వాళ్లేమన్నారంటే!

నేనూ – బోర్హెస్

జూన్ 2016

నేను అలా వీధుల్లోంచి నడుస్తూ, ఎంట్రన్స్ హాల్ ఆర్చివైపో, గేటుమీది ఇనపకమ్మీలనూ చూసేందుకో అలవాటుగా ఒక్క క్షణం ఆగినప్పుడు నాకు తటస్తపడే వ్యక్తి బోర్హెస్. నాకు ముందుగా ఇతను ఉత్తరాల ద్వారా తెలుసు, ఒక్కోసారి అతనిపేరు అధ్యాపకులు, ఆత్మ కథకుల జాబితాల్లో కనిపిస్తూ ఉంటుంది.

ఇక నా సంగతా ?నాకేమో ఇసుక గడియారాలు, మాపులు, పద్దెనిమిదో శతాబ్దపు టైపోగ్రఫీ, కాఫీ రుచి, స్టీవెన్సన్ వచనం, ఇటువంటివంటే చాలా ఇష్టం. వీటిల్లో కొన్ని అతనికి కూడా నచ్చుతాయేమో, కానీ వాటన్నిటినీ మహా గొప్పగా తన పాత్రల వర్ణనకోసం మాత్రమే వాడుకోవడం నన్ను కష్టపెడుతుంది. ఐనాసరే, మేము పరస్పరం విరుద్ధమైన వ్యక్తులమని అంటే అది అతిశయోక్తి అనే అంటాను. నేనేమో నిరంతరం జీవిస్తూ, జీవించడం మాత్రమే నాపనిగా పెట్టుకుని కాలం గడిపేస్తూ, బోర్హెస్ని మాత్రం తన సాహిత్యాన్ని సానపెట్టుకోడానికి వదిలేశాను. నేనున్నది అతన్నలా వదిలెయ్యడానికే అనుకుని సమాధానపడతాను.

బోర్హెస్ సాహిత్యానికి కొన్ని మంచి పుటలను చేర్చాడు, కాదనను. కానీ అవి నాకు ఒరగబెట్టేదేం లేదు. మిగతా అన్ని ఉత్తమమైన విషయాల్లానే, అతని రచనలుకూడా. అవి ఏ ఒక్కరికీ చెందవు. భాషకీ, సంప్రదాయానికీ తప్ప మరెవరికీ ఉపయోగపడవు- ఆఖరుకి అతనికి కూడా. ఇంతా చేసి నేనేమో క్రమంగా క్షీణించిపోతున్నాను. మహా ఐతే నాలోని ఒక అంశ మాత్రం తనలోపల మిగులిపోతుందేమో! ప్రతి విషయాన్ని అబద్ధాలుగా అతిశయోక్తులుగా మార్చే అతని పెడబుధ్ధి తెలిసి కూడా, నేను మెల్లమెల్లగా నా సొంతమైన అన్నిటినీ తనకే ఇచ్చేసుకుంటున్నాను.

స్పినోజా చెప్పినట్టు వస్తువులన్నీ తమతమ అస్తిత్వాల్ని అంటిపెట్టుకొనే ఉండాలనుకుంటాయి. రాయి రాయిగానే, పులి పులిగానే బతకాలనుకుంటాయి. అలాగే, నా ఉనికి ఒక వేళ నిజమైతే, నేను నాలో కాక బోర్హెస్ లోనే ఉన్నాను. కాని అతని పుస్తకాల్లోనూ, గిటార్ తీవ్రప్రకంపనలలోనూ, నాకన్నా ఇతరులే ఎక్కువగా కనిపిస్తారు. అందుకే, అప్పుడప్పుడూ తననుండి విముక్తి కోసం తపించేవాణ్ణి. నగర శివార్ల లో బయల్దేరి అనంతవిశ్వంలోని కాలాతీత శూన్యం వరకూ ఆటలాడేవాణ్ణి. ఆ ఆటలన్నీ ఇప్పుడు అతనివే కాబట్టి నేనిక వేరే ఊహల్లో కాలం గడపక తప్పదు . ఇక ఇంతే, నా జీవితం పైపైకి తేలిగ్గా ఎగిరిపోతుంది. నేను సాధించినవాటిని అన్నిటినీ కోల్పోతాను. అన్నీ మరపులోకి జారిపోడమో, బోర్హెస్ పరం కావడమో తప్పదిక.

ఇంతకీ మా ఇద్దర్లో ఈ పేజీని రాసిందెవరో నాకు తెలీదు.

మూలం: బోర్హెస్
తెలుగు: అపర్ణ తోట

**** (*) ****