కథ

ఎర్రర్ ఆఫ్ లవ్

ఫిబ్రవరి 2017

నెలల పిల్లాడు మెత్తగా చెంపలు తాకుతున్నట్టు తగులుతుంది గాలి. నీటిలో తన ప్రతిబింబంపక్కనే విక్రం ప్రతిబింబం ఓలలాడుతూ తరంగాలతో కలిసి కలల రాగం ఒకటి బాణీ కడుతున్నట్టుగా ఉంది. ప్రియ తదేకంగా నీటినే గమనిస్తుంది. విక్రం చేతిలో ఒక చిన్న గులక రాయి నీటిలోకొదుల్తూ “ఏంటి, నవ్వుకుంటున్నావు?” అనడంతో సర్దుకుని “నవ్వేనా?” అని మందహాసంతో కళ్ళు విప్పారుస్తూ చూసింది. తీర్చి దిద్దిన కనుబొమ్మల కింద తడి మెరుస్తున్న కళ్ళను విక్రం ఒక రెండు సెకన్ లలోనే జీవితమంతా సేద తీరినట్టుగా చూసాడు.”ఏదో గుర్తుకొచ్చి…” అని మందహాసంతో విక్రం అరచేతిని తన చేతిలో దాచుకుంది.

ఉత్తుంగ ప్రవాహంలో
విసురుగా ఒడ్డు చేరిన చెట్టు కొమ్మను
పచ్చటి రామ చిలకలా వాలు!
ఎగురుతూ క్షణం సేద తీరడానికైనా…
మళ్ళీ చిగురించడానికి
సరిపడ్డ ప్రాణం
నాలో ఉందనుకోడానికి
అది చాలు !

***

ఆ రోజు తన కారు పార్క్ చేస్తున్నప్పుడు పొరపాట్న వెనుక ఉన్న బైక్ ని గుద్దే సరికి అది పడిపోయింది. కంగారుగా దిగి అటు ఇటు చూసింది. సెక్యూరిటీ గార్డ్ తీక్షణంగా చూస్తున్నాడు ప్రియను. ప్రియ అపాలజిటిక్ గా చూసినా అతని గుండె కరగినట్టు లేదు.

” భయ్యా ! యే గాడీ కిస్కా హై ? ”

” ముఝే క్యా మాలూం…కోయి బందా అంధర్ షాప్ మే చలే గయా ” హైదరాబాదీ ఉర్దూ ర్యూడ్ నెస్ ధ్వనిస్తుంది. ‘ కార్ ఉన్న వాళ్ల పట్ల ఒకప్పుడు గౌరవం ఉండేది. ఈ రోజుల్లో అదో కంటెంప్ట్ అయిపోయింది ‘ అని నిట్టూర్చి ” ఆప్ యే బైక్ నై ఉఠావోగే క్యా ? ” కొంచెం భీరుత్వాన్ని కప్పుకుంటూ కటువుతనాన్ని ప్రదర్శించింది. ” క్యా మా… దేఖ్ కే రక్నా హై నా…” అని టోపీని పక్కన పెట్టి బైక్ ఎత్తి, ఉన్న చోట పెట్టాడు. ‘ అచ్చా… ఈ బైక్ ఆయనొస్తే చెప్పు ఆ హేండిల్ కు కొంచెం డేమేజ్ అయినట్టుంది . నేను లోపలే షాప్ లో ఉంటా ” అని గబాల్న అనేసి షాప్ లో దూరింది.

పెద్ద షాప్. బ్రాండెడ్ షో రూం. ఒక ఐదు మంది కస్టమర్లు ఉంటారేమో. ఏ.సీ పిల్ల తెమ్మెరలా తాకుతోంది. నిశ్శబ్దంగా సేల్స్ జరిగిపోతున్నాయి.

అక్కడే టై కట్టుకుని ఉన్న ఓ సేల్స్ బోయ్ తో “హలో ఎక్స్ క్యూజ్ మీ…” అనడంతో చేతిలో షర్ట్స్ మడతపెడుతున్నాడేమో ఆపేసి, వెనక్కు తిరిగి ప్రశ్నార్థకంగా చూసాడు.

“ఎక్స్క్యూజ్ మీ… నాకు ఫార్టి టూ సైజ్ షర్ట్ కావాలి” అనింది.

తన చేతిలో షర్ట్స్ ను చూస్తూ, మళ్ళీ తన మొహాన్ని ఎగాదిగా చూస్తూ అన్నాడు “బట్… ఇవి ఫార్టీ సైజ్ అండి”

అమాయకంగా ఉన్న వాడి మొహం చూసి ‘తిక్కలోడు రా బాబు’ అనుకుని, “పర్లేదు. అవి అక్కడే పెట్టి 42 చూపించు” అనింది.

వ్యంగ్యం తగిలినట్టుంది. కనిపించీ కనిపించని స్మైల్ గమనించే లోపు వెనక్కు తిరిగి 42 సైజ్ షర్ట్స్ అన్నీ ఒక్కొకటి తీసి చూపించాడు.
ఒక్కో షర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెట్టాడు.

“ఇది రింకిల్ రెసిస్టెంట్ క్లాత్ అండి. ఈ దేశంలో మొట్టమొదటిగా ఈ కంపనీనే అడ్వాన్స్డ్ సైంటిఫిక్ మెథడ్స్ లో మెనుఫేక్చర్ చేస్తుందండి. రింకిల్ డెన్సిటి అనేది ప్రధానమైన ఇండికేటర్. ఇప్పటి వరకు అతి తక్కువ రింకిల్ డెన్సిటీ పెరామీటర్ ఉన్న క్లాత్ ఇదేనండి. ఇది కంపనీ ఇండజినస్ గా తయారు చేస్తుందండి. ఇంపోర్టెడ్ కంటెంట్ అసలు లేదు ఇందులో. ఇది త్రీ హండ్రెడ్ కౌంట్ క్లాత్ అండి. దానితో స్మూత్ నెస్ బాగొస్తుంది. పైగా ఎండాకాలమైనా చలికాలమైనా, మన హైదరాబాదు వెదర్ కు బా సూట్ అవుతుంది” చెప్పేస్తూ వెళ్తున్నాడు.

ఇంకో షర్ట్ తీసి చూపిస్తూ అన్నాడు
“మీరు ఈ ఫిట్ చూడండి. ఇందులో ప్రతి స్ట్రై ప్, ఇంకో స్ట్రైప్ నుండి, ఎక్కడ కూడా, ముందూ వెనకా, హేండ్ కఫ్స్ వద్ద గానీ డీవియేట్ అవ్వదు. స్టిచ్ అయినట్టు కూడా మీకు తెలీదు, ఎంతో దగ్గరగా గమనిస్తే తప్ప. ఎర్నాకులంలో స్పెషల్ స్టిచింగ్ సెంటర్ ఉందండి కంపనీకి. అది ఐ.ఎస్.ఓ సర్టిఫికెషన్ ఉన్న సెంటర్ అండి. సో మీరు కాన్ఫిడెంట్ గా స్టిచింగ్ క్వాలిటీని మిగతా కంపెనీలకంటే బెటర్ అని నమ్మొచ్చు”

‘ఈ సేల్స్ మేన్ ఎవరో కాని మరీ ఎక్కువ ఇన్ ఫర్మేషన్ ఉంది ఈయన దగ్గర. ఏదైతేనేం తన లాంటి క్వాలిటీ ఫ్రీక్స్ కు సరిపోతాడు’ అని మనసులోనే అనుకుని లైట్ పింక్ రంగు షర్ట్ మీద, గోధుమ రంగు స్ట్రైప్స్ ఉన్న షర్ట్ బాగా నచ్చి చేతిలో తీసుకుని, పైన తడుముతూ” మీరు ఈ షో రూం లో ఇదే మాట, వేరే షో రూం లోకెళ్ళినా ఇదే మాటే చెప్తారు. ఎన్నాళ్ళయ్యింది ఇక్కడ జాబ్ చేయబట్టి?” అని ఫేబ్రిక్ పైన చూపు తిప్పకుండానే సాలోచనగా అడిగింది.

“జస్ట్ ఇప్పుడే నండి. మీరు ఎక్స్క్యూజ్ మీ అన్నప్పట్నుండి” అన్నాడు.

టక్కున తలెత్తి చూసింది. కొంచెం అలర్ట్ అయ్యింది. ‘ఈ మగ పురుగులకు, ఏ ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగస్తుడని గుర్తుండదు, మగాళ్ళు అని మాత్రమే గుర్తుంటుంది’ అనుకుని మొహం ప్రశ్నార్థకంగా పెట్టి “ఏంటి? ఎక్స్క్యూజ్ మీ? “ అంది. తాను మొహం చిట్లించినట్టు ప్రియకు అనిపించింది.

“లేదు. ఫస్త్ టైం ఎక్స్క్యూజ్ మీ అని పిలవడానికి ఐదు నిమిషాల క్రితం, ఇదో!… టై కొత్తది ఒకటి తీద్దామని లోపలకొచ్చి షర్ట్ కోసం టెంప్ట్ అవుతుంటే మీరొచ్చి షర్ట్స్ చూపించండి అన్నప్పుడు” ప్రియ గబుక్కున బ్లష్ అయిపోయింది.

‘ముందే డౌట్ వచ్చింది సేల్స్ మేన్ ఇంత కళగా ఎలా తయారై ఉన్నాడా అని. అంత అనర్గళంగా వివరిస్తుంటే ఏదో తొలిచినప్పుడన్నా ఎంక్వైరీ చేసి ఉండాల్సింది… ఛ’ అనుకుంది.

గబుక్కున “సారీ అండి“ అనేసి షర్ట్ తీస్కొని కౌంటర్ దగ్గరకు వెళ్ళి పోయింది. బిల్లు కట్టేసి, క్రెడిట్ కార్డ్ పర్సులో జాగర్తగా పెట్టుకుని, బయటకొచ్చింది.

సెక్యూరిటి గార్డ్ అదే గర్హనీయమైన చూపులు చూస్తున్నాడు. “కోయీ అయే క్యా?” అడిగింది.

“నై మేడం” బదులొచ్చింది.

“అచ్చా. ఠీక్ హై. ఇదుగో…” అని చేతిలో ఒక యేభై పెట్టి కార్ వేపు వెళ్ళింది. కార్ దగ్గరకెళ్ళి కీ పెడుతున్నప్పుడు వెనక నుండి సెక్యూరిటీ తనకు వినిపించేట్టు పిలిచాడు “మేడం, యే సార్ ఆగయే!”

తను వెనక్కు తిరిగి చూస్తే సేం కేరక్టర్ మళ్ళీ. అడుగుతున్నాడు సెక్యూరిటీ ని “క్యా హువా? ఏమయ్యింది?” అని.

తను వెంటనే దగ్గరకెళ్ళి “సారీ అండి. నే కార్ పార్క్ చేస్తున్నపుడు చూస్కోలేదు. మీ బైక్ కు తగిలి కింద పడిపోయింది. అదుగో హేండిల్ కొంచెం ట్విస్ట్ అయ్యింది.” అని గబా గబా మాట్లాడి గిల్ట్ ఫీలింగ్ నంతా వదిలించేసుకోవాలని చూసింది.

పూర్తి నవ్వు చూసింది అతని మొహంలో. జుట్టు పాపిట పెట్టుకుని దువ్వుకుని ఉన్నాడు. ఒత్తుగా ఉండి, ముందు నుదురు మీద కనుబొమ్మల వరకు సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవాలి అన్నట్టు జారినట్టుంది. నలుపుకు గోధుమ రంగుకు మధ్యలో అతని కాంప్లెక్షన్ ఉంది.

***

” నేను అంతో ఇంతో నలుపే కదా ! నీకెలా నచ్చానబ్బా ! అందునా నీవు అంత క్వాలిటీ ఫ్రీక్ వు ” అన్నాడు విక్రం. పది రోజుల వెనక్కు తేలుతూ వెళ్ళిన మనస్సును , మళ్ళీ ప్రస్తుతం లోకి లాక్కు వచ్చింది. చేతిని వదలకుండా అంది ” నాకు ఫెయిర్ కాంప్లెక్షన్ ఉన్న మగాళ్ళు ఇంగ్లీష్ సినిమాలో విలన్లలాగా అనిపిస్తారు ” అంది. అమాయకంగా చూస్తూ ” ఏంటో …అదో కాంప్లెక్స్ నాకు అంతే ” అంది. ” పోనీలే, తమిల్ సినిమా విలన్ లకు ఈ మాత్రం కితాబన్నా దొరికింది ” అన్నాడు విక్రం చిరుదరహాసాన్ని కప్పి పెట్టుకుంటూ.
విక్రం చెవుల పక్కన చక్కగా ట్రిం చేసిన విస్కర్స్ నే గమనిస్తోంది ప్రియ.

విక్రం పర్ ఫెక్షనిస్ట్ లా అనిపిస్తాడు ఒక్కో సారి. కన్విన్స్ కాకుండా ఏ పనీ చేయడు అని ఈ కొద్ది రోజుల్లో తనకు తెలిసింది. కన్విన్స్ అయ్యాక ఫ్లెగ్జిబిలిటీ పోకుండా బిహేవ్ చేస్తాడు. ఎవరు తప్పు చేస్తున్నా మొదట అర్థం చేసుకోడానికే చూస్తాడు. ద్వేషం అన్న విషయాన్ని దగ్గరకే రానీవడు.

***

రెండో రోజు చిన్నాన్న తన పర్సనల్ లోన్ గురించి వాకబు చేయమంటే విషయం కనుక్కుందామని బేంకుకు వచ్చి , మళ్ళీ విక్రం కళ్ళకు దొరికిపోయింది.

“ అదేంటి ! సేల్స్ మేన్ జాబ్ రిజైన్ చేసి, ఇక్కడ చేరారా ? “ అని అడిగింది, కళ్ళల్లో లేని సీరియస్ నెస్ ను తెచ్చిపెట్టుకుంటూ.
అదే సీరియస్ మొహం తో “ అది టెంపరరీ అండి. ఐదు నిమిషాలు చేసి చూసాను. బానే ఉంది. ఆరో నిమిషం కు మోటివేషన్ కనిపించలేదు “ అని గడ్డం ను ప్రియ వేపు ఎత్తి ఊపుతూ అన్నాడు.

ఏదో అనబోతుండడం తో , విక్రం చప్పున ఆపేసి “ నేను ఇక్కడ లోన్ డిపార్ట్మెంట్ కు మేనేజర్ ను “ అన్నాడు. మళ్ళీ అందుకుని “ ఇది ఉత్తిత్తి ఉద్యోగం కాదు. నిజం జాబే. ఇదుగో నా ఐడెంటిటీ కార్డ్ “ అని గబుక్కున చూపాడు.

ఆ తర్వాతి రెండ్రోజులు వాళ్ళ చిన్నాన్న పర్సనల్ లోన్ విషయం లో, ఎలిజిబిలిటీ కండిషన్స్ రిలాక్స్ చేసి, దగ్గరుండి లోన్ సేంక్షన్ అయ్యేలా చేసాడు. ప్రియ కృతఙతా పూర్వకంగా ఫీల్ కాకుండా ఉండలేకపోయింది. అరవై రెండేళ్ళ వృద్ధుడికి, ఏ బేంకూ లోన్ ఇవ్వ లేని పరిస్థితుల్లో విక్రం చొరవ లేకపోతే పని అయ్యుండేదే కాదు. తను గ్రాడ్ యుయేషన్ లో ఉన్నప్పుడు నాన్న చనిపోయాక, కన్న కూతురిలా పెంచిన చిన్నాన్న కిడ్నీ ఆపరేషన్ కు డబ్బులు జమ అయ్యేవే కాదు. ప్రియకు, విక్రం ఏదో ఎక్స్ ట్రా ఇంటెరెస్ట్ తీసుకున్నట్టనిపించింది. లోన్ పేపర్స్ సైన్ చేస్తున్నప్పుడు మొహమాటం లేకుండా అడిగింది.

“ ఏంటి ? “ అని

“ ఏమి ఏంటి ? “

“ అదే ఏంటి ? “

“ ఆ ఏంటీ ఏంటో చెప్పండి “

“ ఐ హోప్ యు ఆర్ నాట్ ట్రయింగ్ టు హిట్ ఆన్ మి “

“ అందుకే ఈ హైదరాబాద్ రీజియన్ లో యంగెస్ట్ మేనేజర్ అయ్యాను కాబోలు “

ఇక ప్రియకు ఏమనాలో అర్థం కాక ఇబ్బందిగా నవ్వేసి “ మీకు కాఫీ అయినా ఆఫర్ చేసి నన్ను విముక్తురాలిని చేసుకుంటా “ అంది.
ఎదుటి మగాడు ప్రతి ఒక్కడు , తమను ఏదో రకంగా ఫ్లర్ట్ చేయాలని చూస్తున్నారనో, ఏదోలా దగ్గరవ్వాలనే ప్రయత్నం చేస్తున్నారనే పేరనోయియాతోనే మరింత దగ్గరౌతారన్న విషయం గమనించుకోరు. ఇక ముఖ్యంగా , నిజాయితీ గా ప్రవర్తించే మగాళ్ళ విషయం లో బాగా డిఫెన్స్ లో పడ్డాక, ముందుకెళ్ళకుండా ఉండిపోవడం కష్టమౌతుందని అర్థమయ్యే లోపు, ప్రియ మరుసటి రోజు కాఫీ షాప్ లో విక్రం తో కలిసి కాఫీ తాగుతుంది.

ఎన్నో కబుర్లు, ఎన్నో రాజకీయాలు, ఎన్నో దృక్పథాలు, ఎన్నో మంచి మాటలు మది గడప దగ్గర విక్రం ను కూర్చోబెట్టాయి. ఫ్రతి రోజు , ఆఫీసు అయ్యాక కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోవడం పరిపాటయ్యింది. నాలుగో రోజో, ఐదో రోజో – కాఫీ షాప్ లో గొడవ మరో మెట్టుకు తీసుకెళ్ళింది ఇద్దరి పరిచయాన్ని….. కాదు అనుబంధాన్ని!

ఈవ్ జీజింగ్ సాధారణమే…కాని విక్రం హేండిల్ చేసిన తీరు తనను విక్రం గురించి మరింత ఆలొచింప జేసేలా చేసింది
కాఫీ షాప్ నుండి బయటకు అడుగు పెట్టిన ప్రియకు పక్కనుండి విజిల్ వినిపించింది. వెనకాలే వచ్చిన విక్రం కు కూడా వినిపించింది. ప్రియ పట్టించుకోకుండా ముందుకెల్తుంటే , మళ్ళీ వాడెవడో చిల్లరగా విజిల్ వేసాడు.

విక్రం గబుక్కున వాడినాపాడు. వాడు నిర్లక్ష్యంగా తలెగరేసి, పక్కనున్న ఇద్దరి మిత్రుల వేపు చూసి నవ్వాడు. అందరు ఇరవై ఏళ్ళ లోపు వాళ్ళే.

” మీ విజిల్ ?! ” విక్రం ప్రశ్నార్థకంగా అడిగాడు.

” నాకు వినిపించలేదే ? ” జవాబొచ్చింది.

విక్రం తలూపి వెళ్ళిపోమన్నట్టు చూసాడు. ప్రియ, విక్రం వెనుక నుండి చూస్తుంది.

రెండడుగులు కూడా వేసాడొ లేదో వాడు, విక్రం విజిల్ వేసాడు. వాడు చివ్వున తల తిప్పి చూసాడు.

విక్రం ఎక్స్ప్రెషన్ లేకుండా మొహం పెట్టుకుని ఉన్నాడు. వాడు విక్రం దగ్గరికొచ్చి ” బాస్, ఏంటీ రిటార్టా ? ” అంటూ కాలర్ పైకెత్తుతూ అడిగాడు.

వెంటనే విక్రం , ప్రియ వేపు తిరిగాడు. ” మై డియర్ వ్యూయర్స్ ! you must have seen how males behave when a woman is alone at a coffee shop. Now , we are taking you to another place like…… a movie theatre “ అని చాలా సేరియస్ గా అనడం తో ప్రియకు కంఫ్యూజన్ పెరిగింది ‘ ఏంటి ఈ పెద్ద మనిషి ఏం జేస్తున్నాడు? ‘ అన్నట్టు మొహం పెట్టింది.

వాల్లళ్ళో ఒకడడిగాడు ” ఏం చేస్తున్నావ్ బాస్? ”

విక్రం మొహం మొత్తం నవ్వుతో నింపుకుని చేయి కలుపుతూ ” థేంక్యూ ! we are shooting a social experiment on eve teasing from Zee TV. Look there… ” అంటూ వాడి భుజం తడ్తూ ప్రియ మెడలో పెండెంట్ చూపించి ” That is the camera and , by the way, the show is scheduled for telecast tomorrow prime time …it will be fun…watch it ” అన్నాడు నవ్వు మొహం చెరిగిపోనీకుండా.

విక్రం మొహం లో కళింగ రాజ్యాన్ని సమూలంగా తుద ముట్టించిన కరవాలపు అంచులా కాన్ ఫిడెన్స్ తల తల మెరుస్తుంది. కురుస్తున వెన్నెల్లో తుఫాను మెరుపులా విక్రం పెదాల మీద నవ్వుంది. విక్రం కనురెప్పలకు దీపాల ఒత్తులు తోరణాలు కట్టినట్టుగా ఉన్నాయి.
వాళ్ళ మొహాల్లో పేనిక్ క్లియర్ గా కనిపించింది. ఒకర్నొకరు తోసుకుంటూ , మొహాలకు కర్చీఫ్ కప్పేసుకుని వాళ్ళ కార్లలోకి దుంకి పరిగెత్తించారు.

నిజానికి , ఇది చాలా చిన్న సంఘటనే. చాత కాని యూత్ లో మేకపోతు గాంభీర్యం ఉంటుంది. ఇలాంటి పెట్టీ థ్రెట్స్ కే అల్లకల్లోమైనట్టు అయిపోతారు. ఆ తర్వాత , ప్రియ తో విక్రం చెప్పిన మాటలు , విషయం పై తనకున్న అవగాహనను ఎక్ష్క్స్ ప్రెస్ చేసిన విధానం, మెచ్యూర్ద్ గా అర్థం చేసుకున్న విధానం విని ప్రియ మనసులోనే విక్రం ను దగ్గరకు లాక్కుంది.

” మన దేశం లో సుమారు ఇరవై కోట్ల మంది యంగ్ మెన్ ఉంటే, అందులో , ఇలా ఇంకా ఫేమిలీ మీద, తల్లి తండ్రుల మీద పడి బతుకుతూ ఆత్మ గౌరవం లేకుండా ఉన్న వాళ్ళు , అందులోనూ బాగా డబ్బున్న కంఫర్ట్ కూడా ఉన్న వాళ్ళు, పట్టణాల్లో ఉన్న వాళ్ళు ఐదు శాతం కంటే తక్కువుండొచ్చు. అంటే వీళ్ళ జనాభా మన మొత్తం దేశ జనాభా మీద చూస్తే ఒక శాతం కన్నా బాగా తక్కువ. మరి వీళ్ళ బారిన పడే ఆడవాళ్ళ శాతం పది శాతం ఉంటుందేమో ! దానర్థం మన దేశ జనాభా మొత్తం మీద సగం మంది ఆడవాళ్లైతే, రోజుకు ఒకడికి దొరకాల్సిన వాళ్ళు అందులో పది శాతము – ఇంచుమించుగా ఐదు మంది అన్న మాట. ఎంత వర్క్ లోడ్ ఉంటుంది ఇదే పని మీద ఉంటే వీళ్ళకు ? “ జుట్టు కొంచెం నుదుటి మీద నుండీ పైకి తోస్తూ అన్నాడు “ ఇక్కడ గమనించాల్సిందేమంటే , ఇంత పెద్ద వర్క్ లోడ్ ను వీళ్ళు రొటీన్ చేసేసుకున్నారు. హేబిచువల్ టీజర్స్ గా ఉండి నెక్స్ట్ మోమెంట్ మర్చిపోవాల్సిన పరిస్థితి. అందుకే మెకనైజ్ చేసేసుకోవాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళకు. వీటిలో కొన్ని అత్యాచారాల కింద కన్ వర్ట్ అవుతాయి. ప్రస్తుతానికి , ఆ పరిస్ఠితుల్లో , అంత వల్నరబిలిటీ లో మనం లేము కాబట్టి అంత దూరం తర్వాత ఆలోచించుదాం “ ప్రియ సాలోచనగా తల ఊపడాన్ని గమనిస్తూ కంటిన్యూ చేసాడు.

“ ఇంటికెళ్ళాక , వీళ్ళలో అందరూ వాళ్ళ కుటుంబాలతో మామూలు జీవితం నడిపే పరిస్థితే ఉండొచ్చు… వీళ్ళను నిర్భయ కేసులో ముఖేష్ లా ఎక్స్ట్రిమైజ్ చేసి చూసి ప్రతి వ్యక్తి తప్పుకు ఆ వ్యక్తిని మాత్రమే నిందిస్తే, ఉరిశిక్ష ఉండడం లెజిటిమేటే ! “ ప్రియ విక్రం ఏం చెప్పదల్చుకున్నాడో అర్థం చేసుకుంటుది. చాలా ఫోకస్డ్ గా వింటుంది. విక్రం తన హస్తాలను ప్రియ ముందు కదుపుతూ మాట్లాడుతుంటే, పొడవాటి అతని వేళ్ళు తన మనసుకున్న కాన్సంట్రేషన్ ను మిస్ అవ్వకుండా చూస్తున్నాయ్.

విక్రం ముగించే టోన్ తో ఇలా అన్నాడు ” ఇలాంటి సాధారణ ప్రొఫైల్ ఉన్న వాళ్ళకు సోషల్ షేమింగ్ సరిగ్గా సరిపోతుంది. ఇక ఫేస్ టూ ఫేస్ గొడవ పడితే, వాళ్ళకు ఒకటి తగిల్తే నాకు రెండు తగలడం తప్ప లాభం ఏమీ ఉండదు. ” అని మృదువుగా , సెలయేర్లు దాటి వెతుక్కుంటూ వచ్చిన ఓ అడవి గాలిలా నవ్వాడు.

***

మనిషి చేసిన ఏ తప్పునైనా ఎక్స్ట్రా పొలేట్ చేసి ఊహించుకుని ద్వేషించడం సులభమే. మన మెదడు మన ఇష్టం. అది ఎలా అర్థం చేసుకోడానికి కంఫర్టబుల్ గా ఉంటే అలా అర్థం చేసుకుంటుంది అనుకుంటారు కానీ కాన్షియస్ గా దాన్ని ఇం ఫ్లు యెన్స్ చేసి మరీ బేలెన్స్డ్ గా ప్రాక్టికల్ గా ఆలోచించడం అందరికీ వారనుకున్నంత సులువుగా అలవడదు.

ఎక్కడో పాల పిట్ట కూస్తోంది. అక్కడక్కడ రెండు మూడు జంటలు, ఫేమిలీస్ కలిసి నగర జీవితానికి దూరంగా శీతాకాలపు గాలులల్లో చల్లగా నిదరోతున్న హిమాయత్ సాగర్ జల సౌందర్యాన్ని హృదయం తో జో కొడుతూ ఆనందిస్తున్నారు.

” టైం అయ్యింది . వెల్దామా ? ” విక్రం అనడం తో , విక్రం పొడవాటి వేళ్ళ మధ్య ఇరుక్కు పోయిన తన క్రింసన్ రంగు వేసుకున్న గోళ్ళనే చూస్తూ అంది ” మ్మ్… ”

ఇద్దరికీ తెలుసు ప్రశ్న తో పాటు , సమాధానం కూడా భరించలేనిదే!

***

కారు నడుపుతుంది కాని , రియర్ వ్యూ మిర్రర్ లో విక్రం గ్లాసెస్ సర్దుకుంటూ బైకును నడపడాన్నే చూస్తుంది. అద్దం లో విక్రం ను చూసిన ప్రతి సారి, అలజడి ఒకటి మదిలో మెదులుతుంది.

కారులో లేవేండర్ పర్ ఫ్యూం మనసులో అలజడిని సముదాయించలేకపోతుంది.

విక్రం ను విడిచి తిరిగి ఇంటి ముఖం పడుతున్నందుకు కాదు. తనను తాను కన్విన్స్ చేసుకుని సూర్యను పెళ్ళి చేసుకున్నందుకు !! తన అంచనాల కే దొరక్కుండా తాను ప్రవేశించిన బాటలో ఇలా పయనిస్తున్నందుకు!!

సూర్య మంచి వాడు. స్త్రీ అంటే గౌరవం కలిగిన వాడు. ప్రజాస్వామికంగా కుటుంబాన్ని నడపాలని కోరుకునే వాడు. తన మావయ్య వాళ్ళ నాన్న కమ్యూనిస్ట్ పార్టీలో స్టేట్ లెవెల్ స్థాయిలో కొలీగ్స్. ప్రగతి వాద భావాలతో పాటు చదువరి, తెలివైన వాడు , బాగా సెటిల్ అయిన వాడు కాబట్టి ప్రియకు మేచ్ బాగుంటుందని మావయ్య సజెస్ట్ చేసాడు. వెంటనే బాబాయి చొరవ తీస్కొని, సూర్య తో పెళ్ళి చూపులు ఎర్పాటు చేయడం , నిశ్చితార్థం ఫిక్స్ చేయడం , ఇంకొ మూడు నెలల్లో పెళ్ళి చేసేయడం అయిపొయింది.

ఐతే సూర్య మంచి తనం లో ఉన్న అనీజీనెస్, అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. తనకు ఐస్ క్రీం కావాలంటే, పది సార్లు చెక్ చేసుకుంటాడు. రెండు మూడు సజెషన్స్ ఇస్తాడు.వాటి లో తననే ఎన్నుకోమంటాడు. తాను ఎన్నుకున్న వాటిపై ఫీడ్ బేక్ ఇస్తాడు. ఫైనల్ గా తెచ్చి చేతిలో పెడతాడు. ఈ లోపు ఐస్ క్రీం ను తినాలనే ఎమోషన్ ఒకటి చచ్చిపోతుంది. తాను డ్రెస్ కొనుక్కోవాలని తీసుకెల్తే అన్నీ బాగున్నాయంటాడు, అన్నీ బాగోవంటాడు చివరికి తనను డిసైడ్ చేసుకోమంటాడు. మొదట్లో సరదాగా, అప్పుడప్పుడు ఎక్జైటెడ్ గా, సంబరంగా ఉండేది. మరి అది కొత్త పెళ్ళి కూతురు కుండే ఇన్ సెక్యూరిటి వల్ల కావాచ్చేమో తెలీదు. రాను రాను గమనిస్తే సూర్యకు తాను గొప్ప ప్రజాస్వామిక వాది అని ప్రూవ్ చేసుకోవడం లో చాలా శ్రద్ధ ఉన్నట్టు గమనించింది . అందులో తన ఆనందం తో నిమిత్తం లేదు అనే విషయం లీలగా అర్థమయి రాను రాను బల పడింది. ఎన్ని సార్లు ఆలోచించింది ఈ విషయం గురించి?! తాను ఆఫీసు నుండి అలసి వస్తే కాఫీ తానే తయారు చేస్తాడు కాని తన చేతి తో కాఫీ ఇవ్వడం లో ఎమోషన్ ఉండదు. ప్రో గ్రాం చేసినట్టు మంచి తనాన్ని ప్రదర్శిస్తాడు. ఆఫీసులో చిరాకు ఎక్కువైనప్పుడు మాత్రం అసలు ఇరిటేషన్ బయటకొస్తుందేమో , బాగా అరిచి పాడేస్తాడు. మళ్ళీ ‘ సారీ ‘ ఎప్పుడో అప్పుడు చెప్తాడు. సూర్య తనను మిగతా మగాళ్ళలా బాధ పెట్టడు. కాని తనకు ఆనందం ఎందులో ఉందో అది మెకనైజ్ చేసేసాడు అని ఆలస్యంగా గమనించింది. తాను అందంగా ఉంటుందని తెలుసు. ఎప్పుడన్నా కొత్త ఫేషన్ వేర్ కొన్నప్పుడో, తన గోళ్లకు మంచి పాలిష్ వేసుకున్నప్పుడో, లేదా కొత్త చెప్పులు వేసుకున్నప్పుడో అందం గురించి మాట్లాడాల్సి వస్తే ‘ శ్రమైక సౌందర్యం ‘ అని ప్రస్తావిస్తూ నిర్వీర్య పరుస్తాడు. భార్య అందాన్ని అప్రీషియేట్ చేయడం కూడా సంఘ సేవలా చేసేసాడు. గట్టిగా ‘ తనకు ఈ డ్రెస్ నచ్చింది ఇదే కొను ‘ అని పట్టుబడితే, అతనిలో మంచి తనానికి ఏవన్నా మార్కులు తక్కువ పడ్తాయా ? ఓ సారి సూర్య ఆఫీసు నుండి లేట్ గా వచ్చినప్పుడు , కలిసి భోంచేద్దామని వెయిట్ చేస్తే , చాలా హడావిడి చేసాడు ‘ ఒక ఆడది మా ఇంట్లో ఇలా మొగాడి కోసం తన ఆకలిని త్యాగం చేయడం తనకు వెగటుగా ఉంటుందని ‘ మొహం మీదే అనేసాడు. ‘ ఏం ? నెలలో ఒక ఐదారు రాత్రులు తాను ఆకలి మర్చి తన భర్త కోసం వేచి చూస్తే, ఆయనలో మంచి తనం అగ్ని పరీక్షకు గురౌతుందా ? ‘ అని ఎన్నో సార్లు అనుకుంది.

సూర్య ప్రేమను ప్రజాస్వామికంగా ఉండాలనే ప్రెషర్ లో ఉంటాడు. చిన్న తప్పులను ఎక్కువ ఊహించుకుంటాడు. భర్త చెడ్డవాడైతే ఎవరికైనా కంప్లెయిన్ చేసి అర్థం చేయించవచ్చు. కానీ ఈ యాంత్రిక మంచితనం ఎంత చెడ్డగా ఉంటుందో ఎవరికీ చెప్పుకోలేని నిస్సహాయత తనది.
వాళ్ళ నాన్న, అప్పుడప్పుడు ఇంటికి వచ్చి స్త్రీల అభ్యుదయం గురించి తనతో మాట్లాడి, తన కొడుకు గురించి గర్వ పడి వెళ్ళి పోతూ ఉంటాడు. వాళ్ళ ఇంట్లో కూడా ఏదో గిల్ట్ అవాయిడ్ చేయడానికి , అందరూ మంచి తనం పాటిస్తున్నట్టు ఉంటారు. సూర్య వాళ్ళ అమ్మ మాదేవి తప్ప. మాదేవి ఆంటీ ఇతర మనుష్యుల తో సంబంధం లేకుండా, ఎవరి అభిప్రాయాలతో పేచీ లేకుండా తన పనిలో తాను నిమగ్నమై ఉంటుంది. టైం దొరికితే టీ వీ పెట్టుకుని ఒక్కతే తెలుగు మ్యూజిక్ చానెల్ లో పాటలు చూస్తూ ఉంటుంది. మొదట్లో ఆమె ఓ తరహా అనుకుంది. ఐతే సూర్యాను దగ్గరగా చూసాక, ఆమెలో తను కనిపించ సాగింది. అది ఊహించుకుంటేనే తనకు భయంగా ఉంటుంది. ఓ ఆరునెళ్ళు గడిచాక – రాత్రుల్లు ఎవరో కౌ బాయ్ దొంగలు ఇంటి మీదకు దాడి చేసి అంతా ఎత్తుకు పోతున్నట్టు, తను మాదేవి ఆంటి మాత్రం పక్క పక్కనే కూర్చుని టీ వీ తదేకంగా చూస్తున్నట్టు, గుమ్మం బయటే సూర్య వచ్చిన వాళ్ళకు అటెన్షన్ లో నిటారుగా నిలబడి కీ ఇచ్చిన బొమ్మలా సెల్యూట్ చేస్తున్నట్టు ఇలా ఏవో అర్థం పర్థం లేని కలలు వఛ్ఛేవి. అప్పుడప్పుడు ఏదోలా మనసు కష్టం చేసుకుని , సూర్యతో సార్ట్ ఔట్ చేసుకుందామనుకునేది. ఆలస్యంగా తెలుసుకుంది – తాను కూడా ఈ ప్రోటోకాల్ లో మునిగిపోయిందని, సమస్యలను సహజంగా ఎలా సార్ట్ ఔట్ చేసుకోవాలో బుర్రకు తోచనంత దూరం తాను జరిగిపోయిందని.

ప్రేమ ప్రజాస్వామికంగా ఉండడం ముఖ్యం కాదు. ఆర్ధ్రంగా ఉండడం ముఖ్యం. ఏదో ఒక సారి, ఎవరో ఒకరు కాసేపు మనసు నొప్పి పెట్టుకుంటే , మనుష్యులు దూరం కారు కాని, ఆర్ధ్రత లేకపోతే మాత్రం కలవలేనంత దూరం అవుతారు. మళ్ళీ కలుద్దామనుకున్నా ఎడారిలో వేసిన విత్తనం లా ఎప్పటికీ మొలవలేరు.

***

ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఒకటే హోరు. కొంచెం తెప్పరిల్లి ప్రియ సీ డీ ఆడియో ప్లేయర్ లోకి తోసింది. అద్నాన్ సామి సాంగ్స్ నెమ్మదిగా మృదువుగా వినిపిస్తున్నాయి కాని, ప్రియ మనసులో కార్ వెనకే వచ్చిన విక్రం ఎక్కడికెళ్ళాడొ తెలీక కలిగే ఆరాటం మాత్రం అనాథలా ఆమె మనసునే చూస్తూ ఉంది.

తానింత వరకు , తనకు పెళ్ళైన విషయాన్ని విక్రం వద్ద దాచి పెట్టింది. పేపర్లలో ఎన్నో చదివింది. ఆఫీసుల్లో, ఫ్రెండ్స్ వద్ద ఎన్నో వినింది. ఇదో ‘ అక్రమ సంబంధం ‘ అవ్వబోతుందని లేదా అయ్యిందని తెలుస్తుంది. ఆ పదం లో, ఆభావం లో ఉండే గుండె కోత ప్రియ కు తన మృత దేహాన్ని తనే మోస్తున్నట్టుగా ఉంది. చేసే తప్పు నిజాయితీతో చేస్తే ఫేస్ సేవింగ్ ఉంటుందా ?! అసలు ఎలా చేసినా తప్పు తప్పే కదా ?! పొరపాట్న చేసినా తప్పే కదా ?! సమాజం అంగీకరించని విధానాలకు, వ్యక్తిగత స్థాయిలో సమర్థించ గలిగే కారణం ఉండడం ఒప్పుకోదగ్గదేనా ?!

తన విషయం చెబ్దామనే ఇందాక ఎంతో విల విల లాడింది కాని , విక్రం మౌనం తనకు ఏదో అడ్డుకట్ట వేసింది. ఉన్నంత సేపు విక్రం మౌనాన్ని ఒక సంగీతం లా వినింది. ఒక అపురూప గంధర్వ గానం లా ఆ నిశ్శబ్దం లో పరవశించింది. అందుకే దాన్ని ధ్వంసం చేసి అలజడిని సృష్టించాలని అనిపించలేదు. మనసొప్పక గొంతు దాక వచ్చిన మాట ను వెనక్కు నెట్టేసింది.

***

విక్రం లో ఉన్న ఆ ఊహించని నిశ్శబ్దానికి కారణం ఏంటో, ఆ నిశ్శబ్దం లో ఉండే అల్లకల్లోలం ఏంటో తెలిసేది. అప్పుడన్నా వాళ్ళిద్దరూ ఒకే రాగం లో శృతి కట్టిన రెండు వేర్వేరు పాటలని తెల్సుకునేది.

ఇద్దరూ ఒకే ఆత్మ సంఘర్షణ చేస్తున్నారనే విషయం అతనికొక్కడికే తెలుసునని ,అసంతృప్తి కెరటాలతో ఇంట్లోకి అడుగు పెడుతున్న ప్రియను విక్రం దూరం నుండే నిస్త్రాణంగా పరికిస్తున్నాడని ప్రియ గమనించుకోలేదు – ప్రతి రోజులానే!

**** (*) ****