హోకా హే

విక్టర్ హార: ముగింపులేని పాట

జూలై 2016

మ్యానిఫెస్టో – విక్టర్ హార (Victor Jara)

పాడటం అంటే మోహం వల్లనో
నాగొంతు వినిపించాలనో కాదు నేను పాడుతున్నది
నా గిటార్ కు మనసే కాదు మస్తిష్కమూ
ఉంది గనుక నేను పాడుతున్నాను
ఈ నేల నా గిటార్ గుండెకాయ
పక్షుల రెక్కలున్నయ్ దానికి
సంతోషాన్నీ దుఃఖాన్నీ ఆశీర్వదించే
పవిత్ర జలం వంటిది నా గిటార్
వియొలీత* అన్నట్లు
నా పాట తన ప్రయోజనాన్ని కనుక్కుంది
కష్టజీవి నా గిటార్
వసంత పరిమళం తనలో

ధనవంతులకోసం అస్సలు
పలకదు నా గిటార్
అవును, ఆ వూసే ఎత్తకు
నక్షత్రాలను అందుకునేందుకు
నిర్మించిన నిచ్చెన నా పాట.

నిజమైన నిజాయితీతో
ఆఖరి వూపిరి వరకు
తన పాట తాను పాడే గాయకుని
నరాల వీణను మీటగలిగినప్పుడే
పాట సార్థకం, అర్థవంతవుతుంది

క్షణికమైన గుర్తింపు కోసమో, పొగడ్తల కోసమో
దేశ దేశాల్లో కీర్తి ప్రతిష్టలకోసమో కాదు నా పాట.
ఈ చిన్ని దేశం కోసం
లోతైన ఈ నేల కోసం నా పాట
ఆది సమస్తం శాశ్వత విశ్రాంతి తీసుకునే నేల
తిరిగి సమస్తం మొలకలెట్టే నేల
ఏ పాటైతే ధైర్యంగా నిలుస్తుందో
అది ఎల్లప్పుడూ నిత్యనూతనమే.
(*వియొలీత: చిలీ జానపద సంగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. విక్టర్ లాంటి వాళ్లకు స్పూర్తి ఈమె).

చిలీ! దక్షిణ అమెరికా పడమటి తీరంలో సన్నని రిబ్బను పీలిక లాంటి దేశం.
దేశ రాజధాని సాంటియాగో దగ్గర్లో లాంకెన్ అనే ప్రాంతంలో రైతుకూలీ కుటుంబంలో, సెప్టెంబరు 28, 1932 లో పుట్టాడు విక్టర్. మానుఎల్ హార, అమాందా మార్తీనెస్ అతని తల్లిదండ్రులు. అమాందా మంచి గాయని, గిటార్ , పియానో వాయించేది. కష్టపడి పని చేసేది. మానుఎల్ తాగుబోతు, సోమరిపోతు. అమాందాను కొట్టేవాడు. పిల్లలను చిన్నప్పుడే పనుల్లో ఇరికించాడు. విక్టర్ ఆరేళ్లకే పొలంలో పని చేశాడు. తన అనుభవాలనుంచే పాటలు కట్టాడు విక్టర్. అందుకే ఆ వసంత పరిమళం అతని పాటలో, అందుకే మట్టి ఉచ్వాస నిశ్వాసాలు అతది పాటలో:

పొలంలో సీతాకోకలు ఎగురుతున్నాయి
కీచురాళ్ళు పాడుతున్నాయి
గాలి మండిపోతూ నన్ను మరింత నల్లబరుస్తుంది
కాల్చే ఎండలు వెదజల్లుతూ వెదజల్లుతూ సూర్యుడు
నేను నేలను చాళ్లు చాళ్ళుగా దున్నే కొద్దీ
చాళ్లు చాళ్లుగా చెమట నదులు నా మీద

కొన్నేళ్ళకు తండ్రి ఆ కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయాడు. అమాందాకు, పిల్లలకు అదే మంచిదయ్యింది. పిల్లలను తీసుకుని సాంటియాగో వచ్చేసింది అమాందా. అక్కడ, వీళ్లున్న ఇంటిదగ్గర ఒకతను గిటార్ అంటే విక్టర్ కు వున్న ఇష్టం చూసి, కొత్త పాటలు కట్టే అతని తెలివికి అబ్బురపడి గిటార్ వాయించడం నేర్పించాడు. అమాందా పిల్లలను క్రమశిక్షణతో పెంచింది. తాను వళ్లు హూనం చేసుకుని పిల్లలను చదివించింది. అమాందా తన ఆరోగ్యం పట్టించుకోకుండా పని చేసి, ఆఖరికి పని చేసే చోటే స్పృహ తప్పి పడిపోయింది. చనిపోయింది. విక్టర్ కు అప్పుడు పదిహేనేళ్లు. అడుగడుగునా కష్టాలతో బతుకు దుర్భరమనిపించినా ఎప్పుడూ నవ్వుతూ కనిపించే తల్లి పెంపకంలో జీవితంపట్ల ఎంతో ఆశావహ దృష్టి పెంచుకున్నాడు విక్టర్. అప్పట్లో విక్టర్ కు ఎదురైన అనుభవాలు చిలీకి సర్వసాధారణం. పేద కుటుంబంలో పుట్టి విక్టర్ లా చదువుకున్నవాళ్లు మాత్రం చాలా తక్కువ.

చిల్లర పనులు చేస్తూ మొదట్లో అకౌంటంట్ అవడం కోసం చదివాడు. అది నచ్చక మత గురువు పని (ప్రీస్ట్ హుడ్) కోసం సెమినరీలో చేరాడు. అక్కడ రెండేళ్లు చదివాక చర్చి పట్ల విముఖత కలిగి అదీ వదిలేశాడు. కొన్నేళ్లు ఆర్మీలో పనిచేసి చివరికి తనకు ఇష్టమైన జానపద సంగీతం, థియేటర్ ఆర్ట్సులో కుదురుకున్నాడు. లాటిన అమెరికన్ దేశాల్లోని సంగీతం, ముఖ్యంగా వియొలీత పర్ర పాడిన జానపద గీతాలు, పాబ్లో నెరూడ కవిత్వం అతని సంగీతం మీద ఎంతో ప్రభావం చూపాయి. 1950ల్లో కుంకుమేన్ (Cuncumen) అనే బృందంతో కలిసి పాడడం మొదలుపెట్టాడు. 1960ల్లో జానపద సంగీతాన్ని తన పాటకు నేపథ్యంగా ఎంచుకుని ఆన్హెల్ పర్ర (Angel Parra) అనే ప్రముఖ గాయకుడితో కలిసాడు. అక్కడ పాల్గొన్న కార్యక్రమాల ద్వారా కొత్త చిలీ పాట ( లా నుయేవా కాన్సియోన్ చిలీనా, La Nueva Cancion Chilena) అనే ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. 1966లో తన మొదటి పాటల ఆల్బం ను వెలువరించాడు. 1970లు వచ్చేసరికి సాల్వదోర్ అయెందె (Salvador Allende) కు స్నేహితుడయ్యాడు. క్యూబా, సోవియట్ యూనియన్ లు దర్శించాడు. క్రియాశీల వామపక్ష రాజకీయాలు, జానపద సంగీతం అతని పాటల్లోని సాహిత్యంలో మమేకమయ్యాయి. చిరునవ్వుతో వెలిగే ప్రశాంతమైన ముఖంతో, మధురమైన గానంతో ఆతను, అతని పాట, అతని గిటార్, జనంలోకి చొచ్చుకుపోయాయి. పక్క దేశమైన పెరు (Peru) కు వెళ్లినప్పుడు విక్టర్ ను తన ఇంటికి రమ్మని ఒక రైతు కూలీ పిలిస్తే అభ్యంతరం చెప్పకుండా వెళ్లిపోయాడు. మారుమూల కుగ్రామంలో అతని ఇంటికి వెళ్లినప్పుడు ఆ రైతుకూలీ భార్య విక్టర్ ను గుర్తుపట్టి అంత ముఖ్యమైన వ్యక్తి ఇంటికి వచ్చినందుకు భయపడింది. విక్టర్ కలుపుగోలుతనంతో ఆమె భయాన్ని పోగొట్టాడు. వాళ్లింట్లో పాటలు పాడాడు. ఇలాంటి సంఘటనల వల్ల ఒక్క చిలీనే కాక లాటిన్ అమెరికన్ దేశాల ప్రజలు విక్టర్ పాటను తమ పాట చేసుకున్నారు. పాటగాడిగానే కాక, అతడిని తమలో ఒకడిగా భావించేవారు.

రైటిస్ట్ లకు విక్టర్ క్రియాశీలరాజకీయాలు కంటగింపయ్యాయి. అతనిమీద దాడులు జరిగేవి. వాటినేం పట్టించుకోకుండా విక్టర్, సల్వొదోర్ అయెందెకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొన్నాడు, స్వచ్చందంగా పని చేశాడు, ఉచితంగా పాటలు పాడాడు. అయెందె పార్టీ ఉనిదాద్ పాపులార్ (Unidad Popular) కు పార్టీ గీతంగా ‘మనం గెలుస్తాం’ (వెంసెరెమోస్, Venceremos) అనే పాటను కూర్చాడు.

చిలీ!! ప్రజాస్వామ్య ఎన్నికల్లో ఒక మార్క్సిస్టు ప్రభుతం ఎన్నికైన మొట్టమొదటి దేశం!
క్రిస్టియన్ డెమొక్రాట్స్ తో కలిసి ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో అయెందె ప్రెసిడెంటుగా ఎన్నికైనప్పుడు ధనవంతులు తలుపులు, కిటికీలు మూసేసుకుని తమ ఇళ్ళల్లో చీకట్లో వుండిపోతే మిగతా ప్రజలంతా నృత్యాలు చేస్తూ, పాటలు పాడుతూ పండగ చేసుకున్నారు. చిలీలో మొట్టమొదటిసారి శ్రామికవర్గానికి ఒక గుర్తింపు వచ్చినట్టు భావించారు.

చిలీ!! భౌగోళికంగా పసిఫిక్ మహాసముద్రానికి, అర్జెంటినా దేశానికి మధ్య ఇరుక్కుపోయినట్లుండే చిన్న దేశం. మార్క్సిస్టు అయెందె ప్రెసిడెంటు అవగానే అమెరికా సంయుక్త రాష్ట్రాలకు, సోవియట్ యూనియన్ కు మధ్య ప్రచ్ఛన్న యుద్ధంలో ఇరుక్కుపోయిన అతిచిన్న దేశం.

అయెందె గెలవకూడదని అమెరికా ఎన్నో ప్రయత్నాలు చేసింది. చివరికి అయెందె గెలిచాక చిలీ ప్రజలకు తమ బాగోగులు చూసుకోవడం తెలీకపోతే తామే ఆ పిల్లలను చూసుకోవాలని నిక్సన్ మహాశయుడు ప్రఖ్యాతి గాంచిన సి.ఐ.ఏ కు ఒక చిన్న పని అప్పగించాడు. అది చిలీకి ఎకనామిక్ షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడం. ఆ పని సి.ఐ.ఏ ఎంతో సమర్థవంతంగా నిర్వహించింది. చిలీ ఆ పరిణామాన్ని ఊహించలేదని కాదు. సోవియట్ యూనియన్ తమకు బాసటగా నిలుస్తుందని అయెందె నమ్మాడు. కమ్యూనిస్టు దేశమైతేనేం దాని వ్యాపార కాంక్షలు దానికుంటాయి. క్యూబా లాంటి ఇంకో దేశాన్ని అక్కున చేర్చుకుని అమెరికాతో శతృత్వాన్ని మరింత పెంపొందించుకోవడానికి సోవియెట్ యూనియన్ విముఖత చూపింది. అంతేకాదు అయెందేది ప్రజాస్వామ్యానికి ద్రోహం చెయ్యగలిగే మనస్తత్వం కాదని, వుక్కుపిడికిలితో దేశాన్ని అదుపులో పెట్టే ఆలోచన కూడా చెయ్యడని, ఆయనకు సహాయం చేస్తే తమకేమీ లాభం వుండదని గ్రహించింది.

రైటిస్ట్ లు వెంట వెంటనే చేపట్టిన సమ్మెల వల్ల అయెందె ప్రభుత్వానికి ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం రాలేదు. విక్టర్, అతని భార్య జొయాన్, ఎంతో మంది కామ్రేడ్లు, శ్రామిక జనం, స్వచ్చందంగా ఎంతో పని చేశారు. ఇన్ని కష్టాలున్నా, 1973 మార్చి నెలలో జరిగిన ఎన్నికల్లో అయెందెకు మునపటి ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అయెందె హయాంలో పేద ప్రజలకు ఇంతకు ముందు కంటే ఎక్కువ తిండి దొరికింది, ఇంతకు ముందు ఎప్పుడూ చెయ్యని పనులు చెయ్యగలిగారు. ప్రజాస్వామికంగా జరిగే ఎన్నికల్లో అయెందేను ఓడించలేమని ప్రతిపక్షాలకు, అమెరికాకు అర్థమయ్యింది. ఉక్కు పిడికిలి బిగిసింది.
ప్రజల్లో చైతన్యం వుడిగిపోకుండా నిలబెట్టగలిగే శక్తి పాటకు వుందన్న సంగతి ఎప్పుడో గ్రహించిన విక్టర్ ఈ కష్టకాలంలో అయెందేకు బాసటగా నిలిచి ఎన్నో పాటలు పాడాడు:

చేతులతో నదీ గమనాన్నే మార్చే మీరు
లేచి నిలబడి మీ చేతులను చూడండి
సోదరుల చేతులను మీ చేతుల్లోకి తీసుకోండి
రక్తంతో ఏకమయ్యాం మనం కలిసి నడుద్దాం
భవితవ్యం ఈనాడే మొదలవుతుంది
మనల్ని దుర్భర స్టితిలో వుంచిన మూకల నుంచి
పూర్తి విముక్తి సాధిద్దాం

అని ప్రజలకు పిలుపునిచ్చాడు విక్టర్.

చివరి రోజుల్లో అయెందె అడిగిన అప్పుకి బదులుగా తమ ఆయుధాల్ని కొనుగోలు చెయ్యాలని నిబంధన పెట్టింది సోవియట్ యూనియన్. అందుకు కూడా ఒప్పుకున్నాడు అయెందె. ఇంతకీ ఆ డబ్బు కానీ, ఆయుధాలు కానీ అయెందె ప్రభుత్వానికి చేరనే లేదు. అయెందె నమ్మకం ఆయన్ని మళ్లీ బోల్తా కొట్టించింది. ఆయన ఎంతో నమ్మిన ఆర్మీ జనరల్ పినొచెట్ చేతుల్లోకి వెళ్లాయవి.

చిలీ!! పెద్ద దేశాల చేతుల్లో, స్వదేశీ కోటీశ్వరుల చేతుల్లో ఆటబొమ్మ అయిపోయింది.
9 సెప్టెంబర్ 1973. ఆదివారం.
ఎట్లాగైనా దేశంలో అంతర్యుద్ధాన్ని ఆపి రక్తపాతాన్ని నివారించాలని అయెందె చాల ప్రయత్నించాడు. తన క్యాబినెట్ లో ముఖ్యులతో సమావేశమయ్యాడు. తన ప్రభుత్వం వుండాలా వద్దా అన్న ప్రశ్నతో రెఫరెండం ప్రవేశపెడతానని చెప్పాడు. పినొచెట్ తదితరులు అందుకు ఒప్పుకున్నారు. ఆర్మీలో ఏవో ఇబ్బందులున్నాయని, సోమవారం కాకుండా బుధవారం రెఫరెండం ను ప్రవేశపెట్టమని కోరారు. అందుకు అయెందె ఒప్పుకున్నాడు. సోమవారానికి, బుధవారానికి మధ్య మంగళవారం వుందన్న సంగతి పట్టించుకోలేదు.

చిలీ!! ప్రపంచం కళ్లముందు చిలీ బడుగు జనాల ఆశలు భగభగ మండిపోయాయి.
11 సెప్టెంబర్ 1973. మంగళవారం.
అంతర్యుద్ధం వస్తే జరిగే మారణహోమం గురించిన పాటలను రికార్డు చేసే పని మీద ఆరోజు యూనివర్సిటీకి వెళ్లిపోయాడు విక్టర్. సాంటియాగోలో విచిత్రమైన ప్రశాంతి. అయెందె కూడా ప్రెసిడెన్సియల్ ప్యాలెస్ కు వెళ్లిపోయాడు. ఆయన ప్యాలస్ లోకి వెళ్లిన వెంటనే సైనిక తిరుగుబాటు (మిలటరీ కూప్) మొదలయ్యింది. తనకు నమ్మకస్తుడైన అగుస్తో పినొచెట్ ను పిలిపించమని చెప్పాడు అయెందె. కూప్ కు సూత్రధారియే పినొచెట్ అని తెలుసుకుని కుప్పకూలిపోయాడు. అయెందేను లొంగిపొమ్మని, దేశం వదిలివెళ్లిపొమ్మని ఆదేశించాడు పినొచెట్. అయెందె అందుకు ఒప్పుకోలేదు. తన చివరి ఉపన్యాసాన్ని ఒక్క రేడియో స్టేషనైనా ప్రసారం చేస్తుందని నమ్మి వాళ్లకు ఫోన్ చేశాడు. ఆ చివరి నమ్మకాన్ని వమ్ము చెయ్యలేదు నిబద్ధత కలిగిన ఆ రేడియో స్టేషన్. ఆయన చివరి మాటలు దేశం నలుమూలలకు చేరాయి. చిట్టచివరి దాకా ప్రజాస్వామ్యానికి, దేశప్రజల నమ్మకానికి నిబద్దుడనై వుంటానని, రాజినామా చెయ్యనని, పారిపోనని మాట ఇస్తుండగానే ప్యాలెస్ మీద బాంబుల వర్షం కురిసింది. శత్రువుల చేతికి చిక్కకుండా ఫిడెల్ కాస్ట్రో బహుమతిగా ఇచ్చిన గన్ తో కాల్చుకుని మరణించాడని ఆయనతో ఉన్న బాడిగార్డులు చెప్తారు.

ఆరోజు కర్ఫ్యూ విధించబడి ప్రజలంతా ఎక్కడివాళ్లు అక్కడే చిక్కుబడిపోయారు. విక్టర్ కూడా యూనివర్సిటీలోనే వుండిపోయాడు. మరుసటిరోజు అందరితోపాటు విక్టర్ ని చిలీ స్టేడియం కు తరలించారు గార్డులు. విక్టర్ను గుర్తుపట్టిన గార్డులు అప్పుడప్పుడు కొడుతూ, బెదిరిస్తూ స్టేడియంకు తరలించారు. స్టేడియంలో దాదాపు ఐదువేల మందిని నిర్భందించారు. విచక్షణా రహితంగా బందీలను కొడుతూ, కాల్పులు జరుపుతూ ఎప్పుడూ ఏం జరుగుతుందో తెలియక భయంతో, నొప్పితో కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతూ భయానక వాతావరణం నెలకొంది. తలకు గాయమై రక్తం కారుతున్నా, తన చుట్టు ఉన్నవారి భయం పోగొట్టడానికి పాటలు పాడాడు విక్టర్. అది గమనించిన ఒక గార్డు బూతులు తిడుతూ విక్టర్ను కడుపులో గుద్దాడు, పక్కటెముక విరిగేట్టు కొట్టాడు. పెద్ద గుంపునుంచి వేరు చేసి ఒక చిన్న గుంపు దగ్గర కూర్చోబెట్టారు. అక్కడ చిత్రహింసలు భరించలేక ఒకతను కిటికీలోంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడ ఒక చిత్తుకాగితంలో ఒక పాట రాయడం మొదలుపెట్టాడు విక్టర్.

ఇక్కడ ఐదువేలమందిమి ఉన్నాం
నగరంలోని ఈ చిన్ని భాగంలో.
మేం ఐదువేల మందిమి.
ఈ నగరంలో, మొత్తం దేశంలో
అంతా కలిసి ఎంతమందిమి?
ఇక్కడే
విత్తనాలు విత్తేవి
ఫ్యాక్టరీలను నడిపేవి వెయ్యి చేతులున్నాయి.
ఆకలికి, చలికి, భయానికి, నొప్పికి,
నైతిక ఒత్తిడికి, భీతికి, వెర్రితనానికి
ఎంతమంది జనం బలి అయ్యారు?
మాలో ఆరుగురం తప్పిపోయాం
నక్షత్రాలమధ్య ఖాళ్లీల్లోకి వెళ్లిపోయినట్లు.
చచ్చిపోయి ఒకరు,
ఇంకొకరు ఒక మనిషి ఇంతలా దెబ్బలు తినగలడని
నేను ఎప్పుడూ ఊహించనంతగా దెబ్బలు తిని
మిగిలిన నలుగురు భయాన్ని అంతం చెయ్యాలనుకుని
ఒకరు శూన్యంలోకి దూకేశారు,
ఇంకొకరు గోడకేసి తలబాదుకున్నారు,
అందరూ మృత్యువు తీక్షణదృష్టిలోనే.
ఫాసిజం ఎన్ని ఘోరాల్ని సృష్తిస్తుంది!

వాళ్లు తమ ప్లాన్లను కత్తి అంత ఖచ్చితంగా పూర్తిచేస్తారు.
వాళ్లకు ఏదీ పట్టదు
వాళ్లకు, రక్తం పతకాల వలె కనిపిస్తుంది
నర సంహారం వీరత్వంలా అనిపిస్తుంది.

దేవుడా, నువ్వు సృష్టించిన ప్రపంచం ఇదేనా,
నీ ఏడు రోజుల అద్భుతం, శ్రమ ఫలితం ఇదేనా?

ఈ నాలుగు గోడల మధ్య కేవలం ఒక అంకె కు ఉనికి ఉన్నది
దీని క్రమం పెరగదు,
నెమ్మదిగా మరణాన్ని ఇంకా ఇంకా కోరుకుంటుంది.

కానీ నా మనసు హఠాత్తుగా మేల్కొంటుంది
ఈ పోటుకి గుండెచప్పుడు కాలేదని నాకు తెలిసిపోతోంది
ఉన్నదల్లా మెషీన్లకుండే స్పందన
సైన్యం తన మృదువైన మంత్రసాని ముఖాన్ని చూపిస్తుంది.

మెక్సికో, క్యూబా, ఇంకా మిగతా ప్రపంచమంతా
ఈ దౌర్జన్యాకి వ్యతిరేకంగా ఘోషించనీ!

శూన్యాన్ని ఉత్పత్తి చేసే
పదివేల చేతులం ఇక్కడ మేం.
ఈ దేశంలో ఎంతమందిమి?

మా ప్రెసిడెంటు, మా సహవాసి రక్తం
బాంబులకన్న, మరతుపాకుల కన్న శక్తివంతంగా తిరగబడుతుంది!
మా పిడికిళ్లు మళ్లీ ఎదురుతిరుగుతాయి!

పాడడం ఎంత కష్టం
ఇక భయం గురించి పాడాలంటే,
నేను బతుకుతున్న భీతి
నేను మరణిస్తున్న భీతి.
ఇన్ని ఘోరాల మధ్య
నిశ్శబ్దమూ, హాహాకారాలతో
అనంతమైన క్షణాలు
నా పాటకు ముగింపు అయినప్పుడు.

నేను చూస్తున్నది ఇంతకుముందు చూడలేదు.
నేను అనుభవించినదీ, అనుభవిస్తున్నదీ
జన్మనిచ్చే క్షణం … …

పాట పూర్తికాకముందే గార్డుల కమాండర్ ఆయన్ని పిలిచాడు. ఆ కాగితాన్ని పక్కనున్న ఒకతనికి ఇచ్చి వెళ్లిపోయాడు విక్టర్(ఆ కాగితం చివరికి విక్టర్ భార్య జొయాన్ కు చేరింది). విక్టర్ తో “గిటార్ వాయిస్తావా?” అన్నట్లు వేళ్లతో సంజ్ఞ చేశాడు కమాండర్. స్టేడియం మధ్యలో టేబిల్ దగ్గరికి రమ్మని పిలిచాడు. నలుగురు గార్డులు విక్టర్ను కదలకుండా పట్టుకుని చేతులను టేబిల్ మీద పెట్టించారు. కమాండర్ గొడ్డలితో విక్టర్ చేతులను నరికాడు. కిందపడిపోయిన విక్టర్ మీద పడి పిడిగుద్దులు గుద్దుతూ ‘ఇప్పుడు పాడు’ అంటూ బూతులు తిట్టాడు. కాసేపటికి లేచి, తూలుతూ నిలబడి, రక్తం కారిపోతున్న చేతుల్నెత్తి ఉనిదాద్ పాపులర్ పార్టీ గీతం “మనం గెలుస్తాం” పాటను పాడాడు విక్టర్. ఆ హింసను చూస్తున్న ఎంతో మంది బందీలు విక్టర్ తో పాటు పాడడం మొదలుపెట్టారు.

కమాండర్ తుపాకీతో రష్యన్ రౌలెట్ ఆట ఆడుతూ విక్టర్ తలవెనుక కాల్చాడు. 43 బుల్లెట్లతో విక్టర్ హత్యాకాండను పూర్తి చేశారు ఇద్దరు గార్డులు.

సామూహిక సమాధుల్లో పూడ్చిపెట్టేముందు మృతదేహాలు భద్రపరచేచోట పని చేస్తున్న యువకుడు గుట్టలు గుట్టలుగా వచ్చిపడుతున్న శవాల్లో విక్టర్ను గుర్తుపట్టాడు. వెంటనే విక్టర్ ఇంటికి వెళ్లి ఆయన భార్య జొయాన్ కు చెప్పాడు. అలా చెప్పడం వల్ల తన ప్రాణానికే ముప్పు అని ఆ యువకుడుకి తెలిసినా, తమలో ఒకడైపోయిన విక్టర్ పట్ల ఉన్న అభిమానం అతనికి ఆ ధైర్యాన్నిచ్చింది. అతని సహాయంతో విక్టర్ను వేరేచోట పూడ్చిపెట్టగలిగింది జొయాన్.

తన గాయాల్ని లెక్కచేయకుండా చివరిదాకా తన పక్కనున్న కామ్రేడ్లకు ధైర్యం చెబుతూ, తుదిశ్వాస వరకు జనం పాట పాడుతూ మరణించాడు ప్రజాగాయకుడు విక్టర్. విక్టర్ పాట ఇప్పటికీ విప్లవ స్ఫూర్తిగా నిలిచే ఉంది.

విక్టర్ హార! చిలీ ప్రజలే కాదు ప్రపంచ ప్రజలు పాడుకునే ఒక ముగింపులేని పాట.

**** (*) ****