కవిత్వం

నువ్విక్కడ లేనప్పుడు

మార్చి 2017

ఆశలోకి జారడం ఎంత తేలికో ఓ లోతైన నిరాశలో మునగడమూ అంతే తేలిక
ఇక్కడ ఎవరూ లేరు, నేనూ నీ తలపూ… అంతే… అంతే… నా లోకమంతా ఇంతే!
ఒక ఊహ సంతోషమైతే మరో ఊహ దుఃఖం, నిజాలేవీ ఉండవురా
నేనూ, నీ తలపూ… అంతే.

ఒక తలపులో ఏదో విడిపోతుంది, ప్రాణం అల్లాడి పోతుంది,
మరొక తలపులో ఏదో ముడిపడుతుంది మనసు ఉప్పొంగుతుంది
అన్నీ తలపులే, నాకు నేను చెప్పుకొనే నీ కథలే.

ఈ సాయంత్రం నది ఒడ్డున కూర్చొని
పొడి ఇసుకని గుప్పిళ్ళ నుంచి జార విడుస్తుంటే ఎదో దిగులు
నిను చూస్తూ గడిచిపోయిన కాలమొకటి ఇక్కడే ఉండింది కదా, ఏమైపోయింది?
ఏ దిక్కులోకి క్రుంగిపోయింది?
ఇలాగే ఈ ఇసుకలాగే ఈ గుప్పిళ్ళ నుంచి
గుండె అంచుల నుంచి జ్ఞాపకాల్లోకి ఎప్పుడు జారిపోయింది?

పొద్దంతా చీకట్లోకి వెళ్ళి పోతోంది, కళ్ళలోకి వెచ్చని కన్నీరొచ్చి చేరుతోంది
నిశ్శబ్దం అని అందరూ సంబోధించే ఇక్కడే, నాకు మాత్రం
నీ గొంతులో మొదటిసారి విన్న ఆ పాట మళ్ళీ మళ్ళీ వినిపిస్తూనే ఉంది
చీకటని అందరూ వెలివేసిన శూన్యమొక్కటే తోడుగా ఉంది.

నీకొకటి చెప్పనా
నా ఇప్పటి సంతోషమంతా నా దుఖంలోనే ఉందిరా
మరికాసేపు, ఊహ ఉన్నంతసేపు, ఊహు… కాదు, ఊపిరున్నంతసేపు
నీ కోసం దుఃఖపడగల అపూర్వ క్షణాలు దొరికాయి చూడు
ఇదే ఇప్పటి నా సంతోషమంతా!

ఇది ఇలానే ఉండిపోతుందని
రాబోయే కాలమంతా వేదనే అని నాకేం నమ్మకం లేదు

భూమి తిరుగుతోందటగా
రాత్రి తరువాత పగలు
వేసవి తరువాత వర్షం

ఇలానే
ఇలానే ఈ చీకటంతా ఒకనాటికి వెన్నెలవుతుంది
అవుతుందిలేరా

నీకూ నాకూ మధ్య తెర పట్టుకొని కూర్చున్న కాలం అలసిపోతుందిలే
ఇవాళ కాకపోతే రేపు
దూరాలలో అల్లుకున్న దిగులు కావ్యాలు అప్పుడు కలిసి కూర్చొని చదువుకుందాం, సరేనా.

చూస్తున్నావుగా
తలపులో నుంచి తలపులోకి ఎలా ప్రవహిస్తున్నానో!

 

Pic. Credit: https://www.pinterest.com/pin/304555993535390396/