కవిత్వం

దాహంతో…

సెప్టెంబర్ 2016

ఎండుతనపు నగ్నత్వం ఎలా వదిలిపోవాలీ
తడిబట్టను దేహం పై కప్పాలి

నది నదిలా కనబడకపోవడంకంటే
గొప్ప విషాదమేముందీ

ఇక్కడ ఒక నది ఉండాలి
నదిలో చూసుకున్న నా ప్రతిబింబం
ఇక్కడిక్కడే ఒయాసిస్సై ఎగురుతూ ఉండాలి

కొన ఊపిరితో ఎవరో దాహం దాహం అని
తల్లడిల్లుతున్నట్టుంది

***

అప్పుడపుడు
ఏకాంత రాత్రిలో

ఎండిన నది పాయలమీద
నిశ్శబ్దం చేతిలో చేయి వేసుకొని నడుస్తాను

నల్లగా కందిపోయిన నింగి
వెలుతురిని గుటకలుగా మింగుతూ
ఎక్కిళ్ళలో చీకట్లని జాలువారుస్తుంది

నది మీద శకలాలుగా రాలిపడుతూ
తిమిరం
సైకతచోరులు తవ్వితీసిన గుంతలలో
సెదదీరుతుంది

నదికి నిలువునా గాయాలైనట్టు
అక్కడక్కడా బురద పేరుకుపోయింది

నదికి దాహం బాగావేస్తున్నదేమో
కొద్ది కొద్దిగా వెన్నెల కరుగుతూ ఉంది

నాగరికత అంతా మనదే అనుకుంటాం గానీ
అదంతా నది నిర్మించిన చరిత్ర కదా

ఇపుడు
నాగరికత కుదుళ్ళతో కదులుతున్నట్టు
వాడిపోయిన మట్టిమడతల ముఖంతో నది…

నది వల్ల జీవితాన్ని తాగిన నేను
ఇపుడు
నదికి జీవితాన్ని తాపాలి.

నదీ మూలం దగ్గర నుంచి
ప్రయాణం మళ్ళీ మొదలెట్టాలి