” I CAN CONNECT NOTHING WITH NOTHING ” అంటాడు టి.ఎస్. ఇలియట్ తన ” వేస్ట్ లాండ్ ” కవితలో. ఆ కవిత ఆధునిక కవిత్వానికి ఆదిమూలమైన కవిత అని మనమందరమూ భావిస్తాము. ఒక బీజ కణం నుండి ఆవిర్భవించి , ఒక రూపం తో జన్మించి , ఏమిటో ఎందుకో ఈ భూమి మీదకి వచ్చామో తెలీక కొట్టుమిట్టాడుతూ ఉన్న జీవి వేదన కు ప్రతిబింబం ఆ కవిత .ఆ కవిత చదవడం ఒక అపూర్వానుభవం. కాశీభట్ల వేణుగోపాల్ ని చదవడం కూడా అటువంటి ఒక అపూర్వానుభవమే అని చెప్పాలి .
మనసులోని భావాన్ని అక్షరంగా ఆవిష్కరించే ధైర్యం చాలా తక్కువమందికి ఉండచ్చు . అలా అనిపించినది అంతా రాసేయడమేమీ గొప్ప విషయం కాదనీ కొందరికి అనిపించవచ్చు. నిజమే రెండూ సరి అయిన అభిప్రాయాలే. సాహిత్యం అన్నది సమాజ హితం కోసమని ఇదే స్పృహ తో రచయిత రచన చెయ్యాలన్నది ఒక అంశం. రచన ప్రభావం చదువరుల మనసుల మీద పడుతుంది కనుక రచయిత రాసే ప్రతి అక్షరాన్నీ అలోచించి రాయాలన్నది ఒక నాగరిక మైన భావన .
ఇందుకు పూర్తిగా భిన్నమైన రచయిత వేణుగోపాల్ . తన లోలోని అంతర్లోకాల లో తిరుగాడుతున్న ఆలోచన లను సకలం అక్షరాలుగా అభివ్యక్తిస్తాడు ఈయన. ఇది ఆదరణ పొందుతుందా లేదా అన్నది పక్కన పెడితే అసలు మనిషి తన మనసులోని భావనలను యధాతధంగా రాయవచ్చా, అలా రాస్తే వచ్చే లాభమేమిటి అన్నది ఇప్పుడు మన ముందరున్న ప్రశ్న. ” నికషం ” ఒక మనోవైజ్ఞానాత్మక మైన నవల అని చెప్తే దాన్ని నేను సహజమైనదిగా కాక అసహజంగా చిత్రించి నట్లు అవుతుంది. మనో వైజ్ఞానిక మంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు, మనిషి మెదడు మనసు లోని భావనలను చైతన్య స్రవంతిలో వెలువరించడాన్ని మనోవైజ్ఞానిక నవల (సైకలాజికల్ నావల్ ) అంటాము. అవే ప్రమాణాలతో కొలిస్తే ఈ నవలను ఈ పేరుతో పిలవచ్చు.
బంగారపు నిగ్గు తేల్చడానికి నికషోఫలం (గీటురాయి) వాడినట్టు ఈ మనవ జీవితానికి ఏది గీటు రాయి ? అని మనముందు ట్రిల్లియన్ డాలర్ ప్రశ్నను తీసుకొచ్చిన వేణుగోపాల్ అతి సహజమైన రాతగాడు. కానీ ఎక్కువ అసహజత్వాలకి రంగులకి అలవాటు పడిపోయిన మన మనసులు ఈ సహజత్వాన్ని ఇప్పుడు తట్టుకోలేవు అందుకే ఈ రచయిత రచన అసహజంగా వింతగా అనిపిస్తోంది చాల మందికి. ఇది కొందరి నుండి విని చెప్తున్నది ఈ మాట.
మనసు చాలా భయంకర మైనది అందులో సుప్త చైతన్యం లో దాక్కున్న పిశాచాల లాంటి భయంకర మైన ఆలోచనలు ఎన్నెన్నో. ఇవి మనిషిని నిట్టనిలువునా చీలుస్తూ ఆలోచించే మనిషిని యాంత్రికంగా బతికేస్తున్న ఈ పశు ప్రాయపు బతుకుని ప్రశ్నిస్తాయి . ఇలాంటి వేదన అందరికీ కలగదేమి ? అందరూ బాగానే బ్రతుకుతుంటే కేవలం ఒక వేణుగోపాల్ మాత్రమే ఇలా ఎందుకు రాస్తాడు ? ఎందుకంటే వేణుగోపాల్ అంతర్ముఖుడు , తన అంతర్నేత్రం తో చూసినవి అక్షరీకరిస్తాడు . పదాలను ఏర్చి పేర్చి రాయడు ఇవి ఒక ” మో” , ఒక త్రిపుర, ఒక బుచ్చిబాబు , ఇలా ఇంకొందరి పేర్లు చెప్పొచ్చు అందులో వేణుగోపాల్ ని కూడా చేర్చొచ్చు. కానీ ఎవరి ప్రత్యేకత వారిదే , ఈ నిరంతర వేదన తనని తానూ డిస్సెక్ట్ చేసుకుని ఏమి కనుక్కున్నాడో ఆ ఫైండింగ్స్ ని ఒక రీసెర్చ్ రిపోర్ట్ లా ఒక కథ కొన్ని పాత్రల ద్వారా మనకి చెప్పే ప్రయత్నం ఈ రచయితది. కేవలం నికషం ఒక్కటి చదివితే వేణుగోపాల్ అర్ధం కావడం కష్టం. చలం అంటే మైదానం మాత్రమే అనుకున్నట్టుట్టుంది.
” నేను -చీకటి” నవల తో సంచలనం సృష్టించిన వేణు గోపాల్ నేటి నికషం లోనూ అదే స్థాయికి తగ్గకుండా మరొక జీవితాన్ని మనకందించారు. ఈ జీవి పేరు అలెక్స్ రామసూరి ఓ అనాధ, ఓ బొల్లి వ్యాధి వాడు , ఓ రసాత్మక చిత్రకారుడు , ఓ తాగుబోతు ఇన్ని లక్షణాలున్న వాడు అలెక్స్. తనని కని ఎక్కడో కుళ్ళు మోరీ పై పారేసిన తల్లి పై సాధించలేని కక్ష , తనని అనాధాశ్రమం చేర్చిన ఓ మంచి మనిషి గా మానవత్వం పై నమ్మకం , తనని స్వంత బిడ్డగా భావించి తమ ఆస్థి పాస్తులు రాసిచ్చిన క్రిస్టియన్ దంపతుల పై కృతజ్ఞత, తనకంటూ జీవితం లో మిగిలిన మరో రెండు ఆత్మీయ ఆత్మలు స్నేహితులు దుర్గ , కథ మనకు చెప్తోన్న వ్యక్తీ . అలెక్స్ జీవితం లో జరిగే సంఘటనలే కాక అతని చుట్టూ అల్లుకున్న కొందరి జీవితాలను కూడా మనకి ఈ కథ లో కనబడతాయి .
ఒక వ్యక్తి ఆంతరంగిక వ్యధను కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు రచయిత . చిన్న నవలిక ఇది. అలెక్స్ వంటి వ్యక్తి ఎటువంటి తిరస్కారానికి గురవుతాడో , చివరికి వేశ్య కూడా నిరాకరించడం తో ఎంతగా దేహ సౌఖ్యం కోసం పరితపిస్తాడో ఈ అనుభూతులన్నీ మనసుని కలచి వేస్తాయి. ఒకే ఒక్క అమ్మాయి తన కూతురి వయసుది అయిన ప్రియ, నేడో రేపో చనిపోబోయే వ్యాధితో ఉన్న ఆ అమ్మాయి అలెక్స్ ని అభిమానించడం అతనికి ఎంత ఊరటనిస్తుందో , ఆ అమ్మాయి మరణం తో ఇక బంధాలన్నీ తెంచుకుని ఫ్రాన్స్ వెళ్ళిపోతాడు . కథా పరంగా పెద్ద ఇతివృత్తం ఉన్నది కాదు. అయినా ఈ పాత్రలన్నీ సజీవమయిన పాత్రలు. ప్రియ తల్లి గాయత్రి, ముంతాజ్ (వీళ్ళందరికీ కాలేజ్ మిత్రురాలు), కావేరి, దుర్గ ఒక్కో పాత్రా ఒక మానసిక స్తితికి ప్రతీకగా కనిపిస్తాయి.
మనిషిలోని అస్తిత్వ కాంక్షకు స్వార్ధానికి ప్రతీక గాయత్రి. ఒక మామూలు గృహిణి ముంతాజ్. అర్ధం చేసుకునే మనసుండి అనుకంప కలిగిన వ్యక్తీ కావేరి . ఎంత అసహ్యకరమైన పనులు చేసినా అలెక్స్ ని అసహ్యించుకోలేని అతని మిత్రులు . వేణుగోపాల్ గారి శైలి ఇది వరకు పరిచయ మున్నవారికి పెద్దగా ఇబ్బంది పెట్టదు కానీ మొదటి సారి చదివే పాఠకుడికి కొంచం ఇబ్బందిగా అనిపిస్తుంది . భూత .వర్తమాన భవిష్యత్తులను కలిపేసే మాటలు ఆలోచనలు , అంతరంగ విశ్లేషణ ఇవన్నీ రచయిత నిజాయితీని ప్రకటిస్తాయి. ఒక కాఫ్ఫ్కా , కామూని , మిలన్ కుందేరా ని చదివిన వారికీ ఈ చైతన్య స్రవంతి పధ్ధతి కొత్త కాదు. ఇప్పుడు ఈ సమయం లో ఇటువంటి రచనలు రావడం ఒక విధంగా తెలుగు సాహిత్యానికి ఓక కొత్త వొరవడి అని చెప్పొచ్చు శ్రీశ్రీ కధలను, చండీదాస్ ను , చలాన్ని , రావి శాస్త్రిని అందరినీ మా తరం చదువుకున్నాము . వారందరిని ఒక్క వేణు గోపాల్ లో చదువుకోవచ్చు ఇప్పటి తరం .
ఇక ఈ నవల ఇచ్చే సందేశం ఏమైనా ఉందా ? అసలెందుకు ఇటువంటి వైయుక్తిక దు:ఖాలు రాయబడతాయి ? అని కనుక అడిగితే సాహిత్యం సందేశం ఇవ్వాలి అనే వారికీ ఐతే నేనేమీ చెప్పలేను కానీ ఈ నవలలోని ఒక నిజాయితీ గల మనో విశ్లేషణ , మనసు పొరల్లో దాగున్న ఎన్నో భావనలను నిజాయితీ తో మనకి మనం ఆత్మ పరిశీలన చేసుకునే విధంగా చదువరులను ప్రేరేపిస్తాయి . ఇంతకు మించి సాహిత్యానికి వేరే ప్రయోజనముందని నేను అనుకోను. వేణు గారి భాష పట్ల కూడా కొంత అభ్యంతరాలున్నాయ్ కొందరికి కానీ అతి సహజంగా ఉన్నట్లనిపిస్తుంది నాకు. ” కన్య శుల్కం ” లాంటి నాటకం లోనే ప్రదర్శన లోనే స్వేచ్చగా వాడిన (లంజ ) లాంటి పదాలు, సందర్భోచితంగా ఈ నవలలో రావడం అసభ్యంగా మాత్రం లేవు. ఇన్సెస్ట్ గురించి , అలాగే తమకన్నా చిన్న పిల్లలిని కామించడం గురించి ఇవన్నీ మనకి “లోలిత ” లోనే చదువుకున్నాము. అవేవీ కొత్తగా ఐతే ఏమీ లేవు. అన్నిటికి మించినది ఆఖరున అలెక్స్ డైరీ (సగం కాలిన పేజీల ) మిత్రుడు కథ లోని నేరేటర్ చదవడం. అందులో ప్రకటితమైన అలెక్స్ మనోభావాలు , ఆలోచనలు , ఆకాంక్షలు , అసహజమైన కోరికలు వాంఛలు సహజాతాలు ఇవన్నీ మనకి తెలుస్తాయి. మనకి తెలియని మన లోలోపలి భావాలూ , భయాలు వాంఛలు అణగ దొక్కిన కోరికలు ఇవన్నీ ఆ రాతల్లో ఉంటాయి.
వాస్తవానికి వేణు గోపాల్ గారు వాస్తవ రచయిత. అతి సహజమైన భావాలను ఎ ఇన్హిబిషన్స్ లేకుండా రాయగల వారు. అతని మిగిలిన రచనల్లో కుడా ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది. ఆద్యంతమూ చదివించే శైలి శిల్పం భాష ఆయనది. అతని రచనలు చదివిన వెంటనే కాసేపు ఎవరికైనా మనసు మూగ బోతుంది , నిశ్శబ్దం గా మారిపోతాము. ఆతర్వాత అంతర్ముఖులమై మనలని మనం అంతరీక్షణ చేసుకోవడానికి అవకాశం , అవసరాన్ని కల్పిస్తాయనడం లో సందేహం లేదు. “WE ARE ALL HOLLOW MEN” అని ఇలియట్ అన్నట్లు మళ్ళీ ఇలియట్ మాటలతోనే ముగిస్తాను ఈ బోలు తనం ఏదైతే ఉందొ మనలోని దీనికి అద్దం పట్టే రచన వేణుగోపాల్ “నికషం ” ఇది మన మనసులకొక గీటు రాయి. ఈ నవల ఒక కతార్టిక్ ప్రభావం కలిగిస్తుంది.
సాహితీ మిత్రులు ప్రచురణ లో వెలువడిన ఈ నవలికను మిత్రుడైన “మో” కి అంకిత మిచ్చారు వేణు గారు. మంచి నవలను ప్రచురించిన శ్రీశ్రీ విశ్వేశ్వర రావు గారికి అభినందనలు. ఆలోచింప జేసే సాహిత్యానికి ఇంకా ఆదరణ కొరవడ లేదని మరో సారి నిరూపించింది ఈ “నికషం”.
Madam Dhatri garu, mee visleshana baagundi.
chala bavundi visleshana…
అంతరంగం వొక అడివి
భయంకర మనోభావ మృగాలు నిండిన అడివి
Nice to read your article Dear Jagathi.. A writer like . కాశీభట్ల వేణుగోపాల్ is a boon to Telugu literature. Yes.. genius fights during his lifetime with his contemporary world only to be showered with belated praises. Let us hope the Genius gets his due recognition and my sincere thanks to him for his analytic psychic insight and his great narrative techniques.
Your introduction to the novel is good Jagadhdhaatri garu. I shall read it as soon as I can lay my hands on it.
me vishleshana chala bagundi mukyamga srisri chalam chandidas ravisastri ila andarini venugopal chudatam
ఇలియట్ ప్రస్తావనతో మొదలుపెట్టి మళ్ళీ ఇలియట్ తోనే ముగిస్తూ సాగిన ఈ రచన సమీక్షలు ఎలా రాయాలొ చెప్పటమేకాకుండా నవలని విశ్లెషించిన తీరు అమోఘం…ఇప్పటివరకూ వేణుగోపాల్ ని చదవని వారు ఈ నవలేకాక అతని అన్నీ రచనలూ వెంటనే చదివించేవిధంగా ఉందీ రచన. అభీనందనలు జగతీగారు
చీకటికి వెలుతురుకి మధ్య
చిక్కుకున్న మనసులను కదిపే
కాశీభట్ల….
సలాం…