పక్కన ఐఫోన్లో అలారం మోతకి గబుక్కున మెలకువ వచ్చింది హమీర్‌కి. ఫ్లయిట్‌ని కాచ్ చెయ్యడంకోసం ముందుగా లేవడానికి అలారం పెట్టుకున్నాడన్న మాట నిజమే గానీ, అలా హఠాత్తుగా లేచేసరికి అతనికి తలకాయనెప్పి వచ్చింది. కలవల్లో లేక కంఫర్టర్ని కప్పుకుని వుండడంవల్లో గానీ బనీన్ చెమటతో తడిసిపోయింది. అది కల వల్లనే అనుకోవడానికి బలమైన కారణాలే వున్నాయి. ఎందుకంటే, ఆ కల సామాన్యమైనది కాదు. అది ఎవరి కయినా గానీ మెలకువ రాగానే ఆప్యాయంగా అక్కున చేర్చుకునే స్పర్శని అమితంగా కాంక్షించేలా చేసేది. శరీరంలోని నాడీ, తంత్రులనే గాక వాటికి మూలాలని కూడా గుర్తుచేసేది. అతని విషయంలో ఆ కోరిక మాటల కందనంత బలమైనదే గానీ, ఆ క్షణాన అతను చెయ్యగలిగింది ఒకటే! ఆ కోరికని మనసులో మారుమూలకి తోసేసే ముందర కనీసం కొన్ని శబ్ద తరంగాలల్లో దాన్ని ఓలలాడించడం, దానికి జోల పాడించడం. అలా చెయ్యగల వ్యక్తి ఒకే ఒకరు. టైం చూశాడు. డెన్వర్‌కీ హైదరాబాద్‌కీ పన్నెండున్నర గంటల తేడా. అంటే, ఇండియాలో సాయంత్రం ఆరుగంటలు. ఫోన్ నంబర్ డయల్ చేశాడు.
“ఏమిటీ ఈవేళప్పుడు ఫోన్ చేశావ్?” అన్నది అతని తల్లి సరోజగారు అవతలపక్కనుంచీ.
“ఏం లేదు. జస్ట్ వాంటెడ్ టు హియర్ యువర్ వాయిస్!” జవాబిచ్చాడు.
“నీ ఆరోగ్యం సరిగ్గా వున్నదా?” గాభరా పడ్డదావిడ. “ఒక్కడివీ వుంటున్నావు. పెళ్లిచేసుకొమ్మంటే వినవు!” కంప్లైంట్ చేసింది.
“నువ్వూ ఒక్కదానివే వున్నావు. నా దగ్గరకి వచ్చి వుండమంటే వింటున్నావా?” కొద్దిగా చిరాగ్గా వున్నా సౌమ్యంగానే అడిగాడు.
“నువ్వు పెళ్లి చేసుకో, వెంటనే వచ్చి వుంటా! ” అన్నారావిడ అటువైపు నించీ.
“ఇదెప్పుడూ వున్నదేగా! ఐ నీడ్ టు గో మామ్. ఫ్లైట్ కాచ్ చెయ్యాలి,” అని అతను ఫోన్ పెట్టేస్తుంటే ఆవిడ అడ్డుకుంది -
“ఇలా వేళకాని వేళలో ఎందుకు ఫోన్ చేశావు, ఇంత త్వరగా ఎందుకు పెట్టేస్తున్నావు?”
“చెప్పాగా, డెన్వర్ వెడతానని! ఇప్పుడు డెన్వర్ ఎయిర్‌పోర్ట్ దగ్గర వున్నా. వెనక్కొచ్చే ఫ్లయిట్ ఎక్కడానికి వెడుతున్నా. ఇంటికొచ్చిన తరువాత మాట్లాడుతాన్లే,” అని ఆవిడకి మాట్లాడే అవకాశా న్నివ్వకుండా ఫోన్ పెట్టేశాడు. ఎయిర్‌పోర్టు కెళ్లడానికి తయారవుతూ ఆ కలకి ఒక విధంగా కారణమయిన ఆ ట్రిప్పుని గూర్చి ఆలోచించాడు.
***
శాటలైట్‌తో ఇంటెగ్రేట్ చేసి లాంచ్ చెయ్యబోయే సోలార్ ఇమేజింగ్ ఇన్‌స్ట్రుమెంట్ డిజైన్ మీద డిస్కషన్లకోసం బౌల్డర్లో వున్న యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోకి వెళ్లాలని తెలిసినప్పుడు హమీర్ నిట్టూర్చాడు. డెన్వర్లో ఫ్లయిట్ దిగి బౌల్డర్‌కి డ్రైవ్ చేసుకుని వెడుతూ, “సేమ్ ఫార్టీ మైల్స్ యాజ్ బిఫోర్!” అనుకున్నాడు.
“ఇంతకు ముందు ఇక్కడికి పర్సనల్ ట్రిప్పుల మీద రప్పించిన ఆకర్షణ సోలార్ ఫ్లేర్‌లాగా సెగగొట్టి దూరంగా వుండమంటోందిరోయ్!” అని అంటూ తన గుండెమీద చెయ్యి వేసుకున్నాడు. రూట్ 36 మీద వెడుతూ బౌల్డర్ చేరడానికి దాదాపు అయిదు మైళ్ల ముందర, ఇక్కడ “వావ్!” అనిపించే దృశ్యం రాబోతోంది, అని గుర్తుచేసుకున్నాడు. రోడ్డు పక్కన సీనిక్ ఓవర్‌లుక్ అని పాయింట్ చేసిన చోట కారు నాపి దిగాడు. అతనున్న ఎత్తునించీ వ్యాలీలో వున్న బౌల్డర్ సిటీ మొత్తం కనిపించింది. ఊరు మొత్తం వ్యాలీలో వుండడంవల్ల అతను ప్రయాణిస్తున్న రోడ్డు కూడా ఊళ్లోకి వెళ్లడానికి కొండమీంచి కిందకు దిగింది రాజుగారి నెక్కించుకోవడానికి ఏనుగు వంగినట్టు. కొండల పాదాల దగ్గర ఊరు. ఆ పాదాల మీదకు అంతకు ముందు అతను చూసినప్పటికన్నా కొంచెం ఎక్కువ సంఖ్యలో యిళ్లు పాకుతున్న ట్లనిపించిందతనికి. ఐఫోన్‌తో ఫోటో తీస్తూ, “హలో బౌల్డర్, సే చీజ్!” అన్నాడు. తరువాత ఊళ్లోకి ప్రవేశిస్తుంటే మొదటగా కనిపించిన యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బిల్డింగ్స్‌కి హలో చెప్పి, “డు యు మిస్ మి?” అనడిగాడు.
మొదటిరోజు చర్చలయిన తరువాత ఆ యూనివర్సిటీ కాంపస్‌లో నడిచాడు. “నువ్విక్కడ ఇలా ఒంటరిగా నడవడం మొదటిసారి గదూ?” అని చెట్లూ, చుట్టుపక్కల కొండలూ అడిగిన ట్లనిపించిం దతనికి. “మూడేళ్ల క్రితందాకా ఇక్కడ సెటిలవుతా ననుకున్నా!” అని వాటికి జవాబు చెప్పాడు. “వేరీజ్ షి? ” అని అవి తన నడిగి నట్లనిపించి “నాకేం తెలుసు” నన్నట్లు భుజాల నెగురవేశాడు.
సెప్టెంబర్ కావడంవల్ల ఆకులని రాల్చడానికి చెట్లు కొద్దిగా సన్నధ్ధ మవుతుండడంతో అక్కడక్కడా ఆకుల్లో లేతపసుపు, ఎరుపు రంగులు కనిపిస్తున్నాయి గానీ, ఎక్కువ ఆకుపచ్చదనమే కనిపించింది. విశాల మయిన ఆ కాంపస్‌లో ఎత్తయిన చెట్ల మధ్యలో, అక్కడక్కడా మాత్రమే వున్నట్లున్న పురాతనమయిన బిల్డింగ్స్ మధ్యలో తిరుగుతూ, “ఇక్కడ బాచెలర్స్ చేసివుంటే బావుండేది!” అనుకున్నాడు. “ఇట్ వజ్ నాట్ మెంట్ టు బి!” అని నిట్టూర్చాడు. ఆ కాంపస్‌కి ఆనుకుని వున్న బేస్‌లైన్ రోడ్డుకు అవతల పక్కనున్న ఇండియన్ రెస్టారెంట్‌లో డిన్నర్ చేశాడు.
మరునాడు రోజంతా జరుగుతాయని అనుకున్న చర్చలు లంచ్ టైంకే అయిపోవడంతో, బౌల్డర్లోనే వుండే కొలీగ్, “బ్రైనార్డ్ లేక్ రిక్రియేషన్ పార్క్‌కి వెళ్లు, నీకు అలాంటి వాటిమీద ఇంటరెస్ట్ వుంటే!” అన్నాడు. “ది లాస్ట్ టైమ్ ఐ హైక్‌డ్ వజ్ విత్ మై డాడ్ ఆన్ ది ట్రెయిల్స్ నెక్స్‌ట్ టు ది పొటోమాక్ రివర్ ఇన్ మేరీలాండ్. గ్రేట్ ఫాల్స్ ట్రెయిల్స్. ఐ లైక్‌డిట్! ” అని హమీర్ జవాబిచ్చాడు. ఇంటర్నెట్లో కనిపించిన ఆ పార్క్ ఫొటోలు చూసి, “ఇట్ రియల్లీ లుక్స్ గార్జియస్! ” అని అతనిచ్చిన డైరక్షన్లని పట్టుకుని బయల్దేరాడు. రోడ్డు మెలికలు తిరుగుతూ, అక్కణ్ణించీ ఎత్తుకు వెడుతూ, ఒక పక్క కొండా ఇంకోపక్క లోయా కనిపిస్తుంటే – “సీనిక్ డ్రైవ్! బావుంది!” అనుకున్నాడు.
సాయంత్రం నాలుగ్గంటలకి హమీర్ ఆ పార్క్‌లోకి అడుగు పెట్టేసరికి అక్కడ ముందున్న పార్కింగ్ లాట్‌లో ఒక్క కారూ కనిపించలేదు. ఎంత స్కూళ్లు తెరిచినా గానీ సెప్టెంబర్ మధ్యలోనే ఇంత నిర్మానుష్యంగా వుంటాయా ఈ పార్కులు, అని అతనికి ఆశ్చర్యం వేసింది. ఆపోజిట్ డైరక్షన్లో ఒక పెద్ద రిక్రియేషన్ వెహికిల్ (RV) వెళ్లడం చూసి, పార్క్‌లో వున్న ఒక వెహికిలూ వెళ్లిపోయినట్లుంది, అనుకున్నాడు. కారు దిగి, అక్కడ పోస్ట్ చెయ్యబడివున్న పార్క్ మాప్‌ని చూసి, దాని పక్కన వున్న ఇన్‌ఫర్మేషన్‌ని చదివి, మళ్లీ కారెక్కి డ్రైవ్ చేసుకుంటూ లోపలకి వెళ్లాడు. అక్కడ చివరగా వున్నట్లనిపించిన పార్కింగ్ లాట్‌లో కారుని పార్క్ చేసి దిగాడు. ఒక ఇరవై గజాలు చెట్ల మధ్యగుండా నడిచి రోడ్డు మీదకు రాగానే రోడ్డు కవతలపక్క కనిపించింది బ్రైనార్డ్ లేక్ (Brainard Lake). నిశ్చలంగా వున్నదది. ఆ లేక్‌కి పక్కనే వున్న బోర్డుని చూసి అది సముద్రమట్టానికి పదివేల అడుగులకి పైగా ఎత్తులో వున్నదని తెలుసుకున్నాడు.
అక్కడి నిశ్శబ్దంలో వినిపించిన పెద్ద శబ్దం అతని ఆశ్చర్యం చేసినదే! ఎందుకంటే, నిశ్శబ్దానికి నీరాజనా లిస్తున్నట్లు చిరుగాలి నామమాత్రానికి కూడా అక్కడ లేదు. కుందేళ్లు, ఉడతలు, లేళ్లు లాంటి జంతువులు ఎండుటాకుల మీద నడుస్తూ చేసే శబ్దం ఏదీ అతని చెవులకి సోకలేదు. అంత ఎత్తున ఎగరడానికి సత్తువ లేదని పక్షులు కూడా అక్కడికి రావడానికి నిరాకరించినట్లుంది – వాటి శబ్దాలు కూడా అతనికి వినబడలేదు. పైన విమానం శబ్దాల్లేవు. కార్ల శబ్దాలు సరేసరి; అక్కడికి వచ్చిన ఒకే కార్లోంచి దిగాడతను.
జనసంచారం వుండే చోటు అక్కడికి కనీసం పదిమైళ్ల దూరంలో వున్నది. ఆ లేక్‌కి పక్కనే వున్న బోర్డుని చూసి అది సముద్రమట్టానికి పదివేల అడుగులకి పైగా ఎత్తులో వున్నదని తెలుసుకున్నాడు.
ఐఫోన్ తీసి, అతను ఆ సరస్సు ఒడ్డుకి పది గజాల దూరంలో నిలబడి తన చుట్టూ తాను తిరుగుతూ ఆ అద్భుతమైన సీనరీని ఐఫోన్లో రికార్డ్ చెయ్యడం మొదలుపెట్టాడు. ఆ సరస్సు నిశ్చలంగా వున్నదని స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు అర్థవృత్తంలాంటి ఆకారం వున్న ఆ సరస్సు చుట్టూ మూడింట రెండువంతులు సబ్-ఆల్పైన్ చెట్లు తప్పు చేసినట్లు నిశ్శబ్దంగా నిలబడున్నాయి. దిగులు పడొద్దని చెబుతూ వాటిని ఆ సరస్సు అక్కున చేర్చుకున్నట్లుగా ఆ చెట్ల నీడలు నీళ్లల్లో కనిపిస్తున్నాయి. ఆ చెట్ల వెనుకగా, పిల్లలు ఆడుకుంటుంటే నిలబడి గంభీరంగా సూపర్వైజ్ చేస్తున్న తండ్రుల్లా కనిపించాయి కొన్ని కొండలు.
ఎంత చూసినా తనివి తీరనట్లున్న ఆ దృశ్యాన్ని కళ్లనిండా నింపుకుని, పార్కింగ్ లాట్ వైపు నడవబోతుంటే రోడ్డు మీద మధ్యగా కనిపించిందతనికి – ఏదో ఒక జంతువు చేసిన విసర్జన తాలూకు తడితడిగా వున్న కుప్ప. చుట్టూ చూస్తే ఏ జంతువూ కనిపించలేదు, దేని అలికిడీ వినిపించలేదు. కారు ఎక్కిన తరువాత అది ఏ జంతువు పని అయ్యుంటుందా అని అతనికి సందేహం వచ్చింది.
***
“దట్ క్యూరియాసిటీ – దట్స్ వాట్ గాట్ మి ఇన్ టు ట్రబుల్ అండ్ గేవ్ మి ది నైట్‌మేర్ లాస్ట్ నైట్! ” అనుకున్నాడు హమీర్ డెన్వర్ ఎయిర్‌పోర్ట్‌కు డ్రైవ్ చేస్తూ.
***
ఆ ముందు రోజు రాత్రి – అదే, బ్రైనార్డ్ లేక్ నుంచీ తిరిగొచ్చిన తరువాత – మరునాడు పొద్దున్న పెందరాళే ఎక్కాల్సిన ఫ్లయిట్ కోసం డెన్వర్ ఎయిర్‌పోర్టుకి దగ్గరగా వుండే హోటల్లో ముందే రూమ్ రిజర్వేషన్ చేసుకున్నాడు గనుక, అక్కడి కెళ్లిన తరువాత ఇంటర్నెట్లో సెర్చ్ చేశాడు. కొలరాడో రాష్ట్రంలో వుండే జంతువులేవో తెలుసుకున్నాడు. వాటి గొద్దెలు ఎలా వుంటాయి అని ఇమేజెస్‌లో వెదికి చూసిన తరువాత అతనికి అర్థమైంది – తను విడియో తీసిన చుట్టుపక్కల వున్నది నల్ల ఎలుగుబంటి (black bear) అని. ఆండ్రూకి ఫోన్ చేసి – “నువ్వు అవుట్‌డోర్స్ మనిషివి కదా, పైగా ఎప్పుడూ హైక్ చేస్తూ అడవుల్లో తిరుగుతూంటావు. బ్లాక్ బేర్స్ మనుషులని అటాక్ చేస్తాయా?” అని అడిగాడు.
“దే డోన్ట్ నార్మల్లీ ఎటాక్ పీపుల్, బట్, ఇఫ్ దే ఆర్ హంగ్రీ, దట్స్ డిఫరెంట్!” ఆండ్రూ జవాబిచ్చి, “వాట్ హాపెన్డ్?” అనడిగాడు. హమీర్‌కి తన అడ్వంచర్‌గూర్చి చెబుతే అనవసరంగా ఇంటిల్లిపాదీ కంగారు పడతారనిపించింది. అందుకని, “కొలరాడో స్టేట్‌లో వున్నా గదా! ఎక్కడయినా ఒంటరిగా తిరిగేట్లయితే ముందు జాగ్రత్త పడదామని,” అని చిన్న అబధ్ధం చెప్పాడు.
“ఓకె. దేరార్ ప్రికాషన్స్ యు కెన్ టేక్ ఇఫ్ యు నో బేర్స్ ఆర్ అరవుండ్,” అన్నాడు ఆండ్రూ.
ఆ పార్క్‌లో బేర్స్ వుంటయ్యని నాకు ముందు తెలియదు గదా, అని అనుకుని, “ఐ విల్ కీపిట్ ఇన్ మై మైండ్. ఈ ట్రిప్‌లో అట్లాంటి ఎడ్వెంచర్ చెయ్యడానికి ఇంక టైంలేదు,” అని చెప్పి ఫోన్ పెట్టేశాడు.
పక్కమీద పడుకున్న తరువాత గానీ ప్రమాదానికి తనెంత దగ్గరగా వెళ్లి వుండవచ్చో అర్థం కాలేదు. అర్థమయిన తరువాత అతనికి వెన్ను జలదరించింది. అయితే, అది తన గూర్చి కాదు. “నాక్కూడా ఏమన్నా అయితే అమ్మ తట్టుకోగలదా?” అని ఆలోచిస్తూ మంచంమీద దొర్లాడు. చాలాసేపటిదాకా నిద్ర పట్టలేదతనికి. ఆ నిద్రనుంచీ మేల్కొలిపింది గదిలో అలారమో లేక నైట్‌మేరో అతనికి అర్థం కాలేదు.
ఆ తరువాత థాంక్స్‌గివింగ్‌కి మూర్తిగారింట్లో కలిసినప్పుడు, డిన్నర్ చేస్తున్న సమయంలో ఆయనకీ, భవానిగారికీ, విదుషికీ, ఆండ్రూకీ, రోహిత్‌కీ అతను చెప్పిన ఆ నైట్‌మేర్ వివరాలివీ:
“అలా మెల్లిగా చుట్టూ తిరుగుతూ విడియో తీస్తున్నానా, ఆ ఒడ్డుకి పక్కనే వృత్తానికి chord (జ్యా) లాగా వేసిన తిన్నగా గీసిన గీతలాంటి రోడ్డుకు ఆ చివర మొదలుపెట్టి, సరస్సు నంతటినీ ఫోన్లో బంధించి, రోడ్డుకు వున్న ఈ చివరి పక్కకు వచ్చేసరికి -
(బ్రైనార్డ్ లేక్ – సముద్ర మట్టానికి 10,300 అడుగుల ఎత్తులో)
“ఒళ్లంతా నల్లని బొచ్చుతో, నా బరువుకి కనీసం నాలుగింతలుండి, ఆరంగుళాల పొడుగూ, మూడంగుళాల వెడల్పూవున్న ఐఫోన్ అంత దగ్గరనించీ ఏమాత్రం కవర్ చెయ్యలేని భారీ శరీరం – బ్లాక్ బేర్ – నాకు మూడడుగుల దూరంలో – డాడీ వెనక నిల్చుని ఆయనమీద పంజా విసరబోతూ –
“నా గుండె కోట్టుకోవడం మానేసింది. అయినా కాళ్లకి ఎక్కణ్ణించీ వచ్చిందో ధైర్యం – అది మెదడుతో పనిలేకుండానే వచ్చినట్లుగా – పార్క్ చేసివున్న కారువైపుకు నన్ను పరుగెత్తించింది. ‘డాడీ – రన్!’ అని పెద్దగా అరిచాననే అనుకుంటా. ఆయన ఫాలో అవుతున్నారో లేదోనని వెనక్కు తిరిగి పూర్తిగా చూడడానికి టైం లేక కనుకొసలలోంచి చూస్తే అంతటి భారీ శరీరమూ తన స్పీడ్ నేమీ హాంపర్ చెయ్యదని నిరూపిస్తున్నట్లుగా డాడీని తరుముతూ ఆయనకీ దానికీ మధ్యవున్న దూరాన్ని బాగా తగ్గించేస్తూ వస్తోంది. ఆయనని అది తన పంజాకి చిక్కించుకునేటంతలో నాకు బేర్స్ శబ్దాలకి భయపడతాయని గుర్తొచ్చింది. కలలో అలాంటివి గుర్తుండడం వింత గాదూ? జేబులోంచి కార్ రిమోట్ ని తీసి ఎర్ర అలార్మ్ బటన్ నొక్కాను. అది బొయ్ఁ బొయ్ఁ బొయ్ఁ మంటోందని అనుకుంటే, తీరా చేస్తే అది నేను నిద్ర లేవడానికి పెట్టుకున్న అలారం!
“నాకు ఆశ్చర్యకర మేమిటంటే, కలలో కారు అలారమూ, గదిలో ఐఫోన్ అలారమూ ఎలా సింక్రొనైజ్ అయ్యాయనేది. అంటే, గదిలో అలారం కొట్టే సమయంనించీ మొదలుపెట్టి మైండ్లో కాలాన్ని వెనక్కి లెక్కేసి ఆ కల మొదలవ్వడం వింతగా లేదూ?”
***
హమీర్ డెన్వర్ ఎయిర్‌పోర్ట్ దగ్గర రెంటల్ కార్‌ని రిటర్న్ చేసి, ఆ కంపెనీ షటిల్‌లో ఎయిర్‌పోర్ట్‌ని చేరాడు. బోర్డింగ్ పాస్ తీసుకుని, సెక్యూరిటీ తతంగం పూర్తయిన తరువాత బి టర్మినల్ చేరి టైమ్ చూస్తే ఫ్లయిట్ బోర్డ్ చెయ్యడానికి ఇంకా గంటకి పైగానే సమయముంది. అక్కడ అప్పర్ లెవెల్‌లో వున్న ఫుడ్‌కోర్ట్‌లో ఒక కాఫీ తీసుకోవడానికి లైన్లో నిలబడితే ఫోన్ మోగింది. కాలర్ ఐడిలో విదుషి అని కనిపించింది. “హలో” అని అతను ఆన్సర్ చెయ్యగానే, “జస్ట్ చెకింగాన్ యు. ఎక్కడున్నావ్?” అడిగింది విదుషి.
“కాఫీ తీసుకోవడానికి లైన్లో నిలబడ్డాను,” అన్నాడు హమీర్.
“ఎక్కడ? మెక్డొనాల్డ్స్ లోనా?”
“కాదు. ఇక్కడ ఫుడ్‌కోర్టులో అప్పర్ లెవెల్లో ఒక బేకరీ వుందిలే, అక్కడ! నా సెల్‌ఫోన్‌కి ట్రాకింగ్ యాప్ పెట్టడానికి నాచేత ఒప్పిద్దామని ఎంత ప్రయత్నిస్తావో!” కొద్దిగా చిరాగ్గా అన్నాడు.
“డోన్ట్ బ్లేమ్ ది మెస్సెంజర్! దే ఆర్ మై ఆర్డర్స్! ఐ హావ్ టు ఆన్సర్ టు మామ్, యు నో? ఇట్స్ యాజ్ మచ్ ఫర్ మై మామ్స్ పీసాఫ్ మైండ్! ఒప్పుకుంటే తేలిగ్గా పోయేదానికి నువ్వే రాధ్ధాంతం చేస్తున్నావ్. అయినా, ఇంతకుముందు ఫ్లయిట్లల్లో వెళ్లినప్పుడు అక్కడెవరో వుండేవాళ్లు, వాళ్లవల్ల నీ వివరాలు తెలిసేవి. ఇప్పుడు నీ వివరాలు నీవల్ల తప్ప ఇంకెవరి వల్ల తెలుస్తాయి? ఎనీవే, కాఫీ తీసుకుని గేటు దగ్గర కెడుతున్నావా లేక అక్కడే కాసేపు కూర్చుంటావా?”
“ఇక్కడే కూర్చుంటా. ఐ విల్ టెల్యు దిస్! నీ పిల్లలకి ఇలా ఫోన్ చేసి క్షణక్షణం వేధించావంటే వాళ్లు సెల్‌ఫోన్‌ని వదిలేసి పారిపోతారు,” కోపంగా అన్నాడు హమీర్.
“కనీసం ఇంకో పదేళ్ల సంగతి. అప్పుడు చూద్దాం. లేకపోతే, పుట్టగానే వాళ్లకి ట్రాకింగ్ చిప్‌ని నేనే శరీరంలో పెట్టి కుట్టేసి, వాళ్ల ఫిఫ్టియెత్ బర్త్‌డేనాడు ప్రెజెంట్‌గా దాన్ని తీసేయిస్తా!” అన్నది విదుషి. “ఐ హావ్ టు గో. బై,” అని ఫోన్ పెట్టేసింది.
ఒకచేత్తో కాఫీ కప్పుని పట్టుకుని, రెండోచేత్తో కేరీ-ఆన్‌ని లాక్కుంటూ వెళ్లి అక్కడే వున్న ఒక టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చున్నాడు. కాఫీని సిప్ చేస్తూ అప్పటికే ఈస్ట్‌కోస్ట్‌లో తొమ్మిది గంట లయినందువల్ల ఫోన్ తీసి అందులో ఈమెయిల్స్ ఏమయినా వున్నయ్యా అని చూడసాగాడు. “కెన్ ఐ సిట్ హియర్?” అని బాగా పరిచయ మున్న గొంతు వినిపిస్తే తలెత్తి అక్కడామెను చూసి ఆశ్చర్యపోయాడు. బ్లూ జీన్స్, నడుముదాకా వచ్చి ఫ్రిల్స్ వుండి, వంటిమీద జారిపోతున్న ఆక్వా గ్రీన్ సిల్క్ టాప్‌లో మెరిసిపోతున్న ఆమె ఇంకెవరయినా అయ్యుంటే లేచి ఆమె కూర్చుంటున్నప్పుడు ఆమె వెనుక ఆ కుర్చీని పట్టుకుని నిలబడేవాడు. ఆమె ఫోన్ నంబర్ ఎలాగయినా సంపాదించాలని చూసేవాడు. ఆమె పెదాలపైన తన పెదాలముద్ర వెయ్యాలని తపించేవాడు. ఆ వెడల్పాటి నల్లని కనురెప్పలని ముద్దుపెట్టుకోవా లనుకునేవాడు. ఆ మెడ వంపుమీద తన వేళ్లను నాట్యమాడిస్తే ఆ అనుభవ మెంత బావుంటుందో తెలిసివచ్చేలా చేస్తా ననేవాడు. అయితే, హమీర్‌కి ఆ వచ్చినామె మరచిపోవాలనుకునే బలమైన పరిచయం.
అందుకే నిర్లక్ష్యంగా, “ఇట్స్ ఎ ఫ్రీ కంట్రీ!” అని బుజాలెగరేసి మళ్లీ ఫోన్ వైపు చూస్తూ కూర్చున్నాడు.
“యు హావ్ పుటాన్ సమ్ వెయిట్. అదర్ దాన్ దట్, యు హావ్ నాట్ ఛేంజ్‌డ్ మచ్!” అన్నది ఆ వచ్చినామె.
“యు హావ్ పుటాన్ సమ్ వెయిట్. ఇన్ ఫాక్ట్ టూ మచ్!”తలెత్తకుండానే హమీర్ జవాబిచ్చాడు.
ఆమె పెద్దగా నవ్వి అన్నది – “ఇట్ వుడ్ హావ్ బీన్ బిలీవబుల్ ఇఫ్ ఓన్లీ యు సా బిఫోర్ యు కామెంటెడ్! ఐ హాడ్ ఎ గ్రేట్ వ్యూ అని నువ్వన్నా దాన్లో అర్థం వుంటుంది.”
“యస్. ఐ హాడ్ ఎ గ్రేట్ వ్యూ!” అన్నాడు “డ్”ని వత్తి పలుకుతూ. “సో, హూ గెట్స్ ది గ్రేట్ వ్యూ నౌ?” కళ్లల్లో క్రోధాన్ని కురిపిస్తూ వ్యంగ్యంగా అన్నాడు.
“టెక్నికల్లీ, ఎనీవన్ హూ కేర్స్ అబవుట్ ఇట్!” అన్నదామె అతని కోపాన్ని పట్టించుకోకుండా, చుట్టూ చూస్తూ. బ్రెక్‌ఫాస్ట్ కోసం లైన్లో నిలబడ్డవాళ్లూ, ఆ ఫుడ్‌కోర్ట్‌లో కూర్చుని తింటున్నవాళ్లూ, గేటు దగ్గరకి లగేజీలనో పిల్లలనో చేత్తో ఈడ్చుకుంటూ వెళ్లేవాళ్లూ ఎవరి పనుల్లో వాళ్లు నిమగ్నమై వున్నారు. ఆమెని పట్టించుకోవడానికి ఎవరికీ తీరిక లేదు.
“యు మిస్ ది అటెన్షన్!” నీడిల్ చేస్తూ అన్నాడు.
“యస్. ఫ్రం యు!” అన్నదామె.
“యు వుడ్ హావ్ హాడ్ ఇట్ ఇఫ్ యు వాంటెడిట్!” తప్పు ఆమెదే నని గుర్తుచేశాడు.
“టెక్నికల్లీ, ఇట్స్ యు హు బ్రోక్ ఇట్ ఆఫ్. రిమెంబర్?”
“బికాజ్ ఆఫ్ దట్ స్టుపిడ్ కండిషన్!” అంటూ ఆమె ఎడమ చేతి వేళ్లవైపు చూశాడు – పెళ్లయినట్లు కనిపించే టెల్‌టేల్ సింబల్ – వెడ్డింగ్ రింగ్ కోసం. కాకపోతే, కనీసం ఎంగేజ్‌మెంట్ రింగ్ కోసం. ఏదీ అక్కడ కనిపించకపోవడం అతన్నింకాస్త రెచ్చగొట్టింది. “నీ కండిషన్లకి ఒప్పుకునే ఇడియట్ ఎవరూ నీకింకా దొరక లేదన్నమాట!” వ్యంగ్యంగా అన్నాడు.
“డోన్ట్ బి టూ హోప్‌ఫుల్! నీతో కలిసి తిరిగినప్పుడు కూడా చాలాకాలం అక్కడ రింగేమీ లేదు!” ఆమె గుర్తు చేసింది.
“వై షుడ్ ఐ బి హోప్‌ఫుల్? ఆ దురదృష్టవంతు డెవరో గానీ, నీ గూర్చి పూర్తిగా తెలుసుకోవడానికి నేను తీసుకున్నదానికంటే తక్కువ సమయం తీసుకుంటాడని ఆశిస్తా – వాడి వెల్ఫేర్ కోసం!”
“ఇట్స్ ఎ టు వే స్ట్రీట్!” అన్నదామె.
“యస్. వైడ్ ఇనఫ్ ఫర్ ఎ సింగిల్ కార్ – అండ్ పెడెస్ట్రియన్స్.”
“హే, ఇట్ కుడ్ బి వర్స్! దేర్ కుడ్ బి నో ప్లేస్ ఫర్ పెడెస్ట్రియన్స్!” సన్నగా నవ్వింది. నవ్వేటప్పుడు తమాషాగా విచ్చుకునే ఆ సన్నని పెదాలనీ, కళ్లల్లో ప్రతిఫలించే ఆ నవ్వునీ చూసి మూడేళ్లయింది అనుకున్నాడు హమీర్. రోజూ లెక్కపెట్టుకుంటూనే వున్నాడు గనుక అంత శ్రమ పడకుండానే గుర్తొచ్చింది.
“మీ అమ్మగారెలా వున్నారు?”
“బానే వుంది.”
“ఇంటికెళ్లేసరికి భోజనం రెడీగా వుంటుంది!” అన్నది.
నిజం చెప్పా లనిపించలే దతనికి. “ఆహాఁ!” అని ఊరుకున్నాడు.
“వాట్ బ్రింగ్స్ యు టు డెన్వర్?”
“కనెక్టింగ్ ఫ్లయిట్ కోసం వెయిట్ చేస్తున్నానని ఎందుకు అనుకోగూడదు?”
“ఇంత పొద్దున్నే కనెక్ట్ చేసేవేవీ వుండవు గనుక.”
ఆమె కళ్లల్లోకి సూటిగా చూస్తూ, “టెక్నికల్ మీటింగ్ ఇన్ బౌల్డర్,” అని జవాబిచ్చాడు.
“ఐ మిస్ దట్ వ్యూ!” సన్నగా గొణుక్కున్నదామె.
“డోన్ట్ హావ్ ఎనీ డ్రీమ్స్ ఆఫ్ గెటింగ్ బాక్ టుగెదర్ విత్ మి!” కరుగ్గా అన్నాడు.
“బ్రేక్ చేసిందీ, బతిమిలాడాల్సిందీ నువ్వు! గుర్తుంచుకో – మనుషులు చెయ్యగలిగింది ప్రార్థించడం మాత్రమే. కనపడ్డమా మానడమా అనేది ఏంజెల్స్ నిర్ణయించుకుంటారు!” అన్నదామె నిటారుగా కూర్చుంటూ.
“అవును. అది చెప్పింది ఏంజెల్స్ గూర్చి. పిలవకపోయినా వచ్చే డెవిల్స్ గుర్చి కాదు. మాట్లాడితే, నీనుంచి నేను పరుగెత్తుకుని పారిపోవాలి!”
“నిన్నెవరు ఆపుతున్నారు?” అన్నదామె.
“నేను ఇక్కడికి ముందుగా వచ్చి కూర్చున్నాను!” అన్నాడు హమీర్ కుర్చీలో వెనక్కు వాలుతూ.
“ఏంజెల్‌కీ డెవిల్‌కీ మధ్య ఆకర్షణ గూర్చి విన్నావా? నువ్వు చెప్పినట్లుగా అయితే, నేను డెవిల్‌నీ, నువ్వు ఏంజెల్‌వీ కదా! ఆపోజిట్ పోల్స్ షుడ్ అట్రాక్ట్!”
“డెవిల్స్ ఇన్‌ఫ్లుయెన్స్ పడగానే ఏంజెల్స్ కూడా డెవిల్స్‌గా మారిపోతార్ట. దానిగూర్చి నువ్వు వినివుండవు!”
“మరి ఈ ఏంజెల్ ఎలా తప్పించుకున్నాడో?” అడిగిందామె.
“ఒక డెవిల్ ఇన్‌ఫ్లుయెన్స్ వల్ల. అందుకని నీ నుంచీ తప్పించుకోవడం తేలికయింది,” జవాబిచ్చాడు.
ఆ గొంతులోని విచారం, దానికి కారణం ఆమెకు తెలియనివి కావు. అందుకే మాట మార్చింది. “నువ్వు ఇక్కడికి తరుచుగా వస్తూంటావా?”
“మూడేళ్లలో ఇది మొదటిసారి. ఇకముందు తెలియదు. వై డు యు కేర్?”
“ఊర్కేనే. సంభాషణని పొడిగిద్దామని!”
“నాకీ సంభాషణతో అవసరం లేదు.”
“నాకుంది. నా ఫ్లయిట్‌కి ఇంకా టైముంది.”
“నాకు లేదు,” అంటూ హమీర్ కుర్చీలోంచి లేచాడు.
“ఫ్లయిట్లో నీ పక్కనే నా సీటుంటే ఏంచేస్తావ్?”
“సీటు మార్చమని అడుగుతాను.”
“అంత భయపడొద్దులే. నేను శాన్ ఫ్రాన్సిస్కో వెడుతున్నాను!” అన్నదామె.
“నువ్వు పశ్చిమానికీ, నేను తూర్పువైపుకీ – జస్ట్ లైక్ బిఫోర్!” అని వంకరగా నవ్వి, కంప్యూటర్ బాగ్‌ని భుజానికి తగిలించుకుని, కారీ ఆన్‌ని లాక్కుంటూ బయల్దేరబోతుంటే అన్నది -
“బై నీనా, అని చెప్పు!”
“బై, మీనా!” ఆ “మీ” ని స్పష్టంగా పలుగుతూ అక్కణ్ణించీ కదిలాడు.
“బై నానీ!” అన్నది మీనా.
“షి ఈజ్ నట్స్!” అని తలనడ్డంగా ఆడిస్తూ తన ఫ్లయిట్ గేటువైపు అడుగేశాడు హమీర్.
చంద్రునిమీద నడవడం కూడా ఒక అడుగుతో మొదలుపెట్టినట్లే, రాబోయే తొమ్మిది నెలల్లో అతని జీవితంలో తిరిగే మలుపులకి కూడా అది తొలి అడుగని అతని కప్పుడు తెలియదు.
[ఇంకా ఉంది...]
Eppadivar కు bagundi
Manchi prarambhamam….’ Brainard Lake’ gurinchi vini baaga andandinchanu. Oka saari vellalani anipinchindi. Kadha baga aasakti karam GA undi…!
ఫస్ట్ చాప్టర్ చక్కగా వచ్చింది.