కథ

తన్మయి

డిసెంబర్ 2016

రిగింది నిజమే… కానీ కలంత అందంగా. కల నీకు మిగిల్చే అనుభూతి వాస్తవంలో అనుభవంలోకి వస్తే ఈ దివాస్వప్నాలు నీ ఆత్మని కోటి దీపాలతో వెలిగించి చూపుతాయి.

ఈ అనుభవంతో కలిగే స్పృహ అందులో వుండగానే తెలిసిపోవటం కల మెలకువలు కలగలసిపోయిన ఈ మన:స్థితి ఓ చెంప భయపెడుతుంది. అందాన్ని చూసి కంపించినట్టు, ఆనందం నిన్నుతాకినా అందుకోవడానికి భయం కలుగుతుంది ఒక్కో క్షణం.

నువ్వు సిద్ధంగా వుండాలి. అది నిన్ను వెతుక్కుంటూ వచ్చిన లిప్తల్లో ఏమరుపాటుగా వున్నావా ఎప్పటికీ ఇక అంతే!

నా హృదయం కంపించిపోయే క్షణాల్లో అతనన్నాడు- ఈ ఆనందాన్ని అందరూ handle చేయలేరు.
People are dreaded to hold it. Not everyone’s heart has the ability to withstand the exciting happiness.
నీ దేహం నీ మనసు ఒకే రేఖపై నిలబడ్డప్పుడు అడుగు అటూ ఇటూ వెయ్యకు. అనుభవైకవేద్యమైన అనుభూతి నీ ఆత్మని నింపి నిన్ను అమరత్వం ఆవరిస్తుంది.

దూరం నించి చూసినప్పుడు అతని పట్ల ఏ భావం కలగదు; ఎంత ప్రయత్నించీ ఏమీ తెలుసుకోలేవు. కొన్ని సార్లు ఆ indifference ని భరించలేకపోయాను కూడా. నా మనసులో నేనే దగ్గరగా వెళ్ళాను. దూరం జరిగాను. ఏ రోజూ ఒక్కమాట పలకలేదు. ఇదంతా బాహ్యప్రపంచపు జంజాటం కాదు. నాకైనా లీలగా కూడా తెలియదు. నాకే ‘తెలియని నా లోపలి ఏకాంత లోకాల స్వప్న సంచారి అతడు.

ఇన్ని సంవత్సరాలకి ఇంత అనూహ్యంగా ఈ రహస్యం ఈ హేమంత వేళ చెవిలో గుసగుసలాడింది. రహస్యం నాతో చెప్పిందా… నేను రహస్యంతో అన్నానా జ్ఞాపకంలేదు కానీ, ఇద్దరం ఎదురెదురుగా ఉన్నప్పుడు నా గుండెల్లోకి లోతుగా చూసి నవ్వింది. మంచు తెరలు మెల్లగా కరిగి అదృశ్యలోకపు స్వప్నపాంథుడు నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు. నమ్మలేదు.

భయం కలిగింది మొదట. విస్మయం… కంపించిపోయింది దేహం.

నాకే తెలియని నన్ను చూపిస్తున్నాడు. వేలు పట్టుకుని కూడా వెళ్లడానికి ఎంత సంశయం!

కానీ ఆ క్షణాల తాదాత్య్మం నన్ను నిలువనీయలేదు. ఇన్నాళ్ళు ఏ వ్యక్తావ్యక్తపు లోక సంచారం చేశానో ఆ మార్మిక లోకపు మహారాజులా నన్ను ఆ mystic world లోకి తీసుకొనిపోయాడు.

ఇలా జరుగుతుందా? జరిగే వీలుందా? నన్ను చూసుకుంటే నమ్మక తప్పదు.

మామూలు మనసులు గొప్ప అనుభవాలు అందకోలేవేమో!!

సిద్ధంగానే వున్నా నాకే తెలియని స్థితిలో ఆ మాటలు మళ్లీ మళ్లీ చెప్పలేను. మొదటి సారి తాకినప్పుడు అతణ్ణి తాకొచ్చు అని కూడా తెలియలేదు. అంత బలంగా దగ్గరికి వెళ్లానని తర్వాత తనన్నప్పుడు కానీ తెలియలేదు. నాకు తెలియని నేను తనకెలా తెలుస్తున్నాను? ఆలోచనతో ఈ అనుభూతిని దూరం చేసుకోలేక నన్నతనికే వదిలేశాను.

ఎంత తేలికయ్యింది హృదయం! దూదిపింజలు కొండ శిఖరం మీద నుంచి విడిచినప్పుడు గాలి వాటుకి తేలిపోయే అనుభూతి. మాటలు వ్యర్థమైపోతాయంతే. నమ్మి తీరాల్సిందే. నేనే సాక్ష్యం.

మా కలయికకి ప్రకృతి ముందే సిద్ధమైపోయినట్లు- వెన్నెల వర్షంలా కురుస్తోంది. దారిపక్కల మిణుగురుల వెలుగులు
మార్గశిరపు గాలులు. ఈ ఏకాంతం. ఒక దృశ్యకావ్యానికి ఏ మాత్రం తీసిపోని కథలో కలల సంచారం. ఈ రాత్రిళ్ళిలా వింతకాంతితో ఎందుకు వెలుగుతున్నాయో! ఆ రోజు మా దారి కాని దారిలో, అనుకోని మలుపు తిరిగిన క్షణంలో, లిప్తపాటు ఏదో అదృశ్య భావం వీటన్నిటినీ చూపింది. రోజూ చూసే చోటుల్లో ఇంతటి ఆనందాలు. ఇది అతని మాయ తప్ప మరొకటి కాదు

ఆ రోజు sudden గా “We deserve a hug” అన్నాడు. Tone లో అదే indifference. క్షణంపాటు ఏమీ తోచలేదు. అబ్బా… అతని వాసన అల్లుకుంది అతనికంటే ముందుగా.

ఏ జన్మల కావలో అతణ్ణి వదలి వచ్చాను. ఇన్ని యుగాలు దాటి మళ్లీ చేరవచ్చాడు. నన్ను పట్టు విడవలేదు, మళ్లీ వస్తానని మాట ఇస్తే తప్ప. అప్పటికీ అపనమ్మకం కళ్ళల్లో. దూరం జరిగే వీలుందనే అనుకుంటున్నాడు. పిచ్చివాడు, ఆలస్యాన్ని ఈ సారి మన్నించలేదు. ఆ ఆక్రమణని నేనూ కాదనలేదు. వేల యోజనాలు దాటి వచ్చాడు. నేనెవరో చెప్పడానికి అభినయించిన నిర్లక్ష్యం పటాపంచలు చేశాడు. అమృతం నింపి వెళ్లాడు ఆత్మనిండా.

ఆ రాత్రి కొన్ని ప్రకృతి దృశ్యాలెప్పటికీ యాదృచ్ఛికాలు కావు. Important encounters are planned by the souls long before the bodies see each other. గుర్తొచ్చిందా మాట. అదే అన్నాను. చప్పున వేళ్ళతో పెదవులద్దాడు.

మాటలు ఎంత వ్యర్థమైనవి!

ఈ మౌనం చాలు మన మధ్య. “Let the stillness flow between our souls” అంటున్నాడు. కానీ చెప్పేయాలనుంది నాకు. నా మనసు ఇంతటి ఉద్వేగాన్ని భరించలేకపోతుంది దేహం.

వేకువ జామున ప్రయాణంలో సుప్రభాతం పాడుతోంది రేడియో. పక్కకి చూసి అన్నాడు “నువ్వే వెంకటేశ్వరుడివి ఇప్పుడు” అని. ఎలాంటి unusual పోలిక! కానీ, ఎంత బాగా అన్నాడు. ఇలాంటి పిచ్చి మాటలు నా మనసుని నింపుతాయంటే నేను వెఱ్ఱిదాన్ని అనుకుంటారేమో!!

కానీ ఇలా వుండి చూస్తే తప్ప నేను మరొకరికి అర్థంకాను. ఈ వగరు పెదవులు, ఆ వగరు వాసన ఇంత అద్భుతంగా వుంటాయా?
కొన్ని హద్దులు దాటి చూడలేకపోతే స్వర్గం పక్క నుంచి వెళ్తున్నా దానికి అంధులమైపోతాం.

వ్యర్థం చేశానిన్నాళ్లూ. అదే మాట అంటే, ‘పొరబడుతున్నావు. నువ్వు కోరడం చేత జరిగింది కాదు ఇది’ అంటున్నాడు.

ఏమైతేనేం, ఆనందంగా వున్నప్పుడు ఆనందంగా వున్నామని తెలిసిపోవటం ఎంత మందికి జరుగుతుంది? నీ హృదయం కవిలో పలకటం ఇత్తెఫాక్‌ గా జరిగేదేమీ కాదు.

అకస్మాత్తుగా దూరదర్శన్‌ రోజుల్లో ‘రుడాలి’ చూసి ఏడ్చిన రాత్రులు జ్ఞాపకమొచ్చాయి. ‘ఇంగ్లీష్‌ పేషెంట్‌’ నన్ను వెంబడించి వేధించిన పగళ్ళ కళ్ళ ముందు కదిలాయి. ఇతడికీ వాటికీ ఏంటి సంబంధం? మనసు వేటికెందుకు లంకెపెడుతుందో?! విషాదం కలవని ఆనందాన్ని ఎప్పటికీ చూడలేదేమో నా గుండె. ఏ emotions ఏ జ్ఞాపకాలని ఎందుకు ట్రిగ్గర్‌ చేస్తాయో చెప్పగలిగేదెవరు?

ఈ overwhelming రాత్రుల భావోద్వేగాలకు తలవంచటం మినహా మరేమీ చేయలేని నిస్సహాయత చేరింది నాలో. You are my Athena అని ఈ అపరాత్రి మసక వెలుతురు వేళ పలవరిస్తున్నాడు. ఇతనూ మరో వెఱ్ఱివాడు కాకపోతే మా కలయిక ఇంతటి అమృతం చిలికేదా? కొందరిని చూసినప్పుడు అందం అనే స్పృహే కలగదు. ఎన్ని మాటలతో చెప్తాడు అందాన్ని. నాకు మాత్రం ఈ విశ్వాంతరాళ ఆకర్షణ అతని చూపుల నించి పొంగుతుంది.

ఏ నక్షత్రరాశుల ధూళినుంచి పుట్టుకొచ్చాయో మా దేహాలు. అనంత దూరాల కావల జరిగిన వియోగం ఈ సంయోగ క్షణాల తీవ్రతని ఇంత ప్రజ్వలింపజేస్తుంది. భక్తుడు సూఫీ సంగీతం పాడినట్లు, నీకు దూరంగా వున్న వేళల్లో నిన్ను వేడుకున్నాను, తిట్టాను, ఏడ్చాను
సొమ్మసిల్లాను.
నిరీక్షణ ముగిసి నువ్వు ఎదురుపడ్డ క్షణాల్లో, నీ కళ్ళలో కళ్ళు నిలుపలేకున్నానని, నా స్థితి అచ్చంగా అలాగే తోచింది. దగ్గరి దూరాల యుక్తాయుక్తాల తర్కం మరిచిపోయింది మనసు.

ఇంట్లోవాళ్లు పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు చూచాయగా కూడా అతని మీద మనసైందనీ ఊసుకూడా బయటికి రానీయలేదు.
వాళ్లూ అనుకొని వుండరు. అతనికీ తెలిసే అవకాశం ఎంత మాత్రం లేదు. ఏమరుపాటున కూడా ఎవరి దగ్గరా అతని మాట తీసి ఎరుగను. అప్పటికి నా అనుభవం అతనికి దగ్గరగా వెళ్లనివ్వలేదు.

It is hard to explain.

చిత్రంగా తోచినా కానీ అతడిని పెళ్లాడటం ఎంత మాత్రం ఇష్టంలేపోయింది నాకు. అనుకోకుండా అతడిని కలిసిన క్షణాల్లో నా మనసే పలికింది అతని మాటల్లో.

మేం కలిసిన చివరి రాత్రి, ఇక అదే ఆఖరిసారి అని మాట తీసుకున్నాక నన్ను గుండెలకి హత్తుకుని ఆ రాత్రంతా అలాగే వుండిపోయాడు. ఆ కలవరింతల రాత్రి అలా ఘనీభవించిపోతే కాలంలో ఆ క్షణాల అమరత్వం అలా నిలిచిపోతుందనే వెఱ్ఱి కోరిక కలిగింది. ఆయుష్షు లేని ప్రేమకథలే అద్భుత కావ్యాలవుతాయంటే జత పలికింది నా హృదయం.

I’m the purest form of your love. There are no rules or principles that can bind us. There isn’t any traditional jewellery, nor any social contract… అంటున్నాడు.

తుదిమొదలు నెరుగని ప్రేమ కావ్యాల్లో కథానాయకుడైపోయాడు అతగాడు. ఎన్నటికీ ఎడతెగని ఎదురుచూపులకు ఇటుగా మిగిలిపోయాను నేను.

**** (*) ****

illustration: Javed



7 Responses to తన్మయి

  1. Vijay Koganti
    December 1, 2016 at 8:47 pm

    ఆసక్తి కరమైన సంభాషణ, చిత్రమైన జీవితపుమలుపు!
    కట్టి పడేసిన కధనం! బాగుంది.

  2. Sai Padma
    December 1, 2016 at 8:59 pm

    కొన్ని బంధాలు బాంధవ్యాలు కానంత మాత్రాన అపసవ్యాలు కావు. ఇప్పుడే ఉషాజ్యోతి బంధం గారి ” తన్మయి ‘ కథ చదివాను.
    విరహోత్సుకత, ఎన్ని రాత్రుళ్ళని వెలిగించి, ఎన్ని పగళ్ళని ఎడతెగని కవిత్వం చేస్తుందో కదా అనిపించింది. i still felt a little bit restraint in story, which is rather a muse’s monologue..
    అనిమిషంగా, అనుకోకుండా దొరికిన క్షణాలకీ, వో కలయికలో, తనని తాను పారేసుకొనే సూఫీతనపు సంతోషానికీ మధ్య ఉన్న చిన్నగీత ని , భలే పట్టారు..
    తరచి చూస్తే, total abandon లో చెల్లా చెదురైన కొన్ని ముత్యాలు, మిణుగుర్ల వెలుగులో, మెరసిన ఆత్మల కాంతులు .. వెరసి, ఈ కథలో పంక్తులు..

  3. December 1, 2016 at 10:34 pm

    బ్రతుకు బాంధవ్యాలు,కట్టుబాట్ల కతీతమైన pure form of love ,
    అది అలౌకిక జగత్తు లో ఆకర్షించుకుని కలుసుకున్న రెండు ఆత్మల -
    శివ శక్తి చైతన్యాల పవిత్ర అద్వైత స్థితి.
    A mistic union experienced by souls from materialistic world .

    ఆ అలౌకిక ఆత్మ బంధాన్ని అందంగా అల్లిన అక్షరాలు.

  4. Anusha
    December 2, 2016 at 10:32 pm

    Great ushajyothi aka proud of u

  5. December 3, 2016 at 12:54 pm

    నీ శైలి బాగుంది ఉషా ఒక జలపాతం లా సాగి పోతోంది ఒక కొత్తదనం ఉంది …రాస్తూ ఉండు లవ్ జె

  6. Siva Somayajula
    December 4, 2016 at 8:49 pm

    Loved it. Brilliant piece of writing.

  7. కృష్ణమోహన్
    December 17, 2016 at 4:01 pm

    మీ రచనా శైలి బాగుంది దీనిలో కథలు చదవటం ఈ రోజే మొదలు రెండో కథ మీ(ఈ)కథ చదివాను హత్తుకుంది మనసుకు

Leave a Reply to Siva Somayajula Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)