సౌందర్యపు సెలయేటి నీటి దప్పిక ఎప్పుడూ ఆరదూ తీరదూ… ఇప్పుడు మందు మీద మత్ప్రియురాలి దర్శనకాంక్ష తీవ్రంగా…గేట్‌ను బండితోనే తోసుకు లోపలికి, నా లోపలికి… పగిలిన సాంధ్య వర్ణాలను చప్పరిస్తూన్నప్పుడు, అప్పుడప్పుడే విడివడ్తూన్న రేరాణీ పరిమళాల్తో…ఆ మధుగంధ మిళితమై…బహుమను తే నునుతే తవ’ లేను సంగీత పవన చలిత…పిండా కూడూ, నిర్వికారంగా తిరుగుతూన్న ఫ్యాను…
కింద మోజుపడి పరిపించున్న మార్బుల్ ఐసురింక్ మీద చక్కర్లు కొడుతున్న ఉల్లిపొట్టు బ్యాలే….నిశ్శబ్దంగా గిరగిరగా భ్రమణం…దివాను మీద ఆరి మడతలు పడ్డానికి ఓపిగ్గా ఒకదాన్నొకటి కావలించుకొని గుట్టగా బట్టలు. లోపలెక్కడో తన పరిమళం… ఎక్కడున్నా గుర్తిస్తా…ధీర సమీరే యమునా తీరే…. ఎండిపోయిన తుంగభద్రా….ఒడ్డు పబ్లిక్ పాయిఖానా…
ఒకప్పటి శృంగార భావన్లు నిర్లజ్జగా పల్లేరు కాయలల్లే కరుచుకునే వున్నాయి. నలభైఏడేళ్ళుగా నా మీంచీ కర్కశంగా నడుచుకుంటూ వెళ్లిపోయిన కాలం గుర్తులు…తెల్లబారిన గడ్డమ్మీసాలు, స్టాంపు ముద్రలు…ఏదో దేశానికి సిల్క్ ముద్రలున్నాయట.
“బండి అక్కడే పారేసి ఆటోలో ఏడ్వొచ్చుగా…ఎక్కడైనా గుద్దితే…? ఎవ్రీడే ఈజ్నాటే సండే…”
“ప్రియే…వారాంతం…నల్గురం కలిసాం మధువన్లో, కేవలం రెండే…యిదో యింకో మూడు జోబులో…క్వార్టరంతే…”
“నిజమే ఆ ఏడుపేదో ఇంట్లో ఏడ్వొచ్చుగా, చిన్నది నువ్వొచ్చే వరకూ అన్నం తిననని అట్టాగే పడుకుండిపోయింది…”
చున్నీలేని జారిన గుండెల్తో మత్ప్రియురాలు. కొండేపూడి కవిత్వం ‘హృదయానికి బహువచనం’ అనుకుంటా, రొమ్ముల గురించి మంచి కవిత్వం…చివరికింతేనా….
‘రసవజ్ఝరికి తెరవేస్తూ రాజీకి జీవరాహిత్యానికి తాంబూలమిస్తున్నట్టు పరచిన ఆకుల మీద వక్కల్లాగా అంతేనా…’ అంతేనా మత్ప్రియురాలా!
బట్టలగుట్ట మీద ఒకప్పుడు స్నిగ్ధకోవలంగా వుండిన హస్తద్వయం ఎన్నివేల కోట్ల మాట్లు…సెగరెట్ వేడితో పొగతో నల్లబారిన నా మొరటు పెదాల్తో…అయ్యో నిజం యింత నిష్ఠూరంగా వుండాలా…?!
డై చేసిన ముంగురుల మధ్య నుంచీ కారి జారిన చెమట చుక్క ఒకప్పటి పాలరాతి ముక్కలాంటి నుదుటి మీద…
“వేడిగా వుంది…నే మడుస్తాలే, నువ్వెళ్ళి స్నానం చేసిరా….” కొద్దిగా ముడతలు పడ్తూన్న చేతుల మీద చెయ్యేసి అన్నా…
“ఏఁ చెమట్లు కక్కుతున్నాననా… ఎన్నిసార్లు, అయ్యెయ్యో ఖండశర్కర కరిగి జారిపోతోందంటూ నాకలా?”
పువ్వులా నవ్వకే నా ఎంకీ, గువ్వలా ఎగిరిపోయిన కాలాన్ని చూసీ….ఈ క్షణానికి నే నండూరిని మరి…
“ఛీ, నువ్వెళ్ళు ముందు. సిగరెట్లూ మందూ ఆ బార్ వాసనా ఉదయాన్నే కొట్టుకున్న స్ప్రే కల్సి కంపుకొడ్తూన్నావ్…”
పెద్దది గదిలోంచొచ్చి…
“వచ్చావా…నా బండి సంగతేం చేసావ్? ఎవరో అడిగారన్నావే…లేకపోతే ఎక్స్చేంజ్‌లో తీసుకుందాం వూరకనే నాన్నా వూరికే సతాయిస్తోందదీ” దాందగ్గరి కెళ్ళి ఆ బూరె బుగ్గల్ని తడిమి చుపుక్కుమని శబ్దం చేస్తూ, “ఓ కే ఓకే కే….”
“రేపు నేనూ మా కల్సెళ్తాం నీకు చెప్తన్నానంతే” అల్టిమేటం…ఓ కుసుమ కోమలి నియంత…నీలిపువ్వుల తెల్లనైటీ హాలంతా తిరుగుతూ నైటీ ఉల్లిపొట్టు పందెం…దివాన్కిందికి దూరి నిశ్చబ్దంగా నవ్విన ఉల్లిపొట్టు వెకిలి నవ్వు…
“ఈ టేబుల్మీద కూరగాయలు తరక్కు మా…దో బండి, యింకా మందు పూర్తిగా ఎక్కలేదు కాబట్టిప్పుడే చెబ్తున్నా…” గదిలోకి మాయమైన నైటీ…తల్లీతండ్రితో ఒకే వాక్యంతో సంభాషించి….వ్యాకరణ వేత్తలారా, కర్తలారా…యిదేం సెంటెన్సూ?
“వెళ్ళమన్చెప్పానా, త్వరగా రా, నేనెళ్ళాలి… లేపోతే బైట బాత్రూం లోకి దూరు, మాట్లాడాలి నీతోటి”
మళ్ళీ యిదేం సెంటెన్సూ? ఏమో! నిత్య పరిణామ కాంక్ష యీ భాషకు..
నన్ను నేను కడుక్కుని, తెల్లని పైజమా టీషర్ట్‌ల్లోకి మెటం సైకోసిస్….కరెక్టేనా? ట్రాన్స్ మైగ్రేషన్ని అదే కదా అంటారూ? మళ్లీ భాష…
సీసాలో సిల్క్ ….గ్లాసులోకి….ఫ్రిజ్ సీసాలో పన్నీరు గ్లాసులోని సిల్క్ తో… పాత సింథాల్ పరిమళం గదినిండా…
హా హా మత్ప్రియురాలు…ఎన్నియుగాలుగా?
“రేపుదయాన్నే లేచే పన్లేదని నిండా తాగేకు…కాస్సేపు నీతో మాట్లాడాలన్నానా” అన్నానా? భామని…
ఏమని?
అరవిరిసిన పూలలోన…
తర్వాతేమో…మాట వరసకెపుడైనా…
సముద్రాల అన్నాడా? అరవై ఏళ్ళ క్రితం అపుడెపుడో అన్నాడా?
“వినపడిందా?” తలమీంచీ జారిన నిశావసనం…నైటీ…
“టాక్టుమీ మై డాలింగ్”
“చిన్నదాన్ని లేపొస్తా..కాస్తాడ”
నాకు తోడుగా గదిలో పరిమళాన్నొదిలి తను బైటికెళ్ళింది…
కుషన్డ్ ఈజీ చైయిర్లో అనీజీగా నేను…
నే….ను…నేనూ? ఎవర్నీ? ఎవరీ నేను?
శుద్ధ చైతన్యధృతి, ఆలోచన కృతి…జగద్యో ని….
కోహమ్
కోహమ్
సోహమ్
సోహమ్
త్వత్త్వమసి…ఫిలోసోఫీ…ఏడాదికి పన్నెండు లక్షలు….
మత్ప్రియురాలి ప్రియుడు….ప్రియుడేనా?
ఇద్దరందగత్తెల అస్తిత్వానికి రెండు కారణాల్లో ఓటి….
నీతో మాట్లాడాలన్నానా?
భామిని…ఏమని? మాటవరసకెపుడైనా….ఎపుడైనా సరే…
కాదన్నానా? పాతికేళ్ళుగా మాట్లాడ్తూనే వున్నాం…ఫుల్‌స్టాప్ లేని అతిదీర్ఘ వ్యాక్యం…ఇద్దరం కల్సి ఇద్దరం నాన్ స్టాప్‌గా సంభాషించుకుంటూనే వున్నాం…రెండు పాత్రలు కలసిపోయి మోనో యాక్షన్…బ్బో భలేవుందే…రెండు పాత్రలు ఒకే యాక్షన్…. ఆరు పాత్రలు కల్సి రచయిత కోసం అన్వేషణ లూక్జీనీ నాటిక…అప్పుడు అట్టర్ ప్లాపే యిపుడు అతిగొప్ప ప్రయోగం… మా యిద్దరిదీ నాటకం కాదే. అవసరార్థం ఒకర్నించొకరం దాక్కుంటాం గానీ…
“పెద్దది దాన్ని లేపి అన్నం పెడ్తోంది” వసంత తిరోగమనం….
“అవునూ, మందుకేమీ తెచ్చుకోలేదా…వట్టి చన్నీళ్లతో తాగుతున్నావ్?” మళ్ళీ అంది….
“నిన్నడుగుదామనుకునేంతలో వెళిపోయావ్”
అక్యూజింగ్ గా అన్నా….
“నారాయణా మిక్స్చరుంది తేనా? అయినా నేన్నీతో మాట్లాడాలన్నా కదా…. అసలు పిల్లల గురించి నువ్వేమనుకుంటున్నావ్…మిక్స్చర్ తెస్తా ఆగు….” మళ్లీ మాయమయింది మత్ప్రియురాలు…
మిక్స్చర్తో వున్న స్టీల్ బౌల్ పక్కన పెట్టి “చెప్పు” అంది.
“హ్హ హ్హ హా వాళ్ళు నా…సారీ మన పిల్లలు…అంతే” అన్నా. “నీకూ నాకూ పిల్లలే సామి…పెద్దదానికి ఇరవై ఓటి….ఎట్లా ఎదుగుతోందో చూసావా? శరీరం కాదు వాళ్ళ చెవుల మజ్జ గుజ్జు కూడా చాలా బాగా వృద్ధి చెందింది…అది…అదీ గమనించావా….దానికి సొంతలోకం తయారయ్యింది…అది మన కూతురే కాదనేందుకు ఈ ప్రపంచానికే మీ హక్కు లేదు….కానీ అదో పూర్తీ ఆడదైంది. షి యీజ కంప్లీట్ ఉమన్ బై హర్సెల్ఫ్…డిడ్యూ నోటీస్దాట్? అదీ చెప్పు ” తలగడ వొళ్లోకి లాక్కొని పరుప్మీద వికసించిన పద్మంలా….
“వాడ్డూయూ వాంట్మీ టుడూ, సీ..అయ్ లవ్ హర్ యాజయ్ వాజ్లవింగ్హర్ బిఫోర్షివాజ్ బార్న్…ఇప్పు..ఇప్పుడెందుకడిగావ్…” ఇంకా మాట్లాడబోతున్నా…
“మా” పెద్దగా అరిచినట్టుగా పిలిచింది మా సంభాషణ కారణం…గభాల్న లేచి బైటికి వెళ్లింది తను, దాదాపుగా పరిగెత్తినట్టు. బైట హాల్లో ఏవో హడావుడి సంభాషణలు..సగం తెర్చిన తలుపుల్లోంచీ నా భార్య పృష్ఠభాగం కనబడ్తోంది…అప్రయత్నంగా ఎరోటిక్ ఫీలింగ్….భాస్వరత్ర్సోణి శోభాజిత స్వర్ణభూభృత్సేల్ ఘన నితేంబ…గగనజఘన
తుఫానులా మళ్ళీ లోపలికి తన్నుకొచ్చింది…
“లే…త్వరగా వెంకోబరావు యింట్లోకి…అతనేదో చేసుకున్నట్టున్నాడు..క్విక్…ఫాస్ట్” ఇప్పుడే కదా నాతోపాటు యింటికొచ్చాడు వెంకోబా…అంతలో ఏమై వుంటుందీ….అరగంటలోపే …దాదాపు పరిగెత్తా వెంకోబా యింటికి…నా వెనకే తనూ…తనవెంట పెద్దదీ. వెంకోబరావ్ మంచమ్మీద పడుకునున్నాడు….వాడి భార్య మీనాక్షి ఏడుస్తోంది గట్టిగానే….వెంకోబుడి కూతురు కన్నీళ్లు కారుస్తూ “నానా! నానా! ప్లీజ్ లే నానా, నువ్ చెప్పినట్టు వింటా ప్లీజ్ నానా…మాయా ప్లీజ్, నాన చాలా పిల్స్ మింగేసాడు యిప్పుడే…ఎన్నో తెలీదు”
పెద్దది వన్నాటెయిట్కి ఫోన్జేసేసింది…హాస్పటల్ చాల్దగ్గిర….
వెంకోబుడ్ని లేపడానికి ప్రయత్నం చేసా, ముఖాన నీళ్లు కొట్టా. కొద్దిగా కదుల్తున్నాడుగానీ….మగత కమ్మేసింది…అంబులెన్స్ వచ్చేసింది.
“అమ్మాయిని చూసుకో” అని వెంకోబరావ్ కూతుర్ని తనకప్పజెప్పి, మీనాక్షితో కల్సి యాంబులెన్సెక్కి బోతూండగా, పెద్దది నా వ్యాలెట్ తెచ్చిచ్చింది…
ఎంత ప్రెజెన్సాఫ్ మైండ్ దీనికి! ఓ క్షణం ఆశ్చర్యపడి, తలాడించి మీనాక్షి పక్కన కూచున్నా..యాంబులెన్స్ లోంచే డాక్టర్కి ఫోన్చేసి విషయం చెప్పేసా…నర్సింగ్హోమ్ దగ్గరే వుంటాడు తను బాగా తెలిసిన వాడే…
వెంకోబరావ్ పరిస్థితి దాదాపు అర్థమయిపోయింది…తండ్రీ కూతురూ గొడవ పడ్డారు. ఏ విషయమో వూహించడం కష్టం కాదు. ఆ అమ్మాయికి ఇరవై నాలుగు, ఇరవై ఐదేళ్ళుంటాయి.. బెంగుళూర్లో పన్జేస్తుంది. ఓ ఎమ్మెన్సీలో చాలా మంచి జీతం…
పక్కనున్న మీనాక్షి వైపు చూసా..
భర్త మీద ఓ చెయ్యేసి నిశ్చబ్దంగా రోదిస్తోంది. సౌందర్యాన్ని ఏరి పట్టుకోవడం నీకో వ్యసనంగా పరిణమించిందన్న మత్ప్రియురాలి మాట గుర్తొచ్చింది. దాదాపు చావు బతుకుల్లో వున్న వెంకోబరావు భార్యలో ఘనీభవించిన సౌందర్యం ముగ్ధ విషాదంగా గోచరిస్తోంది నాకు. బుద్ధికి సమయాసమయాలుంటాయా? నా బుద్ధికి మాత్రం లేవుగాక లేవు….
దాదాపు మృత్యుకౌగిల్లో వెంకోబరావు….మృత్యువును తాకుతూ మీనాక్షి సౌందర్యం….ఇదేం బుద్ధి? ఇదేం ఆలోచన?
వెంకోబను క్యాజువాల్టీకి తీసుకెళ్ళగానే అప్పటికే వచ్చేసిన డాక్టరు ఇమ్మీడియేట్గా స్టమక్ వాష్‌కు ఆర్డర్ వేసాడు…డాక్టర్ గారి పక్కక్కూచుని “సర్”? అని నేనే ఓ పెద్ద ప్రశ్నార్థకంగా ముడుచుకున్నా….
“చాల్తొరగా తెచ్చారు…హిమస్ట్ కమవుట్…విల్సీ…” డాక్టర్ వెంకోబరావు దగ్గరికెళ్లిపోతూ
“ఇప్పుడే కేషీట్ రాయకండి…” అని నర్సుకు చెప్పాడు.
నెన్చెప్పాలనుకున్నదదే….లేనిపోని పెంట….డాక్టరీజ నైస్ రీజనబుల్ మ్యాన్’ అనుకున్నా….రూల్స్ కు వ్యతిరేకంగా వెళ్ళడంలో సోషల్ జస్టిస్. ఓ గంట తర్వాత డాక్టర్,
“అతనికి టాబ్లెట్స్ ఎక్కువ దొరికినట్టు లేదు లెండి. దట్టూ హీ సీమ్స్ టు హ్యావ్ త్రెటెన్డ్ హిజ్ ఫామిలీ…లుకిన్టు ఇట్…కానీ, ట్వన్టీఫోరవర్స్ అబ్జర్వేషన్లో వుంచాలి…” అన్నాడు.
వెంకోబుణ్ణి గదికి షిఫ్ట్ చేసారు.
“ఐసీయూ అవసరం లేదు లెండి. అయినా వి విల్నాట్ మేకిట్ పబ్లిక్….అర్థమయింది…” డ్యూటీ డాక్టర్‌కు అన్నీ చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. గది నిశ్శబ్దంలో నేనూ… డీలా పడిన సౌందర్యం మిగిలాం…దీర్ఘంగా శ్వాసిస్తున్న వెంకోబుడితో…
వాడు ఎవర్ని బెదిరించాలనుకున్నాడో అర్థం కావడానికి నేనో ఐన్‌స్టీన్ కానక్కర్లేదు…కూతురు. ‘షీ ఈజ్ కంప్లీట్ ఉమన్ బై హర్సెల్ఫ్, డిడ్యూ నోటీస్ దాట్?’ నా సగం జీవితమడిగిన ప్రశ్న గుర్తొచ్చింది. వీడు తన కూతురు మీద వున్న హక్కును దొహరాయించడానికి వ్యర్థ ప్రయత్నం చేసాడు….
అదో పరిపూర్ణ స్త్రీ. దాని జీవితం పట్ల దానికున్న హక్కును అది ప్రకటించి వుంటుంది, వీడిట్లా సమాధానం చెప్పాడు. వీడు చక్రం తిప్పుతూంటే చెరుగ్గడల్లా నలుగుతున్నది మాత్రం వేరెవ్వరో….
జీవితం దానంతట వుంటుంది. కానీ జీవితం…..నా జీవితంలోని వ్యక్తుల జీవితం ఇట్లాగే వుండాలి అని అనుకున్నాడు వెంకోబుడు…జీవితానికి పర్యాయాలూ, ఎన్నికలూ, వీడు కోరిన స్వాతంత్ర్యం, వీడు కోరిన విలువలూ, హక్కులూ….మట్టిగడ్డా వీడు నిర్ణయించేసుకున్నాడు. వీడి కూతురు దాని ప్రకారం అది నిర్ణయం ప్రకటించింది. పర్యవసానం, వైరుధ్యం…రగడ…చిన్న రచ్చ…
నా గదిలో కుషన్డ్ ఈజీ చైయిర్లో నా అస్తిత్వం..ఇరవైమూడ్లో ఏసీ..మెదుడు రకరకాల ఆలోచన్లు విడదీయడానికి ప్రయత్నం చేస్తోంది…
“నానా ” మెత్తగా పువ్విడిగినట్టు పక్కన కూచున్న, ముడుచుకున్న వసంతం…కళ్లు తెరిచి చూసి….దాని తల మీద చెయ్యేసి “చెప్పరా” అన్నా.
“ఆర్యూ ఆల్ రైట్?” ఇంకా దగ్గరికి జరుగుతూ అడిగింది.
“యా బెస్ట్” అన్నా.
“బండీ….?” నసిగింది.
గట్టిగా నవ్వా, కళ్ళలో నీళ్లు తిరిగాయి. కారణాలు రెండు..”
నీ ప్రయాణం నీ ఇష్టంరా” వంగి దాని తల మీద ముద్దు పెట్టుకొని అన్నా.
**** (*) ****
ప్రియమైన శ్రీ కాశీభట్ల వేణుగోపాల్ గారు, నమస్కారములు.
కవిత్వంలో, వచనంలో రసవజ్ఝరి మీరు. శుద్ధ చైతన్యధృతి, ఆలోచన కృతి మీరు.
ఇలా అంటున్నది నాలాంటి అల్లాటప్పా రాయుడు కాదు;
మిమ్మలమితంగా ప్రేమించిన ‘మో’ గారు, త్రిపుర గారు, మరెందరో తెలుగు సాహితీ ప్రముఖులు, మీ అభిమాన పాఠకులు.
‘మో’, త్రిపుర గార్ల దీవెనల సుధలు మేఘమాల నుండి మీ పై కురుస్తున్నాయి
” కాశీ నీ ప్రయాణం నీ ఇష్టంరా, కానీ ఎవ్రీడే ఈజ్నాటే సండే ” అంటూ హద్దులు పెడుతూ
చాలా బాగుంది . అనుభూతించి అనుభవించే కథ ! రచయితకు కృతజ్ఞతలు !
Variety kadha chadavataniki bagundi. Dhanyavaadalu
చదువు తున్నంత సేపు కొలిమిలో కాలుతున్న నిప్పులా,కణకణ మంటూ నే ఉంది.. నిజం వేణుగోపాల్ గారికి ధన్యవాదాలు
అద్భుతమైన కథ …మీ శైలి విలక్షణం
శైలిలో, శిల్పంలో ఎలాంటి ప్రత్యేకతా లేకుండా సాదాసీదాగా రాసిి చాలామంది చేత మెప్పును పొందుతాం కాని దానికంటె, కొద్దిమంది అభిమానుల్ని సంపాదించుకున్నా సరే, ఇలా beaten path నుండి దూరంగా పోతూ విలక్షణంగా రాయటమే బహుధా ప్రశంసనీయం, అభినందనీయం.
భ్హలే. కథ భలే చెప్పారు. ఎదురొడ్డి ప్రయోజనం లేదని. సరెండరే బెటరని.
“నా జీవితంలోని వ్యక్తుల జీవితం ఇట్లాగే వుండాలి అని అనుకున్నాడు వెంకోబుడు…జీవితానికి పర్యాయాలూ, ఎన్నికలూ, వీడు కోరిన స్వాతంత్ర్యం, వీడు కోరిన విలువలూ, హక్కులూ….మట్టిగడ్డా వీడు నిర్ణయించేసుకున్నాడు. వీడి కూతురు దాని ప్రకారం అది నిర్ణయం ప్రకటించింది. పర్యవసానం, వైరుధ్యం…రగడ…చిన్న రచ్చ…”
నా నీ నౌ నో నే నెవర్.
నా, నీ,
ఇంతేనా, తేనా, నా,
అవునిన్తే, తే,
నోనా, నో,
నా, నీ,
రెండింతే, రౌండిన్తే,
ఇంతే.