వ్యాసాలు

కృష్ణశాస్త్రి – సినీ సాహిత్యం

నవంబర్ 2016

తెలుగు సినీ సాహిత్యానికి కావ్య గౌరవం తెచ్చిన రచయితలలో కృష్ణశాస్త్రిగారు ప్రసిద్ధులు. మల్లీశ్వరి సినిమాకి మాటలు-పాటలు రాయటంతో ఆయన తెలుగు సాహిత్యంలో చలనచిత్ర గీతాలకి ప్రత్యేకతని సంతరించారు. ఆయన వెలువరించిన సినీసాహిత్యంలో పరిశీలించవలసిన అంశాలు రెండు. ఒకటి మల్లీశ్వరి రచన. రెండు సినీగీతాలు.

దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రిగారు 1950 లో సినీరంగ ప్రవేశం చేశారు. తెలుగుచలనచిత్ర చరిత్రలో ఆణిముత్యమైన మల్లీశ్వరి చిత్రానికి ఆయన రాసిన సంభాషణలు చిత్రానికి వన్నె తెచ్చినాయి. ప్రసిద్ధ దర్శకులు బి.ఎన్.రెడ్డిగారు కృష్ణదేవరాయల కాలంనాటి కథని సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నారు. సంగీతం, సాహిత్యం, నాట్యం, శిల్పం వంటి లలితకళలకి సమ ప్రాధాన్యాన్నిచ్చి, రాయలవారి కళాభిరుచిని దృశ్యకావ్యంగా తీయాలని రెడ్డిగారి సంకల్పం. ‘దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి రచనలమీద నాకెంతో గౌరవం. ఆయనచేత చిత్రాలలో పాటలు రాయించాలనుకునేవాడిని. ‘మల్లీశ్వరి’ ఆలోచన రాగానే, ఆ కథకు ఆయనే తగినవారని, ఆయనతో చెప్పి రాయమని అడిగాను. కృష్ణశాస్త్రిగారు చాలా నిదానం, నెమ్మది. ఎంత ఆలస్యం అయినా సరే, ఒక కళాఖండంగా నిర్మించాలని వారిచేతనే మాటలు, పాటలు రాయించాను.’ అని బి.ఎన్.రెడ్డిగారు అన్నారు.

కృష్ణశాస్త్రిగారు రొమాంటిసిస్ట్ కావడంతో మల్లీశ్వరి చిత్రం ఆయన అభిరుచులకి తగ్గట్టుగా రూపుదిద్దుకుంది. ఏ సన్నివేశానికి, ఏ రసానికి, ఏ పాత్రకి మాటలు ఎంతవరకు అవసరమో గుర్తించి మరీ సంభాషణలు రాశారు. పాత్రల స్వభావాలని దృష్టిలో ఉంచుకొని ఔచిత్యాన్ని పాటిస్తూ రచన చేశారు.

పల్లె వాతావారణం, తిరునాళ్ళ సంబరాలు, నాట్య సన్నివేశాలూ, శిల్పుల జీవితాలూ, నేతపనివాండ్ర జీవితాలూ, రాజమందిర వాతావరణం, అమాయక ప్రకృతి – అన్నింటినీ పరిశీలించి సందర్భానికి తగ్గట్టు రచన చేశారు. సంభాషణలు పాత్రల స్వభావాలనుంచి పుట్టే సంఘర్షణలకి అద్దం పడతాయి. తద్వారా కథ నడుస్తుంది. కథని సాగదీసినట్టుగా కాకుండా, సహజధోరణిలో నడిపించడం కృష్ణశాస్త్రిగారి ప్రతిభకి గీటురాయి.

కృష్ణశాస్త్రిగారు కవి. సంభాషణలు రాసేటప్పుడు ఆయనలొ కవి కనిపించడు. పాత్రల మనసులోంచి, వాళ్లున్న పరిస్థితిలోంచి ఎలాంటి మాటలు వస్తాయో ఆలోచించి, ఆ మాటలనే రాయటం ఆయన ప్రత్యేకత. అసలు అభిప్రాయాన్ని ప్రకటించడానికి మాటలూ, అనుభూతిని వ్యక్తం చేయడానికి కవిత్వమూ అన్న స్పృహ సంభాషణల రచయితకు ఉండాలి. ఆ స్పృహ కృష్ణశాస్త్రిగారికి ఉంది.

‘మల్లీశ్వరి’ చిత్రంలో చిన్నపిల్లల అల్లరీ, అమాయక సంభాషణమూ, ఆటపాటలూ చిత్రించి మల్లీ,నాగరాజుల బాల్యాన్ని రసమయం చేసారు. నాటక రచనా, సినిమా రచనా కొంచెం దగ్గరగ ఉంటాయి. కథలోని పాత్రల స్వభావాల సంఘర్షణలోంచి పలికే సంభాషణలే కథని కొసదాకా నడిపిస్తాయి.

‘మల్లీశ్వరి’ చిత్రంలో నాగమ్మ అత్యాశ, నాగప్ప సంతృప్తికర జీవితం, మల్లీ, నాగరాజుల అమాయకత్వం, కళాభిరుచులూ, రాయలవారికి కళలపట్ల ఉన్న ఆదరణ కథకి కీలకమైన అంశాలు. నాగమ్మ ‘తన కూతురు మహారాణివారి ఇష్టసఖి కావాలని’ ఆశపడటం, నాగరాజు ‘మల్లిని మహారాణీవారి ఇష్టసఖిని చేయమని’ అమాయకంగా కోరటం, రాయలవారు సరదాపడి వారి ముచ్చట తీర్చటం – ఈ మూడు అంశాలూ కథని నడిపించాయి. నాగరాజు శిల్ప సృష్టి, మల్లీశ్వరి నాట్యకౌశలం కథకి వన్నెలు దిద్దినాయి. మల్లీశ్వరి నవరసభరితంగా రూపుదిద్దుకొంది.

‘రాతిబొమ్మ మోజులో పడి, అసలు బొమ్మని మరిచిపోతావేమో’ అని మల్లి అంటే ‘అసలు బొమ్మకంటే రాతిబొమ్మే నయం కదూ’ అని నాగరాజు అంటాడు. ఈ సంభాషణం తనని పట్టించుకోకుండా, బొమ్మలు చెక్కడంలో, నిమగ్నమైన బావ మనసుని మళ్లించడానికి మల్లి సరదాగా అన్నదీ, నాగరాజు చమత్కారంగా అన్న మాటలూ కథకి జీవం పోసినాయి.

మహారాజావారి మెడలోని హారం మల్లి చేతిలోకీ, పల్లె వాతావరణంలో పండిన జాంపండు రాణీవారి చేతిలోకి మారడం కథని మలుపు తిప్పింది. రాజుగారి కళాభిరుచి,పల్లెప్రజల అమాయక సంస్కృతీ ప్రస్ఫుటించేలా చిత్రించిన ఈ సన్నివేశం కళలకీ రాజుల కొలువుకీ వంతెనలా భాసిల్లింది.

ధనం, అహంకారం నాగమ్మ వ్యక్తిత్వాన్నీ, మంచితనం, అమాయకత్వం నాగప్ప వ్యక్తిత్వాన్నీ తీర్చిదిద్దినాయి. పౌరుషాన్ని ప్రదర్శించిన నాగరాజు శిల్పవిద్యలో రాణకెక్కుతాడు. మల్లీశ్వరి రాణీవారి ఇష్టసఖి అవుతుంది.

మల్లి,నాగరాజుల వియోగాన్ని కృష్ణశాస్త్రిగారు హృదయాలని కదిలించేలా చిత్రించారు. చివరికి ప్రేయసీ ప్రియులు సాహసించి దగ్గరవటంతో, రాయాలవారు ముచ్చటపడి, వారిని విడుదల చేయటంతో కథ సుఖాంతమౌతుంది.

రాణివాసాలకంటే అమాయక పల్లెటూరి నివాసమే సుఖమని గ్రహిస్తారు, మల్లీనాగరాజులు. వారి కోరికని రాజుగారు రాణీవారికి తెలియజేసినపుడు రాణీవారు ‘పాపం! ఆ చిన్నవారి మనసులో రాణీవాసపు భోగభాగ్యాలంటే వింత వింత ఊహలున్నాయి కాబోలు’ అని అంటారు. రాణివాసాల భ్రమ తొలగి, జీవితంలో అసలు వాస్తవాన్ని ఆవిష్కరించటం చిత్రంలో ప్రధాన ఉద్దేశ్యం. ప్రేమ ఎంత ఉదాత్తమైనదో, జీవనసౌందర్యాన్ని ప్రేమ ఎలా ప్రోది చేస్తుందో కళాత్మకంగా చెప్పిన చిత్రం ‘మల్లీశ్వరి’. కళలకి, ప్రేమకీ ఎంత దగ్గర సంబంధముందో చెప్పిన చిత్రం ఇది. కళాకారుల సృజనాత్మక అనుభవాన్నీ, ఆ అనుభవంలో వారు పడే వేదననీ, లక్ష్యసాధనలో వారి దృఢ దీక్షనీ మల్లీ నాగరాజు పాత్రలలో కృష్ణశాస్త్రి తేటతెల్లం చేశారు.

సాహిత్యం రసజగత్తు. చలనచిత్ర రచన ప్రజలకి సన్నిహితమైన శైలిలో ఉండాలి. మనుషులూ వారి ప్రవృత్తులూ, కదలికలూ, మాటతీరూ, స్వరభేదాలూ, సంస్కారం, కుటుంబ నేపధ్యం, పరిసరాల ప్రభావం, అనుబంధాలూ – అనురాగాలూ అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని, లోకంపట్ల ఎరుకతో సంభాషణలు రాయడం వల్ల ‘మల్లీశ్వరి’ కళాఖండమయ్యింది. సాహిత్యానికి సంబంధించి తనవంతు పాత్ర సమర్థంగా నిర్వహించారు కృష్ణశాస్త్రిగారు.

చలనచిత్ర రచనతో కృష్ణశాస్త్రిగారిలోని కవి ప్రజలకి మరింత సన్నిహిత మయ్యాడు. తెలుగు మాటల కూర్పు పాటకి ఎలా ప్రాణం పోస్తుందో కృష్ణశాస్త్రిగారికి బాగా పట్టుబడింది. సినిమాలో సందర్భం, పాత్రల స్థితిగతులూ, అప్పటి మనస్స్థితి, వారి భాష అన్నీ తెలుసుకొని పాట రాసినప్పుడే సినిమాపాట రక్తి కడుతుంది. కృష్ణశాస్త్రిగారి పాటలలో ప్రత్యేకత ఏమిటంటే, సినిమా చూస్తున్నప్పుడు ఎటువంటి అనుభూతికి లోనవుతామో, పాట విడిగా వింటున్నప్పుడు కూడా అటువంటి అనుభూతికి లోనవుతాము.

మానవ జీవితంలో ఎన్నో సన్నివేశాలు, ఎందరో మనుషులు, ఎన్నెన్నో మానసిక స్థితులు. అన్నింటికీ అన్ని రకాలుగా భాషలో మాటలుంటాయని కృష్ణశాస్త్రిగారి విశ్వాసం. ఆ ‘మాట’ తప్ప మరో ‘మాట’ ఆ మానసిక స్థితిని వ్యక్తం చేయలేదని ఆయన నమ్మకం. ఆ ‘మాట’ వచ్చేదాకా ఓపిక పడితే, పాట జీవం పొసుకుంటుంది. మాటకి పర్యాయ పదాలుండవనీ ఆ స్థితిని వ్యక్తం చేయడానికి అది తప్పనిసరి పదమని ఆయన అభిప్రాయం. అందుకే కృష్ణశాస్త్రిగారి పాటల రచనలో ఆలస్యం జరిగినప్పటికీ, పాటలు అమృతబిందువులైనాయి. సంగీతం నాదం ద్వారా సాధించేది. కవిత్వం శబ్దం ద్వారా సాధించాలి. తెలుగు జీవితాన్ని ప్రతిబింబించే కృష్ణశాస్త్రిగారి పాటలు రెండు సంపుటాలుగా వెలువడ్డాయి. 1975లో కృష్ణశాస్త్రి సన్మాన సంఘం, మద్రాసు వారు ‘మేఘమాల’ పేరుతో ఒకటీ, 1996లో ఓరియంట్ లాజ్మన్ వారు ‘గోరింట’ పేరుతో ఒకటీ సినిమాపాటల సంకలనాలు వెలువరించారు.

జానపద గీతాల స్వరూప స్వభావాలూ, నన్నయవంటి మహాకవుల పద్యాల ఛందో రీతులూ, త్యాగయ్య అన్నమయ్యల కీర్తనల అంతఃసౌందర్యమూ, జీర్ణించుకొని, తెలుగుపదాల కూర్పులో పాటని పలికించే సౌందర్య రహస్యాన్ని కృష్ణశాస్త్రి గ్రహించగలిగారు. ప్రజల జీవితంలోని కష్టసుఖాలూ, మాటతీరూ నిశితంగా పరిశీలించే దృష్టి కృష్ణశాస్త్రికి పుష్కలంగా ఉంది.

కృష్ణశాస్త్రిగారి శైలి లలితమైనది. ఆయన ముద్రని మనం పాటలో పట్టుకోగలం. ఆ ఆత్మీయతని ఆయన పాట కూర్పులో సాధించగలిగారు. దానికి కారణం ఒక మాట పక్కన ఏ మాట పొదిగితే భావం, రసం, రాగం సమర్థంగా పలుకుతాయో కృష్ణశాస్త్రిగారికి తెలిసిన విద్య. అందరం మాట్లాడుకొనే మాటలతోనే పాట పాడించగల కళావేత్త. ఆయన. ‘పాట పదములకై నిత్య పథికుడు’ కృష్ణశాస్త్రి.

భావ వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కృష్ణశాస్త్రిగారి సినీగీతాలని ఐదు రకాలుగా విభజించవచ్చు. 1. జోలపాటలు 2. సంస్కృతి 3. సంస్కరణదృష్టి 4. మానవత 5. ప్రణయం.

పసితనంలో అమ్మ పాడే జోలపాటతో మనిషికీ పాటకీ అనుబంధం ఏర్పడుతుంది. చందమామ రావె! జాబిల్లి రావే! అంటూ మానవ జీవన స్రవంతిలో ఆనందాన్ని కలిగించే పాటలు ఎన్నో ఉన్నాయి. కృష్ణశాస్త్రిగారు ఈ పాటల తత్త్వాన్ని గ్రహించి, ఆయన పద్ధతిలో కొన్ని సినిమాలకి సందర్భానికి తగినట్టుగా జోలపాటలు రాసారు. ఆ పాత్రల స్థితిగతులని బట్టి పాటలో చరణాలు ఉంటాయి. ఆ పాటలు వింటుంటే పాత్రల స్వభావాలు మనకు అవగతమవుతాయి.

‘బంగారుపాప’ సినిమాకి రాసిన పాటలో ‘ లుళలుళలుళా! అనే సాకీతో ప్రారంభమై, ‘తాధిమి తకధిమి తోల్బొమ్మా! దీని తమాష కీల్బొమ్మా!’ అంటూ తాత్త్విక ధోరణిలో సాగే జోలపాట రాశారు. ‘ఎవరికెవ్వరో ఏమౌతారో, యివరము తెలుసా? కీల్బొమ్మా, ఈ యివరము తెలుసా మాయబొమ్మా’ అనే చరణంలో మనిషి జీవితరహస్య మార్గాలని అన్వేషించే ధోరణి ఉంది. ‘కోపము తాపము క్రూరకర్మలూ, కూడని పనులే తోల్బొమ్మా, పాపపు రొంపిని పడబోకే, పరమాత్ముని నమ్మవె కీల్బొమ్మా’ అంటూ మానవులు జీవన ధోరణిని తెలియజేస్తారు. ఈ సందర్భంలో పాప సాహచర్యంతో దుర్మార్గుడు మంచివాడుగా మారతాడు. ఆటన్నా పాటన్నా పరమాత్ముని బొమ్మలాటని చెప్పే జీవన సత్యం ఈ పాటకి సాహిత్య గౌరవాన్నిచ్చింది.

‘సంపూర్ణ రామాయణం’ చిత్రంలో ‘రామాలాలీ! మేఘశ్యామాలాలీ! తామరస నయనా! దశరధ తనయాలాలీ! ‘ అనే పాటలో దృశ్య చిత్రీకరణంలో పాత్రల స్వభావాలు ఆవిష్కరించేలా, మాటలు పొదిగారు కృష్ణశాస్త్రిగారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి, రామునికి తల్లులు. ‘ఎవ్వరు ఊపాలి? ఎవ్వరు జోల పాడాలి?’ అని కౌసల్య ‘నేనా’ అంటుంది. కన్నతల్లికే సందేహం వస్తే, సుమిత్ర ‘నేనో’ అని తటపటాయిస్తుంది. కైకెయి ‘నేనే’ అని ఖచ్చితంగా చెబుతుంది. కాకువు భేదంతో కైకేయికి రామునిపై ఎంత ప్రేమ ఉందో చెప్పి కృష్ణశాస్త్రిగారు ఈ జోలపాటలో కైకేయి స్వాభావిక సౌందర్యాన్ని ఆవిష్కరించారు.

‘కాలం మారింది’ చిత్రంలో అనాధ బాలికపై జోలపాట కరుణరసం ఉట్టిపడేలా రాశారు. ‘పల్లె నిదురించేను – తల్లి నిదురించేను! ప్రతిపాప తల్లి పొత్తిళ్ళు నిదురించేను’ అని ప్రారంభించి, ‘ఎవరికి నీవు కావాలి? ఎవరికి నీ మీద జాలి’ అని అనాధబాలికని ప్రశ్నిస్తారు. ‘ఏ తల్లి పాడేను జోల? ఏ తల్లి ఊపేను డోల, ఎవరికి నీవు కావాలి, ఎవరికి నీ మీద జాలి’ అని ప్రపంచం కర్కశత్వాన్ని ప్రకటిస్తారు. ‘కలువ పాపాయికి కొలను ఒడి ఉన్నది! చిలుక పాపాయికీ చిగురు ఒడి ఉన్నదీ! ప్రాణమే లేని ఒక శిలకు గుడి ఉన్నది! నీకే.. అమ్మ ఒడి లేనిదీ … గుడి లేనిదీ … ‘ ప్రకృతిలో అన్నీ ఆనందంగానే ఉన్నాయి. మానవ సమాజంలోనే కరుణలేదనీ,మనుషుల కంటే మతానికి ప్రాధాన్యానిస్తున్నారనే జీవనసత్యాన్ని కృష్ణశాస్త్రి భావకవిత్వంలో ఒక అంశమైన దృశ్యచిత్రణం కళాత్మకంగా చేశారు.

తెలుగువారి సంస్కృతికి అద్దం పట్టేవి పండగలు. మానవులందరూ కలసి మెలసి సాగించే జీవన విధానంలో పండగలకి ప్రాధాన్యం ఉంది. సుఖదుఃఖాలూ, కలిమిలేములూ అన్నీ మరచిపోయి, ఆనందాన్ని పొందేది పండగలప్పుడే. పల్లెలు సంస్కృతికి ఆటపట్టు. నారు పోసింది మొదలు,పంటలు ఇళ్ళకి చేరేదాకా మనిషికి పాట తోడు ఉంటూనే ఉంటుంది. తెలుగు సినిమాలలో కృష్ణశాస్త్రిగారు మన పండగలని చిత్రిస్తూ కొన్ని పాటలను రాశారు. అవి ఆయనకి మన సంస్కృతి పట్ల ఉన్న అవగాహనని తెలియజేస్తాయి.

మన పండగలు వినాయక చవితితో ప్రారంభమౌతాయి. ‘వినాయక విజయం’ చిత్రానికి రాసిన పాటలో ‘వేల్పులందరిలోన తొలివేల్పువో ఏమో! పూజలలో మొదటి పూజ నీదేనేమో! అని అంటారు. పిల్లలూ పెద్దలూ భక్తి శ్రద్ధలతో చేసే వినాయక పూజని ప్రస్తావించారీ పాటలో. అట్ల తదియకీ, ఉండ్రాళ్ల తదియకీ ‘గోరింటాకు’ పెట్టుకొని సంబరపడే కన్నెపిల్లల కలలని చిత్రిస్తూ ‘గోరింట పూసింది కొమ్మా లేకుండా, మురిపాల అరచేత మొగ్గా తొడిగింది, ఎంచక్క పండిన ఎర్రని చుక్క , చిట్టీ పేరంటాలికి శ్రీరామ రక్ష’ అంటారు. ‘మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు, గన్నేరులా పూస్తె కలవాడొస్తాడు. సిందూరంలా పూస్తే చిట్టీ చేయంతా అందాల చందమామ అతనే దిగివస్తాడు.’ కృష్ణశాస్త్రిగారు కలలకి మాటల రంగులద్ది, భావాన్ని అందంగా పలికించి తెలుగు సంస్కృతిలోని సౌందర్యాన్ని ఆవిష్కరించారు.

‘అమెరికా అమ్మాయి’ తెలుగుపాట పాడే సన్నివేశాన్ని చిత్రించి, ‘ఒళ్లంత వయ్యారి కోక, కళ్లకు కాటుక రేఖతో’ తెలుగు పడతిని పరిచయం చేస్తారు. సాంస్కృతిక సౌందర్యమంతా మూసపోసిన పాట ఇది.

‘కార్తీక దీపం’ చిత్రంలో కృష్ణశాస్త్రిగారు కార్తీకమాసంలో స్త్రీలు అరటిదొప్పలపై దీపాలు వెలిగించి, చెరువులలో వదిలే దృశ్యాన్ని చిత్రిస్తూ పాట రాశారు.

‘ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం
చేరనీ నీ పాద పీఠం కర్పూర దీపం ‘

అనే పల్లవితో ప్రారంభమై, ‘ఆకాశానా ఆ మణిదీపాలే ముత్తైదువులుంచారో, ఈ కోనేటా, ఈ చిరుదివ్వెల చూచి చుక్కలనుకొంటారో’ అని అంటారు. భావకవికి భావన ముఖ్యం. భూమ్యాకాశాల మధ్య దూరాన్ని చెరిపివేసేలా చిత్రీకరించిన పాట కృష్ణశాస్త్రిగారిది. మన సంస్కృతిలోని సౌందర్యాన్ని భావించి రాసిన పాట ఇది.

‘రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా’ అంటూ రాసిన పాట ‘ఉండమ్మా బొట్టు పెడతా’ చిత్రంలో సంక్రాంతి వాతావరణాన్ని సాక్షాత్కరింపజేస్తారు. ‘కడివెడు నీళ్లు కళ్ళాపి చల్లి గొబ్బిళ్లో గొబ్బిళ్లు, కావెడు పసుపు గడపకు పూసి గొబ్బిళ్లో గొబ్బిళ్లో’ అంటారు

‘గాదుల్లో ధాన్యం ! కావిల్లా భాగ్యం
కష్టించే కాపులకూ! కలకాలం సౌఖ్యం’

అని శ్రమైక జీవన సౌందర్యాన్ని పలికిస్తారు. సాంస్కృతిక నేపథ్యంలోంచి కృష్ణశాస్త్రి రాసిన పాటలు తెలుగు సాహిత్యంలో శాశ్వతమైన స్థానాన్ని పొందాయి.

రాజారామమోహనరాయలు మానవోద్యమం ప్రభావంతో ఆంధ్రదేశంలో సంస్కరణ ఉద్యమాలకి శ్రీకారం చుట్టినవారు కందుకూరి వీరేశలింగం పంతులుగారు, రఘుపతి వేంకటరత్నం నాయుడుగారు. ఇద్దరూ బ్రహ్మ సమాజానికి ఉద్యమరూపాన్ని ఇచ్చినవారే. సంస్కరణ ఉద్యమంలో వితంతు వివాహం, వేశ్యానిర్మూలనం, దళితుల ఉద్ధరణం ప్రధానమైన అంశాలు. ఈ భావాలు నేపథ్యంలోంచి భావకవితా వైతాళికుడు కృష్ణశాస్త్రి కొన్ని సినిమాపాటలు రాశారు.

‘కల్యాణ మంటపం’ సినిమాలో ఒక వేశ్య కూతురు తనకి తమ కులవృత్తి నచ్చక సాంసారిక జీవితం గడపాలని కోరుకుంటుంది. ‘సరిగమపదనిస… పలికేవారుంటే, హృదయము తెరిచేవారుంటే.. వలచే మనసుకు బదులుగ, పిలిచే కనులకు ఎదురై, ఎదురై పలికేవారుంటే” అని ఆమె సంస్కరణ భావాలు గల హృదయంకోసం ఎదురుచూస్తోంది. ‘ఒక కోవెలలో ఒకడే దేవుడు, ఒక హృదయంలో ఒకడే ప్రియుడు! జీవన నేత, ప్రేమ విధాత ‘ అని కృష్ణశాస్త్రిగారు వేశ్యా వృత్తిలోంచి బయటపడాలనుకొనే స్త్రీ ఆకాంక్షని చిత్రించారు.

సామాన్యులు ఊర్వశిని వేశ్యగా భావిస్తే, కృష్ణశాస్త్రి విశ్వప్రేయసిగా గౌరవించారు. స్త్రీని ఉన్నత దృష్టితో చూడటం భావకవిత్వంతోనే ప్రారంభమైంది. స్త్రీ హృదయాన్ని, ఆవేదననీ అర్థం చేసికొని కృష్ణశాస్త్రి సంస్కరణ దృష్టితో రాసిన పాట ఇది.

హరిజనోద్యమం, కళావంతుల వివాహం మొదలైన సంస్కరణ ఉద్యమాలతో సన్నిహిత సంబంధం గల కృష్ణశాస్త్రిగారు సినీ సాహిత్యంలో సంస్కరణ ధోరణి ప్రదర్శిస్తూ ‘మంచిరోజులు వచ్చాయి’ చిత్రంలో

‘నేలతో నీడ అన్నది నను తాకరాదనీ
పగటితో రేయి అన్నదీ నను తాకరాదనీ
నీరు నన్ను తాకరాదనీ గడ్డిపరక అన్నది
నేను భర్తనే తాకరాదనీ ఒక భార్య అన్నదీ’

అనె పాటలో కులాంతర వివాహం చేసుకున్న భార్య భర్తని తృణీకరించిన సందర్భంలో ఆమె హృదయాన్ని సంస్కరించే ధోరణిలో కృష్ణశాస్త్రి ఇలా అంటారు.

‘రవికిరణం తాకనిదే నవకమలం విరిసేనా
మధుపం తను తాకనిదే మందారం మురిసేనా’

అని ప్రకృతిలోని నైర్మల్యాన్ని మనుషుల్ని అలవరచుకోమంటున్నారు. ‘అంటరానితనము – ఒంటరితనము, అనాదిగా మీ జాతికి అదే మూలధనము’ అని అంటారు. మనుషుల మూర్ఖత్వాన్ని తొలగించే ప్రయత్నం. ఈ భావసంస్కరణం. అదే కృష్ణశాస్త్రి పాటలకి ఆభరణము.

కృష్ణశాస్త్రిగారి సాహిత్యంలో అంతర్లీనంగా స్ఫురించేది మానవత. మనిషిని మనిషిగా, మానవునిగా చేసేది మానవత. ప్రపంచ పరిస్థితుల పట్ల , విశ్వమానవుల పట్ల కరుణతో అర్థం చేసుకొనే స్పృహ కలిగించేది మానవత. కొన్ని సినిమా పాటలలో మానవతా సుమగంధాలు వెదజల్లేరు కృష్ణశాస్త్రి.

సుఖదుఃఖాలు చిత్రానికి రాసిన పాట. ‘ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది’ అనే పల్లవితో ప్రారంభమౌతుంది. ‘మరిగిపోయేది మానవహృదయం కరుణకలిగేది చల్లని దైవం;’ అని అంటారు. ‘ద్వారానికి తారామణి హారం, హారతి వెన్నెల కర్పూరం’ అని పాట ముగిస్తారు. సంకుచిత మనస్తత్త్వాన్ని చెరిపి విశాల దృక్పథాన్ని ధ్వనింపచేస్తున్నారీ పాటలో. వ్యక్తులు తమ ఇళ్లలో జరిగే శుభకార్యాలకి గుమ్మాలకి మామిడితోరణాలు కట్టుకుంటారు. ఒక చిన్నపళ్లెంలో హారతి పడతారు. కానీ కవి విశ్వకుటుంబి . ప్రపంచ శుభం కోరే కవి ఇంటి గుమ్మానికి నక్షత్రాల మణిహారమే తోరణం. ఆకాశం హారతిపళ్లెం. చందమామ కర్పూరం బిళ్ల. వెన్నెల హారతి. ఆరుమాటలలో ఆరు ఖండాలని కలిపి, విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని ధ్వనింపజేసిన ఈ గీతం మానవతకి అద్దం పడుతుంది.

‘ఉండమ్మా! బొట్టు పెడతా’ చిత్రంలో ‘అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది’ అనే పాటలో ‘ఆ గుడిలో దీపం ఉంది . అదియే దైవం’ అని అంటారు కృష్ణశాస్త్రి. మానవ హృదయంలో వెలిగే ప్రేమ ఆ దైవం. ‘ప్రతిమనిషి నడిచే దైవం. ప్రతి పులుగూ ఎగిరే దైవం’ అని అంటారు. మతవైషమ్యాలతో మనిషిని మరిచిపోతున్న ఈనాడు మనిషిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతని గుర్తు చేస్తున్నారు కవి. మతం కంటే మానవత ఎంత గొప్పదో చెబుతున్నారు. మనిషి మనసు ఈశ్వరుని కొలువు అనిపించాలనే తపనతో రాసిన గీతమిది. కులమతాల కతీతమైన మానవత ఈ గీతంలో అక్షరకాంతులు వెదజల్లింది.

తెలుగు సినీ గీతాలలో ప్రణయానికి ప్రాధాన్యాన్నిచ్చిన వారిలో కృష్ణశాస్త్రిగారిని ప్రత్యేకంగా చెప్పాలి. వియోగాన్నీ, సంయోగాన్నీ సున్నితంగా చెప్పడంలో ఆయన సిద్ధహస్తులు. ‘మల్లీశ్వరి’ చిత్రానికి రాసిన పాటలు ప్రణయ మాధుర్యానికి ప్రతినిధులు.

‘మనసున మల్లెల మాలలూగెనే, కన్నుల వెన్నెల డోలలూగెనే’ అంటూ మల్లీశ్వరి చిత్రంలోని విరహగీతం కథానాయిక మనోభావాలని క్రమక్రమంగా వ్యక్తం చేస్తూ, ఆమె తన వ్యక్తిత్త్వాన్ని విశ్లేషించుకొనేలా చిత్రించిన ధోరణిలో రచించారు కృష్ణశాస్త్రి. భావకవిత్వంలో లిరిక్ లక్షణాన్ని పుణికి పుచ్చుకున్న గీతమిది. ‘ఎన్నినాళ్లకీ బ్రతుకు పండెనో, ఎంత హాయి ఈ రేయి నిండెనో’ అని ముగిసిన ఈ పాట సినిమాలో సందర్భానికి సరిగ్గా అతకడమే కాక, విడిగా విన్నప్పుడు ఆ దృశ్యం మన మనస్సులో కనిపించేలా రాశారు కృష్ణశాస్త్రి.

‘ఎందుకే నీకింత తొందర, ఇన్నాళ్ల చెరసాల ఈ రేయి తీరునే’ అని తొందరపడే మనసుని చిలకగా భావించి, రాణివాసమనే పంజరంలోంచి కథానాయిక విముక్తమవటాన్ని సూచించి, పాటరచనలలో సృజనాత్మక భావనకి ప్రాధాన్యాన్నిచ్చారు కృష్ణశాస్త్రి.

ఆకాశవీధిలో హాయిగా ఎగిరే మేఘమాలని పిలిచి, మల్లి అమాయకంగా తన హృదయ వేదన తెలుపుతూ మల్లీశ్వరి చిత్రంలో,

‘జాలిగుండెల మేఘమాలా! నా, బావలేనిది బ్రతుకజాల!
కురియు నా కన్నీరు గుండెలో దాచుకొని
వానజల్లుగా కురిసి పోవా! కన్నీరు, ఆనవాలుగా బావమ్రోల’

వియోగ శృంగారం పలికించారీ గీతంలో.

‘సుందర సురనందనవని మల్లీ, జాబిల్లీ!
అందేనా! ఈ చేతుల కందేనా?
చందమామ ఈ కనులకు విందేనా? ‘

అనే పాట ‘పూజాఫలం’ చిత్రానికి రాశారు. ప్రేమించిన ప్రియుడు ఎదురుగా ఉన్నా తనకి దక్కక పోవడాన్ని కన్నులకి విందులు చేస్తూ, చేతులకందని చందమామలా చెప్పేరీ పాటలో కృష్ణశాస్త్రి. ‘కలువ పేద బ్రతుకులో వలపు తేనె నింపేనా? ” అంటూ పేద ప్రియురాలి మనోవేదన వియోగ శృంగారంలో పలికించి ప్రకృతిలో మానవ మనఃస్థితిని దర్శించారు.

‘రానిక నీకోసం సఖీ! రాదిక వసంత మాసం’ అంటూ ‘మాయని మమత’ చిత్రంలో విఫలప్రేమని పలికించారు. వియోగంతో భార్యకి భర్త రాసిన లేఖ రూపంలో ‘కుశలమా! నీకు కుశలమేనా?’ అని అంటూ ‘బలిపీఠం’ చిత్రంలో రాసిన పాటలో విరహాగ్ని కొత్త తరహాలో పలికించారు.

ప్రియుని తన ఒడిలో పరుండబెట్టికొని ‘ రాజమకుటం’ చిత్రంలో కథానాయిక పాడే పాట ‘సడిసేయకేగాలి సడిసేయబోకే ‘ అంటూ కృష్ణశాస్త్రి అమూర్తమైన వాటికి ఆకారాన్ని కల్పిస్తారు. ‘పండువెన్నెల నడిగి పాంపు తేరాదే! నీలిమబ్బుల దాగి నిదుర తేరాదే! విరుల వీవన పూని విసిరిపోరాదే! ‘ గాలిని బ్రతిమాలే ధోరణి ప్రణయంలో ప్రకృతిని చిత్రిస్తారు కృష్ణశాస్త్రి.

‘ఏకవీర’ చిత్రంలో ‘ప్రతిరాత్రి వసంత రాత్రి, ప్రతిగాలి పైరగాలి, బ్రతుకంతా ప్రతినిమిషం పాటలాగ సాగాలి’ అంటూ సంయోగ శృంగారంలోని సౌందర్యాన్ని పలికించారు కృష్ణశాస్త్రి. ‘మావిచిగురు తినగానే కోయిల పలికేనా/ కోయిల గొంతు వినగానే మావిచిగురు తొడిగేనా?’ అని ‘సీతామాలక్ష్మి’ చిత్రంలో రాసిన పాటలో ప్రణయంలో అమాయక ప్రకృతిని చిత్రించారు. ‘ఒకరి పెదవి పగడాలు వేరొకరి కనుల దివిటీలు, ఒకరి గుండె ఉయ్యాల వేరొకరి గుండె జంపాల’ అనడంలో ప్రణయం హృదయంలో మాధుర్యాన్ని చిందించాలనే భావనకి ప్రాధాన్యాన్నిచ్చారు.

తెలుగు సాహిత్యరంగంలో ప్రత్యేకించి, సినిమారంగంలో విలువలు పడిపోతున్న ఈనాడు కూడా కృష్ణశాస్త్రి సినిమా పాటలకి వన్నె తగ్గలేదు. దానికి కారణం, తెలుగు మాటలకి, జిలుగు వెలుగూ కలిగించి, పాటలు రాసి, పాటలో భావసౌందర్యాన్ని ఆవిష్కరించటం, మానవ మనస్తత్త్వంలోని వైవిధ్యాన్ని గ్రహించి, విభిన్న అనుభూతులని పాటలుగా పలికించిన కృష్ణశాస్త్రి తెలుగు సాహిత్యంలో అజరామరుడు.

కృష్ణశాస్త్రిగారి సాహిత్యాన్ని పరిశీలిస్తే ఆయన సౌందర్య ప్రస్థానంలో శాశ్వతమైన స్వేచ్చకోసం, నిర్మలమైన ప్రేమకోసం, శాశ్వతమైన సౌందర్యం కోసం ఆయన పడిన తపన తెలుస్తుంది.

‘కృష్ణపక్షం’లో కవికుమారుడు భౌతికమైన స్వేచ్చాన్వేషణంలో ప్రేమకి దూరమై, సౌందర్యాన్ని కోల్పోయాడు. ‘ప్రవాసం’ లో దుఃఖంతో తనని తాను సంస్కరించుకొనే ప్రయత్నం చేశాడు. ప్రేమభావనతో హృదయాన్ని సౌందర్యమయం చెసుకున్నాడు. ‘ఊర్వశి’లో శాశ్వతసౌందర్యాన్ని దర్శించాడు. శోధన, సాధన, ఆరాధన ప్రధానమైన అంశాలుగా సాగిన కృష్ణశాస్త్రి సౌందర్య ప్రస్థానంలో ప్రేమ ఎంత ఉదాత్తమైనదో తెలుస్తుంది.

ప్రకృతిప్రేమ, మానవత, భక్తి, ప్రణయం, పల్లీయ జీవనమాధుర్యం, దేశభక్తి మొదలైన అంశాలు ఆయన కవిత్వంలో చోటు చేసుకొని, మానవవిలువలని ఆవిష్కరించాయి.

భౌతిక సౌందర్యం కంటే ఆత్మసౌందర్యం శాశ్వతమైనదనే సత్యం ఆయన సాహిత్యంలో మనకి కనిపిస్తుంది. బ్రహ్మసమాజం, మానవోద్యమం ఆయనకి మానవులపట్ల కలిగించిన అవగాహనతో, ఆయన సృష్టించిన సాహిత్యం మనిషిపట్ల ఆయనకి గల ప్రేమని తెలియజేస్తుంది

ఆంగ్లవిద్యా సంస్కారం ఆయనకి సాహిత్య సృజనలో రూపానికి సంబంధించిన నూతన సంవిధానమూ, భావాలకి సంబంధించిన సంస్కరణ దృష్టిని అలవరించాయి. భావకవిత్వాన్ని ఉద్యమరూపం ధరించేలా చేసినాయి.

కృష్ణశాస్త్రి సౌందర్య దృష్టి, మానవ ప్రేమ, కరుణ, పదలాలిత్యం తెలుగు సాహిత్యంలో నవ్య ధోరణులకి మార్గదర్శకాలైనాయి.

**** (*) ****