వాకిలి అంతర్జాలమాసపత్రిక పాత సంచికలు తిరగేస్తుంటే; మే 2013 సంచికలో, సుజాత గారి వ్యాసం ‘రచయితలు సరైన భాష వాడకపోతే, అది భాష మీద కుట్రే’ అన్న వ్యాసం కనపడింది. విషయం ఆసక్తికరంగా అనిపించటంతో వెంటనే చదివాను. చదివిన తర్వాత అందులో ఉన్న విషయాలమీదనే కాకుండా, మన కథల్లో కనపడుతున్న తెలుగు భాష మీద ఇంకొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉందని అనిపించింది.
1. సుజాత గారి వ్యాసంలో వడ్డెర చండీదాస్ గారి నవల ‘అనుక్షణికం’ లో ఉన్న తెలుగు భాష గురించి ప్రస్తావన ఉంది. ఆయన రాసిన నవల ‘హిమజ్వాల’, రాసిన కథల్తో వెలువడ్డ కథల సంపుటి ‘చీకట్లోంచి చీకట్లోకి…” కూడా చదివితే, ‘అనుక్షణికం’లో ఆయన వాడిన తెలుగు భాష తులనాత్మకంగా ఎంత తక్కువ ఇబ్బంది పెడుతుందో తెలుస్తుంది. ఈ రెండు పుస్తకాలూ, ‘అనుక్షణికం’ కన్నా ముందువి. మామూలుగా తెలుగు కథల్లో, నవలల్లో వాడని పదాలు వాడటమే కాకుండా; విస్తృతంగా వాడకంలో ఉన్న కొన్ని ఇంగ్లీషు పదాలకు, ఆయన తన రచనల్లో తనదైన శైలిలో తెలుగు పదాలు వాడే ప్రయత్నం చేశారు. పంకా మీట, బూడిద బుడ్డి అలాంటివే.
2. చండీదాస్ గారు వాడిన భాష గురించి రాస్తూ, కాశీభట్ల వేణుగోపాల్ గారు తన కథల్లో వాడే భాష గురించి సుజాత గారు కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారు. వాటితో ఏకీభవిస్తూనే, అంతకుముందు కొందరు రచయితలు అంతకుముందు వాడినట్లుగా కనపడని కొన్ని పదాలను ఆయన వాడుతున్నారన్న నిజాన్ని సైతం మనం అంగీకరించాల్సి ఉంది. సుజాత గారి వ్యాసంలో ఉటంకించబడ్డ ఉన్న నికషం (ఒరగల్లు, ఒరయిక, గీటురాయి మీద గీచిన బంగారపు గీత) అలాంటి పదాల్లో ఒకటయితే, ఆయన మరో కథ ‘నిశ్శబ్ద స్వరం’ లో వాడిన ‘సుషిరాలు” అనే పదం మరొకటి. దీని అర్థం, వేణువుకి ఉండే రంధ్రాలు. అవి, వేణువు వాడే ప్రాంతాన్ని బట్టి ఆరు, ఎనిమిది, పదకొండు, వీటిలో ఎన్నయినా కావచ్చు.
3. ఏ సాహిత్యప్రక్రియలో వాడిన పదాలయినా, పదబంధాలయినా పాఠకుడు సులభంగా చదవగలగాలి. అది సౌకర్యంగా జరిగితేనే; తెలిసిన అర్థాన్ని, తెలుసుకున్న అర్థాన్ని వాక్యానికి అన్వయించుకుని అంతర్లీన భావాన్ని అవగాహన చేసుకోగలుగుతాడు. ఈ మధ్య నేను చదివిన ఒక తెలుగు కథలో 769 ఇంగ్లీషు పదాలు ఉన్నాయి. దీనికి తోడు ఒక ఇంగ్లీషు పదానికి మరో తెలుగు పదాన్ని ముడెయ్యటం. టేబిల్మీద అలాంటి ప్రయోగాల్లో ఒకటి. అదే పెద్ద ఇబ్బంది అనుకుంటున్న దశలో, నాలుగు ఇంగ్లీషు పదాలకి పీటముడి వేసి, సంథింగీజ్రాంగ్ అని కొందరు మాత్రమే పలికేలా రాయటం, మూలిగే నక్కమీద తాటిపండే కాగలదు.
4. ఏ రచన అయినా తనకు తెలీని ఒక విషయాన్ని తెలిసేలా చెప్పటానికి ప్రయత్నిస్తోందన్న నమ్మకం పాఠకుడికి కలిగించగలిగాలి. ఆ నమ్మకం వమ్మయేలా రచన ఉంది అన్న అనుమానం కలిగినపుడు, ఏ పఠితా దానిలోకి ఇష్టపూర్తిగా, పూర్తిగా ప్రవేశించడు. కాగా, అయిష్టంతో దాన్ని దూరంగా నెడతాడు. అప్పుడు కథ ప్రాథమికప్రయోజనం అయిన చదివించగలగటం దెబ్బతింటుంది. అది, తన కథ పాఠకుల్లోకి వెళ్లాలి అన్న ఉద్దేశం ఉన్న కథకులెవరూ ఆహ్వానించదగిన పరిణామం కాదు.
5. సుజాత గారి వ్యాసంలో కొడవటిగంటి కుటుంబరావు గారు వాడిన అయిష్టత అనే పదం గురించి ఒక అభ్యంతరం ఉంది. శబ్దార్థచంద్రికలో అయిష్టం అనే పదమే లేదు. ఇష్టానికి నకారం జోడించి, ఇష్టం లేకపోవటాన్ని వ్యక్తీకరించటానికి, సృష్టించబడ్డ పదం అది. ఇష్టంగా చెప్పాలనుకున్నదాన్ని అయిష్టం చెపుతున్నపుడు, అయిష్టతని సృష్టించటం మీద ఇష్టం ఎందుకో బోధపడదు.
6. వీటితో పాటు, వ్యాసంలో; రంగనాయకమ్మ గారు తన రచనలో వాడిన ‘గడియ’ అనే పదం గురించి కూడా వ్యాసకర్త అభిప్రాయం ఉంది. గడియ అంటే అర్థం, ఇరవై నాలుగు నిమిషాల (దీన్ని కొందరు నిముషం అని రాస్తారు, అది తప్పు. నిమిషం అని కానీ, నిముసం అని కానీ రాయాలి) కాలం అని చెపుతూ, ఆ అర్థం రచనలో సందర్భానికి ఎలా అన్వయిస్తుందని సుజాతగారు అనుమానం వ్యక్తపరిచారు. నా దగ్గర ఉన్న శబ్దార్థచంద్రిక (ప్రచురణ-1969-పేజీ 420) ప్రకారం, గడియకి ఉన్న అర్థాలు; ఇరువదినాలుగు నిమిషాల కాలము, అల్పకాలము, ముహూర్తము(పండ్రెండు క్షణాల కాలము). ఈ అర్థాల దృష్ట్యా రంగనాయకమ్మ గారు ఆ పదాన్ని వాడటం రచనాసందర్భానికి సరిపోతుందని నా అభిప్రాయం. కొందరు తరచుగా వాడే ఘడియ అనే పదం కానీ, విఘడియ అనే పదం శబ్దార్థచంద్రికలో లేదు. విగడియ అనే పదం మాత్రం ఉంది. దాని అర్థం, గడియలో అరవయ్యో భాగం. నేననుకోవటం, గడియారం అనే పదానికి గడియ అనే పదం మాతృక అని.
7. ఇది కాక, వ్యాసంలో అల్లం శేషగిరిరావు గారు తన కథలో వాడిన కర్ణాకర్ణిగా అనే పదం గురించి సైతం ప్రస్తావన ఉంది. దీని గురించి రాస్తూ సుజాత గారు, రచయిత ఆ పదం అర్థం ”అస్పష్టం’ అనుకొని వాడినట్లుగా ఉంది అన్నారు. ముందు పేరాలో నేను పేర్కొన్న శబ్దార్థచంద్రికలోనే (పేజీ 299) ‘కర్ణాకర్ణి’ అంటే ‘వినికివరుస’ అని చెప్పబడింది. అదే పేజీలో ‘వినికి’ అంటే ‘వినుట’ అని కూడా అర్థం ఉంది. అందువల్ల ‘కర్ణాకర్ణి’ అంటే ‘వినపడిన వరుస’ అని అర్థం చేసుకోగలిగితే, శేషగిరిరావు గారి ప్రయోగం కూడా అభ్యంతరకరం కాదు.
8. సుజాత గారి వ్యాసం నాలుగో పేరాలో ‘వాళ్ళకి’ అనే పదప్రయోగం ఉంది. నాకు తెలిసి తెలుగు పదాలు రాస్తున్నపుడు; ‘ళ’ కి ‘ళ’ ఒత్తు ఇవ్వగూడదు. ఆ అవసరం ఉన్నచోట ‘ల’ఒత్తు వాడాలి. అందువల్ల ‘వాళ్ళకి’ అని రాయకుండా, ‘వాళ్లకి’ అని మాత్రమే రాయాలి. 1277 పేజీలు ఉన్న శబ్దార్థచంద్రిక (1969 ప్రచురణ); 234, 256, 313, 331, 354, 363, 366, 380, 394, 395, 396, 397, 430, 453, 461, 468, 475, 541, 618, 670, 787, 788, 844, 869, 897, 1018, 1030, 1044, 1174, 1232, 1242, 1254 పేజీల్లో ఉన్న విభిన్న పదాల ద్వారా అదే విషయం మనకు స్పష్టంగా తెలియచెపుతుంది.
9. ఈ రకమైన పొరపాట్లు దొర్లడానికి కారణం ఒకటే. మన జ్ఞానంలోంచి కాకుండా, ఒక పదం మనకు మొదటిసారి పరిచయమయిన జ్ఞాపకంలోంచి, వాడటం. నా దృష్టిలో దీనికి మంచి ఉదాహరణ విభ్రమ అనే పదం.. ‘విభ్రమం’ అంటే ‘భ్రాంతి’ అనీ, ‘విభ్రమ’ అంటే ‘ముసలితనం’ అనీ అర్థం. దీన్ని ‘భ్రాంతి’ అనే అర్థంలో చాలా మంది ఉపయోగిస్తారు. అలా ఉపయోగించిన కథకులొకరికి, ఈమెయిల్ ద్వారా ఇదే విషయాన్ని తెలియపరిస్తే, నేను ‘భ్రాంతి’ అనే అర్థంలోనే ఆ పదం వాడాను అని జవాబు వచ్చింది. అర్థం బట్టి పదప్రయోగం ఉండాలి కాని, వాడిన విధం బట్టి పదం అర్థం మారుతుందా? కథ లేకపోయినా భాష ఉంటుంది. భాష లేకపోతే కథ ఉంటుందా? అన్నది అలాంటి కథకులు అవశ్యం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.
10. ఈ రోజు ఉదయం ఒక కథ చదివాను. అందులో ఒక పురుష పాత్ర; నేనూ, మా ఆవిడా ఇద్దరం అనాథలమే అని మరో పాత్రకి తెలియపరుస్తుంది. అనాథ అంటే నాథుడు లేనిది అనీ; అనాధ అంటే నాధుడు లేనిది, దిక్కు లేనిది అనీ అర్థం. కాబట్టి ఆ పురుషపాత్ర వాడాల్సిన పదం అనాధ. అంతే కాని అనాథ కాదు.
11. ఒక రచయిత తన కథలో స్త్రీ పాత్రకి వర్ధని అని పేరు పెట్టాడు. వర్ధనము అంటే పెరుగునది. వర్ధిల్లు అంటే వృద్ధి పొందునది. బహుశా, వీటిని దృష్టిలో పెట్టుకుని ఆయన ఆ పేరుని ఎన్నుకుని ఉంటాడు. కాని, వర్ధని అంటే చీపురుకట్ట, పాడె అని ఆయనకి తెలిసుండదు.
12. మా మాట తీరు స్వచ్ఛంగా ఉంటుంది, మిగిలినవాళ్లతో పోలిస్తే మా మాటలు స్పష్టంగా ఉంటాయి అన్న నమ్మకంతో కొందరు కొన్ని పదాల్లో మొదటి అక్షరాలని ఒత్తి పలుకుతుంటారు. అయితే వారు పలికిన విధంగా ఉండే పదాలు తెలుగు భాషలో ఉండవు. ఘడియ అలాంటి పదాల్లో ఒకటయితే, ఖర్మ రెండోది. తప్పుగా రాసిన పదానికి వేరే అర్థం ఏదీ లేకపోతే, పెద్దగా ముప్పు ఉండదు. ఉచ్చారణలో సామ్యత బట్టి, ముద్రారాక్షసమేమో అని సర్ది చెప్పుకొని, సరిగా అర్థం చేసుకోవచ్చు. సమస్యల్లా తప్పుగా రాసిన పదానికి వేరే అర్థం ఉంటేనే. శతాబ్దాలు అంటే కొన్ని వందల సంవత్సరాలు. శతాబ్ధాలు అంటే వంద సముద్రాలు. ఈ సున్నితమయిన తేడాలని మనసులో పెట్టుకుని పదప్రయోగం చేస్తే, అపార్థాలకి తావుండదు. అనర్థాలూ వాటిల్లవు.
అనుబంధం: తెలుగులో రాయబడుతున్న రచనల్లో తరచుగా తప్పుగా వాడబడుతున్న పదాల పట్టిక. బ్రాకెట్లలో ఇవ్వబడింది సరైన పదం.
అంతర్థానం(అంతర్ధానం), అగాథం(అగాధం), అథోలోకం(అధోలోకం), అర్ధం(అర్థం), అర్థంతరంగా, అర్థాంతరంగా, అర్ధాంతరంగా(అర్ధంతరంగా), ఆదిమధ్యంతాలు(ఆదిమధ్యాంతాలు), కధారచన (కథారచన), ఖచ్ఛితం(ఖచ్చితం, కచ్చితం), గ్రంధి(గ్రంథి), చామనఛాయ(చామనచాయ), నేపధ్యం(నేపథ్యం), పరిణితి(పరిణతి), ప్రధమంగా(ప్రథమంగా), ప్రార్ధన(ప్రార్థన), బేధం(భేదం), మధన(మథన), మన్మథుడు (మన్మధుడు), యధాతథం, యధాతధం, యథాతధం(యథాతథం), యదార్ధం(యథార్థం), రధం(రథం), వృధా(వృథా), వ్యథ(వ్యధ), నిముషం(నిమిషం, నిముసం), నిశీధి(నిశీథి), శతాబ్ధం(శతాబ్దం), శిధిలం(శిథిలం), సామర్ధ్యం(సామర్థ్యం), స్తబ్దత(స్తబ్ధత), స్పర్థ(స్పర్ధ), స్మశానం(శ్మశానం), స్వాంతన(సాంత్వన).
**** (*) ****
సుజాత గారి వ్యాసం: రచయితలు సరైన భాష వాడకపోతే, అది భాష మీద కుట్రే
Related Articles:
భాషాసవ్యతకు బాటలు వేద్దాం (ఎలనాగ)
చంద్రశేఖర రెడ్డి గారూ,
మంచి వ్యాసాన్ని అందించినందుకు అభినందనలు. ఒక పదం మొదటిసారిగా పరిచయమైన జ్ఞాపకం ఆధారంగా ఆ పదాన్ని అదే రూపంలో వాడటం జరుగుతుందని మీరు చెప్పిన సంగతి కొందరి విషయంలో వాస్తవమే కావచ్చు. కాని, ఆ తప్పు పదాన్ని మళ్లీమళ్లీ చూడటమే వారు దాన్ని తప్పుగా రాయటంలో ఎక్కువ ప్రధానమైన పాత్రను వహిస్తుందని నా అనుమానం. తప్పుగా రాసిన పదానికి వేరే అర్థం ఉన్నప్పుడే సమస్య వస్తుందని మరో మంచి మాటను చెప్పారు మీరు. మధ్యాహ్నంకు బదులు మధ్యాన్నం అని రాస్తే అది మధ్యలో ఉన్న, లేక మధ్యలో తినే అన్నం అవుతుంది! మధ్య, అన్నం – ఈ రెండూ తత్సమాలే (సంస్కృత సమ శబ్దాలే) మరి.
ఇక మన్మథుడు తప్పు అని, మన్మధుడు సరైన పదం అని తెలిపారు మీరు. మీరు చెప్పింది కరెక్టేనంటారా?
పోతే, అర్ధాంతరం తప్పు అని, అర్ధంతరం సరైన పదమని పేర్కొన్నారు. అర్ధ + అంతరం = అర్ధాంతరం (సవర్ణ దీర్ఘ సంధి) అవుతుంది కదా. లేక, అది విడదీయడానికి వీలు లేని ఒకే పదమంటారా? అంతరం అంటే మరుగు(చాటు) అని ఒక అర్థం వుంది. వాక్ + అంకురాలు = వాగంకురాలు, వాక్ + అనుశాసనుడు = వాగనుశాసనుడు, వాక్+ అర్థములు = వాగర్థములు, వాక్ + అధీశ్వరి = వాగధీశ్వరి అవుతుంది. ఇవి జశ్త్వ సంధులు. ఇక నిర్ + అలంకార = నిరలంకార, నిర్ + అపేక్ష= నిరపేక్ష అవుతుంది. కాని, వాక్ + ఆడంబరత = వాగాడంబరత. కాబట్టి, అర్ధంతరంను అర్ధ్ + అంతరం అని విడదీయాల్సి ఉంటుంది. కాని, అర్ధ్ హిందీలో వుంది తప్ప తెలుగులో లేదు. ఈ కారణం వలన అర్ధాంతరం సరైన పదమని అనుకుంటున్నాను. లేక, నేనే తప్పుగా చెప్తున్నానంటారా? దయ చేసి అన్యధా భావించకండి. రంధ్రాన్వేషణ నా ధ్యేయం కాదు. పాఠకులకు సరైన పదరూపాలు తెలియాలన్నదే నా ఉద్దేశం.
ఎలనాగ గారికి,
నా వ్యాసం మీకు మంచిగా అనిపించినందుకు సంతోషంగా ఉంది. మన్మథుడి విషయంలో మీ పరిశీలనతో ఏకీభవిస్తున్నాను. అర్ధంతరం విషయానికి వస్తే,
అది ఒకే పదం కాదు అని నిఘంటువులు చెపుతున్నాయి. అర్ధము అంటే సగము. అంతరం అంటే మరుగు (చాటు) అనే కాకుండా సమయం అని కూడా అర్థం ఉంది. ఈ రెండూ కలిపితే వచ్చే ‘సగం సమయంలో’ అనే అర్థం, ఉన్నట్లుండి అనే అర్థానికి సరిపోతోంది. ఈ పదాల మధ్య, సంధి ఇస్తున్న తుదిరూపాన్నిదృష్టిలో పెట్టుకుంటే, ఈ విషయంలో కూడా మీతో సమ్మతిస్తున్నాను.
మీ వ్యాఖ్యని రంధ్రాన్వేషణ అని నేననుకోను. ప్రయత్నం ఎవరిదయినా ఎటునుంచయినా , సరయిన పదం, ఉపయోగించేవారికి చేరాలి. నా ఉద్దేశం ఎప్పుడూ అదే.
టి. చంద్రశేఖర రెడ్డి
6 వ అంశంలో గడియ అంటే 12 క్షణాలు అని ఇచ్చారు. కానీ రెండు గడియలు ఒక ముహూర్తము కాబట్టి 48 నిముసములు పంచాంగపు కాలెండర్లలొ గమనిస్తే ఈ విషయం బోధపడుతుంది.
నాగూ గారికి,
వ్యాసం చదివి సంస్పందించినందుకు కృతజ్ఞతలు. గడియ అనే పదం విషయంలో నేను వ్యక్తపరచిన అభిప్రాయానికి శబ్దార్థ చంద్రికలో ఇచ్చిన అర్థాలు ఆధారం. పదస్వరూపాలకీ, వాటి అర్థాలకీ సంబంధిత నిఘంటువులు ప్రామాణికం. మరేవీ కావు.
టి. చంద్రశేఖర రెడ్డి
మూడు అంశాలమీద సందేహాలు –
7. అల్లం శేషగిరిరావుగారి వాడుక సందర్భం గూర్చి నాకు తెలియదు గాని, నా చిన్నప్పుడు “కర్ణాకర్ణిగా” అన్న మాటని వాడుకలో గుంటూరులో విన్నాను. దానికి అర్థం ఎవరో చెప్పుకుంటుండగా విన్నాను అని. అంటే కర్ణ+ అకర్ణి అని గదా. వినికివరుస అన్న పదాన్ని వినడం మాత్రం ఇదే మొదటిసారి.
11. “పర్వత వర్ధని” అన్నది ఒకప్పుడు స్త్రీలకు పెట్టిన పేరు. మా దగ్గరి చుట్టానిది అదే పేరు. ఆవిణ్ణి “వర్ధని” అని మా నాన్నగారే పిలిచేవారు. వర్ధనమ్మ గారు అని బయటివాళ్లు పిలిచేవాళ్లు. ఆవిడ 1969 కి కొన్ని దశాబ్దాల ముందరే పుట్టారు. ఆవిడ తండ్రి సంస్కృత పండితుడు. అందుకని “హరి” అన్న పదానికి కోతి అన్న అర్థం వున్నట్టే వర్ధని అన్న పదానికి మీరుదహరించిన అర్థానికి వేరే అర్థాలుకూడా సమ్మతమనే ననుకుంటా.
అలాగే, అంతరం అంటే తేడా అని కూడా అర్థముంది కదా! ఉదాహరణకి, “ఏమిటా మాటలు, పెద్దంతరం, చిన్నంతరం లేకుండా!” అని పిల్లలని పెద్దవాళ్ళచేత చివాట్లు తినడం మా తరంలో మామూలే.
శివకుమార శర్మ గారికి,
మీరు వెలిబుచ్చిన సందేహాల గురించి-
7. వినికివరుస అన్న పదం శబ్దార్థచంద్రికలోంచి తీసుకున్నదే. ఎవరో చెప్పుకుంటుండగా విన్నాను అన్నా, ఒకరి తర్వాత ఒకరు ఒకే మాట వినటం కనక అది కూడా వినికివరుస అన్న అర్థంలో ఇముడుతుంది.
11.వర్ధని గురించి-శబ్దార్థచంద్రిక ప్రకారం ఆ పదానికి ఉన్న అర్థాలన్నీ, నేను నా వ్యాసంలో ఇచ్చాను. ఏదీ వదలలేదు. అంతర్జాల నిఘంటువు ఆంధ్రభారతి లో చూసినా, ఆ పదానికి చీపురు కట్ట అనే అర్థం ఉంది. శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీషు డిక్షనరీలో కూడా (519 పేజీ) వర్ధని అంటే అర్థం-a broom అనే ఉంది. ఈ ఫలితాలన్నీ, వ్యాసంలో నేను పేర్కొన్న అర్థానికే మద్దతు పలుకుతున్నాయి.
చివరగా పెద్దంతరం, చిన్నంతరం అన్న ప్రయోగాలగురించి. అవి పదాలు అని నేను అనుకోను. అవి నా దృష్టిలో పదబంధాలు. వాటికి నిఘంటువుల్లో చోటు లేదు. మీరు అన్నట్లు ఆ రెండు పదబంధాలనీ ‘వయోభేదం పాటించే విషయంలో’ వాడతాం.
కృతజ్ఞతలు
టి. చంద్రశేఖర రెడ్డి