ఈ వారం కవి

కవిత్వం నన్ను సరళంగా, నిరాడంబరంగా మార్చింది

15-ఫిబ్రవరి-2013

 కవిత్వంలో నిశ్శబ్దం అనగానే మొదటగా స్ఫురించే కవి ఇస్మాయిల్ గారు. ప్రస్తుత కాలంలో ఇస్మాయిల్ గారిని తలచుకోగానే,  వెంటనే గుర్తుకొచ్చే  కవి – మూలా సుబ్రహ్మణ్యం అంటే అతిశయోక్తి కాదు. ఇస్మాయిల్ కవితలు చదివి, ఆ బాణిలో, ఆ ప్రేరణతో ఒక్క కవితైనా వ్రాయని కవి ఉన్నాడంటే నమ్మలేం. ఆ కవితల మత్తులో జోగుతూ గాలిబుడగల్లా పేలిపోయిన కవులు చాలా మందే ఉన్నారు. కవులు కాకపోయినా, ఇస్మాయిల్ కన్నా అద్భుతంగా ప్రకృతిలో మమేకమయ్యే మనుషులైనా కనీసం ఉంటారా అని ఆశ్చర్యపోవటం కూడా పరిపాటి.! ఇస్మాయిల్ తో పోలిక అవసరమో అనవసరమో తెలీదు. కానీ, ఆ స్థాయిలో అనుభూతికి కొత్త రంగులు తొడిగి, ప్రకృతిలో పుట్టి, ప్రకృతిలో మమేకమైన మరో కవి మన మూలా సుబ్రహ్మణ్యం అని చెప్పటానికి  ఎటువంటి మొహమాటాలు ఉండవు.

 

లీలగా వినపడుతున్న సెలయేటి సవ్వడి / చుట్టూ ఉన్న నిశ్శబ్దాన్ని రెట్టింపు చేస్తోంది”!

పారే నది నాకు దారి చూపుతుంది / చంద్రుడు దారంతా వెలుతురు పరుస్తాడు / చిన్ని పడవలో ఒంటరిగా నేను”.

వేణువుగా మలచొద్దు, కచేరీలసలే వద్దు / చప్పట్లు నా మౌనాన్ని భగ్నం చేస్తాయి”.

ధ్యాన ముద్రలోని విత్తనానికి / జ్ఞాననేత్రం తెరుచుకునేలా / వానబొట్టు ఉపదేశం”.

 

చెప్పుకుంటూ పోతే, ఏటి ఒడ్డునే ఆద్యంతాలు లేని ఓ రసప్రవాహ ఝరిలో మనలని మనం మర్చిపోతాం. అనుభవాన్ని అనుభవంగా చెప్పటమొక్కటే కవిత్వం కాబోదు. ఆ అనుభవసారంలోని అర్థాన్ని సామాన్య పాఠకుడికి కూడా కవి చేర్చగలిగినప్పుడే అది అర్థవంతమైన కవిత్వం అవుతుంది. ఆ పరిణితి సుబ్బు కవితల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అరమరికలు లేని అనుభూతి, సరళమైన భాష, స్పష్టమైన భావాలు పాఠకుడిని చేయి పట్టి నడిపిస్తాయి.

 

స్వచ్ఛమైన తెలుగు కవిత్వానికి కేరాఫ్ అడ్రస్ ఏదంటే, నిస్సందేహంగా చెప్పొచ్చు – ఏటి ఒడ్డున మూలా సుబ్రహ్మణ్యం అని.  మూలా సుబ్రహ్మణ్యంతో ముఖాముఖి :


 1. మీ గురించి. 

మొదటి ప్రశ్నే కష్టమైన ప్రశ్న అడిగేసారు (నవ్వులు)

నా గురించి అంటే నిజంగా చెప్పడానికేమీ తోచట్లేదు. అందుకని నా బ్లాగు పరిచయంలో పెట్టుకున్న నాలుగు లైన్లే చెప్పి ఊరుకుంటాను.

ఏ సెలయేటిని చూసినా

ఆ గలగలలు

నాలోనూ వినిపించేవి

 

కొన్నాళ్ళకి నేను

కవిత్వం మొదలుపెట్టాను!

 

2. సాహిత్యపరంగా మిమ్మల్ని ప్రభావితం చేసిన వ్యక్తులు?

ప్రశ్న కొంచెం మార్చాలేమో! (నవ్వులు) సాహిత్యపరంగా నన్ను ప్రభావితం చేసిన పుస్తకాలే ఉంటాయి కదా. అలా చూస్తే “అమృతం కురిసిన రాత్రి”, “రాత్రి వచ్చిన రహస్యపు వాన”, “కరుణ ముఖ్యం”,  “ఆరోవర్ణం”  ఇంకా “త్రిపుర కథలు”.

 

3. శ్రీశ్రీ, తిలక్, ఇస్మాయిల్, అజంతాలు కాకుండా, ముఖ్యంగా ఇప్పటి తరంలో మీరు అభిమానించే కవులు, కథకులు ఎవరు?

నచ్చే కవితలు, కథలే ఉండాలి గానీ కవులు, రచయితలు ఉండకూడదు. (నవ్వులు)

 

4. “నిశ్శబ్దం శబ్దాన్ని జయించిన రోజుమొదలైచిరుజల్లులో పూలుపలకరించే దాకా  మీ కవితా ప్రస్థానంలో చోటు చేసుకున్న మార్పుల గురించి చెబుతారా?

నా జీవితంలో మొదటి ఇరవై యేళ్ళు కవిత్వం లేకుండానే గడిచిపోయాయి.  తెలుగు అంటే వెర్రి ప్రేమ ఉన్నప్పటికీ ఎంసెట్లు, ఇంజనీరింగుల వెల్లువలో కవిత్వం గురించి ఆలోచించే సమయం చిక్కలేదు. ఇరవైయేళ్ళప్పుడు మహాప్రస్థానం చదివాను. ఆ కవిత్వం నన్ను ఉర్రూతలూగించింది. కానీ కవిత్వం రాసేందుకు మాత్రం ప్రేరేపించలేదు. తర్వాత  M.Tech కోసం ఖరగ్ పూర్ వెళ్ళినప్పుడు, అక్కడ ఒక స్నేహితుడి దగ్గర “అమృతం కురిసిన రాత్రి” పుస్తకం చూశాను. పేరే అద్భుతంగా ఉందే అని చదివి ఇస్తానని తీసుకున్నాను. తర్వాత ఒక ఏడాది పాటు ఆ పుస్తకంతోనే గడిపాను. చదవగా చదవగా నాకూ కవిత్వం రాయాలని ఒక దుర్బుద్ధి పుట్టింది. అలా 2002లో ఖరగ్ పూరులో ఉండగానే మొదటి కవిత రాసాను. తర్వాత ఒక సంవత్సరం పాటు ఏవేవో రాసాను. నవ్వుతారనే భయంతో ఎవరికీ చూపించేవాణ్ణి కాదు. 2003 లో ఉద్యోగరీత్యా బెంగుళూరు రావడం,  2003 అక్టోబరులో ఒక అర్ధరాత్రి విసుగెత్తిన నన్ను “రాత్రి వచ్చిన రహస్యపు వాన” నిలువునా తడిపెయ్యడం, అలా ఇస్మాయిల్ కవితాఝరిలో మునిగితేలాను. ఆయన్ని కలవలేకపోవడం జీవితంలో పెద్ద లోటు. తర్వాత తెలుగులో వచ్చిన ఆధునిక కవిత్వం చాలా వరకు చదివాను.

ఇలా పదేళ్ళబట్టీ కవిత్వం నన్ను వెంటాడుతోంది. రాయాలనుకున్నట్టు రాయలేక, రాసినదాంతో సంతృప్తి చెందలేక ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. కొత్తదనం లేని కవిత కవిత కాదని నాకు ముందునుంచీ నమ్మకం. అందుకని ఏది రాసినా కొత్తగా రాయడానికి ప్రయత్నించేవాడిని. ఏ వస్తువుని చూసినా దీన్ని కొత్తగా చూడొచ్చా అని ఆలోచించేవాడిని. . ఏ కవిత ఎందుకని నాకు నచ్చుతోందో ఆలోచించేవాణ్ణి. ఇది కాక తెలుగుపీపుల్.కాం ద్వారా పరిచయమైన సాయికిరణ్ గారు, రఘు గారు, తులసి, ప్రసూన , నిషిగంధ, సీత, ఈమాట ద్వారా పరిచయమైన విన్నకోట రవిశంకర్ గారు, ముకుంద రామారావు గారు, భూషణ్ గారు , ఇంద్రాణి , పవన్ గారు, వినీల్ ఇంకా ఇక్బాల్ చంద్ గారు, కనక ప్రసాద్ గారు, పప్పు నాగరాజు గారు, స్వాతి కుమారి గారు,  వీళ్ళందరితో కవిత్వం మీద చేసిన లెక్కలేనన్ని చర్చలు నాకు ఎంతో ఉపయోగపడ్డాయి.  ఇదికాక జెన్ కవిత్వం, సూఫీ కవిత్వం, కన్నడ వచనాలు ఇవి ఇష్టంగా చదువుకున్నాను. ఇవన్నీ చదవడం వల్ల నా కవిత్వంతో పాటు నా వ్యక్తిత్వంలో కూడా చాలా మార్పు వచ్చింది. కవిత్వం నన్ను సరళంగా, నిరాడంబరంగా మార్చింది. “నా కవిత్వంలో నేను దొరుకుతాను” అన్న కవి వాక్యం అనుభవంలోకి వచ్చింది. కవిత్వం మనకో దారి చూపిస్తుందని అర్ధమైంది. తావోయిజంలో చెప్పినట్టు దారిలో ఉండడం ముఖ్యం. గమ్యం ముఖ్యం కాదు. ఇప్పుడు నాకు కవిత్వం మీద పెద్ద మమకారం లేదు. కవిత్వం వచ్చినప్పుడు రాసుకోవడం, నచ్చిన కవిత్వం చదువుకోవడం ఇంతే.

 

5. మీ కవితల్లో ఇస్మాయిల్ తొంగి చూస్తుంటారు అని చాలా మంది అంటూ ఉంటారు. ఇది మీరు విమర్శగా స్వీకరిస్తారా లేక ప్రశంసగానా? అసలు, ఇస్మాయిల్ ప్రభావం మీ మీద ఎంత ఉంది?

నా మీద ఎవరి ప్రభావం ఉందో మీరే చెప్పాలి (నవ్వులు). నా మీద ఇస్మాయిల్ ప్రభావం తప్పకుండా ఉందండీ. అయితే అది కవితా నిర్మాణంలో కాదు. కవితా దృక్పథంలో.

 

6. ముందు ప్రశ్నకి అనుబంధంగానే ప్రశ్న కూడా ఉండబోతోంది. అందమైన జ్ఞాపకాలలోంచి మీరు మంచి కవిత్వమే వ్రాస్తారని, కానీ కష్టసుఖాలు కవితా వస్తువులుగా మీరు వ్రాస్తే చూడాలని ఆశిస్తున్నట్లు కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. సూటిగా మీ జవాబు ఏమిటి?

ముందు చెప్పినట్టు నాకు కవిత్వం మీద పెద్ద మమకారం లేదండీ. అసలు కవిత్వం నేను రాస్తున్నానని కూడా నాకు అనిపించడం లేదు. కవిత్వం నన్నొక వాహికగా చేసుకుని బయటకి వస్తోందనిపిస్తుంది. అందుకని ఎలాంటి వస్తువుల మీద రాయాలనేది నా చేతిలో లేదు.

 

7. మనం అభిమానించే కవులు చాలామంది, కవితల్లో రాజకీయ సామాజిక కోణాలను స్పృశించారు. మీ ఉద్దేశ్యంలో కవిత్వంలో రాజకీయ, సామాజిక కోణాలు ఏమాత్రం అవసరం? అసలు అవసరమా?

నేను హృదయవాదిని. నా గుండెని తట్టే కవిత్వం కోసం నేను వెతుక్కుంటాను. రాజకీయాలు మేధోపరమైన వ్యాపారాలు. వాటికి నేను కనెక్ట్ కాలేను.

 

8. వాదాలకి, నినాదాలకి, ప్రాంతాలకి తెలుగు కవిత్వం పరిమితమైపోతున్నదని ఎప్పటి నుంచో విమర్శలు వస్తున్నాయి. కవిత్వం జీవితానుభవాల నుంచి వచ్చేదై ఉండాలంటారు. అలాంటప్పుడు, సామాజిక, రాజకీయ, ఆర్ధిక విషయాలను జీవితానుభవంగా భావించి స్పృహతో కవిత్వం వ్రాస్తే తప్పేముంది?

తప్పేం లేదు. నిజమైన  దుఃఖంలోంచో, నిజమైన ఆనందంలోంచో కవిత పుట్టినప్పుడు ఆ కవి దుఃఖం లేదా ఆనందం మనకి అంది తీరుతుంది. ఆ కవితలో ఏ వాదం ఉంది? దాని చారిత్రక నేపథ్యం ఏమిటి? ఇవన్నీ విశ్లేషించేది విమర్శకులు. నాకు వాటి మీద ఆసక్తి లేదు.

 

9. ప్రస్తుతపు పోకడలు చూస్తుంటే, “అల్పాక్షరాలతో అనంతార్థంమాటవరసకే మిగిలినట్లు అనిపిస్తుంది. కవిత్వం పేరుతో కథలు, సీరియల్సు వ్రాసేస్తున్నారు. నేపథ్యంలో మీ మీద ఉన్న మరో అపవాదు ఏమిటంటే, క్లుప్తంగా వ్రాసే ప్రయత్నంలో, భోజనం పెట్టకుండా, రుచి మాత్రం చూపించి వదిలేస్తారనీ. దీని మీద మీ వివరణ ఏమిటి? అసలు కవిత్వంలో క్లుప్తత మీద అవగాహన కల్పిస్తారా?

కవిత్వంలో క్లుప్తత ఉండి తీరాలని నాకనిపిస్తుంది. Brevity is the Soul of Wit  అన్నారు గానీ Brevity is the Soul of Poetry అని కూడా అనొచ్చేమో! అయితే క్లుప్తత అంటే కవిత నిడివి తక్కువ ఉండడం కాదు. కవితలో వ్యర్ధంగా ఒక్క అక్షరం కూడా ఉండకూడదు. తను చెబుతున్నది పాఠకుడికి చేరదేమో అన్న భయం వల్లనో, ఎక్కువ చెప్పెయ్యాలన్న ఆతృత వల్లనో కవులు కవితని ఆపాల్సిన చోట ఆపరు. దీనివల్ల కవిత అందం చెడిపోతుంది. కవిత్వానికి ఒక రూపం ఉండాలి కదా!

ఇక రుచి మాత్రం చూపించి వదిలెయ్యడం అంటారా, ఈ మధ్య రాసిన ఒక కవిత గుర్తొస్తోంది..

నేను కేవలం

ఒక తాళం చెవి

తయారు చేసి ఇస్తాను

 

నిధి మాత్రం

నీలోనే ఉంది!

 

10. కవిత్వానికి ఏది ముఖ్యంభావం, భాష, శిల్పం. వీటి మధ్య సమన్వయాన్ని ఎలా సాధించాలి?

కూరకి ఏది ముఖ్యం అంటే ఏం చెప్తాం. అన్నీ సమపాళ్ళలో కలిస్తేనే కదా రుచిగా ఉండేది. అలాగే కవిత్వం కూడా. అన్నీ ముఖ్యమే. ఇక సమన్వయం ఎలా సాధించాలి అంటే కవిత్వం ఎలా రాయాలి అని అడగడమే. ఒకరు చెప్తే తెలుసుకునే విషయం కాదిది. రాస్తూ వెళ్తే ఎప్పటికో ఈ విషయాలు తేటపడతాయి.

 

11. అసలు కవిత్వం ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుడుతుంది అన్న ప్రశ్నలు వేస్తే, మీ సమాధానం ఏమిటి?

“ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా?”   ఎప్పుడో రాసుకున్న ఒక లైను “ఏ కవి కాగడా పటుకుని వెతుక్కుటూ తమవైపు వస్తాడో అని చీకటి గుహలో ఊహలు ఎదురుచూస్తున్నాయి”. కవిత్వానికి చావు పుట్టుకలు లేవు. కవి సమయంలో కవికీ, చదివినప్పుడు మనకి ఎరుకలోకి వస్తోందంతే.

 

12. కవిత్వంలో మునిగితేలుతూ ఉండే మీరు గోడలు, అమరావ్రతం, అనునాదం, తదితర కథలు వ్రాయటానికి ప్రేరణ ఏమిటి?

నేను కథలెక్కడ రాసాను. అవన్నీ పెద్ద కవితలే కదా. (నవ్వులు) నాకు కథలు రాయడం చేత కాదండీ. ప్రయత్నిస్తున్నాను. అదో అభ్యాసం. చూడాలి ఎప్పటికైనా మంచి కథ రాయగలనేమో!

 

13. ప్రస్తుత తెలుగు కవులపై, కవితా విమర్శకులపై మీ అంచనాలు, అభిప్రాయాలు ఏమిటి?

తెలుగులో ఎంతో వైవిధ్యమైన కవిత్వం వస్తోంది. పత్రికల్లోనే కాక బ్లాగులు, వెబ్ సైట్లలో కూడా ఎంతో మంది కవులు ఉత్సాహంగా కవిత్వం రాస్తున్నారు.  ‘వాకిలి’లో కూడా కవిత్వానికి మంచి వాతావరణం కల్పించారు.  ఇంటర్నెట్ వల్ల కవితని రాయడం, వెంటనే ప్రచురించుకోవడం, నలుగురి అభిప్రాయాలు తెలుసుకోవడం, లోటు పాట్లని దిద్దుకోవడం ఈ విషయాల్లో ఇంతకు ముందు లేని వెసులుబాటు మనకి ఉంది. సరిగ్గా వాడుకోగలిగితే ఇది కవులకి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.  తెలుగులో మంచి విమర్శకుల కొరత కనిపిస్తోంది.  అయితే కవులు కూడా విమర్శని తొందరగా తీసుకోలేకపోతున్నారనిపిస్తోంది. “నన్ను పొగిడితే నిన్ను పొగుడుతా” అనే ధోరణే కనిపిస్తోంది. మంచి కవిత్వం రావాలంటే మంచి విమర్శ ఉండి తీరాలి. కవితని విమర్శిస్తే కవిని విమర్శించినట్టు కాదు కదా.

ఈ అవగాహన ముఖ్యం.

 

14. కవిత్వానికి ప్రయోజనముందంటారా?

కవిత్వానికి తప్పకుండా ప్రయోజనం ఉంది. అది జీవితంలోని నిజమైన అర్థం వైపు మనల్ని నడిపించడం. కవి జాతికి సౌందర్య భిక్ష పెడతాడు. జీవితంలో సౌందర్యం చాలా ముఖ్యం. నేడు మన సమాజంలో జరుగుతున్న చాలా అరాచకాలకి కారణం ఈ సౌందర్యరాహిత్యమే అనిపిస్తుంది. అందుకే కవిత్వం, కళలు లేని సమాజం కుళ్ళిపోతుంది.

 

 

 

 

ముఖాముఖం: కొండముది సాయికిరణ్ కుమార్