కథ

ప్రయోగం

డిసెంబర్ 2016

పొద్దున్నే నిద్ర లేవగానే, రాత్రి పడుకునే ముందు చదివిన పుస్తకం లోని వాక్యాలు దృశ్యాల రూపంలో కలలోకి వచ్చి నా నిద్రని కలత నిద్రగా మిగిల్చిన విషయం గుర్తుకొచ్చింది. రాత్రి నేను చదివిన పుస్తకంలో కొన్ని ప్రయోగాల గురించి ఉంది. అయితే అవి సైన్సుకి సంబంధించిన ప్రయోగాలు కాదు, మనుషుల జీవితాలకి సంబంధించిన ప్రయోగాలు. కొంత మంది తమ జీవితాలతో తాము చేసుకున్న ప్రయోగాలు. నిజానికి మహాత్మా గాంధీ తన జీవితమే సత్యంతో తాను చేసిన ఒక ప్రయోగం అని చెప్పుకున్నారు. సైన్సుకి సంబంధించిన ప్రయోగాలు భౌతికమయిన విషయాల గురించిన నిజాలను వెలికి తీస్తాయి. జీవితానికి సంబంధించిన ప్రయోగాలు మాత్రం మన దృక్పథాన్ని మార్చగలిగిన జీవిత సత్యాలని మనకి తెలియ చేస్తాయి. నిజానికి మన జీవితాలని మన ప్రమేయం లేకుండానే కాలం తన నిరంతర ప్రయోగాలకి గురిచేస్తూ ఉంటుంది.

అలాంటి ఆటుపోట్లని ఎదుర్కోవటం వల్ల మన ప్రమేయం లేకుండానే మనం కొన్ని కొత్త కొత్త పాఠాలను కూడా నేర్చుకొంటూ ఉంటాం. ఈ రోజు నిద్ర లేవగానే నాకూ ఇప్పటికిప్పుడు ఒక వింత ఆలోచన వచ్చింది. నిన్నటి వరకూ కాలం తన ప్రయోగ వస్తువుగా నన్ను ఉపయోగించుకుంది. కానీ ఈ రోజు కాలంతో నేనే ఒక ప్రయోగం చెయ్యాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నేను చేసే ఈ ప్రయోగం నిన్నటి వరకు ఉన్న నా దైనందిన జీవితానికి కొంచెం భిన్నంగా ఉండాలని కూడా తీర్మానించుకున్నాను. అందుకే ఒక చిన్న సరికొత్త ప్రయోగానికి నన్ను నేను సిధ్ధం చేసుకున్నాను.

రోజూ లాగ కాకుండా పక్క మీద నుంచి లేచి అప్పటికి నా దగ్గర ఉన్నఒక పాత, మాసిపోయిన, కొంచెం చిరిగిన డ్రెస్ వేసుకుని అన్నపానాలు, స్నానం లేకుండానే మామూలుగా నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా గుమ్మం దగ్గర నా కోసం ఎదురు చూసే ఎప్పుడూ వేసుకునే నా ఖరీదయిన చెప్పులని అలాగే వదిలేసి, అదే నా మాసిన గడ్డంతో రోడ్డు మీదకి వచ్చి బలాదూరుగా తిరగటం మొదలు పెట్టాను. నా చుట్టూ ఉన్న పరిసరాలను, మనుషులను గమనిస్తూ వెళుతున్నాను. క్రీస్తు ఉన్నప్పుడు ప్రపంచ జనాభా ముప్పై కోట్లని ఎక్కడో చదివాను. ఇప్పుడు మాత్రం ఏడు వందల కోట్లు పైనే. రద్దీలో ఈ రోడ్డు మీద ఒకరినొకరు పట్టించుకోకుండా కలియ తిరుగుతున్న ఏడు వందల కోట్ల జనాభాలో భాగమయిన ఈ మనుషులని చూస్తుంటే, ప్రతి మనిషికి మరో మనిషితో ఏదో ఒక అనిర్వచనీయమయిన కార్యకారణ సంబంధం ఖచ్చితంగా ఉండే ఉంటుందని అనిపించింది. అసలు నాకయితే మనందరం ఒక్కొక్కళ్ళం అంతు లేని చిక్కులు పడిపోయిన దారపు బంతి లోని చిక్కుముడులం అనిపిస్తుంది. ఇలా ఆలోచించుకుంటూ జీవితంలో మొదటిసారిగా, వేషభాషలతోను వాటివల్ల వచ్చే గౌరవ మర్యాదలతోను కూడిన నా అస్తిత్వాన్ని పక్కన పెట్టి బాధ్యతా రాహిత్యంగా, అన్య మనస్కంగా, ఏ గమ్యం లేకుండా ఊరికే నా కాళ్ళు ఎక్కడికి తెసుకెళితే అక్కడికి నడుచుకుంటూ వెళ్ళటం కూడా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది.

నా ప్రయోగంలో మొదటి రెండు గంటల్లోనే నా గురించి నేను ఒక కొత్త విషయం తెలుసుకున్నానన్న ఆ ఆనందంలో మునిగి ఉండగానే, ఉన్నట్టుండి ఒక బస్సు చాలా వేగంగా నన్ను గుద్దేటంత దగ్గర వరకూ వచ్చి సరిగ్గా దాని ముందు భాగం నా మొహాన్ని తాకుతుండగా సడన్ బ్రేకు వేయటం వల్ల కీచ్ మని శబ్దం చేస్తూ ఆగిపోయింది. నేను అనుకోని ఈ పరిణామానికి ఒక్క సారిగా భయపడి అదిరిపడ్డాను. కానీ ఆ బస్సు డ్రైవర్ సహా అక్కడ ఉన్నవారెవరికీ నా పరిస్థితిని గురించిన అవగాహన గానీ, ఆందోళన గానీ లేకపోగా, అప్పటి వరకూ అక్కడ నించున్న జనం ఆ బస్సు లోకి ఎక్కటం చూసి అది ఒక బస్టాప్ అన్న విషయం మాత్రం నా భయం నుండి తేరుకున్నాక నాకు అర్థమయ్యింది. అందరితో పాటు నేను కూడా బస్సు లోపలికి ఎక్కి కూర్చున్నాను. నిజానికి నా దగ్గర బస్సు టిక్కెట్టు కి డబ్బులు కూడా లేవన్న విషయం లోపల కండక్టరుని చూశాక గానీ గుర్తు రాలేదు. టిక్కెట్టు కి డబ్బులు లేకుండా బస్సు ఎక్కటం వల్ల ఆ కండక్టరు వేసే ప్రశ్నలకి నా మానసిక స్థితి ఎలా ఉంటుందని తెలుసుకోవటానికి ఇదీ ఒక ప్రయోగమేనన్న ధైర్యంతో అలాగే కూర్చుండి పోయాను. కానీ నాకు ఆ అవకాశం ఇవ్వకుండానే, రద్దీగా ఉన్న ఆ బస్సులో ఒక మూల కూర్చున్న నన్ను ఆ కండక్టరు గమనించకుండానే, బస్సు తన గమ్య స్థానానికి చేరిపోయింది.

ఆ కొత్త ప్రదేశంలో దిగే సమయానికి ఉదయపు ఎండ తీవ్రత కొద్ది కొద్దిగా పెరిగింది. ఆకలి నెమ్మది నెమ్మది గా తనకు తానుగా తనని నాకు మరోసారి పరిచయం చేసుకోవటానికి ఆరాటపడుతుంది. కొంచెం నీడ కోసం, ఇంకా తెరవని ఒక మెడికల్ షాపు ముందు కూర్చున్నాను. కొంత సేపటికి ఆ దుకాణం యజమాని నన్ను పక్కకి తప్పుకోమని చెప్పి, షట్టరుకి దణ్ణం పెట్టుకుని తాళం తీసి, షట్టరు పైకెత్తి చెప్పులు బయట వదిలి, లోపలికి అడుగు పెట్టి మొట్ట మొదటిగా ఎదురుగా ఉన్న ఒక పెద్ద షిరిడీ సాయిబాబా బొమ్మకి దణ్ణం పెట్టుకుని, ఆ పక్కనే ఉన్న మిగిలిన దేవుళ్ల పటాలకి కూడా పూజ చేసి అగరొత్తులు వెలిగించి వచ్చి తన కౌంటర్ లో కూర్చున్నాడు. ఎండ తీవ్రతకి చెమటలు పట్టి నా మొహం జిడ్డు కారటం మొదలయ్యింది. దానికి తోడు దుమ్ముతో కూడిన పరిసరాల వల్ల నా వొళ్ళంతా దుమ్ము కొట్టుకుపోయింది.

అప్పటి వరకు నేను నిర్లక్ష్యం చూపించటం వల్ల నా మీద కోపం తెచ్చుకున్న ఆకలి తొందరలోనే కడుపులో మంటగా మారి తన ప్రతాపం చూపించటం మొదలు పెట్టింది. నా కడుపులోని మంటకి ఈ మందుల షాపులో మందు ఏమయినా దొరుకుందేమో ఒక సారి సరదాగా అడగాలనిపించింది. “నాకు కడుపులో మంట గా ఉంది. మందు ఏమయినా ఉంటే ఇవ్వండి” అని అడిగాను దగ్గరికెళ్ళి. ఆ షాపు యజమాని నన్ను పైనుంచి కింది వరకూ ఒకసారి చూసి”తర్వాత ఇస్తాను. కాసేపు అలా పక్కన కూర్చో” అన్నాడు ఎంతో దయతో. నిజానికి ఏదో తమాషాకి అలా అడిగాను కానీ ఆకలికి మందు లేదనీ, అన్నమే మందు అనీ నాకూ తెలుసు. ఒక వేళ నిజంగా అలాంటి మందు ఈ మందుల షాపులో ఉన్నా ఇప్పటికిప్పుడు కొనడానికి నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. కానీ ఇప్పుడే ఇవ్వకుండా “కొంచెం సేపటి తర్వాత ఇస్తాను” అని షాపు యజమాని ఎందుకన్నాడో మాత్రం నాకు అర్థం కాలేదు.

ఒక అరగంట తర్వాత మళ్ళీ వెళ్ళి అడిగాను “కడుపులో మంటగా ఉంది. మందు ఇవ్వండి సార్” అని. షాపు యజమాని “ఒక్క అరగంట ఆగవయ్యా. ఇస్తాను” అని మళ్ళీ అదే మాట అన్నాడు. కొంచెం సేపటి తర్వాత ఒక పెద్ద మనిషి వచ్చి ఒక మందుల చీటీ చూపించి అన్ని మందులూ కొనుక్కుని వెళ్ళి పోయాడు. షాపు యజమాని అతని దగ్గర డబ్బులు తీసుకుని అది మొదటి బేరం కావటంతో దేవుడి పటాలకి చూపించి దణ్ణం పెట్టుకుని క్యాష్ కౌంటర్లో వేసుకున్నాక వెంటనే, మళ్ళీ ఒక ఆడ మనిషి వచ్చి మందులు కొనుక్కుని వెళ్ళిపోయింది. అలా చాలా సేపటి వరకూ ఒకళ్ళ తరవాత ఒకళ్ళుగా ఎవరో ఒకళ్ళు వచ్చి ఏవో మందులు కొనుక్కుని వెళ్ళిపోతున్నారు.

ఆ తర్వాత ఎప్పటికో ఇంకా అక్కడే కూర్చున్న నన్ను పిలిచి “ఇలా రా. నీకు ఏ మందు కావాలన్నావ్ ?” అని అడిగాడు. నేను వెళ్ళి “కడుపులో మంటగా ఉంది. మందు ఇవ్వండి సార్” అని అడిగాను మళ్ళీ. ఈ లోపు అప్పుడే వచ్చిన అతనికి బాగా పరిచయం ఉన్న ఒక పెద్దాయనతో కాసేపు మాట్లాడుతూ ఈ నెల తాము చేయబోయే దైవ కార్యాల గురించి చర్చించుకోవటం మొదలు పెట్టారు. వాళ్ళు ఆ సంభాషణలో మునిగి ఉండగానే, అవసరం లేని నా మందు గురించి మళ్ళీ ఆ షాపు యజమానిని అడిగి విసిగించకూడదని నిర్ణయించుకుని నిశ్శబ్దంగా వెనక్కి తిరిగి వచ్చేశాను. కానీ నాకు ముందుగా మందులు ఇవ్వకపోవటానికి కారణం మాత్రం నెమ్మది నెమ్మదిగా బోధపడింది.

పొద్దున్నే నా లాంటి మాసిన, చిరిగిన బట్టల్లో ఉన్నవాడికి, కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా, నూనె జిడ్డు కారుతున్న వాడికి రోజులో మొదటి సారి తన మందులు అమ్మటం వల్ల ఈ రోజంతా తన గిరాకీ అంత బాగుండకపోవచ్చు. తనకి కీడు కలగవచ్చు. రోజులో మొదటి సారి ఇలాంటి అపశకునం మొహంతో బేరం మొదలు పెట్టటం అతనికి ఎంత మాత్రం ఇష్టం లేదు. అందుకే నన్ను తర్వాత రమ్మని చెప్పాడు. నేను నిన్నటి నా వేషభాషలతో ఇక్కడికి వచ్చి ఉంటే నన్ను తప్పకుండా తన మొదటి వినియోగదారుడిగా అనుమతించి ఉండేవాడు.

అయితే ఇక్కడ అతను గుర్తించని చిన్న గమ్మత్తయిన విషయం ఏమిటంటే, షాపు తెరవగానే అతను మొదట దణ్ణం పెట్టుకున్న దేవుడిది కూడా జిడ్డు మొహమే. ఆ పటంలో ఉత్త కాళ్ళతో నించున్న ఆ దేవుడిది కూడా మాసిన గడ్డమే. ఆ దేవుడు వేసుకున్నది కూడా చిరిగిన చొక్కానే. కానీ ఇంత చిన్న విషయం ఆ షాపు యజమాని ఎందుకు గమనించ లేక పోయాడో నాకు అర్థం కాలేదు. ఇప్పటివరకూ అతని జీవితంలో ఎన్నో వందల సార్లు ఆ దేవుడికి దణ్ణం పెట్టుకుని ఉంటాడు. కానీ ఒక్క రోజు కూడా ఆ దేవుడి రూపు రేఖలని గానీ, అందులో దాగి ఉన్న అంతరార్థాన్ని గానీ అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యలేదు. నిజంగా అలాంటి ప్రయత్నమే కనుక చేసి ఉంటే ఈ రోజు తప్పకుండా నన్ను తన మొదటి వినియోగదారుడిగా ఏ సంకోచం లేకుండా అంగీకరించి ఉండేవాడు.

కొన్ని వేల సంవత్సరాలుగా మనిషి దేవుడిని నమ్మటం, పూజించటం అనే తంతుని నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉన్నాడు. కానీ అదే దేవుడి ఉపదేశాలలోని అసలయిన అర్థాన్ని పెడ చెవిన పెడుతూనే ఉన్నాడు. నిజానికి ఈ రోజు నేను ఈ ప్రయోగం చేయక ముందు వరకూ అతని లాగానే ప్రవర్తించాను. ఇప్పటికిప్పుడు ఈ ప్రయోగం తర్వాతే నాకూ ఈ సత్యం బోధపడింది.

ఈ నాటి నా ప్రయోగం విజయవంతంగా పూర్తయ్యింది. మరో కొత్త ప్రయోగం కోసం, మళ్ళీ మరో కొత్త సూర్యోదయం కోసం ఎదురుచూడటం కోసం, నేను బయలుదేరిన చోటుకే మళ్ళీ నా ప్రయాణం మొదలు పెట్టాను.

**** (*) ****