కవిత్వం

అనామిక

మే 2016

నువ్వు నాకంటే ముందే స్పందిస్తావు.
మట్టి కుండ నుండీ నీళ్ళు తోడుతున్నట్లు
సున్నితంగా కవ్విస్తావు.
నువ్వు నాతో అంటావు
ఏముంది నీ కవిత్వంలో?
చిక్కగా పొరలు పొరలుగా దిగులు అల్లుకున్న మసక తప్ప?
ఏముంది నీ కవిత్వంలో?
అస్పస్టంగా కనపడే ఇసుకరెక్కలూ,
అస్పస్టంగా కనపడే సగం వరకూ తడిచిన గులాబీలూ,
పగిలిన అద్దపు ముక్కలమధ్య విచ్చుకున్న వానా,
అక్కడక్కడా విసిరేయబడ్డట్లు ఉండే, అస్తమయపు ఆకాశపు రంగు.
ఏముంది నా కవిత్వంలో?
నువ్వు ప్రస్తావించిన అస్పష్టత తప్ప?
నువ్వు చూసిన మసక అద్దాల చీకటితప్ప?
ఎలా పదాలలో చేరాలో తెలియని కొన్ని అక్షరాలూ,
ఒక సంక్లిష్టతనుంచి బయటపడి,
వాక్యాల్లోకి రాలేని సమయమూ తప్ప?
ఏ కవిత్వంలో అయినా ఏముంటుందీ?
తెరలు తెరలుగా వ్యాకులతా,
శకలాలుగా కవి హృదయం.

నువ్వు నాకంటే సంతోషంగా కనిపిస్తావు.
హాయిగా నవ్వుతావు.
కవిత్వం కోసం నేను మాటలు వెదుకుతూ ఉంటాను.
కవిత్వం కోసం నన్ను నేను కోల్పోతూ ఉంటాను.

ఒక్కోసారి నువ్వు
ఏదో ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తావు.
నువ్వూ, నేనూ, కవిత్వం
ప్రపంచంగా నేను
ఇంకా అక్షరీకరించబడని చిన్న చిన్న ప్రపంచాలను నిర్మించుకుంటాను.
కవితల్లో సృస్టించబడిన ప్రపంచాలలో నేను సులువుగా జీవిస్తాను.
కవితల్లో నివసిస్తున్నంతకాలం, నన్ను నేను సంతోషంగా చూసుకుంటాను.

నిన్నూ నన్నూ, కవితాత్మకంగా చూస్తున్న
ఆకాశం
పచ్చి ఆకుల చెట్టులా కనిపిస్తుంది.
నేను నీతో అంటాను
కవిత ఒక రహస్యం.
కవీ, కవితా, వాన నీరూ, పొడి ఇసుక లాంటివి.
స్పందనలకూ, ప్రతిస్పందనలకూ,
వివరణలకూ, విశ్లేషణలకూ,
పూర్తి అనుభూతికీ, అనుభవానికీ అందనివి.
కవిత్వం, ఎన్నో ఏళ్ళ పరిచయం ఉన్నా
మాట్లాడుకోగలిగినంత చనువు ఇవ్వని
ఒంటరి స్నేహిత.

*



4 Responses to అనామిక

  1. Ajitha Kakumanu
    May 4, 2016 at 6:02 pm

    This voice is very close to my heart, something which I can sense and feel but have never been able to express.

  2. Ajitha Kakumanu
    May 4, 2016 at 6:04 pm

    A very enjoyable experience and very close to my heart

  3. May 13, 2016 at 12:25 pm

    బాగుందండి. అభినందనలు.

  4. May 19, 2016 at 1:50 pm

    Thanks

Leave a Reply to Jyothsnaphanija Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)