ముఖాముఖం

“నేర్చుకుని చెయ్యము, చేసేటప్పుడు నేర్చుకుంటాం.” – పింగళి చైతన్య

ఆగస్ట్ 2016

కొందరు పరిచయం అవగానే ఆత్మీయులుగా అనిపిస్తారు.  కొందరి ఆత్మీయత పొందడానికి పరిచయం అవసరం లేదు. నాకు చైతన్య స్నేహితురాలు కాక ముందే తన కథల ద్వారా ఆత్మీయురాలైంది. తను రాసిన ‘చిట్టగాంగ్ వీరవనితలు’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు రావడం, తనను ఇలా పరిచయం చేసే అవకాశం దక్కడం సంతోషాన్ని కలిగిస్తుంది.

మనకు పెద్దగా తెలియని ఒక స్వాతంత్ర్య పోరాటాన్ని ఈ పుస్తకం ద్వారా చైతన్య పరిచయం చేసింది.  ఎనబై ఏళ్ల క్రితం మనదేశంలో ఒక భాగంగా ఉండి, తరువాత విభజనలో కోల్పోయిన చిట్టగాంగ్ అనే ప్రాంతంలో జరిగిన సమరాన్ని కళ్ళకు కట్టినట్లు వర్ణించడమే కాకుండా, విప్లవ వీరవనితలను మన ముందు సజీవంగా నిలబెట్టింది. ప్రీతీలత, సావిత్రిబాయి, కల్పన, ప్రేమలత, ఇందుమతి ఇలా ఒక్కొక్కరినీ తను పరిచయం చేసిన తీరు మనకి ఆడవారి పట్ల మరింత గౌరవం పెరిగెట్టు చేస్తుంది.  “మనం ఆడవాళ్ళం..” ఈ మాటతో తన అంకిత ప్రకటన చేసిన చైతన్య, డిల్లీ లో నిర్భయ సంఘటన తరవాత ఆడవారి పరిస్ధితి గురించి వచ్చిన రకరకాల స్పందనలకు సమాధానంగా ఈ పుస్తకం వచ్చిందని చెప్పింది.

ఇక పింగళి చైతన్య గురించి చెప్పాలంటే మన జాతీయ జెండాను  రూపొందించిన పింగళివెంకన్న మనవరాలినని చెప్పుకోదు. దశరథరాం కుతురిననో, బాలుకి సహచరిగానో లేక నోర్బుకి తల్లిగానో అసలు పరిచయం చేసుకోదు. తను, తనే!

సరదాగా మొదలుపెట్టినా, ఇంటర్వ్యూ పూర్తయ్యాక నిజంగానే తనని ఇంకాస్త ఎక్కువగా తెలుసుకున్నాను. ఆ క్రమంలో జరిపిన సంభాషణే ఈ క్రింద పేర్చాను.

- అపర్ణ తోట


‘చిట్టగాంగ్ విప్లవ వనితలు’ పుస్తకం రాయడం ఎప్పుడు మొదలు పెట్టావు?

నాకు ఇరవై ఆరేళ్ళప్పుడు. అంటే 2010 లో.  పూర్తిచేసేసరికి మూడేళ్ళు గడిచిపోయింది. పబ్లిష్ అయి రెండేళ్ళు దాటిపోయింది.

సరే, అసలు ఇటువంటి పుస్తకం రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

ప్రపంచ విప్లవ చరిత్రలో ఆడవారి కోణం నుంచి వచ్చిన పుస్తకాలు చాల తక్కువ. అందులోనూ చిట్టగాంగ్ పోరాటం గురించి పెద్దగా సమాచారం లేదు. ఆ రోజుల్లో ఆడవాళ్ళు ఇటువంటి ఉద్యమాల్లో పాల్గోవడం ఊహించలేము. మరి దానిని డాక్యుమెంట్ చెయ్యాలి. అందుబాటులో లేని, చెల్లాచెదురుగా పడి ఉన్న సమాచారాన్ని ఎలాగైనా తెలుగులోకి తీసుకురావాలి. ఇదే ఆలోచనకు నాంది.  అదే సమయంలో నిర్భయ సంఘటన జరిగింది. సంఘటన ఎంత చిత్రహింసకు గురిచేసిందో, సంఘటన గురించి విన్న అభిప్రాయాలు అంత బాధపెట్టాయి. ఇటువంటి సమయంలో స్త్రీలను గురించి మాట్లాడడం  చాలా అవసరంగా అనిపించింది నాకు. వ్యాసాలుగా రాసి పబ్లిష్ చేస్తే స్థలం సరిపోకపోవచ్చు. అందుకే పుస్తకం తెచ్చాను.

సూర్యసేన్ అంటే ఇక్కడవారికి కాస్త తక్కువ తెలుసు. మరి నీకెలా తెలిసింది?

మన దేశంలో దేశభక్తి  సహజంగానే ఉంటుంది గదా. చిన్నప్పుడు జనగణమన పాడడం, వందేమాతరం పాడడం దేశభక్తి  అనుకునేవారు. మా ఇంటి వాతావరణం వలన నేను దేశభక్తిని ఇంకాస్త ఎక్కువగానే ఫీల్ అయ్యేదాన్ని. దానివలన నాకు మామూలుకన్నా ఎక్కువమంది ఫ్రీడం ఫైటర్స్ తో పరిచయం ఉంది. కొద్దికొద్దిగానే తెలిసినా ఈ పేర్లు విని ఉన్నవే. కాబట్టి పెద్దయ్యాక  చదువుతున్నప్పుడు రిలేట్ చేసుకోవడానికి సాయపడ్డాయి. నాకు స్టాంప్ కలెక్షన్ ఒక హాబీ. అప్పట్లో సూర్యసేన్ స్టాంప్ కూడా నాదగ్గర ఉండేది. ఆయన గురించి విని ఉన్నాను. ఆ తరవాత 2004 లో విజయవిహారం పత్రిక లో అతని గురించి ఒక చిన్న ఆర్టికల్ వచ్చినప్పుడు చదివాను. సూర్యసేన్ నన్ను ఎందుకు ఆకర్షించాడంటే అతను చేసిన పనికి ఫలితం ఆశించలేదు. పోరాటం లో ఓడిపోతామని తెలుసు, చచ్చిపోతామనీ తెలుసు. కానీ వెనకడుగు వేయలేదు. అందరిలోనూ ఉద్యమజ్వాల రగిలించాడు.

ఈ పుస్తకంలోని సమాచారాన్నంతా  ఎక్కడ నుంచి సంపాదించావు?

చాలా పుస్తకాలు సేకరించాను. కష్టం కన్నా ఖర్చు ఎక్కువైంది. కొన్ని ఇంటర్నెట్ లో, కొన్ని కలకత్తా స్టేట్ ఆర్కైవ్స్ లో, ఒకటి బంగ్లాదేశ్ లో ఉన్న ఫేస్ బుక్ ఫ్రెండ్ ద్వారా, ఇలా సంపాదించాను. ఇదంతా పెద్ద ప్రహసనం. వారికి ఉత్తరం రాయడం, ఫాలో అప్ చేయడం, వచ్చాక గాని వాటి కండిషన్ బాగుందో లేదో తెలియక పోవడం. ఒక సమయంలో పిచ్చిపడుతుందేమో అనిపించేది.

మొదట ఎవరి గురించి రాశావు?

కల్పనా దత్.  ఆమెదీ నాదీ ఒకేరకమైన వేదన. నేను రెండున్నర ఏళ్ల వయసులో ఉన్నప్పుడే మా నాన్న చనిపోయాడు. ఆయన బాడీని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ కి ఇచ్చారు. నా ఎయిత్ క్లాస్లో కమలాకర్ అని నా క్లాస్ మేట్ ఏమనేవాడంటే, “ పింగళి, మీ నాన్న చనిపోలేదేమో…బతికే ఉన్నాడేమో..” అని. ఆయన డెడ్ బాడీ కాలడం మా ఇంట్లో ఎవరూ చూడలేదు. అలాంటప్పుడు “బతికుంటే..’అనే ఆలోచన ఉంటుంది కదా… ఆ ఆశతో నేను చాలకాలం వరకూ, అంటే దాదాపు నాకు ఇరవైరెండు, ఇరవైమూడేళ్ళ వయసొచ్చాక కూడా ఎదురు చూస్తూ ఉన్నాను.  తారకేశ్వర్ డెడ్ బాడీ దొరకనప్పుడు అతను బతికే ఉన్నాడన్న కల్పనాదత్ ఆశతో నేను వ్యక్తిగతంగా బాగా కనెక్ట్ అయ్యాను.  ఆ బాధ చాలా కష్టమైనది. అందుకేనేమో మొదటగా ఆమె గురించే  రాసాను.

చాలాచోట్ల మతాన్ని, దేవతలనీ మెటాఫర్ గానో, సిమిలి గానో వాడావు. ఎక్కువమంది చదవాలనా?

నేను రాసేటప్పుడు నా దృష్టి లో రీడర్ నిజంగా లేడు. రాయడం కూడా విచిత్రంగా జరిగింది. అది పుస్తకం అవుతుందని అనుకోలేదు. మతాన్నీ, దేవతలనీ వాడడం నిజమే. కానీ “వాటిని పుక్కిటి పురాణాలు అనొచ్చు” అని కూడా ఒకచోట రాసాను.  ఇక విషయానికి వస్తే మనకి తెలీకుండానే మనం కొన్ని సంప్రదాయ వ్యక్తీకరణలకు అలవాటు పడ్డాము. మా అబ్బాయితో అక్షరాలు దిద్దించడం నాకు అసలు ఇష్టం లేదు. కానీ నేర్పించేటప్పుడు దిద్దించవలసి వస్తుంది. అలానే చదివేవారికి అర్ధమయ్యే విధానమొకటి ఉంటుంది కదా. నేనూ, వారూ కూడా ఒక వాతావరణానికి అలవాటు పడిఉన్నాము. మాకు ఉమ్మడిగా అర్ధమయ్యే  భాష ఒకటి ఉంటుంది. నిన్న చూడు, మనం మాట్లాడుకునేడప్పుడు “డెఫ్ అండ్ డమ్ “అనే పదం అనకూడదు “వెర్బల్లీ చాలెంజడ్” అనాలి అన్నావు. అలానే” బ్లైండ్” అనకూడదు “విషువల్లీ చాలెంజడ్ “అనాలి వగైరా… అంటే మనం సెన్సిటివ్ అవుతున్న కొద్దీ,  మన హక్కుల గురించి అవాహన పెరుగుతున్న కొద్దీ, మన పదజాలం మారుతుంది. ఇప్పుడు నేనా సిమిలీలు లేక మెటాఫర్స్  ఉపయోగిస్తానా అంటే, చెప్పలేను. ప్రీతిలత అనేకాదు, సుభాష్ చంద్ర బోస్ లాంటి విప్లవ నాయకుడు కూడా కత్తి తో వేలును కోసుకుని బొట్టు పెట్టుకుని దుర్గామాత పూజ చేసేవాడు. అదే సుభాష్ చంద్ర బోస్ నమాజ్, ప్రేయర్ల కోసం ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కి రెజిమెంట్లలో ఏర్పాటు చేసాడు. అతను మతాన్ని అనుసరించడం అతని వ్యక్తిగత విషయం. మతాన్ని అనుసరించడం, విప్లవవాదిగా ఉండడం వేరువేరని ఎప్పుడూ అనుకోను. రాణిగైడిల్య గురించి ఒకరు రాసిపంపమన్నారు. పంపాను కానీ ఆ వ్యాసంలో ఆమె గాంధీ శిష్యురాలినని చెప్పుకుంటుంది. అది ఎడిట్ చేసి పంపమన్నారు. చరిత్రను రాస్తున్నప్పుడు నేనలాంటి మార్పులు చేయకూడదు. నేను మార్చనన్నాను. అలానే ఇది కూడా. వాళ్ళు మతాన్ని అనుసరించారు. ఎన్నైనా చెప్పనీ బెంగాల్ లో ఆడవాళ్ళు తెగింపుగా ఉంటారు. అక్కడ కాళికా మాత పూజ అనే నేపధ్యం ఉంది. స్త్రీ శక్తి ని గౌరవించడం అనేది అక్కడి సంప్రదాయం లో భాగం . మనం వారిలో ఉన్న ఆ రెండు అంశాలను విడదీయలేము. కల్పనా దత్ లాంటి వారు విప్లవ వీరులు మాత్రమే కాదు. వాళ్ళు ఆస్తికులు కూడా. కాబట్టి వారి భాష లోనే రాయవలసి వస్తుంది.

నేపధ్యం ఏమో స్వాతంత్ర్యపోరాటం. రాసిందేమో ఆడవారి గురించి. మళ్ళీ థ్రిల్లర్  ఎఫెక్ట్ ఎందుకు తెచ్చావు?

వర్మ సినిమాల ప్రభావం అనుకోరాదూ? నేను మొదట రాణి గైడిల్య గురించి(ఈ పుస్తకం లో లేదు) రాసి మా అత్తగారికి, బాలుకీ చదవమని ఇచ్చినప్పుడు..వాళ్ళు చదివి తిరిగిస్తూ, “బావుందని చెప్పారు. ఏడుపో, కోపమో ఏదో రావాలి కానీ బావుంది అనిపించడమేంటో అర్ధం కాలేదు. తర్వాత నాకర్ధమైంది. ఇటువంటివి రాస్తే సోషల్ టెక్స్ట్ బుక్ చదువుతున్నట్టు ఉండకూడదు, ఇంకేదైనా ప్రయత్నించాలి. అలా అనుకుని, మధ్యలో సంఘటన ఎత్తుకుని ఫ్లాష్ బాక్ లోకి వెళ్లి మళ్ళీ వర్తమానం లోకి రావడం, అలా సన్నివేశాలు ముందుకీ వెనక్కి జరగడం… అలా ప్రెజెంట్ చేశా. అంతేగాక, అదొక రహస్య కార్యకలాపాలున్న ఉద్యమం కదా.. అలాంటి నేపధ్యాన్ని, జరిగిన సంఘటనలని దృష్టిలో పెట్టుకునే రాసాను.  ఈ కొత్త తరహా రచనని చదివిన మా అత్తగారి, బాలు స్పందనలు కూడా గమనించేదాన్ని.

కానీ భాష లో కాస్త అమాయకత్వం..ఇంగ్లీష్ లో చెప్పాలంటే “నైవిటి” ఉంది కదా, అలా అని నీకు తరవాత ఎప్పుడన్నా అనిపించిందా?

నాకున్న పెద్ద బలం ఏంటంటే నేనేమన్నా రాస్తే వెనక్కి తిరిగి చదవను. చెప్పాలంటే వెనక్కి తిరిగి చదవాలంటే భయంగా ఉంటుంది. అందులో నైవిటి ఉంటుందని నాకు తెలుసు. (ఇద్దరి నవ్వుల మధ్యా చెప్పింది)

ఇంకో విషయం ఏంటంటే  మనం ఏదన్నా నేర్చుకుని చెయ్యము. చేసేటప్పుడు నేర్చుకుంటాం.  పుస్తకం వస్తుంది అని అనుకోలేదని చెప్పాగదా. అలా జరిగిందంతే.  అప్పుడు నేర్చుకున్నదే అంతా. నా లాప్టాప్లో షిఫ్ట్ డిలీట్ కొట్టవలిసినవి బోల్డుంటాయి. ఈ పుస్తకాన్నిమాత్రం జాగ్రత్తగా కాపాడుకున్నా.

నీ పుస్తకంలో ప్రతీ అక్షరంలో నువు  ప్రస్తావించిన వీరుల మీద ప్రేమ, వాత్సల్యం కనిపిస్తుంది. ఎలా ఫీల్ అవుతావు వారి గురించి?

అంటే అది ఎట్లా చెప్పాలో నాక్కూడా తెలియట్లేదు అపర్ణా…   వ్యక్తిగత జీవితం లో కూడా బలమైన వ్యక్తిత్వమున్న అమ్మాయిలను గురించికూడా అలానే ఫీల్ అవుతాను. నేనీరోజు ఇంత సౌకర్యంగా ఉన్నానంటే కారణం మన ముందు తరం ఆడవాళ్ళు ఉద్యమం చేస్తూ, ఉద్యోగాలు చేస్తూ, వాళ్ళమీద పడిన రాళ్ళను ఏరి, శ్రద్ధగా పేర్చి, నా కోసం ఇంత అందమైన బాట వేయడంవలనే అనిపిస్తుంది. అలానే పుస్తకంలో రాసిన ఈ పదిమందికీ ఉద్యమం ఒక సాధారణ విషయమే అయినా, వారందరి నేపధ్యం భిన్నమైనది. ప్రీతిలత ఎంతో చదువుకుని చిన్నవయసులోనే హెడ్ మిస్ట్రెస్ అయింది. స్కూల్ లో మొదటి మహిళా ప్రధానోపాధ్యాయురాలు! అదే సావిత్రిబాయి- బ్రాహ్మణవాడ తప్పితే మరేదీ తెలియని నిరక్షరాస్యురాలు. ప్రేమలతకు పెళ్ళయ్యాక భర్త చదువు నేర్పించాడు. నేత్రసేన్ భార్యకు అసలు చదువులేదు. అంటే భిన్నమైన నేపధ్యాల నుంచి వచ్చిన అమ్మాయిలు కూడా ఆ నేపధ్యాలని పక్కన పెట్టి, వాళ్ళు ఒక ఆశయం కోసం పని చేయడం, అవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. నేను ఇటువంటివారిని అందరిని బయట కలవగానే ఎందుకు ప్రేమలో పడిపోతానంటే నాకు నా లోటుపాట్లు తెలుసు. నేను వీరి దగ్గర ఏం నేర్చుకోవాలో తెలుసుకుంటూనే ఉంటాను. ఇప్పుడు ఈ రోజుల్లో నిలబడి నేను నేను ప్రజాస్వామిక ఉద్యమాల్లో పబ్లిక్ గా పాల్గొంటున్నాను. దానికి లోకులు ఎన్ని మాటలు మాట్లాడతారో! ఆ మాటలు కొన్నిసార్లు నిస్పృహ కలిగిస్తాయి. అలాంటిది ఎనభైయ్యేళ్ళ క్రితం వాళ్ళెంత కష్టపడి ఉంటారో కదా అనిపించి  ప్రేమకలుగుతుంది.

ఇంకా?

అప్పటి ఆడవాళ్లకుసాయుధ పోరాటం కన్నా గాంధీతో కలిసి పనిచేయడం తేలిక. జిల్లాకు వెళ్ళడం వదిలేయి, అసలు బయటకు రావడమే పెద్ద విషయం. ప్రీతిలత ఎనభైరెండు రోజులు అండర్ గ్రౌండ్ లో ఉంది. నేనా పుస్తకం రాసినప్పుడు ఏమి ఆలోచించానంటే మార్నింగ్ లేచి బాత్రూమ్ కి వెళ్ళాలంటే ప్రీతిలత ఎక్కడికి వెళ్ళి ఉంటుంది. పీరియడ్స్ అప్పుడు ఏం చేసుంటుంది, ఇప్పటిలా పాడ్స్ లేవు కదా, బట్టలు కూడ ఉన్నాయో లేదో, అలా.. ఇప్పుడే చాలా పెద్ద ఛాలెంజ్, మరి అప్పుడు మగవాడితో మాట్లాడితేనే పెద్ద తప్పు. అలాంటి సమయాల్లో అంతమంది మగవారితో కలిసి ఎలా ఉండి ఉంటుంది, అని ఆలోచించాను. ఆమె అనే కాదు, సావిత్రి మగవాళ్ళకు ఆశ్రయం ఇచ్చినందుకు వెలేశారు. ఇంకా ఎందరో ఇలా!

కానీ స్పష్టత లేకుండా చిన్నతనంలో ఉద్యమంలోకి రావడం ఎంతవరకూ సబబు? పైగా చాలామంది చదువుకున్నవారు, సామజిక సంస్కరణ ఉద్యమంలో పాల్గొనడం కన్నా చనిపోవడం మీద ఎక్కువ దృష్టి పెట్టలేదా? గెలవలేమని తెలిసి కూడా ఉద్యమించడంలో అర్ధముందా?

అభివృద్ధి అనేది ఒకే దిశలో జరగడం సాధ్యం కాదు. ఒకే టైం లో శ్రీశ్రీ ఉన్నాడు, చలం ఉన్నాడు, ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ఉన్నాడు, గాంధీ ఉన్నాడు. వీరేశలింగం ఒకవైపు వితంతువివాహాలు జరిపిస్తున్నాడు. ఎవరితోబడితో వారితో వివాహాలు జరిపించాలనే తప్ప, ఆడవారి కోరికలు మరిచిపోతున్నావని చలం ప్రశ్నించాడు. మనకు రెండూ అవసరమే. వితంతు వివాహమే పెద్ద  విప్లవం. దానికి మళ్ళీ “నువ్వెవడివి రా భాయ్”  అనడం ఇంకా పెద్ద విషయం. ఇవతల అందుకునే స్థానంలో ఉన్నవారు అందిపుచ్చుకోవడం లో డిగ్రీస్ ఉంటాయి. ఏ డిగ్రీ లో వాళ్లకి ఆ డిగ్రీ లో జరిగే పోరాటం కావాలి. కవియిత్రి సరోజినీ నాయుడు కావాలి, అదేసమయంలో యూనియన్ ఫ్రీడమ్ ఫైటర్ అయిన సరోజినీ నాయుడు కూడా కావాలి. అలానే దేశాభివృద్ధి కోసం పరిశ్రమలు పెట్టాలన్న విషనరీలు- టాటా, బిర్లాలు కూడా కావాలి. ఏకపక్ష అభివృద్ధి అనేది అసాధ్యం. ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలి.

నువ్వు పెరిగిన వాతావరణం, పనిచేసిన నేపధ్యం, నీ ఆలోచనా ధోరణి చాలా హేతువాద పరంగా ఉంటాయి కదా… మరి నీ పుస్తకం లో మొదటి ఆరు పేరాల్లోనే మూడు మతాల గురించి గొప్పగా ప్రస్తావించావు. మధ్యమధ్యలో హనుమంతుడూ, కాళికామాతల ప్రస్తావన కూడా ఉంది?

అవును, భారతమాత ముద్దు బిడ్డలు అని కూడా ఉంది. అది అప్పటి నేపధ్యం. రాయక తప్పదు. ఇప్పుడు రాసుంటే  99% వాడేదాన్నికాదు. పైగా ఈ మూడేళ్ళలో నా ఆలోచనల్లోనే చాలా మార్పులు వచ్చాయి. కొన్ని విషయాలు తెలుసుకున్నాను, కొన్ని భ్రమలు వదిలించుకున్నాను.

మూడేళ్ళలో తేడా ఏంటి?

నార్త్ ఈస్ట్ ఇండియాకి, ఇండియాకి ఉన్న సంబంధం కొత్తగా అర్థమైంది. ఇండియా బ్రిటన్ కన్నా ఏమీ తేడాగా లేదు అనిపించింది. నా దేశం తప్పుచేయకూడదనే అబ్సెషన్ తగ్గింది. పైగా ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీ మొదలయ్యే సమయానికి ‘భారతమాత’ అంటే ఒక ఆలోచన. ఇప్పుడొక దేవత. కొన్ని సంస్ధలైతే  సింహమూ, కాషాయమూ కూడా వాడుతున్నారు. అంతేగాక బాల్యం నుండే దేశభక్తిని ఒక మంచి లక్షణంగా     చెప్తున్నారు. పైగా జెండర్, కులం, వంశం లానే దేశభక్తి కూడా. అది వదిలించుకోగలగాలి. అదొక మూర్ఖత్వం. మణిపూర్ వెళ్ళాక అది కూడా పోయింది.

నిజమే, దేశభక్తి మూర్ఖత్వమైతే కష్టమే. కానీ ఆచరణకు సరిహద్దులు ముఖ్యం కాదా?

ఇల్లు అనార్కి గా ఉంటే దానిని నడపడం కష్టం.  పరిపాలన సాగించాలంటే లౌకికమైన సవాళ్లు ఎన్నో ఉంటాయి. దేశం అనో, పంచాయితీ అనో ఏదన్నా కొన్ని సరిహద్దులు ఏర్పాటు చేసుకుంటాము. కానీ ఏ బోర్డర్లో ఉన్న ప్రజలని మనం మన దేశ ప్రజలని చెబుతున్నామో, వాళ్ళని మనం హింస పెడుతున్నాం.

ఇందాక “ఇప్పుడు రాసుంటే అలా రాసేదాన్ని కాదు” అన్నావు కదా. ఏమి మార్చేదానివి?

భారతమాత అనే మాట వాడేదాన్ని కాదు. మిగిలిన వాస్తవాలు గానీ, నువ్వన్న నైవిటి గాని అలానే ఉంటాయి. దేశం విషయం లో నా దృక్కోణం మారినా, ఆడవారి గురించి రాసాను కాబట్టి, పెద్దగా తేడాలైతే ఏమి ఉండవు . నేపధ్యం విప్లవం అయినా రాసింది ఫెమినిస్ట్ కోణం లోనే. కాబట్టి అది మారదు.

చిట్టగాంగ్ పుస్తకానీకి ‘మనసులో వెన్నెల’కూ తేడా?

‘మనసులో వెన్నెల’ నా పుస్తకమే కానీ, చిట్టగాంగ్ పుస్తకం కోసం పడినంత కష్టం పడలేదు. కానీ మనసులో వెన్నెల వచ్చేవరకు, చిట్టగాంగ్ పుస్తకం ఉందని చాలామందికి తెలియదు. దీనికి ఈ మాత్రం గుర్తింపు వచ్చినప్పుడు చిట్టగాంగ్ కి ఎందుకు రాలేదు అని నాకు బాధగా ఉంటుంది. చిట్టగాంగ్ రాతపరంగా కూడా మనసులో వెన్నెల కథల కన్నా బాగా రాశాను. నిజమే మార్కెటింగ్ వగైరా విషయాలు ఉంటాయి. అయినా సరే. కథలు చదవడం ఈజీ. చిట్టగాంగ్ పుస్తకానికి ఒక  టైం, మూడ్ కూడా కావాలి.

ఈ ఉద్యమాలలో తిరిగి  చెదిరిపోయిన మనసుని ఎలా హేండిల్ చేస్తావు?

రాయడమే. అదే నాకు సాంత్వనని ఇస్తుంది. అంతకన్నా ఇంకేం చెయ్యలేను. ‘మనసులో వెన్నెల’ కథలు పూర్తిగా నా లోపల జరిగే పోరుకు ఔట్లెట్.

ఇప్పుడు రాసే పుస్తకాన్ని గురించి చెప్పు?

మణిపూర్ బుక్ అనేది నా ప్రయాణం. నేను 2004 లో ఇండియన్ ఆర్మీ రేపిస్ట్స్ గురించి రాసినప్పుడు “సజీవ కాగడాల కాంతి” అనే వ్యాసం రాసాను. “రామాయణ భాగవతాలు కాదు, మేము మా కడుపులో దాచుకున్న క్షణం నుంచి తదుపరి తరాలకు మీ పోరాటమే చెప్తాము, అని అప్పుడు రాసాను. ఆ రోజు నేను మా అబ్బాయిని  ఇరోం షర్మిల దగ్గరకు తీసుకెళ్లినప్పుడు చెప్పాను, “చూడు. మా నుంచి నేర్చుకో..” అని. కానీ ఒకే సమయం లో ఇద్దరమూ నేర్చుకుంటున్నాం అనిపించింది. “దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు” అని మూడోతరగతిలో వల్లెవేసినా, అది అర్ధం చెసుకొవదానికి 2004 నుంచి ఇప్పటిదాకా, అంటే పన్నెండేళ్ళు పట్టింది నాకు.

మణిపూర్ వెళ్ళినప్పుడు- ఎక్కడ నుంచి వచ్చారు, అని అడిగితే హైదరాబాద్ అని చెప్తున్నాము.. ’ఎక్కడది?’ అని అడిగితె సౌత్ ఇండియా లో ఒక మూల అని చెప్పాము. కానీ నెమ్మదిగా “ఎక్కడ నుంచి?’ అని అడిగితే “ఇండియా నుంచి” అని చెప్పడం మొదలు పెట్టాము. మూడురోజుల్లో వచ్చిన మార్పది. ఇండియాలో కలుపుకున్నప్పుడు- బలవంతపెట్టో, బెదిరించో, బతిమాలో కలుపుకున్నాము. కానీ సరిహద్దుల్లో ఉన్న వారిని మనకు బఫ్ఫర్స్ గా కాల్చుకు తింటున్నామన్న మాట. అంతే, ఇంకేమీ లేదు. ఇంకే దేశం, ఏ గొప్పతనం మనం మాట్లాడతాం?

చిట్టగాంగ్ పుస్తకం  ఏమన్నా రాబోతున్న పుస్తకానీకి బీజాన్ని వేసిందా?

లేదు. చిట్టగాంగ్ మీద ఒక పుస్తకం రాసాక ఒక హాంగోవర్ లో ఉన్నా. తరవాత ఏమి రాయాలి అని ఆలోచించాను. హిందు ముస్లిం ఐక్యత ఎంత ముఖ్యమో, ఒక హిందు ఒక ముస్లిం ఈ దేశం కోసం ఎలా ఉరికంబం ఎక్కారో, ముస్లింలని నమ్మని బిస్మిల్, అష్ఫాక్ ని  చూసి తన అభిప్రాయం తప్పని తెల్సుకుని ఎంత మారాడో, ఈ దేశం కోసం ముస్లిం లు ఎంతమంది పొరాడారో చెప్పడం చాలా ముఖ్యం అనిపించింది. ఐతే, ఇక్కడ ఒక  ప్రమాదం ఉంది.. అదే “దేశభక్తి”! నేను హిందూముస్లిం ఐక్యత రాద్దామనుకున్నా. కానీ ఈ దేశభక్తి అనే అంశాన్ని తాకకుండా ఉండలేను. వీరి గురించి ఎప్పటికైన రాయవలసిందే. కొంచం విరామం తీసుకుని తరవాత రాద్దామని ఆపాను. ప్రస్తుతం మణిపూర్ మీదే నా దృష్టి ఉంది.

ఫెమినిజం అంటే సరైన అవగాహన లేని వారిలో, దానికి సంబంధించిన కొన్ని మూస ఆలోచనల ధోరణి కనిపిస్తుంది. దాన్ని దాటి వ్యక్తిత్వాల స్థాయిలో ఆడవారి అంతర్బాహ్య బలాలను తెలియజేయడం ఎంతో అవసరం. అలా తెలియజేసే ఇటువంటి పుస్తకాలు జ్ఞానాన్ని ఇవ్వడమే కాదు, స్పూర్తినిస్తాయి. ఆగమగీతమై మరెన్నో విప్లవాలకు ఆహ్వానం పలుకుతాయి.

 

**** (*) ****



3 Responses to “నేర్చుకుని చెయ్యము, చేసేటప్పుడు నేర్చుకుంటాం.” – పింగళి చైతన్య

  1. కె.కె. రామయ్య
    August 1, 2016 at 5:55 am

    సరిహద్దుల్లో ఉన్న వారి పట్ల (అది కాశ్మీర్ కానీ, నార్త్ ఈస్ట్ ఇండియా లోని మణిపూర్ కానీ)
    ” నా దేశం తప్పుచేయకూడదనే అబ్సెషన్ ” ను గురించి ప్రస్తావించిన చైతన్య గారికి
    జెండర్, కులం, వంశం లానే దేశభక్తి కూడా వదిలించుకోగలగాలి అన్న చైతన్య గారికి వొందనాలు.

    కనీసం వీటిపేరుతో జరిగే వివక్షతలను, హింసను నిలువరించాలి!

    సూర్యసేన్‌ నాయకత్వంలో జరిగిన చిట్టగాంగ్‌ సాయుధ పోరాటంలో పదిమంది మహిళలు
    ( ప్రీతిలత వదేదార్, కల్పనా దత్, సుహాసిని గంగూలి, ఇందుమతి సింగ్, ప్రేమలత, సావిత్రిబాయి,
    ఓ అజ్ఞాత వ్యక్తి, బీనా దాస్, కల్యాణి దాస్, బినోదిని సేన్, ) నిర్వహించిన పాత్రను అద్భుతంగా చిత్రీకరించిన
    ‘చిట్టగాంగ్‌ విప్లవ వనితలు’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వఛ్చిన సందర్భంగా చైతన్య గారికి అభినందనలు.
    చైతన్య గారిని ఇంటర్వ్యూ చేసిన అపర్ణ గారికి నెనర్లు.

    ఈ పుస్తకాన్ని నవోదయ బుక్ హౌస్, కాచిగూడ, హైద్రాబాదు వారి నుండి తెప్పించుకొవచ్చుఁ :
    http://www.telugubooks.in/products/chittagang-viplava-vanitalu

  2. అవినేని భాస్కర్
    August 1, 2016 at 10:38 am

    “ఇదంతా పెద్ద ప్రహసనం. వారికి ఉత్తరం రాయడం, ఫాలో అప్ చేయడం, వచ్చాక గాని వాటి కండిషన్ బాగుందో లేదో తెలియక పోవడం. ఒక సమయంలో పిచ్చిపడుతుందేమో అనిపించేది.”

    “మనం ఏదన్నా నేర్చుకుని చెయ్యము. చేసేటప్పుడు నేర్చుకుంటాం.”

    జాహార్లు!

  3. satyanarayana
    August 2, 2016 at 11:13 pm

    ఫెమినిజం అంటే సరైన అవగాహన లేని వారిలో, దానికి సంబంధించిన కొన్ని మూస ఆలోచనల ధోరణికనిపిస్తుంది. దాన్ని దాటి వ్యక్తిత్వాల స్థాయిలో ఆడవారి అంతర్బాహ్య బలాలను తెలియజేయడం ఎంతో అవసరం. అలా తెలియజేసే ఇటువంటి పుస్తకాలు జ్ఞానాన్ని ఇవ్వడమే కాదు, స్పూర్తినిస్తాయి. ఆగమగీతమై మరెన్నో విప్లవాలకుఆహ్వానం పలుకుతాయి.

    అపర్ణ గారు చక్కగా చెప్పారు .

    “కానీ ఏ బోర్డర్లో ఉన్న ప్రజలని, మనం, మన దేశ ప్రజలని చెబుతున్నామో, వాళ్ళని మనం హింస పెడుతున్నాం.”

    “అంతేగాక బాల్యం నుండే దేశభక్తిని ఒక మంచి లక్షణంగా చెప్తున్నారు.”

    ” జెండర్, కులం, వంశం లానే దేశభక్తి కూడా”. అదొక మూర్ఖత్వం . అది వదిలించుకోగలగాలి. . మణిపూర్ వెళ్ళాక అది కూడా పోయింది.

    నీ పుస్తకంలో ప్రతీ అక్షరంలో నువు ప్రస్తావించిన వీరుల మీద ప్రేమ, వాత్సల్యం కనిపిస్తుంది. ఎలా ఫీల్ అవుతావు వారి గురించి?

    అంటే అది ఎట్లా చెప్పాలో నాక్కూడా తెలియట్లేదు అపర్ణా… వ్యక్తిగత జీవితం లో కూడా బలమైన వ్యక్తిత్వమున్న అమ్మాయిలను గురించికూడా అలానే ఫీల్ అవుతాను. నేనీరోజు ఇంత సౌకర్యంగా ఉన్నానంటే కారణం మన ముందు తరం ఆడవాళ్ళు ఉద్యమం చేస్తూ, ఉద్యోగాలు చేస్తూ, వాళ్ళమీద పడిన రాళ్ళను ఏరి, శ్రద్ధగా పేర్చి, నా కోసం ఇంత అందమైన బాట వేయడంవలనే అనిపిస్తుంది.

    ఇంత ఉదాత్తమయిన భావన ఎంతమందికి ఉంటుంది? పైన ఉదహరించిన కొన్ని అభిప్రాయాలు ,సమాజాన్ని నిస్పక్షపాతంగా చూడాలనుకునేవాళ్లకే అర్ధమవుతాయి .

    అసలు ఇలాటి పుస్తకాన్ని రచించిన పింగళి చైతన్య గారికీ,పాఠకులతో పంచుకున్న అపర్ణగారికి ,ధన్యవాదాలు .

Leave a Reply to satyanarayana Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)