కవిత్వం

ప్రథమ సమాచార నివేదిక -వైరముత్తు

సెప్టెంబర్ 2016

డో?

మగో?

పిసరంత ప్రాణి
మిల్లీగ్రామంత ప్రాణం
బ్రతికే ఉందో?
మరణించిందో?

ముందుగా ఢీకొని చెదిరింది-
మెదడో?
మొండెమో?
మర్మస్థానమో?

నోటికందిన పువ్వులో
మధువు సేవించి ఎగిరుంటుందా?
ఇప్పుడు ముళ్ళకంపలో
శవమై వేలాడుతూంటుందా?

ఒంటిరెక్కతో పాకుతూ
మరోరెక్కకై వెతుకుతుందా?
చీమల పుట్టలో వేయిముక్కలై
సమాధి అయ్యుంటుందా?

క్షణంలో ఎంత ప్రమాదమొచ్చిపడిందని
నొచ్చుకుని ఉంటుందా?
కావాలని చేసిన హత్య అని
తిట్టుకుంటూ నిష్క్రమించుంటుందా?

మరో ప్రయాణంలో తారసపడితే, ఈ మనిషిని
‘పోనీ పాపం’ అనుకుని క్షమిస్తుందా?
పురుగువై పుట్టెదవుగాక – అని శపిస్తుందా?

ఆకృతి మారినా, జీవులన్నింటికీ
ప్రాణం విలువ సమానమేనన్న
జ్ఞానం కలిగించే వెళ్ళుంటుందా?

పచ్చని పొలాల మధ్య రహదారిలో
నీడలు జారిపడే కార్ విండ్‌షీల్ద్ కి
అకస్మాత్తుగా ఢీకొని చెదరిపోయిన ఆ
సీతాకోకచిలుక!

మూలం: వైరముత్తు రాసిన “ముదల్ తగవల్ అఱిక్కై” అన్న అరవ కవిత
సంపుటి: కొంజం తేనీర్ నిఱైయ వానం (కాస్త తేనీరు బోలెడంత ఆకాశం), 2003
అనువాదం: అవినేని భాస్కర్