కవిత్వం

ఎప్పుడైనా చూశారా అతన్ని?

మార్చి 2017

ప్రేక్షకుల గేలరీల మధ్య ఒద్దికగా కూలబడి
నాటకాన్నిశ్రద్ధగా చూస్తూ కనిపిస్తాడతను
తెరలు దగ్గరగా జరుపుతున్నప్పుడు
ఎందుకో అస్తిమితంగా కదులుతాడు

చప్పట్లు ముగిశాక
ఎక్కడెక్కడో నిశ్వాసాలు, పొడిదగ్గు,
ఎవరో చిన్నగా మాట్లాడుతున్న చప్పుడు
ఆరుతున్న దీపాలతో పాటే
మెల్లిగా నిశ్శబ్దం పరుచుకుంటుంది.
ఆ చీకటిలో అతను ఒక్కడే నల్లగా మెరుస్తాడు!

ప్రతీసారీ ఇలాకాదు
సందోహం లో అతను సంతోషంగా కనిపిస్తాడు
కొందరిని ఆటపట్టించడానికి బోలు ప్రయత్నాలే కాక
సమూహాల్నిసమకూర్చి చర్చలను లేవనెత్తుతుంటాడు
చిరునవ్వు ల వెనుక మసక చూపును దోపుతాడు
కనిపించని
బరువును మోస్తూ పలకరిస్తాడు

మోహిస్తాడు,
బహుశా ప్రేమిస్తాడేమో కూడా!
ఓడిపోతానని తెలిసినట్లే ఉంటాడు. మళ్ళీ క్షమిస్తాడు
క్షమించడం లోని సుఖాన్ని మరిగినవాడల్లే ఉంటాడు

కానీ
చలికాలపు అర్ధరాత్రి ఉలికిపడిలేచి
అధాటున కౌగిలించుకునే తోడు కోసం
తపించి తపించి మంచం పై దొర్లి
‘అంతా మిథ్య’ అని నవ్వుకుని పక్కకు తిరిగి
ప్రక్కనే ఆదమరిచిన భార్యను చూసి ఆశ్చర్యపోతూ
రాని నిద్రకోసం అనవసరంగా ప్రయత్నిస్తాడు

వేసవి సాయంకాలాల్లో బాల్కనీ లోనుంచి నగరాన్ని చూస్తూ
ఇంతవరకూ కలవని ఆమె ఆనవాలు కోసం ఆలోచనలతో పెనుగులాడి
వెనుతిరిగి దఢాల్న
తలుపులు మూస్తాడు

మొన్న ఒక రాత్రి ఇంట్లో అందరూ పడుకున్నాక
హఠాత్తుగా అతనికి అనిపించింది
‘ఇప్పుడేమైతే నేం, నిద్రపోయినట్లే కదా
అన్నీ సర్దేసి ఒకసారి వెళ్ళిపోతేనేం ?
మిగిలేది ఈ బొందేకదా… రేపటికి రెండు, అంతేకదా!’

కుర్చీ లోంచి
వెచ్చగా ఉన్న గచ్చుపై కాళ్ళాన్చుతూ
రాత్రిని మరొక్కసారి వేడుకున్నాడతను …
‘ఏదీ, ఒక్కసారి వెలిగించి, కరిగిపోయే ఆమెను చూపించు,
నీమీదొట్టు, ఇంకెప్పుడూ నిన్ను వృథా కానీయను”

 

 

Pic. Credit: https://www.pinterest.com/pin/274578908504965008/