కవిత్వం

కథ ముగిసింది

08-ఫిబ్రవరి-2013

కథ ముగిసింది
కథల చెట్టు కూలిపోయింది
నా చిన్నప్పటి కథల్లో రాజకుమారులు-గుర్రాలు, చాకలాడు-గాడిద
అందరూ, అన్నీ మరణించాయి
ఒక గొప్ప రహస్యం చెబుతున్నట్లు
“విషము నిమ్ము కాదు విషయ నిమ్ము”
అని గుసగుసలాడే గొంతు
ఆగి పోయింది

నాన్నమ్మా! నాన్నమ్మా!
నీ ఊడ పట్టుకుని వేళ్లాడే పసిరి కాయలం మేము
ఎనభై మూడేళ్లొచ్చాయని
ముసలితనం నిన్ను మింగేసిందని
ఎవరన్నారు?
నిన్నా మొన్నటి నీ మెత్తని చేతి స్పర్శ
నా చెంపల్ని తాకిన నీ బోసి నోటి ముద్దులు
గేటు దగ్గర నన్ను కౌగిలించుకున్నపుడు నా భుజాన్ని అల్లుకున్న నీ ఆత్రపు ఊపిరి
అన్నీ నా గుండెలో పదిలంగా శ్వాసిస్తున్నాయి
చెదరని జ్ఞాపకమై నన్ను అనుక్షణం తడుముతున్నాయి

నాన్నమ్మా!
నువ్వు మా నాన్నకు మాత్రమే అమ్మవు కావు
నా చిట్టి పాపాయికీ అమ్మవే
ఏళ్ల తరబడి మర్చిపోయిన కథని మళ్లీ బతికించి
పిల్లకు అన్నం తినిపించావు చూడూ-
ఏడ్పు మానిపించి కళ్లల్లో వెలుగు పంచావు చూడూ
అక్కడే నువ్వు బతికున్నావు

ఏ కాలమూ నిన్ను మింగలేని కథల చెట్టై పిల్ల గుండెలో కొత్తగా మొలిచావు
ఇప్పుడు భూగోళానికివతల సప్త సముద్రాలకివతల
వచ్చీ రాని తెలుగులో “మాంస్ గ్రాండ్ మా “కథై
అచ్చం నా చిన్నప్పటి
నాన్నమ్మవై ఠీవిగా జరీ చీర కట్టుకుని
బైబిలు చేత్తో పట్టుకుని ప్రజా కోటికి స్వస్థత చేకూర్చడానికి
ప్రయాణమవుతున్న ప్రవక్తవై ప్రత్యక్షమయ్యావు
నీ నించి ఉద్భవించిన అంకురమై మొలిచిన
నాలుగో తరానికి కథల వేరువై నాటుకున్నావు
ఎవరన్నారు నువ్వు మరణించావని?

ఉదయానే నువ్వు మరణించావని పన్నెండు గంటల ఆలస్యంగా కబురందుకున్న నాకు
వేల మైళ్లకివతలనుంచి నీ పార్థివ దేహాన్ని స్పృశించేందుకు రాలేని నాకు
నిన్ను ఊపిరి బిగించిన గాజు పెట్టెలో ఊహించుకున్నప్పుడల్లా నా ఊపిరి ఆగినంత ఉక్కిరిబిక్కిరి
రోదిస్తూ ఎప్పుడూ చూడని నీకోసం వెక్కివెక్కిపడే నా దిగులు దు:ఖాన్ని ఆపలేని అశక్తత

నాన్నమ్మా!
నీ మెత్తని శరీరపు స్పర్శ
వెచ్చని చేతులు
గొప్ప సంభాషణా స్వరం
ముక్కుపుటాలు అదిరే పెల్లుబికే కోపం
చిన్నపిల్లలతో మమేకమైనప్పటి పగలబడే నవ్వు
నా జీవితకాలపు సజీవ గుర్తులు
నీలా రుచికరమైన కొబ్బరన్నం నేనెందుకు నేర్చుకోలేదు?
కనీసం ఒక్క సారైనా డబ్బులు చేతిలో పెడ్తూ ఇంకేమైనా కావాలా అని ఎందుకడగలేదు?
అల్లిబిల్లి కథల కన్నతల్లివి నీకు పాదాభివందనం ఎందుకు చెయ్యలేదు?
చివరి చూపుగా పరిగణించని మన చివరి కలయిక వరంగా ప్రసాదించావా నాకు?!
నిన్ను చూడాలని ఎంతగానో తపించి చేరినందుకు చివరి కౌగిలింతని మిగిల్చేవా?

నాన్నమ్మా! ఇంత కాలం తెగని పేగై
నా ముందు తరపు చివరి ఆధారమై
మేరు గంభీరంగా చివరి నిమిషం వరకూ పచార్లు చేసిన
నీకు తొందరేమొచ్చింది?!
ఎప్పటికీ “నాటవుట్ ‘అని నువ్వేగా చెప్పావు?!
ప్రార్థనతో ప్రశాంతతని పంచిన నువ్వు
ప్రభువాజ్ఞ కాలేదని మొన్న కూడా చెప్పేవు కదా!
నేనిప్పుడు పసిపాపనై ఎవరి మెడ చుట్టూ చేతులు వేసి నిద్రపోను?
కథ చెప్తేనే గానీ అన్నం తిననని ఎవరి దగ్గర మారాం చెయ్యను?
ఇప్పుడెవరు ఐస్ప్రూటుకి అడిగినంత డబ్బులిస్తారు?
గాజులు తాకట్టు పెట్టి బిర్యానీలు తినిపిస్తారు?!

కృతఘ్నుడైన కొడుకు పిల్లలమీదే నీకింత మమకారముందే
కుటుంబ విద్వేషాల నడుమ నీ సగం జీవనం నలిగిపోయిందే
అయినా మన మధ్య బంధానికి అడ్డు రాని ఎన్నో కథలు
నీ గుండెల్లో గుంభనంగా దాచుకున్నావు
ఎన్నడూ నీ కష్టాన్ని పైకి వెలిబుచ్చలేదు
ఏ రోజుకారోజు గురించి ఆలోచించమని
బతికి చూపించావు
ముగియని కథవై
నా పిల్లలకూ కథల నాన్నమ్మవైన
నీ కథ ముగిసిందా!!!

రాజుగారూ-గుర్రాలూ
చాకలీ- గాడిదా