సంపాదకీయం

జనవరి 2013 సంచిక: మాట్లాడుకుందాం రండి!

జనవరి 2013

ఈ ‘వాకిలి’ ఒక కల.

ప్రతి పత్రికా- అది అచ్చులో అయినా, అంతర్జాలంలోనయినా- అందమయిన కలతోనే పుడుతుంది.

‘వాకిలి’ కల మీతో అరమరికలు లేని సాహిత్య సంభాషణ! ఎలాంటి మొహమాటాలూ లేని, అచ్చంగా సాహిత్య విలువల మీది ప్రేమతో మాట్లాడుకోవడం! విమర్శనీ, ప్రశంసనీ సమహృదయంతో ఆహ్వానించే సహనాన్ని పెంచడం! జీవితంలోని కొత్త కోణాల మీద నిజాయితీతో నిండిన వెలుగుని ప్రసరించడం! స్వచ్చమయిన స్వేచ్చని గౌరవించే సాహిత్య సమూహాన్ని సమీకరించడం!

గత ఇరవయ్యేళ్లుగా తెలుగు సాహిత్యం సంశయ యుగంలోంచి నడుస్తోంది. ఏది సాహిత్యం అనేది పెద్ద సంశయం! అనేక రకాల సాహిత్య ధోరణులు కొన్ని సార్లు ఊపిరాడనీయని సందిగ్ధంలోకి  కూడా తోస్తున్నాయి. ముఖ్యంగా అస్తిత్వ వాద ధోరణులు మన ముందు చాలా కొత్త ప్రశ్నల్ని నిలబెట్టాయి. కానీ, వాటికి సమాధానాలు వెతుక్కునే లోగా అవే సందిగ్ధంలో పడ్డాయి. ప్రశ్నలు మిగిలిపోయాయి, సమాధానాలు దొరకలేదు. ఈ స్థితిలో సాహిత్యం ఏం చేస్తుంది? ఇదే ఇప్పటి సంశయం. రచయిత కేవలం వాస్తవికతని ఫోటో తీసే ఛాయాచిత్రకారుడే అయితే, ఈ సంశయం లేకపోయేది. ఆ మాటకొస్తే, ఫోటోకి ఒక తాత్విక కోణం లేదని అనగలమా? ఫోటోని ఏ కోణం నించి తీస్తారన్న దాన్ని బట్టి ఆ వాస్తవికత మీద ఆ ఫొటోగ్రాఫర్ దృక్పథమూ తెలిసిపోతుంది కదా!

రచయిత వాస్తవికతని తనదయిన కంటితో చూస్తాడు. తనదయిన ఉద్వేగంతో, ఆలోచనతో ఆ వాస్తవికతకి ఒక ప్రత్యేకతని ఇస్తాడు. ఈ ‘తనదయిన’ చూపు అన్నది ఇప్పుడు మసకబారిపోతోంది. పొగమంచు లోకం మన ముందు అన్ని దృశ్యాల్నీ, అన్ని అనుబంధాల్నీ, అన్ని విలువల్నీ  పరాయీగా మార్చేస్తోంది. అన్నిటికీ మించి, అసలు అవన్నీ జీవితానికి అవసరమా అన్న మరీ వ్యాపార/ భౌతిక పక్షపాత ధోరణి మనల్ని ముంచెత్తుతోంది. వీటికి అతీతంగా ఆకు మీది నీటిబొట్టులా వుండడం రచయితకి సాధ్యం కాదు. తన కాలాన్ని తన పరిసరాల్ని మరచిపోయే  పరవశత్వం మంచి సాహిత్య లక్షణం కాదు. మంచి మనిషితత్వమూ కాదు.

ఒక సంశయాన్ని జయించి తన స్వరాన్ని నిక్కచ్చిగా వినిపించే సాహసం ఈ కాలం రచయితకి కావాలి. ఆ సాహసమే ఆ రచయిత తన పాఠకులకు ఇవ్వాల్సింది. వ్యక్తిత్వాన్ని నిలబెట్టగల, వ్యక్తిత్వంలోని అంతస్సూత్రాన్ని తెగిపోకుండా పదిలపరిచే భరోసా ఇవ్వాలి మంచి సాహిత్యం. ఇదంతా ఒక ఎజెండా ప్రకారం, ఒక  పార్టీ తీర్మానం ప్రకారం జరక్కపోవచ్చు.  రచయితలోని ఉద్వేగం, సున్నితత్వం తనకి తెలియకుండానే ఈ పనిచేస్తూ పోతుంది. ప్రకృతిలోంచి, బంధాల్లోంచీ, సమూహాల్లోంచీ, తన దినచర్యలోంచీ, వృత్తి వ్యాపకాల్లోంచీ రచయిత ఒక ప్రపంచాన్ని ఆవిష్కరిస్తాడు. రచయితకి వున్న గొప్ప శక్తి ఏమిటంటే: అతని అక్షరం! అవి వాక్యాలవుతున్నప్పుడు కొన్ని భావాలని మోసుకెళ్తాయి. అవి కథలవుతున్నప్పుడు కొన్ని జీవితాల్ని తాకుతూ వెళ్తాయి. అవి కవితలయినప్పుడు కొన్ని అనుభూతుల్ని నరాల్లోకి ప్రవహిస్తూ వెళ్తాయి. ఇంకా వేర్వేరు రూపాల్లో వేర్వేరు అనుభవాలవుతాయి. ఏ రూపం తీసుకున్నా, అది ఒక జీవితం ఇంకో జీవితంతో పలకరించే సన్నివేశం. ఒక అనుభవం ఇంకో అనుభవంతో ముడిపడే సంభాషణ. అనేక మానవ సమూహాల మధ్య స్నేహ బంధాన్ని నిర్మించే కరచాలనం.

అలాంటి కరచాలనాల వెలుగులతో చీకట్లని జయించడం ‘వాకిలి’ కల. ఇది కేవలం ‘వాకిలి’ కల కాదు. రచయితలందరి కల. అలాంటి అనేక కలల్ని వాకిట్లో కూర్చోబెట్టి, సంభాషణ మొదలెట్టడమే ‘వాకిలి’ చేయగలిగింది. ఈ సంభాషణలో మీరూ వాక్యం అవ్వండి. మీ వాక్యాల లాంతరులో ‘వాకిలి’ని వెలిగించండి.