కవిత్వం

కూవూ!

జనవరి 2017

ఎందుకు
ప్రేమించిందో
యేమో
చివుళ్ళతో పూసిన ఆ అడవిని,
ఆ వయారి రంగుల పిట్ట.
‘కూవూ’ అని పేరు పెట్టింది!
పూలతోటయిందాకా
కూసి మురిసి విరిసిపోయింది.
కొండకోనలనిండా
కలలను అల్లి
వూహల మత్తులో
పాటల వూయలలూపింది.

ఓతెల్లబోయిన వుదయాన
మాటన్నా చెప్పక
మరలిన మాసానికై,
తనదై నిలవని
రంగుల నద్దిన
ఆ పూవుల చిత్రానికై

యింకా వెదుకుతూ
‘కూవూ’ అని
పిలుస్తూ,
చూపుకు గొంతు తొడిగి
ఒకో వర్ణాన్నీ
ఆ అడవికే యిచ్చేస్తూ
యే వసంతమూ తనది కాదనే
గ్రహిస్తూ
పిచ్చిదానిలా
వన్నెలు రాలిన జీవిలా
కోయిలై!

Painting by Doris Blessington