హోకా హే

“యో నో వీనె అ మతార్. యో వీనె అ మొరిర్“ – “నేను చంపడానికి రాలేదు. చచ్చిపోవడానికి వచ్చాను.”

జూన్ 2016

పోర్టరికొ! స్పానిష్ ఆక్రమణదారులు మంత్రాలదీవి అని ప్రేమగా పిలుచుకున్న ద్వీపం. ప్రస్తుతం అమెరికా సంయుక్త రాష్ట్రాల ఆధిపత్యంలో ఒక కామన్ వెల్త్. అమెరికన్ ప్రజలకు అత్యంత ఇష్టమైన ట్రావెల్ డెస్టినేషన్. అందమైన ఈ ద్వీపం కంటే మనోహరమైన మనసున్న వాళ్లు ద్వీప వాసులు.

ఈ చిన్న ద్వీపంలో తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశాలెన్నో ఉన్నాయి. ఒక సందర్శన స్థలం నుంచి ఇంకో స్థలానికి వెళ్తున్న హడావిడిలో రోడ్డు పక్కన మామిడిపళ్లు అమ్ముతున్న యువకుడ్ని పలకరించి చూడు. నీకు ముందు సమాధానమిస్తుంది అతని చిరునవ్వు. అతనితో మాటలెలా కలపాలో తికమకగా వుందా? అతని ఇంగ్లీషు, నీ స్పానిష్ మామిడి పండు అమ్మడం/కొనడం వరకే పరిమితమవుతున్నాయా? అయితే, “లొలీత లెబ్రోన్” అనేసి అతన్ని గమనించు. అతనే కాదు, ఈ ద్వీపవాసి ఎవరి దగ్గరైనా ఆ పేరెత్తు. అతని/ఆమె కళ్లల్లో మెరుపు నిన్ను సూటిగా తాకుతుంది. తన ఆలోచనలని కూడగట్టుకోవడానికి వాళ్లకు అరనిమిషం పట్టదు. లొలీత లెబ్రోన్ గురించి చెప్పడం ఎక్కడనుంచి మొదలుపెడతారు? “సరే అయితే, నేనోక్కదాన్నే వెళతాను”, “!వివా పోర్ట రికొ లిబ్రె!”(స్వతంత్ర పోర్ట రికో వర్ధిల్లాలి) ఆమె అన్న ప్రసిద్ధ వాక్యాల నుంచి మొదలుపెడతారేమో. వాళ్లే నేనైతే ఈ ఇక్తోమి గురించి చెప్పడం “యో నొ వీనె అ మతార్. “ నుంచి మొదలు పెడతాను.

“యో నో వినె మతార్. యో వినే అ మొరిర్” (నేను చంపడానికి రాలేదు. చచ్చిపోవడానికి వచ్చాను) – మార్చి 1, 1954. తనను అరెస్టు చెయ్యడానికి వచ్చిన అమెరికన్ పోలీసులకు ధిక్కారంగా ముప్పై నాలుగేళ్ల లొలీత లెబ్రోన్ అన్న మాటలు.

ఎందుకు మృత్యువును లెక్కచెయ్యని ఆ ధిక్కారం, అంత తెగింపు?

తైనో అనే నేటివ్ అమెరికన్ తెగ ప్రజలు ఈ ద్వీపానికి మూలవాసులు. 1493 లో కొలంబస్ ఈ ద్వీపం ఇక స్పెయిన్ రాజ్యానికి చెందినదని ప్రకటించాడు. స్పానియార్డుల పాలనలో తైనో తెగ పూర్తిగా నశించిందనే అనుకున్నారు ఆక్రమణదారులు. కానీ వాళ్ళు కొండల్లో, అడవుల్లో దాక్కుని కొంతమందైనా మిగిలారు. 1898 లో స్పానిష్-అమెరికన్ యుద్ధంలో ద్వీపాన్ని అమెరికా సంయుక్త రాష్ట్రాల పరం చేసింది స్పెయిన్. 1917 లో కొన్ని రాజ్యంగ హక్కులను పోర్ట రికొ ప్రజలకు ఇచ్చింది అమెరికా ప్రభుత్వం. కానీ ఆ హక్కులకు ఎన్నో షరతులు విధించారు. ఉదాహరణకు తమకూ పాలకుడైన అమెరికా అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని ఎన్నుకునే ఓటు హక్కు వీరికి లేదు. కానీ ప్రపంచం నలుమూలల్లో అమెరికా నెరిపే యుద్ధాల్లో సైనికులౌతారు. 1947 లో వారి గవర్నర్ ను ఎన్నుకునే హక్కు ఇచ్చింది అమెరికా ప్రభుత్వం. ద్వీప ప్రజలు కామన్ వెల్త్ ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులే కాకుండా అమెరికా ప్రభుత్వానికి కూడా పన్నులు కట్టాల్సివుంది. అమెరికా పౌరులైనా తీవ్ర జాతి వివక్షకు లోనవుతుంటారు.

1868లో పోర్ట రికొ ప్రజలు స్పానిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన లరేస్ అనే టౌన్ లో 1919 లో పుట్టింది లొలీత. ఆమె పుట్టినప్పటి పేరు, డోలరెస్ లొలీత సొటొమయోర్. రఫయేల సొటొ లుసియానో, గొంసాలో లెబ్రోన్ బెర్నాల్ ఆమె తల్లిదండ్రులు. లేత వయసులోనే లిబరల్ పార్టీలో సభ్యత్వం ఉన్నా మొదట్లో రాజకీయాల్లో ఎక్కువగా పాల్గొనలేదు లొలీత. తనకు పజ్జెనిమిదేళ్లప్పుడు జరిగిన పోన్సె-సామూహిక హత్య ఆమెలో తీవ్ర మార్పు తెచ్చింది. మార్చి 21, 1937 లో పోర్ట రికన్ నేషనలిస్ట్ పార్టీ నేత టొమాస్ లోపెస్ దె విక్టోరియా (Tomas Lopez De Victoria) నాయకత్వంలో శాంతియుత పాదయాత్రపై పోలీసులు కాల్పులు జరిపారు. అక్కడికక్కడే ఎంతో మంది చనిపోయారు. ఇంతకీ ఆ పాదయాత్రకు పోన్సె నగర మేయర్ నుంచి నిర్వాహకులు అనుమతి తెచ్చుకున్నారు. చివరి నిమిషంలో ఆ అనుమతిని రద్దు చేశాడు పోర్ట రికో గవర్నర్ విన్షిప్. పాదయాత్ర ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే పోలీసు కాల్పులు మొదలయ్యాయి. కాల్పులు తప్పించుకున్న కొంతమందిని వాళ్ల ఇళ్ల దాక తరిమి మరీ చంపారు. గాయపడిన వాళ్లను కూడా కాల్చి చంపారు. బోలివార్ మార్కెజ్ అనే యువకుడు ఒక గోడ దగ్గరికి పాకుతూ వెళ్లి గోడ మీద తన రక్తంతో రాశాడు:

“!వివా ల రిపబ్లికా, అబాహో లాస్ అసెసినోస్!” (రిపబ్లిక్ వర్థిల్లాలి. హంతకులు నశించాలి)

నేషనలిస్ట్ పార్టీ సభ్యులు కొంతమంది మొదట కాల్పులు జరిపారని గవర్నర్ అమెరికా ప్రభుత్వానికి చెప్పాడు. ఈ తప్పుడు సమాచారాన్ని న్యూ యార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ మొదలగు పత్రికలు ‘నేషనలిస్ట్ పొలిటికల్ రివోల్ట్ పజ్జెనిమిది మంది చావుకు కారణమయింద’ని ప్రచురించాయి. కానీ సంఘటన ఇన్వెస్టిగేషన్లో నేషనలిస్ట్ పార్టీ తప్పేమీ లేదని, పోలీసులు నిరాయుధులైన నేషనలిస్టులమీద కాల్పులు జరిపారని తేలింది. చివరికి గవర్నర్ కు గానీ, కాల్పుల్లో పాల్గొన్నారని నిరూపించబడ్డ పోలీసులకు గానీ ఎలాంటి శిక్ష పడలేదు. అమెరికా ప్రభుత్వం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఈ సంఘటన లొలీత మీద తీవ్ర ప్రభావం చూపింది. ఆ సమయంలోనే ఒక ఇంజనీరును పెళ్లి చేసుకుంది. ఒక పాపకు తల్లి అయ్యింది. త్వరలోనే అతనితో సంబంధం వీగిపోయి పాపను తల్లి దగ్గర వదిలి న్యూ యార్క్ నగరానికి వెళ్లింది. అక్కడ ఆమెకు ఎప్పటికో గానీ ఉద్యోగం దొరకలేదు. తను స్పానిష్ మాత్రమే మాట్లాడడం ముఖ్య కారణం. దుస్తులు కుట్టే కొన్ని ఫ్యాక్టరీల్లో చేరింది. ఫ్యాక్టరీల్లో పనివాళ్ళ దుర్భర పరిస్థితుల మీద, వర్ణ వివక్ష మీద పోట్లాడేది. వెంట వెంటనే ఉద్యోగం పోగొట్టుకునేది. ఇరవై రెండో ఏట రెండో సారి పెళ్లి చేసుకుని ఒక బాబుకు తల్లయింది. బాబును కూడా తన తల్లి దగ్గరికే పంపించింది. రెండవ భర్త అదుపాజ్ఞలు భరించలేక త్వరలోనే విడాకులు ఇచ్చింది. 1943 లో చాలామంది పోర్ట రికన్లు అమెరికాకు వలస వచ్చారు. వారిని వర్ణ వివక్షకు గురి చేస్తూ, వారిని పేదవారిగానే ఉండిపోయేట్టు చేసే అమెరికన్ వ్యవస్థమీద ఆమెకు తీవ్ర నిరసన ఏర్పడింది. 1946 లో పోర్ట రికన్ నేషనలిస్ట్ పార్టీలో చేరింది. తనకున్న సోషలిస్ట్, ఫెమినిస్ట్ భావాలను పార్టీలో ప్రవేశపెట్టింది. ఆమె కార్యదక్షతను గమనించిన పార్టీ త్వరలోనే పార్టీలో బాధ్యతాయుతమైన స్థానాలలో ఆమెను నియమించింది.

జూన్ 10, 1948 లో పోర్ట రికొ ప్రజల హక్కులను ఇంకా ఎక్కువగా అణిచివేస్తూ పోర్ట రికన్ సెనేట్ లో ఒక బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం, పోర్ట రికన్ జెండాను ప్రదర్శించకూడదు, దేశభక్తి పాటలు పాడకూడదు, స్వాతంత్ర్యం గురించి మాట్లాడకూడదు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఎన్నో తిరుగుబాట్లు జరిగాయి. అమెరికా అధ్యక్షుడైన హ్యారీ ట్రూమన్ మీద హత్యాయత్నం కూడా జరిగింది. అమెరికా నుంచి స్వాత్రంత్ర్యానికి జరిగిన తిరుగుబాట్లను పట్టించుకోకుండా జులై 25, 1952 పోర్ట రికో పేరును కామన్ వెల్త్ ఆఫ్ పోర్ట రికొ అని అధికారికంగా మార్చింది అమెరికా ప్రభుత్వం.

పోర్ట రికొ ప్రజల దుర్భర పరిస్థితులను ప్రపంచానికి తెలిసేలా చేయడం కోసం అమెరికా ప్రభుత్వానికి ముఖ్యమైన కొన్ని ప్రదేశాలపై దాడి చెయ్యాలని నేషనలిస్ట్ పార్టీ నిర్ణయించింది. వాషింగ్టన్ డి. సి. లోని హౌస్ ఆఫ్ రెప్రెజెంటిటివ్స్ (House of Representatives) మీద తన వాళ్లతో కలిసి దాడి చేయాలని నిర్ణయించుకుంది లొలీత.

మార్చి 1, 1954 ఉదయాన రఫయెల్ మిరండా, ఇర్వింగ్ ఫ్లోరెస్, అంద్రేస్ ఫిగ్వెరోవా అనే ముగ్గురు యువకులతో కలిసి క్యాపిటల్ బిల్డింగ్ కు చేరుకుంది. వర్షం కారణంగా దాడిని వాయిదా వేయాలన్న రఫఎల్ ప్రతిపాదన విని తటపటాయిస్తున్న మిగతా ఇద్దరితో , “సరే అయితే నేను ఒక్కదానే వెళ్తాను” అని ముందుకు ఉరికింది పోర్ట రికొ జెండాను చుట్టుకున్న లొలీత. ఆమెను అనుసరించక తప్పలేదు మిగతావాళ్లకు. హౌస్ చేంబర్ కు పైనున్న విజిటర్ గ్యాలెరీకి చేరుకున్న తరువాత మిక్సికో ఎకానమీ గురించిన తర్జనబర్జనలు జరుగుతున్న సమయంలో తన కామ్రెడ్లకు సంకేతమిచ్చి లేచి నిలబడి, పోర్ట రికో జండాను ఊపి “!వివా పోర్ట రికొ లీబ్రే!”(స్వతంత్ర్య పోర్ట రికొ వర్థిల్లాలి) అని అరిచింది. తన ఆటోమాటిక్ పిస్టల్ తో హౌస్ సీలింగ్ కు గురిపెట్టి కాల్చింది. ఇద్దరు కిందకే గురిపెట్టి లామేకర్స్ వైపు తుపాకులు కాల్చారు. ఒకరి తుపాకి జ్యామ్ అయి పేలలేదు. లొలీత సీలింగ్ కేసి కాల్చిన బుల్లెట్లు వెనక్కి తిరిగి వచ్చి కొంతమందిని గాయపరిచాయి. మొత్తం కాల్పుల్లో ఐదుగురు లామేకర్స్ తీవ్రంగా గాయపడ్డారు. అరెస్టు తరువాత అరిచింది లొలీత, “నేను చంపడానికి రాలేదు. చచ్చిపోవడానికి వచ్చాను.”

ఆ కాల్పుల్లో ఎవరూ చనిపోలేదు. హత్య చెయ్యాలనే ఉద్దేశంతోనే కాల్పులు జరిపారని ఆ నలుగురిపై అభియోగం మోపబడింది. “పోర్ట రికొ స్వాత్రంత్ర్యం కోసం చనిపోవడానికి వచ్చామని” కోర్టులో చెప్పింది లొలీత. జూన్ 16, 1954 న ఆ నలుగురికి డెభ్బై ఏళ్ల కారాగార శిక్ష విధించారు. జులై 8, 1954 న తనకొడుకు నీళ్ళల్లో మునిగి చనిపోయాడని లొలీత కు తెలిసింది. ఇంకో రెండేళ్లకు ఆమె తల్లి కూడా మరణించింది. జైలులో ఉన్న మొదటి ఆ రెండేళ్లు చాలా కష్టంగా గడిపింది లొలీత. ఆమె జైలులో ఉన్నప్పుడు స్పానిష్ లో రాసిన ఉత్తరాలను జైలు అధికారులు అడ్డుకుంటున్నందుకు ఇంగ్లీషులో రాసిన తన అక్క ఉత్తరాలను తీసుకోవడానికి నిరాకరించింది. వాళ్లకు ఉత్తరాలు తప్ప బయటి ప్రపంచంతో ఎట్లాంటి సంబంధం ఉండేది కాదు. కొంతమంది మూడున్నర రోజులు నిరాహారదీక్ష చేసి ఆ డిమాండ్ ను సాధించుకున్నారు. ఆ దీక్షలో పాల్గొన్నందుకు కొన్ని రోజులు లొలీతను తన సెల్ బయట పని చెయ్యకుండా కట్టడి చేశారు జైలు అధికారులు. ఆమె జైలులో ఉన్న కాలంలో పబ్లిక్ గా క్షమాపణ చెప్తే ఆమెను విడుదల చేస్తామని కొంతమంది జడ్జీలు ప్రతిపాదించారు. ఆమె ఒప్పుకోలేదు.

పదిహేనేళ్ల తరువాత పెరోల్ కోసం అర్జీ పెట్టుకునేందుకు అవకాశం వస్తే నిరాకరించింది. ఎందుకు నిరాకరిస్తున్నదో జైలు కమిటీతో మాట్లాడాల్సి వచ్చింది. పెరోల్ ప్రపోజల్ లో ఉన్న కొన్ని విషయాల పట్ల తనకున్న ఆక్షేపణలతో పాటు, తీవ్రవాదం గురించి, అమెరికన్ పాలిటిక్స్ గురించి, ఆటం బాంబు గురించి తన అభిప్రాయాలను రాతపూర్వకంగా కమిటీకి తెలియపరిచింది. పెరోల్ నిరాకరించడం వెనకనున్న ఆమె ఉద్దేశాన్ని తప్పు పట్టారు జైలులో ఉన్న ఆమె సహచరులు. ఆమె వాళ్లకు కూడా దూరమయ్యి కవిత్వాన్ని ఆశ్రయించింది. ఇదిగో జైలులో ఆమె రాసిన ఒక కవిత :

ఒంటరిగా

నా జైలు గది ఏకాంతంలో
నిశ్శబ్దంగా ఉన్నాను, నిలువవున్న నీటిలా

ప్రశాంతంగా నడుస్తాను సముద్రం వైపు
నా మౌనం …
ఒంటరిగా. వాన శబ్దం మాత్రమే
నా దుఃఖంలో ఓదార్పవుతుంది.
“ఈ వర్షం నీ స్వరం.”
ఈ గోడలపై
తారాడే నీడలు, కాంతి రేఖలు
ప్రసాదించే ఐశ్వర్యాలు
నీ కౌగిలింతల, ముద్దల జ్ఞాపకాలు

నా గాయపడిన, బందీలైన పక్షులు వాళ్లు
డొల్ల శరీరాలు, భీకరమైన పిడికిళ్ల మధ్య
కాయలు కాసిన వాళ్లు
చెవులు చిల్లులు పడే నిశ్శబ్దపు చెరలో
నోళ్లు కట్టేయబడినవాళ్లు.

లేబర్ డే రోజున వాళ్ళ అరుపులు వింటాను
ఏం సందడి!
వాళ్ల నవ్వుల మధ్య
మేఘాలు చెదిరిపోతాయి, ఒక నలిగిపోయిన కల పెళ్లుబుకుతుంది
అలసిన సూర్యుడు నడి నెత్తికి చేరుకుంటాడు

చాళ్లుగ దున్నిన మట్టి లాంటి మాటల్లో
కల్తీ సారా మత్తులో
తమను తాము లాక్కుంటూ సాగిపోతారు
ప్రపంచ నదిలో ప్రవహించే
రక్తమూ, రక్తనాళాలూ వాళ్లే

ప్రపంచంలో శక్తిమంతులు చేసిన గాయం వాళ్లు
అయినా ఆ తుపాకుల మాసిన నీడలు
ఈ గోడలపై ఎప్పుడూ కనిపించవు

“పవిత్రుల్ని” కోటీశ్వరుల్ని చేసే
మాదకద్రవ్యాల బానిసలు వాళ్లు
యాంకీ వలసవాదులు మన నుంచి దొంగిలించిన
బంగారంలా, రాగిలా మెరిసే
విధి వెంటాడే అస్తిపంజరాలు వాళ్లు

ఆమె జైలు లో ఉన్నప్పుడే, 1977 లో ఆమె కూతురు కూడా చనిపోయింది. ఇరవై ఐదేళ్ళు జైలులో గడిపిన తరువాత, ఆమెకు, ఆమెతో దాడిలో లో పాల్గొన్న సహచరులకు క్షమ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్.

1997 లో పోర్ట రికొ భవిష్యత్తు గురించి జరిగిన సంప్రదింపులలో మాట్లాడుతున్నప్పుడు ఆమెకు కేటాయించిన సమయం అయిపోయిందని కాంగ్రెస్ సభ్యులు ఒకరు ఆమె మాటలకు అడ్డురావడం మొదలుపెట్టినప్పుడు, లొలీత, “నా దేశంలో, నా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న నన్ను మాట్లాడకుండ చేయలేవు” అని అతన్ని గదిమింది.

ఇన్నేళ్ళ తరువాత పోర్ట రికొ పరిస్థితిలో మార్పులు లేవు. అమెరికా మొత్తంలో పోర్ట రికొ ప్రజలే ఎక్కువ పన్నులు కడతారు. కామన్ వెల్త్ ప్రభుత్వం అమెరికా దగ్గర తీసుకున్న అప్పు తీర్చలేక దివాళా దిశగా ప్రయాణిస్తోంది పోర్ట రికొ. అంటే ఉన్న కొన్ని హక్కులు కూడా ద్వీప ప్రజలకు లేకుండా పోతాయి. దివాళా ప్రకటించనివ్వాలా వద్దా అన్నది కూడా అమెరికన్ లామేకర్స్ చేతుల్లోనే ఉంది.

పోర్ట రికొలో ఎన్నో తిరుగుబాట్లు, ఉద్యమాలు నడిచాయి. పోర్ట రికొను అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో యాభై ఒకటవ రాష్ట్రంగా కలుపుకోవాలన్న కొంతమంది చేస్తున్న డిమాండ్ గురించి, “కొంతమందికి స్వాతంత్ర్యం అంటే భయం” అని వేదనతో వాఖ్యానించింది లొలీత. కొంతమంది ద్వీప ప్రజలు పూర్తి స్వాతంత్ర్యం కోరుకోరు. తిరుగుబాట్ల మీద వ్యతిరేక అభిప్రాయం కలిగివుంటారు కూడా. రాజకీయ అభిప్రాయాలు ఎట్లా ఉన్నా ద్వీప ప్రజలందరూ లొలీత లెబ్రోన్ ను నేషనల్ హీరోగా పరిగణిస్తారు. మొక్కవోని ధైర్యంతో, పోర్ట రికో స్వాతంత్ర్యం కోసం తన సర్వస్వాన్ని అర్పించి, స్వాతంత్ర్యం కోసం పరితపించి ఆ కోరిక తీరకుండానే తొంభై ఏళ్ల వయసులో, ఆగస్ట్ 1, 2010 లో మరణించింది.

ఇంతకీ లొలీతను ఇక్తోమీగా పరిగణించవచ్చా అని సందేహంగా ఉండింది. ఇక్తోమీ అంటే నేటివ్ అమెరికన్ తెగకు చెందిన వీరుడు అని ఈ సిరీస్ మొదటి భాగంలో చెప్పాను. అమెరికా తెగల్లోని వీరులైన కవుల గురించే ఈ సిరీస్ లో రాయాలని అనుకున్నాను. ఈ సందేహాన్ని ఒక పోర్ట రికన్ విప్లవకవి మిత్రుడిని అడిగితే, “పోర్ట రికో ప్రజలందరిలో ఎంతో కొంత నేటివ్ అమెరికన్ రక్తం ఉంటుంది. ఆంగ్లోసాక్షన్ రక్తం ఎక్కువ ఉంటుందనుకుంటె పోర్ట రికోను ఇంకో రాష్ట్రంగా ఎప్పుడో కలిపేసుకునేది అమెరికా ప్రభుత్వం” అని అన్నాడు. అంతే కాదు, లొలీత అంత నికార్సయిన నేటివ్ అమెరికన్ పోర్ట రికోలో మరొకరు లేరని, లొలీత గురించి ఈ సిరీస్ లో తప్పకుండా రాయొచ్చని భరోసా ఇచ్చాడు.

**** (*) ****