కొన్ని కవితలు చదవడానికి, చదివి కవిత లోని ఆర్తిని అనుభవం లోనికి తెచ్చుకోవడానికి కేవలం సాహిత్య విద్యార్థులం అయితే సరిపోదు. మరీ ముఖ్యంగా, శక్తివంతమైన గొంతుక వున్న ఒక దళిత కవి రాసిన కవితనీ, అతడి గొంతు లోని బాధనీ, ఆగ్రహాన్నీ సహానుభూతితో అర్థం చేసుకోవడానికి వేల సంవత్సరాలుగా ఈ దేశం వర్ణ వ్యవస్థ కుంపటి పైన ఎట్లా తగలబడి పోతున్నదో, ఆ కుంపటిని రాజేస్తూ వున్న పురాణాలు ఏమిటో, స్మృతులేమితో విశ్లేషించుకుని అర్థం చేసుకునే హృదయం కావాలి. ప్రపంచం ఆధునిక కాలంలోకీ, అత్యాధునిక కాలంలోకీ వెళ్లిందని సంబరాలు జరుపుకునే కాలంలో కూడా గ్రామాలలోనూ, నగరాల లోనూ, చివరికి ఘనత వహించిన విశ్వవిద్యాలయాల లోనూ ఇంకా కొన్ని కులాల వాళ్ళు వెలివాడలకు ఎందుకు పరిమితం చేయబడుతున్నారో, వాళ్ళను అట్లా పరిమితం చేస్తోన్న శక్తుల రాజకీయాలేమిటో తెలిసి వుండాలి.
ఇంతా చేసి, కులం మిగిల్చిన అవమానాల గాయాలని తడుముకుంటూ కవిత చెప్పే ఒక దళిత కవి ఈ దేశం నుండి కోరుకుంటున్నది ఏమిటి? తనని మనుస్మృతి సృష్టించిన అస్ప్రుశ్యునిగా కాకుండా, మానవత్వం సృష్టించిన మనిషిగా చూడమని. కవి ‘యువక’ (కలేకూరి ప్రసాద్) మాటల్లో చెప్పాలంటే – ‘పిడికెడు ఆత్మ గౌరవాన్ని’ యివ్వమని.
కలేకూరి ప్రసాద్ రాసిన ఈ ‘పిడికెడు ఆత్మ గౌరవం కోసం’ విస్తృత ఆదరణ పొందిన కవిత. ఈ దేశ చరిత్ర లోను, పురాణాల లోను ఉటంకించిన దళితుల, శూద్రుల ప్రస్తావనని స్పృశిస్తూ కూడా ఎక్కడా ఉపన్యాస చాయలు లేకుండా గొప్ప ఆర్తితో చివరి వరకూ సాగిపోవడం ఈ కవిత ప్రత్యేకత.
కవిత లోని దాదాపు ప్రతీ లైను మనల్ని ఈ దేశ పురాణాల చీకటి మూలల్లోకో, ఈ దేశ చరిత్ర మకిలి అధ్యాయాల్లోకో తీసుకు వెళ్తుంది. ఆ చీకటి మూలల్లోనో, ఆ మకిలి అధ్యాయాల్లోనో దుఃఖించే దళితుల్ని చూపిస్తుంది!
పిడికెడు ఆత్మ గౌరవం కోసం
నేను ఎప్పుడు పుట్టానో తెలియదు గానీ
వేల ఏళ్ళ క్రితం ఈ గడ్డ మీదే చంప బడ్డాను
‘పునరపి మరణం – పునరపి జననం’
నాకు కర్మ సిద్ధాంతం తెలియదు గానీ
మళ్ళీ మళ్ళీ మరణించిన చోటనే పుడుతున్నాను
నా దేశం ఈ దేశంలో కరిగిపోయి
గంగా సింధూ మైదానమైంది
నా కనుగుడ్లు కన్నీరై ద్రవిస్తే
ఈ దేశంలో జీవనదులు ప్రవహించాయి
నా సిరల నుండి జీవధాతువులు స్రవిస్తే
ఈ దేశం సస్య శ్యామలమై సిరులు కురిసింది
త్రేతా యుగంలో నేను శంభూకున్ని
ఇరవై ఏళ్ళ క్రితం నా పేరు కంచికచెర్ల కోటేశు
నా జన్మస్థలం కీలవేన్మని కారంచేడు నీరుకొండ
ఇప్పుడు కరుడుగట్టిన భూస్వామ్య క్రౌర్యం
నా గుండెల మీద నాగేటి కర్రులతో పచ్చ బొట్టేసిన పేరు చుండూరు
ఇక చుండూరు నామవాచకం కాదు సర్వనామం
ఇప్పుడు ప్రతి గుండె ఒక చుండూరు – రగిలే రాచ పుండూరు
నేను జన సమూహాల గాయాన్ని గాయాల సమూహాన్ని
తర తరాలుగా స్వతంత్ర దేశంలో అస్వతంత్రున్ని
అవమానాలకూ అత్యాచారాలకూ మాన భంగాలకూ చిత్ర హింసలకూ గురై
పిడికెడు ఆత్మ గౌరవం కోసం తలెత్తిన వాడిని
ధన మదాంధ కులోన్మత్తుల రాజ్యంలో
బతకడమే ఒక నిరసనగా బతుకుతున్న వాడిని
బతికి వున్నందుకు పదే పదే చస్తున్న వాడిని
నన్ను బాదితుడని పిలవకండి
నేను అమరుణ్ణి నేను అమరుణ్ణి నేను అమరుణ్ణి
లోకానికి సంపదను మిగిల్చేందుకు క్షామాన్ని మింగిన
గరళ కంటున్ని నేను
శీర్షాసనం వేసిన సూర్యోదయాన్ని
నిటారుగా నిలబెట్టేందుకు
సూర్యుని నెత్తి మీద ఈడ్చి తన్నిన వాడిని
రగిలే గుండె కొలిమిలో నినాదాలు కురిపిస్తున్న వాడిని
నాకు జాలి జాలి మాటలొద్దు కన్నీటి మూటలొద్దు
నేను బాదితున్ని కాను అమరుణ్ణి
ఎగిరే ధిక్కార పతాకాన్ని
నాకోసం కన్నీరు కార్చకండి – మీకు చాతనైతే
నగరం నడిబొడ్డున ఖననం చేయండి
జీవన రవళిని వినిపించే వెదురు వనాన్నై వికసిస్తాను
నా శవాన్ని ఈ దేశం ముఖచిత్రంగా ముద్రించండి
చరిత్ర పుటల్లోకి సుందర భవిష్యత్తునై పరివ్యాప్తిస్తాను
ఒక పెను మంటల పెనుగులాటనై
మళ్ళీ మళ్ళీ ఈ దేశంలోనే ప్రభవిస్తాను
‘నేను ఎప్పుడు పుట్టానో తెలియదు గానీ/వేల ఏళ్ళ క్రితం ఈ గడ్డ మీదే చంప బడ్డాను’ అని ప్రారంభించాడు కవితని. నిజమే! ఈ దేశంలో వర్ణ వ్యవస్థ ఎప్పుడు సృష్టించ బడిందన్న ప్రశ్నకు చారిత్రక ఆధారాలు లేవు గానీ, అది వెలుగులోకి వస్తూనే కొందరిని పంచముల పేరిట సమాజానికి అంటరాని వాళ్ళను చేసింది.
‘పునరపి మరణం – పునరపి జననం’ అంటూ కవి ఆది శంకరాచార్యుని ‘భజగోవిందం’ ప్రస్తావన తీసుకొచ్చాడు కవి.
ఇంతకూ, శంకరాచార్య ఏమన్నాడు? ‘ మరల మరల జన్మిస్తూ, మరల మరల మరణిస్తూ, తిరిగి తల్లి గర్భమున శయనిస్తూ, ఈ సంసారాన్ని దాట జాలక నానా బాధలకు గురవుతూ వున్న నాకు ముక్తి ప్రసాదించు మురారీ!‘
భజగోవింద పారాయణం చేసిన సవర్ణులకు సంసారం నుండి ముక్తి లభించిందేమో గానీ, వేల ఏళ్ళు గడిచినా వర్ణ వ్యవస్థ చట్రం నుండి దళితులకు విముక్తి లభించలేదని కవి వాపోతున్నాడు.
‘నా దేశం ఈ దేశంలో కరిగిపోయి / గంగా సింధూ మైదానమైంది’ అంటున్నపుడు, భారత దేశం వెలుపలి నుండి వలస వచ్చిన ఆర్యులు ఈ దేశ మూలవాసుల నాగరికతను ధ్వంసం చేసి సింధూ నాగరికతను (Indus Valley Civilisation) నిర్మించిన చరిత్రను తవ్వుతున్నాడు కవి.
అట్లా ఈ దేశంలోకి చొరబడిన వాళ్ళు ఇక్కడి మూలవాసుల శ్రమతో పంటలు పండించారు అని చెప్పడానికి ‘నా సిరల నుండి జీవధాతువులు స్రవిస్తే / ఈ దేశం సస్య శ్యామలమై సిరులు కురిసింది’ అంటున్నాడు.
యుగాలు మారినా దళితుల వెతలు మారలేదని చెప్పడానికి, ‘త్రేతా యుగంలో నేను శంభూకున్ని / ఇరవై ఏళ్ళ క్రితం నా పేరు కంచికచెర్ల కోటేశు’ అని అంటున్నాడు.
శంభూకుడు ఎవరు ?
రాముడు రాజ్యమేలే కాలంలో ఒక బ్రాహ్మణుడు, అకాల మృత్యు వాత పడిన తన కొడుకు శవాన్ని రాముడి ముందు పెట్టి, రాజ్యంలో ఎదో అరిష్టం జరుగుతున్నందువల్లనే తన కొడుకు ఇట్లా మరణించాడని వాపోతాడు. అప్పుడు ఆ అరిష్టానికి కారణం శూద్రుడైన శంభూకుడు బొందితో స్వర్గం వెళ్ళడానికి తపస్సు చేస్తూ వుండడమే అని తెలుసుకుని, హుటా హుటిన వెళ్లి, తపస్సులో వున్న శంభూకుని శిరస్సు ఖండిస్తాడు.
మరి, కంచికచెర్ల కోటేశు ఎవరు ??
భారత దేశం స్వతంత్ర దేశంగా మారిన తరువాత ఒక అగ్ర వర్ణ యువతిని ప్రేమించిన నేరానికి ఆ అగ్ర వర్ణ భూస్వాముల చేతిలో హతమైన ఒక దళిత యువకుడు.
చుండూరు దళితుల ఊచకోత నేపథ్యంలో రాసిన కవిత కాబట్టి, ఈ సంఘటన కన్నా ముందు జరిగిన దళితుల ఊచకోత సంఘటనలను ఉటంకిస్తూ ‘నా జన్మస్థలం కీలవేన్మని కారంచేడు నీరుకొండ / ఇప్పుడు కరుడుగట్టిన భూస్వామ్య క్రౌర్యం / నా గుండెల మీద నాగేటి కర్రులతో పచ్చ బొట్టేసిన పేరు చుండూరు ‘ అంటున్నాడు కవి.
వేతనాల పెంపు డిమాండ్ చేసినందుకు దాదాపు 44 మంది దళిత కూలీలను అగ్ర వర్ణ భూస్వాములు ఊచకోత కోసిన సంఘటన 1968 ప్రాంతంలో తమిళనాడు లోని కీలవేన్మనిలో జరిగింది. 1985 లో కారంచేడు, 1987 లో నీరుకొండ హత్యాకాండలు జరిగితే, చుండూరు ఘటన 1991 లో జరిగింది.
దేశానికి స్వాతంత్రం వొచ్చి, దళితులకు చదువులు, ఉద్యోగాలలో రాజ్యాంగ పరమైన రక్షణలు కల్పించబడిన తరువాత కాలంలోనే దళితుల పైన దాడులు స్థలాలనే కవి తన జన్మ స్థలం అంటున్నాడు. బహుశా, డాక్టర్ అంబేద్కర్ వేసిన బాటలో చదువుకుని, ప్రశ్నించడం మొదలు పెట్టాకే దళితుల పైన దాడులు ఎక్కువ అయ్యాయనీ, అందుకే కవి ఆయా స్థలాలను తన జన్మ స్థలం అంటున్నాడని అనిపిస్తుంది ! చుండూరు ఘటనతో దళితుల పైన దాడులు పరాకాష్టకు చేరడంతో ‘చుండూరు / రాచ పుండూరు / నామవాచకం కాదు సర్వనామం అంటున్నాడు’.
‘బతకడమే ఒక నిరసనగా బతుకుతున్న వాడిని ‘ అనడంలో తరాలు మారినా మారని దళితుల స్థితి హిందూ వర్ణ వ్యవస్థ పట్ల ఒక తీవ్ర నిరసనగా నిలబడి వుందని చెప్పడమే!
తన మరణం, వర్ణ వ్యవస్థ పైన పోరాటం కొనసాగడానికి ఒక స్పూర్తిగా నిలవాలనే ఆశతో కవి – ‘నన్ను బాధితుడు అని పిలవకండి / నేను అమరున్ని ‘ అని పదే పదే చెప్పడం కనిపిస్తుంది.
ఇదంతా సరే – భారతీయ సమాజాన్ని కేవలం ఒక వర్గ వ్యవస్థగానే అర్థం చేసుకునే ప్రయత్నం చేసిన మార్క్సిస్ట్ ఆలోచనా ధోరణిని పక్కన పెట్టి, భారతీయ సమాజాన్ని వర్ణ / కుల వ్యవస్థగానె అర్థం చేసుకోవలసి వుంటుందని చెప్పిన అంబేద్కర్ – పూలే ఆలోచనా ధోరణిని అక్కున చేర్చుకున్నానని చెప్పడం కోసమేనా ‘శీర్షాసనం వేసిన సూర్యోదయాన్ని / నిటారుగా నిలబెట్టేందుకు / సూర్యుని నెత్తి మీద ఈడ్చి తన్నిన వాడిని’ అని అంటున్నాడు?
ఇవాళ కొత్తగా దళితుల్ని దేశద్రోహులుగా చిత్రించే ప్రయత్నం చేస్తోన్న వాళ్ళను కవి కలేకూరి ప్రసాద్ అప్పుడే ఊహించి రాసాడా అన్నట్టు వున్న ఈ కవితా వాక్యాలు చదవండి -
‘మీకు చాతనైతే / నగరం నడిబొడ్డున ఖననం చేయండి / నా శవాన్ని ఈ దేశం ముఖచిత్రంగా ముద్రించండి / చరిత్ర పుటల్లోకి సుందర భవిష్యత్తునై పరివ్యాప్తిస్తాను / మళ్ళీ మళ్ళీ ఈ దేశంలోనే ప్రభవిస్తాను’
దేశ మూలవాసులైన దళితులను వెలివాడల లోకి విసిరి వేసిన ఈ దేశ అమానవీయ వర్ణ వ్యవస్థను ధిక్కరిస్తూ ఎగిరిన పతాక ఈ కవిత!
ముఖ్యంగా, ‘మీకు చాతనైతే / నగరం నడిబొడ్డున ఖననం చేయండి / నా శవాన్ని ఈ దేశం ముఖచిత్రంగా ముద్రించండి’ లాంటి చివరి పాదాలు చదువుతున్నపుడు మీకు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇటీవలి సంఘటనలు ఏవైనా జ్ఞప్తికి వొచ్చాయా ?!
**** (*) ****
Photo Credit: Telugu Wiki
ప్రజాకవి, సాహితీ విమర్శకుడు, మార్క్సిస్టు విశ్లేషకుడు, దళిత విప్లవ ఉద్యమకారుడు జననాట్యమండలి, విప్లవ రచయితల సంఘం సభ్యుడు కలేకూరి ప్రసాద్ ‘పిడికెడు ఆత్మ గౌరవం కోసం’ కవిత లోని ఆర్తిని, వర్ణ వ్యవస్థ వివక్షత బాదితుల బాధనీ ప్రస్తావించిన విజయ్ కుమార్ గారికి నెనర్లు.
నాకు జాలి మాటలొద్దు – కన్నీటి మూటలొద్దు
నేను బాధితుణ్ణి కాదు – అమరుణ్ణి
ఎగిరే ధిక్కార పతాకాన్ని
నా కోసం కన్నీరు కార్చకండి
మీకు చేతనైతే
నన్ను నగరం నడిబొడ్డున ఖననం చేయండి
జీవన రవళిని వినిపించే వెదురువనాన్నై వికసిస్తాను.
కలేకూరి ప్రసాద్ నుండి రోహిత్ వేముల వరకూ ఎన్నెన్ని ఆక్రోశాలో.
“మళ్ళీ ఈ బాధితులైన ప్రజల నుంచి కొత్త నాయకుడు వస్తాడని నేను ఆశిస్తున్నాను” అన్న కలేకూరి అన్న కల నిజం కావాలని ఆశిస్తూ …
అన్నీ బాగున్నాయి.కలేకూరి,ఎండ్లూరు గార్ల కవితలు చాలా బాగున్నాయి
అన్న నీకు జెభీంలు చెప్పడం తప్ప అమీ చేయగలం ….
అన్న నువ్వు గోప్పోడువు అన్న….. ఈనీచం ఐన జనాన్ని వదిలి వెళ్ళిపోయావు
Nijam edesamlo Varna Kula vyavasthalu unnamtha varaku dalithula mida dadulu jaruguthune umtae.kani dalithululo vhaithanya ranamtha varaku Emi cheyalemu sati dalithudiki annayam jaruguthumte chusthade kani radu
” నిజం. ఈ దేశంలో వర్ణ కుల వ్యవస్థలు ఉన్నంత వరకు దళితుల మీద దాడులు జరుగుతూనే ఉంటాయి. కాని దళితులుల్లో చైతన్యం రానంత వరకూ ఏమి చేయలేము. సాటి దళితుడికి అన్నాయం జరుగుతుంటే చూస్తాడే కాని రాడు. ” ~ శేఖర్ బాబు ఎడ్ల
( శేఖర్ బాబు గారు మీ కామెంట్స్ తెలుగులో రాయడానికి, ఇక్కడి బాక్స్ లో ఇంగ్లీషు అక్షరాల్లో ( ఫొనెటిక్ గా ) టైపు చేస్తే అవి తెలుగు అక్షరాల్లోకి పదాలుగా వాక్యంగా మారుతుంది. గమనించగలరు. )
మంచి విశ్లేషణ విజయ్ కుమార్ గారు
గుడి లోనికి ‘గబ్బిలం’ రావచ్చు కాని ఈ ‘నాలుగు పడగల హైందవ నాగరాజు ‘ ఒక అంటరాని వాడిని రానివ్వదు. తరతరాల బాధని గుర్రం జాషువా గారు వెలి బుచ్చారు. ఆ బాధ ఇంకా గాధలు గా కొనసాగుతోంది. ఫులే అంబేద్కర్ ల సమాజం లోని ఈ నికృష్ట బ్రాహ్మణా క్రౌర్యాన్ని విరిచినా ఇంకా వెళ్ళు భూమి లో పాతుకు పోయి వున్నాయి. మన చరబందరాజు అడిగిన ‘ఏ కులం అబ్బి ! నీది ఏ మతం అబ్బి !’ అని ప్రశ్నిస్తూనే వుంది ఈ కరడు కట్టిన కుళ్ళిన బ్రాహ్మణ ఆధిపత్య సమాజం. కనీసం ఇప్పడికి ఐన శ్రీశ్రీ విప్లవ శం ఖం లో రాసినట్టు “కులం కులం అని కుశ్చి తాలు పెంచుకోకు ! మతం మతం అని మాత్సల్యం తెన్చుకోకు !…” అని సమతా మానవుడు నినదించాలి ..!
“వెలివాడల గుండెల నిండా నిప్పుల నినాదాల్ని వెలిగించి, అంటరాని బతుకుల్లో పిడికెడు ఆత్మగౌరవాన్ని ప్రసరించిన ప్రత్యామ్నాయ సాంస్కృతిక సమర యోధుడు కలేకూరి ప్రసాద్”.
“భూమి కోసం..అత్యాచారాల నిరోధం కోసం.. గౌరవప్రద జీవితం కోసం..వనరులపైన, రాజ్యాధికార వాటా సాధన కోసం ఒక సమగ్ర దళిత ఉద్మమం రూపొందలేదని ఉద్యమ నాయకత్వాన్ని తన రచనల్లో నిలేసిన కలేకూరి ప్రసాద్” మే 17,2013న ఒంగోలు అంబేద్కర్ భవన్ లో అమరుడైనాడు.
మంచి విశ్లేషణ విజయకుమారగారు.
మంచి విశ్లేషణ విజయకుమార్ గారు.
లేటుగా చూసాను. చాల బాగుంది, విజయ్.