అనువాదం

తత్త్వశాస్త్రం యొక్క ఆవశ్యకత

ఏప్రిల్ 2016

["The Ultimate Belief" by CLUTTON BROCK]

ఉపోద్ఘాతం

చిన్ని పుస్తకాన్ని ఎప్పుడైనా రాసి ఉండొచ్చు గాని, ఈ ప్రపంచ యుద్ధం దానికి ప్రేరణనిచ్చింది. జర్మన్లు వాళ్ళ పాఠశాలల్లో, అక్కడి జనాభాలో ఎక్కువమంది ఆమోదించే ఒక రకమైన భావజాలాన్ని బోధిస్తారు, దానికి అనుగుణంగానే వాళ్ళు ఇప్పుడు ఆచరిస్తున్నారు. అది వాళ్ళకి ఒక ఐకమత్యాన్నీ, మొండి ధైర్యాన్నీ ఇచ్చింది; అంతే కాదు, మనందరకూ తెలిసిన అనేక నేరాలు చేసేలా ప్రేరేపించింది కూడా. మనం, దానికి విరుద్ధంగా, మన పాఠశాలల్లో ఏ భావజాలాన్నీ బోధించము, కనీసం తత్త్వచింతనగా పిలవదగ్గదేదీ బోధించము; అలా చెప్పనందుకు గర్వపడతాము కూడా. ఒక భావజాలం జర్మన్లు అంత క్రూరులుగా మారిస్తే, మనకి ఏ రకమైన భావజాలం లేకపోవడమే మెరుగు అనుకుంటాం. కానీ జర్మను భావజాలం చెడు ఫలితాలనివ్వడానికి కారణం ఆ ఆలోచనలలోని చెడుదనం; నైతికంగానే కాదు, మేధోపరంగా చూసినా. ఒక భావజాలంలో దోషం ఉన్నంత మాత్రం చేత ఏ రకమైన భావజాలాన్నీ కలిగి ఉండకపోవడమే మంచిదనుకోకూడదు. జర్మనులు వాళ్ళ చెడు ఆలోచనలా ప్రోద్బలం వల్ల కొన్ని మంచి విలువల్ని కూడా వాళ్ల చెడు లక్ష్య సాధనకి దుర్వినియోగం చేశారు; కానీ వాళ్ళు ప్రపంచం నిర్ఘాంతపోయేలా ఆచరించేరు; మనం ఏ రకమైన ఆలోచనా లేకపోవడం వల్ల, మంచిది గాని చెడ్దది గాని, మనం ఏ విలువలూ ప్రదర్శించలేకపోయాము. మనకి మన విద్యావిధానం ఉంది, కానీ దానికి మనిషిగురించినది గాని, విశ్వం గురించినది గాని, ఏ తాత్త్విక ప్రాతిపదికా లేదు. మనకీ ఒక మతం ఉంది, కానీ, అందులోనూ ఏ రకమైన తాత్త్విక చింతనా లేదు. ఏ తాత్త్విక చింతనా లేని మతం సజీవమైన మతంకాదు. అది దాని విశ్వాసాలని నిలబెట్టుకోవచ్చునేమోగాని, ఆ నమ్మకాల వెనుకనున్న అసలు కారణాలు తెలుసుకోలేదు. ఉదాహరణకి ఒక బాలుడున్నాడు. వాడికి దేముడున్నాడనీ, దేముణ్ణి ప్రేమించాలనీ చెప్పారు; కానీ దాని వెనుక ఒక తాత్త్విక ప్రశ్న ఉంది: అతడు దేవుణ్ణి ఎందుకు ప్రేమించాలి? అన్నది. దానికి గాని సరియైన సమాధానం చెప్పకపోతే, అతడు దేవుణ్ణి తప్పుడు కారణాలకి ప్రేమించడం నేర్చుకుంటాడు, దానివల్ల అతన్ని ప్రేమించడంలో విఫలమౌతాడు. అతడు తనని ప్రేమించుకుంటూ, దేవుణ్ణి ప్రేమిస్తున్నాననుకుని తనని తాను మోసం చేసుకుంటుంటాడు. మనం స్వర్గానికి వెళతాం కాబట్టి దేవుణ్ణి ప్రేమించాలనుకునే వాళ్ళది కూడా ఇదే పరిస్థితి. వాళ్ళ స్వలాభాపేక్ష స్వర్గానికి వెళ్ళాలన్న కోరిక రగిలిస్తోంది; మీరు భగవంతుణ్ణి గాని, మరెవరిని గాని, ఏ వస్తువుని గాని, స్వంతలాభం ఆశిస్తున్నంత సేపూ ప్రేమించలేరు.

తత్త్వశాస్త్రం ఒక్కటే మీకు దేవుణ్ణి గాని మరెవరినైనా గాని ఎందుకు ప్రేమించాలో; అసలు ప్రేమ అంటే ఏమిటో చెబుతుంది. కనుకనే మనం తత్త్వచింతనలేకుండా బ్రతకలేము, మనకి ఎంత ధార్మిక చింతన ఉన్నప్పటికీ. నిజానికి, మనకి ధార్మిక చింతన ఎంత ఎక్కువగా ఉంటే, అంత ఎక్కువగా మనం తత్త్వచింతన ఆవశ్యకతనీ, యువతకి చిన్నప్పటినుండీ దాన్ని బోధించవలసిన అవసరాన్నీ గ్రహించగలుగుతాము. మనం మంచి అంటే ఏమిటో, మనుషులు ఎందుకు మంచిగా ఉండాలో స్పష్టమైన అవగాహనలేకపోతే, మనం మంచిగానూ ఉండలేము, మంచిగా ఎలా ఉండాలో ఇతరులకి చెప్పనూ లేము. ఒక చిన్న పిల్ల వాడికి ఒక పని ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెబుతూ, అలా చెయ్యమని చెప్పడానికి వెనకగల కారణం చెప్పకపోతే, జీవితం ఏ నిబంధనలూ లేని ఎవరు ఎలాపడితే అలా ఆడే ఆట అని చెబుతున్నట్టు లెఖ్ఖ; అదే నిజమైతే, జీవితానికి విలువలేదు.

ఆ విషయంలో జర్మనులు పిల్లలకి కనీసం ఒక స్పష్టమైన సిద్ధాంతాన్ని బోధించారు. వాళ్ళు తమ పిల్లలకి వాళ్ళు మంచిగా ఉండాలనీ, వాళ్ళు ఏమి చేసినా దేశం మంచి కోసం చేయాలనీ చెప్పారు; వాళ్ళ పిల్లలు దీన్ని నమ్మి, జర్మనుల దృష్టిలో ఏది మంచి అయితే, ఆ దృష్టిలో ఆశ్చర్యకరంగా అంత మంచిగానూ ప్రవర్తించగలిగేరు. వాళ్ళు చాలా శ్రమించారు, విధేయత కలిగి, ఆత్మ-త్యాగం చేసుకున్నారు. వాళ్ల దేశం పరిశుభ్రమైన దేశంగా, అత్యంత నైపుణ్యవంతమైన దేశంగా, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా, మానవాళికి భరింపరాని ఉపద్రవంగా తీర్చిదిద్దేరు. ఇందులో మనకి స్పష్టంగా తెలుస్తున్నది, “మంచితనం” అంటే వాళ్ళకున్న అభిప్రాయం మనకున్న అభిప్రాయం ఒకటి కాదని; కానీ, వాళ్ళ భావజాలపు అంటురోగం మన మనసులకి సోకకూడదనుకుంటే మన దృష్టిలో మంచితనం అంటే ఏమిటో మనకి తెలియాలి. మన అభిప్రాయం ఏమిటో అంచనా వెయ్యడంలో గాని, మనపిల్లలకి బోధించడంలో గాని మనం ఘోరంగా విఫలం అయ్యాము.

మనకే అదేమిటో తెలియకపోతే, మనం మనిషి మనసు గురించి ఏం అనుకుంటున్నామో, ఈ జీవితం లక్ష్యం ఏమిటో, ఈ సృష్టి తత్త్వం ఏమిటో తెలుసుకోకుండా, పిల్లలకి బోధించలేము. ఈ విషయాలేవీ చెప్పకుండా మనం ఏది చెప్పినా అది పేలవంగానూ, నమ్మలేనిదిగానూ ఉండి పిల్లలు వ్యతిరేకించే అవకాశం ఉంది నిజానికి, చాలా సార్లు సవాలు చేస్తారు కూడా. ఇంగ్లండులో ఒక గుడ్డిగా ప్రతిదాన్నీ వ్యతిరేకించే, నిష్ప్రయోజనమైన ప్రతిస్పందన యువతలో కనిపిస్తుంది. మనం దాని గురించి చాలా గర్వపడతాం గాని, దానికి తగిన కారణం కనిపించదు.

వాళ్ళకి సత్యం అంటే ఏమిటో బోధిస్తే, అది వాళ్ళు నేర్చుకుని, విశ్వాసం ఉంచితే మంచి జరుగుతుంది. మనం వాళ్ళకి సత్యం ఏమిటో చెప్పలేనపుడు, వాళ్ళకి ఏదీ చెప్పకుండా ఉండవలసింది. తిరుగుబాటు అంటే ఎప్పుడు తప్పే, అది తిరగబడినవాళ్లలో గాని, తిరగబడిన వాళ్ళమీదగాని; కనుక అది మనకి గత్యంతరంలేని చివరి మార్గం. మంచి బోధనకి ఋజువు ఏమిటంటే, అది విద్యార్థి నమ్మడం, నమ్మిన వాళ్ళకి అది లాభం చేకూర్చడం. జర్మను బోధన ఎందులో బాగుంది అంటే, దాన్ని అందరూ నమ్మేరు; అది ఎందులో బాగులేదంటే, అది వాళ్ళకి మంచి చెయ్యలేదు. మన బోధన ఎక్కడ చెడ్దగా ఉందంటే సర్వసామాన్యంగా యువతలో ఒక మోస్తరు దాటి తెలివైన పిల్లలకి అది నమ్మశక్యంగా కనిపించదు; వాళ్ళకి అలా కనిపించడానికి కారణం అందులో పొంతనా లేదు, స్థిరత్వమూ లేదు.

నేను స్వయంగా ఉపాధ్యాయుడిని కాను; కాని నేను స్వయంగా నేర్చుకున్నాను, నాకు చెప్పినదానిపట్ల నాకు గుడ్డిగా కలిగిన ప్రతిస్పందనలు గుర్తున్నాయి. ఒకసారి గతంలోకి చూసి వాటిని తలుచుకున్నప్పుడు, నాకనిపిస్తుంది, నేనెందుకు ప్రతిఘటించేనంటే, నాకు ఎవ్వరూ చెప్పనూ లేదు, చెప్పే ప్రయత్నమూ చెయ్యలేదు, నేను ఎందుకు జ్ఞానాన్ని ప్రేమించాలో, అందాన్ని లేదా ధర్మాన్ని ఎందుకు ఆరాధించాలో. చెప్పిన పాఠాలు నేర్చుకోవాలనీ, కొన్ని నియమాలు పాటుస్తూ నడుచుకోవాలనీ నాకు చెప్పారు, దాన్ని బట్టి నేను అర్థం చేసుకున్నది నేను మా ఉపాధ్యాయులకి దానివల్ల సౌకర్యంగా ఉంటుంది కాబట్టీ, నేను అలా చెయ్యకపోతే వాళ్ళు నాకు జీవితం దుర్భరం అయిపోతుందికాబట్టీ అలా ఉండాలనీ. నిస్సందేహంగా ఇందులో నాది కొంతవరకు తప్పు ఉంది. నేను వాళ్ళ బోధనలకీ, నేను జీవితంలో పైకి రావాలనుకుంటున్న ఆకాంక్షలకీ మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించవలసింది. కానీ, వాళ్ళూ దీన్నే మరింత స్పష్టంగా చెప్పి ఉండాల్సింది. పర్యవసానంగా, మనిషి మనసంటే ఏమిటో, జీవితానికి లక్ష్యం ఏమిటో, ఈ సృష్టి యొక్క లక్షణాలు ఏమిటో నా అంతటగా నేను దాన్ని తెలుసుకోవలసి వచ్చింది… నెమ్మదిగా, అస్తవ్యస్తంగా ఎంతో వేదనపడుతూ.

ఈ పుస్తకంలో, ఈ నమ్మకాల్ని క్లుప్తంగా, స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. అవి నా స్వంత ఆలోచనలని చెప్పే దుస్సాహసం చెయ్యను. బదులుగా, అవి చాలా మంది మనుషులు విశ్వసించేవనీ, చాలామంది ఉపాధ్యాయులు బోధించడానికి ఉత్సాహపడతారనీ అనుకుంటున్నాను. అవి ఎంత తక్కువగా ప్రస్తావించడంగాని, బోధించడంగాని జరుగుతుందంటే, అసలు అలాంటివి ఉన్నాయన్న ఎరుకే ఉండదు. ఈ యుద్ధం, జర్మను ప్రజలు చేసిన ఘాతుకాలూ నా నమ్మకాల్ని నేను స్పష్టంగా అవగాహన చేసుకునేలా చేశాయి. యువకులూ వృద్ధులూ అన్న తేడా లేకుండా నేను చాలా మందిలో ఇదేరకమైన కోరికని గమనించేను. జర్మనుల ప్రవర్తన వెనుక ఒక తాత్త్విక చింతన ఉందనీ, ఆ తప్పుడు ఆలోచనా విధానం వాళ్ళ దేశప్రయోజనాలకోసం ప్రచారం చెయ్యబడిందనీ మనకందరికీ తెలిసిందే. వాళ్ళు చేసిన పొరపాట్లే మనం కూడా చెయ్యకుండా ఉండడానికీ, మనకున్న బలహీనతలనుండీ, దోషాలనుండీ తప్పించుకోవాలంటే మనకి ఎటువంటి తాత్త్విక చింతన అవసరం? ఇక్కడ ఇంగ్లండులో, గత కొన్నితరాలనుండీ అటు చెప్పుకోదగ్గ ఉపాధ్యాయులమూ కాదు, నేర్చుకునే విద్యార్థులమూ కాదు. ఈ దౌర్భాగ్యమే దానికి అనుకూలంగా గాని వ్యతిరేకంగా గాని మన ప్రమేయం లేకుండా, ప్రపంచమంతటా ఆవరించి ఉండవచ్చు. మన మేధస్సుని ఒక చేతిరుమాలులో చుట్టి, మానవాళిని ముందుకీ తీసుకుపోలేదు, వెనక్కీ తీసుకుపోలేదు. మనం ఇటువంటి నకారాత్మకమైన స్థితిలో కొనసాగలేమని గ్రహించాము. మనం కూడా జర్మనులు నమ్మినదే నమ్మడం గాని, లెదా దానికి వ్యతిరేకమైనది ఏదో ఒకటి సృజనాత్మకమైనదీ, అద్భుతమైనది నమ్మడం గాని చెయ్యాలి. మనకంటూ మన పిల్లలకిమప్పగల ఒక భావజాలం మనకి ఉండాలి

అటువంటి తాత్త్వికచింతనని ప్రస్తావించడానికి ప్రయత్నించేను, పిల్లలకి చెప్పగలిగే విధంగా కాదు గాని, నాకంటే బాగా పిల్లలకి ఎలా చెప్పాలో తెలుసు కాబట్టి, ఉపాధ్యాయులకి అర్థం అయేలా. వాళ్లు దీన్ని నమ్మి, దాని మీద పరిశ్రమిస్తే, వాళ్ళు చెప్పే విధానంతో బాటు చెప్పే విషయాన్ని కూడా ప్రభావితం చేస్తుంది; ఎలా చెప్పాలన్నది వాళ్ళకి సంబంధించినది, నాకు బోధనలో ఏ రకమైన అనుభవమూ లేదు.

బెనెడెట్టో క్రోసే Aesthetics గురించి పరిచయమున్న వాళ్ళకి ఈ శాస్త్రంలో నేను అతని దగ్గరనుండి చాలా నేర్చుకున్నానని తెలుస్తుంది. వాళ్ళకి ఒక సందర్భంలో అతని అభిప్రాయానికి భిన్నంగా జరిగేననీ తెలిస్తుంది. కాని దాని గురించి నాకే స్పష్టంగా తెలియదు. అతను ఏ సిద్ధాంతాలు ప్రతిపాదిస్తాడని నమ్ముతున్నానో అవే ప్రతిపాదిస్తున్నాను. ఏది ఏమయినా, ఇక్కడ అతనికి నేను ఎంతో ఋణపడి ఉన్న విషయాన్ని ప్రస్తావించదలుచుకున్నాను.

[ఇంకా ఉంది...]