సమీక్ష

ఉత్కంఠభరితమైన కథ – రాజ్ఞి

ఫిబ్రవరి 2017

క మంచి పుస్తకం చదవగానే సన్నిహితులకు  చెప్పేస్తాం, మరీ నచ్చేస్తే కొన్ని వాక్యాలు రాసుకొని దాచుకుంటాం. అంతకు మించి ఒక పుస్తకాన్ని ప్రేమించినప్పుడు, పూర్తిగా ఆ భావాన్నంతా అనుభవించినప్పుడు, చదువరి రచయిత కూడా అయినప్పుడు, అందునా అది మరొకభాషలో ఉన్నప్పుడు, లోపలి సాహిత్యాభిలాష మనసును ‘అనువాదం’ వైపు ప్రేరేపిస్తుంది. ఆ పుస్తకం మీది ప్రేమనంతా సంపూర్ణంగా వ్యక్తపరిచే అందమైన ప్రక్రియే ‘అనువాదం’.  దీనికి ముందు తన పచ్చని తోరణాల వంటి రచనలతో  ‘వాకిలి’ పత్రికకు   శోభను తీసుకువచ్చిన డాక్టర్ మైథిలి అబ్బరాజు గారి ‘రాజ్ఞి‘ – SHE - ( who must be obeyed ) – అనువాద నవల – మే నెల 2015నుంచీ మొదలయ్యి  పదిహేడు భాగాలతోఅత్యంత ఉత్కంఠగా సాగింది.  ఎక్కడా కూడా అనువాదం చదువుతున్న భావన కనిపించదు, ప్రస్తావిస్తున్న దాని యొక్క  పరిమళం తప్ప.

ఈ పుస్తకం ఆగ్లం లో రైడర్ హగ్గర్డ్ కలం నుండి 1886 లో ‘ది గ్రాఫిక్’ అనే మ్యాగజైన్ లో సీరియల్ గా వచ్చింది . ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ అత్యంత ఎక్కువగా అమ్ముడైన పుస్తకాల జాబితాలో ఉంది. ఇంత గొప్ప నేపథ్యం ఉన్న నవలను ఇంకా అందంగా దాని ప్రతిష్టను ఇనుమడింపచేసే విధంగా అనువదించారు మైథిలి గారు.

ఆఫ్రికా తీరంలో ప్రాణశక్తిని ఆవాహన చేసుకొని మృత్యువును జయించిన  ఒక ‘రాణి’ చేతిలో తన భర్తను కోల్పోయిన అమెనార్టస్ అనే స్త్రీ,  ’ఆ రాణిని అంతమొందించడమూ లేక ఆమె శాశ్వత జీవితపు  రహస్యాన్ని చేధించడమూ’ అనే సంకల్పాన్ని తన వంశం ముందుంచి మరణిస్తుంది. ఆమె కొడుకుతో మొదలై ఆ వంశం లోని అరవై ఐదు తరాల వారు ఆ దిశగా ప్రయత్నించి ఎవరికివారు సేకరించిన ఆనవాళ్ళను – తరువాతి తరంవారికి అందిస్తూ వస్తారు. అరవై ఆరో  తరానికి చెందిన ’లియో’ అచ్చు అమెనార్టస్ భర్త కాలిక్రేటస్ పోలికలతో ఉంటాడు. ఇతను తన సంరక్షకుడైన హాలీ తో కలిసి ‘రాణి’ ని శోధించేందుకు సిద్ధపడతాడు. ఆ క్రమంలో అదే రాణికి బానిసలుగా ఉన్న అమహగ్గర్  జాతి స్త్రీ ఉస్తేన్,  లియో ని మొదటిచూపులోనే ప్రేమించడమూ, లియో కూడా ఆమె మీద ప్రేమ పెంచుకోవడం జరుగుతుంది.  మృత్యువుకి అంచున ఉన్న లియో ని ఆఖరి నిమిషంలో ’రాజ్ఞి’ కాపాడుతుంది. తన కోసమే కాలిక్రేటస్ మళ్ళీ పుట్టి వచ్చాడని నమ్ముతుంది.  పూర్వం తన ప్రేమకు అడ్డుగా నిలిచిన అమెనార్టస్ ని చంపలేకపోయిన రాజ్ఞి – ఈసారి రెండువేల యేళ్ళ తరువాత తాను ప్రేమించిన వాడికోసం ‘ఉస్తేన్’ ను  లియో కళ్ళ ముందే చంపేస్తుంది. తర్వాత లియోని తన సౌందర్యంతో ముగ్ధుణ్ణి చేస్తుంది. తాను ఈ సుదీర్ఘమైన కాలమంతా కాలిక్రేటస్ పునరాగమనం కోసం ఎంతలా ఎదురుచూసినదీ,  కాలిక్రేటస్ ని వధించినందుకు తను ఎంతగా పశ్చాత్తాపపడినదీ  వివరిస్తుంది. నిదర్శనాలు చూపిస్తుంది. లియో ఒక సందిగ్ధావస్థలో  ఉండగానే అతణ్ణి  కూడా మృత్యుంజయుణ్ణి చేసేందుకు, జీవజ్వాల వద్దకు తీసుకెళుతుంది ’రాజ్ఞి’.  అందరి ఆలోచనలకు అతీతంగా  మొదటిసారి ప్రాణశక్తిని ఇచ్చిన జీవజ్వాల…  రెండవసారి అదే జ్వాల ముందు నిలుచున్నప్పుడు ప్రాణశక్తిని వెనక్కి తీసుకుంటుందని తెలియక, ఆ జ్వాల ముందు నిలుచున్న  ’రాజ్ఞి’  మరణిస్తుంది.  పూర్తిగా  రెండువేల యేళ్ళ వార్ధక్యం కొన్ని క్షణాల్లో ఆవరించి మరణిస్తుంది.  అనంతమైన ఆమె నిరీక్షణ తరువాత కలుసుకున్న లియోతో  …. “ప్రియా, కాలిక్రేటస్ – మర్చిపోకు నన్ను- నా దుస్థితికి కరుణ చూపు – నేను వస్తాను – మళ్ళీ – ఇంకా ఎక్కువ అందంగా …నిజం. వ- స్తా- ను”  అనే ఆఖరి మాటలతో  ఆయేషా - ’రాజ్ఞి’ మరణిస్తుంది. శాశ్వత జీవితాన్ని ప్రసాదించే ఆ జీవజ్వాలలోకి  వెళ్లే ఉద్దేశ్యం  తమకు లేదని లియో, హాలీ వెనుదిరుగుతారు. వారు రెండు సంవత్సరాల పాటు ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని ఇంగ్లండ్ చేరుకోవడంతో  ఈ కథ ముగుస్తుంది. కొనసాగింపు ఉంది అని సూచిస్తూ… మళ్ళీ ఆయేషా లియో కోసం పుడుతుందేమో అనే  సూచన చేస్తూ కథ ముగుస్తుంది.

మైథిలి గారు మొదటి భాగంలో ఈ పుస్తకం గురించి పరిచయం చేస్తూ ‘భారతీయులకి మటుకే ప్రత్యేకంగా అర్థమయే స్త్రీ శక్తిని, అంతటిది అయి ఉండీ ప్రేమ కోసం తపించిపోవటాన్ని She ఆవిష్కరిస్తుంది.’ అంటూ  కథలోకి  తీసుకెళ్తారు. నవలలోని పాత్రలు అన్నీ తమ తమ విలక్షణమైన స్వభావాలతో మసలుతూ ఉంటాయి నవల మొత్తాన్ని తన గొంతుకతో చెప్పుకొని పోయే కీలకమైన పాత్ర  ’హొరేస్ హాలీ ‘ ఒంటరి జీవననేపథ్యం  మొత్తం ఒక్క పారాగ్రాఫ్ లో  బరువైన పదాలలో  ఉంటుంది. “ నా ఒంటరితనం లోంచి నల్లటి తృప్తినొకదాన్ని అనుభవిస్తున్నాను…నాకు తల్లి లేదు, తండ్రి లేడు, అన్నా తమ్ముడూ అక్కా చెల్లెలూ ఎవరూ..ఎవరూ లేరు. అంతటి ఒంటరితనమూ ఒక ఘనతేగా మరి ?” అని. ఈ కథ లో ఒక నిబద్ధతతో కూడుకున్న పాత్ర హాలీది, తన వికారమైన రూపానికి అతకని ఎనలేని జ్ఞానం గలవాడూ, పలు భాషలు తెలిసినవాడూ కూడా. ఎక్కడా జంకనితనమూ, సమయస్పూర్తితో కథ మొత్తంలో లియోని వెన్నంటి ఉంటాడు.

లియో విన్సే ఈ నవలలో కథానాయకుడు.గ్రీక్ దేవుడు అపోలో విగ్రహంలా ఉంటాడని,  అతన్ని చూసిన ప్రతి అమ్మాయీ ప్రేమలో పడిపోతుండేదనీ హాలీ తన మాటలలో వర్ణిస్తాడు. సాహసానికి వెనుకాడని వాడు , సింహంలా పోరాడేవాడూ , ఉస్తేన్ కి ప్రాణ సఖుడు. కానీ ‘ఆయేషా’ (‘రాజ్ఞి’) దృష్టిలో తనకోసం మళ్ళీ జన్మించిన కాలిక్రేటస్. ఉస్తేన్, ఆమహగ్గర్ అనే ఆటవిక జాతి స్త్రీ,  లియోని ప్రేమిస్తుంది, ఇక ఆఖరి క్షణం వరకూ అతన్ని కనిపెట్టుకొని ఉండి అతన్ని విడువని సాహసి. లియో కోసం రాజ్ఞి ని కూడా ధిక్కరించి ఎదురు నిలిచే పాత్ర, చివరికి లియో కోసమే రాజ్ఞి చేతిలో ప్రాణాలు పోగొట్టుకొనే పాత్ర. జాబ్ నమ్మకస్తుడైన పనివాడు అయినప్పటికీ లియోతోనూ, హాలీతోనూ మంచి అనుబంధం కలవాడు.  బిలాలీ,  అమహగ్గర్  జాతి పెద్ద, కృతజ్ఞత కలవాడు. ఈ  నవల ఏ రహస్యాన్ని చేధించడానికైతే మొదలవుతుందో ఆ రహస్యాన్ని ప్రపంచం ముందు నిలిపిన కాలిక్రేటస్, అమెనార్దస్ పాత్రలు చాలా ధృఢమైనవి. భార్యని అమితంగా ప్రేమించి ఎట్టి పరిస్థితుల్లోనూ విడువని భర్తగా కాలిక్రేటస్ పాత్ర, భర్త మరణానికి కారణమైన ‘స్త్రీ ‘ మీద ప్రతీకారం కోసం తరాలను అటుగా నడిపించిన అమెనార్దస్ పాత్ర మైథిలి గారి కలంలో చదివేటప్పుడు స్థిరమైన రూపాలు మన కళ్ళ ముందు నిలబడతాయి.

చాలా చాలా చెప్పుకోవాల్సిన సమయం ఈ సమీక్షలో, అది ఈ రచనలోని లేక అనువాదంలోని మాధుర్యం గురించి! నిజమే, ఆగ్లంలో  చదివి కథని అర్థం చేసుకోగలం కానీ, ఈ తెలుగు అనువాదం చదవకపోతే  ఇక్కడ  ఎన్నోచోట్ల…   వీలున్న చోటల్లా వికసించిన ఆ వచన కవిత్వాన్ని మిస్ అయిపోతాం. ఆ సౌకుమార్యంతో కూడుకున్న సాయంత్రాలు, సాయంత్రాల్లోకి కమ్ముకున్న నల్లటి ఆకాశాలూ … ఆ నల్లటి ఆకాశాల్లో అందని నక్షత్రాలు, ఆ అందని నక్షత్రాల కోసం వేల వేల యేళ్ళ తరబడి కాలంతో,  ప్రకృతితో పోరాడే హృదయాలను మాత్రం ఈ అనువాదం చదివితేనే ఆస్వాదించగలం. ఏ పాత్ర మీదా  కోపం రానివ్వరు, అత్యంత హేయమైన చర్యని కూడా మరోవైపునుంచి చూస్తే , ‘తప్పించలేము,  వారి వైపు నుంచి చూస్తే ఇది సరైనదే’ అనుకొనేలాగా ఉంటుంది. అలజడి లేని వాక్యాలతోనే ఉత్కంఠభరితమైన కథను అద్భుతంగా ఆవిష్కరించారు మైథిలి గారు.

‘వాకిలి’ పాఠకులు ఒకరు అన్నట్టు “కలంలో సరళమైన శైలి, సహజమైన ఉరవడి కలవారు. కథనంలో వేగం చూపిస్తూ రాబోయే మలుపుకోసం ఉద్విగ్నతను పెంచడంలో  ఈ రచయిత్రి గొప్ప నైపుణ్యం కలవారు. ”

మచ్చుకు కొన్ని వాక్యాలు యధాతధంగా”

“ఆ రోజుని ఎప్పటికీ మర్చిపోలేను. కిటికీ లోంచి పడుతున్న సూర్యకాంతి వాడి బంగారపు జుట్టుతో ఆడుకుంటూ ఉంది. తల ఒక వైపుకి వాల్చి మమ్మల్ని తేరిపారచూశాడు. లియో ఉన్నట్లుండి చేతులు చాపి పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చేశాడు”.

“నువ్వు నాకిష్టం”  అని చెప్పాడు వాడు… ”నువ్వు బాలేవు, కాని మంచాడివి ”

“సూర్యుడి ఆగమనాన్ని ప్రకటించి కీర్తించిన దూతలూ వైతాళికులూ చీకట్ల నీడలని వెతికి తరిమికొట్టారు. అప్పుడిక దినరాజు తన సముద్రశయ్యమీంచి లేచి వచ్చాడు, భూమిని తన వైభవోపేతమైన వెచ్చదనంతో వెలిగించాడు. అలల మీద ఊగుతున్న పడవలో కూర్చున్న నేను నీటి సవ్వడిని వింటూ  మేము చేరవస్తూన్న  కొండ  కొమ్ము ని తిలకించాను”

అక్కడి గుహల్లో రాణి చనిపోయినవారి శరీరాలను పదిలం చేయిస్తూ ఉంటుంది.  అలా పదిలం చేసిన ఒకానొక స్త్రీ పాదాన్ని చూసినప్పుడు అత్యంత ఆర్తితో  కూడుకున్న వాక్యాలు మనల్ని కదలనివ్వవు…

“ఈజిప్షియన్ మమ్మీల లాగా అది కుంచించుకుపోయి లేదు…నున్నగా ఘనీభవించి ఉంది అంతే, కొంత పాలిపోయి.. నిప్పులోంచి  తప్పించి తీసిన జాడలు కనిపిస్తూ. ఎన్ని వేల ఏళ్ళనాటిది… ఏ ప్రాచీన నాగరికతా వైభవం లోంచి నడచివచ్చింది… కేరింతలు కొట్టే శిశువుగా, సిగ్గు చిందే కన్యగా, పరిపూర్ణమైన స్త్రీ గా? ధైర్యంగా ఏ ధూసరిత పథాలలోంచి మృత్యు సమీపానికి చేరింది? అంతకు ముందర ఏ అర్థరాత్రి ఎవరికోసమని రహస్యంగా కదిలివెళ్ళింది? ఆ అడుగు చప్పుడుకి ఏ చెవులు ఎదురు చూశాయి? తన సౌందర్యానికి తలవంచిన ఏ జగజ్జెట్టి మెడ మీద ఆనింది ఈ పాదం..ఏ ఆరాధకుల పెదవులు భక్తితో ఆనినాయి ఇక్కడ?” అని ప్రవహించే ఆ వర్ణనలో పూర్తి దృశ్యాన్ని స్వయంగా స్పృశించగలుగుతాము.

“ఆ అనంతమైన వైశాల్యంలో వేలకివేల నక్షత్రాలు మిలమిలమంటున్నాయి – ఆ బ్రహ్మాండమైన సౌందర్యపు ప్రకాశం ముందు మనిషి ఎంత అల్పుడో మళ్ళీ కొత్తగా తెలిసివచ్చింది. ఈ అంతటికీ అధిపతి అయిన భగవంతుడి అడుగుజాడలను అనుసరించటం ఎవరి తరం ! ఆయన ఏ పనిని ఎందుకు తలపెట్టి సాగిస్తాడో ఎవరు ఊహించగలరు!”

“అలా ఎలా కుదురుతుంది చెప్పు ? నులి వెచ్చ-ని ప్రేమావేశం లోంచి చలి గడ్డకట్టే మృత్యువు కౌగిట్లోకి – అంత సులువుగా జారిపోవటం సాధ్యమా? ”

అందమైన తెలుగు పదాలతో, తెలుగు భావాలతో …  ఆఫ్రికాతీరంలోనూ,  ఈజిప్టు పరిసరాల్లోనూ సాగే ఈ కథని మంచి సాహిత్యం చదవాలనుకొనేవారు ఎవరూ కూడా మిస్ అవ్వకూడదని ఆశిస్తూ .. ఈ సమీక్ష నా చిన్న ప్రయత్నం !

**** (*) ****

రాజ్ఞి మొత్తం నవలని ఇక్కడ చదవొచ్చు: http://vaakili.com/patrika/?cat=479