కవిత్వం

మీరు వేరు నేను వేరు – వైరముత్తు

అక్టోబర్ 2016

న్ను క్షమించండి

తేనెటీగలు వెంటబడితే
చెల్లాచెదురై పరుగుతీసే పిల్లల్లా
గబగబా ప్రయాణానికి బయల్దేరే
ఉల్లాస జీవుల్లారా

నన్ను క్షమించండి

మీతో పరుగు
అసాధ్యం నాకు
నన్ను వెంబడించడం
వీలుకాదు మీకు

పెట్టెలో మీ
బట్టలతోబాటు దుఃఖాలనూ
కుక్కుకుంటున్న యాత్రికులారా

కండరాలు గట్టిబడి
కొయ్యబారిపోయాక
హఠాత్తుగా ఆత్మవికాసమంటూ
బయలుదేరిన పర్యాటకులారా

త్వరత్వరగా మనుషులవ్వాలని
ఆశపడిన సంచారులారా

వీపున గూటినిమోసే నత్తల్లా
గుండెల్లో ఇల్లుమోసుకుంటూ
విహారానికి బయలుదేరిన ప్రయాణికులారా

మీతో పరుగు
అసాధ్యం నాకు
నన్ను వెంబడించడం
వీలుకాదు మీకు

*

మీరు పక్షులను చూస్తే
చప్పట్లుకొట్టి పారద్రోలుతారు

నేను
పక్షి ఈకలో
అది ఎగిరిన
ఆకాశపు పొడవు వెడల్పు
కొలుచుకుంటాను

*

నదిని చూస్తే
శత్రువుల్లా రాళ్ళేస్తారు

నేను
చెప్పుల్లేని పాదాలతో
నడిచొచ్చిన నదీ!
నీ అరికాళ్లలో ఏవైనా గాయాలున్నాయా అని
కళ్ళు తడి చేసుకుంటాను

*

సుగంధ నక్షత్రాల్లా
వికసించిన పువ్వులను చూస్తే
తెంపుకోడానికి త్వరపడతారు

నేను
శిరసు తెగినా నవ్వులుజల్లే
పువ్వుల ఔదార్యాన్ని
మనసులోనే మెచ్చుకుంటాను

*

మూడు రోజుల్లో
మూడువందల కిలోమీటర్లు
దాటేయడమే మీ లక్ష్యం

నేను
ఒక సీతాకోకచిలుక రెక్కకింద
వారమంతా విడిది చెయ్యాలనుకుంటాను

*

మీరు
పర్యటనకొచ్చినచోటకూడా
హంసతూలికాతల్పాలు కోరుకుంటారు

నాకు
ఎండుటాకులే దుప్పటి
చెట్టువేరే తలగడ

*

సంపూర్ణ విముక్తి పొందలేరు
పర్యటనలో పఠనానికై
బళ్ళుగట్టుకుని నవలలు
తెచ్చుకుంటారు

నేను
గడ్డిపరకపై
మంచుదిద్దిన అక్షరం కంటేనా ఈ
మనుషుల రాతలని మురిసిపోతుంటాను

*

మీరు నాగరికులు
తడిసిన గడ్డినేలపై
కుర్చీవేసుకుంటారు

నేను
గడ్డిపైన పడి పొర్లి పొర్లి
పులకించిపోతుంటాను

*

మీరు
మసక కమ్ముతుందనగా
మందుసీసాల మూతలు తీస్తారు

నేను
భరిణెల వంటి మొగ్గలు
గాలి విసురుకెలా తెరుచుకుంటాయో
తెలుసుకునే తపస్సులో మునిగి ఉంటాను

*

ప్రశాంతత కోసం వచ్చామంటూనే
ఫోన్ లో ఎఫ్‌ఎం ట్యూన్ చేస్తుంటారు

నేను
గాలి అలలవరుసల్లో
పక్షుల కువకువలు వింటూ
మైమరచిపోతుంటాను

*

అరిగిపోయిన అచ్చులో
ఇమడ్చబడ్డారు మీరు
నాలుక ఇచ్చే రుచితో తప్ప
ప్రపంచాన్ని ఆస్వాదించలేని వాళ్ళు

మీరు మారరు

స్వర్గంలో వదిలినా
మట్టినే తొవ్వుతుంది వానపాము

*

మీతో పరుగు
అసాధ్యం నాకు
నన్ను వెంబడించడం
వీలుకాదు మీకు

నన్ను క్షమించండి

మీరు వేరు నేను వేరు

***

మూలం: వైరముత్తు
అనువాదం: అవినేని భాస్కర్