మావూరి ముచ్చట

అంటిత్తులు

ఏప్రిల్ 2016

రంగమ్మత్తా రామ్మామల మాదిరి ఆలూమొగుళ్ళు మా ఊర్లో ఇంకెవరూ లేరు. వాల్లిద్దరూ ఒకర్ని వదిలి ఒకరు ఉండనే ఉండరు. కూలికి పొయినా ఒకటిగా పోతారు ,ఊరికి పోయినా ఒకటిగా పోతారు. వాళ్ళ జతను చూసి ఊర్లో జనాలు వాళ్ళని అంటిత్తులు అంటుంటారు.

రంగమ్మత్త తొలిసారి యాగిటి అయ్యింది. అట్లయి ఇట్లయి తొమ్మిది నెలలు నిండినాయి. ఒక నాటి రెయ్యి, రాయినీరు కరిగే పొద్దులో అత్తకి నొప్పులు ఎత్తుకున్నాయి. కుచ్చుంటాది, లేస్తాది,అమ్మా అంటాది ,అబ్బా అంటాది. మామకి ఏమి చేయాలో తెలవలేదు, కాల్లూ చేతులూ ఆడలేదు. వాళ్ళ ఇండ్లల్లో ఉండే పెద్దోల్లను పిల్చేకి బయిటికి పోబోయినాడు . అడుగట్ల పెట్టినాడో లేదో అత్తా వచ్చి ఆయన రెండు కాళ్ళనీ పట్టుకొని “ఏడకు పోతా ఉండావు ,ఈడ్నే ఉండు” అనింది.

“ఎవుర్నన్నా పిలుసుకోనొస్తాను ఉండే ” అన్నాడు మామ.

“నువ్వు ఏడకీ పోవద్దు ,నేను బతకను ,నా కళ్ళ ముందర్నే ఉండు ,నిన్నెవరు ఇంత పని చేయమనింది. నువ్వు చేసిన పనికే నాకిన్ని ఇక్కట్లు. చేసిందంతా చేసేసి ఇప్పుడు గమ్మునుండావే,నీ మొకం మొయ్య,నీ జిమ్మడ” అని తిడతా “ఈ భాద నేను పడలేను ,ఈ నొప్పులు నేను పడలేను” అని అరస్తా ఉండాది. మామకు నోట్లో తేమ లేదు. ఏమి చెయ్యల్లనో తెలవక వనకతా ఉండాడు.

“ఒరేయ్ వచ్చి నడుము పట్టుకోరా, కాళ్ళు పట్టుకోరా” అని నోటికొచ్చినట్లు తిడతా ఉండాది. ఆ యమ్మ ఒక్కొక్క సారి బలంగా ముక్కతా ఉంటే మామకు చెమట్లు పడతా ఉండాయి. బలంగా ముక్కి “బిడ్డ వస్తుండా దేమో చూడరా ” అంటుండాది. ఆ యమ్మ నొప్పులు పడినట్లు లేదు ఆయప్ప పడినట్లు ఉండాది. అన్ని అగసాట్లు పెట్టి బిడ్డ నేల పడింది. అప్పుడయినా ఇక్కన పక్కనోల్లను పిలిచేకి ఒప్పుకోలేదు అత్త.

కొడవలితో బొడ్డు కోసి మామే బిడ్డను వరికసువు మింద పండేసినాడు.

అప్పటి నింటీ అత్తకు బాలింత పనులన్నీ మామే చేసినాడు. వాళ్లకు చేసేదానికి ఎవరూ లేరు. బాలింతలు సన్నీల్లు తాకకూడదని ,బాలింత నెల ఎల్లి పోయే వరకూ అన్ని పనులు మామే చూసుకునే వాడు.

ఆ యమ్మ మైలు గుడ్డల్ని రెయ్యి పూట ఉతికే వాడు. బిడ్డకు ,తల్లికి మందు తినిపించేది ,బిడ్డకు కుంకుమ పువ్వు ,గోరోజనము ,కస్తూరీ నూరి పోసేది ,కారం పొడి నూరి బాలింతకు కూడు పెట్టేది.. ఇట్ల పనులన్నీ మామ పాలయినాయి.

అనెంక ఇట్లే ,మొగుని ముందర్నే అయిదు మంది బిడ్డల్ని కనింది రంగంమత్త. మా రామ్మామ్మ ఆయప్ప బిడ్డలకు ఆయనే పురుడు పోసినాడు. ఐదుగురు బిడ్డలూ పెరిగి పెద్దయి ,పెళ్ళిళ్ళు చేసుకొని వేరు కాపరాలు పెట్టుకున్నారు. అత్త కూ మామకూ వయసయిపోయింది. అత్తకు ఒళ్ళు బాగాలేకుండా వచ్చి ,ఏ పనీ చేయలేకుండా అయ్యింది. ఇప్పుడు మామే అన్ని పనులూ చేస్తాడు. పండక్కీ పబ్బానికి ఇల్లు అలికేదీ ,కుండా సట్టి కడిగేది, వంటావార్పు ,పూజా పునస్కారాలు అన్నీ మామే చేస్తుంటాడు. ఊర్లో జనాలు ఇప్పుడు కూడా వాళ్ళని అంటిత్తులు అనే అంటుంటారు.

**** (*) ****

illustration: Kiran B.