నుడి

నుడి-6 (ఏప్రిల్ 2016) & నుడి – 5 (మార్చి 2016) ఫలితాలు

ఏప్రిల్ 2016


నుడి – 5 (మార్చి, 2016) ఫలితాలు


పాఠకులకు నమస్కారం.
ఈసారి నుడిని ఒక్కరు కూడా ఆల్ కరెక్ట్ గా పూరించలేదు.
ఒక తప్పుతో పూరించినవారు:
1. తుమ్మూరి రామ్మోహన్ రావు
2. కామేశ్వర రావు
3. రాధిక

2, 3 తప్పులతో కూడా ఎవ్వరూ పూరించలేదు. మిగిలినవారందరూ 4, లేక అంతకన్న యెక్కువ తప్పులతో నింపారు. విజేతలుగా నిలిచిన ముగ్గురికీ అభినందనలు. నుడిని పూరించడానికి పూనుకున్న పాఠకులందరికీ కృతజ్ఞతలు. ఇక కొన్ని ఆధారాలకు జవాబులను, వివరణలను చూద్దామా?

8 అడ్డం ఆధారం: వేమన పద్యంలో ఘాటైన వాసన కలది (3)
వివరణ: దీనికి జవాబు కప్పురం. ఉప్పు కప్పురంబు అనే పద్యం అందరికీ తెలిసే వుంటుంది. అయితే కొందరు కస్తూరి అని నింపారు. వేమన పద్యాల్లో దేంట్లోనైనా కస్తూరి అనే పదం ఒకవేళ ఉన్నా 6 నిలువు జవాబుకు అది సరిపోదు.

3 నిలువు ఆధారం: స్త్రీల చీరల రవికల పొడవైన దారాల కొసలు (4)
90 శాతం మంది లలలల అని పూరించారు.
వివరణ: నిజానికి స్త్రీల అని మాత్రమే ఇచ్చి ఊరుకోవచ్చును. దానికి సమాధానం లలనల. కాని అప్పుడది డైరెక్ట్ క్లూ అవుతుంది. డైరెక్ట్ క్లూలలో మజా ఏముంటుంది? పైగా పాఠకుల్ని తికమక పెట్టాలి కదా! అందుకే మరికొన్ని పదాలను కలిపి cryptic clue గా మార్చటం. ఇక అసలు వివరణకొస్తే, చీరల, రవికల, పొడవైన, దారాల – ఈ నాలుగు పదాల కొసలను (చివరి అక్షరాలను) కలిపితే వచ్చేది లలనల = స్త్రీల. The Hindu Crossword లో ఈ తరహా క్లూలూ చాలా వుంటాయి. అందుకే

హిందూ డెయిలీ పత్రిక
నందుండును ఆంగ్ల పజిలు, అది నాకు ప్రియం
బందుకె ఆ రీతిన రూ
పొందించితినీ పజిళ్లు పూరించుడికన్

అని విన్నవించుకున్నాను చాలా సంవత్సరాల క్రితం ఒక పత్రికలో ఇటువంటి పజిల్నే నిర్వహించినప్పుడు. (ఈ కందపద్యంలో నిత్యసంధినీ, యడాగమాన్నీ ఉద్దేశపూర్వకంగానే పాటించలేదు)

5 నిలువు ఆధారం: భూమి కొలత అటుదిటుగా రాక ముందు దిగువన అదృశ్యమైన ఎగువ నది (3) దీనికి చాలా మంది రాకఎ అని జవాబును రాశారు.
వివరణ: ‘ఎగువ నది’ మైనస్ ‘దిగువన’ = ఎ. అటుదిటుగా రాక = కరా. ఎ + కరా = ఎకరా = భూమి కొలత.

6 నిలువు ఆధారం: కెరటానికి ఇమ్ము కొమ్ము, తెమ్ము హయమ్ము (3)

8 అడ్డంకు ‘కస్తూరి’ని జవాబుగా రాసినవారు దీనికి తురికి అని సమాధానమిచ్చారు. ఈ పదానికి గుర్రం అనే అర్థం వున్న మాట నిజమే. కాని, కొమ్మును తీసేయగా మిగిలే ‘తరికి’కి కెరటం అనే అర్థం లేదు. ఈ క్లూకు జవాబు తురంగం.
వివరణ: కెరటం = తరంగం. దీనిలోని మొదటి అక్షరమైన ‘త’కు కొమ్మును చేరిస్తే తురంగం = గుర్రం (హయం)

11 నిలువు ఆధారం: తల కొట్టేసిన పాములు శైవ మతస్థుల్ని చూపిస్తాయి (3)
వివరణ: పాములు = భుజంగాలు. తల(మొదటి అక్షరం)ను కొట్టేస్తే జంగాలు మిగుల్తుంది. అదే సమాధానం.

12 నిలువు ఆధారం: నడుమ తేలిక చేసి యిల్లంతా సర్దితే చాక్లెట్ లాంటిది దొరుకుతుంది (3)
వివరణ: నడుమ తేలిక చేయటం అంటే ‘యిల్లంతా’ లోని మధ్య అక్షరమైన ‘ల్లం’ లోంచి వత్తును తీసేయటం అన్న మాట. అప్పుడు ‘యిలంతా’ వస్తుంది. దాన్ని తారుమారు చేస్తే వచ్చే తాయిలం ఈ ఆధారానికి జవాబు.

13 నిలువు ఆధారం: ఒకరకం పాత్రలు బహుశా జడ చివర్న వుంటాయి (3)
చాలా మంది కుచ్చులు అని నింపారు. కుచ్చులు జడ చివర్న ఉంటాయనేది వాస్తవమే. కాని, అవి ఒకరకం పాత్రలు కావు కదా. ఈ క్లూకు జవాబు కుప్పెలు. జడకుప్పెలు అని వుంటాయని చాలా మందికి తెలుసు. ఇక కుప్పె ఒకరకం పాత్ర. ఉదా: గాజు కుప్పె = బీకరు (Beaker)

17 నిలువు ఆధారం: కాబట్టి కకావికలైనది అంత చేదు (4)
వివరణ: ఇక్కడ అంత చేదు ఒక anagram కనుక, దాన్ని jumble చేస్తే అందుచేత = కాబట్టి.

18 నిలువు ఆధారం: ఇంపైన పాట (2, 2)
చాలా మంది కలగానం, కలస్వనం, కమ్మ గానం, కర్నా గానం అని రకరకాలుగా నింపారు. దీనికి జవాబు కమ్ర గానం. ఒక్కరు ( విజేత నం.1) మాత్రమే కరెక్టుగా నింపారు.
వివరణ: కమ్ర = ఇంపైన. కలస్వనం, కలధ్వని, కలకూజితం, మొదలైన పదాలలోని ‘కల’కు అవ్యక్త మధుర(మైన) అనే అర్థం వుంది. కమ్రకు మాత్రం ఇంపైన అనే ఇదమిద్ధమైన (ఇదమిత్థమైన) అర్థం వుంది.

20 నిలువు ఆధారం: కొమ్ము లేదు కనుక విలువైనది అసంపూర్ణం (3)
వివరణ: కనుక లోంచి కొమ్మును తీసేస్తే కనక వస్తుంది. కనకము = బంగారం. అది విలువైనది. కాని అసంపూర్ణం అంటున్నాం. అందుకే కనకములో చివరి అక్షరం లుప్తమై కనక మిగిలింది.

పాఠకులారా,
మీ అభిప్రాయాలను, సూచనలను తప్పక ఇవ్వవలసిందిగా కోరుతున్నాను.

**** (*) ****