లోచూపు

లోచూపుతోనే… (రెండవ భాగం)

ఫిబ్రవరి 2013

తనని సమీపించబోయే మృత్యువుగురించి హ్యూం ఎప్పుడూ సరదాగా మాటాడినప్పటికీ, ఆ హుందాతనాన్ని పదిమందిముందూ ప్రదర్శించడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. సంభాషణ సహజంగా ఆ విషయం వైపు మళ్ళితే తప్ప తనంత తాను ఆ ప్రస్తావన తీసుకు వచ్చేవాడు కాదు; అప్పుడుకూడా ఆ విషయం గురించి ఎంతసేపు మాటాడాలో అంతసేపే తప్ప అంతకుమించి కొనసాగించేవాడు కాదు; అయితే ఆ విషయం తరుచూ ప్రస్తావనలోకి వస్తుండేది, కారణం, అతన్ని చూడడానికి వచ్చిన మిత్రులు ఆయన ఆరోగ్యపరిస్థితి గురించి సహజంగానే అడిగే వాళ్ళు. నేను పైనప్రస్తావించిన సంభాషణ ఆగష్టు ఎనిమిదవ తేదీన మా ఇద్దరి మధ్యా జరిగింది; ఆ తర్వాత మరొక్క సారే మాటాడగలిగేను. అతను ఎంతగా నీరసించిపోయాడంటే, అతని ఆత్మీయమిత్రుల కలయిక అతనికి ఇంకా అలసట తెప్పిస్తోంది. ఎందుకంటే, ఇప్పటికీ అతనిలోఉన్న ఉత్సాహము ఎంత ఎక్కువా, అతని సౌజన్యమూ, స్నేహశీలతా ఎంత పరిపూర్ణమైనవీ అంటే, అతని పక్కన ఎవరైనా స్నేహితుడు కూర్చుంటే  బాగా చిక్కిపోయిన అతని శరీరం-అనుమతించినదానికంటే ఎక్కువగా, ప్రయాసపడుతున్నప్పటికీ మాటాడకుండా ఉండలేడు. అందుకని, ఎడింబరోలో నే నుండడానికి అతనొక కారణమైనప్పటికీ, అతని సలహా మేరకి, అతను నన్నెప్పుడు చూడాలనిపించినా నాకు కబురుపెట్టాలన్న షరతు మీద ఎడింబరో విడిచి ఇక్కడ కిర్కాల్డీలో మా అమ్మగారి ఇంటికి వచ్చేను; ఈ లోగా అతన్ని ఇప్పుడు తరచు పర్యవేక్షిస్తున్న వైద్యుడు డా. బ్లాక్, కూడా అతని ఆరోగ్యం గురించిన సమాచారం వీలున్నప్పుడల్లా తెలియజేస్తానని మాట ఇచ్చేడు.

ఆగష్టు 24న డా. బ్లాక్ ఇలా రాసేడు:

“నేను క్రిందటిసారి ఉత్తరం వ్రాసినప్పటికంటే, హ్యూం అతని సమయాన్ని చాలా సులువుగానే గడిపేడు, కాకపోతే, ఇంకా నీరసించిపోయేడు. రోజుకొకసారి లేచి కూచోడమూ, మెట్లుదిగి క్రిందకి వెళ్లడమూ, పుస్తకాలు చదువుకుంటూ కాలక్షేపం చెయ్యడం తప్ప ఇప్పుడు ఎవరినీ కలవడం లేదు. అత్యంత ఆత్మీయ మిత్రులతో సంభాషణ కూడా అతనికి అలసట కలిగించి, నొప్పి ఎక్కువచేస్తోంది; అదృష్టవశాత్తూ అతనికి మిత్రుల్ని కలవవలసిన అవసరం లేదు, కారణం, అతనికి ఏ రకమైన విచారమూ, అసహనమూ, వ్యాకులమూ లేవు; అతని సమయాన్ని పుస్తకాలు చదవడంతో బాగానే గడపగలుగుతున్నాడు.”

 

మరుచటి రోజు నాకు స్వయంగా హ్యూం దగ్గరనుండే ఉత్తరం వచ్చింది. దానిలో ముఖ్య విషయం ఇది:

ఎడింబరో,

ఆగష్టు 23, 1776

ప్రియ మిత్రమా!

నేను ఈ రోజు పక్కమీదనుండి లేవలేకపోవడం వల్ల మా నెవ్యూ*  సహాయం తీసుకోవలసి వచ్చింది.

***

నా ఆరోగ్యం త్వరగా క్షీణిస్తోంది. నిన్నరాత్రి నాకు కొంచెం జ్వరం వచ్చింది. అది ఈ సుదీర్ఘమైన వ్యాధికి ముగింపు పలుకుతుందేమోనని ఆశించానుగాని, దురదృష్టవశాత్తూ, అది చాలవరకు తగ్గిపోయింది. ఆ కారణంతో, నన్ను చూడడానికి నువ్విక్కడకి రావడానికి అంగీకరించలేను. ఎందుకంటే నేను నీతో గడపగలిగిన సమయం అతితక్కువ; కానీ, నాకు ఏపాటి శక్తి ఇంకా మిగిలి ఉందన్న విషయం డా. బ్లాక్ తెలియ పరచగలడు.  సెలవు.”

మూడు రోజుల తర్వాత డా. బ్లాక్ దగ్గరనుండి ఈ ఉత్తరం వచ్చింది:

ఎడింబరో,

సోమవారం,

26 ఆగష్టు, 1776,

గౌరవనీయులకు,

“నిన్న మధ్యాహ్నం సుమారు 4 గంటలకు హ్యూం పరమపదించేరు. అతనికి మరణం ఆసన్నమైనదన్న విషయం గురు శుక్రవారాల మధ్యలో, అతని అనారోగ్యం బాగా ముదిరిపోయి, ఎప్పుడైతే అతన్ని పక్కమీదనుండికూడా లేవలేనంత బలహీనుణ్ణిచేసిందో అప్పుడే రూఢి అయిపోయింది. అతను చివరిక్షణంవరకు స్పృహలోఉండి, మరణసమయంలో ఏ రకమైన బాధగానీ, కష్టంగానీ పడలేదు. ఏ క్షణంలోనూ సూచనప్రాయంగానైనా అసహనం ప్రదర్శించలేదు; అతను ఎవరితోనైనా మాటాడగలిగే సందర్భం తటస్థించినపుడు, ఎప్పుడూ ప్రేమగానూ ఆప్యాయంగానే మాట్లాడే వాడు. మీరు ఇక్కడికి రావద్దని ఇంతకుముందే అతను మీకు ఉత్తరం రాసి ఉండడం వలన మిమ్మల్ని ఇక్కడకి పిలిపించడం మర్యాద కాదని భావించి మీకు కబురుచెయ్యలేదు. అతను బాగా నీరసించిపోయినపుడు మాటాడడానికి చాలా కష్టపడవలసి వచ్చేది. అతను ఎంత ప్రశాంతమైన చిత్తముతో మరణించేడంటే, అంతకు మించిన స్థితి బహుశా మరొకటి ఉండదు. ”

ఆ విధంగా ఉత్తముడూ, ఎన్నడూ మరువశక్యంకాని మన స్నేహితుడు పరమపదించాడు; అతని తాత్త్విక వివేచననీ, అభిప్రాయాలనీ నిస్సందేహంగా మేధావులు చర్చిస్తారు, ప్రతివారూ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగానో వ్యతిరేకంగానో ఉండడాన్ని బట్టి వాటిని ఆమోదించడమో, ఖండించడమో చేస్తారు; కానీ,  అతని వ్యక్తిత్వంగురించీ అతని శీలంగురించీ ఎక్కడా అభిప్రాయభేదం ఉంటుందని అనుకోను. అతనికి ఎంత ఆత్మనిగ్రహం, భావరాగాలమీద అదుపూ ఉందంటే, మీరేమీ అనుకోనంటే, నా పరిచయస్థులలో ఇంతవరకు ఏ వ్యక్తిలోనూ అవి గమనించలేదు. అతనికి డబ్బుకి కటకటగా ఉన్నప్పుడు కూడా, అతని ఆర్థికపరిస్థితుల్లో అత్యంతావశ్యకమైన ఆ అతిపొదుపరితనం, తగిన సందర్భం వచ్చినపుడు, ఉపకారం చెయ్యడానికీ, దానం చెయ్యడానికీ అడ్డురాలేదు. అతని పొదుపరితనం లోభత్వంవల్ల వచ్చినదిగాక, అతను ఇతరులమీద ఆధారపడకూడదన్న స్వతంత్రేచ్ఛవల్ల వచ్చినది. అతని సుతిమెత్తని స్వభావం అతని మనోస్థైర్యాన్నిగాని, తీసుకున్న కఠిననిర్ణయాలనుగాని ఎన్నడూ సడలించలేదు. మర్యాదా, వినమ్రతతోపాటు ఎప్పుడూ చలాకీగాఉంటూ సరసోక్తులాడే అతని స్వభావం సహజమైనదేగాక ఏ ద్వేషపు ఛాయలూలేని అతని మంచిదనంనుండీ, అతని హాస్యప్రియత్వం నుండీ వచ్చినది; ఆ గుణం వేరెవరిలోనైనా అతితెలివిగా కనిపించి తరచు వెగటు పుట్టించి ఉండేది. అతని పరిహాసాల పరమార్థం ఎన్నడూ ఇతరుల్ని కించపరచడం కాదు; కనుకనే అవి, అతను తరచు పరిహాసమాడిన వ్యక్తులని కూడా, చిన్నబుచ్చుకుని కోపం తెచ్చుకునేట్టు చెయ్యకపోగా, వాళ్ళకికూడా నవ్వుతెప్పించడంలో ఎన్నడూ విఫలం కాలేదు. నిజానికి, అతనికున్న ప్రీతిపాత్రమైన అనేక మంచి గుణాలలో అతనితో సంభాషణని ఇష్టపడేలా చేసేది మరొకటి లేదేమో. సమాజంలో అందరూ ఇష్టపడే అలా ఎప్పుడూ సరదాగా, చలాకీగా ఉండే స్వభావం వెనుక తరచు చపలత్వమూ, మిడిమిడి జ్ఞానమూ కలగలిసి ఉంటాయి; కాని ఇతని విషయంలో అతని విస్తృతమైన అధ్యయనమూ, అత్యంత గంభీరమైన ఆలోచనాశక్తీ, ఏ విషయమైనా పరిపూర్ణంగా ఆకళింపుజేసుకోగల సమర్థతా అనువర్తించి ఉన్నాయి. మొత్తంమీద, అతని జీవితకాలంలోనూ, ఇప్పుడు అతను మనమధ్య లేనప్పుడూ, అతని గురించి నా ఖచ్చితమైన అభిప్రాయం ఒక్కటే: మానవసహజమైన బలహీనతలూ, పరిమితులకీ లోబడి ఒకవ్యక్తి ఎంతవరకు పరిపూర్ణ జ్ఞానవంతుడూ, ఉదాత్తుడూ, గుణవంతుడూ కాగలడో, దానికి అతిచేరువుగా వెళ్ళిన వ్యక్తి అతను.

తమకి ఎప్పుడూ ప్రీతిపాత్రమైన,

ఏడం స్మిత్

———————————————————————————————–

*(అతనికి ఒక సోదరుడూ ఒక సోదరీ ఉండటంతో  ఎవరి కొడుకో తెలియక అనువాదం చెయ్యలేదు)