కవిత్వం

నేను చూశాను!

15-ఫిబ్రవరి-2013

ఎదురవుతుంటారు కొందరు. చిటికెనవేలితో శిలువను ఎత్తేవాళ్ళు, చిరునవ్వుల్తో
చీకట్లను తరిమి తరిమి తన్నేవాళ్ళు, సమయాలకు సౌరభాన్ని అద్దేవాళ్ళు,
సంభాషణను సమ్మోహితం చేసేవాళ్ళు, పరిచయాన్ని ప్రపంచం చేసేవాళ్ళు,
సామీప్యాన్ని సందర్భంగా మలిచేవాళ్ళు, జీవితాన్ని ఉత్సవం చేసేవాళ్ళు.

ఇదే భూమ్మీద. కళ్ళలోకి సూటిగా చూసేవాళ్ళు, చెత్తమనుషుల చెవుల్లో సీసాలు పోసేవాళ్ళు,
మాటతో మట్టిముద్దకు ప్రాణం పోసేవాళ్ళు, ఆగమనంతోనే ఆత్మీయులయ్యేవాళ్ళు, వీడ్కోలుతో జీవితంపైని ఆశను పెంచేవాళ్ళు.

నిజమై, నిప్పై, ఉరుమై, చెలిమై, పిలుపై, వలపై, గెలుపై, మలుపై. ఎదురవుతుంటారు కొందరు. జీవనకాంక్షని తెలిపే అరుపై.

వెళ్ళరు వాళ్ళు తిరుగుటపాలో. ఉండనీరు మనల్ని ఉన్న బాక్సుల్లో.