సంపాదకీయం

కొత్త శీర్షికలు

ఫిబ్రవరి 2017

వేలపూల సుగంధాల్ని మరిపించే సువాసన వానది. వానెప్పుడూ జ్ఞాపకాలుగా ముసురుకుని, కథలు కథలుగా కురిసి మరిచిపోలేని అనుభూతుల్ని మిగిల్చి వెళ్తుంది. ఉడుకుతున్న అన్నం వాసనేమో అచ్చం అమ్మ పిలుపులా ఒంట్లో ఉన్న ప్రతీ కణాన్ని పులకరింపజేస్తుంది. మంచి పాట కూడా అంతే, మన లోలోకి ఇంకి, రక్తంతో దోస్తీ చేస్తూ మనతో పాటే ఉండి పోతుంది.

మరి పుస్తకం?! దీంది కూడా వాన, అన్నం, పాటల పోకడే. వీటి పోకడ ఏమిటంటే… రాకడే! అవి వచ్చాక వెళ్ళే ప్రసక్తి ఉండదు. మరిచిపోవడమంటూ జరగదు. మనం ఏదైనా పుస్తకం నడుమ్మీద చెయ్యేసి ఒళ్లోకి తీసుకున్నప్పుడు అదొక్కటే రాకుండా దాంతో పాటు కొన్ని జ్ఞాపకాల్ని కూడా మనవొళ్లోకి లాగుతుంది. కొన్ని కథలు, వ్యాసాలు, కవితలు మనం పోయేవరకు వెంటాడుతూనే ఉంటాయి. మనకు ఏదైనా ఒక పుస్తకం గుర్తుకొచ్చినప్పుడు, ఆ పుస్తకంలో ఉన్న కథొక్కటే కాకుండా, దాంతో పాటు అప్పటి కాలాల్ని, సంగతుల్ని, ఆ కథ చదివినప్పుడు మన చుట్టూ ఉన్న పరిసరాల్ని,స్నేహితుల్ని, మనం అనుభవించిన సుఖాల్ని, దుఃఖాల్ని అన్నింటిని గుర్తుకు తెస్తుంది. చిన్నోడు ఒక్కడే ఆటకు వెళ్లి, మొత్తం పిల్లల గుంపుతో ఇంటికి తిరిగొచ్చి, అందరికీ స్నాక్స్ పెట్టమని అమ్మతో గొడవ పెట్టుకున్నట్టు… ఇలా వస్తాయన్న మాట పుస్తకాల జ్ఞాపకాలు కూడా.

అందుకే, మరిచిపోలేని ఆర్టికల్స్ కోసం వాకిట్లో ఈ నెల నుంచి ‘ఎడిటర్స్ పిక్’ అని ఒక కొత్త శీర్షిక మొదలుపెడుతున్నాం. ఇంటర్నెట్ పత్రికల్లోంచి, బ్లాగులనుంచి, పాత ప్రింట్ పత్రికల నుంచి మనల్ని వెంటాడే మంచి మంచి ఆర్టికల్స్ ని సెలెక్ట్ చేసి నెలకో ఆర్టికల్ ని ఇక్కడ ప్రచురిస్తాం.

అలాగే, పోయిన నెలలో ‘రీడర్స్ కార్నర్‘ అని ఒక కొత్త కాలమ్ కూడా మొదలుపెట్టాం. ఈ శీర్షిక కోసం మీలో ఎవరైనా రాయొచ్చు. వాకిలిలో మీకు నచ్చిన కథ, కవిత, వ్యాసం ఇలా ఏదైనా తీసుకుని మీ అనుభూతుల్ని రాయొచ్చు, లేదా ఆ వ్యాసం గురించి సద్విమర్శ కూడా చేయొచ్చు.

పాఠకుల మెదడుకు పదునుపెట్టే, సాహిత్యానికీ సంబంధించిన ప్రశ్నలు కొన్ని‘మీకు తెలుసా?’ అనే శీర్షిక రూపంలో ఈ నెల నుంచి మీ ముందుకు తెస్తున్నాం.

ఈ నెల వాకిలి ప్రత్యేకం- పప్పు నాగరాజు గారి అనువాదం ‘మెటాకవితలు మూడు’. కవిత్వ కళ గురించి, కవిత్వానుభూతి గురించి పలవరించిన కొన్ని కవితల్ని, ఆ కవుల తాలూకూ కవిత్వారాధనని తెలుగులో పరిచయం చెయ్యడానికి ఈ మూడు కవితలూ ఒక ముఖద్వారం వంటివి.