కొత్త పుస్తకం కబుర్లు

గమనాన్ని గమనించే కథలు

ఫిబ్రవరి 2016

తెలుగు వాళ్ల కిప్పుడు రెండు రాష్ట్రాలు యేర్పడ్డాయి. కానీ ఈ రెండు రాష్ట్రాల్లోని తెలుగువాళ్ల సంఖ్య యెంతో, అంతమంది తెలుగువాళ్లు రెండు రాష్ట్రాల బయట వున్నారు. తొలిరోజుల్లో చాలా చిన్న గొంతుగా ప్రారంభమైన వాళ్ల సాహితీస్వరం క్రమంగా పెరిగి 2000 నాటికి స్పష్టంగా వినబడసాగింది. తమిళనాడులో హోసూరు నుంచి తెలుగు సాహిత్యం వెలువడడం ప్రారంభించాక గానీ, అక్కడి తెలుగువాళ్ల వునికీ, మనికీ, యితరులకు తెలియలేదు. యిప్పుడు రాష్ట్రేతర ఆంధ్రులు తమదైన జీవితాన్ని సాహిత్యీకరించే పనిని నిర్దుష్టంగా చేసుకుపోతున్నారు. సమకాలీన సాహిత్య ప్రక్రియలన్నింటిలోనూ బలంగా వున్న కథానిక వాళ్ల వ్యక్తీకరణకు బాగా దోహదం చేస్తోంది. గత అయిదారేళ్లుగా అమెరికాలో స్థిరపడిన తెలుగువాళ్లు రాస్తున్న కథలు తెలుగు ప్రవాస జీవితాలను (Diaspora) ప్రతిభావంతంగా పరిచయం చేస్తున్నాయి. అమెరికా ప్రవాస కథానికలకు యీ గుర్తింపు తీసుకొచ్చిన ముఖ్యమైన కథకుల్లో తాడికొండ శివకుమార శర్మ గారు వొకరు. గత దశాబ్దకాలంలో ఆయన రాసిన యీ యిరవై కథలను యిప్పుడు ఓ సంపుటి రూపంలో చదివినప్పుడు ఆయన యీ పనిని యెంత సాధికారంగా, ప్రతిభావంతంగా చేశారో అర్థమవుతుంది.

అమెరికా దేశం యిప్పటికీ పూర్తిగా పరిణామాన్ని పొందని (Melting pot అంటారు) దేశం. వివిధ దేశాలవాళ్లతో, రకరకాల జాతులవాళ్లతో కలిసి అదొక సంక్లిష్టమైన మానవ సమాజంగా తయారవుతోంది. వుద్యోగాల్ని వెతుక్కుంటూ అక్కడికి వెళ్లిన భారతీయులు గూడా అక్కడి సమాజంలో భాగమైపోక తప్పదు. వాళ్ల పిల్లలు అమెరికన్లే అవుతారు. భారతీయతని మరవలేని తొలితరం వాళ్లకూ, కొత్త దేశీయత చేత తయారు చేయబడిన మలితరం వాళ్లకూ మధ్య సంఘర్షణ తలెత్తక తప్పదు. యిండియానుంచీ వెళ్లిన తండ్రి తన కూతురు హార్వర్డులో చదవాలనీ, చదరంగంలో గ్రాండ్ మాస్టర్ కావాలనీ కోరుకోవడం సహజం. కానీ అమెరికనయిజయిన ఆ అమ్మాయి యెంట్రెన్సుటెస్టు కోచింగుకు వెళ్లననీ, టెన్నిస్ ఆడడం మానననీ మొరాయిస్తుంది. తన కూతురు కూచిపూడి నాట్యం నేర్చుకోవడానికీ, వయిలెన్ సాధన చేయడానికీ అతను అంగీకరించకపోవడానికి గూడా భారతదేశంలో సంగీతానికున్న నిరాదరణే కారణమని అతను గుర్తించలేడు. కానీ తమ యిష్టాయిష్టాలను తమ పిల్లపైన రుద్దడం అమెరికాలో సాగదు. వాళ్లో ఫోన్ చేస్తే పోలీసులు తల్లిదండ్రులను ‘అట్రాసిటీ’ కేసుమీద అరెస్టు చేసి పారేస్తారు. అలిగిన పిల్లలు కోపంతో కాస్సేపు కనిపించకపోతే అమెరికాలోని తల్లిదండ్రులు రకరకాల అనుమానాలతో భయభ్రాంతులవుతారు. చివరకు అక్కడి అమెరికన్ పోలీసు గూడా అలిగి వెళ్లిపోయిన పధ్నాలుగేళ్ల అమ్మాయితో “నా కిద్దరు పిల్లలు. ఇద్దరూ నీకంటే పెద్దవాళ్లే. ఐ కెన్ టెల్ యు దట్ బిహైండ్ దట్ క్లౌడ్ ఆఫ్ మాడ్నెస్ దేర్ యీజ్ ఎ సన్ కాల్డ్ లవ్. ది క్లౌడ్ ఈజ్ టెంపొరరీ. ఇట్ విల్ క్లియర్. నీ విషయంలో అది ఈ పాటికి క్లియర్ అయిపోయింది. ఐ విల్ ప్రూవ్ ఇట్ టు యూ … టునైట్ – ఇన్ టెన్ మినిట్స్. ఫస్ట్ ఐ షుడ్ కాల్ దెం. ముందుగా మీ నాన్న నెంబర్ నాకివ్వు… మీ అమ్మాయి ఒక అంకుల్ని తీసుకు వస్తోందని చెబుతాను” అంటాడు.

భారతదేశంలో పిల్లలకు తల్లిదండ్రులతోబాటు బంధువులూ, స్నేహితులూ, వుపాధ్యాయులూ వుంటారు. ముఖ్యంగా తాతలూ, అమ్మమ్మలూ, నాన్నమ్మలూ, బాబాయిలూ వుంటారు. యెన్ని రకాల గొడవలున్నా వొక సమాజం గూడా వుంటుంది. వాళ్ల వెనకో వూరు వూరే వుంటుంది. యీ విషయాన్ని గుర్తించిన హిల్లరీ క్లింటన్ లాంటివాళ్లు “పిల్లల్ని పెంచాలంటే వొక వూరు వూరే కావాలి” అని చెబుతున్నారు. (ఆమె రాసిన పుస్తకం పేరు It takes a village). యీ విషయాన్ని అమెరికాలో జీవిస్తున్న తెలుగువాళ్లు సైతం ఆలస్యంగా గుర్తించడమే జీవితంలోని వైచిత్రి. యిటువంటి సంక్లిష్టమైన జీవన విధానాన్ని చిత్రించడానికి రచయితకు సునిశితమైన దృష్టితోబాటు నిర్మోహత (detachment) కూడా వుండాలి. అప్పుడే “ది లోన్ డ్రమ్మర్” వంటి కథలు రాయగలుగుతారు. జీవితమే మూలసూత్రంగా, వాస్తవికతే ఆలంబనగా రాసే యిటువంటి కథలు చదువుతున్నప్పుడు కెనడా జీవన విధానాల్ని గుర్తించి కథలు రాసిన “ఆలిస్ మన్రో” గుర్తుకొస్తారు. ఆమె కథల్లో కూడా సిధ్ధాంతాల కతీతమైన, సమీకరణలకు లొంగని, సంక్లిష్టమైన జీవనగతులు పాఠకుల్ని విస్మయుల్ని చేస్తూ వుంటాయి.

అమెరికాలో స్థిరపడిన తొలితరం భారతీయులు మాత్రం తమదైన సంస్కృతీ సంప్రదాయాలను మరవలేరు. అమెరికాలో చనిపోయిన తన తమ్ముడికి ఉదారంగా విరాళాల నిచ్చిన అమెరికన్ల రుణం తీర్చడంకోసం, వొక అన్న తానూ అమెరికాకు వెళ్లి, అక్కడే డబ్బు సంపాదించి, వాళ్లకు అప్పుతీర్చడానికే జీవితాన్నంతా వెచ్చిస్తాడు (నాకు తెలిసిన టెన్సింగ్ నార్కే). మరో వ్యక్తి తాను చనిపోయినప్పుడు తనని పూడ్చడం కోసం తన స్వగ్రామం నుంచీ 23 కిలోల మట్టిని (యిండియా నుంచి విమానంలో అమెరికాకు వెళ్లేటప్పుడు 23 కిలోల బరువును మాత్రమే అనుమతిస్తారు) తీసుకెళ్తాడు. యింకోవ్యక్తి అమెరికాలో ఐటీ సాఫ్ట్వేర్ వుద్యోగాలు మారిపోయినప్పుడు, తనకు వారసత్వంగా వచ్చిన అర్చక వృత్తిని చేపట్టడానికి సందేహించడు.

వొకప్పుడు ఈ పరిస్థితులకు భిన్నంగా తల్లిదండ్రులు అమెరికనయిజవడమూ, పిల్లల్లో పాతకాలపు బుధ్ధులు మిగిలి వుండడమూ కూడా సంభవించవచ్చు. భర్త చనిపోయిన తర్వాత వొక భార్య తన వయసున్న మరోవ్యక్తితో కలిసి జీవించడం (Living together) మొదలెడుతుంది. అయితే ఆమె పిల్లలు మాత్రం అందుకు వొప్పుకోరు.

తానే వో కథలో చెప్పినట్టుగా శివకుమారశర్మగారు యిప్పటికీ, యెప్పటికీ భారతీయుడే (Still an Indian). విదేశాలకు వెళ్లి స్థిరపడిన భారతీయ విద్యాధికులు తమ మాతృదేశంలోని జరిగే ప్రతివిషయాన్నీ అప్రమత్తతతో పట్టించుకుంటూనే వుంటారు. తమ దేశంలో మంచిని పెంచడం కోసం, చెడును రూపుమాపడం కోసం తమ శక్తులనంతా వినియోగిస్తారు. శర్మగారి లాంటి రచయితలు తమ జన్మభూమిలో జరుగుతున్న అరాచకాలను తూర్పారబట్టడం కోసం కథలు రాస్తూ వుంటారు. స్వార్థమూ, లంచగొండితనమూ, దేశంలోని రాజకీయాల నెంతగా దిగజార్చాయో చూసి విలవిల లాడిపోతారు (స్వాభిమాన వ్రతం, సున్నాల పక్కన ఒకటి, ఊహాతీతం మొదలైన కథలు). దేశంలోని మంచిని చూసినప్పుడు పరవశమై పోతారు (రేపటి ఆశాకిరణాలు). తమ జీవితపు జ్ఞాపకాలను తలచుకున్నప్పుడు ఆనందంతో పులకించిపోతారు (పంచముఖి, ఆ నవ్వుకోసం). సార్వజనీనమైన సత్యాల అన్వేషణకు గూడా పూనుకుంటారు (రిచర్డ్ బాక్ నవలిక జొనాతన్ లిగింగ్స్టన్ సీగల్ను జ్ఞాపకం చేసే ‘శిఖరాగ్రాన,’ ‘పంచముఖి,’ ‘డెడ్మేన్ పేరడాక్స్’).

శివకుమార శర్మగారి కథల్ని చదువుతున్నప్పుడు పాఠకుడు మళ్లీ వొకసారి తన జీవితాన్ని గురించీ, తన ప్రపంచాన్ని గురించీ పునర్మూల్యాంకన చేసుకుంటారు. సాగివచ్చిన దూరాన్ని పరిశీలించి తన గమనమెలా సాగుతోందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. తనలోని లోపాల్ని వెదికిచూసి, తనను మరింత మంచి మానవుడిగా తయారు చేసుకోవడానికి సన్నద్ధమవుతాడు. వుత్తమ సాహిత్యాని కింతకంటే మించిన ప్రయోజనమింకేముంటుంది?

మధురాంతకం నరేంద్ర
5 అక్టోబరు 2015
తిరుపతి

(‘విదేశగమనే’ కథాసంకలనం ముందుమాట నుండి)

పుస్తకం ప్రతులకు:
http://www.avkf.org/BookLink/display_titled_book.php?book_id=17329
AVK Fundation
Ph: 040-64512224

**** (*) ****