కవిత్వం

కొత్త కొత్తగా

08-ఫిబ్రవరి-2013

ఇవాల్టి నుంచీ కొత్తగా మొదలవుదాం
నిన్నటికి కొనసాగింపుగా కాక
ఈ రొజే మొగ్గ తొడుగుతున్నట్లుగా
తాజా తాజాగా
పరిమళ భరితంగా
పాపాయి
లేలేత చేతుల్లోని
అరవిచ్చిన బోసి నవ్వుల్లోని
మృదువైన స్పర్శ లాగా
కొత్త కొత్తగా మొదలవుదాం

మాటలు పాతవే కావచ్చు
సంభాషణలు సరికొత్తగా
మొదలుపెట్టుకోవచ్చు
చూపులు అవే కావచ్చు
సరికొత్త దృశ్యాల్ని ఆవిష్కరిద్దాం
రంగులు రుచులు ముఖాలు
అన్నీ పాత పాతగానే వుండొచ్చు
ఒకసారి ప్రయత్నిస్తే
ఏదో ఒక కొత్తదనం దొరక్క పోదు
ఈ రోజు రేపటికి పాతదైనా
ఈ వసంతం
చివరాఖరికి పులిసిపోయినా
ఈ రోజును మాత్రం
కొత్తగానే మొదలు పెడదాం

ఏమో
ఏ తేనెటీగ
మనలోని మకరంద బిందువుల్ని
ఒక చోటుకు చేర్చుతుందో
ఏ మంచు బిందువు
మన పెదవులపై
సూర్యోదయ కాంతిలో
తళుక్కుమంటుందో
ఏ దేహపు చిగురు వర్ణం
ఎన్ని కాంతులీనుతుందో
ప్రారంభిస్తేనే కదా తెలిసేది
కొత్తదనపు రుచి
ఎప్పుడూ
క్షణం తర్వాతి క్షణం
కొత్తదే
ప్రతి క్షణం
సరికొత్తగా ప్రారంభించడానికి
ఈ రోజే మొదలు పెడదాం

కొత్త కాలపు సువాసనల్ని శ్వాసిద్దాం
నిన్నటి దు:ఖాల్నీ దిగుళ్లనీ
మంటల్లో వేసి
నేటి వేకువ ఝామున
నులివెచ్చగా చలి కాగుదాం
ఇవాల్టి నుంచీ కొత్త కొత్తగా మొదలవుదాం



One Response to కొత్త కొత్తగా

  1. nsmurty
    February 8, 2013 at 3:39 am

    మాధవరావు గారూ,

    ఎవరి ఇరుకుగదుల్లో వారు గతంతో సంభాషిస్తూ గడిపే కంటే, వర్తమానంలో బతకడానికి ఎప్పుడూ మనుషులు కుతూహలం కలిగి ఉండాలి. అది వ్యక్తికీ, సమాజానికీ కూడా మంచిదే.

    అభివాదములు.

Leave a Reply to nsmurty Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)