కవిత్వం

పడక – వైరముత్తు

జనవరి 2017

క్కడా ఇక్కడా
ఎక్కడెక్కడో అల్లల్లాడి
అలసి సొలసి వేసారిన తెమ్మెర
పడకకై వెతికింది
ఆ రాత్రి కునుకుతీద్దామనిపూవులను పరచి
పడుకుందాం అనుకుందికొన్ని పూలలో తేనెచుక్కలు
కొన్ని పూలలో మంచుముత్యాలు
కొన్ని పూలలో తుమ్మెదలు

పూవుల్లో ఖాళీల్లేవు
తెమ్మెర ముందుకు సాగింది

*

ఉద్యానవనంలో -
వెలుగు తుడవని
చిమ్మ చీకట్లో
నిద్రపోదాం అనుకుంది

అక్కడ -
ఏకాంతంగా ప్రేమికులు
తెమ్మెర దూరి వెళ్ళేందుకు
వారి బిగికౌగిట సందులేదు

ఆశ్చర్యపోయి, ఓసారి తిరిగి చూసి
వెను తిరిగింది తెమ్మెర.

*

తెమ్మెరకు చదువొచ్చు
అక్షరాలు కూడబలుక్కుని
“పో లీ స్ స్టే ష న్”
అని చదివింది

లోనికెళ్ళి
తుఫాను వేగంతో బయటికొచ్చేసింది

మొరటు గురకలహోరులో
నిద్రపోయిన అలవాటులేక.

*

నేలమీనేలమీద ఆశలొదులుకొని
చెట్లకొమ్మల్లో తలవాల్చింది

ఒకటే రొద

పగలు రాలిన పండుటాకులకై
రాత్రంతా లేత ఆకుల ఏడుపులు

ఏడుపుకేకల మధ్యన ఎవరు నిద్రించగలరని?

*

శ్మశానమే సరైన చోటు
నిశ్శబ్ధంలో నిద్రపోవచ్చు

అక్కడున్నవాళ్ళెవరూ
కదలరు మెదలరు

శ్మశానంగోడెక్కి దూకింది తెమ్మెర

సమాధులు ఒకదానితో ఒకటి గొడవపడే అరుపులు

దేవదారు చెట్లవెనక దాగి పరీక్షగా చూసింది

ఒక్కో సమాధిమీదా ఒక్కో బిక్షగాడు

ఒకరి సమాధిని మరొకరు ఆక్రమిస్తున్నారని
ఎడతెరపిలేకుండ కొట్లాటలు

శ్మశానం నుండి బతికి బయట పడింది

విసిగిపోయిన తెమ్మెర ఆవిలిస్తూ
ఓ పాఠశాలలో పడక వెతుక్కుంది

తరగతిగదిలో కాలుపెట్టగానే జారిపడింది
పగలంతా పిల్లలు కార్చిన కన్నీళ్ళ తడి

వయసుకిమించిన భారంమోసే
పిల్లల వేడి నిట్టూర్పులు
వెన్ను కాలింది తెమ్మెరకు

వెనుతిరిగి
తిరిగిచూడకుండ వెళ్ళిపోయింది

*

మళ్ళీ అడవికే వెళ్ళి నిద్రపోదామంటే -
రాత్రిపూట చెట్లను హత్యచేసే
మనుషుల కలకలం

ఏం చెయ్యాలో తోచక
నడుస్తూనే నిద్రపోయింది

నిద్రలో దూరంగా ఎక్కడో వినిపించింది
చనుబాలవాసనతో ఓ జోలపాట

పాటొచ్చిన దిక్కుకి
సడిలేకుండ పరుగెత్తింది

పిల్లాడు నిద్రపోయినా తాను మేలుకుని
ఉయ్యాలనూచే చేయినీ,
లాలించే పాటనీ కొనసాగిస్తుంది
ఓ తల్లి

హమ్మయ్యా!

ఆమె నుదుటి చెమట ని
చల్లగ తాకిన తెమ్మర
చాప మీద మిగిలున్న చోటులో
ఆమె పక్కన ఒరిగి
హాయిగ పవళించింది!

***

అనువాదం: అవినేని భాస్కర్
మూల కవిత: “పడుక్కై” – వైరముత్తు
సంపుటి: పెయ్యెన పెయ్యుం మళై (కురవమనగా కురిసే వర్షం), 1998.