గెస్ట్ ఎడిటోరియల్

వాకిలి కథలపై విహంగవీక్షణం

ఆగస్ట్ 2016

నవరి 2013 లో మొదలైన వాకిలి అంతర్జాల మాసపత్రిక జూన్ 2016 సంచికతో 42 నెలలు పూర్తిచేసుకుంది. నవల, కథ, కవిత,వ్యాసం ఇలా రకరకాల సాహిత్యప్రక్రియలకి తనలో స్థానం కల్పిస్తోంది. కొన్ని గణాంకాలనీ, ఇంకొన్ని ప్రమాణాలనీ ఆధారం చేసుకున్న ఈ విశ్లేషణ; మూడున్నర సంవత్సరాలలో వాకిలిలో వచ్చిన కథల తీరుతెన్నులని విభిన్న కోణాల్లోనుంచి చూడటానికి ఒక ప్రయత్నం చేస్తుంది.

కథల సంఖ్య:

ఈ నలభై రెండు నెలల్లో వాకిలిలో వెలుగు చూసిన కథలు 120. ఇందులో అనువాద కథలు 3. మిగిలినవి 117. అంటే నెలకు సగటున సుమారుగా 3 కథలు వాకిలిలో ప్రచురితమయ్యాయి.

కథల పేర్లు:

చాలామంది రచయితలు కథకి సంబందించిన మిగిలిన విషయాల మీద పెట్టే శ్రద్ధ, కథకి పేరు పెట్టటం మీద పెట్టరు. ఈ విషయానికి నూతన రచయితలే కాదు, లబ్ధప్రతిష్ఠులయిన రచయితలు కూడా మినహాయింపు కాదు. దీనివల్ల కొన్ని కథలకి పెట్టే పేర్లు, చిరపరిచితమయినవిలా అనిపిస్తాయి. ఒక్కోసారి అవి కథ ఇతివృత్తాన్నీ, కొండొకచో కథ ముగింపునీ, కథని పూర్తిగా చదవకముందే బట్టబయలు చేస్తాయి. కథాయుద్ధంపై పాఠకభీష్ముడి ఆసక్తిని చంపటానికి అలాంటి పేర్లు శిఖండి పాత్ర ధరిస్తాయి.

కథలు చదవటంలో విస్తారమయిన అనుభవం ఉన్న సంపాదకులూ, వారితో పాటు పాఠకులూ; కథ పేరుని బట్టి కథకుడి స్థాయినీ,  కథ నాడినీ పట్టేస్తారు. పక్కలో పెట్టుకోవాలా, పక్కకి నెట్టేయాలా అన్నది చిటికెలో నిర్ణయించేస్తారు. అందువల్ల పాఠకుడిని కథవైపు ఆకర్షించడానికి, ఇతివృత్తం విశిష్టంగా ఉంటే చాలదు. కథనం ఆసక్తికరంగా ఉంటే సరిపోదు. కథకి పెట్టిన పేరులో సైతం వైవిధ్యం ఉట్టిపడాలి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని, వాకిలిలో వచ్చిన కథల పేర్లు, ఎంత విభిన్నంగా ఉంటున్నాయో చూద్దాం.

కథలకి, సినిమా పేర్లు పెట్టటం అనేది ఒక ఆనవాయితీ. దీనికి నిదర్శనం నాలుగు స్తంభాలాట, దొరబాబు అనే కథలు. ప్రతి సినిమా పేరుకీ ఇవ్వాళా రేపూ ఒక టాగ్ లైన్ ఉంటోంది. కథల పేర్లపై కూడా ఆ ప్రభావం పడింది అనుకోవటానికి, సౌభాగ్యం రోడ్డున పడింది (దానికి మనమేం చేస్తాం?) కథ పేరు సిద్ధంగా ఉంది.  కథకుడి మీద కానీ, కథనం మీద కానీ పరభాషా ప్రభావం ఉన్నపుడు, కథ పేరు మీద ఆ ఛాయలు పడక మానవు. అందువల్లనే  ఇంగ్లీషు పదాల్తో కాని, ఉర్దూ లేదా హిందీ పదాల్తో కానీ పెట్టిన పేర్లు 18 కథలకి ఉన్నాయి. కథలో ఒకటికి మించి భాషలు ఉన్నపుడు, కథ పేరు అలా ఉండటంలో అనౌచిత్యం ఏమీ లేదు. ఒల్వెరా స్ట్రీట్ పిచ్చి కవి, ది టెర్మినేటర్-ద్వైతము లాంటి పేర్లు దానికో నిదర్శనం. కథనం మాండలికంలో ఉన్నపుడు, కథ పేరు మాండలికంలో ఉండటం సముచితం. మేస్టృబాబు మరి నేరు అనే కథ దీనికి ఉదాహరణ. కథలో ఒక పాత్ర పేరు; కథకి ఉంచటం ఒక అలవాటు. ఈ రీతిపై ఆకర్షణ ఇంకా తగ్గలేదనే విషయాన్ని మైథిలి, యామిని కథలు ధృవపరుస్తాయి.  ప్రముఖమైన పలుకుబడులు, కొంత మార్పుతో కథ పేరుగా పనికొస్తాయనటానికి ధనం మూలం, పాత ఒక వింత లాంటి కథల పేర్లు ఉదాహరణలు. ఒకప్పుడు సినిమా పాటల పల్లవులు యథాతథంగా కథల పేర్లుగా అమిరేవి. అవి కొంత రూపాంతరం చెంది, గాలికే కులముందీ…లా కథల పేర్లు అవుతున్నాయి. అంతే కాదు కొన్ని సినీ గీతాల  చరణాలు సైతం ఆ పాత్రని పోషిస్తున్నాయి. పాలగుండెలో ఏదీ దాగుందో, ఎందుకు వగచేవో అనే కథలు ఈ విషయాన్ని నిరూపిస్తాయి. ఒక ప్రసిద్ధి చెందిన నవల పేరు, చిన్న మార్పుతో కథ పేరుగా పనికొస్తుందా? అవునని అసమర్థుని ప్రేమయాత్ర కథ చెపుతోంది. అమావాస్య చంద్రుడిలా, ఆకాశంలో భూకంపంలా; పొసగని రెండుపదాలని కలిపి కథ పేరుగా పెట్టి ఒక వైవిధ్యం సాధించవచ్చు. నలుపు అని అర్థం ఇచ్చే ‘కారు’ ని తెల్లటి పున్నమికి జోడించటం (కారుపున్నమి-జూలై 2013), కలపకి చెందిన పెళుసుని అందానికి ఆపాదించటం (సెప్టెంబర్ 2015) అలాంటి ప్రయోగాలే.

అధ్యాయవిభజన:

కథ అంటే ఒకప్పుడు ఒక సంఘటన. ఒక జీవితశకలం. ఇప్పుడు కథ నిర్వచనం మారింది. ఇతివృత్తం విస్తృతీ పెరిగింది. దాంతో కథలోకి విభిన్నపాత్రల ప్రవేశం, నిష్క్రమణా  జరుగుతోంది. సందర్భాన్ని బట్టి సంఘటనాస్థలి సైతం మారుతోంది. ఆ మార్పులకి అనుగుణంగా కథలో అధ్యాయవిభజన జరిగితే, అది; కథలో రాబోయే మార్పును స్వీకరించడానికి పాఠకుడిని మానసికంగా సంసిద్ధం చేస్తుంది. ఈ దృక్కోణాన్ని నిర్లక్ష్యాన్ని చేసిన కథ, ఎక్కడో ఒకక్కడ పాఠకుడిని అయోమయానికి గురిచేస్తుంది.

ఒక కథలో ఎన్ని అధ్యాయాలు ఉండాలనేది కథనం మీద ఆధారపడి ఉంటుంది. ఒక అధ్యాయం ఎన్ని పేజీలకి విస్తరించాలి అన్నది ఆ అధ్యాయం ద్వారా కథకుడు, కథకుడికి సంబంధించిన ఏ భాగం చిత్రీకరించాలనుకున్నాడనేదాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. వీటి దృష్ట్యా ఒక కథకి ఇన్ని అధ్యాయాలే ఉండాలనే నియమం, ఇన్ని పేజీలకి తప్పనిసరిగా అధ్యాయం మారాలనే పరిమితి; విధించడం విజ్ఞత కాదు. అలాగని,  పేజీలకు పేజీల కథని ఒకే అధ్యాయంగా రాయటం; ఒక చిన్నకథని ముక్కలుముక్కలు చేయటం పద్ధతి కాదు.

ఈ నేపథ్యంలో, వాకిలిలో వచ్చిన, వస్తున్న కథల్లో అధ్యాయవిభజన ఏ మేరకు జరుగుతోంది? అనే ప్రశ్న ఉదయించక మానదు. ఈ గణాంకాలు ఆ ప్రశ్నకి సమాధానమిస్తాయి.

ఒక అధ్యాయం ఉన్న కథలు 59, రెండు అధ్యాయాల కథలు 18, మూడు అధ్యాయాల కథలు 8, నాలుగు  అధ్యాయాల కథలు 12, అయిదు అధ్యాయాల కథలు 11, ఆరు అధ్యాయాల కథలు 2, ఏడు అధ్యాయాల  కథలు 4, ఎనిమిది అధ్యాయాల కథలు 1, తొమ్మిది అధ్యాయాల కథలు 1, పదమూడు అధ్యాయాల కథలు 1.

.         ఒకే అధ్యాయంతో రాసిన కథలు, మొత్తం 117 కథల్లో సగం. ఈ 59 కథల్లో; ఒకటి నుంచి మూడు  పేజీలలోపు ఉన్నవి 15, నాలుగు నుంచి ఆరు పేజీలలోపు ఉన్నవి 27, ఏడు నుంచి తొమ్మిదిపేజీల లోపు ఉన్నవి 15, పది నుంచి పన్నెండు పేజీల లోపు ఉన్నవి 02. అన్నిటికన్నా పెద్ద కథ 11 పేజీలది.

కొందరు కథకులు; అధ్యాయవిభజన గురించి ఇంత చర్చ (ఇది చాలా సున్నితమయిన పదం. దీనిలో అక్షరాల స్థానాన్నీ, గుణింతాల లేదా గుణితాల స్థానాన్నీ మారిస్తే రచ్చ అవుతుంది) అవసరమా? కథలో మరింత అధ్యాయవిభజనకి అవకాశం ఉంటే, అది మేమే చెయ్యమా? అలా వదిలేస్తామా? అని ప్రశ్నించవచ్చు. ఈ ప్రశ్నకి సమాధానం; ఒకటే అధ్యాయం ఉన్న, రెండు పెద్ద కథలపై నేను జరిపిన పరిశీలన ఇస్తుంది.

మొదటి కథ డిసెంబర్ 2014 సంచికలో ప్రచురించబడ్డ రాజేశ్ యాళ్ల కథ-కిటికీలోని బాల్యం. ఇది 11 పేజీల కథ. ఈ కథలో తొమ్మిదో పేరా తర్వాత సందర్భం మారింది. పన్నెండో పేరా అనంతరం సంఘటనా సమయం మారి, ఒక కొత్త పాత్ర కథలోకి ప్రవేశించింది. నలభై అయిదో పేరా తర్వాత ప్రధాన పాత్ర గతంలోకి వెళ్లింది. నలభై ఆరో పేరా తర్వాత అదే పాత్ర వర్తమానంలోకి ప్రవేశించింది. డెభై ఎనిమిది, తొంభై ఒకటి, నూట ఆరు, నూట తొమ్మిది పేరాల అనంతరం సంఘటనాసమయం మారింది. నూట ఇరవై ఎనిమిదో పేరా మొదటి వాక్యం పిదప, సంఘటనాస్థలి ఇంకోటి అయింది (నిజానికి ఈ వాక్యం తర్వాత పేరా కూడా మార్చి ఉండాలి). వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ కథని పది అధ్యాయాలుగా రాసి ఉన్నట్లైతే, కథనాన్ని అనుసరించటం మరింత సౌకర్యవంతమయేది.

రెండో కథ, జనవరి 2016 వాకిలి సంచికలో వచ్చిన అరుణ పప్పు కథ- పునర్నిర్మాణం. ఇది ఏడు పేజీల కథ. మొదటి ఏడు పేరాలూ, కథలో రెండు పాత్రల మధ్య సంభాషణ. ఆ పేరాలతో సంభాషణ అంతమయి, ఎనిమిదో పేరానుంచి సంఘటనాస్థలి మారింది.  పన్నెండో పేరా తర్వాత కథలో పాత్ర కారు దిగుతుంది. సంఘటనాస్థలి, సందర్భం వేరవుతుంది. పదిహేడో పేరా తర్వాత, ఇరవయ్యో పేరా తర్వాత సంఘటనాసమయం మారింది.  నలభయ్యోయిదో పేరా తర్వాత, సంఘటనాస్థలి మారింది.  ఏభయ్యో పేరా తర్వాత, కథలో ప్రధానపాత్ర వర్తమానంలోనుంచి గతంలోకి ప్రయాణిస్తుంది. అరవై ఒకటో పేరా తర్వాత, ప్రధానపాత్ర వర్తమానం లోకి తిరిగొస్తుంది. డెబ్బయ్యో పేరా తర్వాత, ఒక పాత్ర తిరుగు ప్రయాణం మొదలవుతుంది. ఈ మార్పులకు అనుగుణంగా, కథ ఎనిమిది అధ్యాయాలుగా ఉండి ఉంటే, కథ చదవటం మరింత సులభతరమయేది.

కొన్ని కథల్లో అధ్యాయవిభజన అవకాశం ఉన్నంతమేరకు జరగటం లేదని నిరూపించటానికి, ఈ రెండు దృష్టాంతాలు సరిపోతాయి.

కథల్లో కనపడుతున్న భాష: 

ఇపుడొస్తున్న తెలుగు కథల్లో, భాష మూడు రకాలుగా వినియోగించబడుతోంది. కొన్ని కథల్లో, కథంతా  ఒకప్పటి తెలుగుకథల్లో విస్తృతంగా ఉపయోగించబడిన వ్యావహారికభాషలో ఉంటోంది. మరికొన్ని కథల్లో కథ మొత్తం ఒక ప్రాంతపు మాండలికాల్తో/యాసతో కనపడుతోంది. ఇంకొన్ని కథల్లో, పాత్రలన్నీ లేదా కొన్ని పాత్రలూ ఒక ప్రాంతపు మాండలికాల్తో/యాసతో మాట్లాడుతుండగా, మిగిలిన కథంతా వ్యావహారికభాషలో రాయబడుతోంది.

వాకిలిలో ఇంతవరకూ వచ్చిన 117 కథల్లో, 97 కథలు పూర్తిగా వ్యావహారికంలో రాయబడ్డాయి. కథ మొత్తం ఒక ప్రాంతపు యాసతో/మాండలికాల్తో, 7 కథలు ఉన్నాయి.  మిగిలిన 13 కథల్లో, సంభాషణలు  ఒక ప్రాంతపు యాసతో/మాండలికాల్తో ఉండగా, తతిమ్మా కథంతా వ్యావహారికంలో ఉంది.

కథలో వాడిన భాష ఎలాంటిదయినా, చదివించగలగటం కథ ప్రాథమిక లక్షణం. కాని, కొన్ని కథల్లో ఉపయోగించిన మాండలికాల అర్థాలు, మిగిలిన ప్రాంతాల పాఠకులకు తెలియక పోవటంతో; కథను పూర్తిగా అర్థం చేసుకోవటంలో కొంత అసౌకర్యం ఏర్పడుతోంది. దీన్ని అధిగమించటానికి ఒకటే మార్గం. అలాంటి కథల చివర, వాటిలో ఉపయోగించబడ్డ మాండలికాలూ, వాటికి అర్థాలూ ఇవ్వటం. కాని, అలాంటి ప్రయత్నమేదీ పైన చెప్పిన  20 కథల విషయంలో జరగలేదు (వాస్తవానికి, ఈ లోపం తెలుగులో వస్తున్న అనేక కథల్లో కొట్టవచ్చినట్లుగా కనపడుతోంది). భవిష్యత్తులో ఆ లోపాన్ని పూరించే ప్రయత్నం చేపడితే, మాండలికాల్తో రాసిన  కథలు సైతం, వాకిలి పాఠకులకి మరింత దగ్గర కాగలవు.

తన కథలో; మిగిలిన ప్రాంతాలవారికి అర్థం తెలియని మాండలికాలు ఏవి? అన్నది అదే కథారచయితకి పూర్తిగా తెలియటానికి అవకాశాలు తక్కువ. వాటిని మిగిలిన ప్రాంతాల కథకులు/లేదా పాఠకుల మాత్రమే పూర్తిగా గుర్తించగలరు. వారితో ఆ పని చేయించి, వాటి అర్థాలను కథకుడి ద్వారా ఇప్పించి, కథ చివర పొందుపర్చాలి.

కథనరీతి:  

వాకిలిలో ఇంతవరకూ వచ్చిన 117 కథల్లో; ఉత్తమపురుష లో రాయబడిన కథలు 64, బహుళ ఉత్తమపురుషలో చెప్పబడిన కథలు 2, ప్రథమపురుషలో వచ్చిన కథలు 51. సాధారణంగా ఉత్తమపురుషలో కథ ‘నేను’ పరంగా నడుస్తుంది.   దాన్ని ‘మేము’ తో కూడా నడపవచ్చు. కాని, అలా నడిచిన కథలేవీ వాకిలిలో రాలేదు. మధ్యమపురుషలో కథ; ‘నువ్వు’ పరంగా కానీ, ‘మీరు’ పరంగా కానీ చెప్పబడుతుంది. ఈ తరహాలో చెప్పబడే కథలు చాలా అరుదు. వాకిలిలో అలాంటి కథలు కూడా ఏవీ రాలేదు. కొందరు కథకులయినా, ఈ రెండు రీతుల్లో కథ రాసే  ప్రయత్నాన్ని చేపడితే బాగుండును అని వాకిలి పాఠకుడుగా నాకు అనిపిస్తోంది.

కథ ప్రారంభం:  

చదువుకోవటానికి కథని ఎన్నుకునే విషయంలో సహాయపడేది దాని ఆరంభం లేదా ఎత్తుగడ. కొన్ని దశాబ్దాల క్రితం తెలుగులో చాలా కథలు ఒక వర్ణనతో ప్రారంభమయ్యేవి. కథలో అంతర్భాగంగా, అనివార్యంగా కనపడే ఆ వర్ణనకీ; కథకీ సంబంధం ఉందా లేదా అనే విషయం పాఠకులు పెద్దగా  పట్టించుకునేవారు కాదు. కాలక్రమేణా ఈ ధోరణి తక్కువయింది. దాంతో           ఎక్కువభాగం తెలుగుకథలు ఇప్పుడు ఒక భావప్రకటనతోనో, భౌతికచర్యతోనో, సంభాషణతోనో మొదలవుతున్నాయి. కథపై, పాఠకుడికి ఉత్కంఠత కలిగించటానికి తద్వారా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాకిలిలో కథలు, ఎన్ని ఏ రకంగా మొదలయ్యాయి అంటే-

భావప్రకటనతో మొదలయిన కథలు 65 (ఉదాహరణ: ఇంత ఉద్వేగాన్ని జీవితంలో ఎప్పుడూ అనుభవించలేదు, నేను. కథ-చరిత్రహీనులు/యాజి/జనవరి 2013). సంభాషణతో ప్రారంభమయిన కథలు 20 (ఉదాహరణ: “ఇవాళ గేమ్ వుంది తెలుసుగా. తొందరగా తయారవు. ఏం తింటావు?” స్కూల్  నుంచి అప్పుడే వచ్చిన క్రిస్  కి గబ గబా చెప్పేస్తోంది సుచిత్ర. కథ-హోమ్ రన్/ కల్పనా రెంటాల/ఫిబ్రవరి 2013). భౌతికచర్యతో ఆరంభించిన కథలు 13 (ఉదాహరణ: కాలేజీ నుంచి వచ్చి ఇంట్లోకి అడుగు పెట్టానో లేదో మా అమ్మ క్రింద కూర్చుని ఉన్నదల్లా లేచి నాకు ఎదురొచ్చి నా బుగ్గలు పుణుకుతూ “అదృష్టవంతురాలివే తల్లీ. మామయ్య నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు” అంది. కథ-అనుబంధం/మండువ రాధ/నవంబర్ 2013).

వర్ణనతో ఎత్తుకోబడిన కథలు 19 (ఉదాహరణ: అప్పుడే వర్షం పడిందేమో ఆకులన్నీ తడితడిగా పచ్చగా మెరుస్తున్నాయ్. వర్షం బరువుకు వాలిన గులాబీ నుండి నీటిచుక్క నేలమీదకు జారుతో౦ది. చూరు నుండి నీళ్లు ధారగా పడుతున్న చప్పుడు చిన్నగా వినిపిస్తోంది. ఉండుండి వీస్తున్న గాలికి మేపల్ ఆకులు మెల్లగా కదులుతున్నాయ్. మేఘాల మాటునున్న సూరీడు ఒక్కో కిరణాన్ని గురిచూసి పంపుతున్నట్లుగా ఏటవాలుగా పడుతోంది నీరెండ. వర్షం వెలిసిన తరువాత మాత్రమే కనిపించే అరుదైన వెలుగుతో మెరిసిపోతోందా ప్రదేశం. కిటికీలోంచి ఆ సౌందర్యాన్ని చూస్తూ టీ తాగుతోంది రాధిక. కథ-వికసించిన పువ్వు/జ్యోతిర్మయి/మార్చ్ 2013).

కథకుల్లో పురుషులెంతమంది? మహిళలెంత మంది?

మొత్తం 117 కథల్లో; 62 కథలు పురుషుల కలంనుంచి జాలువారితే, 55 కథలు మహిళల చేతిలో రూపు దిద్దుకున్నాయి. 2013, 2014 సంవత్సరాల్లో పురుషులు రాసిన 16, 9 కథలకన్నా మహిళలు రాసిన కథలు  ఎక్కువగా అంటే 17, 14 వచ్చాయి. 2015, 2016 సంవత్సరాల్లో ఈ ధోరణి మారి పురుషుల కథలు ఎక్కువయ్యాయి. ఈ సంవత్సరాల్లో పురుషుల కథలు 25, 12 కాగా మహిళలు రాసిన కథలు 16, 8.

ఎవరు ఏ భాష ఎక్కువగా వాడుతున్నారు?

వ్యావహారికం, ఒక ప్రాంతపు యాస/మాండలికాలు కలిపి పురుషులు రాసిన కథలు 6. మహిళలు రాసినవి 7. పూర్తిగా మాండలికం/ఒక ప్రాంతపు యాసలో పురుషులు రాసిన కథలు 05. మహిళలు రాసిన కథలు 2. పురుషులు 51 కథల్ని, మొత్తం కథని వ్యావహారికంలో రాయగా; అదే తరహాలో మహిళలు 46 కథలు రాశారు.

ఎవరు ఏ కథనరీతిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు?

ప్రథమ పురుషలో పురుషులు రాసిన కథలు 31. మహిళలు రాసినవి 20. ఉత్తమ పురుష లో పురుషులు రాసిన కథలు 31. మహిళలు రాసినవి 35. వీటిలో బహుళ ఉత్తమపురుషలో రాసిన కథలు 2. వీటిని ఒక్కొక్కటి చొప్పున పురుషకథకులూ, మహిళా కథకులూ రాశారు.

ఎవరు కథని ఎలా ఆరంభిస్తున్నారు?

పురుషులు రాసిన కథలు భావప్రకటనతో ఆరంభమైనవి 30. ఈ ప్రారంభంతో మహిళలు రాసిన కథలు 35. పురుషులు రాసిన కథల్లో  భౌతిక చర్యతో ప్రారంభమయిన కథలు 7. ఈ ధోరణిలో మహిళలు రాసిన కథలు 6.  పురుషులు రాసిన కథల్లో వర్ణనతో మొదలయినవి 13. ఇదే పద్ధతిలో మహిళలు రాసిన కథలు 6. పురుషులు రాసిన కథలు సంభాషణతో ఆరంభమయినవి 12. ఇదే విధానంలో మహిళలు రాసిన కథలు 8.

విరామచిహ్నాల వాడకం:

ఒక కథని సౌకర్యవంతంగా చదివించే విషయంలో, విరామచిహ్నాలది అత్యంతప్రధానమయిన పాత్ర.  వాకిలిలో కొన్ని కథల్లో విరామచిహ్నాలు వాడిన విధానం ఇలా ఉంది.

కథ పేరు/పునర్నిర్మాణం/అరుణ పప్పు/జనవరి 2016:

కథలో పాత్రలు పరస్పరం పిలుచుకున్నపుడు, పాత్ర పేరు తర్వాత ఆశ్చర్యార్థకం ఉంచటం ఒక పద్ధతి. కాని 28, 42 పేరాల్లో పిలుపు తర్వాత కామా ఉంటే, 66 పేరాలో పిలుపు తర్వాత మూడు చుక్కలున్నాయి. ఆశ్చర్యార్థకం అవసరం లేదని రచయిత భావిస్తే, మూడు చోట్లా కామాయే ఉండాలి లేదా మూడు చుక్కలుండాలి. (పిలుపు పక్కన కామానో, మూడు చుక్కలో ఉండటం ఈ కథలోనే కాదు. మిగిలిన కథల్లో సైతం కనపడుతోంది.)

కథ రెండో పేరాలో నాలుగు సంపూర్ణవాక్యాలు ఉన్నాయి. వాటి చివర ఉండవలసిన ఫుల్ స్టాప్, ఒక వాక్యం చివర మాత్రమే ఉంది. మిగిలిన మూడు వాక్యాల చివర ఎలిప్సిస్ అనబడే మూడు చుక్కలు ఉన్నాయి.

విరామచిహ్నాల్లో ఫుల్ స్టాప్ రూపంలో ఒక చుక్కా, ఎలిప్సిస్ రూపంలో మూడు చుక్కలు మాత్రమే ఉన్నాయి. ఒక పాత్ర కానీ, కథకుడు కానీ చెప్పదలుచుకున్న విషయాన్ని పూర్తిగా చెప్పలేని సందర్భాల్లో మాత్రమే ఎలిప్సిస్ వాడాలి. ఒక వాక్యాన్ని ఆపి, కొనసాగించదల్చుకున్నపుడు కామా వాడాలి. కాని, కథలో అనేక చోట్ల రెండు చుక్కలూ, మూడు చుక్కలూ అవసరమైన దానికన్నా ఎక్కువ కనపడ్డాయి.

పదిహేడో పేరా ఒక సంభాషణ. అది ఒక పిలుపుతో అంతమయింది. పిలుపు చివర ఆశ్చర్యార్థకం బదులు నాలుగు చుక్కలు ఉన్నాయి. డెబ్భయ్యారో పేరాలో, ఒక పాత్ర మరో పాత్రని ఒక ప్రశ్న అడుగుతుంది. అడిగిందావిడ అనే పదంతో ఆ వాక్యం అంతమవుతుంది. అయినా ఆ ప్రశ్న చివర ప్రశ్నార్థకం లేదు.

సంభాషణని ఇన్వర్టెడ్ కామాల్లో ఉంచడం విధిగా ఒక పద్ధతి. అలా ఉంచిన సంభాషణ చివరి పదం తర్వాత ఆశ్చర్యార్థకం కానీ, ప్రశ్నార్థకం కానీ వాడవలసిన అవసరం లేకపోతే అవసరాన్ని బట్టి కామా లేదా ఫుల్ స్టాప్ మాత్రమే వాడాలి. కాని, సంభాషణలున్న పద్దెనిమిదో పేరా తుది పదం తర్వాత రెండు చుక్కలూ, ముప్పయ్యయిదో పేరా చివరి పదం  తర్వాత మూడు చుక్కలూ, ఏభైనాలుగో పేరా ఆఖరి పదం తర్వాత నాలుగు చుక్కలున్నాయి.

ఒక పాత్ర, మరో పాత్రతో జరిపిన సంభాషణలో; ఇంకో పాత్ర మాట్లాడిన మాటలు యథాతథంగా ఉటంకించినపుడు మాత్రమే, ఆ మాటలని సింగిల్ కోట్స్ లో ఉంచాలి. దీనికి పూర్తి భిన్నంగా; ఒక కథలో(రాజా వచ్చేశాడు-మూలకథ/అళగిరి స్వామి-అనువాదం/రాజేంద్రకుమార్ దేవరపల్లి-ఫిబ్రవరి 2013); ఒక పేరాలో తప్ప, మిగిలిన చోట్ల ఉన్న అసలు సంభాషణలే, ఇన్వర్టెడ్ కామాల్లో బదులు సింగిల్ కోట్స్ లో ఉన్నాయి. అదే కథలో కొన్ని సంభాషణల ఆరంభంలోనూ ఇన్వర్టెడ్ కామాల్లో మొదటి భాగం బదులు, రెండో భాగం ఉంది. ఇది ముద్రారాక్షసమో, మరే ఇతర కారణం వల్ల దొర్లిన దోషమో తెలీదు.

ఒక కథని స్వగతం రూపంలో అయిదు పాత్రలు చెప్పాయి (నాలుగు స్తంభాలాట-మండువ రాధ-మే 2016). ఆడపావురం, పిల్లపావురం కథనాల్లో మొదటి పేరా, ఇన్వర్టెడ్ కామాల్లో మొదటి భాగంతో మొదలయితే, చివరి పేరా ఇన్వర్టెడ్ కామాల్లో రెండో భాగంతో అంతమయింది. తిక్కపావురం కథనంలో మొదటి పేరా ఇన్వర్టెడ్ కామాల్లో మొదటి భాగంతో మొదలయితే. ఆఖరి పేరా ఆశ్చర్యార్థకంతో/ప్రశ్నార్థకంతో అంతమయింది. మగపావురం  కథనంలో రెండు పేరాలుంటే, రెండూ ఇన్వర్టెడ్ కామాలతో మొదలయి, అంతమయాయి. గోపురం పావురం కథనంలో మొదటి పేరాకి ఇన్వర్టెడ్ కామాల్లో మొదటి భాగం ఉంటే, చివర ఏమీ లేదు. రెండు నుంచి పదిహేడో పేరా చివర వరకూ, ఇరవై మూడు నుంచి ఇరవై అయిదో పేరా వరకు ఎలాంటి ఇన్వర్టెడ్ కామాలు లేవు. చిత్రంగా పద్దెనిమిది నుంచి ఇరవై రెండో పేరా వరకూ; అన్ని పేరాలూ ఇన్వర్టెడ్ కామాతో మొదలయి, అంతమయాయి. ఆడపావురం, పిల్లపావురం చెప్పిన కథలో సంభాషణలు సింగిల్ కోట్స్ లో ఉండగా, గోపురం పావురం వినిపించిన కథలో సంభాషణలు ఇన్వర్టెడ్ కామాల్లో ఉన్నాయి.

వీటన్నిటి వలన, అయిదు పాత్రల కథనానికి ఇన్వర్టెడ్ కామాలు వాడిన పద్ధతి, ఈ క్రింద ఉటంకించిన ప్రమాణానికి లోబడి లేదు అనిపిస్తోంది.

“The convention is to give opening quotation marks to the first and each subsequent paragraph, using closing quotation marks only for the final paragraph of the question.”

రెండు అంతకు మించి భావాలని ఒక వాక్యంలో ఇమడ్చాలనుకున్నపుడు సెమికోలన్ వాడాలి. అలా కాకుండా అన్ని చోట్లా కామాలే వాడితే, ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవటం కష్టం అవుతుంది. కామా స్వల్పవిరామాన్ని తెలిపితే, ఫుల్ స్టాప్ పూర్తి విరామాన్ని తెలుపుతుంది. సెమికోలన్ ది ఈ రెండిటి మధ్య స్థాయి. కొన్ని కథల్లో ఉన్న వాక్యాల్లో సెమికోలన్ వాడవలసిన అవసరం ఉన్నా, వాడని సందర్భాలు ఉన్నాయి. ఈ ఉదాహరణని చూడండి.

            ప్రకృతిని, పచ్చటి పరిసరాలను గమనించడం, అందమైన దృశ్యాలను, స్థలాలను నా కెమెరాలో బంధించడంఇంకా ఎంతోమందిలో చూడాలన్న తపన కలిగేలా వాటి గురించి రాయడం…ఇదంతా నా వృత్తి.”

(పునర్నిర్మాణం/రచయిత అరుణ పప్పు/ జనవరి 2016).

            ఈ వాక్యంలో ఉన్న భావవ్యక్తీకరణలో మూడు చర్యలున్నాయి. ఈ మూడు చర్యల మధ్య కామాలతో, చుక్కలతో విరామం ఇవ్వకుండా, ఒక చోట సెమికోలన్ తో మరింత పెద్ద విరామం ఇచ్చినట్లయితే అదే వాక్యం ఇలా మరింత అర్థవంతంగా ఉండి, అవగాహన ఇంకా సులభమయేది.

“ప్రకృతిని, పచ్చటి పరిసరాలను గమనించడం; అందమైన దృశ్యాలను, స్థలాలను నా కెమెరాలో బంధించడం, ఇంకా ఎంతోమందిలో చూడాలన్న తపన కలిగేలా వాటి గురించి రాయడం, ఇదంతా నా వృత్తి.”    

ఇప్పుడొస్తున్న కథల్లో కొంతమంది కథయితలు (ఈ పదం రచయితలకు పర్యాయ పదం. శబ్దార్థ చంద్రిక- 283 పేజీ) పెద్దపెద్ద వాక్యాలవైపు మొగ్గు చూపడంలేదు. కామాల వాడకం తగ్గించడానికి, అవకాశం ఉన్నంతవరకూ చిన్నచిన్న వాక్యాలే రాస్తున్నారు. సరయిన విరామచిహ్నాలు వాడి, అర్థాన్ని సరిగా అందించగలిగితే వాక్యం పెద్దగా ఉన్నా, అభ్యంతరకరం కాదు. దానికి భిన్నంగా ఉన్న ఈ పెద్ద వాక్యం చూడండి.

“అప్పుడు అత్తగారిని ఏహ్యంగా చూశాను కాని తానూ ఓ నిస్సహాయురాలేగా పాపం ఏం చేయగలదు సానుభూతి చూపించడం తప్ప” ( కృతి/మండువ రాధ/జనవరి 2016).

అందుబాటులో ఉన్న విరామచిహ్నాలని సముచితంగా ఉపయోగించి పై వాక్యాన్ని ఈ విధంగా రాసి ఉండవచ్చు. కాని, అలా జరగలేదు.

“అప్పుడు అత్తగారిని ఏహ్యంగా చూశాను.  కాని, తనూ ఓ నిస్సహాయురాలేగా! పాపం ఏం చేయగలదు? సానుభూతి చూపించడం తప్ప.”

వాక్యనిర్మాణం:

కథని చదివించగలగడంలో వాక్యనిర్మాణానిది చాలా ముఖ్యమైన పాత్ర.

కథకుడి మనసులో భావం ఎంత క్లిష్టమయినదయినా, అది సులభంగా పాఠకుడికి చేరాలంటే సరయిన వాక్యనిర్మాణం, పదాల పొందిక ప్రధానం.  దానికి వ్యతిరేకంగా; వాక్యనిర్మాణమే క్లిష్టంగా ఉంటే సరళమయిన భావం కూడా పాఠకుడికి చేరదు.

చిన్నచిన్న వాక్యాలు చదవడానికి సౌకర్యంగా అనిపిస్తాయి. కారణం, వాటిని చదవటానికి పట్టే సమయం చాలా తక్కువ. చదవటం పూర్తికాగానే ఆ వాక్యం అందించిన భావాన్ని తన జ్ఞాపకంలో నిక్షిప్తం చేసుకోవటానికీ,  మరో వాక్యంలోకి పాఠకుడు సత్వరం వెళ్లటానికీ అవి దోహదిస్తాయి. పెద్ద వాక్యాల్లో ఆ సౌలభ్యం అంత సులభంగా లభించదు. ఉదాహరణకి ఈ వాక్యం చూడండి. .

“కొన్నాళ్ళుగా ఆయన నన్ను విస్మరించి ఆమె మందిరంలోనే ఉంటూ నా దగ్గరకి రాకపోవడం వల్ల నేను దు:ఖిస్తున్నానని భావించి పెద్దరికాన్ని నెత్తిన వేసుకుని నా గురువుగారే పూనుకుని ఆ గ్రంథం రాశారని ఎవరికి తెలుస్తుంది?” (కృతి/మండువ రాధ/జనవరి 2016).

నిజానికి ఈ వాక్యాన్ని, ఇంకా చిన్నచిన్న వాక్యాలుగా రాయవచ్చు. రాసి, భావాన్ని మరింత సులభంగా పఠితకు అందించి ఉండవచ్చు. ఎలాగంటే-

 ”ఆయన నన్ను విస్మరించి కొన్నాళ్లుగా ఆమె మందిరంలోనే ఉంటున్నారు. ఆయన నా దగ్గరకి రాకపోవడం వల్ల నేను దు:ఖిస్తున్నానని గ్రహించి, పెద్దరికాన్ని నెత్తిన వేసుకుని నా గురువుగారే పూనుకుని ఆ గ్రంథం రాసి ఉంటారు. కాని, ఆ నిజం ఎవరికి తెలుస్తుంది?”

ఒక పాత్ర ఒక పని చేసి ఉండటం, చేస్తూ ఉండటం, చేస్తుంది అని అనుకోవటంలో చాలా తేడా ఉంది. ఈ తేడాని గ్రహించకుండా కొందరు కథకులు ఆ చర్యని వర్ణిస్తారు. దాంతో పాఠకుడి మనసులో కొంత అయోమయం ఏర్పడుతుంది. ఈ ఉదాహరణ చూడండి.

“ఒక కెమికల్ ఫాక్టరీలో పని చేస్తూ, ఇంటరు చదువుతున్న కూతురుతో నెట్టుకొస్తుంది.” (చేదుపూలు/మెహెర్/ఫిబ్రవరి 2016).

కథనం ప్రకారం ఈ చర్య ఇంకా పూర్తి కాలేదు. జరుగుతూనే ఉంది. అలాంటప్పుడు, పై వాక్యం ఇలా ఉంటే ఇంకా బాగుండేది.

“ఒక కెమికల్ ఫాక్టరీలో పని చేస్తూ, ఇంటరు చదువుతున్న కూతురుతో నెట్టుకొస్తోంది.”

కొన్ని వాక్యాల్లో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ పదాలు ఉంటాయి. ఈ వాక్యం దానికి ఒక నిదర్శనం.             …సతీత్వమూ పటాపంచలుగా, చెల్లాచెదురుగా విరిగి పడిపోయింది.” (కృతి/మండువ రాధ/జనవరి 2016).

ఇక్కడ రచయిత భావం, సతీత్వం విరిగి పడిపోయిందని, చెల్లాచెదురయిందని. పటాపంచలయిందని. పటాపంచలు అంటే అర్థం చెల్లాచెదరులు (శబ్దార్థ చంద్రిక-పేజీ 814). ఇక చెల్లాచెదరంటే మిక్కిలి చెదరినది (శబ్దార్థ చంద్రిక-పేజీ 513). ఇంచుమించుగా ఈ రెండు పదాల అర్థం ఒకటే. చెప్పదలుచుకున్న భావం ఒకటే అయినపుడు, ఒకే అర్థం వచ్చే రెండు పదాలను వాక్యంలో ప్రయోగించటం వలన అదనపు ప్రయోజనం ఏమీ సమకూరదు. ఇది దృష్టిలో పెట్టుకుంటే, ఈ వాక్యాన్ని ఈ రెండు రకాల్లో ఏదో ఒక రకంగా రాసి ఉండవచ్చును.

“సతీత్వం విరిగి పటాపంచలుగా పడిపోయింది.”  లేదా “సతీత్వం విరిగి చెల్లాచెదరుగా పడిపోయింది.”  

అలాంటిదే అదే కథలో ఉన్నసంఘర్షణ పడీ పడీ మనసు జీవాన్ని కోల్పోయి మరణించింది. అనే వాక్యం కూడా. మనసు జీవాన్ని కోల్పోవటమంటేనే మరణించడం. అందువల్ల మనసు జీవాన్ని కోల్పోయిందన్నా, కాదూ నిర్జీవమయిందన్నా, లేదా మరణించిందన్నా సరిపోయి ఉండేది.

ఒక వాక్యంలో ఒక బహువచనం ఒక పనికి కారణభూతమయింది. అదే వాక్యంలో మరో ఏకవచనం అదే పనికి దారితీసింది. ఆ పని ఫలితాన్ని చెప్పేప్పుడు ఏకవచనంతో అంతం చెయ్యాలా? బహువచనంతో అంతం చెయ్యాలా అనే సమస్య ఏర్పడుతుంది.

ఈ సమస్యనుంచి బయటికి రావాలంటే ఒకటే మార్గం. పనికి కారణమయిన రెండిటినీ, ఏకవచనమో బహువచనమో చెయ్యటం. ఈ వాక్యం పరిశీలించండి.

            కూలీల కోలాహలం, ట్రాక్టరు చప్పుళ్లు కొండ మీది నిశ్శబ్దాన్ని అప్పుడప్పుడూ పగలగొడుతున్నాయి ”(పునర్నిర్మాణం/అరుణ పప్పు/జనవరి 2016).

ఇక్కడ కూలీల కోలాహలం ఏకవచనం. ట్రాక్టరు చప్పుళ్లు బహువచనం. పగలగొడుతున్నాయి బహువచనానికి వర్తింపచేయాల్సినది. అది కూలీల కోలాహలం అనే ఏకవచనానికి ఇమడదు. పై వాక్యాన్ని ఈ రెండిట్లో ఏదో ఒక రకంగా రాసి ఉంటే, అన్వయకాఠిన్యత ఏర్పడి ఉండేది కాదు.

            “కూలీల కోలాహలం, ట్రాక్టర్ల చప్పుడూ కొండ మీది నిశ్శబ్దాన్ని అప్పుడప్పుడూ పగలగొడుతున్నాయి. కూలీల కోలాహలాలూ , ట్రాక్టర్ల  చప్పుళ్లూ కొండ మీది నిశ్శబ్దాన్ని అప్పుడప్పుడూ పగలగొడుతున్నాయి.” కొన్ని వాక్యాల్లో పదం ఉండగూడని చోట ఉంటే, రావాల్సిన అర్థం రాదు. కాగా, ఒక్కోసారి అది విపరీతార్థాన్ని కూడా ఇవ్వవచ్చు. ఈ వాక్యాన్ని చూడండి.     

            బుద్ధుడి శరీరంలోని ఎముకనొకదాన్ని భరిణలో పెట్టి బొజ్జన్నకొండ స్తూపంలో భద్రపరిచారని, దాంతో పాటు ఎన్నో ఏళ్ల కిందటి మట్టిపాత్రలు దొరికాయని చెబుతోంది అక్కడ భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పెచ్చులూడుతున్న బోర్డు” (పునర్నిర్మాణం/అరుణ పప్పు/జనవరి 2016).

ఇక్కడ అసలు ఉద్దేశం భారతప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డు, పెచ్చులూడిపోయిందని. కాని, వాక్యం ఆ అర్థం ఇవ్వటం లేదు. భారతప్రభుత్వం పెచ్చులూడిపోయిన బోర్డు ఏర్పాటు చేసిందన్న అర్థం ధ్వనిస్తోంది. అదే  వాక్యాన్ని ఈ రకంగా రాసి ఉంటే మరింత అర్థవంతంగా ఉండేది.

            బుద్ధుడి శరీరంలోని ఎముకనొకదాన్ని భరిణలో పెట్టి బొజ్జన్నకొండ స్తూపంలో భద్రపరిచారని, ఎన్నో ఏళ్ల కిందటి మట్టిపాత్రలు దాంతో పాటు దొరికాయని చెబుతోంది అక్కడ భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డు. ఆ బోర్డు కూడా పెచ్చులూడిపోయి ఉంది.”

            ఈ సందర్భంగా చెప్పాల్సిన విషయం మరొకటి ఉంది. భరిణ అనే పదం శబ్దార్థచంద్రికలో కానీ, శబ్దరత్నాకరంలో కానీ లేదు. దీన్ని బరణి అని రాయాలి. బరణి అంటే కాటుక మొదలగునవి యుంచుకొనెడు పాత్రము, కరాటము (శబ్దార్థ చంద్రిక-పేజీ 949).

చివరగా ఈ వాక్యం కూడా చూడండి.

            “నా ఆలోచనలు తనదాకా వెళ్లినట్టు, నా మోకాలిమీద వారిస్తున్నట్టుగా తట్టింది ప్రతిమ.”

ఇదే వాక్యం ఇలా ఉంటే మరింత అర్థవంతంగా ఉండేది కదా?    

            “నా ఆలోచనలు తనదాకా వెళ్లినట్టుంది. వారిస్తున్నట్టుగా నా మోకాలిమీద తట్టింది ప్రతిమ.”

సంభాషణా శైలి:

కథల్లో సంభాషణలని సాధారణంగా మూడు రకాలుగా రాస్తుంటాము. ఒక పద్ధతి, ఒకటికి మించి పాత్రల సంభాషణని ఒకే పేరాగా రాయటం. రెండోది, ప్రతి పాత్ర సంభాషణనూ విడి పేరాల్లో రాయటం. మూడో పద్ధతి, కథనంతో సంభాషణలని కలిపి రాయటం.

పై నేపథ్యంలో 2016 సంవత్సరంలో వచ్చిన 20 కథలని (ఒక అనువాదకథని మినహాయించి) సంభాషణల ధోరణి ఆధారంగా విశ్లేషిస్తే ఫలితం ఇది.

అసలు సంభాషణలు లేని కథలు=3; సంభాషణలు కథనంతో కలిసిన కథలు=2; సంభాషణలను విడి పేరాల్లో రాసిన కథలు=14. ఒక కథలో, మొదటి నాలుగుపేజీల్లో సంభాషణలే లేవు. చివరిపేజీలో మాత్రం సంభాషణలకు విడిగా పేరాలున్నాయి.

పై మూడు పద్ధతుల్లో ఏ పద్ధతిలో రాయటం అనేది సరైనది అన్న ప్రశ్నకు జవాబు చెప్పటం కష్టం. కాని, చదవటానికి ఏది సౌకర్యవంతంగా ఉంటుంది అనేది చెప్పవచ్చు. కథనంతో కలిపి, ఒక కథలో ఒకే పేరాగా రాయబడిన సంభాషణలని మొదట చూసి; దాన్నే ఉదాహరణగా తీసుకుని అందులో సంభాషణలని విడిగా రాసిన ప్పుడు ఎలా ఉంటుందో చూడండి. నేను చెప్పాలనుకున్నది, చెప్పకుండానే మీకు అవగతమవుతుంది.

ఉదాహరణ 01: (కథ-చెదరిన ప్రతిబింబం/క్రిష్ణవేణి/ఫిబ్రవరి 2016)

“హలో రాధికా, రేపటి డిన్నర్ మా ఇంట్లోనే అని గుర్తుందిగా?”  ప్రతిమకి గుర్తు చేశాను. ‘వాట్ ఈజ్ యువర్ పాయిసన్!’ అని నిన్ను అడగక్కరలేదుగా! వోడ్కా, ఆరెంజ్ జ్యూసేనా?” నిన్న సాయంత్రం రేణుక ఫోన్. ఈ మధ్య ఇంగ్లీష్ తెగ వాడుతోందే! కాక్‌టెయిల్స్ గురించి కూడా బట్టీ పట్టినట్టుంది.నిజం చెప్పాలంటే, ఈ నెలవారీ డిన్నర్ల ఏర్పాటు గురించి ఆఫీసు పనుల్లో పడి మరిచేపోయాను. అలా అని ఒప్పుకోడానికి సిగ్గేసి, “ఆ, గుర్తుందిలే. ఏదన్నా వండి తీసుకు రమ్మన్నావా?” ఫార్మాలిటీ పూర్తి చేస్తూ అడిగాను.“నిన్ను నువ్వు తెచ్చుకో, చాలు. వండడానికి రామూ ఉన్నాడు.”- రక్షించింది. మా ఆయన విక్రమ్ అయితే,”మనమే వంటకాలు పట్టికెళ్తే, మరి వాళ్ళింట్లో డిన్నరేమిటింక! నా మొహం.” అని విసుక్కుంటాడు.ప్రతిమకి ఫోన్ చేసాను.“మూడు రోజుల తరువాత రేణుక పుట్టినరోజు. మనందరికీ ఆఫీసుంటుంది కదా అని, పనిలో పనిగా ఆదివారమే పిలిచిందంతే.“ అంది. నాకున్న మతిమరపుతో, “ఓహో, తన పుట్టినరోజా!”-అనబోయి, నాలుక్కరచుకుని,“గిఫ్టేం కొంటున్నావు?” అడిగాను.“బాబోయ్, తనకి గిఫ్టు కొనడమా! కిందటిసారి నేను సిల్కు చీర కొన్నానా? ఎంత శ్రద్ధగా ఎంచి మరీ కొన్నాను! బాగుందని కానీ థేంక్సు చెప్పడం కానీ లేకపోగా, ఈనాటివరకూ దాని ఊసే ఎత్తలేదు. తనకి ఆ మర్యాదలు తెలిస్తే కదా? ఇంటికి పనికొచ్చే వస్తువేదో తీసుకెళ్తే సరిపోతుంది. నువ్వూ అలాంటిదే ఏదో కొనియ్యి.”- సలహా పడేసింది.

ఉదాహరణ 02: (ఉదాహరణ 1 ని మార్చి రాసినది)

“హలో రాధికా! రేపటి డిన్నర్ మా ఇంట్లోనే అని గుర్తుందిగా?” ప్రతిమకి గుర్తు చేశాను.

‘వాట్ ఈజ్ యువర్ పాయిసన్!’ అని నిన్ను అడగక్కరలేదుగా! వోడ్కా, ఆరెంజ్ జ్యూసేనా?” నిన్న సాయంత్రం రేణుక ఫోన్.

ఈ మధ్య ఇంగ్లీష్ తెగ వాడుతోందే! కాక్‌టెయిల్స్ గురించి కూడా బట్టీ పట్టినట్టుంది. నిజం చెప్పాలంటే, ఈ నెలవారీ డిన్నర్ల ఏర్పాటు గురించి ఆఫీసు పనుల్లో పడి మరిచేపోయాను. అలా అని ఒప్పుకోడానికి సిగ్గేసి, “ఆ, గుర్తుందిలే. ఏదన్నా వండి తీసుకు రమ్మన్నావా?” ఫార్మాలిటీ పూర్తి చేస్తూ అడిగాను.

“నిన్ను నువ్వు తెచ్చుకో.  చాలు. వండడానికి రామూ ఉన్నాడు,”

-రక్షించింది. మా ఆయన విక్రమ్ అయితే, “మనమే వంటకాలు పట్టికెళ్తే, మరి వాళ్ళింట్లో డిన్నరేమిటింక! నా మొహం.” అని విసుక్కుంటాడు. ప్రతిమకి ఫోన్ చేసాను.

“మూడు రోజుల తరువాత రేణుక పుట్టినరోజు. మనందరికీ ఆఫీసుంటుంది కదా అని, పనిలో పనిగా ఆదివారమే పిలిచిందంతే,“ అంది.

నాకున్న మతిమరపుతో, “ఓహో, తన పుట్టినరోజా!” అనబోయి, నాలుక్కరచుకుని,“గిఫ్టేం కొంటున్నావు?” అడిగాను.

“బాబోయ్! తనకి గిఫ్టు కొనడమా! కిందటిసారి నేను సిల్కు చీర కొన్నానా? ఎంత శ్రద్ధగా ఎంచి మరీ కొన్నాను! బాగుందని కానీ, థేంక్సు చెప్పడం కానీ లేకపోగా; ఈనాటి వరకూ దాని ఊసే ఎత్తలేదు. తనకి ఆ మర్యాదలు తెలిస్తే కదా? ఇంటికి పనికొచ్చే వస్తువేదో తీసుకెళ్తే సరిపోతుంది. నువ్వూ అలాంటిదే ఏదో కొనియ్యి,” సలహా పడేసింది.

అసలు కథలో ఉన్న పంక్తుల బదులు, మార్చి రాసిన దాంట్లో నాలుగు పంక్తులు ఎక్కువ ఉన్నాయి. ఏడు పేరాలూ పెరిగాయి. కథ చదవటంలో పెరిగిన సౌలభ్యంతో పోలిస్తే, ఇవి పట్టించుకోదగినవి కావు.

కథల్లో పేరాలు:

తరచుగా తెలుగు కథలని చదువుతున్న నన్ను, కొన్ని కథల్లో ఉన్న పెద్దపెద్ద పేరాలు ఇబ్బంది పెడుతున్నాయి. వాటితో పోలిస్తే, చిన్నచిన్న వాక్యాలూ, పేరాలు ఉన్న కథలు తక్కువ కష్టపెడుతున్నాయి. దీనికి నేననుకునే కారణం; చదివే వేగాన్ని పెద్ద పేరాలు తగ్గించటం, చిన్న పేరాలు పెంచటం. వేగం మరీ తగ్గినా ఇబ్బందే, పెరిగినా ఇబ్బందే. పాఠకుడిగా నా సౌకర్యాన్ని పక్కన పెడితే, అసలు పేరాగ్రాఫు అంటే ఏవిటి? అనేది చూద్దాం.

-Paragraphs are comprised of sentences, but not random sentences. A paragraph is a group of sentences organised around a central topic. In fact, the cardinal principle of paragraph writing is to focus on one idea. A solidly written paragraph takes its readers on a clear path, without detours.

ఒక అభిప్రాయాన్ని కలిగించే, లేదా ఒక భావాన్ని వ్యక్తీకరించటం మీద దృష్టి కేంద్రీకరించే వాక్యాలు ఒక పేరాగా రూపు దిద్దుకోవాలి. ఒకటికి మించి అభిప్రాయాన్ని ప్రతిఫలించే వాక్యాలు ఒకే పేరాలో ఉండకూడదు. ఒకే భావాన్ని ప్రతిబింబించే వాక్యాలు ఒకటికి మించి పేరాలుగా కనపడకూడదు. అందుకే, ఒక పాత్ర తన మాటల ద్వారా చెప్పదలుచుకున్న తన ఆలోచనని/ఆలోచనలని ఒక పేరాగా ఉంచాలనటం.

ఈ ప్రమాణాన్ని దృష్టిలో ఉంచుకుని; అయిదున్నర పేజీలున్న; నాక్కూడా…/కాశీభట్ల వేణుగోపాల్/ఏప్రిల్ 2016 కథలో పేరాలని పునర్విభజన చేస్తే, 79 పేరాలు కాస్తా 53 కి పడిపోయాయి.

ముక్తాయింపు:

చదివించగలగటం కథకుండాల్సిన ప్రాథమికలక్షణం. ఈ పరిశీలన కొరకు నేను ఎన్నుకున్న అంశాలన్నీ ఆ లక్ష్యసాధనకు  దోహదించేవే.

కథలు ఈ అంశాల మీదే రాస్తున్నారు, ఆ అంశాల మీద రాయటం లేదు అనటం; వాటి మీదే రాయాలి, వీటిమీద రాయకూడదు అని నిబంధనలు విధించటం; నా దృష్టిలో రచయిత పరిధిలోకి చొరబడకూడని విధంగా చొచ్చుకుపోవటం. కథ ఏ ఇతివృత్తం మీద రాశారు అనేదాని కన్నా, దేనిమీద రాసిన కథయినా నన్ను చదివించగలిగిందా లేదా అన్నదే నాకు ముఖ్యం. వాకిలిలో కథలు స్పృశించిన ఇతివృత్తాల మీద, నేనేమీ మాట్లాడకపోవటానికి అదే కారణం.

**** (*) ****


Editors’ Note

ఇప్పటివరకూ వాకిలిలో వచ్చిన కథలపై ఒక విశ్లేషణ ఈ వ్యాసం. పదాల వాడకం, వాక్య నిర్మాణం, పేరాల, అధ్యాయాల విభజన, కథకుడి గొంతుకల్లో వ్యత్యాసం, ఇంకా అనేక అంశాలను ప్రస్తావిస్తూ సాగిన అతిధి వ్యాసం. ఇందులో పాఠకులకి ఆసక్తి కలిగించేవి, రచయితలకి సహాయపడేవి, ఎడిటర్లుగా మేము నేర్చుకుని తీరవలసినవి చాలా విషయాలే ఉన్నాయి. ఈ అంశాలపై పాఠకుల/రచయితల అభిప్రాయాలు, మరిన్ని మంచి చర్చలు జరగాలని ఆశిస్తూ…