సమీక్ష

పాటల పినలగర్రా… పాడూ!

ఫిబ్రవరి 2013

ఆర్. రామకృష్ణ గారి, పినలగర్ర కవితా సంపుటి 1986 నుండి 1999 ల మధ్య వ్రాసిన 36 కవితల సమాహారం. పినలగర్ర అంటే (ఉత్తరాంద్ర లోని బొబ్బిలి ప్రాంతానికి చెందిన మాండలికం ప్రకారం) పిల్లనగ్రోవి.  మూగ వారు లేదా మురళి-ఊదే-కళాకారులు తమ హృదయ-భాషని లేదా హృదయ-ఘోషని పంచుకోడానికి ఉపయోగించే పిల్లనగ్రోవిని శీర్షికగా తీసుకోవడంతోనే ఈ కవితలలో హృదయాంతరాల సందేశమేదో కవి దాచి ఉంచారని అనిపిస్తుంది.

పొలం దున్నుతున్నప్పుడు వచ్చే మట్టి వాసన లో మాధుర్యం;  దుక్కి దున్నే రైతు చిందించే స్వేదజలం వెనుక వున్న విలువ, అందులోని శ్రామిక సౌందర్యం;  పొలం పనికి పసి బిడ్డను ఇంటిదగ్గర వదిలి వచ్చిన తల్లిపడే మానసిక వేదన;  పల్లె ను దాటి నగరం లోకి అడుగుపెట్టిన స్త్రీ వేదనామయ స్థితి, మట్టి నుండి మనిషికి, మనిషి నుండి సమాజానికి ముడిపడిన అంతర్లీనమైన విషయాలను కవితలలో ఆత్మీయంగా పొదిగారు రామకృష్ణ గారు.  ‘పల్లె, పొలం, పంట-చేలు, ఫలసాయాలు’ ఆధారపూరితమైన జీవితాలు మనల్ని హత్తుకుని వాటి బాగోగులను ఇష్టంగా, హృద్యంగా, దైన్యంగా,  ధైర్యంగా, ఉద్వేగపూరితంగా చెబుతున్నట్టు అనిపిస్తాయి. సాధారణ పాఠకుల మొదలు, కవి పండితుల వరకూ అర్ధమౌతూ అనుభూతి కలిగించే రీతిలో ఈ కవితలు మనకు పరిచయముండిన వాతావరణాన్ని పునాదిగా అలోచనా స్రవంతిలోకి చెయ్యి పట్టుకుని తీసుకువెళ్తాయి. స్త్రీలు, శ్రామిక జీవులు, కళాకారులు, దగా పడిన/పడుతున్న మనుషుల జీవితాలను సంవేదనా భరితంగా ఆవిష్కరించడమే కాక; వాటి వెనుక ఉన్న పరిస్థితులను కూడా కవితాత్మకంగా మనముందు పరచి, ప్రశ్నలను, ఆలోచనలనూ రేకెత్తిస్తారు రామకృష్ణ గారు.

ప్రారంభం లోనే స్మృతిగీతం ఒక ఆత్మీయమైన మనిషి (కీ. శే. శ్రీమతి జయప్రద గారు) వదలిపోయిన రోజుల మానవతా పరిమళాన్ని గురించి చెబుతుంది. “పూల రెక్కలతో వేసిన వాతలు–మా మనసుల్లోంచి ఇంకా మాసిపోనే లేదు–మీరు మాయమవ్వడమేంటి?” అని నిందా పూర్వకంగా, లేని మనిషి సమక్షం గురించి బాధపడటం మనల్ని కూడా ఆ మనిషి పట్ల విధేయులుగా మారుస్తుంది. మార్కెట్ నుండి మనుషుల వైపు ప్రయాణించేట్టు చేస్తుంది.

మొదటి కవిత లో: తన పాటతో వందల ప్రేక్షకులని రాత్రంతా ఓలలాడించి మరీ  అంటిపెట్టేసుకున్న జముకుల పాటగాడు, మర్నాటి ఉదయం బుక్కెడు గంజి కోసం ఆ మంత్రముగ్ధుల ఇల్లిల్లూ పట్టి చేరితే “గిన్నె తెచ్చుకున్నావా” అని అతడిని అడిగే వారి ఔదార్యం వెనుక తొంగిచూసే అంటరాని తనాన్ని  వెక్కిరించి కొరడాతో కొట్టినట్టనిపిస్తుంది.

“పదాల పూలరేకుల నడుమ తన హృదయాన్ని

గుచ్చి ఇచ్చేవాడు

….

అతని పాటలో తడిసి

రాత్రి రంగు వెలసి పోయేది

….

అతని పాటని పాయసంలా తాగిన జనం”

మర్నాటి ఉదయం తమని తాము నాగుపాములమని బయట పెట్టుకుంటారు.

ఇంతే, అవకాశవాద– మనుషులు ఎన్నికల పండగలైపోయాక రాజకీయనాయకుల రూపంలో (చివరి కవితలో) తమని తాము నిర్లజ్జగా బయటపెట్టుకుంటారు.

“పండగ వెళిపోయాక

పాములు మళ్ళీ పైకి లేస్తాయి

….

ఆ ఓట్ల పండగ కాస్తా వెళిపోయాక

మనల్ని పెనవేసుకు తిరిగిన చేతులే

పొరలు విప్పి పాములై పైకి లేస్తాయి.”

రెండు సందర్భాల లోనూ పాములను ఉపమానాలుగా తీసుకోవడం కవితలు బలంగా తాకేట్టు చేస్తాయి.

అవకాశవాదులను ఎండగట్టిన ఆ కలం తోనే “మా ఊరికి కొందరు మనుషులు కావాలి” అని మరో కవితను వ్రాశారు రామకృష్ణ గారు.

“మొన్న మొన్నటివరకూ ఊరినిండా

రాజకీయనాయకులు, ఓటర్లు మాత్రమే ఉండేవారు

నిన్నటికి చూస్తే

అమ్మకందార్లు, కొనుగోలుదారులు మాత్రమే కనిపించారు

ఇవాళ చూస్తే అసలు ఎవరూ కనబడడం లేదు

…………

మా ఊరికి కొందరు మనుషులు కావాలి”

అనడంలో గ్రామాలలో మనుషులు ఏ విధంగా పరిగణింప బడుతున్నారో, Materialistic గా తయారౌతున్నారో చెప్పడమే కాకుండా వలస పోతున్న మనుషుల వలన బోసిపోతున్న పల్లెల గురించిన ఆవేదన కూడా కనిపిస్తుంది. బాధ్యతను ఎంత సునిశిత పరిశీలనతో, ఆర్తి తో కవి చెబుతున్నారో ఈ కవితను చదివితే తెలుస్తుంది. మూడు సముద్రాలు కవితలో కూడా సముద్రతీర మనుషులను (ముఖ్యంగా జాలర్లను) కబళించి ఊర్లకు ఊర్లనే మాయం చెయ్యబోయే కోస్టల్ కారిడార్ గురించి హృద్యంగా హెచ్చరిక చేశారు. “ఒకప్పుడు ఇక్కడొ చెట్టు….అమాంతంగా అక్కునచేర్చుకునే మా అమ్మమ్మలా ఆదరించేది” అని కాంక్రీటు భవనాల కోసం ఆహుతైపోయిన ఆకుపచ్చని ఆత్మీయ సంపద గురించి కలత చెందుతారు.

‘హృదయానికి హృదయాన్ని చేరవేసి వాళ్ళు మాట్లాడుకొనేవాళ్ళు’ అని రైతు అతని భార్యల  వ్యవసాయిక బతుకుల కష్టసుఖాల కలబోతలని, పరాధీనమవుతున్న వారి వృధ్ధాప్యపు జీవిత నేపద్యంలో స్మరించారు.

‘నూతికి ఏతామేసి’ కవితలో పంటపొలాలకు నీటినివ్వాలనుకునే కష్ట జీవిని అపహాస్యం చేసిన విధిని నిరసిస్తే, ‘ఉడుపుల మడి’ కవితలో కష్టాన్ని పంట రూపంలో చూసి పరవశించి పోయే రైతు జీవిత సార్ధకతను గురించి ప్రశంసించారు.

‘పాట రాని వాన్ని పాతి పెట్టండి’అన్నా, ‘పాటల పినలగర్రా పాడు’ అన్నా కళతో ముడిపడిన జీవన సంఘర్షణల నేపధ్యమే ఈ రెండు కవితలలోనూ కనిపిస్తుంది. ‘గాయ పడిన గుండెలోంచే పాట పుడుతుంది , గులాబీలు పట్టుకుంటే పాట పుట్టదు…నీలో ఎప్పటికీ పాట పుట్టటం లేదా ఐతే నిన్ను పాతి పెట్టొచ్చు’ అని నిర్ద్వందంగా గాయాలు లేకుండా గేయాలు  పుట్టాలనుకునే  గేయకర్తలను ఎండగడతారు.  “నా పాటల పినలగర్రా పాడు….నా రాగాల రెల్లుపూవా పాడు…’ అని పశువుల కాపరిగా, పాలేరుగా జీవితం వెళ్ళమారుస్తున్న పసివాడిని ఆర్తిగా తన దుఖాన్ని పిల్లనగ్రోవి పాట ద్వారా విలపించో లేక వివరించో పాడుకోమంటారు.

స్త్రీల దైనందిన జివితాలలోని కష్టాలను, మానసిక సంఘర్షణలనూ అనేక కవితలలో కళ్ళకు కట్టినట్టు చెప్పారు. ‘పాప తల్లి’ అనే కవిత ‘మడిలో అడుగు పెట్టింది మొదలు…మనసు ఊయల మీదే ఉంది’ అని ప్రారంభంలోనే అనడం పసి పిల్లలను ఇంటి దగ్గరొదలి పనిలోకొచ్చిన తల్లి తల్లడిల్లడాన్ని తలపోస్తుంది. వదలి వచ్చిన పాపకు మరొకరు తోడు ఉన్నా కూడా  పాలుపోలేని తల్లి మనసు, అసలెవరి ఆలనా పాలనా లేకుండా వంటరిగా వదలి వచ్చినదని తెలిసి బాధతో గుండెల్లో సుడులు తిరుగుతాయి. “మనసు మనసులో ఉండటం లేదు” అని పాపతల్లితో పాటూ ఆ కవిత చదివేవారూ వేదన చెందుతారు. నిజానికి ఈ వేదన ఆ ఒక్క మడిలో అడుగుపెట్టిన పల్లె స్త్రీదే కాదు, నేటి సమాజంలో ఉద్యోగ బాధ్యతలలో తలమునకలై పిల్లలను వదలి ఆఫీసులకు వస్తున్న అందరు తల్లులదీ కూడా. “పాపతల్లి-2” అనే మరొక కొనసాగింపు కవితలో పనిముగించి పరుగు పరుగున ఇంటికి వెళ్ళిన తల్లి పాపను గుండెలకద్దుకుని తనలోని తుఫానును తీరం దాటించుకున్న సంగతి తెలిశాక మన మనస్సులను కూడా తుఫాను తరువాత ఉండే ప్రశాంతత ఆవరిస్తుంది.

నగరంలో తారు రోడ్ల మీద ఒక పల్లె నుండొచ్చిన తల్లి నడచిపోతూ ఉంటే; కన్న తల్లి లాంటి పల్లెనూ, పాల్జావ లాంటి పొలాన్ని వదలి వచ్చిన ఆమె పరిస్థితులను  తలపోసి, పట్టించుకుని, ప్రస్తావించే కవి లోపలి చూపులను చూసి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అనుభవం, సునిశిత పరిశీలన, స్పందించే గుణాలు మాత్రమే కవికి అలాంటి చూపునిస్తాయనిపిస్తుంది.

‘చిరంజీవి సౌభాగ్యవతికి ‘ కవితలో ఆడపిల్ల అందరిలా ‘పుట్టకముందు ఉమ్మనీటిలో ఉంటే సరిపోదు…పుట్టాక కన్నీటిలో బతకాల్సిందే తల్లీ’ అని కూతురికి తల్లి చేసే హితోపదేశం. ‘కిరోసిన్ మంటలకు, చీరల ఉరితాళ్ళకు, అత్తగారి ఆరల్లకు, ఆడపడచుల సాధింపులకు, భర్త గారికి ఎంతకీ చాలని కట్నం దాహానికీ తట్టుకుంటూ ఎలా బతుకీడ్చాలో చెబుతుంది. నిరాశ మయమైన జీవితాన్ని, బాధాలనూ ప్రస్తావిస్తున్నట్టనిపించినా వాస్తవానికి మారని సమాజాన్ని, కోడళ్ళ బాధలనూ ప్రస్తావించడమే ఈ కవిత ఉద్దేశ్యం.

“ఆలోచనలేని మనిషిని ‘నిర్జీవ పదార్ధం’గా ఎద్దేవాచేసిన స్పూర్తి కవిత; నెల్లిమర్ల పోరాట వీరుల త్యాగాన్ని నినదించే తూరుపు వినిపించే సూర్యరాగం కవిత;  ‘మీ చేతుల్లో వికసించే అన్నం …. మట్టి, చెమట అనే రెండు మూలకాల  సంయోగ ఫలం…..చెమటపడని నేల చెల్లని రూపాయి బిళ్ళ ‘ అని శ్రమకు సంబంధించిన విలువని చెప్పే మరొక కవిత; ‘మతోన్మాదమొక రాసక్రీడ ‘ కవితలో ‘మనం మనుషులమై మాట్లాడుకోవడం వాడికిష్టముండదు ‘ అని మతాన్ని ఆసరాగా తీసుకుని చేసే వేర్పాటువాద రాజకీయాలను ప్రస్తావన ఉంటుంది” ఇవన్నీ పినల గర్ర కవితా సంపుటిలో దేనికదే ధీటుగా ఉంటూ ఇమిడిపోయాయి.

సునామీ సృష్టించిన బీభత్సానికి చలించి వ్రాసిన ‘సముద్రమా నీ పేరు బీభత్సమా ‘ కవిత, ఉరితాడు ముడి విప్పుదాం అంటూ ‘శిక్షించాల్సింది నేరస్తులను కాదు నేరాలను అని ఆలోచనలు పురికొలిపే కవిత,  నేడు ఎఫ్.బి.ఐ లకు పచ్చజెండా ఊపిన  ప్రభుత్వాన్ని స్పురణకు తెచ్చేలా నాడే వ్రాసిన ‘పెట్టుబడిదారులకు ప్రత్యేక ఆహ్వానం ‘ కవిత, కింది వర్గాల మీద దాడులని నిరశించే ‘విశాల హృదయం, శవం చెప్పిన జవాబు ‘ కవితలు , స్పూర్తిని కలిగించే ‘అనుభవం అద్దమైతే, కవిత్వం ఇలా చదువుకుందాం ‘ మొదలైన జీవన వైవిద్యాలని ఆవిష్కరించే అనేక కవితలను రామకృష్ణ గారు ఇందులో పొందు పరిచారు.

వర్తమాన సమాజంలో ‘న్యూస్ పేపర్లు, టీవీ చానెళ్ళు, నాయకుల ప్రకటనలకు ‘ మాత్రమే పరిమితమైపోయే మన ఆలోచనలను పట్టుకుని, కదిపి, కుదిపి నాణేనికి రెండొ వైపుని చూపించేవి చాలా కవితలు ఇందులో ఉన్నాయి. ఇప్పుడు ‘మాతృభాషైన తెలుగుని కాపాడుకోవాలని, అన్నా హజారే గారి ఉద్యమం తరువాత అవినీతిని అరికట్టాలని, ఢిల్లీ బస్సు కీచక కిరాతకం తరువాత ఆడ పిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలని అంతమొందించాలని ‘ విస్త్రుతమౌతున్న నినాదాలకు, దశాబ్దాల క్రితమే చైతన్యవంతం చేసిన కవితలు ఇందులో భాగమయ్యాయి.  ‘అనుభవం అద్దమైతే ‘ కవిత మొత్తం సంకలనానికే తలమానికంగా ఉండి, పైన చెప్పిన అన్ని విషయాలను సమగ్రంగా చర్చించింది.

మానవీయత, జీవన వాస్తవికత, జీవిత సంఘర్షణ, ధ్వంసం అవుతున్న బతుకులు, దృష్టిపెట్టాల్సిన సమస్యలు వీటన్నీంటి గురించి పినలగర్ర కవితలు అనేక విషయాలను చెబుతాయి.

ఇలాంటి కవితలతో మనల్ని ఆలోచింపజేసిన కవి ఆర్. రామకృష్ణ గారు సర్వదా అభినందనీయులు. వారి ఈ కవితలు గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతూ వస్తున్న చలనానికి ప్రతీక. ఇవి కాలంతో పాటు తప్పకుండా నడుస్తాయని అనిపిస్తోంది.

ప్రతులకు క్రింది ఈ-మైల్ అడ్రస్ కు సంప్రదించ గలరు:

ఈ మైల్: reddiramakrishna63@gmail.com

వెల: రూ. 50  మాత్రమే