కథ

దొరబాబు

జూన్ 2016

పాపం చెన్నమ్మ.. వయసులోనే మొగుడు పోయి, ఇప్పుడు వయసే అయిపోయి, ఆటో యాక్సేంట్లో చెయ్యి తెగిపోయి, ఒంటిపైని ముడతలు పడిపోయి ఇట్టా వుండాదిగానీ దొరబాబు పెళ్ళాం కాక ముందర, పాతూరు పాలెంలో చానామంది కన్నా మా గొప్పగా బతికినట్టే!. చిన్నప్పుడు చెన్నమ్మ తల్లి రవనమ్మ, పిల్లకి బుగ్గమీదా, ముక్కుమీదా, అరికాలినా దిష్టి చుక్కలు పెట్టేది.

“నాకూతురు సందమామ. దీనికి కురిచీలో కాలు మీద కాలేసుకుని కూచునే దొరబాబు లాటి మొగుడోస్తాడు”పతిరోజూ ఇట్నే అనేది. చెన్నమ్మ కిల కిలా నవ్వేది. రోజూ అమ్మ గారాబం చేసి మోచ్చుకోటాన తను నిజంగా చాలా అందగత్తె అని చెన్నమ్మకి తెలిసిపోయ్యింది. అందుకే ఆటల్లగూడా యువరాణీ ఏషాలే గట్టేది. చుట్టు పక్కల సావాసగత్తులు కూడా ఆ పిల్ల ఇచ్చే తాయిలాలికి ఆశపడి చెన్నమ్మని రాణీగా ఉండనిచ్చేవాళ్ళు.

రవణమ్మ తనుపనిచేసే ఇళ్ళ కాడ్నుంచి కుచ్చుల గౌనులు, బుట్ట చేతుల జాకీటున్న చిలక పచ్చు రంగు పరికెనీ, పొట్టి పావడాలూ, అప్పుడప్పుడూ మొగోడికి మల్లె పేంటూ చొక్కాలూ ఇంకా ఏమో తెచ్చేది. అబ్బో, ఆ గుడ్డలు చూసి చుట్టుపక్కల పిల్లలు కుళ్ళుకు సచ్చేవారంటే నమ్మేయోచ్చు.
అమ్మలక్కలుగూడా పిల్లదాని బోగాటం జూసి మూతులు తిప్పుకుని మెటికలు విరిచేవాళ్ళు.

యీది బళ్ళో ఏడు తరగతులు సదివి పెద్ద మనిసైనాక చెన్నమ్మ ఇంటికాడనే నిల్చిపోయింది. అప్పట్లో ఆడ పిల్ల అంతమాత్రం సదివిందంటే గొప్పే. పిల్లకి పదైదు దాటినంక పెళ్లి చేసేదానికి రవనమ్మ ఎతకలాట మొదులుబెట్టింది.

పాలెంలో ఒకరిద్దరు పెద్ద పెద్ద ఆపీసరులు వున్నారు. ఆ ఇరుకు సందుల్లో పుట్టి పెరిగి ఆటిని వదల్లేక కాలనీ ఇళ్ళ మజ్జిన అట్నే సదురుకుని మిద్దెలు కట్టుకున్నారు. ఐతే ఆల్ల ఇళ్ళలో చెన్నమ్మకి తన ఈడుకి తగ్గ దొరబాబులాటి పెళ్లి గాని పిలగాడు ఎవడూ కనబళ్ళా! ఇగ తనకి మొగుడ్ని తేవాలంటే బైట ఎతకాలిసిందే అనుకునింది చెన్నమ్మ. రవనమ్మ కూడా బైట్నే ఎతికింది.

“ఈ ఏల మా చెన్నమ్మని సూసుకోను పిల్లోడు వొస్తాడు” అమ్మలక్కలికి చెప్పింది.

“పెళ్ళికొడుకు ఏం జేస్తాడు?” ఆరాలు తీశారు

“అప్పర్మెంటులు కట్టే తాపీ మేస్త్రీ చేతి కింద ఉంటాడు. రేపు మాపు మేస్త్రీ అవుతాడు”గొప్ప ఉజ్జోగమే అన్నట్టుగా చెప్పింది రవనమ్మ.

“నీ చిన్నప్పుడు దొరబాబుని తెస్తాననేది మీ అమ్మ. అన్నట్టుగానే పెద్ద మేస్త్రీనీ పట్టుకొస్తంది”అమ్మలక్కలు పరాచికాలాడారు.

“తాపీ పనా” చెన్నమ్మ నీరుగారి పొయ్యింది. ఈయాల్టి దాకా అమ్మ తనకోసం కనీసం ఆపీసులో బంట్రోతునైనా తెస్తాది అనుకునింది.

“ఓమే, నిన్ను పెల్లిజేసుకోను ఈ పాలెం లోకి ఎవురు వస్తారనుకున్నావు? సినిమా యాటర్ని కట్టుకుందావకున్నా ఏందీ!”మేనత్త నవ్వతా అనింది
“పిల్లోడి పేరు మట్టుకూ దొరబాబే” అమ్మ కుశాలుగానే వుండాది.

అమ్మ చేసింది శానా పెద్ద మోసం అనుకునింది చెన్నమ్మ. లోపల్లోపల రోసపడింది. ఇన్నేళ్ళూ దొరబాబుని తెస్తానని ఇప్పుడు ఏవీ ఎరగనట్టు దొరబాబనే పేరుగల్లోడిని తెచ్చింది. పిల్లని చూడను పెళ్లోల్లు వచ్చినపుడు మూతి ముడుసుకునే వుండాది.

“పిల్ల గుణం గలదే. తలగూడా ఎత్తడంలేదు”పెళ్ళికొడుకు తరుపున వాళ్ళు అనుకుండారు. ఐదు చిన్నాల చెవిదిద్దులు, కాలి పట్టీలతో చెన్నమ్మ పెళ్లి అయిపొయ్యింది.

చెన్నమ్మ మొగుడు ఉత్త సోమరిపోతోడు. సుకంగా పొద్దస్తమానం మంచాన కాల్లుజాపి పొడుకుని వుంటమే ఆడికి గొప్ప పాటు. పెళ్ళప్పుడు చెప్పినట్టు పెద్ద మేస్త్రీ కాడ పనిచెయ్యడు. ఆడసలు ఏడా పనే చెయ్యడు.

“ఒకడి కింద నేనేఁది పని చేసేది? నే దొరబాబుని. పని కూలోళ్లు చెయ్యాల”ఎప్పుడు పనికి పొమ్మన్నా ఇదే మాట చెబుతాడు. చెన్నమ్మ ఆశ పడ్డాది, ఎట్టాగో పోరకాడి ఆడిని దారికి తెచ్చి పనిమంతుడిని చెయ్యాలని. ఎన్నో రకాలుగా చెప్పింది. బండనాకొడుకు, ఏదో ఒకటి చమత్కారంగా వాగతాడు గానీ దారికోస్తేనా.

ఒక్కోసారి “నేను చిన్నా చితకా పనులు నేనెట్టా చేసేను” అంటాడు

“నీకు పెద్ద పెద్ద పనులు ఏం చాతౌను?” చెన్నమ్మఇసుగుబడేది

“ఏదో ఒకటి, రోజుకి ఎయ్యి రూపాయలు వొచ్చేది ఏదైనా చాస్తా”

“ఇప్పుడు ఎయ్యిరూపాయల పని ఎవుడిస్తాడు నీక. ముందు మూడు వందల పని చేస్తేగదా”

“ఎవుడూ ఇవ్వడం లేదనే గదా నేను పనికి పోకందా ఉండింది” ఇకిలిచ్చేవోడు

అమాసకీ పున్నమికీ పెద్ద మేస్త్రీ మడుసులు తగ్గినపుడు పనికి రమ్మని గోజారితే, నిక్కతా నీలగతా పోతాడు. తెచ్చిన పదిరూపాయాల్లో రూపాయి మట్టుకు మిగలస్తాడు. మిగింలిందంతా తాగేస్తాడు. కాయ కష్టానికి పనికిరాని మొగుడు కాపరానికి మాత్తరం తెగ ఎగబడతాడు. పాకలో అత్తా మావా, మరుదులూ తిరగతా ఉండంగనే ముగ్గురు పిల్లలిని కనింది చెన్నమ్మ. రెండు కానుపుల అయినాయి, ఇంకా చాలని నరుసు ఎంత చెప్పినా మొగుడు ఆపరేషన్ చెయ్యనివ్వలేదు. నా వొమశానికి నిండా పిల్లలు కావాలి అంటా పెళ్ళాం దుంప దెంచుతా ఉండేవాడు. వాడ ‘కాలనీ’ అయ్యిన తరవాత గుడిసె ఒంటిగది ఇల్లయింది. గుడిసెలో కన్నా సిమెంటు ఇంటిలో మరుగు బాగుంటది, నాలుగో మారు ఆడ పిల్లని కన్నాది. ఇంకా చానా మందిని కనేదే, ఆడు ఆల్లాళ్ళ పంచనా చేరి తేరగా దొరికిన నాటుసారా తాగి తాగి చావకుండా ఉండుంటే. తరవాత ఎన్ని అగసాట్లుబడి బిడ్డల్ని సాకిందో, దొరబాబు వొమశం తినీ తినకా ఎట్టా బతికిందో వూళ్ళో ఎవుర్ని అడిగినా చెబతారు.

చెన్నమ్మ ఇప్పుడు వొయసైపోయిన పండుటాకు. మజ్జానం ఏల దాకా బడి కాడ కూసుంటది. బళ్ళో మజ్జానం పూట పిల్లలికి అన్నం వండి పెట్టే పని సుబ్బరామయ్యది. దిక్కు లేని ముసిలాళ్ళకి అన్నంపెడితే, ఆళ్ళకి మాట తోడుగా వుంటే దేవుడు మెచ్చుతాడని పెద్దోళ్ళు చెప్పిన సుద్దుల్ని గెవనంలో పెట్టుకున్నోడు. పిల్లలికోసం అన్నం వొండేప్పుడు సొంతానికి తెచ్చుకున్న రేషన్ బియ్యం రోవంత వుడకేస్తాడు. ముసిల్దానికి ఓ ముద్ద పెడతాడు. తొర తొరగా తినేస్తాది. మళ్ళీ బొచ్చె ఎత్తక నిలబడతది.

సుబ్బరాయుడు కడుపు నిండేదాకా పెడతాడు. తిని గోడకి జారబడుద్ది. పిల్లల్నీ, పంతుళ్లనీ రూపాయి కోసం గోజారుద్ది. బళ్లోకి ప్రతిరోజూ వచ్చి అలా అడుక్కోకూడదని కొందరు కేకలేస్తారు.

“ఇది బడనుకున్నావా? గుడనుకున్నావా? రోజూ బిచాణా వేస్తావు. పో, పో”ఒక్కోసారి చీదరిస్తారు.

“పోతానయ్యా”అంటది కానీ ఏమ్మిట్నే పోదు. సేద తీరతది. తరవాత బయలు దేరుద్ది. చీకటి పడేదాకా చానా దూరం నడుస్తుదంటారు. బుజాన ఎదురు కర్ర చివర కట్టిన పచ్చ గుడ్డ మూట మాటి మాటికీ తడుముకుంటా ఏడేడికి పోద్దో ఎవ్వురూ పట్టిచ్చుకోరు.

“ఎవరీ పెద్దామె? రోజూ ఎక్కణ్ణించొస్తుంది? ఈ ఊరేనా?”కొత్తగా వచ్చిన పంతుళ్ళు సుబ్బరాయున్ని ఎంక్వయిరీ చేస్తంటారు.

“ఈ ఊరే. బిడ్డలందరూ ఎటో చెదిరిపోయ్యారు. ఒకడు నా తట్టోడు ఉండేవాడు. ఆడు ఎక్కువరోజులు కూలి పనుల మీద చెన్నైలో వుంటా ఆడ్నే అలవాటు పడి పొయ్యాడు. ఆడి కొడుకు ఈ ఊరినే వున్నాడు. కాలనీ కాడ ఇల్లు, పెళ్ళాం, పిల్లలూ. ఏదో ఆడి బతుకు ఆడు బతకతన్నాడు.
ఎప్పుడేనా ఎదురుబడి పలకరిస్తే, ముసిల్ది వూరెమ్మట తిరగతందని నామర్దా పడతంటాడు.”

“ఎప్పుడూ దొంగ చూపులు చూసినట్టు కనబడుతుంది. బళ్ళోకి ఇలాంటి వాళ్ళని రానీ కూడదు. పిల్లలుంటారు కదా” సారంటాడు.

“అరే, దొంగతనాలు చేసేది కాదు సార్. ఒంటి చెయ్యి ముసిల్ది. దొంగతనం చెయ్యాలనుకున్నా ఎట్టా చేసుద్ది సార్. అటువంటిదిగాదు. మంచిదే. ఆడాడ ఓ రూపాయి అడక్కొచ్చుకుంటది అంతే. పోనీండి”సుబ్బరామయ్య సంజాయిషీ యిచ్చినట్టుగా చెప్పాడు.

“ఈ ముసిల్ది కాలూ చెయ్యీ ఉన్నన్నాళ్ళూ బాగుండేది. మొగుడు ఏ కాలం నాడో పోయ్యాడు. ఈ ముసిలామేకి ఆటో యాక్సెంట్లో చెయ్యి పోయింది. ఇచ్చిత్తరం చెప్పమంటారా? యాక్సెంట్లో చెయ్యి తెగి పోయిన తరవాత ఎవడో ఇంటికాడ ఒదిలి పొయ్యాడు. ఆస్పటల్కి తీసక పోయినోడు లేదు, మందు బిళ్ళ మింగిచ్చినోడు లేడు. సచ్చి పోయిన్దనుకున్నారు. హాయిగా ఇంటికాడ సావనీ, మళ్ళా సూది మందుల యాతన ఎందుకులే అని అందరూ గమ్మునున్నారు. కానీ, బూమిన నూకలు చెల్లలేదు ముసలి పేనానికి మూడో రోజున లేచి కూచుని అన్నం పెట్టమనింది. ఎందుకు బతికిందో మరి. పరాచికానికి, సావగూదడే ముసిలిదానా, ఎందుకీ వొయసులో నీకీ బొందితో తగలాటం అన్నా మాటాడదు. ఆ జీవానికి ఇంకా ఏమి యాతన రాసుందో” ముసిలామె కత ఇంకా ఎదో ఇనిపిచ్చబోతా వుండంగానే గంట మోగింది.

ఆ పొద్దు మొదులు, సారు చెన్నమ్మని రోజూ చూస్తానే వుండేవోడు గానీ కసరడం మటుకూ మానేసాడు.

చలి కొద్దిగా దుప్పటి తీసి రోజు రోజుకీ సెగని పెంచుతున్న సూర్యుణ్ణి తొంగి చూస్తున్న కాలం. పదో తరగతి పరిక్షలు దగ్గిర బడ్డాయి. పిల్లలికి ఇళ్ళ కాడ కన్నా బళ్లోనే చదూకోను బాగుంటది. ఆళ్ళకి తోడుండి చదివించను సార్లుకి రోజుకొక్కరికి చొప్పున ఒంతులు. లెక్కల సారు తన వొంతుకి శని వారం సాయంకాలం పొద్దు పోయేదాకా బడికాడ ఉంటాడు.

ముందు జరిగిన పరీక్ష పేపర్లిస్తన్నాడు. ఒక పేపరుకాడ ఆగి పొయ్యాడు. బడి మొత్తానికీ సూడ సక్కంగుండే వోడు, ఎప్పుడూ తల నీటుగా దువ్వి, సక్కని గుడ్డలు తొడిగి, పోద్దుతాల మొహానికి గుమాలించే పొగడరు రాసి, అందరికన్నా సదువున ముందార నిలిసే పిల్లోడు, మొన్న రోవంత ఎనకబడి పోయ్యాడెందుకో. పైగా ఈ మజ్జ తలకట్టు సరింగా లేదు, గుడ్డలు మాసి వున్నాయి, మొగం జిడ్దోడతా వుంది. పిలిసినాడు, అడిగినాడు. ఆడేం చెప్పాలా.

“బాగా శ్రెద్ద పెడితే బాగుపడతావు” హెచ్చరించారు. పిల్లోడు మెదలకుండా తల ఊపాడు.

పొద్దు గుంకనొచ్చింది. పిల్లలు సంచులు సదిరేసారు. తరగతి తలుపు తాలాలేసేసారు. సారు పక్కూరి ఆడపిల్లల్ని ఆటో ఎక్కించాడు. ఊరిలో పిల్లలు గుంపులు గుంపులుగా బైలు దేరారు.

ఆ పిల్లోడు బడి కాడనే నిలిచిచూస్తన్నాడు. సారు, పిల్లలంతా ఎల్లిన కూసేపటి దాకా బడికాడనే గోడవారగా బైకు బెట్టి నిలబడతాడు. పర్లేదు, పిల్లలంతా ఇంగ ఇంటికి పోయ్యుంటారని అనిపిస్తే ఇంటికి పోతాడు. ఆ సాయంకాలం, సారు నిలబడి వుండంగానే అల్లంత దూరం నుండీ చెన్నమ్మ వస్తా కనబడింది. కర్రని ముందుకు తోసుకుంటా, కర్రసాయంతో కాయాన్ని జరుపుకుంటా చెన్నమ్మ వస్తా వుంది.

ఎట్టో తట్టు బడి ఆరుగుదాక వొచ్చింది. ఇంగ వల్ల కాదన్నట్టు కూల బడింది. వాడు కొంత దూరాన నిలబడి దబాయింపుగా చూస్తన్నాడు. ఆడ్ని సైగ చేసి పిలిసింది. దగ్గిరికెల్లాడు. కూచోమని చెయ్యి ఊపింది. కూచున్నాడు. ఇంతకూ మునుపెపుడూ ఆ పిల్లాడు ముసలవ్వ దగ్గర కూచుని వుండగా సారు చూళ్ళేదు. బడి మొత్తానికీ దాదాపుగా ఎవ్వురూ చూసుండరు! కాసేపు అలుపు తీర్చుకుంది. శెమట తుడుసుకునింది.

“ పరీక్ష జరిగే బడి శానా దూరం. పొద్దున్నే తొమ్మిది గంటలకల్లా ఎల్లాల కదా. మరి సయికిల్ ఇప్పిస్తానన్నావు ఏది?నువ్వు ఇప్పిచ్చే దాకా నేను ఇట్నే మురికితనంగనే ఉంటా. పుస్తకం కూడా పట్నంటే పట్టనంతే!”పిల్లోడు మహా అమలుగా బెదిరిస్తండాడు.

చెన్నమ్మ గబాల్న కర్రకి కట్టిన పచ్చ గుడ్డ సంచి ఆడి ముందర పెట్టింది. ఆడు ఆత్రంగా ఇప్పదీసాడు. సంచి నిండా కొన్ని నోట్లు, చిల్లర పైసలూనూ. వాడి కళ్ళు మెరిసాయి. డబ్బులు లెక్కేయ్యమని చెయ్యి ఊపింది. లేక్కేసాడు. మూట కట్టి లోకం కళ్ళని పడకుండా దాచిన ముష్టి రూపాయలు.
ముష్టివైతేనేం, మారకానికి ఇబ్బందేం లేదు!

“సయికిల్ కి సరిపోతాయా?” వొగరుస్తున్న ముసలి గొంతులో ఆరాటం.

“సరిపోతైలే” డబ్బులన్నీ పుస్తకాల సంచిలో తోసుకుంటా వాడు కుశాలుగా చెప్పిండు.

“దొరబాబూ, నా రాజా బాబూ నువ్వు బాగా సదవాల. కుర్సీలో కూసునే వుజ్జోగం చెయ్యాల. నువ్వు బాగా సదవాల. నా మీంద కోపగిచ్చుకుని ఎనకబడబాకు. నువ్వు దొరబాబువి , నా దొరబాబువి” అంత మట్టుకే మాట్టాడ గలిగింది. ఇంకా ఏందో చెప్పాలని వున్నా చెప్పను ముసలి ప్రాణానికి చాత కాలేదు. గాజు కళ్ళతో ఆశగా మునిమనవడు, దొరబాబుని మొత్తంగా తడిమింది.

అయ్యవోరి కళ్ళు తడిసి పొయ్యాయి! ఆడి తల నూనె, పొగడరూ, గుడ్డలూ ఏడినించి వొస్తన్నాయో, ఆడికి పరిచ్చలకి పోడానికి కొత్త సయికిల్ ఎలా రాబోతందో సారుకి తెలిసిపోయింది. పని చెయ్యను వోపిక సాలని ముదిమిలో పిల్లోన్ని దొరబాబుని చేసేదానికి ‘వొంటి చేత్తో’ అవ్వ పడతాన్న పాటుకి ఆయన గుండె చెరువై పొయ్యింది. ఆ తాపత్రియం ఇలువ తెలుసుకోకుండానే అనుబగిస్తన్న బుల్లి దొరబాబు కోసరం తెల్లారి చెప్పాలిసిన పాటం గురించి సారు రాత్రి పొద్దుపోయ్యేదాకా తయారవుతానే వుండాడు.

**** (*) ****



11 Responses to దొరబాబు

  1. వనజ తాతినేని
    June 1, 2016 at 6:58 am

    ఆశలు ఎవరికైనా ఉంటాయి. పాపం అవి తీరకపోయినా బ్రతికే ఉంటారు చెన్నమ్మకి లాగా. కళ్ళు చెమర్చాయి.
    ఇంటికొక దొరబాబులున్న రోజులు ఇవి. ఒంటిగా కాడిని మోస్తూ ఇంకా ఏమి యాతన పదాలని రాసి ఉందొ అనిమొండిగా బ్రతికి ఉండే చేన్నమ్మలు కళ్ళకి కనబడ్డారు కృష్ణ జ్యోతి గారూ .. కథ నచ్చింది. అభినందనలు.

    • jyothi
      June 1, 2016 at 4:12 pm

      థాంక్ యు మేడం

    • కృష్ణజ్యోతి
      June 1, 2016 at 5:16 pm

      థాంక్ యు మాడం

  2. venkat
    June 1, 2016 at 8:14 am

    మంచి కథ. సోమరి పోతులూ చెప్పే సాకు, ‘నేను ఒకడి కింద పనిచెయ్యను’!

  3. venkat
    June 1, 2016 at 4:25 pm

    కథ బాగుంది. సోమరి పోతులూ తరచుగా చెప్పేది, ‘ ఒకడి కింద నేనేఁది పని చేసేది?’

  4. కె.కె. రామయ్య
    June 1, 2016 at 11:26 pm

    వొయసై పోయిన పండుటాకు చెన్నమ్మ మనవడు పిల్లోన్ని దొరబాబుని చేసేదానికి ‘వొంటి చేత్తో’ పడతాన్న పాటుకి గుండె చెరువై పొయ్యింది. అభినందనలు కృష్ణ జ్యోతి గారూ ( నామిని అన్న ఇస్కూల్ బళ్లోనే సదివినట్లున్నావే తల్లా ).

    • కృష్ణజ్యోతి
      June 2, 2016 at 10:15 am

      థాంక్ యు రామయ్య గారూ

  5. చందు తులసి
    June 2, 2016 at 6:43 pm

    ముష్టెత్తుకునైనా తన దొరబాబు కోసం….చెన్నమ్మ కష్టం కదిలించింది.మనిషిని నడిపించేది, బతికించేది అనుబంధమే కదా. జ్యోతి గారూ కథ కదిలించింది.

  6. sree
    June 4, 2016 at 8:18 am

    పాత్రలు కళ్ళముందు సజీవంగా కదిలాయి

  7. ashok
    February 16, 2017 at 3:37 pm

    మనసుకు హత్తుకుంది

Leave a Reply to venkat Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)