అనువాద నవల

రాజ్ఞి – పదకొండవ భాగం (‘She‘ by Sir H.Rider Haggard)

మే 2016

[ ఏప్రిల్ నెల సంచిక తరువాయి ]

ఖైదీలు అందరినీ బయటికి తీసుకుపోయాక ఆయేషా చేత్తో సైగ చేసింది. గుమిగూడి ఉన్న జనమంతా గొర్రెల్లాగా వెనక్కి పాక్కుంటూ నిష్క్రమించారు. ఇక అక్కడ ఆమే, నేనూ, మూగవాళ్ళూ, కొద్ది మంది భటులూ మిగిలాము. ఆ అదను చూసుకుని లియో పరిస్థితి ఎంతమాత్రం బాగుండలేదని చెప్పి చూసేందుకు రమ్మని అడిగాను , కాని ఆయేషా కాదంది. సాయంకాలం దాకా ఆగవచ్చుననీ చీకటి పడితేనే గాని మృత్యువు చేరరాదనీ అంది. పైపెచ్చు – తాను చికిత్స చేసే ముందర వ్యాధి ని దాని క్రమం లో చివరకంటా వెళ్ళనిమ్మని కూడా . చేసేదిలేక నేను వెళ్ళబోతూ ఉంటే ఆపి గుహల్లో విశేషాలు చూద్దాం రమ్మంది.

ఆమె మాటని కాదనాలంటే మాత్రం కాదనగల శక్తి ఉందా నాకు ! సిం హాసనం మీంచి లేస్తూ మూగ వాళ్ళకి ఏదో ఆజ్ఞ ని ఇచ్చింది. నలుగురు తప్పించి మిగిలినవాళ్ళంతా వెళ్ళిపోయారు. ఆ నలుగురూ ఇద్దరిద్దరు గా దివిటీ లు పుచ్చుకుని మా వెనకే బయల్దేరారు.

” ఇటువంటి అద్భుతాలను ఎన్నడైనా చూసి ఉన్నావా హాలీ ? ఆ అంతరించిపోయిన జాతి కి ఎంత ప్రతిభ, ఎంత సామర్థ్యం ! ఈజిప్షియన్ ల లాగా , బ్రతికి ఉన్నవాళ్ళ కన్నా మరణించినవాళ్ళ మీదే వాళ్ళకి శ్రద్ధ ఎక్కువ లాగుంది. ఎందరు మనుషులు ఎన్నేసి సంవత్సరాలు పనిచేస్తే ఇదంతా ఏర్పడిందో ! ”

” కొన్ని వేలమంది ”

” అవును. ఈ కోర్ జాతి ఈజిప్ట్ వాళ్ళ కంటే పురాతనమైనది – ఈ చెక్కి ఉన్న అక్షరాలలో విషయాన్ని కొద్ది కొద్ది గా అర్థం చేసుకుంటే తెలిసింది నాకు. ఇదిగో చూడు – వాళ్ళు మలచిన గుహల్లో ఇది ఆఖరనుకుంటాను ” – దీపాల వెలుగు లో అక్కడి శిల్పాలు కనిపించాయి. చేతిలో దండం వంటిది పట్టుకుని కూర్చున్న వృద్ధుడి ఆకృతి ఒకటి. మేము భోజనం చేసేచోట శవస్నానం చేయించబడుతున్న మనిషి ఇతనే అయిఉండాలి – అవే పోలికలు. అతను కూర్చున్నదీ ఇందాక ఆయేషా కూర్చున్న సిం హాసనం వంటిదే. ఆ దిగువన ఏదో విచిత్రమైన లిపిలో రాసి ఉంది. అది ఏ భాషో ఏ మాత్రం పోల్చుకోలేకపోయాను – కొంతవరకూ చైనీస్ లిపి కి దగ్గరగా ఉందనిపించింది. ఆయేషా దాన్ని కూడబలుక్కుంటూ పైకి చదివి నాకు వివరించింది.

” కోర్ సామ్రాజ్యం స్థాపించబడిన నాలుగు వేల రెండువందల యాభై తొమ్మిదవ సంవత్సరం. మహా రాజాధి రాజయిన టిసినో చేత సంకల్పించబడి, మూడు తరాల ప్రజల, బానిసల కృషి ఫలితంగా ఈ శవాగారం నిర్మించబడింది. ఆ మహారాజు ఆకృతే ఇక్కడ శిల్పరూపం గా నెలకొల్పబడిఉంది. ఊర్ధ్వ , అతి ఊర్ధ్వ లోకాల ఆశీస్సులు ఇక్కడ ప్రసరించుగాక ! తిరిగి లేచే తరుణం ఆసన్నమయేవరకూ , ఘనత వహించిన టిసినో మహారాజు సంతోషం గా , ప్రశాంతంగా నిద్రించుగాక ! ఆయన మేల్కొనే ముందే మేల్కొని సేవించవలసి ఉన్న పరివారమంతా కూడా అదే ప్రకారం నిద్రించెదరు గాక ! ”

” చూడు హాలీ, ఈ గుహ ని మలచేందుకు నాలగు వేల ఏళ్ళ కిందటే నగరం ఉందన్నమాట. నేను రెండు వేల ఏళ్ళ కిందట చూసినప్పుడూ ఇది ఇలాగే ఉంది – ఎప్పటిదో ఎలా అంచనా కడతాం ? రా ఇలా నాతో – కాలం తీరినప్పుడు ఈ జాతి నాశనం ఎలా సంభవించిందో చూపిస్తాను. ” – గుహ మధ్యకి తీసుకుపోయింది. అక్కడ ఆ రాతి నేల మీద గుండ్రటి దృఢమైన రాతి పలక. ఆ దిగువన ఉన్న దేన్నో అది మూసి పెడుతూన్నట్లు తెలుస్తోంది.

” ఏమిటిది ? ఊహించగలవా ? ”

” లేదు ”

ఆయేషా గుహ ఎడమ పక్కకి వెళ్ళి ఆ గోడ పైభాగానికి దివిటీ లని ఎత్తి చూపించమని సైగ చేసింది. అక్కడ, టిసినో సమాధి మీద కనిపించిన లిపి వంటి దాని లోనే ఎర్రటి ఎరుపు రంగు తో ఏదో రాసిఉంది. ఆ రంగు ఇప్పటికీ వెలవలేదు. ఆమె దీన్ని కూడా చదివి చెప్పింది.

” జ్యూనిస్ అనబడే నేను. కోర్ జాతికి అర్చకుడూ పురోహితుడూ అయి ఉండిన వాడిని – కోర్ సామ్రాజ్యం స్థాపన జరిగిన నాలుగు వేల ఎనిమిది వందల మూడవ సంవత్సరం లో – ఈ శవాగారపు గోడ పైన దీన్ని రాస్తున్నాను. కోర్ అంతరించింది ! ఇక్కడి సువిశాల ప్రాసాదాలలో విందులూ వినోదాలూ మరి జరగవు. కోర్ ఇకమీదట ప్రపంచాన్ని పరిపాలించదు ! ఇక్కడి నౌకల వాణిజ్యం విశ్వం మొత్తానికీ ఇక వెళ్ళదు. కోర్ నిర్మించిన అద్భుతమైన కట్టడాలూ ఓడరేవులూ తవ్వించిన కాలువలూ అన్నీ సర్వనాశనమై – తోడేళ్ళూ గుడ్లగూబల వంటి అనాగరికుల పాలు కాబోతున్నాయి. ఇరవై అయిదు నెలల కిందట కోర్ సామ్రాజ్యాన్ని మహమ్మారి కమ్మింది. చిన్నా పెద్దా బీదా గొప్పా రాజూ రైతూ భే దం లేకుండా జనం దానికి అంచెలంచెలుగా బలి అయిపోయారు. మిగిలిన వాళ్ళు కరువు బారిన పడిపోయారు. మరణించిన ఈ కోర్ సంతానాన్ని శాస్త్రబద్ధం గా భద్రపరచే అవకాశం లేదు – కట్టగట్టి ఈ రాతి బిలం లో పడవేయవలసిన దౌర్భాగ్యం పట్టింది. ఈ జాతికి మిగిలిన కట్టకడపటి వెలుగు కిరణాలు – ఏకాకులుగా ఉత్తరానికి ప్రయాణించి ఒక నౌక ను ఎక్కి వెళ్ళిపోయారు. ఇక్కడి వారిలో మిగిలి ఉన్న చివరి మనిషిని నేనే అనుకుంటూ , మృత్యు ముఖంలో, దుర్భర విషాదం తో రాస్తున్నాను [ వేరే ఏ నగరం లోనైనా ఇంకెవరైనా బ్రతికి ఉన్నారేమో నాకు తెలియదు ] . కోర్ సామ్రాజ్యం అస్తమించింది. ఈ దేవాలయాలలో పూజలు ముగిసిపోయాయి, రాజ భవనాలు ఖాళీ అయినాయి . స్వస్తి. ”

ఆ నిర్భాగ్యుడైన వృద్ధుడెవరో – తన జాతి మొత్తం అంతరించిపోయినాక, వాళ్ళని పాతిపెట్టిన చోటనే – బహుశా ఒక గుడ్డి దివ్వె వెలుగులో – ఒక్కడే రాస్తూ ఉండిన దృశ్యం నా కళ్ళ ముందు కదిలి మనసు తీవ్రంగా కలతపడింది.

” హాలీ ! అలా ఉత్తరానికి ప్రయాణించి వెళ్ళిన వాళ్ళే ఈజిప్షియన్ ల పూర్వీకులు అయిఉంటారని అనిపించటం లేదూ? ”

” ఏమో. నా ఊహకి ఏమీ అందటమే లేదు. అనుకునేదానికన్నా ప్రపంచం మహా ప్రాచీనమని తప్ప. ”

” ప్రాచీనం- అవును, సత్యం. ఒకదాని వెనక ఒకటి ఎన్నెన్ని మహాసామ్రాజ్యాలు ఆనవాలు మిగల్చకుండా అంతరించి ఉంటాయో – వాటిలో ఇది ఒకటి. కాలం అన్నిటినీ కబళించివేస్తుంది … వీరి నిర్మాణాలు ఎన్నో- సుడిగాలికి పెళ్ళగించబడినాయో , సముద్రం పొంగి కొట్టుకుపోయినాయో , భూకంపాలకి చిద్రమై చెల్లాచెదురైనాయో ! ఈ భూమి పైన ఇంతవరకూ జరిగి ఉన్నదేమిటో, రానున్నది ఏమిటో ఎవరికి తెలుసు ! ఆ యూదులు బాగానే అన్నారు లే – ‘ సూర్యుడి కిందన ఏదీ కొత్తదంటూ లేదు ‘ అని. కాకపోతే వీళ్ళు పూర్తిగా అంతరించారని నేను అనుకోను. ఈ పూజారే అన్నట్లు ఎక్కడెక్కడో మిగిలి ఉన్న కొద్ది మంది తో – దక్షిణం నుంచి వచ్చిన అనాగరికులో, లేక నా జాతి వాళ్ళైన అరబ్ లో – వచ్చి సంబంధాలు పెట్టుకొని ఉండవచ్చు. ఎవరు చెప్పగలరు – ఈ అమహగ్గర్ వాళ్ళు అటువంటి సంకర జాతికే చెందిన మనుషు లేనేమో ! నా శక్తి మొత్తాన్నీ వినియోగించీ నిజమేమిటో తేల్చుకోలేకపోయాను. వీళ్ళొక గొప్ప జాతి, ఇదొక బ్రహ్మాండమైన నాగరికత – ఇక గెలవదగినది లేనంతగా ప్రపంచాన్ని గెలిచారు…ఆ సంపదనూ సమృద్ధినీ తలమునకలుగా అనుభవించారు – నశించారు. రా, ఆ దిగువన ఉన్న గుహను చూపిస్తాను. అంతకన్న విచిత్రమైనది నాకు తెలిసి మరొకటి లేదు ”

నేను ఆమె వెంబడి, పక్కనే కనిపిస్తున్న ద్వారం లోంచి , ఆ తర్వాత కొన్ని వందల మెట్లు దిగి వెళ్ళాను. ఆ బిలం కనీసం ఎనభై అడుగుల లోతున ఉంది. పక్క గోడల్లో సన్నని పొడవాటి మార్గాలు పైకి వెళుతున్నాయి- ఎక్కడికి దారి తీస్తాయో తెలియదు గాని, గాలి ఆడుతోంది. ఉన్నట్లుండి మేము నడుస్తున్న దారి అంతమైంది. దివిటీ లు ఆయేషా చెప్పినట్లు చూపబడినాయి – మేము ఒక బ్రహ్మాండమైన అగాధపు అంచున నిలబడి ఉన్నాము. అది ఎంత లోతుకి ఉందో ఊహించలేకపోయాను గాని దాని వైశాల్యం మాత్రం లండన్ సెయింట్ పాల్ చర్చ్ గోపురం కన్నా ఎక్కువగా ఉందనిపించింది. చుట్టూ పిట్ట గోడ కట్టి ఉన్న అందులో , పిరమిడ్ ఆకారం లో పేర్చబడిన మానవ కంకాళాలు – వేల కొద్దీ. ఒక మనుష్య జాతి ఆనవాళ్ళు అంత బీభత్సం గా ఉండటాన్ని , నేనే కాదు – ఎవరూ ఊహించలేరు. పరీక్షగా చూశాక ఇంకా జుగుప్స కలిగించినదేమిటంటే , అక్కడున్నవన్నీ అస్థిపంజరాలేకాదు , వివిధ దశల్లో శిథిలమవుతూన్న శరీరాలు. అప్రయత్నంగా పెద్ద కేక పెట్టాను. నా గొంతు ప్రతిధ్వనికి చలించినట్లు , ఆ గుట్ట పైనుంచి ఒక కపాలం కిందికి దొర్లింది, దాని వెంట ఇంకా చాలా ఎముకలు జారి పడుతూ మా మీదికే వచ్చేట్లు అగుపించాయి.

” చాలు. దయచేసి వెళ్ళిపోదాం ”

ఆమె దయ చూపి వెనుదిరిగింది.

” వీళ్ళంతా ఆ మహమ్మారి జబ్బు తో పోయిన వాళ్ళే కదా ? ”

” అవును. భద్రపరిచే ప్రాప్తం లేకుండా పోయిన వాళ్ళవి. నీకు తెలుసా- కోర్ జాతి వాళ్ళు మృతదేహాలను భద్ర పరిచే పద్ధతి ఈజిప్షియన్ ల దాని కన్న మెరుగైనది.
ఈజిప్షియన్ లు మెదడు నీ కొన్ని శరీరాంగాలనీ తొలగించి భద్రపరుస్తారు – వీళ్ళు అలా చేయరు. సిరల లోకి ఒక ఔషధాన్ని ఎక్కించి ఉన్నపళం గానే ఆ పని చేస్తారు. ఉండు, ఇలా చూడు – ”

మేము నిద్ర పోయిన చిన్న గుహల వంటి వాటి ముందు ఆగి లోపలికి తీసుకు వెళ్ళింది. రెండు నిడుపాటి రాతి బల్లలూ వాటి పైన పసుపు పచ్చని వస్త్రాల కింద, బహుశా మానవ శరీరాలే ఇక్కడా. అన్ని చోట్లా చూస్తున్న పొడవాటి కూజా లే ఇక్కడా ఉన్నాయి. అంత పురాతనమైన వాటి పైన , అనుకునేంత గా దుమ్ము పేరుకుని లేదు ఎందుకో. బయటి ప్రపంచం తో సంబంధమే లేని, ఇంకే జీవజాలపు ఉనికీ కనిపించని ఆ చోట- ధూళి గా మారదగినది ఎక్కువ లేదు కాబోలు.

” ఆ బట్ట ని పైకె త్తి చూడు హాలీ ”

నేను ఆ పని చేయలేకపోయాను, అపరాధం అనిపించింది. ఆమె తొలగించిన బట్ట కింద ఉన్నది ఒక సౌందర్యవతి అయిన స్త్రీ. నాజూకైన కనుబొమలూ కనురెప్పలూ పొడుగ్గా దట్టం గా ఉన్న నల్లని జుట్టు, తీర్చి దిద్దినట్లున్న ముఖరేఖలు. ఆమె గుండె ని ఆనుకుని ఒక పసిబిడ్డ. నాకు కళ్ళు చెమ్మగిల్లినాయి. ఇంకా చాలా మందిని చూపించింది ఆయేషా- రక రకాల వయసులలో , దేహస్థితులలో ఉన్నవారిని. ఒక చోట జంటగా ఇద్దరు – ఇద్దరి గుండెల పైనా కత్తి పోటు గాయాలు. అక్కడ ‘ మరణించి వివాహితులైనారు ‘ అని రాసి ఉందట. ఏ ఔష ధాలనూ మూలికలనూ ఉపయోగించారోగాని , అందరూ అప్పుడే కన్నుమూసినట్లుగా, నిద్ర పోతున్నట్లుగా కనిపించారు. కొద్ది మంది మటుకు , పైకి బాగానే ఉన్నా ముట్టుకుంటే శిథిలమైపోతారనిపించింది. హడావిడిగానో, నిర్లక్ష్యంగానో భద్రపరుస్తూ ఆ మూలికా ద్రవాన్ని లోపలికి ఎక్కించకుండా శరీరాలను కేవలం అందులో ముంచి తీసి ఉండటం అందుకు కారణమై ఉండవచ్చునని ఆయేషా అంది.

వాటిలో ప్రధానమైన మూలిక ఎక్కడినుంచి వస్తుందో ఆయేషా చెప్పింది. కొండవాలుల్లో పెరిగే పొదలట అవి. ఆకులు సన్నగా పొడుగ్గా, మంచి ఆకుపచ్చగా ఉంటాయట. అలా ఉన్నప్పుడు ఎక్కువ వాసన ఉండదుగానీ శీతాకాలం లో ఆకులు ముదురు ఎరుపు రంగుకి తిరిగినప్పుడు మాత్రం ఆ వాసన ఘాటుని దగ్గర్లో ఎవరూ భరించలేరట. అసలు మూలిక ను వే ళ్ళ లోంచి తీస్తారట. దాని మీది హక్కులన్నీ రాజ్యానివేననీ దాని అమ్మకం ద్వారా రాజులు సంపద పోగు చేసుకునేవారనీ కూడా ఆయేషా చెప్పింది.

” వెళ్ళి మహరాజాధిరాజు టిసినో సమాధిని కూడా చూద్దామా, చూసినది సరిపోయిందా ? ”

” చాలు చాలు ! ” గట్టిగా చెప్పాను. ” మృత్యువు కి ఉన్న బలవత్తరమైన శక్తి నన్ను ముంచెత్తుతోంది. జీవితం ఎంత బలహీనమో అశాశ్వతమో ఇంకా ఇంకా చూసి తెలుసుకోవాలని లేదు. బయట పడదాం ఇక్కడినుంచి ”

మూగ వాళ్ళు దారి చూపిస్తూ ముందు నడుస్తున్నారు. కిందని అంతా గాఢాంధకారమవటం వల్ల ఆ వెలుగులు గాలి లో తేలుతున్నట్లున్నాయి. ఎట్టకేలకి , ఆయేషా నివాసానికి చేరాము. నేనిక సెలవు తీసుకోబోయాను గాని ఆమె వారించింది.

‘’ ఉండు కాసేపు ఇక్కడ. నీతో మాట్లాడటం నాకు చాలా ఊరటగా ఉంటోంది. ఇంతకాలంగా నేను మాట్లాడగలిగినది బానిసలతోనూ , నాతోనూ మాత్రమే. నా చింతన నుంచి చాలా జ్ఞానాన్నే సంపాదించాను, చాలా రహస్యాలని తెలుసుకున్నాను గాని – విసుగొస్తుంది చాలాసార్లు. నా జ్ఞాపకాలు ఇవ్వగల ఆహారం కటిక చేదు – తప్పనిసరయి, ఆశల దంతాలతో నములుతుంటాను దాన్ని. నువ్వు నా కన్నా వయసులో ఎంతో చిన్నవాడివైనా , నీది ఆలోచించగల మేధ. ఒకానొకనాడు నేను నిరసించి ఉన్న ఏథెన్స్ తత్వవేత్తలూ అరేబియా లో బెక్కా లో ఉండిన జ్ఞానులూ నిన్ను చూస్తే గుర్తొస్తున్నారు. నీదీ అటువంటి దుమ్ముకొట్టుకున్న వాలకమే , పుస్తకాల దుమ్ము ! ఇలా ఈ పరదా లాగి ఈ పళ్ళు తీసుకో. ఉల్లాసం కలిగించేవేవైనా చెప్పు. నా ముసుగు తీసి నీకు మళ్ళీ కనిపించబోతున్నాను, నా సౌందర్యాన్ని ప్రశంసించు ! ఆ వేదాంతులూ చేసే ఉన్నారులే ఆ పనిని, ఆ కాలం లో ”

ఇదివరకటి కన్న త్వరగా చురుగ్గా ఆమె తన ముసుగు ని తొలగించి, కుబుసం విడిచిన తెల్ల త్రాచు లాగా నా ముందు నిలబడింది. ఆ నేత్రాల ధగధగ ని, ఇదివరకు లాగే – భరించటం నాకు అసాధ్యం గా ఉంది.

ఆమె పద్ధతి లో చాలా మార్పు. తన ప్రత్యర్థి నాశనానికి అగ్ని ని ఉపాసిస్తున్నప్పటి ద్వేషం లేదు, దర్బారు తీర్చి తీర్పు చెబుతున్నప్పటి నిర్దాక్షిణ్య గాంభీర్యం లేదు, శవాగారాల మధ్యన ఉన్నప్పటి పురాతన జ్ఞానమూ లేదు. వాటన్నిటినీ ముసుగు తోబాటే అవతల పెట్టినట్లుంది. ఆమె రాజ్ఞీత్వమూ వెనక్కి తప్పుకుంది , కాని కనిపిస్తూనే ఉంది- సూర్య కాంతి వెనకాల మేఘం లో మెరిసే మెరుపులా. జుట్టు ని విదిల్చి సవరించు కుంటే గుప్పుమని సౌరభం వ్యాపించింది. అందమైన పాదరక్ష తొడిగిన పాదాన్ని తాటిస్తూ ఏదో పురాతనపు గ్రీక్ పాటని – పెళ్ళిపాట అనుకుంటాను , కూనిరాగం తీస్తూ కూర్చుంది. అక్కడ ఉన్నది రూపం లోనూ ఆత్మ ధృతి లోనూ సాటిలేని, అత్యంత వాంఛనీయురాలైన స్త్రీమూర్తి.

” నేను స్పష్టం గా , పూర్తిగా – కనిపిస్తున్నానా ? కనబడేట్లు సర్దుకుని కూర్చో. చూడు – ఈ కళ్ళు, కనురెప్పలు , ఈ అధరాలు , ఈ కేశాలు, ఈ పాదాలు, అరచేతులు , ఈ చెవులు , ఈ చర్మపు తెల్లదనమూ కాంతీ – ఎలా ఉన్నాయో ఒక్కొక్కటీ వర్ణించి చెప్పు, నాకు పొగడ్తలంటే గొప్ప ప్రీతి సుమా ! ఏ అణువంత భాగం లోనైనా నన్ను పోలిన , నాతో పోటీ పడదగిన స్త్రీ అంటూ ఉందా చెప్పు. నా నడుము – కాస్త లావుగా ఉందనిపిస్తోందా ? లేదు లేదు – ఈ నాగుబాము వడ్డాణం పెద్దది అంతే, వదులుగా పెట్టుకున్నాను. కావలిస్తే పట్టుకు చూడు, నీ రెండు చేతులూ చుట్టితే మించి ఉండదు నా నడుము ”

ఇక నేను భరించలేక చప్పున మోకాళ్ళ మీద కూలబడిపోయాను. ఆమె స్త్రీ యా, అంతకు మించినదా – నాకైతే తెలియదు. అరచేతులతో మొహాన్ని కప్పుకుని రక రకాల భాషలు కలిపి చెప్పుకున్నాను- ఆమె ని దేవత లాగా పూజిస్తున్నాననీ అప్పుడు ఆ క్షణం లో ఆమె నా సొంతమయేందుకు ఏమయినా చేసి ఉందుననీ కాని అంతటి మైకం లోనూ నేనేమిటో నాకు తెలుసనీ.

ఆమె నవ్వుతూ చప్పట్లు కొట్టింది.

” అప్పుడే- అంత త్వరగానా ! హాలీ, నీ నోట ఈ మాటలు వినటానికి ఎన్ని నిమిషాలు పడుతుందా అని చూస్తున్నాను. నా ముందొక పురుషుడు మోకరిల్లి చాలా కాలమయిపోయిందోయీ , ఆనందం గా ఉంది నాకు. ఎంత వయసు రానీయి, ఎంత జ్ఞానముండనీయి- అది స్త్రీ ల జన్మహక్కు, కాదా చెప్పు ?

కాని నీకు తెలుసులే , నేను నీకు కాదు అని. పోనీ, ఒక్కసారి ముద్దు పెట్టుకుంటావా నన్ను ? ముద్దు ఏ ముద్రనీ మిగల్చదని అనుకోకు- ఆ పిమ్మట నువ్వు బతకవు , నా మీది కోరిక తో క్షిణించిపోగలవు ”

కవ్వింపుగా , తన ఊపిరి నా ముఖం పైన ఆనేంత , తన జుట్టు నా నుదుటికి తాకేంత – దగ్గరగా వచ్చింది. మరుక్షణం నేనేమి చేసి ఉందునో తెలియదు , చటుక్కున వెనక్కి తగ్గి తన అరచేతిని మాత్రం నా తల మీద ఆనించి ఉంచింది. అందులోంచి ఏమి ప్రవహించిందోగాని నాకు స్పృహ తెలిసింది, ఇంగితం తిరిగి వచ్చింది.

” ఇక చాలులే, కరుణించాను నిన్ను. మంచివాడివి నువ్వు, పాపం. నీకు కనిపించే నేనే నేను కాను, నాలో ఇంకా చాలా ఉంది. ఆ కూజా లో నీరుంది చూడు, దాని లో ఏవేవో కనిపించాయి- నేను ఆ నీరు వంటిదాన్ని, నా మనస్స్థితులు మారుతుంటాయి -ఏవీ నిలవవు, నా అసలు స్వభావం తప్ప. నా కొన్ని మాటలని నువ్వు పట్టించుకోరాదు – ఎంత హాని రావచ్చో ఊహించలేవు ”

పక్కన ఉన్న ఆసనం మీద చతికిలబడ్డాను. నాకింకా వణుకు తగ్గలేదు. ఆమె క్రూరత్వం నాకు తెలుసనీ , తన ప్రత్యర్థి కి కీడు చేసేందుకు ఆ హోమం చేయ టాన్ని చూసే ఉన్నాననీ చెబితే- అమ్మో, ఇంకేమైనా ఉందా!

” ఇదిగో ఈ పళ్ళు తింటూ ఆ యూదుల రక్షకుడన్నావే , నా తర్వాత వచ్చాడు – అతని గురించి చెప్పు. ఇప్పుడు ప్రపంచం లో చాలా భాగం అతని పాలనలోనే ఉందన్నావు కదా , ఏమిటతని సిద్ధాంతం ? తినటమూ తాగటమూ వినోదమూ యుద్ధాల్లో చంపుకోవటం – ఇవే కదా మనుషులకిష్టం , ఏం చెప్పి ఒప్పించాడు వాళ్ళని ? ”

నేను అప్పటికి కాస్త తెప్పరిల్లి ఉన్నాను. నా క్షణికమైన బలహీనత కి లోలోపల సిగ్గు పడుతూ క్రైస్తవం గురించి చెప్పగలిగినదంతా చెప్పుకుపోయాను. ఒక్క స్వర్గ నరకాల గురించినది తప్ప తక్కినవేవీ ఆమెని పెద్ద గా ఆకర్షించలేదు. జీసస్ జీవితాన్ని గురించి మాత్రం తరచి తరచి ప్రశ్నించింది. ఆమె సొంత జాతి అయిన అరబ్ లలో మొహమ్మద్ ప్రవక్త జన్మించటమూ ఆయనకి లక్షల మంది అనుయాయులుండటమూ కూడా చెప్పాను.

” ఓహో ! రెండు కొత్త మతాలన్నమాట. ఇదివరకెన్ని లేవు, ముందెన్ని రావు – వాటికేం కొదవ ! ఆ వెనక ఉన్నదాన్ని చూపించమని ఆకాశాన్ని, అనాదిగా మానవజాతి అర్థిస్తూనే ఉంది. అంతాన్ని గురించిన భయం తో కాస్త నాజూకైన స్వార్థం కలిస్తే పుట్టేదే మతం. ప్రతిమతమూ నమ్మేవారికి మంచినీ భవిష్యత్తునీ వాగ్దానం చేస్తుంటుంది. కానీ , ఇక్కడ చిక్కేమిటంటే, కేవలం నమ్ముతున్నంత మాత్రాన మూఢులకి వెలుగు కనబడదు – నీటి అడుగున ఉన్న చేపలకి నక్షత్రాల వెలుగు ఏమాత్రమో అంతే. మతాలూనాగరికతలూ పుడతాయి, పోతాయి – ప్రపంచం శాశ్వతం, మనిషి శాశ్వతం. తన కి నిష్కృతి ఉన్నది తనలోనేనని మనిషి గ్రహించగలిగితే, ఆ జ్ఞానాన్నీ శక్తినీ తనలోంచే తెచ్చుకుని నిటారుగా నిలబడగలడు. తనకొక నమూనా గా తయారు చేసుకున్న దేవుడి ముందు సాగిలపడనక్కర్లేదు…ఆ నమూనా కి తన కన్నా పెద్ద మెదడూ పొడుగు చేతులూ కూడా మనిషి పెడతాడు చూశావా , అవి తనకి మేలు కాక హాని నే చేస్తాయనే నమ్మకం కూడానూ , ఏం అజ్ఞానం ! ”

ఈమె తర్కం నాకు కొత్తదేమీ కాదు – ఎప్పటినుంచో ఉన్నదే. పురాతన కాలం నుంచి నిన్న మొన్నటి పందొమ్మిదవ శతాబ్దం వరకూ తత్వశాస్త్ర చర్చలలో భాగం గా ఉంటూ వస్తోంది. నేను ఆ వాదన తో ఏమాత్రం ఏకీభవించను – కాని ఆమెని ప్రశ్నించటమో ఖండించటమో చేయదలచుకోలేదు అప్పుడు. ఎందుకంటే – ఒకటి నేను అలిసిపోయి ఉన్నాను, రెండు- ఖచ్చితంగా ఓడిపోతానని తెలిసి. భౌతిక సత్యాలనూ సంఖ్యాశాస్త్రాలనూ అధ్యయనం చేసి ఉన్న సాధారణమైన మనిషి తోనే విశ్వాసమూ అంతః ప్రేరణా వంటివాటి గురించి వాదించటం కష్టం. ఇక ఈమె తోనా- రెండువేల ఏళ్ళ నుంచి పదును పెట్టబడుతూన్న మేధ ఉన్న, ప్రకృతి శక్తులనెన్నో స్వాధీనం చేసుకున్న ఈ అధివాస్తవిక వ్యక్తి తోనా ! వాదించటం మొదలెడితే నన్ను తన వైపుకి తిప్పేసుకోగలదన్న భయం కూడా లేకపోలేదు – మెదలకుండా ఊరుకున్నాను. కాని , వాదించి ఉండవలసింది – ఆయేషా దేన్ని నమ్మేదో తెలుసుకోగల అవకాశం ఉండేది.

నేను వెళ్ళేసరికి ఉస్తేన్, జాబ్ ఘోరమైన విషాదం లో మునిగిపోయి ఉన్నారు. లియో మృత్యుముఖం లో ఉన్నాడు, నా కోసం వాళ్ళు చాలా చోట్ల వెదికారట పాపం. అతను స్పృహ లో లేడు. శ్వాస అతి భారం గా ఉంది, ఉండి ఉండి వణుకుతున్నాడు. ఇంకొక్క గంట కన్న సమయం లేదని నా పరిమిత జ్ఞానం తోనే తెలిసిపోయింది. గంట ఉందా…అయిదు నిమిషాలే ఉందేమో ! ఇతను ఈ పరిస్థితిలో ఉంటే నేను అక్కడ ఆయేషా తో కబుర్లు చెబుతూ కూర్చున్నాను – ఎంత నికృష్టుడిని ! – ఇరవై ఏళ్ళు గా నా జీవితానికి ఉన్న ఒకే ఒక్క అర్థం ఇతనే -గడిచిన అరగంట లో ఒక్కసారైనా తలుచుకున్నానా అసలు !!! ఆలస్యమైపోయిందా ??

ఉస్తేన్ నిరామయం గా కూర్చుని ఉంది. జాబ్ ఏదేదో మాట్లాడుకుంటున్నాడు తనలో తను – కాలు నిలవని ఆదుర్దాతో బయటికి వెళ్ళాడు. ఆయేషా – ఆమె ఒక్కతే ఆశ. లియో కి ఇక ఏ దిక్కూ లేదు. జాబ్ బయటినుంచి భయపడుతూ పరుగెత్తుకొచ్చాడు-
” దేవుడే రక్షించాలయ్యా మనల్ని- శవం నడుచుకుంటూ వస్తోంది అక్కడ – శవం ! ”

ఒక్క క్షణం నేను తికమకపడ్డాను – వెంటనే స్ఫురించింది ఆయేషా దుస్తులు అలాగే శవానికి కప్పినట్లే ఉంటాయని. ఈ లోపు ఆమె లోపలికి రానే వచ్చింది. జాబ్ కెవ్వుమని ఒక మూలకి నక్కి గోడ లో మొహం దాచుకున్నాడు. వచ్చినది ఎవరో ఊహించిన ఉస్తేన్ సాష్టాంగపడింది.

” మంచి సమయానికే వచ్చావులే ఆయేషా. నా బిడ్డ మృత్యువు కి అతి దగ్గరగా ఉన్నాడు ”

” ఈ పాటికి చచ్చిపోయి ఉండకపోతే చాలు, బ్రతికిస్తాను. అతనెవరూ, నీ నౌకరా ? మీ దేశం లో కొత్తవాళ్ళకి నౌకర్లు ఇలాగే మర్యాద చేస్తారా ఏం ? ”

” నీ వేషం చూసి భయపడ్డాడు అంతే ”

ఆమె నవ్వింది.

” ఈ పిల్ల ? ఓ- చెప్పావుగా, గుర్తొచ్చింది. వీళ్ళిద్దరినీ బయటికి వెళ్ళమను. నా జ్ఞానాన్ని ప్రదర్శించేప్పుడు నీచమైన వాళ్ళు ఇక్కడ ఉండరాదు ”

ఉస్తేన్ కి అరబిక్ లోనూ జాబ్ కి ఇంగ్లీష్ లోనూ వెళ్ళమని చెప్పాను. జాబ్ వెంటనే వెళ్ళిపోయాడు గాని ఉస్తేన్ ప్రతిఘటించింది. రాజ్ఞి పట్ల ఉన్న భయభక్తుల వల్ల నాతో గుసగుస గా అంది – ” రాజ్ఞి ఏం చేయబోతోంది అయ్యా ? ఇటువంటప్పుడు భార్య ఉండాల్సింది భర్త పక్కనే కదా ? నేను వెళ్ళనయ్యా ”

” ఏమిటి ఆ పిల్ల ఇంకా ఇక్కడే ఉంది ? ” ఆ వైపుకి మొహం తిప్పి ఒక చివరన నిలుచుని ఉన్న ఆయేషా అడిగింది.

” లియో ని వదిలి వెళ్ళనంటోంది – ” నా నోట్లో మాట నోట్లో ఉండగానే ఆయేషా విసురుగా ఇటు తిరిగి ఉస్తేన్ ని గురిపెట్టి చూస్తూ ఒక్కటే మాట అంది.

” వెళ్ళు ”

ఉస్తేన్ పాక్కుంటూ బయటికి వెళ్ళిపోయింది.

” నా మాట మీరేవారిని నేనేం చేస్తానో ఈ పిల్లకి తెలిసినట్లు లేదు – పాఠం నేర్పాలి లా ఉంది, పొద్దున ఆ విచారణకి వచ్చినట్లు లేదుగా ఈమె ”

మొహం కనిపించకుండా నీడపడుతూన్న లియో ని సమీపిస్తూ -
” రాజసం ఉట్టిపడే ఆకృతి ఇతనిది ” అంటూ మొహాన్ని చూసేందుకు వంగింది.

మరుక్షణం లో ఆయేషా సుందరశరీరం ఎవరో నెట్టినట్లు అంత దూరానికి వెళ్ళిపడింది. గొంతు లోంచి అతి విహ్వలమూ భయానకమూ అయిన కేక వెలువడింది.

” ఏమైంది ఆయేషా ? అతను ఈ పాటికే చనిపోయాడా ? ”

ఆమె నా వైపుకి ఆడపులి లా లంఘించింది.

” కుక్కా ! ధూర్తుడా ! నా నుంచి ఇది ఎందుకు దాచి పెట్టావ్ ? ”- నన్ను చంపబోయేలా చెయ్యి చాచింది.

” ఏమిటి ? ఏమైంది ? ” – అయోమయాన్ని మించిన భయం నాకు.

” ఆ. నీకు తెలిసి ఉండదులే ‘’ – నెమ్మదించింది. ‘’ ఇతను కాలిక్రేటస్ – నా కాలిక్రేటస్. నా కోసం తిరిగి వచ్చాడు , వస్తాడు, నాకు తెలుసు ” – నవ్వుతోందో ఏడుస్తోందో తెలియని ఉద్వేగంతో అతని పేరు పిలుస్తూండిపోయింది.

[ ఇంకా ఉంది ]