కవిత్వం

ఉన్నట్టా? లేనట్టా?

01-ఫిబ్రవరి-2013

1.
కొన్నిసార్లు తడిని అనుభూతి చెందేలోపే
తాకిన నీటి తుంపర ఆవిరైపోతుంది

ఏమో పొడిబారిన హృది ఉంటేనే గానీ
తగిలిన తడి సాంద్రత తెలీదేమో..

కోల్పోయే స్థిమితం శక్తి ఉంటే కదా..
పొందగల తెగువ ప్రదర్శించటానికి ..

ఐనా పొందటానికేమి కొత్తగా లేదనుకున్నప్పుడు..
మరి కోల్పోవడానికేముంది కొత్తగా..

అనుకోవడమే ! అంతా అనుకోవడమేనా?
అనుకోవడంలోనే ఉందంతా!?

పొందడము
కోల్పోవడము
క్షణిక అనుభూతేనా!?
మరెందుకిదంతా??

2.
నువ్వోస్తావా అసలు
నా నువ్వు ఉన్నావా అసలు
నమ్మకం లేక కాదులే
నమ్మేంత అనుభవం లేకనే ఈ తిప్పలు

వస్తే…
వస్తు వస్తూ…
నాకు నేను కనిపించని
కాసిన్ని క్షణాలు తీసుకురా..

నువ్వు నేనుల నుండి
బయట పడేసే
బంగారు క్షణాన్ని మోసుకు రా..

అన్నీ ఆశలే కదూ
నువ్వెలా ఉండాలో
చెప్పే ఆంక్షలే కదూ

సరే మరి
నువ్వు రామాకు !

3.

నువ్వు వద్దు..
నీ తలపు వద్దు

తక్షణం ఆక్రమించిన స్థలిని
భేషరతుగా ఖాళీ చేసిపో

అడగటాలు,అలగటాలు లేని
అద్భుతస్థితి లో వీడ్కోలు చెప్పి వెళ్ళిపో..

అవును..
వీడ్కోలు చెప్పాలంటే
నువ్వుండాలి గా

రావాలని ఆశిస్తున్నానంటే
నువ్వక్కడ లేనట్టేగా

ఆత్మసఖుడా !
మరి ఇంతకీ

నువ్వున్నట్టా??
లేనట్టా??