కవిత్వం

కిటికీలోంచి

అక్టోబర్ 2016

నాలుగు చువ్వల్తో చిత్రం ఒకటి
గది గోడకు వేలాడుతుంది

ఇద్దరు మనుషులు సగం గ్లాసుల్తో నిలబడీ
పొగ నవ్వుల్ని తెరలుగా పంచుకుంటున్న దృశ్యం,
స్నేహం ఇద్దరికీ సంబంధంలేని
టీ కొట్టువానిక్కూడా మేలు చేస్తుంది

పొగదుమ్ము కక్కుతూ వొస్తున్న కారు చూసీ
చీరచెంగుతో కొడుకు ముఖం కప్పేసిందో అమ్మ,
బడిలో సూత్రాలేవీ బయటలోకానికి పట్టవని
వాడికింకా తెలీదులా వుంది

నోరు పెద్దగా తెరిచీ సౌండ్ మ్యూట్ లో
సీతాఫలాల బండివాడు అరుస్తున్నాడు,
కావాలనిపించే ఆశ కలిగిస్తే తప్ప
ఎంత తీయనిదైనా ఎవరూ రుచిచూడాలనుకోరని
ఆతనికి బాగా తెల్సులా వుంది

ఈ టైంలో కిటికీ తీస్తే ఎలారా…?
దాగున్న రెండు రెక్కలూ దగ్గరికి లాగి
చిలక వేసేసాడు మావాడు

ఇప్పుడు లోపల గదంతా
గాలాడని ఆలోచనల ఉక్కపోత.