కవిత్వం

చినవీరభద్రుని కవిత

08-ఫిబ్రవరి-2013

You bring the lips, and I will bring the heart.. -Amir Khusrau (In the Bazar of Love)

చార్మీనార్ ఒక సౌధం, ఒక స్మారకం అనుకున్నానిన్నాళ్ళూ, ఆ సాయంత్రం తెలిసింది,
దానిచుట్టూ కొన్నివేల తేనెటీగలొక తేనెపట్టు అల్లుకుంటున్నాయి,
ఘాటైనతీపిగాలి, అక్కడ మనుషులకదలికల్లోంచే మకరందం ప్రసరిస్తుంది,
అక్కడ ఊరికినే అటూఇటూ తిరిగినా చాలు, నీ చొక్కామీద తేనెమరకలు

అక్కడ చెరకుగానుగ ఆడుతున్నట్టు,బెల్లం వండుతున్నట్టొక వెలుతురు
ఒక్కసారిగా జీవితం జీవించదగ్గదిగా అనిపిస్తుంది,నిన్ను తోసుకుంటూ
ముందుకుతోసుకుపోతున్న మనుషులు నీకళ్ళ కేదో అంజనం పూసేస్తారు
అప్పుడక్కడ ఆకాశంలో కూడా కొత్తగా ఒక బజారు తెరిచినట్టుంటుంది

కొన్ని వేల హస్తాలక్కడ రంగురంగుల వస్త్రాలు నేస్తున్నట్టు, హృదయాలమీద
లతల్నీ, పువ్వుల్నీ సుతిమెత్తగా అద్దుతున్నట్టు, అదొక చేనేతకారుడి మగ్గం.
ఎన్నో శతాబ్దాలుగా మనుషులపాదముద్రల్తో నడుస్తున్న నిరంతర నృత్యం
అక్కడి గాజులదుకాణాలు ఏ ఋతువులోనూ వాడిపోని గులాబిపూలతోటలు

వస్తువుతో వస్తువుమార్చుకునే ప్రాచీన ప్రేమవిపణి, ఆమె తన హృదయాన్ని
అంగడిలో విప్పిపరిచింది, నేనొక కవిత చెల్లించి దాన్ని కైవసం చేసుకుంటాను