ప్రత్యేకం

కృష్ణశాస్త్రి సౌందర్య ప్రస్థానం (మొదటి భాగం)

జూలై 2016


తెలుగులో కావ్యరచన కేవలం అలంకారభూయిష్టంగా, పాండిత్య ప్రకర్షగా, మేధోమథనంగా కొనసాగుతుందనే ఆలోచన 19వ శతాబ్ధంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఆకాలంలో వెలుబడిన ఆధునిక కవిత్వధోరణుల్లో భావకవిత్వానిదొక ప్రత్యేకమైన శాఖ. తెలుగులో భావకవిత్వానికి పర్యాయపదాలుగా నిలిచే కవుల్లో కృష్ణశాస్త్రిగారు ముఖ్యులు. ఆయన కవిత్వం ప్రధానంగా స్వేచ్ఛాకాంక్ష, సౌందర్యారాధన, ప్రేమ భావన, వియోగవేదన అనే అంశాలని ప్రతిఫలిస్తుంది. దేశం బానిసత్వంలో మగ్గుతున్న కాలంలో మనిషిలోపలి భావదాస్యాన్ని ప్రశ్నించి, సౌందర్యరాహిత్యాన్ని నిరసించి, వ్యక్తి ప్రేమ యొక్క అనివార్యతను నొక్కిచెప్పి తనదైన సుస్పష్టమైన భావజాలన్ని విస్తరింపజేసిన కవి ఆయన.కృష్ణశాస్త్రి సాహిత్యాన్ని అవలోకిస్తూ డా. సీతారామయ్య గారు రచించిన సిద్ధాంత గ్రంధంలోని కొన్ని భాగాలను ఇక్కడ వ్యాసాలుగా ప్రచురిస్తున్నాం. -ఎడిటర్

కృష్ణపక్షం – ప్రవాసం – ఊర్వశి

ళ వెనక ఉండే శక్తి సౌందర్యం. అది మానవుల ఏర్పాటుకి లొంగనిది. కళాకారుడు ఎంత సౌందర్యాన్ని తాను స్వాధీనం చేసుకుంటున్నానుకుంటున్నాడో, అంతకన్నా గొప్పగా సౌందర్యం అతనిని వశం చేసుకుంటుంది.

కృష్ణశాస్త్రి జీవితంలో సౌందర్యం పట్ల ఆయన వేదనని పరిశీలిస్తే ఇది బోధపడుతుంది. ఆయన కావ్యాలు కృష్ణపక్షం – ప్రవాసం – ఊర్వశి భావకవితకి రూపకల్పనలు. ఒక్కొక్క అనుభవం మనస్సుని కదిలిస్తే ఒక్కొక్క పద్యంగా బయటకి వచ్చి పడ్డాయి. ‘నా జీవితంలో అతి తీవ్రమైన వేదన, ఆవేశమూ కలిగించే గొప్ప అనుభవాలు కొన్ని వచ్చాయి ‘. అని కృష్ణశాస్త్రిగారు స్వయంగా చెప్పుకున్నారు.

గురజాడ అప్పారావుగారి ‘ప్రేమ కలుగక బ్రతుకు చీకటి’ వంటి వాక్యాలూ, అబ్బూరి రామకృష్ణారావు, రాయప్రోలు సుబ్బారావు గార్లతో ప్రారంభమైన కాల్పనిక కవిత్వం ఆయనలో కొత్త ఆలోచనలు రేకెత్తించినాయి. ఒకే రకం అనుభవాలని ఆత్మపరమైన కావ్యాలలో చెప్పుకున్న కవులలో వేదుల, నాయని, బసవరాజు, నండూరి, కృష్ణశాస్త్రి ప్రసిద్ధులు. హృదయావేశమూ, భావన, భాష అన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకుని వీరి చేతుల్లో కావ్యరూపాలు ధరించినాయి. వీళ్ళ కావ్యాలలొ వేదన, కరుణ ఎక్కువగా చోటు చేసుకున్నాయి.

‘జీవించినందుకు రెండే ఫలితాలు. తీవ్రమైన ప్రేమతో జీవితం వెలగాలి; లేకపోతే విరహంతో కాలిపోవాలి. అంతే కాని ధనమూ, సుఖమూ, భోజనమూ- ఇవన్నీ కలిగి బ్రతకడం ఎందుకు ‘ అంటారు చలం. అటువంటి ఆదర్శ ప్రేమ కోసం ప్రపంచంతో సంఘర్షించి, సౌందర్య ధ్యానంతో, ఆత్మని సంస్కరించుకొని, దివ్య సౌందర్యాన్ని దర్శించిన కవి కృష్ణశాస్త్రి.

ఆంగ్ల సాహిత్యంలోనూ, సూఫీ, వంగ, వైష్ణవ సాహిత్యాలతోనూ పరిచయం ఏర్పడటంతో సరికొత్త పద్ధతిలో సౌందర్య తత్వాన్ని ఆవిష్కరించాలన్న తపన కృష్ణశాస్త్రిగారిలో కలిగింది. ఆయన కావ్యాలలో క్రమ వికాసం ఉంది. అనుభవ ఉదాత్తతలో శిల్పం ఒక దానికంటే మరొకదానిలో రాటుతేలింది.

ఫ్రెంచి కవి, పండితుడు పాల్ వేలరీ కవి లక్షణాల్ని వివరిస్తూ ఇలా అంటాడు. ‘A poet, in sum, is an individual in whom the agility, subtlety, ubiquity and fecundity of this all-powerful economy are found in the highest degree’

కృష్ణశాస్త్రిగారిలో పాల్ వేలరీ చెప్పిన లక్షణాలన్నీ ఉన్నాయి. పొదుపైన మాటలతో సూక్ష్మమైన విషయాన్ని సర్వవ్యాపక లక్షణంగా రమణీయమైన శైలిలో చెప్పటం ఆయన ప్రత్యేకత. భావోద్రేకం, నిరంతర సౌందర్య తృష్ణ ఈయన కావ్యాలలో దర్శనమిస్తాయి.

కృష్ణశాస్త్రి కృష్ణపక్షం – ప్రవాసం – ఊర్వశి కావ్యాలు 1925-29 కాలంలో ప్రచురించారు. ఇందులో ‘మా బాబయ్య, నాన్నగారు ‘ ఖండికలు ఏడు, మరియు గురజాడ అప్పారావుగారిపై రచించిన ‘మహాకవి’ ఖండిక మినహాయిస్తే మిగతా కావ్యంలో కృష్ణశాస్త్రి హృదయ వికాసం విశదమవుతుంది.

కవిలో సృజన అతి సున్నితంగా తీవ్రంగా ఒక సునిశిత నిర్మల వాతావరణంలొ పదునెక్కుతుంది. ‘కొత్తయుగం కవికి కొత్త యౌవనం, స్వేచ్చా జీవనమంటే అభిలాష, సమాజంతో సంఘర్షణా, బాధ, అన్వేషణా, కోరికలు, అవి ఫలించకపోవడమూ, కృష్ణపక్ష రాత్రి – ప్రియతముల మృత్యువూ, ప్రవాసమూ, కొత్త లోకపుటంచుల దర్శనము, గాంధిజీ, మానవమాత్రుని సాక్షాత్కారము’ ఈ సంఘటనలన్నీ ఆయనలోని కళాకారుణ్ణి స్పందింపజేశాయని కృష్ణశాస్త్రిగారే అవతారికలో చెప్పుకున్నారు.

సౌందర్య ప్రేమ, సృజనాత్మక కళ మానవ మనస్తత్వాన్ని వెల్లడి చేస్తూ జీవితం పట్ల కొత్త విలువలు ప్రతిపాదిస్తాయి. ‘ఈ ప్రపంచ దుఃఖాలకీ సౌందర్యాలకీ అనుకంప పడగల ఆత్మ ఉంటేగాని కళని కల్పించలేడు మానవుడు’ అంటారు చలం. ఆ అనుకంప కృష్ణశాస్త్రి కవితకి ప్రాణం. పదాలలో లాలిత్యం, భావాలలో సౌందర్యం, కవితలో గాంభీర్యం తొణికిసలాడించి తెలుగువారిని ఉర్రూతలూగించిన భావకవి కృష్ణశాస్త్రి.

***

భావకవిత్వపు తొలి రోజులలో నిత్యకవితావసంతోత్సవాలతో, వాడవాడలా తిరుగుతూ, కొత్త గొంతుకలు విసురుతూ, ఎందరు పండితులు అవహేళన చేసినా మునుముందుకు సాగిపోయిన వైతాళికుడు ఆయన. బ్రహ్మ సమాజ గీతాలతో, రసపరిమళ పారిజాతాలతో మధురమైన సాహిత్యాన్ని సృష్టించారు కృష్ణశాస్త్రిగారు. ఆరోజుల్లోనే వచ్చింది ‘కృష్ణపక్షం’. కొందరు అభినందించారు. మరి కొందరు నిందించారు. అందుకే కొందరు ‘కృష్ణ’ పక్షాన చేరితే, మరి కొందరు ‘కృష్ణపక్షం’ లోనే ఉండిపోయారు.

‘క్రౌర్య కౌటిల్య కల్పిత కఠిన దాస్య
శృంఖలములు తమంతనె చెదరిపోవ
గగనతలము మార్మోగగ కంఠమెత్తి
జగమునిండ స్వేచ్ఛాగాన ఝరులనింతు’

కృష్ణశాస్త్రిగారి స్వేచ్ఛ ఆత్మ చైతన్యానుభూతిలోంచి పలికిన గానఝరి. భావకవులు వ్యక్తి స్వేచ్ఛకి ప్రాణమిచ్చారు. ప్రకృతిలో పక్షులూ, వాగులూ ఎలా స్వేచ్ఛగా ఉన్నాయో వ్యక్తి కూడా అంత స్వేచ్ఛగా ఉండాలని భావకవి అభిలషిస్తాడు. లోకం నవ్వుతుందనే బెంగ లేదు వీరికి.

‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు
నా యిచ్చయేగాక నాకేటి వెరపు ‘

అని అంటూ ‘తెలిమబ్బు తెరచాటు చెలి చందమామ జతకూడి దోబూచి సరసాల నాడి’

‘దిగిరాను దిగిరాను దివినుండి భువికి
నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు’

అని నినదిస్తారు.
కృష్ణ పక్ష కవికుమారుని స్వేచ్ఛాగానంలో నవయౌవనంలోని ఉత్సాహపులకితమైన హృదయం ఉంది. ఈ దశలో లోకాన్ని గురించి ఎరుక అస్పష్టంగా ఉంది. ప్రపంచాన్నీ, ప్రపంచం ఆరాధించే దైవాన్నీ తృణీకరించే ధోరణి ఉంది.

ఏ గంధర్వలోకం నుంచో కొందరు గంధర్వులు ఈ లోకంలోకి దిగివస్తారు. వాళ్లల్లో చాలామంది ఇక్కడ కళాకారులౌతారు. ప్రజల దృష్టికి ఎంతో దూరమూ, ఉన్నతమూ ఐన సౌందర్యాన్ని తమ కళలో ప్రదర్శిస్తారు.

‘నా నివాసమ్ము తొలుత గంధర్వ లోక
మధుర సుషమ సుధాగాన మంజువాటి
ఏనొక వియోగ గీతిక’

అని అంటారు. ‘వియోగ శాలినీ హృదయరాగ వేదనారేఖ’గా తనని చెప్పుకుంటూ అనంత విశ్వంలో పడి ‘సకల దిశాంతరాళం’లో ప్రతిధ్వనించేలా విరహగీతాలు పాడి వేదనలో రగిలిన సౌందర్యోపాసకుడు కవి. ‘కృష్ణపక్షం’ లోని ఖండకావ్యాలని ఏర్చి కూర్చిన శివశంకరశాస్త్రిగారు ‘అన్నియునొక్క కవి ఆత్మలో నుండి ఉద్భవించిన వనుదాని కంటే నన్య విధమగు నైక్యమీ సంపుటిలో గాన రాలేదు’ అంటూనే మళ్లీ ‘ కానీ కొంచెము పరిశీలించినవారు కృష్ణశాస్త్రిగారి భావతరంగిణి ప్రధానముగా చతుర్విధముల ప్రవహించుచుండునని తెలిసికొనగలరు’ అని కూడా అన్నారు.

కృష్ణపక్షం, ప్రవాసం, ఊర్వశి కావ్యాలలో కృష్ణశాస్త్రిగారి కాల్పనిక ఆవేశం, హృదయ పరిణామం స్పష్టంగా కనిపిస్తాయి. ఈ మూడు కావ్యాలనీ క్రమపద్ధతిలో పరిశీలిస్తే స్వేచ్ఛ, ప్రేమ, దుఃఖం, ప్రవాసం, సౌందర్యం అనే అంశాలు కనిపిస్తాయి. స్వేచ్ఛాన్వేషణంలో, ప్రేమాన్వేషణంలో ఆయన పడ్డ ఆరాటం దుఃఖానికి దారితీసి ప్రవాసిని చేసింది. అంతర్ముఖులయ్యారు. హృదయాన్ని క్షాళనం చేసుకున్నారు. సౌందర్యాన్ని దర్శించారు. ఇదీ ఆయన సౌందర్య ప్రస్థానం.

యువకుడైన కవికుమారుడు ప్రకృతి దర్శనంతో ఆనందపరవశుడై స్వేచ్ఛనీ, ఆనందాన్నీ ప్రకటిస్తాడు.

‘ఆకులో ఆకునై పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై
ఈ యడవి దాగిపోనా’

అంటారు కృష్ణశాస్త్రి. ఋషులు తమ అన్వేషణ అరణ్యాలలోనే సాగించేవారు. అనంతత్వాన్ని అందుకొనే శోధనలో కవి తన సౌందర్య ప్రస్థానం అడివిలోంచే ప్రారంభించటం ఔచిత్యాన్ని సంతరించుకుంది. జగము నిండా స్వేచ్ఛాగానాన్ని నింపాలని తపించే కృష్ణశాస్త్రి ‘నాకు ప్రేమ దొరికింది కాదు. నా ఆదర్శానికి సరిపోయే సౌందర్యమూ దొరికింది కాదు.’ అంటారు. వాటి అన్వేషణతోటే ఆయన కావ్యజీవితం ప్రారంభమైంది. ప్రేమ, సౌందర్యం, విశ్వాసం కాల్పనిక కవికి ఊపిరులు. యౌవనంలో ఉరకలు వేసే భావాలతో స్వేచ్ఛాగానం చేస్తాడు భావకవి.

‘తిమిర లత తారకాకుసుమములఁ దాల్చఁ
గర్కశ శిలయు నవజీవ కళలఁ దేఱ
మ్రోడు మోక చివురులెత్తి మురువు సూప
జగమునిండ స్వేచ్ఛాగాన ఝరులనింతు’

చీకట్ల తీగలు నక్షత్రాల పూలని వికసింప చేసినట్లుగా, మోళ్లు చిగుళ్లు తొడిగినట్లుగా, కఠినశిలలు ప్రాణం పోసుకున్నట్లుగా ప్రపంచమంతటా స్వేచ్ఛాగానం ప్రవహించాలి. భావకవులు మనిషికి సంకెళ్లు ఎందుకని ప్రశ్నిస్తారు.

లోకాన్నీ, లోకం ఆరాధించే దైవాన్నీ నిరాకరించే ధోరణి ‘నేను’ కవితలో కనిపిస్తుంది. యౌవనంలో మనిషికి అహంకారం ఎక్కువ. ఎవ్వరినీ లెక్కచేయక పోవడం, ఎక్కడికో రెక్కలొచ్చి ఎగిరిపోవాలనే ఉద్వేగంతో చెలరేగిపోవడం ఉంది. సౌందర్యాన్వేషణంలో భౌతికదృష్టి కనిపిస్తుంది. స్వేచ్ఛనీ, ఆనందాన్నీ అనుభవించాలనే ఆరాటం ఉంది. భగవంతుణ్ణి ‘రాజవీధుల రతనాల రథమునెక్కి నెడలు నిర్జీవ పాషాణ విగరం’ గా , ‘చలువరాతి మేడలు చెరసాలలందు, తళుకు బంగారు సంకెళ్ల దాల్చి లోకపాలకుని’ గా మురిసే బానిసీడుగా చూస్తాడు కవి. సంప్రదాయాలనీ, మతవిశ్వాసాలనీ చిన్నచూపు చూస్తాడు.

‘తేటివలపు’ లో కవి యొక్క చంచలమైన మానసిక స్థితి కనిపిస్తుంది. తేనెల కోసం మల్లెపూవుని అనుభవించిన తేటితో రెమ్మలు అంటాయి ‘లలిత మనోజ్ఞమూర్తి, మనోహర గాన సత్కళా విలసితుడు, ఆర్ద్రచిత్తుడు’ అని అమాయకంగా వరించింది మల్లిక. అప్పుడు తేటి సమాధానమిస్తుంది. ‘నిరతంబు మల్లిక కడ’నే యుండి ముదము కూర్పగ మాకొక్క పూవె చెపుమా’ ప్రేమ ప్రకృతి సహజమైన స్థితిగా అభివర్ణించడం జరిగింది. ఈ కవితలో స్వేచ్ఛా ప్రణయం ఉంది. విశృంఖల ధోరణి ఉంది. ఇంత జరిగినా ప్రకృతి సౌందర్య రసాస్వాదనలో పడి ‘అవిరళ స్వేచ్ఛ వెనక ముందరయబోక వారిదమ్ములు చిత్ర కాశ్మీర రుచుల బూని విహరించి పశ్చిమ భూధరమున రజని రానున్నదంచు తెల్పంగరాదె’ అని అంటారు. స్వేచ్ఛా ప్రణయంలో కవి చీకట్లోకి జారిపోతున్నాడు. అదే కృష్ణపక్షం.

భావకవిత్వంలో స్వేచ్ఛ ఒక ప్రధానమైన విలువ. కృష్ణశాస్త్రిగారి స్వేచ్ఛాగానం రెండు భాగాల్ని పరిశీలించినపుడు తేలే అంశం ఏమిటంటే, దేశం కోసం స్వేచ్ఛ కంటే మనిషి స్వేచ్ఛ కోసం ఆయన కలలు కన్నారనే విషయం. పైకి కనిపించే దాస్యాల కంటే ఆంతరంగిక దాస్యం మనిషిని ఎలా కృంగదీస్తుందో చెప్పడానికి ప్రయత్నిస్తారు.

స్వేచ్ఛాగానము-1 లో రెండురకాల స్వేచ్ఛలు ఉన్నాయి. మొదటిది యుగయుగాలుగా ఈశ్వరయోధులైన వారు పోరాడిన స్వేచ్ఛ. రాజారామమోహనరాయలు, రఘుపతి వేంకటరత్నం నాయుడు వంటి సంస్కర్తలు కలలు గన్న శాశ్వత స్వాతంత్ర్యం. రెండవది యౌవనోద్రేకంతో వైయక్తికమైన అనుభవాల కోసం భౌతిక దృష్టితో సాగిన స్వేచ్ఛ. మొదటిది సత్యం, శాశ్వతం. రెండవది భ్రమ, క్షణికం.

‘యుగ యుగంబుల నీశ్వర యోధులగుచు
స్వేచ్ఛకై ప్రాణసుమము లర్పించువారి
అమల జీవిత ఫలము ధన్యతను గాంచ,
జగమునిండ స్వేచ్ఛాగాన ఝరులనింతు’

ఈ పద్యంలో మానవుల మనోదాస్యాన్ని పెకలించాలనే సంస్కర్తల తపన ఉంది. నిర్మలమైన జీవితం కోసం సంస్కర్తలు పడిన సంఘర్షణ ఉంది. శాశ్వతమైన స్వేచ్ఛకి సంబంధించిన భావన కృష్ణశాస్త్రి పలికించారు.

కృష్ణపక్షంలోని కవికుమారుని మనస్సు చంచలమైనది.

‘చిత్త మానంద మయ మరీచికల సోల
హృదయ మానంద భంగ మాలికల దేల
కనులనానంద జనితాశ్రుకణము లూర
జగమునిండ స్వేచ్ఛాగాన ఝరులనింతు. ‘

అనే పద్యంలో శారీరక వాంఛ ఉంది. క్షణికమైన ఆనందమనే ఎండమావుల వెంట పరుగులు తీసే మనస్సుని సోలిపోవడంగా , అక్కడితో ముగిసిపోయే ఆనందానుభవాన్ని తేలిపోవడంగా చిత్రించి భ్రమతో కూడిన స్వేచ్ఛని ధ్వనింప చేశారు కృష్ణశాస్త్రి. ఈ పరిస్థితిలో కవి కృష్ణపక్షంలో పడిపోతాడు. భయాన్ని కలిగించే కష్టాలని దాటి, బాధల చీకట్లని ఛేదించుకోవాలనే తపనతో శాశ్వత స్వేచ్ఛాన్వేషణలో పడతాడు. అజ్ఞానాంధకారంలో పడిన మనిషి, అహంకారంతో పతనమైన మనిషి ప్రేమాన్వేషణలో హృదయాన్ని రసమయం చేసికొని ద్వైతస్థితిలోంచి అద్వైతసిద్ధికి ఉన్నతుడవటానికి ప్రయత్నిస్తాడు.

స్వేచ్ఛాగానము – 2 లో భౌతిక దృష్టి కనిపిస్తుంది. ఎక్కడికో ఎగిరిపోవాలనే తపనతో, ‘మాయ మయ్యెదను నా మధురగానమున’ అని అంటూ పువ్వు పువ్వునీ పలకరిస్తూ, ప్రణయరహస్యాన్ని చెపుతూ, ‘తుమ్మెద’లా ప్రవర్తిస్తాడు కవి. అంతేకాదు. ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు? నా యిచ్చయే గాక నాకేటి వెరపు’ అని అంటాడు. ‘In human nature sexual passion is fiercely individual and destructive, but dominated by the ideal of love, it has been made to flower into a perfection of beauty’ అని టాగూర్ అంటారు. వాంఛ వినాశనాన్ని కోరకూడదు. ఆదర్శంతో కూడిన ప్రేమ సౌందర్యాన్ని పరిమళింప చేస్తుందని టాగూర్ అభిప్రాయం.

కృష్ణపక్ష కవి తనని ‘ స్వేచ్ఛాకుమారుని ‘ గా, ‘ గగన పథ విహార విహంగమ పతి ‘గా, ‘మోహన వినీల జలధరమూర్తి ‘గా, ‘ ప్రళయ ఝంఝూ ప్రభంజనస్వామి’గా అభివర్ణించుకుంటాడు. ఆంగ్ల విద్యా సంస్కారం, తరతరాల కట్టుబాట్లు, దేశంలో తరగలెత్తుతున్న జాతీయోద్యమం, స్వేచ్ఛా ప్రణయ సమితి – ఇవన్నీ కవిని ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో పడేశాయి.

‘వక్ర గతి బోదు జక్కని పథమునందు
రాజ పథమునకై కుమార్గమున జూతు ‘

అని కృష్ణశాస్త్రి ‘నేను’ కవితలో విశృంఖలతని పరిచయం చేస్తారు. ‘విసమమృతమట్టు లమృతంబు విసము రీతి ‘ చిత్ర చిత్ర గతుల మార్చే కృష్ణశాస్త్రి జీవితంలోని కొన్ని అంశాలు పరిశీలిస్తే కానీ ఆయన వ్యక్తిత్వ వికాసం అర్థం కాదు. యౌవనంలో పరిపరివిధాల పరుగులు తీసే జీవితంలోని పరిణామాలను కృష్ణశాస్త్రి మిత్రులందరూ అనుభవించారు.

రామమూర్తి, చలం, ముద్దుకృష్ణ, కృష్ణశాస్త్రి – నలుగురూ ప్రాణమిత్రులు. బ్రహ్మసమాజానికి సన్నిహితులు. ‘మతాలనీ, అధికారాలనీ ధిక్కరించీ, అన్ని బంధాలు, సంఘం, బంధుత్వం, స్నేహం అన్నీ మా అన్వేషణ కోసం, ఆచరణ కోసం త్యజించి, యీ జీవితపు అగాధాలను, కొసలని విడదీసి, మనసు ఎంతవరకు తెలపగలదో అంతవరకూ చర్చించీ, తరిచీ తక్కినది అబద్ధమనీ నిర్ణయించిన వాళ్లం’ అని చలం స్పష్టంగా చెప్పారు.

తెలుగు సారస్వతంలో జీవితాన్ని ఒకే కోణంలోంచి మూడు విధాలుగా చూసినవాళ్లు చలం, ముద్దుకృష్ణ, కృష్ణశాస్త్రి. ఈ ముగ్గురి నుంచి పుస్తకాలు అంకితం పొందినవాడు మొక్కపాటి రామమూర్తి. నలుగురూ ప్రేమకోసం తపించివాళ్లు. కట్టుబాట్లు తెంచినవాళ్లు కాంతి కోసం, సత్యం కోసం ఎవరి మాటనీ, ఏ శాస్త్రాన్నీ నమ్మక వాళ్ల అనుభవాలు ఆధారంగా ఆలోచించుకునే వాళ్లు. అన్వేషించేవాళ్లు. మధనపడేవాళ్లు.

‘ఎన్నియుగాలనించో ఋషులు చేసిన అన్వేషణ, క్రిస్టియన్ ప్రవక్తలు మతానికై ధారపోసిన రక్తపువేడి, దిక్కుమాలి నశించిన దీనుల ఆర్తాలాపం జీవితమంతా ధీరంగా ఎదిరించిన యోధుల పట్టుదల, పురాతన కాలపు యత్నాలూ, కలలూ, ఆశలూ, బాధలూ, వ్యధలూ, ఇవేవీ వృధా పోలేదనీ, ఈనాటికి, ఏనాటికి, మనుష్య స్వభావాన్ని, యత్నాలని, ప్రోత్సహిస్తో జీవించి ఉన్నాయని విశ్వసిస్తే, గొప్పగా ప్రేమించుకున్న పూర్వుల అనుభవం, విరహం, ఈనాటి శృంగారానికి మెరుగు పెట్టక తప్పదు.’ అంటారు చలం

అదే ధోరణిలో యుగయుగాల ఈశ్వర యోధుల ఆశయాలని స్వేచ్ఛాగానంగా పలికిన కృష్ణశాస్త్రి, యుగయుగాల ఋషుల అన్వేషణ గురించి చెప్పిన చలం – ఇద్దరూ ప్రేమే సత్యమనీ త్రికరణశుద్ధిగా నమ్మినవాళ్లు. ప్రేమ శాశ్వతమని పోరాడిన వాళ్లు. ప్రేమకీ కళకీ గల సంబంధాన్ని గుర్తించిన వాళ్లు. శృంగారం కళలలోకల్లా గొప్పకళ అని గ్రహించిన వాళ్లు. ఆర్టిస్ట్ కొంతవరకైనా ప్రేమికుడు కావాలని దృఢంగా చెప్పినవాళ్లు. అందుకే ఇద్దరూ లోకంనించి విమర్శని ఎదుర్కొన్న వాళ్లయ్యారు.

కృష్ణశాస్త్రి గురించి చెప్తూ ‘తన నిజ జీవితానికీ, తన స్వప్న సీమలలో గోచరించే సుందరానుభవానికీ, తను తాకే లోకానికీ, తను భావించుకునే స్వర్గానికీ, మధ్య యీ వృత్యాసం బాధించడం వల్లనే అతనిలో ఈ అశాంతి, ఈ అన్వేషణ’ అంటారు చలం.

కృష్ణశాస్త్రి స్వేచ్ఛాన్వేషణలో సౌందర్య స్పృహ ఉంది. కృష్ణశాస్త్రి ప్రధానంగా రొమాంటిక్ కవి. బైరన్, షెల్లీ, వర్డ్స్ వర్త్, కీట్స్ వంటి కవులు స్వేచ్ఛనీ, సౌందర్యాన్నీ అన్వేషించినవాళ్లే. రొమాంటిక్ కవుల స్వేచ్ఛని గురించి క్రిష్టఫర్ కాడ్వెల్ ‘ఇల్యూజన్ అండ్ రియాలిటే’ అనే గ్రంథంలో ఇలా విశ్లేషించాడు. ‘సమకాలిక నిరంకుశ విధానాల నుంచి విముక్తిని కోరిన బైరన్, సహజంగా మంచి లక్షణాలు గల వ్యక్తిని నాశనం చేసిన వ్యవస్థల నుంచి స్వేచ్ఛని కోరిన షెల్లీ, తిరిగి ప్రకృతిలోకి వెళ్లిపోదామన్న వర్డ్స్ వర్త్, ‘Revolution as a flight from reality’ అన్న కీట్స్, అందరూ రొమాంటిక్ కవితా పతాకాన్ని స్వేచ్ఛగా, ఎగరేసినవాళ్లే’ . వీళ్లందరూ కృష్ణశాస్త్రిని ప్రభావితం చేసినవారే.

కృష్ణశాస్త్రిగారి స్వేచ్ఛాప్రియత్వం ఛందస్సులో కూడా కనిపించడం విశేషం. ఆంగ్ల సాహిత్య పరిచయం, నవ్య ధోరణి పట్ల అభిరుచి, భావ పరివర్తనం ఆయనని ఛందః ప్రయోగంలో వైవిధ్యాన్ని ప్రదర్శించేలా చేసి భావ సౌందర్యాన్ని కొత్త తరహాలో ఆవిష్కరించేలా చేశాయి.

నన్నయగారి నుండి ప్రచారంలో ఉన్న ఛందస్సులలో కొన్ని మార్పులను సాధించే ప్రయత్నం కృష్ణశాస్త్రిగారు చేశారు. పాద సంఖ్యకి సంబంధించిన భంగము, పాదముల మధ్య పద్యాన్ని పూర్తిచేసి పాదభంగాన్ని కలిగించడం, పాదమధ్యం లోంచి పద్యాన్ని ప్రారంభించడం మొదలైనవి ఆయన చేసిన ప్రయోగాలు. అన్నీ తేటగీతి పద్యాలలొనే చేయడం గమనింపదగినది.

సాంప్రదాయకంగా పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి. అంతకన్నా ఎక్కువ పాదాలూ ఉండవచ్చు. కానీ తక్కువగా ఉండటం పూర్వ సంప్రదాయం కాదు. ఈ పాద సంఖ్యా భంగము భావకవులు మొదట ప్రవేశపెట్టారు. కృష్ణశాస్త్రిగారి కవిత్వంలో ఈ ప్రయోగం కనిపిస్తుంది.

‘నా విరులతోట బెంచికొన్నాడ నొక్క
పవడపు గులాబిమొక్క నా ప్రణయజీవ
నమ్ము వర్షమ్ముగా ననయమ్ముగురిసి’

ఒక పాదము భంగము కలిగిన పద్యమిది.

పాదముల మధ్యలోనే పద్యాన్ని పూర్తి చేయటం పాదభంగము. ‘ఇలాంటివి స్వేచ్ఛాప్రియత్వమని శ్రీ శివశంకరశాస్త్రిగారు కృష్ణపక్ష సింహావలోకనంలో చెప్పారు.’

‘ మరల గ్రుడ్డిరాతిరిపడు, మరలనోరు
కాని శృతులేని లేని చీకటులు మరల
మరల పాడిల్లు…’

పై పద్యం మూడవ పాదంలో మూడు గణాలు లేకుండా పద్యం పూర్తయ్యింది. దీనిని పాదభంగము అంటారు.

పాదమధ్యంలో పద్యం పూర్తిచేయడమే కాక, పాదం మధ్యలోంచి పద్యం ప్రారంభించుట కూడా ఉంది.

‘నేను నిదుర
వెన్నెలలదారి నొకరేయి వెడలిపోతి
నొక విపంచీ విరహకంఠమొరసి యెగసి ‘

పై పద్యంలో మొదటి పాదంలో మొదట ఉండవలసిన మూడు గణాలు వదలివేయబడ్డాయి. పద్యం కూడా మూడు పాదాలలోనే ఉండటం విశేషం.

ఆంగ్ల సాహిత్యంలో వర్డ్స్ వర్తు ఇటువంటి ప్రయోగాలు చేశాడు. Enjambment పద్ధతి ద్వారా ఈ ప్రయోగం చేశాడు. A skillful poet, however, will use the line ending to reinforce his meaning. Consider the way Wordsworth makes use of a pause at the line ending to emphasise and enact his meaning.’

సమర్ధుడైన కవి భావం బలంగా చెప్పడానికి గాని క్లుప్తత సాధించి గాఢమైన అనుభూతిని పాఠకునిలో కలిగించడానికిగాని ఇటువంటి స్వేచ్ఛని తీసుకుంటాడు. పాదసంఖ్యా, పాదభంగములకు స్వేచ్ఛాప్రియత్వమే కారణం. ఇందులో ఉండే సౌందర్యాన్ని గ్రహించిన ఆచార్య కోవెల సంపత్కుమారాచార్య ‘భావ పరిమితి కన్న పద్యము వ్యర్ధ పదములను కూర్చుటయా చేయవలసియుండును. అది భావసౌందర్యమునకు అనువుగా ఉండదు. అందువలన భావమెక్కడ పూర్తియైన పద్యమును కూడా అక్కడనే ఆపవచ్చును’ అని అన్నారు.

కృష్ణశాస్త్రిగారి స్వేచ్ఛాన్వేషణంలో రూపానికి సంబంధించి ఛందస్సులోనూ భావాలకి సంబంధించి ప్రణయం, సంస్కరణ లోనూ కనబడుతుంది. కానీ యౌవనోద్రేకంలో ప్రణయానికి సంబంధించిన విశృంఖలమైన స్వేచ్ఛ కవిని కృష్ణపక్షంలో పడేసింది. భ్రమతో కూడిన స్వేచ్ఛలోంచి శాశ్వతమైన స్వేచ్ఛకోసం ప్రేమాన్వేషణంలో పడతాడు.

**** (*) ****