నిదురలోకి జారుకోవటం తెలియని
ప్రతి అస్తిత్వం లిఖించే
సంఘర్షణా ప్రతులలో
కొన్ని వాక్యాలుగా అలుముకోవడం
ప్రతి నాకూ ప్రతి నీకు కంఠో పాఠమే కదా
సంస్థాగత వ్యామోహాలని తప్పించుకోలేని
నాగరిక విన్యాసాలలో
ప్రతి జీవనం పొడిబారటం నిజమే కావచ్చు
అయితేనేం ఎక్కడో ప్రతి మనలో
తడిగాలమొకటి సిద్ధంగా ఉండే ఉంటుంది
కళ్ళల్లో మెరుపు లిఖించబడి ఉన్నన్నాళ్ళూ
శూన్యం దరి చేరని ఏకాంతాలు
జీవితం మీద పెంచే ఇచ్ఛని
అద్దుకున్న వాడికి శాపాలైనా వరాలైనా
బతుకులో పెద్ద తేడా ఉండదులే
స్వప్నాలు అమ్ముకోవడం వచ్చిన వాడికి
కష్టాన్ని నమ్ముకోవటం రాదనుకోవటం
ద్వేషాంకురానికి తొలిశ్వాస అన్నది
చరిత్రలో ఏ శాసనం మీదా
చెక్కబడని జీవన సత్యం
అందరి శ్రమకీ చెమట కారటమే నిదర్శనమైతే
మనిషి తిరిగినంత మేరా చిత్తడి నేలలు తప్ప
ఇంకేమీ ఉండేవి కాదు
ప్రతి తానూ ఒక శ్రమజీవేనన్న నిజం అతిశయోక్తిగా కనిపించినంత కాలం
కొన్ని నరాలు రగులుతూనే ఉంటాయి
అలకూ అలకూ మధ్య విరామాన్ని భరించలేనంత
అసహనం తీరానికి ఉండి ఉంటే
ఇక్కడ నీటికి తప్ప మనిషికి ఆరామాలు ఉండేవే కాదు
నలుపూ తెలుపులని రెండు పార్శ్వాలుగా
చూడగలిగే ప్రతి మనిషికీ జీవితం వడ్డించిన విస్తరే
మనసు చదవగలిగే మనిషి ఎదురుగా ఉన్నప్పుడు
బాహ్యాంతరాల సరిహద్దు రేఖపై నువ్వు నిలబడ్డప్పుడూ
మలినాలకి మరణ శాసనం లిఖిస్తూ
ఒకానొక స్వచ్ఛతకి నిర్వచనంలా మారేలా
అలలు అలలుగా ఒక నవ్వు విరబూయాలి… ఒకే ఒక్క నవ్వు
కంగ్రాట్స్ సురేష్
సూపర్బ్ కవిత
Thank you
చాల చాల బాగుంది సురేష్
మనసు చదవగలిగే మనిషి ఎదురుగా ఉన్నప్పుడు
బాహ్యాంతరాల సరిహద్దు రేఖపై నువ్వు నిలబడ్డప్పుడూ
మలినాలకి మరణ శాసనం లిఖిస్తూ
ఒకానొక స్వచ్ఛతకి నిర్వచనంలా మారేలా
అలలు అలలుగా ఒక నవ్వు విరబూయాలి… ఒకే ఒక్క నవ్వు.. అద్బుతమైన వాక్యాలు
Thank you Revathi
నలుపూ తెలుపులని రెండు పార్శ్వాలుగా
చూడగలిగే ప్రతి మనిషికీ జీవితం వడ్డించిన విస్తరే…నిజం …. సూపర్బ్ సురేష్ …అభినందనలు
Thank you Lakshmi
సురేష్ ప్రతి పదం అద్భుతః , అద్భుతమయిన పదాల తో పేర్చిన ప్రతి వాక్యం
రమణీయం, రమణీయమయిన వాక్య విరులే తో అల్లిన కవితా కదంబ సుమ
మాల మనోరంజితమే.
Thank you sir
అద్భుతమైన పదాల పరంపర …అందమైన వాక్యాలుగా, చిక్కని భావంతో చక్కని కవిత…చాలా బాగుంది సురేష్ గారు.
థాంక్స్ లాస్య