పైడి తెరేష్ బాబు…లో పైడి అంటే బంగారం. తెరేష్ అంటే ఏదో ఒక దేవుడి గారి పేరే అయి వుండొచ్చు. కానీ, పైడి తెరేష్ బాబు కవిత్వం అంటే బంగారం కాదు, మట్టి! పనిచేసేది ఆకాశవాణిలో కావచ్చు, కానీ తెరేష్ బిగి కౌగిళ్ళన్నీ నేలకి! నేలలో మెరిసే మట్టికి! కోయిలలు మాత్రమే కూసే చోట…కోయిలల్ని బహిష్కరించి కాకులకు రాజ్యం అప్పజెప్పే కవి తెరేష్. అతన్ని కేవలం కవి అందామంటే మనసొప్పదు, పోనీ కవి కాదు ఇంకేదో అందామంటే కవిహృదయం తల్లడిల్లి పోతుంది. కవిత్వానికీ, తాత్వికతకీ పెళ్లి కుదుర్చిన వాడు. తన ప్రేమకీ లోకమ్మీది ప్రేమకీ బంధం నేర్పినవాడు. తెరేష్…అంటే అరమరికలు లేని మనసు. తెరమరికలు లేని మాట! చూడండి ఈ కవి మనసు నిషాని..
1. మీ కవిత్వం తొలినాళ్ళు ..ప్రవేశం …కష్టాలూ కన్నీళ్లు
-కవిత్వం దాక వెళ్ళారు .అసలు మనం అచ్చరాలు దిద్దడమే అత్యంత నాటకీయ సంఘటన .ముందు ఆ ముచ్చట చెప్పాలి .పిట్టలు కొట్టడం ,,పొయ్యిలోకి పుల్లలేరుకు రావడం , ఈత కొట్టడం, పళ్ళతోటల్లో జామ మున్నగు కాయలు దొంగిలించడం ,తన్నులు తినడం వంటి అపురూపవిన్యాసాలతో అలరారుతున్న బాల్యంలోకి ‘మోడ్రన్ బ్రెడ్’అనే ఆహారవిశేషం ఒకటి ప్రవేశించింది .గవర్నమెంటు వారు దాన్ని ఉచితం గా బళ్ళలో మాత్రమే పంపిణీ చేసేవారు ..ఎంచక్కా ఒట్టిచేతులతో బడి కెళ్ళడం ,బ్రెడ్డు పంచేదాకా వుండడం ,ఒంటేలు కొస్తుందని అబద్ధమాడ్డం , పారిపోవడం,మళ్ళీ ఎప్పట్లాగే పిట్టలు, ఈత , పుల్లలు గట్రా ….మన లైఫ్ మనది . ఈ నేపధ్యంలో కమలమ్మ అయ్యవారమ్మ గారు మా ఇంటికి వచ్చి ,మన చరిత్రను గానం చేసి ,నన్ను మా నాన్న చేత తన్నించి ,చదువుకుని బాగుపడిన పేదవారి జాబితా ఏకరువు పెట్టి ,నన్ను ‘తోపులో బడి’ అనే బడికి రెక్కపుచ్చుకు లాక్కెళ్ళింది ..అ ఆ లు రాయడానికి పలక లేదు అనేది మనదగ్గరున్న కుంటి సాకు .. దాన్నావిడ తేలిగ్గా కొట్టిపారేసి నేల మీద ‘అ ఆ ఇ ఈ’లు రాసి నా చేయి పట్టి దిద్దించింది ..ఆవేళ నాకు అంతగా తెలీదు , నా మట్టి అక్షరాలై నాలోకి ప్రవహించిన సందర్భం అది. ఇవాళ దర్జాగా నాలుగుమెతుకులు తింటున్నానంటే ,నాలుగుముక్కలు రాయగలుగుతున్నానంటే ,ఆవేళ ఆ తల్లి పెట్టిన ఆ నాలుగక్షరాల భిక్షే .ఇక కవిత్వం విషయానికి వస్తే -నాకు కవిత్వాన్ని పరిచయం చేసినవాడు మా నాన్న.అలాగని ఆయనేమీ కవికాడు .కష్టజీవి .వడ్రంగం మేస్త్రీ .ఆయన మంచి పాటగాడు .ఆయన పాడే సినిమా పాటలే నాకు కవిత్వాన్ని పరిచయం చేశాయి .’మంటలు రేపే నెలరాజా’ అనే పాట పాడి ,’నువ్వు దాశరధి గారిలాగ రాయాల్రా ‘అనేవాడు . ‘నన్ను దోచుకుందువటే ‘అనే పాట పాడి నారాయణరెడ్డి గారిలాగ రాయమనేవాడు .ఇలా ఒక్కో కవి రాసిన పాటపాడి ఆయనలాగ రాయమనే వాడు .వాళ్ళెవరో ,ఎందుకలా రాస్తున్నారో అర్ధం కాని వయసు .ఉత్తరోత్తరా వాళ్ళ పేర్లు రేడియోలో విన్నాక విషయం బోధపడింది .నేను చదివిన తొలి సాహిత్యగ్రంథాలు ఎలిమెంటరీ స్కూలు తెలుగు వాచకాలు .వాటిలో పాటలుండేవి ,పద్యాలుండేవి ,కథలుండేవి. అన్నిటినీ బట్టీ పెట్టే వాణ్ని
అప్పటికే నాన్న లాగ పాడాలనే తపన ఒకటుంది .నెమ్మదిగా పాటలు రాయడం మొదలెట్టాను .ఏడో తరగతికే పిచ్చి ముదిరింది ..అప్పటికే మా హిందీ మాస్టారు ఈమని దయానంద గారు జిల్లాలో పేరున్నకవి ..నా పాటలు నీట్ గా ఇంకు పెన్నుతో రాసి ఇంటర్వెల్ టైం లో చూపించాను ..పాటలురాయడం కాదు ,పాఠాలు చదువు ముందు ‘అని ,తిట్టి ,నోట్ బుక్ ని విస్సిరి బైట పడేస్తే ,అదిపోయి వాటర్ ట్యాంక్ పక్కన బురద నీళ్ళలో పడింది ..అసలే ఇంకు పెన్ను రాతలు ..నీటిలో కలిసిపోయాయి .నోట్ బుక్ లో ఒకటీ అరా వాక్యాలు ,బురదమరకలు మాత్రమే మిగిలాయి.దుక్క్హం !ఒకటే దుక్ఖం !కసి!ఒకటే కసి!రాయాలి !మేస్టారికన్నా బాగా రాయాలి ..రాశా.’రాష్ట్ర బాలల అకాడమీ ‘వారు నిర్వహించిన గేయరచన పోటీలలో[1977] జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి. హైస్కూలు అసెంబ్లీలో ‘వీడు నా విద్యార్ధి అని చెప్పడానికి గర్విస్తున్నా’అంటూ హెడ్ మాస్టారు చివుకుల కోటేశ్వర శర్మ గారి ప్రశంస .తోటి విద్యార్ధుల ఈలలు,చప్పట్లు.ఉత్సాహం.ఉద్వేగం.దుక్ఖం.కసి.అప్పట్నుంచి టెన్త్ క్లాస్ అయిపోయేవరకు [1979]బాలల అకాడమీ పోటీల్లో మనమే ఫస్టు.”నీకు బంగారు భవిష్యత్తుంది నాయనా .బాగా రాయాలంటే బాగా చదవాలి .పెద్దవాళ్ళు రాసినవి చదువు.’అని దీవించి ,నాచేతిలో శేషేంద్ర శర్మ గారు రాసిన ఋతుఘోష ,శరజ్జ్యోత్స్న ,పక్షులు,మండే సూర్యుడు , కవిసేన మేనిఫెస్టో మొదలైన పుస్తకాలు నా చేతిలో పెట్టారు మా ఇంకో హిందీ టీచర్ వేదవల్లి తాయారమ్మగారు [శేషేంద్రశర్మ గారి వియ్యపురాలు]అధ్యయనం మొదలు .ఆకలి మొదలు .దొరికినపుస్తకాన్ని దొరికినట్టు చదవడం , ఆ స్టైల్ లో రాయాలని ట్రై చెయ్యడం , చతికిలబడ్డం ,సక్సెసవ్వడం ,సెలవు దొరికితే ,ఆ వేళ అమ్మతోనో నాన్నతోనో కూలీకెళ్ళే పని లేకపోతే , ఎంచక్కా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో దూరడం ,చదవడం చదవడం చదవడం .విచ్చలవిడిగా రాయడం ,ఎందుకురా అన్నన్ని తెల్లకాయితాలు కొంటావు .ఏం రాస్తావు వాటిమీద ? అని మా అమ్మ అమాయకపు ప్రశ్న .[ఆవిడే 'Etv'లో నా 'విధి' , 'సంఘర్షణ' సీరియల్స్ చూస్తూ 'ఎంత బాగా రాశావురా'అని ప్రశంసించింది.]రాస్తున్నవి అసలు పేరుతో పంపిస్తే తిరుగు టపా కట్టేస్తున్నాయి .’మగాళ్ళు సైతం ఆడపేరుతో రాస్తున్న రోజులివి .ఏదైనా కలం పేరుతో రాసి పంపి చూడు ‘ అని కొందరి సలహా .అప్పటికే మనం అరివీర భయంకర రేడియో శ్రోత .రేడియోలో ‘ఉషశ్రీ’, లైబ్రరీలో ‘కరుణశ్రీ,హితశ్రీ , జాతశ్రీ ….ఆ శ్రీ ఈ శ్రీ ‘మనం ‘పైడిశ్రీ’ అయితే ?!?.స్టార్ట్ ఇమ్మీడియేట్లీ పత్రికలకు పంపగా తిరిగొచ్చిన వాటినే తిరగరాసి పంపించా .ఒక్క రచన తిరిగొస్తే ఒట్టు .ఇంటర్మీడియేట్ అయిపోయే నాటికి ‘అచ్చులు’ మొదలయ్యాయి .కవితలు, కథలు, రేడియో రచనలు..ప్రముఖ దిన ,వార,పక్ష పత్రికలతో పాటు .’భారతి’సాహిత్య మాసపత్రిక సైతం నన్ను కాదనలేని పరిస్తితి ‘హల్లులూ మొదలు .డిగ్రీ అయిపోయేనాటికి ‘గుణింతాలు అయిపోయాయి .అంబేద్కర్ రచనలు ,అంబేద్కర్ గురించిన రచనలు చదివాక ‘అసలు భాషా సాహిత్యాలు ‘మొదలయ్యాయి.
2. తెరేష్ అంటే పదునైన వ్యంగ్యం .ఇంత వ్యంగ్యం ఎక్కడినుంచి వచ్చింది?
మాట్లాడ్డం అనివార్యమైనపుడు ,సూటిగా మాట్లాడ్డం నిషిద్దమైనపుడు మాట్లాడ్డానికి మరోవాహకాన్ని ఎంచుకుంటాడు మనిషి ఉదాహరణకు నా చిన్నతనంలో అమ్మతో కలిసి నేనూ కూలిపనికి వెళ్ళే వాణ్ని .కూలీడబ్బులు ఇవ్వమని ఆసామిని సూటిగా అడిగితే కోప్పడేవాడు .అందుకని కూలీజనం వేరేపద్ధతిని ఆశ్రయించేవారు .ఇంట్లో నూకలు కూడా లేవనో ,పిల్ల పెద్దమనిషయిందనో ,చెప్పేవారు .ఆసామికి విషయం అర్ధమయ్యేది .డబ్బులిచ్చేవాడు ..డబ్బులు తక్కువ ఇస్తే ‘పొరపాట్న ఎక్కువిచ్చినట్టున్నారు సామీ’అనేవాళ్ళు.అస్సామీ నవ్వి మిగతావి ఇచ్చేవాడు .బహుశా నా లోని వ్యంగ్యానికి భూమిక ఇలాంటి సంఘటన లేమో !ఒక పదునైన వాక్యం కత్తిలా గుచ్చుకుంటుంది .పదునైన వ్యంగ్యం రెండంచుల కత్తి .అది గుచ్చుకోవడమేకాదు ,లోపల మెలిపెడుతుంది .దెయ్యంలా వెంటాడుతుంది ఐతే ఒక్క మాట .ఇది తనకు తానుగా వచ్చిందే తప్ప ,ప్రయత్నపూర్వకంగా నేను సాధించింది మాత్రం కాదు.
3. మీ సమకాలీకుల్లో మిమ్మల్ని ఆశ్చర్యపరచీ, ప్రభావితం చేసిన వాళ్లెవరయినా వున్నారా?
లేకేం …చాలా మంది వున్నారు .ఒక్క కవితా వాక్యం కూడా రాయడం చేతగాకపోయినా గొప్పకవులుగా చలామణీ అయ్యే వాళ్ళని చూస్తే ఆశ్చర్యమ్ వేసేది .దళిత సాహిత్యపు ఉరవడి కీ ,ఉద్ధృతి కీ అబ్బురపడి మేమూ దళితులమే అనే కులీనకవుల్ని చూసినప్పుడు ,కవిత పూర్తిగా చదవకుండా తీర్పులు తీర్చే వాళ్ళని చూసినప్పుడు ,ఆశ్చర్యం వేసేది .దళిత తత్వాన్ని అర్థం చేసుకుని , ముఖ్యం గా గాంధీ గారికీ [హరిజనోద్ధరణ ], అంబేద్కర్ గారికీ [దళితజన విముక్తి] తేడా తెలుసుకుని చెయ్యి కలిపిన వాళ్లనిచూస్తే ఆశ్చర్యం తో పాటు సంతోషమూ కలిగేది .ప్రభావం విషయానికి వస్తే నేను రాసేది బూతు అని,, బూతు కాదు గుండెకోత అనీ , గొప్ప కవి అనీ , వీడసలు కవే కాడని ఇలా రకరకాలుగా నన్ను విమర్శించిన వారందరి ప్రభావం నా మీద వుంది .ఇదిలావుంచితే , నన్ను నూటికినూరు పాళ్ళు ఆశ్చర్య పరిచి ,అన్నివిధాలా అంతో ఇంతో ప్రభావితం చేసిన సమకాలికుడు ‘త్రిపురనేని శ్రీనివాస్’.నేను కవిత్వంలో రాణించి నట్టే సినిమాల్లోనూ రాణించాలని అతని కోరిక . ‘తెరేష్ , నువ్వు ఉద్యోగం ,భద్రత ,తొక్క,తోటకూర లాంటి మిడిల్ క్లాస్ మెంటాలిటీ లోంచి బైటపడు .గొప్ప ఫిలిం మేకర్ వి అవుతావు ‘ అనేవాడు .నేను వినేవాణ్ణి కాదు . ‘పైడిశ్రీ’ అనే పేరు పీకేసి నన్ను మళ్ళీ ‘పైడి తెరేష్ బాబు’ ను చేసింది అతనే .ఆతను చనిపోయింతర్వాత కూడా చాలా సందర్భాల్లో , చాలా సార్లు గుర్తొస్తాడంటే అతని ప్రభావం నా మీద ఎంతవుందో అర్థం చేసుకోవచ్చు
4. నిశాని కవిత్వలోని అశ్లీలం ,ఆ తరవాతి తెరేష్ కవిత్వంలో లేదు. ఎందుకని?
‘నిశాని’ కవిత్వం లో అశ్లీలం వుందంటే నేనొప్పుకోను. ఒకవేళ మర్యాదస్తుల లెక్కప్రకారం ‘వుంది’ అనుకుందాం . వుంటే గింటే అది ,’ఏమొకో చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను’ అనే అన్నమయ్య కీర్తన కన్నా అశ్లీలంగా ఉందా? మర్యాదస్తులు నెత్తినెట్టుకు ఊరేగే ప్రబంధ కవులు స్త్రీల బాహుమూలాల్ని సైతం వదలకుండా రాసిన రాతలకన్నా అశ్లీలంగా ఉందా ? అప్పటికది ఎట్లా అవసరమయ్యిందో ఇప్పటి అవసరం ఈ రూపం లో వెలువడింది .అంతే . ఏదీ అశ్లీలం కాదు . ఇక నిశాని తర్వాత కవిత్వం అంటారా ….అప్పట్నుంచి ఇప్పటిదాకా నేను రాసినదేదైనా సరే ఒక తప్పనిసరితనం లోంచి, ఒక చారిత్రిక సందర్భం లోంచి పుట్టుకొచ్చిందే తప్ప , ‘అటెండ్ సార్ ‘ మార్కు కవిత్వం కాదు. అది కొందరికి నచ్చవచ్చు .కొందరిని గిచ్చవచ్చు. నా గజల్ లో ఒకచోట ఇలా అన్నాను .”అణువున అనంతమున్నది .అహమున దిగంతమున్నది /పైడి కనుల అశ్రువులో ప్రపంచక్లేశమున్నది “. ఇది పచ్చి నిజం
5. దళిత-ముస్లిం జమిలి స్వరాన్ని వినిపించిన అతికొద్దిమందిలో మీరొకరు.దళిత-ముస్లిం అస్తిత్వాల్ని కవిత్వం లో ఎలా చూస్తారు మీరు?
ఈ దేశానికి సంబంధించి కొద్దిపాటి మినహాయింపులతో ఇద్దరూ ఒకరే !కాకపొతే మతవిశ్వాసాల కారణంగా ముస్లింలకు ప్రత్యేకమైన అస్తిత్వం ఏర్పడింది.ఇద్దరూ ఒకప్పుడు ఈ దేశాన్ని ఏకచత్రాధిపత్యంగా పాలించిన వాళ్ళే .ఇవాళ వాళ్ళు పంచములు ,పనిమనుషులు , అలగాజనం,మటన్ కొట్టు మస్తాన్లు ,సైకిల్ పంచర్లేసుకునే షాబుద్దీన్లు ,ప్రమాదకారులు,టెర్రరిస్టులుగా , మరీ ముఖ్యంగా ఈ దేశానికి సవతి బిడ్డలుగా చూడబడుతున్నారు .అన్యాయం కదా .దారుణం కదా . ఇది కేవలం కొందరు జరిపిన కుట్ర అని అంబేద్కర్ సకృత్తు గా రుజువు చేసిన తర్వాత కూడా నా తోబుట్టువుల గురించి నేను రాయక పొతే ఆత్మవంచన అవుతుందికదా .అందుకే రాశాను .మతాన్ని గౌరవిస్తూనే ,అందులోని మౌడ్యాన్ని ప్రశ్నించమని పిలుపునిచ్చాను .ముస్లిం కవుల రాకతో తెలుగు సాహిత్యం లో మరో కొత్త వాకిలి తెరుచుకుంది .కొత్తప్రశ్నలు నిద్ర లేచాయి .కొత్త ఆలోచనలు,కొత్త చర్చలు పురుడుపోసుకున్నాయి . ఐతే, అటుగానీ ఇటుగానీ విముక్తి భావజాల పరంగా తెంపు కోవలసిన దారప్పోగులు చాలానే వున్నాయి .ఇది ఇవ్వాల్టి కివాళ జరిగే పని కాదు .కాలక్రమేణా మానసికంగా జరగాల్సిన జీవక్రియ
6. మీరు రాసిన వాటిలో మీకు బాగా నచ్చిన కవిత ? ఎందుకు?
చెప్పడం కష్టమే .మరీ సాక్షిబోను ఎక్కించి అడిగితే …సమాధానం “మట్టిబలపం’!అమ్మ మీద రాసిన కవిత .అది నేను మాత్రమే రాయగలిగిన కవిత.అమ్మకు పెద్దగా చదువు రాదు.అయినా నా ‘అల్పపీడనం’ కవితాసంపుటి చేతిలో పట్టుకుని ,అక్షరాక్షరం కూడబలుక్కుంటూ ఆ కవిత చదివేది .ఏడ్చేది .నవ్వేది .’ఇది మా అబ్బాయి రాశాడని’ అందరితో గర్వంగా చెప్పుకునేది . ఇవాళ అమ్మలేదు.కానీ , నా కవితలో అమ్మ బతికే వుంది. కవితలోంచి కొన్నివాక్యాలు గుర్తు చేస్తా
“కదుల్తూకూడా కదలనట్టుండే జీవనది పేరు అమ్మ”
“బొట్టు బొట్టుగా పొదుపు చేసుకున్న రక్తాన్ని
నేషనల్ టుబాకో కంపెనీ పొగాకుబేళ్ళ మీద చిలకరించిన జ్ఞాపకం”
“పుగాక్కాడ ఈనెను చీల్చినట్టు
దారిద్ర్యం అమ్మను రెండు చీకటి తుంపులుగా చీల్చిన జ్ఞాపకం ”
“ఒంగోలు కట్టుకున్న బాధలగది పేరు పైడి సుబ్బులమ్మ”
“ఆస్పత్రులు హిస్ట రెక్టమీలయ్యేది అమ్మలకోసం”
“అమ్మను చూడాలనుకున్నప్పుడల్లా
నన్ను నేను అద్దంలో చూసుకుంటాను
అద్దంలో కనపడని గుండెకాయ మాత్రం
ఒంగోలు గుమ్మంలో కొడుకు ఉత్తరం కోసం ఎదురుచూస్తూ వుంటుంది”
7. ఇప్పటిదాకా రాసిన కవిత్వం మీకు తృప్తి నిచ్చిందా?
లేదు.ఇవ్వలేదు.రాసినదానితో తృప్తి పడ్డం అంటే అది మరణంతో సమానం .ఇంకా రాయాలి .రాస్తాను.చచ్చినాసరే ఒకసారి రాసింది మళ్ళీ రాయను .మా కీ కసమ్ .
8. దళిత అస్తిత్వవేదన లేకపోతే తెరేష్ ఉంటాడా?వుండి వుంటే ఎలావుండేవాడు?
ఖచ్చితంగా ఉంటాడు .ఎలా వుండేవాడైయ్యా అంటే ఎంచక్కా ఎక్కడికక్కడ కులాన్ని దాచిపెడుతూ ,ఒజ్జల పుచ్చకాయలు నిమురుతూ , మనసుచంపుకుని దిన,వార,పక్ష,మాస పత్రికలనిండా నానా చెత్తంతా రాస్తూ ,జనంమీద రుద్దుతూ కవిగా రచయితగా కళాకారుడుగా ఈ పాటికి కీర్తి, అవార్డులు,సన్మానాలూ ,డబ్బు,కార్లు ,విదేశీయానాలు,పైరవీలు ,ప్రభుత్వ నామినేటెడ్ పదవులు ,చుట్టూ అసంఖ్యాక భజనపరులతో ,రోజూ ఒక సభకు అధ్యక్షత వహిస్తూ , పుస్తకాలకు ముందుమాటలు వెనకమాటలు రాస్తూ వేస్తే వెయ్యి వూపులుగా ఉండేవాడు.’అయ్యో నాకోసం , నావాళ్ళ కోసం ఒక్కముక్కైనా రాయలేక పోతున్నానే ‘ అనే అసంతృప్తితో నిత్యం దహించుకు పోతూ ఉండేవాడు. స్వస్తి.
చాలా బాగుంది ప్రియమైన తెరేష్ ! కదిలించావు!!! దళిత అస్తిత్వం మీద మీకున్న స్పష్టతకు అభినందనలు!
చాలా సంతోషం మిత్రమా
తెరెష్ గారూ,
“అమ్మను చూడాలనుకున్నప్పుడల్లా
నన్ను నేను అద్దంలో చూసుకుంటాను
అద్దంలో కనపడని గుండెకాయ మాత్రం
ఒంగోలు గుమ్మంలో కొడుకు ఉత్తరం కోసం ఎదురుచూస్తూ వుంటుంది… ”
ఈ మాటలు మనసుని తాకుతున్నాయి. అసలు ఈ కవిత శీర్షికే (మట్టిబలపం) చక్కగా ఉంది. హృదయపూర్వక అభినందనలు.
నేను ఇష్టపూర్వకంగా రాసుకున్న కవిత . మీకూ నచ్చినందుకు సంతోషంగా వుంది మూర్తి గారూ
చాలా బాగుంది
థాంక్సండీ ఆదిత్య రెడ్డి గారూ
తెరెష్ కవిత్వం రాస్తున్నప్పుడు, నాకు కవిత్వమంటేనే తెలియని రోజులు.వుద్యోగం దొరక్క
బతుకు బండి నెత్తుకొస్తున్న రోజులు. కానీ మంచి దళిత కవిత్వాన్ని రాసినవాడు తెరెష్.
తుల్లిమల్లి విల్సన్ సుధాకర్
thank you dear
మిమ్మల్ని కలవాలి .. సుధాకర్ గారూ తెరేష్ గారితో దొరుకుతారేమో సూడాలి
మాట్లాడ్డం అనివార్యమైనపుడు ,సూటిగా మాట్లాడ్డం నిషిద్దమైనపుడు మాట్లాడ్డానికి మరోవాహకాన్ని ఎంచుకుంటాడు మనిషి ,
పైడిశ్రీ మాత్రం కలం అనే రెండంచుల కత్తి తీసి దూస్తున్నాడు, కోస్తున్నాడు.
సింప్సన్ గారికి కృతఙ్ఞతలు
నాకు అంతగా నచ్చలేదు. అసంపూర్తి వల్ల అసంతృప్తిగా అనిపిస్తుంది. తెరేష్ లోని సంగీతజ్ణుడు, సినిమా విశ్లేషకుడు కూడా బయల్పడితే బాగుండేది.
అసంతృప్తికి క్షంతవ్యుణ్ణి .ఎంత స్వేచ్చాజీవులమైనా కొన్ని పరిమితులకు లోబడక తప్పదు మిత్రమా .ఇవి కొన్ని ప్రశ్నలకు జవాబులే . మిగతా ప్రశ్నలు ఎదురైనప్పుడు మిగతా ముచ్చట్లు !సినిమాలు ,సంగీతం ……సందర్భం వచ్చినపుడు దేన్నీ వదలను . అన్ని ముచ్చట్లూ పంచుకుంటా . Keats ప్రవచించిన unheard melodies గురించిన అభిమానం మీ రూపేణా ఇలా వ్యక్తమైనదనుకుంటున్నాను .కృతఙ్ఞతలు
నాకు బాగా నచ్చి నన్ను కదిలించిన నా తరం దళిత కవులు ముఖ్యంగా ముగ్గురు – మద్దూరి నగేష్ , పైడి తెరేష్ , ఎండ్లూరి సుధాకర్ . సుధాకర్ కవిత్వం జాలి జాలిగ సితారా సంగీతంలా తాకేది, నగేష్ ఒక ఉప్పెన సునామీ లా ముంచేసే వాడు – ఉప్పెనని, సునామీ ని కడుపులో దాచుకుని, కొన్ని సార్లు కెరటాలు కెరటాలుగా, కొన్ని సార్లు జలపాతంగా , కొన్ని సార్లు నర్మగర్భమైన నదిలా పలు విధాలుగా పలికించే ఆగ్రహ సితారా సంగీతం పేడి తెరేష్ ! ఆయన పద్యం ఆయన గొంతులో వినాలి – ఒకే సారి అనేక అనుభూతుల్ని కలిగించగల కళాకారుడు!
మిత్రమా …ఇంత ప్రేమా ! తట్టుకోగలనా !!ఈ సారి మనం కలిసినప్పుడు ముఖాముఖి కొన్ని కొత్తపాటలు వినిపిస్తా . అదొక్కటే నాకు చేతనయిందీ ,నేను చేయగలిగిందీ .మీ ప్రేమకు సర్వదా కృతజ్ఞుణ్ణి .
” అద్దంలో కనపడని గుండెకాయ మాత్రం
ఒంగోలు గుమ్మంలో కొడుకు ఉత్తరం కోసం ఎదురుచూస్తూ వుంటుంది”
Wonderful!!!
thank you
nenu tereshbaabuni choodakamundu chaannaalla kindate athani kavitvam chadivi aascharyapoyaanu.pongipoyaanu.askharam to antha baagaa saamu cheyochani… tereshbaabu rachanalu,naaku nachina marikondaru rachayithalla rachanalla udvegaparichaayi.chaalaa kaalam tarvaatha teresh ni paaduthundagaa vinnanu.voho,adiripoyaanu.oka vennela raatri tersh paatanu nadi vodduna vinte baagunnani korika.
interview swachamaina raktanaalaala nunchi pravahinchina kavitvaprasarana.sebash teresh
నది ఒడ్డున కాకపొతే సముద్రం ఒడ్డున కూర్చుందాం అప్పల్నాయుడు గారూ .నాకు ‘హిందూ’ మహాసముద్రం తోనే పేచీ .బంగాళా ఖాతంతో కాదు . సముద్రగర్భం లో పాటల బీజాలు నాటే విద్య మనకు ఎలాగూ తెలుసు కాబట్టి ‘ప్రవహించడం’ అనే పాయింట్ మీద సముద్రానికి కొన్ని పాటలు నేర్పుదాం. తిరిగి అది మనకు నేర్పే పాఠాలు నేర్చుకుందాం., that is not a big issue,నా పట్ల మీరు కనబరచిన అనురాగానికి కృతఙ్ఞతలు.
dear sir
i have watched your video ME and MY WONDERFUL WORLD
వ్రాయటానికి మాటలు ఏమీ రావటంలేదు.
బహుసా నేనెప్పటికీ కనీసం ఒకటి రెండు వాక్యాలు దానిగురించి రాయలేనేమో
ఆ పుస్తకం గురించి బి.చంద్రసేఖర్ గారి వ్యాసమూ చదివాను
మీ వీడియోనే గత రెండు రోజులుగా మళ్ళీ మళ్ళీ చూస్తున్నాను.
మీ పదాల పదును, ఉచ్చారణ, విరుపులు, వాక్యం యొక్క ఎత్తు పల్లాలు …. ఒకటేమిటి ప్రతీదీ ప్రతీసారీ కొత్తగానే అనిపిస్తున్నాయి మిత్రమా …. అవును నీవు నా ఆత్మకు మిత్రుడివైనావు గుప్పెడు భావాల లావాని చల్లి…
కృతజ్ఞతలతో
బొల్లోజు బాబా
ఏం చెప్పమంటారు మిత్రమా … మీ ఆత్మీయవచనం నన్ను మూగతనంలోకి నెట్టేసింది .బొల్లోజు బాబా గారూ కృతఙ్ఞతలు
ఎంతో ఆత్మీయంగా పలకరిస్తారు .. మావూరి మాస్టారు
please read as
i have watched your video ME and MY WONDERFUL WORLD
మీ కవితలు చదుతుంటె లోపలెక్కడొ వున్న పేగుల్ని తీసి మీటుతున్నట్లు వుంటుంది. అలవోకగా చాలా బాగా రాస్తారు.
మట్టీ గట్టయిన చొట నీల్లుంటాయి .మనిసి గట్టయిన చొట నెత్తురుంటుంది…….సముద్రం ప్రవహించదు కానీ ప్రవహించగలననె బుకాయిస్తుంది…….అనగలిగిన దమ్ము ఎవరికుంటుంది అన్న తెరెశ్ అన్నకి తప్ప .కంగ్రాట్స్ అన్నయ్య
రాసిన దానితో తృప్తి పొందటం అంటే అది మరణంతో సమానం. కవిత ఆగితే కవి మరణించినట్లే. అమ్మ గురుంచి తెరేష్ బాబు మాత్రమే రాయగలడు అన్నది అక్షర సత్యం.
“అమ్మను చూడాలనుకున్నప్పుడల్లా
నన్ను నేను అద్దంలో చూసుకుంటాను
అద్దంలో కనపడని గుండెకాయ మాత్రం
ఒంగోలు గుమ్మంలో కొడుకు ఉత్తరం కోసం ఎదురుచూస్తూ వుంటుంది”
ఎవరు రాయగలరు ఒక్క తెరేష్ బాబు గారు తప్ప
ధన్యవాదాలు
I love this interview a lot
I bow before the poet
hrudayaaniki hattukondi
నిజానికి ఇక్కడ స్పందిస్తే వయసులో పెద్దవారు గనక మీరు, మీలాగ, అని రాయాలి…. నాకు దగ్గర కదా మీరు(నువ్వు) అందుకని మీరు అని నిన్ను (మిమ్మల్ని ) దూరంగా నెట్టలేను తెరేసు బాబు గారు ( )….మీ కంటే వెనక పుట్టినా మీ వ్యక్తిగత జీవితానుభవాల తాలూకా నాతోనూ, నాజీవితంలోనూ ఉంది.అందుకో కొంత మిమ్మల్ని ఇష్టపడతాను త్రిపురనేని గారు అన్నది మీరు పాటిస్తున్నారేమో అనుకుంటున్నాను.. వ్యంగ్యం ఎక్కడినుంచి వచ్చింది? అన్నదానికి దాదాపు అలాంటి సమాదానమే నా దగ్గరా ఉంది. నాకు ఇకనుంచి రాయాలనిపిస్తుందేమో సూడాలి.
ఫన్టాస్టిక్ తెరేష్ , లోగడ మీ అమ్మ గురించి వ్రాసిన కవిత చదివాను . కదిలించింది .
తెరేష్ గుర్తొస్తే ఇబ్బందిగా లేదూ ..
తెరేష్ అన్నా …..
చివరి ప్రశ్నకు జవాబు చదివే ముందు, ‘తెరేష్ ఈ ప్రశ్నకు ఇలా జవాబు చెప్పి వుండాలి’ అనుకుంటూ ఆసక్తితో చదివేను ….ఊహించిన జవాబు కనిపించగానే బోల్డంత సంతోషం !
ఇంటర్వ్యూ బాగుంది సర్
8 వ ప్రశ్న కు మీరు యిచ్చిన సమాదానం చాల గొప్పగా–వాస్తవం గా ఉంది —నిజం చెప్పారు
రాజకీయ నాయకు ల్లా — గ్రూపులు —ఆధిపత్యాలు
గుర్తింపు కోసం ఆరాటాలు — అవార్డ్స్ కోసం నానా గడ్డి కరుచడం — పేస్ బుక్ లో
రోజు కనిపించడం —ఏదో ఒక మెసేజ్ పెడుతూ —బొమ్మలు —-నేటి కవుల్లో చూస్తున్న సత్యాలు
సాహిత్యం కన్నా రాజకీయం ఎక్కువ అయింది —-బాబు గారు చక్కగా చెప్పారు సర్
———————బుచ్చి రెడ్డి గంగుల
చాల బాగుంది తెరేష్ గారు మనసును కదిలించింది