కవిత్వం

నా రాం చిలక

జూన్ 2016

రాత్రంతా వాన కురుస్తున్నట్టే వుంది
ఇక్కడ చిక్కడిపోయాను నేను
ఆమె వచ్చిందేమో మా చెట్టు కిందికి
తీగె మీద పిచ్చుక తెగ అరుస్తోంది
అది అక్కడి నుంచే వచ్చుంటుంది
దాని రెక్కలు పొడి పొడిగా వున్నై
రాత్రి వాన కురిసింది బయట కాదేమో
నా ఆరాటమే గాని ఆమె రాలేదేమో
వచ్చి నుంచోడానికి ఆ చెట్టు లేదేమో
రాత్రని ఏమిటి, పగలని ఏమిటి
వాన నిరతం కురుస్తూనే వుంటుంది
తాగుబోతు నేల దాహం తీర్చలేక
హృదయ మేఘం నెత్తురు కక్కుకుని
రాంచిలకై నా బుజం మీద వాల్తుంది
గుచ్చుకునే దాని గోళ్ళను నిముర్తూ
తిరుగుతుంటాను దాని రెక్కలు విప్పి
నా లోంచి కురిసే వాన చినుకులతో
లోకాలను తడిపేస్తుంటాను ఎక్కడైనా
ఆ చెట్టు విత్తనం పడి వుండకపోదని
దానికి దప్పిక వేస్తుంటుందేమోనని …