కొత్త పుస్తకం కబుర్లు

ఒక ‘నది పలికిన వాక్యం’తో సంభాషణ

ఫిబ్రవరి 2017

గుండె బద్దలు కొట్టుకొని వచ్చిన అక్షరాలకు, రక్తాన్ని అద్దుకొని గర్భం నుండి బయటపడిన అక్షరాలకు తెగువ ఎక్కువ. రాపిడి ఎక్కువ. నీటి తాకిడికి నలిగిపోయి నలిగిపోయి మొరటు రాళ్లు గులక రాళ్లుగా మారిపోయినట్టు విలాసాగరం రవీందర్ అక్షరాలు కూడా ఒక నిప్పును, ఒక దుఃఖపు పుప్పొడిని, చావు చివరి అంచును మోసుకు వస్తాయి. కాలం ఎలా కంపిస్తే అలా ప్రకంపించే కవులు తక్కువ. అందుకు విలాసాగరం రవీందర్ మినహాయింపు. దానికి నిదర్శనం అతడు ఇటీవలే వెలువరించిన ‘నది పలికిన వాక్యం’ కవితా సంపుటి. జీవితపు దిగుడు బావి నుండి ఒక నదిని భుజానికెత్తుకొని వచ్చి మన హృదయపు వాకిట్లో పరవళ్లు తొక్కిస్తాడు. నది ప్రయాణించినంత దూరం తడి వున్నట్టే ఈ పుస్తకం ప్రతి పుట నిండా సమాజ నగ్నత్వం, నీటి నాజూకుతనం, కన్నీటి అలజడి పరుచుకొని వున్నాయి. దేశంలో నూతన ఆర్థిక విధానాలు అమలులోకి వచ్చిన 90వ దశకం నుండి సమాజం సంక్లిష్టంగా మారతూ వస్తోంది. గత మూడు, నాలుగు సంత్సారాల నుండి ప్రపంచం మరింత ముళ్లపంది రూపంలోకి మారిపోయింది. ఇక్కడే రవీందర్ కలం కవిత్వానికి జత కూడింది. అనేక విస్ఫోటనాలను, దుఃఖాన్ని, నిరసనను, సంఘర్షణను, సంక్షోభాన్ని చాలా బలంగా వ్యక్తీకరించడానికి ప్రయత్నించాడు. అయితే కొన్ని అక్షరాలు ఏ రస స్ఫూర్తి లేకుండా ముడి శిలలుగా నిలబడి వుండవచ్చు. కాని ఆ ఒంటి స్తంభపు అక్షరాలు పేదవాడి మొండిదేరిన ఆయుధాలుగానే కనిపిస్తాయి.

కవి తాను గాయపడిన ప్రతిసారి కాగితాన్ని గాయపర్చడు. ఎన్నో గాయాలు సమాధి స్థితిలోకి వెళ్లి ఒక ఆవేశం, ఒక గాఢత మనసును ముసురుకున్నప్పుడు అది కవిత్వమై పొంగి పొర్లుతుంది. నీటి నుండి అలలను దూరం చేయలేనట్లే కవి నుండి ఈ స్పందించే గుణాన్ని వేరు చేయలేం. అనేక సంస్పందనల, భావ వీచికల సమాహారం ఈ కవితా సంపుటి. ఆకాశమంత విచ్చుకోవాల్సిన మనిషితనం ఇప్పుడు నేలరాలిన నక్షత్రంలా అనంత వాయువుల్లో కలిసిపోతోంది. దేహాన్ని సాంతం మనిషితనం కోసం జల్లెడ పట్టాల్సిన సందర్భం. చివరాఖరికి దాని ఆనవాలు కూడా దొరకక దేహిం ఒక ఒంటరి అస్థిపంజరమై మిగిలిపోతోంది.

‘‘గృహాలు గ్రహాల్లా మారాక/మనిషికీ మనిషికీ మధ్యన
మాయా తెరలు వెలిశాక/నువ్వూ నేను
అడుగు దూరంలో వున్నా/గ్రహాంతర వాసులమే కదా’’

అంటాడు. వాట్సప్ ల కాలంలో, ఫేస్ బుక్ ల కాలంలో మానవ సంబంధాలు ఎంతగా విచ్ఛిన్నమయ్యాయో ప్రతిబింబిస్తాయి ఈ కవితా పాదాలు. ఇవాళ ముఖపుస్తకానికి, వాట్సప్ లకు వున్న విలువ మనిషికి లేదు. అతని భావోద్వేగాలకు లేదు. కవిత్వం మనిషిని మనిషిలా నిలబెట్టాలి. గుప్పెడు గుండెకింత తెగింపునివ్వాలి. అప్పుడే అది మనసు మూలాల్లోకి వెళ్లి ఏదో రసాయనిక చర్యకు గురై కొత్త మనిషిని బయటకు తెస్తుంది. మరో రకంగా చెప్పాలంటే మనసుకు పుటం పెట్టాలి. సుతిమెత్తగా హృదయపు గోడలను అక్షరాల సుత్తితో బాదాలి. అప్పుడే మనిషికి, మనసుకు బంగారు వన్నె అంటుకుంటుంది. కొత్త చక్షువులేవో తెరుచుకొని కొత్త బంగారు లోకాలకు దారులు చూపిస్తాయి. ధిక్కారం, కన్నీటి ఉప్పదనం, చెమట బిందువుల పెనుగులాట, మట్టిని మూలధాతువులుగా చేసుకొని రాసిన ఏ కవిత్వమైనా లోకంలో నాలుగు కాలాలు జీవంతో నిలబడుతుంది. ప్రజల మస్తిష్కాల్లోకి ఎక్కుతుంది. అక్కడ అంతకు మునుపులేని వినిర్మాణ ప్రక్రియ ఏదో మొదలవుతుంది.

‘‘నువ్వు దాచిన మిలియన్ డాలర్లు
నీ కష్టార్జితమనుకున్నావేమో
అవి ఈ దేశ ప్రజల రక్త మాంసాలు’’

దీపపు పురుగు దీపం చుట్టూ తిరిగినట్టు ఏ కాలంలోనైనా మనిషి డబ్బు చుట్టే తిరుగుతాడు. ఒకడు శరీరాన్ని చిత్రహింసలు పెట్టి సంపాదిస్తాడు. మరొకడు మెదడును వడిపెట్టి సంపాదిస్తాడు. అయితే మనసుతో సంపాదించిందే రక్తంలోకి ఇంకుతుంది. దేశంలో ఈ రోజు మోసంతో సంపాదించడం, బ్లాక్ మెయిల్ చేసి సంపాదించడం పెరిగిపోయింది. డబ్బులకే గోడౌన్లు కట్టుకున్నవాడెవ్వడూ నిన్న కొత్త నోట్ల కోసం ఏ బ్యాంకు ముందూ లైన్లో నిలబడలేదు. ఇదంతా పసిగట్టి ఎవరైనా నిలదీస్తే అధికారంలో వున్న వాడు ‘కుక్కబిస్కెట్లు’ వెదజల్లుతాడు. లేదా ప్రజల దృష్టిని మరల్చడానికి ఇంకేదో అంశాన్ని ప్రధాన వార్తల్లోకి తీసుకు వస్తాడు. ఏది ఏమైనా ఆఖరికి దోపిడీకి, అన్యాయానికి గురయ్యేది  మాత్రం సామాన్యుడే.

చెమట సంస్కృతికి పూసిన రెండు అద్భుత పుష్పాలు నేతన్న, రైతన్న. ఒకటి కాయకష్టంతో పరిమళిస్తే, మరొకటి మేధస్సుతో వేయి రేకులై వికసిస్తుంది. అయితే ఈ దేశంలో కులవృత్తులను పూడ్చిపెట్టడం ప్రారంభించి చాలా ఏళ్లయింది. జీవిక కకావికలం అయిపోయి ఇవాల నాగళ్లు ఉరికొయ్యలకు వేలాడుతున్నాయి. చేతిమగ్గాలు, మరమగ్గాలు జవసత్వాలు ఉడిగిపోయి ప్రభుత్వాల ఉదాసీనతను ప్రశ్నిస్తున్నాయి.

‘‘అగ్గిపెట్టెలో చీరచేర్చి/అబ్బుర పరిచిన చేతులు
దూలానికి నిలువునా వేలాడి/వాగులో తేలిన దృశ్యాలు
ఇంకా సుడిలా తిరుగుతున్నాయి/పోగుల్లో చిక్కుబడిన దారంలా’’

రానున్న రోజుల్లోనైనా కులవృత్తులు బతికి మనుషులను బతికించాలని ఆరాటపడుతాడు కవి. అయితే కులవృత్తులు నాశనం అయితేనే, గ్రామాలు విధ్వంసమయితేనే అభివృద్ధి మొగ్గ తొడుగుతుందనేది కొత్త భావన.

మనిషి సముద్రం లాంటి వాడు. ఎన్నో అలజడులు, ఆటుపోటులు, శిథిలత మన రక్తంలో కూడా ఉప్పొంగి  అణగిపోతాయి. నదిలా నిర్మలంగా ప్రవహించాలని,  సున్నితపు ఊయలలో ఊగిపోవాలని ఎవరికుండదు? కాని జీవితం నిరంతరం సంఘర్షణాయుతం అయినపుడు, కడలి అంచున విరిగిపడే కెరటపు విధ్వంసం అయినపుడు కడుపులో చల్ల కదలకుండా ఎలా కూర్చోగలం? మనిషి లోతు తెలిసిన, సాగరం మర్మం తెలిసిన  విలాసాగరం రవీందర్..

‘‘బహుశా
సముద్రమూ మనిషీ
చిన్నప్పుడు కవలపిల్లలేమో’’

అంటాడు. సముద్రాన్ని శుద్ధిచేయడం అసాధ్యం. కాని మనిషిని చెమట ద్వారా శుద్ధిచేయవచ్చంటాడు ఒకచోట. పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. ఎన్ని రోజులు బతికితే అంత లాభం అంటాడు కాళిదాస మహాకవి. మనమొక సింహింలా మనదైన సామ్రాజ్యాన్ని ఏలుతున్నప్పుడు అనుకోకుండా ఒకరోజు మరణం మనల్ని కర్కశంగా తాకుతుంది. మనల్ని సవాలు చేస్తూ మన చుట్టే తిరుగుతూ వికటాట్టహాసం చేస్తుంది. అప్పుడు మన పనులన్నీ కట్టిపెట్టి అల్మారాలో భద్రపరిచి దాని వెంట వెళ్లక తప్పదు. కాని అంతకంటే ముందు మనం చేయాల్సిన పనులు చాలా ఉంటాయి.

‘‘చివరి చూపులో రాల్చడానికి
కొన్ని కన్నీటి చుక్కలు
నీ చుట్టూ ఉన్నవారి కళ్లలో
వదిలి వెళ్ళాలి.’’

కనీసం మన శవాన్ని మోయడానికైనా నలుగురు  మిత్రుల్ని సంపాదించుకోవాలి. మనం దేహయాత్ర చాలిస్తున్నామంటే అన్నీ వదిలేసి కేవలం మన కోసమే వేల మైళ్లు దాటి వచ్చి మనల్ని స్పర్శించే ఒక ఆత్మీయ మనిషిని సంపాదించుకోవాలి. లేదంటే ఈ భూమి మీదికి మనం వచ్చిన సంగతి, వెళ్లిపోయిన సంగతి ఎవరికీ తెలియకుండానే ఒక చరిత్ర ముగిసిపోతుంది. చెట్టుకు మనిషికీ ఉన్న సంబంధమే మనిషికి మనిషికీ ఉండాలంటాడు.

తొలిపోద్దును చేతిలో పట్టుకొని, ఊరి తొవ్వెంట నడుస్తూ చేదబావి దగ్గరి మాటల పందిళ్లను బెకెట్ల కొద్దీ తోడి మన మనసు పొరలను జలపాతంలా తడిపేస్తాడు. అస్తిత్వ ద్వారాలు తెరిచి అందులో తనను తాను చూసుకుంటాడు. శిలువెక్కిన అమ్మ భాష గురించి పలవరిస్తాడు. అడవిగాచిన వెన్నెల్లో తలెత్తి నిల్చున్న గడ్డి పరకలకు కొత్త రెక్కలు తొడుగుతాడు. సామాన్యుడి మరణవేదనకు ఒక అశ్రు నివాళి సమర్పస్తాడు. ‘మనిషికీ మనిషికి మధ్యన వేలాడిన ఖాళీ’ని కవిత్వం చేస్తాడు. మనుషులకంటే యంత్రాలనే ఎక్కువ నమ్మేతనాన్ని ఈసడించుకుంటాడు. కవిత్వ దాహం తీరని వాడు. అక్షరాల చెట్టై ఆయుధాల్ని పూసేవాడు. మనిషి తలరాతల వికృత రూపాల్ని పట్టుకున్న వాడు. మనుషుల్ని కరెన్సీ నోట్లుగా చూసే ఒక అమానవీయతను ఎండ వెలుగులో లోకానికి నగ్నంగా చూపుతాడు. గుట్టలకు చెదలు పట్టిస్తున్న ప్రభుత్వ హీనత్వాన్ని నిప్పుతో కడుగుతాడు.

‘‘చీమలకు కూడా పౌరుషముంటుంది కదా!
ఎర్రటి ఎండల మట్టి పిసికి
ఇటుకలను బంగారమోలె మలిచిన చేతులకు
నల్లటి బండలను కూడా ఇర్సుడు
వస్తదని తెలుసుకోండ్రి’’

కోటి పిడికిళ్ల ఆవేశాన్ని గర్భీకరించుకున్న పంక్తులివి. నిత్యం స్వేద సముద్రంలో ఈదులాడే సామాన్యుడు ఎదురు తిరిగితే ఒక్కసారి ఎంతటి అధికారమైనా మోకరిల్లాల్సిందే. విలాసాగరం వాక్యాలు నదిలాంటి వాక్యాలు. పంటలాంటి కవిత్వం. మలినమంటని భావాలు. నది నీళ్లు తియ్యదనాన్నే పంచుతాయి. కాని ఈ ‘నది పలికిన వాక్యం’ జీవితంలోని అన్ని రుచులను పాఠకుడి మదికి అందిస్తుంది. నది పలికిన వాక్యాన్ని సముద్రంలా మన హృదయాల్లోకి ఆహ్వానిద్దాం. అది తీసుకొచ్చే జీవితపు రంగురాళ్లని ఏరుకొని మన మనోవీథిలో జీవితపు సౌధాన్ని నిర్మించుకుందాం. ఈ కవిత్వపు సోపానాలని ఎక్కి దిగి వస్తూంటే మన మనస్సంద్రంలో ఒక కన్నీటి నావ బిందు రూపం దాల్చి ఒంటరిగా తన ప్రయాణం మొదలుపెడుతుంది. జీవన తీరాలేవో కనుచూపు మేరలో కనిపించి ఒక మట్టి తాత్వికతను అనుభంలోకి తెస్తుంది.

**** (*) ****



3 Responses to ఒక ‘నది పలికిన వాక్యం’తో సంభాషణ

  1. Vil asagaram Ravinder
    February 1, 2017 at 4:31 pm

    Thank you Sir.

  2. ఆర్.దమయంతి.
    February 4, 2017 at 12:00 am

    ఎంత గొప్ప సమీక్ష! చాలా బావుంది.
    అభినందనలు.

    • VELDANDI SRIDHAR
      February 4, 2017 at 6:24 pm

      ధన్యవాదాలు మేడమ్….!

Leave a Reply to Vil asagaram Ravinder Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)