సమీక్ష

వ్యథార్త స్త్రీ జీవితాలకు ‘విముక్త’ కథలిచ్చే సందేశమేమిటి?

మార్చి 2016

ప్రముఖ రచయిత్రి ఓల్గా గారి ‘విముక్త’ కథా సంపుటికి కేంద్ర సాహిత్య అవార్డు ప్రకటించిన సందర్భమిది. ఆ కథల రూప-సారాలపై సాహిత్యకారుల, సాహిత్యాభిమానుల మధ్య చర్చలు, వాదవివాదాలు చోటుచేసుకొంటున్న సమయమిది. ఈ కథా సంపుటి ‘నామాట’ లో రచయిత్రి చెప్పినట్లుగా తెలుగు సాహిత్యంలో చాలామంది రచయితలు పురాణ కథలను ‘కొత్త దృక్కోణం’ తో తిరగ రాశారు. ఇలా తిరగ రాయడం లేదా భిన్నంగా వ్యాఖ్యానించడాన్ని ‘కొత్త దృక్కోణం’ అనడంకంటే ఆయా రచయితల ‘స్వీయ దృక్కోణం’ అని పిలవడం సబబుగా వుంటుంది. ఎందుకంటే మనం తరచుగా చూశాం, విన్నాం, గమనించాం, తెలుసుకున్నాం, అర్థం చేసుకున్నాం… అనే సాధారణ మాటల్లో మాట్లాడుకుంటాం. దీని అర్థం కేవలం పంచేంద్రియాల ద్వారా తెలుసుకున్నదని మనం భావిస్తే పొరపాటు అవుతుంది. పంచేంద్రియాల ద్వారా మనకందిన ఇన్ పుట్స్ ను అప్పటికే మనలో రూపుదిద్దుకున్న లేదా రూపుదిద్దుకుంటున్న ఒక దృక్కోణంతో అంతఃచర్య (ఇంటర్ యాక్షన్) జరిపి మన భావాలుగా వెల్లడిస్తాం. అందుకే ఇన్ పుట్స్ ఒకటే అయినప్పటికీ అనుసరించే దృక్కోణాన్ని బట్టి మనిషికి మనిషికి మధ్య భావాలలో వ్యత్యాసం వుంటుంది. పురాణ కథలను తిరగ రాసేటప్పుడు… ఆమాటకొస్తే మనం వెల్లడించే భావాలన్నింటిలోను, అనుభవ సారంలోను మన స్వీయ దృక్కోణం ప్రతిబింబి౦చక మానదు. మన దృక్కోణం ప్రగతి శీలమైనది, సమాజ పురోభివృద్దికి తోడ్పడేది కావచ్చు లేదా ప్రగతి నిరోధకమైనది, సమాజ పురోభివృద్దికి అడ్డుగా నిలిచేది కావచ్చు.

ఈ కథా సంపుటిలో రామాయణ పురాణగాధలోని స్త్రీ పాత్రలను ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని రచయిత్రి తనదైన శైలిలో తిరగ రాశారు. శూర్పణఖ, అహల్య, రేణుక, ఊర్మిళ పాత్రలు ప్రధాన పాత్రధారి సీతతో చేసిన సంభాషణలు, వెల్లడించిన అనుభవ పాఠాలు, మానసిక భావోద్వేగాలు కథా సంపుటి వస్తువులో సింహా భాగం కాగా… చివర్లో రాజ్యవ్యవస్థ బంధితునిగా రాముణ్ణి చూపిన చిత్రీకరణ స్వల్ప భాగాన్ని ఆక్రమించింది. ఈ స్త్రీ పాత్రలన్నీ అనుమానానికి, అవమానానికి, అణచివేతకు, నిరాదరణకు, నిందలకు గురైనవి. రామాయణాన్ని రాసిన కాలంనుండి నేటివరకు ఇలాంటి స్త్రీ పాత్రల ప్రతిబింబాలు సాహిత్య సృజనలోనే కాక నిజ జీవితంలోకూడా భిన్న రూపాలలో మనకు కనిపిస్తాయి. ఈ విషయంలో మరో అభిప్రాయానికి ఆస్కారముండదు. అయితే ఆ కల్పిత పురాణ పాత్రలను తిరిగి వ్యాఖ్యానిస్తూ నేటి నిజ జీవిత ప్రతిబింబాలకు రచయిత్రి ఇచ్చే సందేశం లేదా రచయిత్రి స్వయంగా చెప్పిన ‘సహకారం’ ఏమిటనేది ప్రధాన ప్రశ్న, వాదవివాదాలకు కేంద్ర బిందువు.

మొదటి కథ-శూర్పణఖ తో సీత భేటీ అయిన ‘సమాగమనం’. రామలక్ష్మణులు శూర్పణఖ ముక్కు, చెవులు కోసి ఆమెను కురూపిగా మార్చడాన్ని సీత ‘ క్రూర పరిహాసంగా’ భావిస్తుంది. ఈ సంఘటన జరిగిన క్షణాన సీత అలా అనుకుందా! లేక కథలోని ప్రస్తుత సందర్భంలో (వాల్మీకి ఆశ్రమవాసంలో) అలా భావించిందా! అనే సందేహాన్ని అటుంచి తన కళ్ళముందు భర్తపట్ల మరో స్త్రీ ప్రేమను వ్యక్తం చేయటాన్ని నేటి సమాజంలోని ఒక సాధారణ స్త్రీ ఎలా స్వీకరిస్తుంది? తోటి స్త్రీకి జరిగిన అవమానం పట్ల విచారం వ్యక్త పర్చవచ్చునేమో! అంతేగానీ సీత దాన్నొక ‘క్రూర పరిహాసంగా’ రామలక్ష్మణులను అభిశంసించడం, శూర్పణఖను తిరిగి కలవాలనే తీవ్ర ఆకాంక్షను కలిగివున్నట్లు చూపడం ద్వారా రచయిత్రి పాఠకులకు చెప్పదల్చుకున్నదేమిటో అయోమయంగావుంది. అలాగే అందాన్ని కోల్పోయిన శూర్పణఖ ‘అగ్ని పర్వతమై’, ‘దుఃఖ సముద్రమై’ ‘ఆ కసి’ నుండి ఏం చేసిందో చూడండి! ప్రకృతి ద్వారా మళ్ళీ సౌందర్యాన్ని ప్రేమించి, రూప అరూపాల సారాంశాన్ని కనుగొని, చివరకు పరిష్కారంగా ఒక మనోహరమైన వనాన్ని స్వహస్తాలతో పెంచింది. అంటే అవమాన భరిత జీవితాన్ని ఆత్మ విశ్వాసంతో ఎదుర్కొని నిలబడడానికి; జ్ఞానాన్ని, ధైర్యాన్ని ప్రోది చేసుకోవడానికి ఆమెకు తోడ్పడిన జీవిత ఘటనలేవీ కథలో కనిపించవు.

కేవలం ‘అనంత ప్రకృతి’ అనే అస్పష్ట భావం మినహా. ఇక శూర్పణఖ ఆ వనంలో సుధీరుడు అనే దృఢకాయుని సహచర్యంలో వుండడం, అతన్ని ఒక విధేయునిగా సీతకు చూపించడం, వారి మధ్య ఇంతవరకు ఏ స్త్రీ-పురుషుల మధ్య చూడని బంధంగా (?), శూర్పణఖ జీవితం సఫలమైనట్లుగా సీత భావించటం… అదే ఊపులో సాఫల్యానికి అర్థం పురుషుని సహచర్యంలో లేదని, అది తెలిసాకే నాకీ పురుషుని సాహచర్యం కలిగిందని శూర్పణఖ చెప్పడం… దీన్ని సీత శూర్పణఖ సాధించిన వివేకం, గాంభీర్యం అని గౌరవించడం… మొదలైన వ్యాఖ్యానాలన్నీ స్త్రీ-పురుష సంబంధాల యెడల రచయిత్రి కున్న అసహజ భావాలను వెల్లడిస్తాయి. ఎందుకంటే శూర్పణఖ వనాన్ని పెంచిన ప్రస్తావన, తోటి పక్షులు పొడిచి, పొడిచి ఈకలు పీకిన ఒక చిన్న పక్షి కలిగించిన స్పందన మినహా పది సంవత్సరాల కఠోర దీక్షలో ఆమెకు ఏం జ్ఞానోదయమయిందో, మానవ జీవిత సంఘర్షణ గురించి మరేం తెలుకుందో పాఠకులకు అంతుపట్టదు సుమా!

సంస్కృత పదబంధాలు శీర్షికలుగానున్న ‘మృణ్మయనాదం’, ‘సైతక కుంభం’ కథల్లో సీతతో అహల్య, రేణుక పాత్రలు సౌశీల్యం, సత్యాన్ని గురించి చేసిన సంభాషణలు కథా వస్తువులు. అహల్య, రేణుకలిద్దరూ ‘స్త్రీ ప్రాతివ్రత్యం’ అనే ఛాందస దృక్పథానికి, పురుషాధిక్య భావజాలానికి బలియైన వంచితులు. ఈ అన్యాయం వీరికి వివాహవ్యవస్థ వలన జరిగిందని; అరణ్యంలో ఎన్నో ప్రాణులకు వివాహబంధం లేదని; అనేక తెగల ప్రజల ఆచారాలు భిన్నంగా ఉన్నాయని; ప్రకృతిని-పశువులను ప్రేమించటం, పూజించటం మానవ కర్తవ్యమని అహల్య నొక్కి చెబుతుంది. వివాహ వ్యవస్థను, ఆ వ్యవస్థకు ఆధారభూతమైన భావాలను రెండింటిని ఒకటిగా భావించడం వలన ఈ గందరగోళం తలెత్తుతుంది. నిజమే! నేటికీ వివాహ వ్యవస్థ, వైవాహిక సంబంధాలు, కుటుంబ రూపాలు పురుషాధిక్య భావజాల పునాదులపై నిర్మితమైవున్నాయి. ఈ పునాదులను పెకలించివేయాలి. పురుషాధిపత్యం, అనుమానం, విచారణాధికారం మొదలైన మానసిక జాడ్యాలను నిర్మూలించాలి. మైల-శౌచం, పవిత్రం-అపవిత్రం, శీలం-పతనం మొదలైన ఛాందస మనోభావాలను స్త్రీ-పురుషులిరువురి దృక్పథం నుండి తొలగించాలి. వీటి స్థానంలో కేవలం జెండర్, చట్ట సమానత్వాన్ని మాత్రమేకాక నిజమైన సామాజిక సమానత్వాన్ని సాధించాలి. ఇరువురి వ్యక్తిత్వం, విలువలు, శక్తి-సామర్థ్యాల యెడల పరస్పర గౌరవం, నమ్మకాల ఆధారంగా స్త్రీ-పురుష సంబంధాలను పునర్న్మించాలి. అందుకు తగిన ప్రజాతంత్ర-సెక్యులర్ వివాహ వ్యవస్థను రూపొందించాలి. స్వార్థ-సంకుచితం కాని సామాజిక విలువల ఆధారంగా ఏర్పడ్డ గౌరవం, నమ్మకం నుండి జనించిన ప్రేమానురాగాలున్నప్పుడు భార్యపై భర్తకుగాని, భర్తపై భార్యకుగాని, అపనమ్మకానికి, అనుమానానికి తావుండదు. కావున స్త్రీ-పురుషుల మధ్య ఈ విధమైన ఉన్నత సంబంధాలను నెలకొల్పటానికి బలమైన సామాజిక-సాంస్కృతిక పోరాటాన్ని సంఘంలో ఇంటా-బయటా ఇరువురూ కలసి చేపట్టాలి. సరిగ్గా ఇది నేటి మానవుల కర్తవ్యం. అలాకాక రచయిత్రి అహల్య పాత్ర ద్వారా వివాహవ్యవస్థనే తృణీకరించి అరణ్యాలకు వెళ్లాలని, పశువులను లేదా ప్రకృతిని పూజించాలని మనకు చెప్పడం సముచితంకాదు. మానవ సమాజం ఆ రకమైన ఆదిమ, అరణ్య సామాజిక దశలను దాటి నేటి నాగరిక దశకు చేరుకుంది. మరింత ఉన్నత దశకు చేరుకునే పోరాటంలో ఉంది. దీనికి భిన్నంగా చెప్పడం తిరోగమనవాదమవుతుంది. అలాగే రేణుక పాత్ర ఒకచోట తండ్రి అధీనం లోనికి పుత్రులు పోతారు కాబట్టి ఆ పిల్లల్ని కనటం ఎందుకు అని నిష్టూర మాడుతుంది. ఇలా మాట్లాడడమంటే వాస్తవ జీవిత సంఘర్షణలను ధైర్యంగా ఎదుర్కొనలేక, వైవాహిక జీవితంలోని బాధ్యతలను నిర్వర్తించే ధైర్యంలేక పలాయనం చిత్తగించటమవుతుంది.

“ఎవరి సత్యం వారిది”… “సత్యాసత్యాలు నిర్ణయించగల శక్తి ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా?”… “నీ మనసుకు ఏది శాంతినిస్తుందో అది సత్యమనుకో”… “సత్యం ఎప్పుడూ ఒక్కలాగే ఉండదనీ, నిరంతరం మారుతూ వుంటుందనీ తెలుసుకోవడమే నేను సంపాదించిన జ్ఞానం”- ఇవన్నీ సత్యానికి సంబందించి అహల్య పాత్ర ద్వారా రచయిత్రి చేసిన తాత్విక నిర్ధారణలు. స్థల, కాలాదులను బట్టి సత్యం మారుతుందనేది నిజమే. అయితే ఒక నిర్దిష్ట కాలంలో, నిర్దిష్ట పరిస్థితిలో సత్యంకూడ నిర్దిష్టంగా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఒక నిర్దిష్ట దృగ్విషయానికి సంబంధి౦చి ఒక సత్యమే స్పష్టంగా ఉంటుంది. బహుళ సత్యాలుండవు, మనిషికో సత్యముండదు. ప్రకృతి, సమాజం, మానవుని ఆలోచన అనే మూడు రంగాలలో పనిచేస్తున్న నియమాలను ఆయా రంగాలకు అన్వయించగలిగే శాస్త్రీయ పద్దతి ద్వారా తెలుసుకోగలం. అనగా పరిశీలన, ప్రయోగం, నిర్ధారణలనుండి, చారిత్రిక అనుభవాలనుండి రాబట్టిన విషయాన్ని తర్కబద్దంగా విశ్లేశించి నియమాన్ని కనుగొనడానికి ఉపయోగించే పద్దతిని శాస్త్రీయ పద్దతి అంటారు. మానవుని జ్ఞానశోధనకు, సత్యాన్వేషణకు ఆధారపడ్డ ఏకైక మార్గమిదే. ఈ పద్దతిలో కనుగొన్న జ్ఞానం లేదా సత్యంలో ఏదైనా పొరపాటున్నా దాన్ని అనంతరక్రమంలో చేసే పరిశీలనలు, ప్రయోగాలు, నిర్ధారణలు, చారిత్రిక అనుభవాలనుండి సరిదిద్దుకోగలం. అలాకాక మానవుని స్వీయాత్మక ఆలోచనలనుండి, అనుభవాలనుండి తెలుసుకున్నది పాక్షిక జ్ఞానం అవుతుంది. చాలా సందర్భాలలో అది లోపభూయిష్టంగా ఉంటుంది. ఒక వ్యక్తి గొప్ప మేధావి లేదా ఆలోచనాపరుడైనప్పటికి ఆమె/అతని జ్ఞానం వైయుక్తికం లేదా స్వీయాత్మకం. దీన్ని సత్యంగా అంగీకరించడమంటే ఒక వ్యక్తి తెలుసుకున్నది మరొక వ్యక్తి తెలుసుకున్న దానికి భిన్నగావుంటూ బహుళ సత్యాలు అనే తప్పుడు భావానికి దారితీస్తుంది. అందుకే రచయిత్రి కూడా ఒకవైపు మనిషికో సత్యముంటుందని చెబుతూనే మరోవైపు “సత్యాసత్యాలను నిర్ణయించగల శక్తి ఎవరికైనా వుందా?” అనే సందేహాన్ని వ్యక్తపర్చింది. వాస్తవ సత్యాన్ని నిర్ధారించే శాస్త్రీయ పద్దతిని ఒక కొలమానంగా అంగీకరించకపోతే ఇలాంటి గందరగోళం తలెత్తుతుంది. విజ్ఞాన శాస్త్రాల విషయంలో బహుళ సత్యాలు, మనిషికో సత్యం అనే అసంబద్ద భావాలకు చోటులేదు. న్యూటన్ భౌతిక నియమాలు, డార్విన్ జీవపరిణామ సిద్దాంతం, ఐన్ స్టీన్ విశ్వ నిర్మాణ పరికల్పనలు…. విద్యుత్ నియమాలు, అయస్కాంతత్వం, గురుత్వాకర్షణ స్వభావం….ఇలా విభిన్న విజ్ఞాన శాస్త్ర పరిశోధనలను నిర్దిష్ట సత్యాలుగా అందరూ అంగీకరిస్తారు. కానీ వచ్చిన చిక్కంతా మానవ సమాజనికి, మానవ సంబంధాలకు సంబంధించి ఒక నిర్దిష్ట సత్యముంటుందని, ఒకే ప్రామాణిక శాస్త్ర అవగాహన వుంటుందని అందరూ అంగీకరించకపోవడమే. దీన్ని మార్క్స్ పటాపంచలు చేశాడు, మానవ సమాజ అభివృద్ది నియమాలను ఆవిష్కరించాడు. విజ్ఞాన మరియు సామాజిక శాస్త్రాలన్నింటిని సంకలనం చేసి, సమన్వయం గావించి, సాధారణీకరణ చేసి దృగ్విషయాలన్నింటిలో పనిచేసే నియమాలను వెల్లడించాడు. మార్క్స్ పరిశీలనలకు సంబంధించి, వాటి అన్వయానికి సంబంధించి మన అవగాహనలో వ్యత్యాసాలుండవచ్చు. వాటిని చర్చించాలి, స్పష్టపర్చుకోవాలి. అంతేకాని మానవ సంబంధాలకు సంబంధించి ఒకే సత్యమేది లేదని, నీ మనసుకు ఏది శాంతినిస్తుందో అది సత్యమని సూత్రీకరిస్తే మనుషుల ప్రవర్తనకు, విలువల అవగాహనకు ప్రాతిపదిక లేకుండాపోతుంది. సమాజానికి అడవికి తేడా లేకుండా పోతుంది. ఈ కథల్లో సరిగ్గా ఇదే తేలింది. ఇదే దారిలో రచయిత్రి ఒక అడుగు ముందుకేసి అరణ్యజీవితాన్ని, పశువులను ఆదర్శంగా చూపించింది.

అహల్య, రేణుకలతో పాటుగా ‘విముక్త’ కథలోని ఊర్మిళ పాత్ర కూడా జ్ఞాన సంపాదనకు, సత్య శోధనకు మార్గాన్ని తెలుసుకున్నానని సీతతో గట్టిగా చెబుతుంది. “జ్ఞాన సంపాదనకు అనుభవాన్ని మించిన మార్గం మరొకటి లేదమ్మా” అని అహల్య పలికితే, “ఎవరికైనా అనుభవం నుంచే సత్యం బోధపడుతుంది” అని రేణుక ఉద్భోదిస్తుంది. ఊర్మిళ ఏకంగా “పధ్నాలుగేళ్ళు సత్య శోధనలో నేజేసిన గొప్ప తపస్సును నిద్ర అనుకునే వాళ్ళకు నా మాటలు అర్థమవుతాయా?” అని ప్రశ్నిస్తుంది. రచయిత్రి ఉద్దేశ్యంలో సత్యాన్ని తెలుసుకోవడానికి, జ్ఞానాన్ని పొందడానికి వైయుక్తిక అనుభవమే మార్గం. ఆ అనుభవం కూడా ఆ పాత్రలు తమను తాము తెలుసుకోవడం ద్వారాను, తమలోపలున్న అసలైన దాన్ని అన్వేషించడం ద్వారాను పొందినదే. ఈ తరహా అవగాహనను తాత్విక పరిభాషలో ఎంపిరిసిజం అంటారు. వ్యక్తుల స్వీయాత్మక అనుభవాలనే సత్యంగా భావించే ఒకానొక భావవాద ధోరణిది. ఇంతకు మునుపు చెప్పినట్లు శాస్త్రీయ పద్దతిలో కాకుండా ఇతరేతర మార్గాలలో పొందిన జ్ఞానమేదైనా సత్యాన్ని పాక్షికంగా దర్శించడానికి తోడ్పడవచ్చునేమో. అనుభవ జ్ఞానం కూడా అన్ని సందర్భాలలో మనిషికి మార్గదర్శకం చూపలేదు. చాలా వరకు అది సత్య దూరమైనదేకాక మనిషిని తప్పుదోవపట్టిస్తుంది కూడా. వాస్తవానికి మానవ సమాజం సమిష్టిగా చేసిన, చేస్తున్న పోరాటాలనుండి జ్ఞానం వృద్దిచెందుతుంది. తత్భిన్నంగా తమను తాము తెలుసుకోవడం లేదా తమలోపలికి లోతుగా తొంగిచూడడం ద్వారా జ్ఞానం పొందడమనేది కూడా మతసహిత లేదా మతరహిత భావవాద తాత్విక ధోరణి నుండి పుట్టుకొచ్చిన ‘సెల్ఫ్ రియలైజేషన్’ భావన. సాధుసన్యాసుల, బాబాల అధ్యాత్మిక ప్రసంగాలన్నీ ఇదే భావన చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. జీవిత సమస్యలకు ప్రత్యేకించి స్త్రీలపై దాష్టీకాలకు, పురుషాధిక్యతకు చారిత్రక కారణాలను, వారి విముక్తికి మార్గాన్ని స్త్రీలు గత మరియు వర్తమాన సమాజ వాస్తవిక పరిస్థితులనుండి తెలుసుకొని చైతన్యవంతులై సంఘటితం కావాలి. అన్ని రకాల అన్యాయాలకు వ్యతిరేకంగా జరిగే ప్రజల సమిష్టి పోరాటాలలో భాగస్వాములవ్వాలి. తాము ఏ విధంగానూ తక్కువకాదు అని దృఢంగా విశ్వసించాలి. అందుకుగాను కాలంచెల్లిన పాతభావాలనుండి, నిస్సహాయతనుండి బయటపడడానికి ఏదైనా అడ్డుగా వుంటే దాన్ని తొలగించుకోవటానికి తమ లోపలికి తాము చూసుకువాలి. అలాకాక సమాజంనుండి, జీవితంనుండి పారిపోయి అడవిలోనో (శూర్పణఖ, అహల్య, రేణుకలు), అంతఃపుర మహలు తలుపులు బిగించుకొని ఒంటరిగా (ఊర్మిళ) ఎవరికివారే జ్ఞానోదయాన్ని పొందడం సాధ్యమా? ఇది మహా ఋషులు హిమాలయాల్లో ముక్కుమూసుకొని చేసే తపస్సులాంటిది. సమాజంతో సంబంధంలేకుండా లోపలికి తొంగిచూసుకునే ఈ తప్పుడు భావం సాధారణ స్త్రీలలో నిష్క్రియాపరత్వాన్ని పెంపొందిస్తే, సామాజిక పోరాటాలతో సంబంధంలేకుండా పండిత జ్ఞానం పొందిన కొద్దిమంది విద్యాధిక స్త్రీలలో టిపికల్ వ్యక్తిగతవాదాన్ని ప్రేరేపిస్తుంది. ఈ అభివృద్ది నిరోధక భావజాలాన్ని పురాణ పాత్రలచే ఎంత అందంగా చెప్పించినా అంగీకరించలేము. మెత్తంగా ఈ కథా సంపుటిలోని స్త్రీ పాత్రల సంభాషణలన్నీ మానవ జీవితంపై ఆశావహ ధృక్పథంలేని భావజాలాన్ని నూరిపోస్తాయి. ‘మగవాళ్ళందరూ ఒక్కటే సీతా!’ అని ఒకవైపు ఆక్షేపిస్తూనే మరోవైపు చివరి కథ ‘బంధితుడు” లోని మగ పాత్ర రాముడు కూడా నిస్సహాయుడై, గాఢాంధకారంలో మునిగి వుండడం కథాసంపుటికి సంగ్రహ వాక్యంగా చెప్పవచ్చు. ఈలాంటి కథలు ‘స్త్రీలకు బలాన్ని, ధైర్యాన్ని, వివేకాన్ని’ కలిగిస్తాయని చెప్పగలమా?!

చివరగా కథాసంపుటి సంవిధానం గురించి ఒక మాట చెప్పాలి. సాధారణంగా సాహిత్యంలో వివిధ పాత్రలు భిన్న స్వభావాలను, చిత్తప్రవృత్తులను, మానసిక ఉద్వేగాలను కలిగివుండి వాటి సంభాషణల్లో వైవిధ్యం ఉంటుంది. పాత్రల పరస్పర సంభాషణల ద్వారా కథాగమనం జరిగితే కథరక్తి కట్టి పాఠకులు అందులో లీనమవుతారు. దీనికి భిన్నంగా పాత్రలన్నీ ఒకే మూసలో పోసినట్లుగా, సంభాషణలన్నీ ఒకే తీరుగా, రచయిత్రి అన్ని పాత్రలను ఆవహించి పలికించినట్లుగా ఉంది. శూర్పణఖ, అహల్య, రేణుక, ఊర్మిళలు గురు పీఠాన్ని అధిరోహించి సీతను ఒక శిష్యురాలిగా చేసుకొని అధ్యాత్మిక ప్రవచనాలు వినిపించినట్లుగా వుంది. రసాత్మకం కానీ వాక్యం కావ్యార్హతను పొందుతుందా?!

**** (*) ****



3 Responses to వ్యథార్త స్త్రీ జీవితాలకు ‘విముక్త’ కథలిచ్చే సందేశమేమిటి?

  1. చంద్రిక
    March 2, 2016 at 11:29 pm

    ‘విముక్త’ కథలు అందరు మెచ్చుకుంటుంటే నేను ఒక్కదాన్నే విమర్శిస్తున్నానా అనుకున్నాను. ఈ వ్యాసం చదివాకా నా లాగా ఉండే వారు ఉన్నారు అని అర్ధం అయింది. రామాయణాన్ని సరిగ్గా అర్ధం చేసుకున్న స్త్రీ లకి ఈ కథలు అవసరం లేదు. సీత పాత్ర మాయ లేడి ని చూసినపుడు, లక్ష్మణుడిని తిట్టినపుడు ఒక సామాన్య స్త్రీ లాగే ఆలోచించినా కొన్ని చోట్ల high level thinking గా ఉంటుంది. సీత తనని తాను హనుమంతునికి పరిచయం చేసుకుంటూ ‘పరిణయమయిన పన్నెండు ఏళ్ళు అనుభవించితిని భోగ భాగ్యములు’ అంటుంది. ఆ ఒక్క మాట చాలు ఆవిడ స్వభావం ఏంటో అర్ధం అవ్వడానికి. రావణుడు వస్తే ఒక గడ్డి పోచని పెట్టి మాట్లాడుతుంది. ఉత్తరకాండ లో పిల్లల్ని రాముడికి అప్పచెప్పి సెలవు తీసుకుంటుంది. I did my duty అని చెప్పటం.ఎక్కడ బంధాలు త్రెంచుకోవాలో ఆవిడకి తెల్సు. ఆవిడకి ఎవరి నీతి బోధలు అవసరం లేదు. అటువంటి సీత పాత్ర, ‘విముక్త’ ‘సమాగమం’ కథ లో ‘ముక్కు చెవులు లేని ఆ కురూపిని ఎవరు ప్రేమిస్తారు’ అనుకుంటుంది శూర్పణఖ గురించి. అంటే స్త్రీ ఎప్పుడు ఎవరో ఒకరితో ప్రేమించబడాలా? అది కూడా తన రూపం తో ?నేటి విద్యవంతురాలయిన స్త్రీ ఇలా మాత్రం ఖచ్చితంగా ఆలోచించదు. ‘శత్రువు ని యుద్ధానికి కవ్వించటం ఆర్యధర్మం’. అందుకనే రాముడు శూర్పణఖ ముక్కు చెవులు కోయించాడు అంటారు రచయిత్రి. ఈ ‘ఆర్యధర్మం’ అనే కల్పన ఏంటో అర్ధం కాలేదు. లంక లో ఆ చెట్టు క్రింద అన్ని నెలల పాటు అదే చిరిగిన చీర తో, తిండి లేకుండా ,రోజు రాముడిని తిట్టి పోసే రావణుడు, రాక్షస స్త్రీ ల మధ్య ఒంటరి పోరాటం చేసిన సీత కి, ఈ రోజున బ్రోతల్ లో చిక్కుకున్న అమ్మాయిలకీ తేడా ఏమన్నా ఉందా ? ఆ రోజున హనుమంతుడు ఎంత కష్టపడ్డాడో సీత నమ్మించేందుకు, ఈ రోజు rescue operations చేసే వారు అంతే కష్టపడ్తున్నారు అక్కడ చిక్కుకున్న అమ్మాయిలను నమ్మించడానికి. ఈ అమ్మాయిలు కూడా ఏదో మాయలేడి ని చూసి మోసపోయే వారే కదా!!అమ్మాయిలని అటువంటి చోట్లకి చేర్చి ఆనందించే బ్రోకర్ లకి రామాయణం లోని శూర్పణఖ పాత్ర కి తేడా ఏమన్నా ఉందా? అనోన్య దాంపత్యం తో ఎన్ని కష్టాలయినా ఎలా ఎదుర్కోవచ్చో , అటువంటి దాంపత్యం లో మూడో మనిషి జోక్యం చేసుకుంటే ఆ పర్యవసానం ఏంటో చెప్తుంది రామాయణం. అది అర్ధం చేసుకోవాల్సింది పోయి, ‘విముక్త’ కథలలో ప్రతి కథ లో రాముడు మీద negative thought సీతకి అన్నట్లు వ్రాసారు .అలాంటి ఆలోచన విధానం సమాజం మీద ఎంతో ప్రభావం చూపుతుంది. భర్త చేసే ప్రతి పని భార్య కి negative గా కన్పిస్తుంటే ఎన్ని రోజులు ఉంటుంది ఆ కాపురం? ఈ కథలు చదివాకా కూలిన కాపరాలు నిలబడతాయో లేదో కానీ చక్క గా ఉన్నవి మాత్రం కూల్తాయేమో!!

  2. Chaitanya
    March 3, 2016 at 6:18 pm

    మంచి విశ్లేషణ. విశ్లేషణలో భాగంగా రచయిత/రచయిత్రి చేసిన ఈ కింది వాఖ్యల గురించి నాలుగు మాటలు.

    ” విజ్ఞాన శాస్త్రాల విషయంలో బహుళ సత్యాలు, మనిషికో సత్యం అనే అసంబద్ద భావాలకు చోటులేదు. న్యూటన్ భౌతిక నియమాలు, డార్విన్ జీవపరిణామ సిద్దాంతం, ఐన్ స్టీన్ విశ్వ నిర్మాణ పరికల్పనలు…. విద్యుత్ నియమాలు, అయస్కాంతత్వం, గురుత్వాకర్షణ స్వభావం….ఇలా విభిన్న విజ్ఞాన శాస్త్ర పరిశోధనలను నిర్దిష్ట సత్యాలుగా అందరూ అంగీకరిస్తారు.”

    విద్యుత్ నియమాలు, అయస్కాంతత్వం లాంటి భౌతికశాస్త్ర నియమాలని, డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం, ఐన్‍స్టీన్ సిద్దాంతాన్ని ఒకేగాటను కట్టేసారు. మొదటివి స్పష్టంగా ఏ ఖాళీలు లేకుండా పూర్తిగా వివరించగల విషయాలు కాగా, చివరి రెండూ జీవపరిణామాన్నీ, విశ్వ నిర్మాణాన్నీ వివరించే హైపోతసీస్‍లు మాత్రమే. కాకపోతే ఇప్పటివరకు ఉన్న వాటన్నిటిలోకల్లా ఎక్కువ విషయాలని సమర్థవంతంగా వివరించే సిద్దాంతాలు కావచ్చు. అంతమాత్రాన అవి నిర్దిష్ట సత్యాలు కావు, అలా అని అందరు శాస్త్రవేత్తలే అంగీకరించరు కూడా. ఎందుకంటే జీవపరిణామంలోనూ, విశ్వనిర్మాణంలోనూ ఈ సిద్ధాంతాలు వివరించలేకపోతున్న విషయాలు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని, వీటికన్న మెరుగైన సిద్ధాంతం కోసం, లేదా కుదిరితే వీటిని మరింత విస్తరించటం కోసం ఎన్నో పరిశోధనలు ఇంకా జరుగుతున్నాయి.

    నిజానికి న్యూటన్ భౌతిక నియమాల్ని ఎన్నో ఏళ్ళు నిర్దిష్టమైనవి గానే భావించారు, వాదించారు. కానీ అవి భూమి మీదే కానీ, అంతరిక్ష భౌతిక నియమాలని వివరించలేక చతికిలపడితే, అప్పుడు ఆ ఖాళీలని పూరిస్తూ ఐన్‍స్టీన్ సిద్ధాంతం వచ్చింది. ఇప్పుడు ఐన్‍స్టీన్ సిద్దాంతం, సబ్ అటామిక్ లెవల్ భౌతిక విషయాలని వివరించలేకపోతోందని క్వాంటం ఫిజిసిస్టులు అంటూ, ఇంకా మెరుగైన సిద్దాంతానికి కృషి చేస్తున్నారు.

  3. K SHESYU BABU
    March 22, 2016 at 10:17 pm

    Kadhalalo Purana patralu toe aanaati samaajika raajakiya aardhika sambandhalu chitrikarana chaala sramatoe kuudukunna rachana. Alanti visleshana ee kadhaa samputilo vistrutamgaa chudavachu. Sameeksha ki dhanyavaadalu.

Leave a Reply to K SHESYU BABU Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)