాకెట్ అందుకుని, పక్కనున్న టేబిల్ మీద పెట్టింది.
మొహంమీద తన రంగుకి మాచ్ అవని ఫౌండేషన్ ఎప్పటిలాగానే, చారలు కట్టి ఉంది. చామనఛాయకన్నా తక్కువైన మనిషి పెదాలమీద అతి లేత గులాబీ రంగు లిప్‌స్టిక్కూ, అరిగిన హవాయి చెప్పులూ. జిడ్డుగా ఉన్న జుత్తుని రబ్బర్ బాండుతో కట్టుకుంది. ఏ పదేళ్ళకిందటో కుట్టించుకున్న, వెలిసిన సల్వార్ కమీజు. కనీసం ఇంటికి నలుగురు వచ్చినప్పుడైనా తయారవాలనిపించదేమిటో!
ఇటువైపు సోఫాలో కూర్చున్న ప్రతిమని, “ఎంత సేపైంది వచ్చి?” అడుగుతూ, తన పక్కనే కూలబడ్డాను.
“ఇప్పుడేలే. పది నిముషాలయింది.” పక్కకి జరిగింది కూర్చోడానికి చోటిస్తూ.
“రేణుకా, నువ్వూ ఇక్కడికే రా. చాలా దూరంగా ఉన్నావు.” పిలిచాను.
“వంటింట్లోకి వస్తూ, పోతూ ఉండాలి. ఇక్కడ సరిగ్గానే ఉంది.” ఠపాల్మని, కరుకైన సమాధానం వచ్చింది.
ప్రతిమా, నేనూ మాటల్లో పడ్డాం. రాజీవ్ వచ్చి బీరు బాటిల్స్ తెరిచి మూడు మగ్గుల్లో పోస్తున్నాడు.
పక్కన పెట్టిన స్నాక్స్ నములుతూ, తన పెప్సీ తాగుతూ, “రాధికా, అన్నట్టు నీ డ్రింకేదీ?” ప్రతిమ అడిగింది.
‘ఏమో’ అన్నట్టు భుజాలెగరేసి, పెదాలు విరిచాను.
“ఆడవాళ్ళు తాగడం అన్న ఈ కాన్సెప్టుందే! ఇది బ్రిటిష్ వాళ్ళు మనకి వదిలి వెళ్ళిన దురలవాటు. తాగే ఆడవాళ్ళంటే ఎంత చిరాకో నాకు. కంపరం వేస్తుంది.” ఆవరించుకున్న నిశ్శబ్దం మధ్య బాంబు పడినట్టు, రేణుక మాటలు. ఇద్దరం తన వంక చూశాం. ఆ మూల దూరంగా కూర్చుని, రాజకీయాలు మాట్లాడుకుంటున్న మగవాళ్ళకి ఆ మాటలు వినిపించలేదు కాబోలు. ఇటువైపు కూడా తిరిగి చూడలేదు.
గుండెల్లో, ఏదో లోతుగా గుచ్చుకున్న ఫీలింగ్. అప్పటికప్పుడు లేచి, బయటకి నడుద్దామనిపించింది. నా మొహం చూస్తూనే అర్థం అయినట్టుంది ప్రతిమకి.
“బ్రిటిష్ వాళ్లనెందుకు ఆడిపోసుకోవడం? వాళ్ళు రాక మునుపే, పల్లెల్లో పొలం పనులు చేసుకునే ఆడవాళ్ళు తాగేవారు, ఇప్పటికీ తాగుతున్నారు. జమీందారీ కుటుంబాల్లోనూ తాగేవారు. బ్రిటిష్ అనీ, ఆర్మ్డ్ ఫోర్సెస్ అనీ వాళ్ళ మీద నేరం మోపేసి, జస్టిఫై చేయడంలో అర్థం కనిపించడం లేదు. మా బెంగాలీలలో ఆడవాళ్ళు తాగుతారే మరి! నాకయితే ఒక చుక్క నోట్లోకి వెళ్ళటంతోనే చెవుల్లో, కళ్ళల్లో మంటలు మొదలెడతాయని ముట్టుకోను. మరి మీ పంజాబీ ఆడవాళ్ళ సంగతి మాట్లాడవేం? సందర్భం దొరకాలి తప్ప, అవకాశం వదులుకునేదెప్పుడు? తాగడంలో అందరికీ ముందే ఉంటారుగా!” ప్రతిమ కౌంటర్ ఎటాక్ వినిపిస్తూనే ఉంది.
తల భారం అవడం తెలుస్తోంది.
‘నేను తాగే అరవై మిల్లీలీటర్లకీ, ఇలా ఇంటికి ఆహ్వానించి మరీ అవమానించాలా? అయినా తనకి నా సంగతేమైనా కొత్తా? అయితే, నిన్న ఫోన్లో తన మాటలకి అర్థం ఏమిటి!’ ఇంకొక్క నిముషం కూడా అక్కడ కూర్చోవడం కూడా దుర్లభంగా అనిపించింది. పోనీ విక్రమ్‌కి ఏదైనా సైగ చేసి చెప్దామంటే, తను నావైపు చూస్తే కదా!
హటాత్తుగా లేచి, “మేము వెళ్తున్నామని చెప్తే మర్యాదగా ఉంటుందా? సీన్ క్రియేట్ చేసినట్టనిపించదు కదా! ఏదైనా అనుకోనీ. అవమానం సహించడం నావల్ల కావడం లేదే! మరి నా స్వాభిమానమో?”-తర్జనభర్జన పడుతున్నాను.
నా ఆలోచనలు తనదాకా వెళ్ళినట్టు, నా మోకాలిమీద వారిస్తున్నట్టుగా తట్టింది ప్రతిమ.
“రాధికా, నీ డ్రింక్ పట్రానా?” రాజీవ్ వచ్చాడు.
“తను పెప్సీ తాగుతుందిలే”- రేణుక నిర్ణయించేసింది. అంత అవమానం జరిగిన తరువాత పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవాలనిపించదని అర్థం చేసుకోలేకపోయిందా!
”ఏదీ వద్దు రాజీవ్. నాకు ఏరేటెడ్ డ్రింక్స్ పడవు. .” గొణిగాను.
“సరే అయితే, నీ ఇష్టం.” అంటూ, రేణుక మూలనున్న ఫ్రిజ్ వద్దకి నడిచింది. రాజీవ్ భార్యవైపు చూశాడు. ఏదో అర్థం అయినట్టు, మొఖకవళికలు మారాయి. భార్యవెంట నడిచాడు.
తలదించుకుని కూర్చున్న నా డొక్కలో, తన అలవాటు కొద్దీ మోచేత్తో పొడిచింది ప్రతిమ. మూడోమనిషి అక్కడ లేనప్పుడు, ఆ మనిషి గురించి గుసగుసలాడ్డం, వారివైపు సైగ చేసి చూపించడంలాంటి అలవాట్లున్నాయి ప్రతిమకి. అది అమ్మమ్మ, నాన్నమ్మల కాలపు ఆడవాళ్ళని గుర్తు తెస్తుంది నాకెప్పుడూ. ఆ చర్య ఇప్పుడు మాత్రం చిరాకు పుట్టించలేదు.
“రాజీవ్ ఏదో గొడవ పడుతున్నాడు రేణుకతో. నీ గురించే అనుకుంటాను. విను.”- మెల్లిగా చెప్పింది.
నిజమే. వాళ్ళిద్దరూ వంటింటివైపు వెళ్ళారు. మధ్యనున్న గోడవల్ల కనిపించడం లేదు కానీ కోపంగా మాట్లాడుకుంటున్న, అస్పష్టమైన గొంతుకలు మాత్రం వినిపిస్తున్నాయి.
అక్కడ మరేమయిందో కానీ, రాజీవ్ వచ్చి నా చేతికి గ్లాసందించాడు. ప్రశ్నార్థకంగా చూస్తే, “నీ స్కృ డ్రైవర్. ” అన్నాడు. మాట్లాడకుండా, గ్లాసందుకుని పక్కనున్న టేబిల్ మీద పెట్టాను. ముట్టుకోవడానికి మనస్కరించలేదు.
కొంతసేపయింది. రాజీవ్ వచ్చి, పక్కనే ఉన్న నిండు గ్లాసు చూసి “ ఏమయింది? తాగడం లేదా!” అడిగితే, బలవంతంగా నోటికాన్చుకున్నాను. రాజీవ్ కదలగానే, గ్లాస్ మళ్ళీ పక్కనుంచాను.
ఆ మూల మగవాళ్ళ గొంతులూ, వంటింట్లో గిన్నెల శబ్దం తప్ప ఇంకేవీ వినపడటం లేదు. రేణుక అదే కుర్చీలో కూర్చుని, గోడలవైపు చూస్తోంది. పెద్ద ఇళ్ళల్లో ఉండే విశాలమైన గదులలో కూడా ఆవరించుకోగలిగే నాటురకమైన, మౌనపు అసౌకర్యం అనుభవంలోకి వచ్చింది.
“మళ్ళీ రేపు ఆఫీసులున్నాయి. భోజనాలు త్వరగా కానిద్దాం.” అన్న ప్రతిమ మాటల కోసమే ఎదురు చూస్తున్నట్టు, “అయ్యో, అయిదు నిముషాలే. వడ్డించమని చెప్తాను.” పనమ్మాయికి పురమాయిస్తూ, రేణుక లేచింది.
అందరూ భోజనాల బల్ల వద్దకి నడిచారు. ఇంకా సోఫాలోనే కూర్చునున్న నన్ను రేణుక పిలవలేదు. “రాధికా, భోజనం చల్లారిపోతోంది. రా మరి.“ అన్న రాజీవ్ మాటలతో, ‘కనీసపు మర్యాద దక్కింది’ అనుకుంటూ, లేచి వెళ్ళి టేబిల్ చుట్టూ ఉన్న ఒక కుర్చీలో ఇబ్బందిగా కూర్చున్నాను.
“మీరు మచ్ఛీ లేకపోతే తినలేరుగా? ఎలా వచ్చిందో మరి! రుచి చూసి చెప్పండి.” శేఖర్కీ, ప్రతిమకీ చెప్తూ- వాళ్ళ కంచాలవద్దకి చేపల కూర ఉన్న బౌల్ జరిపింది రేణుక.
“మరి రాధిక వెజిటేరియన్‌గా! తనకోసం ఏమిటి చేయించావు?” ప్రతిమ కలిపించుకుంది. “దాల్ మఖనీ, బంగాళదుంపలూ.”- తన ఎదురుగా పెట్టి ఉన్న రెండు బౌల్స్నీ చూపిస్తూ, వాటిని ఇటువైపు జరపకుండా, ముభావంగా జవాబిచ్చింది రేణుక. ”రామూ, అవిటు పట్రా.” ప్రతిమే చొరవ తీసుకుంటూ, రాముని పిలిచింది. ప్లేట్లో చెమ్చాడు పప్పూ, ఇంకో చెమ్చాడు అన్నం మాత్రం వడ్డించుకున్నాను. వాటినే స్పూనుతో కెలకుతున్నాను తప్ప, స్పూన్ నోట్లో పెట్టుకోబుద్ధి కాలేదు. ప్రతిమ సానుభూతిగా చూసిన చూపులని తప్పించుకున్నాను. రేణుక “తినడం లేదేం?” అని కానీ, “సరిగ్గా వడ్డించుకో.” అని కానీ అనలేదు. ’నేనేమైనా ముష్టిదాన్నా?’ అంటూ రొద పెడుతున్న మనసు నోటిని గట్టిగా నొక్కాను.
భోజనాలయాయి. లివింగ్ రూముకి తిరిగి వచ్చాం. “అయిస్ క్రీమ్ తెస్తున్నాడు రాము.” అన్న రాజీవ్ మాటలకి “ అమ్మో, మరింక అవన్నీ తినే చోటు లేదు పొట్టలో. ఇప్పటికే లేటయింది. వెళ్ళాలి.” అన్న ప్రతిమని ఎత్తి, గిరగిరా తిప్పాలనిపించింది.
నావంక చూసిన విక్రమ్‌కి, “ఇంక పోదాం, పద.” అన్న తీక్షణమైన చూపొకటి పడేశాను. ఏ కళనున్నాడో కానీ, “ఎందుకు? ఏమిటి?” అన్న ప్రశ్నలెయ్యకుండా ‘సరే’ అన్నట్టుగా తలాడించాడు.
గేటు బయటకి వస్తుండగా, లోపలకి ప్రవేశిస్తున్న రేణుక కూతురు మానసి కనబడింది. “అయ్యో ఆంటీ, మిమ్మల్ని మిస్ అయాను. స్నేహితురాలి పుట్టినరోజని పక్క బ్లాకుకి వెళ్ళవలిసి వచ్చింది” అంది.
“ఫరవాలేదులే, మళ్ళీ కలుసుకుందాం.” అంటూ, కార్లో కూర్చున్నాను.
***
ఇంటికి చేరిన తరువాత, ఒక సాండ్విచ్ తయారు చేసుకున్నాను కానీ తినాలనిపించలేదు. డస్ట్ బిన్లో పారేసి వచ్చి, మంచంమీద వాలాను. జరిగిన ప్రతీ సంఘటనా, అప్పుడు తలకెక్కకపోయిన ప్రతీ మాటా గుర్తుకొచ్చి, అలజడి లేపుతున్నాయి మనస్సులో. “ఛీ, అప్పుడే లేచి వచ్చేయాల్సింది. నాకు పౌరుషం రాలేదా? లేకపోతే, చూపించుకోలేనంత చేతకానిదాన్నయానా?” నన్ను నేనే తిట్టుకుంటూ, మధన పడుతున్నాను.
‘ఇన్నేళ్ళలోనూ రేణుక మారనే లేకపోయింది. ఇప్పుడుండేది అంత పోష్ కోలొనీలో కానీ పెళ్ళికిముందు జనతా ఫ్లాటులోనేగా ఉన్నది! రాజీవ్ తన్ని పెళ్ళి చేసుకోవడమే వింతకునేవాళ్ళం అప్పట్లో. పాపం, ఆడపిల్లలందరికీ లైన్ వేసీ వేసీ, ఇంక లాభం లేదనుకుని వయస్సు మీద పడుతుంటే, ఆఖరికి ముక్కూ మొహం కూడా సరిగ్గా లేని రేణుకని పెళ్ళి చేసుకున్నాడు. రేణుక మనస్తత్వం మాత్రం ఇంకా ఆ జనతా గదుల్లోనే ఇరుక్కుని ఉందని నేనెందుకు మరిచిపోయాను! తనకున్న న్యూనతా భావం తెలియదా నాకూ? అత్తవారింట్లో ఎవరితోనూ, తనకి ఇందువల్లే పడదు. చుట్టుపక్కల ఉన్నవాళ్ళతో కలియడం అంటేనూ ప్రాణం పోతుందే! నలుగురి మధ్యలో ఎలా ప్రవర్తించాలో తెలియదు. హాస్పిటాలిటీ ఎలా ఆశించగలిగాను తననుంచి?’ నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను.
నిద్ర వచ్చే సూచనలు దూరదూరంగా కూడా లేవు. నిద్రమాత్ర ఒకటి మింగి, ముసుగు పెట్టుకున్నాను.
***
నెల దాటింది. ఒక సాయంత్రం ప్రతిమ ఫోన్. ఎత్తగానే నవ్వు మాత్రం వినిపించింది. “సంగతేదో చెప్తే, నేనూ నవ్వుతానుగా!” అన్నాను. బలవంతాన్న నవ్వు ఆపుకుని, “ప్రపంచంలో ఎనిమిదవ వింత. చెప్పనా?” ఊరిస్తూ అడిగింది. ఇంకా నేనేమీ అనకముందే, “రేణుక షాట్లు తాగడం మొదలెట్టిందట. తెలుసా?” పగలబడి నవ్వుతోంది.
“ఏ షాట్లు?” అర్థం కాలేదు నాకు.
“ఏవో హాట్ డేమ్లట. నీట్‌గా కొట్టేస్తోందీ మధ్య.”
“నిజంగానే! ఈ మార్పెప్పటినుంచి?”
“తన తోడికోడలు నీరజ లేదూ! ఈ మధ్యేదో వాళ్ళకి సఖ్యత కుదిరినట్టుంది. ఏదో పార్టీకి తీసుకెళ్ళి, ”మరీ పాతకాలపు మనిషిలా బతుకుతున్నావు. ట్రై చేయి. ఇష్టం లేకపోతే వదిలేయొచ్చు.” అందిట. ‘ఐదు షాట్ల తరువాత కూడా నాకేమీ అవలేదు. మరి జనాలెందుకు తాగుతారో, ఏమో!’ అంది రేణుక నాతో.” మళ్ళీ నవ్వు.
“ఏడవనీ. మనకెందుకు?” మాట మార్చాను.
***
నెలయింది. ఆఫీసు పని మీద మా పిన్ని కొడుకు రఘు- ఢిల్లీ వచ్చాడు. వారాంతం, ‘తన ఆఫీసువాళ్ళు ఏదో హోటెల్లో పార్టీ ఏర్పాటు చేశారంటూ’ వెళ్ళాడు. నేనూ, విక్రమ్ కూడా ఎక్కడో కూచిపూడి డాన్స్ ప్రోగ్రాముందంటే వెళ్ళాం. అది పూర్తయి, అక్కడే ఒక చోట డిన్నర్ పూర్తి చేసేటప్పటికి చాలా రాత్రయింది. ‘దారిలోనేగా! రఘుని కూడా పిక్ అప్ చేసుకుందాం.’ అనుకుని ఫోన్ చేస్తే, తను పది నిముషాల్లో హోటెల్ బయటకొచ్చి నిలబడతానన్నాడు.
చేరేటప్పటికి, కారు పార్క్ చేయనవసరం లేకుండా, రఘు బయటే వెయిట్ చేస్తున్నాడు. తన పక్కనే మెట్ల మీద, చిన్న గుంపేదో కనబడింది. మత్తులో తూలుతున్న అమ్మాయొకర్తె, ఇద్దరబ్బాయిలమీద గట్టిగా అరుస్తోంది. చూస్తే మానసి. ఎవరూ పట్టించుకోవడం లేదు.
“విక్రమ్, కారు పార్క్ చేసి రా.” కంగారు పడుతూ చెప్పి, నేను దిగి అటువైపు నడిచాను. “మానసీ, ఇంతకీ ఎవరితో వచ్చావు? అమ్మా, నాన్నకీ తెలుసా”? అడిగితే,
“ఆంటీ, వాళ్ళకి చెప్పే, నా ఫ్రెండు ప్రణవ్‌తో వచ్చాను. మరి ఎక్కడకి మాయం అయిపోయాడో తను. వీళ్ళెవరో కానీ, ఇందాకటినుంచీ అల్లరి పెడుతున్నారు.” మాటలు ముద్దగా వస్తున్నాయి. సరిగ్గా నిలుచోలేకపోతోంది.
“ అక్కా, ఈ అమ్మాయి నీకు తెలుసా? ఇందాక చూస్తే, ఈ కుర్రాళ్ళిద్దరి మీదా పడుతూ ఒకటే వికవికలూ, పకపకలూ. మరిప్పుడేమయిందో, పోట్లాటకి తగులుకుంది.” పక్కనే ఉన్న రఘు తెలుగులో చెప్పాడు.
“నువ్వు నోరు ముయ్యి ముందు.” మందలించాను.
ఈ లోపల విక్రమ్ కారు పార్క్ చేసి వచ్చి, మానసి పరిస్థితి చూసి, తనని కారు వరకూ నడిపించడానికి మాకు సహాయం చేశాడు. కార్లో కూర్చున్న తరువాత మత్తువల్ల కాబోలు, నిద్రపోయింది. వాళ్ళింటి గేటు చేరడానికి అయిదు నిముషాలముందే, తనని కుదిపి లేపాను. బెల్ కొట్టి, ఎవరి అడుగుల శబ్దమో వినిపించిన తరువాత, మానసికి కార్లోంచి దిగడానికి సహాయం చేశాను. నేను తొందర పెట్టడంతో, ఇంకక్కడ ఆగకుండా, విక్రమ్ కారు స్టార్ట్ చేశాడు.
ఉపశమనమో, విడుదలో, ఓదార్పో -ఏదో నిర్వచించలేని అనుభూతి. నిట్టూర్పు విడిచాను.
**** (*) ****
తనదాకా వస్తే కాని తెలియదు . రేణుక ని ఇలాగే .. అందాం. కానీ మానషి ని చూస్తుంటే ఇలా అనిపిస్తుంది … యువత మత్తు పదార్ధాల సేవనలో ప్రమాదాల ఉనికి కనిపెట్టడం లేదు . అది విచారంగా ఉంది .
వనజగారూ, యువత మత్తుపదార్థాల సేవన ఈ మధ్య ఇక్కడ తల్లితండ్రుల ఆమోదంతోనే జరుగుతోంది. అదీ ఇళ్ళల్లోనే- పజామా పార్టీలూ అలాంటి పేర్లతో. అదే ఆశ్చర్యకరమైన విషయం. థేంక్యూ.
“పెద్ద ఇళ్లు లో ఉండే విశాలమైన గదుల లో కూడా ఆవరించుకోగలిగే మౌనపు అసౌకర్యము”; నగర వాతావరణం ఉ ఛ్ఛ తరగతి మనుషులు వ్యవహర శైలి, స్నేహ సంబంధాలు,పొరపొచ్చాలు, కొత్త తరం పై వాటి సంస్కృతి ప్రభావాలు, సమర్థవంతంగా ఆవిష్కరించారు. అభినందనలు.
మీరు తెలుగులో టైప్ చేయడం సంతోషంగా ఉంది హేమచంద్రగారూ.
ఇకపోతే, చాలామంది ఈ కథని అన్వయించుకోరేమో అన్న నా సందేహం మీ కామెంటుతో తీరింది. థేంక్యూ.
బాగుంది కథ కృష్ణవేణీ. ముగింపు బాధ కలిగించింది. ఆత్మ న్యూనత ఉన్న రేణుక వంటి తల్లులు, పిల్లలకి సరైన అవగాహన కల్పించలేకపోవడం సాధారణమే. అందులో.. పెద్ద పెద్ద పట్నాలలో వాళ్ల కదలికలు గమనించడం కూడా కష్టమే. చివరికి రేణుక, రాదికని బాధ పెట్టానని కూడా అనుకోకపోవడం, కూడా సహజంగా ఉంది. చాలా మందికి తెలియదు బాధ పెడుతున్నామని, తెలిసినా పట్టించుకోరు. అభినందనలు.. మంచి కథ అందించారు.
మీనుంచి ఇంత మంచి పొగడ్త రావడం నాకు నిజంగా ఒక సర్టిఫికట్ లాంటిదే భానుమతిగారూ,
అసలిలాంటి కథ రాసినందుకు నన్నెంతమంది తిట్టుకుంటారో అనుకుంటుండాలి. థేంక్యూ. చాలాసార్లని కూడా అనుకోండి.:)
కధ బాగుంది కానీ ఇక్కడ బెంగాలీ పంజాబీ లు అన్న వివక్షత అవసరం లేదేమో ఎందుకంటే ఈ వెట్ పార్టీల్లో మన తెలుగువాళ్ళు సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన వాళ్ళు కూడా తాగడం నేను చూసాను. మీ కధలో రాసిన కల్చర్ చాలా దగ్గరగా చూసాను. ఇంక రేణుక ఆత్మ న్యూనత కు కారణం ఆమె ఆర్ధిక స్థోమత లో వ్యత్యాసం తోనే ఏర్పడ్డదన్నది కరెక్ట్ కాదు.ఒక్కోసారి గొప్ప ఇంటినించి వచ్చి గొప్ప ఇంటి కోడళ్ళైన వాళ్ళు కూడా ఇలా ప్రవర్తిస్తారు. కొంత మంది స్వభావం అంతే ఎదటి వారిని నొప్పించడం. అలాంటి తల్లి పర్యవేక్షణ లో పిల్ల అలా అవడానికి ఎక్కువ అవకాశం ఉంది అది మాత్రం నిజం ఆడ పిల్లలు తల్లిని మగ పిల్లలు తంద్రిని అనుసరించడానికి ప్రయత్నిస్తారు..మిమ్మల్ని విమర్శించాలని కాదు కానీ నా అభిప్రాయం చెప్పాను
సుజలగారూ,
నిజమే మీరు చెప్పినది.
>కారణం ఆమె ఆర్ధిక స్థోమత లో వ్యత్యాసం తోనే ఏర్పడ్డదన్నది కరెక్ట్ కాదు<
రేణుక ప్రవర్తనకి ఏదో కారణం అంటూ ఉండాలి కదా అనిపించి దీన్ని కలిపించానంతే.
ఓపికగా చదివి కామెంటు కూడా పెట్టినందుకు థేంక్యూ.
కథ బాగా రాసారు కృష్ణా.
మీకు నచ్చిందా మాలగారూ? ఈ టాపిక్ మీద రాసినందుకు ఎంతమంది కోప్పడతారో అనుకున్నాను. థేంక్యూ.
ఇటు వంటి సంస్కృతి నాకు బాగా పరిచయమే (మత్తు పదార్ధాల సేవనం వగైరా ). రాధిక, రేణుక పాత్రలు చాలా సహజంగా సాగాయి. కథనం చక్కగా ఉంది
వెంకట్ సురేశ్ గారూ,
“ఇటు వంటి సంస్కృతి నాకు బాగా పరిచయమే”- అవునా?
ఆంధ్రదేశం( రాజకీయ పార్టీ కాదు)లో ఉండకపోవడం వల్ల, ఎంతమంది ఈ కథని అన్వయించుకుంటారో తెలియక కొంచం భయపడ్డాను. ధైర్యం చేసి పంపినప్పటికీ, ఎడిటర్ గారు వేసుకుంటారో లేదో తెలియక అధైర్యపడ్డాను. ఇప్పుడు కామెంట్లు చదివి, ఇది సామాన్యమే అని అందరూ చెప్తుంటే కొంచం ధైర్యం వచ్చింది. థేంక్యూ
కృష్ణవేణి గారు! మంచి కాన్టెంపొరరీ విషయం తీసుకుని చాలా సహజంగా రాసారు. రేణుక మనస్థత్వానికి ., ఆమె పెళ్ళికి ముందు, తరువాత నేపథ్యమే కారణం. ఆత్మ న్యూనత కప్పిపుచ్చుకునే క్రమంలో, ఆమె అలా ముభావంగా, దురుసుగా తయారు అయ్యుండచ్చు. ఆమె భర్త కాంప్రమయిజ్ అయి చేసుకున్న పెళ్ళి. అతని తీరు ఈమెతో ఎలా ఉందో కూడా ఆలోచించాలి. వస్త్ర ధారణ, సౌందర్యపోషణ విషయంలో ఆమెని ఎవరూ ప్రోతఅసహించ.లేదేమో. తన భర్త స్నేహితుల భార్యల ఆధునికత పట్ల ఆమెకు అసహనం ఉండడానికి కారణం, ఆమె వ్యత్యాసానికీ, వివక్షతకీ గురవుతోందేమో. అందుకే నేనిలాగే ఉంటాను అనే మెంటాలిటీ పెంచుకుందేమో. పైగా కూతురు మీద ఇదే ఛాయలు పడడంతో, ఆమెకి తాగుడు మీద ఏవగింపు ఉందేమో. ఒక దిగువ మధ్యతరగతి మనిషిగా ఆమెకి ఆ జివితం పరాయిగా ఉండచ్చు. ఇంక మానసి ఉన్న స్థితి, ఒక్క ఢిల్లీ లోనే కాదండి, మా వైజాగ్ లాంటి చిన్న నగరాల్లో కూడా వ్యాపించింది. అయితే నాకు మీ ఆఖరి వాఖ్యాలు కొంత
చివుక్కుమనిపించాయి. అంటే రాధిక మామూలు మనిషే. తనను అవమానించిన రేణుక కూతురిని అదే మత్తు ఓవర్ డోసులో చూసి, ఆమె ఒకలాంటి రిలీఫ్‌గా ఫీల్ అవ్వడం………అంటే ఒక స్నేహితుల సమస్య ఆమెకి తన ఈగో తృప్తి పరచడం అనేది……….సరే లెండి మీరు మానవ సమాజం గురించి రాసారు. మహనీయుల గురించి కాదు కదా. So all kinds of human weakness are welcome. కధ నాకు నచ్చింది.
శశికళ వోలేటిగారూ,
మీ ఇంత విశదమైన కామెంటు వల్ల మీరు కథని ఎంత శ్రద్ధగా చదివేరో అని అర్థం అవుతోంది. మీ విశ్లేషణ కూడా చాలా బాగుంది. మీకు కథ నచ్చినందుకు కృతజ్ఞతలు.
“నాకు మీ ఆఖరి వాఖ్యాలు కొంత చివుక్కుమనిపించాయి.”-అవును. ముగింపు వేరేలా రాసి ఉండవలసిందేమో అనిపిస్తోంది ఇప్పుడు.
కథ బాగుందండి. పాత్రల స్వభావాలని సహజంగా తీర్చి దిద్దుతారు మీరు. ముగింపు చదివాక, దాదావు 99 శాతం మంది రాధికలానే రిలీఫ్ ఫీల్ అవుతారేమో కదా అని అనిపించింది. కథ బాగుంది, ఆ కింద ఉన్న కామెంట్స్, replies కథలో ఉన్న కొత్త కోణాల్ని చూపినట్లు అనిపించింది
సునీత రమేశ్ గారూ,
“పాత్రల స్వభావాలని సహజంగా తీర్చి దిద్దుతారు మీరు.”-ఇంత మంచి కాంప్లిమెంటే! చాలా థేంక్స్
కథ బాగుందండి. కొత్త తరం పై వాటి సంస్కృతి ప్రభావాలు, సమర్థవంతంగా ఆవిష్కరించారు.
అభినందనలు. #VeeraReddyKesari
వీర రెడ్డి కేసరిగారూ,
మీ పొగడ్తకి థేంక్సండీ
బాగుందండి కధ, యదా రాజ తదా ప్రజా అన్నట్లు, తల్లి తండ్రుల ప్రోత్సాహం తో నియో మిడిల్ క్లాసు పిల్లలు కూడా మట్టుకి బానిసలవడమ్ అందులోను మెట్రోలలో సాధారణం కూడా అయిపొయింది. కాకపోతే చివరిలో అలా అర్ధాంతరంగా ఆపేసారేమొ అనిపించింది. మీ వర్ణనలో మానసిక పరిస్థితులను బాగా వర్ణిస్తారు.మొత్తానికి కధ మాత్రం చాలా బాగుంది
వెంకట్ ఎస్ అద్దంకిగారూ,
“ కాకపోతే చివరిలో అలా అర్ధాంతరంగా ఆపేసారేమొ అనిపించింది.”- మరి ముగింపు ఎలా ఇవ్వాలో అర్థం అవక అలా ఆపేశాననుకుంటాను.
“మీ వర్ణనలో మానసిక పరిస్థితులను బాగా వర్ణిస్తారు.”- ఇది మాత్రం ఎంతో ప్రోత్సాహాన్ని అందించింది నాకు. థేంక్యూ.
కధ బాగుంది. ముఖ్యంగా, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఇంకొంచం నిడివి ఉంటె బాగుండును అనిపించింది.. పరిస్థితులని, ఇరుకుతనాలని వర్ణించటం లో భలే రాసారు కృష్ణ గారూ.. మీ మొదటి కథకీ, దీనికీ ఎంతో తేడా…
పోతే, ముగింపు ఎందుకో అంత నచ్చలేదు. ఇలాంటి తల్లులకి ఇలాంటి పిల్లలే ఉంటారు అన్నట్లుగా జడ్జ్‌మెంటల్ గా అనిపించింది.
మొత్తానికి మంచి ప్రయత్నం
> ఇంకొంచం నిడివి ఉంటె బాగుండును అనిపించింది మీ మొదటి కథకీ, దీనికీ ఎంతో తేడా< బహుశా తెలుగు మెరుగయినందువల్లేమో.
థేంక్యూ
కథ సడెన్ గా ఆగిపోగానే ఏమైనా మిస్ అయ్యానా అనుకున్నాను … ఆలోచించగా మీరు సరి అయిన సమయంలో ఆపేసారని అనిపించింది. ఆ తరువాత పరిణామాలు ఎవరికీ వారు ఊహించుకోగలరు. మీ కథ చదువుతుంటే ఎన్నో నిజ జీవిత పాత్రలు కళ్ళ ముందు కనబడ్డాయి. ఎవరి వ్యక్తిగత అలవాట్లు వారివి, అన్నీ తెలిసి స్నేహం చేస్తున్నప్పుడు తిరిగి మళ్ళి ఆ అలవాట్లను విమర్శించడం హాస్యాస్పదం అని నా అభిప్రాయం. బాగా రాసారు, అభినందనలు.
కే కుమార్ గారూ,
< బాగా రాసారు, అభినందనలు.<
చాలా కృతజ్ణ్జతలండీ.
కథ బాగా రాసారండి
శిద్ధా.నరేశ్ గారూ,
మీకు నచ్చినందుకు కృతజ్ఞతలు
కథ బాగుంది. సుగుణ అని ఒక రచయిత్రి ఉన్నారు. ఆమె రాసారా అనుకున్నాను. కృష్ణవేణి గారు, మీకు అభినందనలు.
“కథ బాగుంది…. మీకు అభినందనలు”- థేంక్యూ అరుణ పప్పు గారూ
“సుగుణ అని ఒక రచయిత్రి ఉన్నారు”- రచయిత్రుల కోవకి చెందే స్థాయికి ఇంకా ఎదగలేదు.
కొన్ని ఆధునిక పోకడలు అనుకునేవి — తాగడాలూ పార్టీయింగ్ ఫ్లర్టింగ్ – ఇత్యాదులన్నీ జీవితం లో భాగాలుగా కలిపేసుకున్నదే నగర నాగరికత అనుకునే అపోహల్లో సంపూర్ణంగా జీవించే వ్యక్తుల్ని పరిచయం చేశారు మీరు. నాగరికత కి బొమ్మా బొరుసుల్లాంటి ఈ పోకడలు నలువైపుల్నుంచీ కమ్మేస్తుంటే ఇలా జీవితాల్నీ, వ్యక్తులనీ చూపిస్తున్న కథలు టైమ్ రికార్డర్స్ లా అనుకోవచ్చేమో కదా వేణి గారు… మీరేమంటారు…??
జయశ్రీ నాయుడు గారూ,
ఫ్లర్టింగ్- నగరాల్లోనే ప్రత్యేకంగా కనిపిస్తుందనుకోను. ఈ అలవాటుకి ప్రాంతీయ, జాతీయ భేదాలుండవు-నేను చూసినంతమట్టుకు.
ఇకపోతే, అవి అపోహలు కావేమో! జీవనశైలుల్లో మార్పంతే. “టైమ్ రికార్డర్స్”- మరేమో, అది నాకూ తెలియదు.
ఇంకేమనగలను?
ఇంటికి పిలిచి అవమాన్చిండం చాల మంది కుసంస్కారులకి అలవాటే …మీ కద లో కళ్ళకి కట్టినట్టు చెప్పారు …
థేంక్యూ నీలిమగారూ.
ఈ కద చదివాకా ఏప్పుడో చదివిన ‘ మరీచిక ‘ కద లోని శ బ రి పాత్ర గుర్తుకు వచ్చింది . మద్యానికి, మాదక ద్రవ్యా లకి ఆధునిక యువత ఎలా బలి అవుతున్నారో ! తలచు కుంటే విచారం గా వుంది ….
కే, శేషు బాబుగారూ,
చదివి కామెంటు పెట్టినందుకు కృతజ్ఞతలు అండీ.
కొన్ని సంఘటనలు, ఆయా సంఘటనల్లొఎని దృశ్య వాతావారణ చిత్రణ ద్వారా పాత్రల్ని, వారి నేపధ్యాల్ని ఎస్టాబ్లిష్ చేస్తూ కథ నడిపించే పధ్ధతి కృష్ణవేణి గారిది. వికల మనస్కుల జీవనశైలిలోనూ ఆ నిలకడలేమి, ప్రవర్తనా వైకల్యం స్పష్తంగా కనబడుతుంది. వాతావరణానికి పాత్రల స్వభావానికి మధ్యనున్న పోలిక చూపించటంలో ఆమె బాగా సక్సెస్ అయ్యారు. ఈమె కథల్లో ప్రత్యేక సందేశాలంటూ ఉండవు. కంపేటిబిలిటీ లేని మానవసంబంధాల ఘర్షణే జీవితంలో ఏముండాలో ఏముండకూడదో నిర్ణయిస్తాయి. మరో ముఖ్యమైన విషయం ఏమంటే ఈమె తనకు తెలియని విషయం గురించి ఊహించి రాసేపని పెట్టుకోరు. ఢిల్లీ లోని కాస్మాపాలిటన్ సంస్కృతి ప్రభావంలో ఉన్న పై తరగతుల్ని అనుకరించే (అకల్టరైజేషన్) మధ్యతరగతి మిడిమేలపు బతుకుల్ని కథలకెక్కిస్తున్నారు. ప్లీజ్ క్యారీ ఆన్.
అరణ్య క్రిష్ణగారూ,
మొట్టమొదటిగా, ఇంత మంచి, విశదమయిన కామెంటుకి కృతజ్ఞతలు.
> నడిపించే పధ్ధతి కృష్ణవేణి గారిది < ఇప్పటివరకూ నాకో పద్ధతి అంటూ ఏదీ లేదనుకుంటాను. ఇంకా experimental stage లోనే ఉన్నాను. కానీ ఈ పద్ధతే కొనసాగిస్తే, monotonous అయిపోతుందేమోన్న సందేహం కూడా ఇంకోవైపు.
“తెలియని విషయం గురించి ఊహించి”- అలా రాయడానికి చాలా అనుభవం కావాలనుకుంటాను మరి.
థేంక్యూ ఒన్స్ ఎగైన్.
బావుంది కృష్ణవేణి గారూ.. ఇలాంటి ప్రవర్తనలతో ఉండే వాళ్ళు చాలా మందిమి మనం చూస్తుంటాం. ఎందుకో తెలీకుండా ద్వేషాన్ని పెంచుకోవడం. అయితే ఎండింగ్ నాకు నచ్చలేదు. అలాంటి వాళ్ళకి ఇలాగే జరుగుతుందని చెప్పడానికి రాసినట్లుంది. ఆమె బాధపడి తన భర్తతో ఇంటికి వచ్చిన వరకూ ఓ జీవన శకలాన్ని చూస్తున్నానా అనిపించేంత నేచురల్ గా రాశారు. అభినందనలు
రాధగారూ, మొట్టమొదటిగా “ అభినందనలకీ నేచురల్‌గా రాశానన్నందుకూ”, కృతజ్ఞతలు.
ఎండింగ్- వీటన్నిటి గురించీ పెద్ద అవగాహన లేదు. నా తెలుగు మెరుగయిందా లేదా అని నా మీద నేను experiment చేసుకోవడమే ఈ రాతలకి కారణం.
“శకలం” అన్న మాటకి అర్థం మీ కామెంటు చూసినప్పటినుంచీ వెతుకుతున్నాను.
శకలము : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు: A part, a portion, a piece. తునక.
సోర్స్: http://www.andhrabharati.com/dictionary/
థేంక్యూ
చక్కటి ప్రయత్నం కృష్ణవేణి గారు. ముగింపు మాత్రం కొంత నిరాశ కలిగించింది, బహుశ కథ శీర్షికకి న్యాయం చెయ్యాలన్న ప్రయత్నం కావచ్చు. లేదా వాస్తవికత కి దర్పణం అని సర్దుకు పోనూ వచ్చు
సునీతగారూ, Quite true.
అసలు ముందు రేణుకతోనే కథ అంతం చేద్దామనుకున్నాను. అందుకే ఆ శీర్షికా, ముగింపూ. ఆ తరువాత నాకు మరేమి తోచిందో కానీ మానసిని కూడా తీసుకు వచ్చాను. కాకపోతే శీర్షికా ముగింపూ మాత్రం సందర్భానుసారంగా మార్చాలేదని కథ పబ్లిష్ అయిన తరువాత ఇలాగే పెట్టిన మొదటి కామెంట్ చూస్తే కానీ తట్టలేదు. థేంక్యూ.
ఈ పార్టి కల్చర్ నాకు బొత్తిగా పరిచయం లేదు కానీ, మనస్తత్వాలని మాత్రం బాగా చూపించారు. ఇలాంటి నియోరిచ్ వాళ్ళు మధ్యతరగతి సాంప్రదాయపు ఇళ్ళల్లో కూడా మనకి కనపడతారు. కథ బావుంది అనటం కన్నా కథనం బావుంది. కొంచెం ఎండింగ్ దగ్గరే చూసుకోవాల్సింది. (ఇంకెలా ఉండాలో నన్నడక్కండే! )
వై రాజ్యలక్ష్మి గారూ,
“కథనం బావుంది.” కృతజ్ఞతలండీ.
“ఎండింగ్ దగ్గరే చూసుకోవాల్సింది”- అవును. అదే చూసుకోలేదు. తొందరపాటు.
“నన్నడక్కండే!”- అడగనండీ.
తాగడం తప్పు కాదు…తాగి వాగడం లేదా గొడవ చెయ్యడం వ్యసనంగా మార్చుకుని మత్తుకి బానిసవ్వడం మంచిది కాదు…అలాగే తాగిన వారి గురించి లేదా అప్పుడప్పుడు సరదాగానే తాగే వారిని తాగుబోతుల్లా చూడడం కూడా సారి కాదు …ఈ కధ ద్వారా నేర్చుకోవలసింది కానీ నేర్పవలసింది కానీ సూన్యం అనేది నా అభి ప్రాయం…ఎవరు తాగిన పరిమితి మించి జరిగేది జరగక మానదు.. అందరూ మానసికం గా బలవంతులు ఉండరు అందుకే కొన్ని దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం చాలా మంచిది అందరికి కూడా… అని నా అభిప్రాయం…ఇలాంటి తాగుబోతుల కధలు తాము చేసే పనికి ఒక ఒప్పుకోలు తనం సమాజం నుంచి ఆశించడం తప్పా… అంత కన్నా ప్రయోజనం ఉండదు సిద్దించదు. బహుశా మరి కొంత మందిని తాగుబోతు తనానికి ఆహ్వానించడం తప్పా… సాధ్యమైనంత వరకు తాగ కుండా వేరే కార్య కలాపాలు ద్వారా మనసుని బుద్దిని నియంత్రించుకుంటే చాలా మంచిది..
శ్రీనివాస్ సత్తిరాజుగారూ,
‘ఈ కధ ద్వారా నేర్చుకోవలసింది కానీ నేర్పవలసింది కానీ సూన్యం’—–హహహ, నిజమే ఒప్పుకుంటున్నాను.
అసలు నాకు కథలు ఎలా రాయాలో ఎలా ముగించాలో, పరిష్కారాలూ నీతులూ ఉండాలో లేదో అన్న కాన్సెప్ట్ కూడా తెలియదు. అందుకే నాకలవాటయిన కాలమ్స్ తప్ప కథల జోలికి ఈ మధ్యన వెళ్ళలేదు.
ఓపికగా చదివి, కామెంటు కూడా పెట్టినందుకు కృతజ్ఞతలు.