ముఖాముఖం

యాభయ్యేళ్ల వందేళ్ల ఏకాంతం

ఏప్రిల్ 2017

న్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ – వందేళ్ళ ఏకాంతం – స్పానిష్ భాషలో గాబ్రియేల్ గార్సియా మార్క్వెజ్ రాసిన మాగ్నం ఓపస్. మార్క్వెజ్ ఈ నవలను 1965 లో రాయటం మొదలుపెట్టి 1966 లో పూర్తి చేశాడు. ఇది ఏభయై ఏళ్ళ క్రితం 1967లో అచ్చయ్యి అనేక సంచలనాలతో సాహిత్య ప్రపంచాన్ని కుదిపివేసింది.

ఏప్రిల్ 17 న మార్క్వెజ్ వర్ధంతి. One Hundred Years of Solitude పుస్తకానికి ఈ ఏడాదితో యాభయ్యేళ్ళు నిండుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని “యాభయ్యేళ్ల వందేళ్ల ఏకాంతం” పేరుతో మార్క్వైజ్ ఇంటర్వ్యూ తెలుగులో.

“మార్క్వెజ్ రచనాశిల్పం” పేరుతో సురేష్ అందిస్తున్న వ్యాస పరంపరలో ఇదొక భాగం. మూడేళ్ల క్రితం ఆంధ్రజ్యోతి వివిధ పత్రికలో వచ్చిన వ్యాసానికి ఇది మూలవ్యాసం (అనెడిటెడ్ వెర్షన్).

***


90ల తర్వాత తెలుగు సాహిత్య ప్రపంచంలో మాజికల్ రియలిజానికి మార్క్యూజ్ పర్యాయపదం అయ్యాడు. 1982లో నొబెల్ ప్రైజ్ తెచ్చిపెట్టిన ఒన్ హండ్రిడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ నవలలోని యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ గ్లోబలైజేషన్కి ఉదాహరణగా మారింది. గ్రామీణ నేపథ్యం కల మన రచయితలు ఎక్కడో ఖండాంతరాల అవతల మకొండోలో తమ ఊరినీ, తమ ఊరిలో ఉర్సులా వంటి తల్లుల్నీ చూడగలిగారు. మొన్న తన మరణం తర్వాత వేలాది సామాన్య పాఠకుల, రచయితలతో పాటు, కొలంబియా అధ్యక్షుడు, అమెరికన్ ప్రెసిడెంటు కూడా సంతాపం ప్రకటించారు. ఇంతగా ఖండాంతర నానా జాతుల సాహిత్య హృదయాలనీ ప్రపంచపు నలుమూలలా కొల్లగొట్టిన మార్క్యూజ్ దక్షిణ అమెరికా కొలంబియాలోని ఓ మారుమూల అరాచక రచయిత. తన నవయవ్వనంలో ఎలా రాయాలో తెలీక తబ్బిబ్బయిన మన తోటి తెలుగు కుర్ర రచయితలలాంటి వాడే అయినా, రాయటం కోసం బతికేందుకు దుర్భరమైన కష్టాలకు సిద్ధమవటం, తనదైన రచనా శిల్పాన్ని సాధించటం అందుకు దోహదపడ్డాయి.

ఓ మామూలు కథ రాయడానికి 500కి పైగా కాగితాలు తగలేస్తానని మార్క్యూజ్ అంటే, మన రచయితలకు షాక్ తగలక తప్పదు. 1983లో సహ రచయిత, తన మిత్రుడు కూడా అయిన మొండోజా కి ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో మార్క్యూజ్ అనేక విషయాలను ప్రస్తావించాడు. లాటిన్ అమెరికన్ వాస్తవికత, అక్కడి సాహిత్యం, దాని నేపథ్యం, తన రచనా క్రమం, తనదైన శిల్పాన్ని సాధించటంలో పడిన అష్టకష్టాలు, భాషా విన్యాసాలు, ఇంకా తన రాజకీయ అభిప్రాయాలు, అక్కడి నిబద్ధ సాహిత్యం తో విభేదాలు, విమర్శకులు నిర్వచించిన సాహిత్య లక్షణాలని బద్దలు కొట్టేయటం, లోకమంతా మెచ్చిన తన నోబెల్ ప్రైజ్ నవల తనకాట్టే నచ్చలేదనటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏది ఏమైనా అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా ల తర్వాత, ఇప్పుడు లాటిన్ అమెరికన్ సాహిత్యం మనల్ని వెంటాడబోతోంది గనుక, మార్క్యూజ్ మాటలని జాగ్రత్తగా విని వాటిని మనదైన వాస్తవికతలోంచి ఆలోచించటం, చర్చకు పెట్టటం తెలుగు సాహిత్యానికి తప్పనిసరి. అందులో ఇదొక ప్రయత్నం.

ఇంటర్వ్యూ: మెండోజా
తెలుగు: సురేష్

“పరిమితుల్ని దాటి చూసే వాస్తవికతే మార్మికత
మార్మిక శైలి నాది కాదు, మా అమ్మమ్మది
సాహిత్య నిబద్ధతతో సమస్యలున్నాయి”

మార్క్యూజ్తో మొండోజా ఇంటర్వ్యూ

***

ప్రశ్న: నువ్వు అలా నమ్ముతావా?

అవును. రచయిత తన జీవిత కాలంలో రాసేది ఒకే ఒక పుస్తకం అని నమ్ముతాను. అదెన్ని పేర్లయినా తగిలించుకోనీ, ఎన్ని సంపుటాల్లో అయినా రానీ. బాల్లాక్ కానాడ్, మిల్విల్లే, కాఫ్కా ఎవరయినా తీసుకో. రాసేది ఒకే పుస్తకం. ఒక్కోసారి రాసిన వాటిలో ఒకదానికి బాగా పేరొచ్చిందనుకో, ఇక ఆ రచయిత ‘ఆ ఒకే ఒక పుస్తకం తాలూకు రచయితగా చరిత్రలో మిగిలిపోతాడు. సెర్వాంటెస్ డాన్ క్విక్సోట్ (డాన్ ఖియోటె) రచయిత. ఆయన రాసిన కథలు ఎవరికి గుర్తున్నాయి? గ్వాటెమాలా రచయిత మిగ్యుల్ ඩ්ටයිඒ ఆస్టియాస్కి ‘ది ప్రెసిడెంట్ నవలా రచయితగానే పేరు. కానీ అది అతని “లెజెండ్స్ ఆఫ్ గ్వాటెమాలా” కంటే గొప్పదేం కాదు.

ప్ర: అలా అయితే, రచయిత ఒకే ఒక పుస్తకం కోసం జీవిస్తాడని అనుకుంటే, నీ సంగతేంటి? నీ ఒకే ఒక పుస్తకం ‘మకోండో పుస్తకమేనా? (మార్కెజ్ రచనల్లో తరచూ వచ్చే ఊరిపేరు మకోండో)

కాదు. నీకూ తెలుసు. Leaf Storm, One Hundred Years of Solitude ఈ రెండు నవలల్లో మాత్రమే మకొండో వస్తుంది. మిగతా రచనల నేపథ్యం కొలంబియా తీరాన ఉండే ఒక మారుమూల పట్నం. అక్కడికి రైలూ, రోడూ ఉండవు. లాంచీలో ప్రయాణమే.

ప్ర: అయితే నీ ఒకే ఒక పుస్తకం?

నా ఒకే ఒక పుస్తకం ఏకాంతం. ఏకాంత వాసానికి చెందిన మనిషి. Leaf Storm లో ముఖ్యపాత్ర బతుకూ చావూ అంతా ఏకాంతంలోనే. No One Writes to the Colonel లో కర్నల్ ఎదురు చూస్తూ… చూస్తూనే ఉంటాడు. ఎప్పటికీ రాని తన పెన్షన్ కోసం. In Evil Hour నవలలో మేయర్ కూడా ఏకాంత జీవి. అయితే అతనిది “అధికారం వల్ల వచ్చిన ఏకాంతం”.

ప్ర: ఆర్తియానో బుయెండియా లాగానా? లేదా నియంతలా.

సరిగా చెప్పావు. One Hundred Years of Solitude, Autumn of The Partiarch రెండూ ఏకాంతానికి సంబంధించినవి.

ప్ర: ఏకాంతమే నీ అన్ని రచనలకీ వస్తువయితే దాని మూలాలు ఎక్కడ నుంచి వచ్చాయి? నీ బాల్యం నుంచా?

అది నా ఒక్కడికి సంబంధించింది కాదు. అది అందరి సమస్య అయితే ఒక్కొక్కరు ఒక్కోలా దాన్ని ప్రకటించవచ్చు. ఏకాంత భావన చాలా మంది రచనలలోకి చొరబడింది. కొంతమంది రచయితలకి తెలిసీ – ఇంకొందరికి తెలీక. నీ రచనల్లో కూడా. కాదా?

ప్ర: అవును, నేనూ రాసాను, నీ One Hundred years Of Solitude నవలకి బీజరూపం నువ్వు ఎప్పుడో రాసిన Leaf Storm లో ఉంది. అప్పటి ఆ యువ మార్కెజ్ గురించి ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు?

జాలి పడతాను. ఎందుకంటే అతను నవలని త్వరత్వరగా ముగించేశాడు. తను మొదటిసారీ చివరిసారీ రాసేది ఆ నవలే అనుకున్నాడు. అప్పటి తన ప్రపంచ జ్ఞానాన్నంతా- ముఖ్యంగా తను అమెరికన్, యూరోపియన్ రచయితల నుంచి నేర్చుకున్న అన్ని మెళకువల్నీ చమక్కుల్నీ అందులో ప్రదర్శించాడు.

ప్ర: ఆ నవల రాసినప్పుడు నీకు ఇరవై రెండేళ్లు. బారాంక్విలా లో ఉండి అందరూ వెళ్లిపోయాక పత్రికాఫీసులో తెల్లవార్లూ కూర్చుని రాసుకునే వాడివి.

అవును EL Heraldoపత్రికాఫీసు అది.

ప్ర: గుర్తుంది. నియాన్ లైటు, సీలింగ్ ఫానూ, ఉక్కపోత, రోడ్డుకవతల బారు, అండర్ వరల్డ్ మనుషులు.. నేరస్తులు.

అవును. నేనక్కడే ఓ హోటల్లో ఉండేవాడిని. అదో వేశ్యల అడ్డా. రూం అద్దె ఒకటిన్నర పెసోలు. ఓ కాలమ్ రాస్తే మూడు పెసోలు వచ్చేవి. సంపాదకీయం రాస్తే ఇంకో మూడు. రూం అద్దె కట్టలేని రోజు నా Leaf Storm రాత ప్రతిని హోటల్ గుమస్తా దగ్గర తనఖా పెట్టేవాడిని. నేను ఆ కాగితాల కోసం తప్పక తిరిగి వస్తానని అతని నమ్మకం.

ప్ర: ఆ నవల అచ్చువేయటం కష్టమయిందా?

అవును. ప్రచురణకర్త దొరకటానికే ఐదేళ్లు పట్టింది. ఓ అర్జెంటినా ఎడిటర్ అయితే నువ్వు రచనలు మానేసి చేపలు పట్టుకోటం మంచిదని పెద్ద ఉత్తరం రాశాడు. No One Writes to the Colonel ని ఫ్రాన్స్లో గాలిమార్ట్ వాళ్లకి పంపాను. దాన్ని రెండో రోజే తిరగొట్టారు.

ప్ర: నీ రచనా పద్ధతిలో వచ్చిన తేడాల గురించి అడగాలి. Leaf Storm నవలకి One Hundred Years of Solitude నవలకీ మధ్య రాసిన No One Writes to the Colonel, in Evil Hour, Big Mama’s Funerel నవలల్లో నువ్వు హఠాత్తుగా వాస్తవిక పద్ధతిని ఆశ్రయించావు. నీ మ్యాజిక్ని వదిలేసి. భాష సూటిగా, శిల్పం సాపుగా చాలా పరిమితుల్ని విధించుకున్నట్టు ఉంటుంది. ఎందుకనీ?

Leaf Storm రాసినప్పటికి వాస్తవికతను కవితాత్మకంగా పాఠకులకి చేర్చేదే మంచి నవల అనుకునేవాడిని. అది వచ్చిన కాలం – 8°ළුටඩ්රාථථ* రక్తసిక్త నిర్బంధం, తీవ్రమైన అణచివేత అమలవుతున్న కాలం. ‘ఆ పాలకుల క్రూరత్వాన్ని నీ నవల బహిర్గతం చేయలేదు. ఖండించలేదు” అని నా “మిలిటెంట్ మిత్రులు’ అనటం మొదలు పెట్టారు. దాంతో నేను ఒక అపరాధ భావనకి గురయ్యాను. అలాంటి భావాల్ని ఇవాళ ఒప్పుకోలేను. అవి సాహిత్యాన్ని తేలిక పరిచే పొరపాటు అభిప్రాయాలు. కానీ అప్పుడే మన్పించిందంటే – దేశం ఎదుర్కొంటున్న తక్షణ రాజకీయ సాంఘిక వాస్తవికతను ప్రతిబింబించటం రచయిత బాధ్యత అని. ఆ దశలో రాసినవే అలాంటివి. అయితే అదృష్టవశాత్తూ నేను త్వరలోనే ఆ దశను దాటి సాహిత్యం గురించిన నా పాత భావనలోకి తిరిగి వెళ్లాను. ఆ రచనలు కొలంబియా జీవన వాస్తవికతను యధాతథంగా ప్రతిబింబిస్తాయి. వాటిని రాయటం పొరపాటు అనీ అనుకోను. అయితే వాటిలో వాస్తవికతకు సంబంధించిన దూరదృష్టి లేకపోవటం కన్పిస్తుంది. అవి సూటిగా బల్లగుద్దినట్టు ఉంటాయి. అట్టే పరిపక్వం చెందని దశ అది. පූරළි°ගීකරණී ප්‍ර రచనలన్నీ “చివరి పేజీతోనే ఖచ్చితంగా ముగుస్తాయి. ఆ రచనా పద్ధతి ఇప్పుడయితే ఇరుకుగా అన్పిస్తుంది. అంతకంటే బాగా రాయగలనని ఆనాటికే నాకు తెలుసు.

ప్ర: నీలో ఆ మార్పుకి కారణం ఏమిటి?

నా రచనల గురించి విశ్లేషించుకోవటం. చాలా కాలం ఆలోచించాక ఒక నిర్ధారణకి వచ్చాను. నేను చేయాల్సిన పని – ఇంకా పెద్ద పని – మిగిలి ఉందని అర్థమయింది. అదేమంటే, నా దేశ రాజకీయ సాంఘిక వాస్తవికతను చెప్పటానికి మాత్రమే నిబద్ధుడిననటం కాదు. అంతకంటే పెద్దదయిన ఈ ప్రపంచాన్నీ దాని వాస్తవికతనూ చెప్పటం. ఆ చెప్పటంలో కూడా నిష్పక్షపాతంగా ఉండటం, దేనివైపూ మొగ్గు చూపకపోవటం. అలా నా స్వానుభవం ద్వారా లాటిన్ అమెరికాలో నిబద్ధ సాహిత్యంగా చెలమణి అవుతున్న దాన్ని నేను అంగీకరించలేకపోయాను. అలాంటి సాహిత్య నిబద్ధతలో చాలా సమస్యలున్నాయి. అయితే వ్యక్తిగతంగా నేను రాజకీయ నిబద్ధుడిని. నా రాజకీయ నిబద్ధత నీకు తెలుసు.

ప్ర: సోషలిజానికా…?

అవును. నేను సోషలిష్టు ప్రపంచాన్ని కోరుకుంటున్నాను. ఆ సమసమాజం ఇవాళ కాకపోతే రేపు వస్తుందని నమ్ముతున్నాను. అయితే లాటిన్ అమెరికాలో నిబద్ధ సాహిత్యంగా పిలవబడుతున్న దానితో ఇంకా చెప్పాలంటే సామాజిక ప్రతిఘటనా నవలా ప్రక్రియతో నాకు విభేదాలున్నాయి. ఎందుకంటే దాని ప్రాపంచిక దృక్పథానికి పరిమితులునన్నాయి. అందువల్ల అది తాను ఆశించిన రాజకీయ చర్యలకు ఉపయోగపడదు సరికదా, అందుకు వ్యతిరేక ఫలితాన్నే ఇస్తోంది. ఎందుకంటే, లాటిన్ అమెరికన్ ప్రజలు నిర్బంధం మీదా అన్యాయాల మీదా గురిపెట్టే నవలలని మించిన సాహిత్యాన్ని ఆశిస్తున్నారు. సాహిత్యం గురించిన వారి అంచనాలు మరింత పెద్దవి. ఎందుకంటే ఆ సమస్యల గురించి వారికి లోతుగా ముందే తెలుసు కాబట్టి. రచయితలు ఏమి రాయాలో రాయకూడదో నిర్దేశించటం ద్వారా రచయితల సృజనాత్మక శక్తికి బంధనాలు వేయటం తప్పని నా మిలిటెంట్ మిత్రులు తెలిసో తెలియకో చేస్తూ ఒక్కోసారి రియాక్షనరీలుగా కూడా వ్యవహరిస్తున్నారు. నా ఉద్దేశ్యంలో ప్రేమని గురించిన నవల విప్లవాన్ని గురించిన నవల కంటే తక్కువేం కాదు. రచయితకున్న నిజమైన విప్లవాత్మక బాధ్యత ఏమిటంటే, తను రాయాలనుకున్న వస్తువుని “మరింత బాగా రాయటం’.

ప్ర: తక్షణ రాజకీయ అవసరాల కోసం రాయటం ఆపావు. సరే One Hundred Years of Solitude లాంటి వాటిలో మార్మిక వాస్తవికతా పద్ధతిని ఎలా సాధించావు?

అలా కథ చెప్పే పద్ధతి మా అమ్మమ్మది. ఓ చిన్నమారుమూల పట్టణంలో ఆమె జీవితం గడిచింది. అక్కడ నమ్మకాలకీ మూఢనమ్మకాలకీ తేడా లేదు. వాళ్ళ కథలూ కబుర్లూ ఎంత నమ్మశక్యంగా ఉంటాయంటే, అవి వాళ్ల రోజువారీ చర్యల్లో భాగం. నేనా రచనా పద్ధతిని కొత్తగా కనుక్కోలేదు. దెయ్యాలూ, భూతాలూ, కల్పనలూ, చిత్రమయిన జబ్బులూ, మంత్ర వైద్యాలూ, మూఢనమ్మకాలూ మా లాటిన్ అమెరికన్ సమజానికే ప్రత్యేకం. వాటినే నేను రచనల్లోకి తీసుకువచ్చాను. నీకు గుర్తుందా? కొలంబియాలో కొందరు చేసిన ప్రార్థన వల్ల ఒక ఆవు చెవిలోంచి పురుగులు బయటకు రావటం? అలాంటివి మేము రోజూ చూసాము. అలాంటి వాస్తవికతను అర్థం చేసుకోవటం కష్టం కనుక చాలా కాలం నుంచీ హేతువాదులూ, స్టాలినిష్ణులూ కొన్ని పరిమితుల్ని విధించారు. నేను చేసిందల్లా ఆ పరిమితుల్ని దాటి వాస్తవికతను చూడటం. అలా రాసిందే
One Hundred Years of Solitude నవల.

ప్ర: One Hundred Years of Solitude, Autumn of Partiarchనవలల్లో నిత్యజీవితంలో కనిపించని కొన్ని విచిత్రాలున్నాయి. అవి నిజంగా జరిగాయా? లేక అలా రాయటం రచయిత స్వేచ్ఛలో భాగంగా చూడాలా?

అలాంటి విచిత్రాలు మా లాటిన్ అమెరికన్ వాస్తవికతలో ఒక భాగం. అసలుకి మా వాస్తవికతలోనే ఒక ವಏರಿಳ್ತಂ ఉంది. అది రాయటం, వర్ణించటం రచయితకు కష్టం. మాటలే దొరకవు. నువ్వో పెద్ద నది గురించి రాయాలనుకో. యూరోపియన్ పాఠకుడికి గుర్తోచ్చేది 1710 మైళ్ల పొడవున్న డాన్యూబ్ నది మాత్రమే. కొన్ని చోట్ల అవతలి గట్టు కనిపించని సముద్రంలా ఉండే అమెజాన్ నది ఆ పాఠకుడి ఊహకి కూడా అందదు. “తుఫాను’ అని రాస్తే అది యూరోపియన్ పాఠకుడికి ఒకలా, ఇతరులకి ఇంకోలా స్ఫురిస్తుంది. అలాగే “వాన” అనే ఒక్క మాట – ఆకాశం విచ్చిపోయి, జలపాతంలా నేలకి దూకి, భూమిని నిలువునా ముంచెత్తటాన్ని చెప్పలేదు. వేడి నీటి ఆవిరి ఊటతో తెర్లుతున్న నదులూ, భూమిని ఎత్తి పడవేసే భీకర తుఫానూ, ఇళూ ఊళ్లే కాదు ఏకంగా మహా నగరాల్ని మాయం చేసే ఉప్పెనలూ, ఇవన్నీ కొత్తగా కనుక్కున్నవి కావు. మా లాటిన్ అమెరికన్ పర్యావరణంలోని నిత్యకృత్యాలు.

ప్ర: అందువల్ల నువ్వు మనదైన వాస్తవికలోంచి కల్పితాల్నీ, ఇంద్రజాలాన్నీ, విపరీతాల్ని తీసుకున్నానంటావు. భాష దగ్గరకి వద్దాం. One Hundred Years .నవలలో పదజాలం ఘాటుగా, సారవంతంగా, మెరుపుల్లాంటి విన్యాసాలతో నిండి ఉంటుంది. ఆ భాషనీ ఇతర పుస్తకాల్లో ఆట్టే కన్పించదు. ఎందుకని?

ఇలా అంటే స్వాతిశయంగా ఉంటుందేమో కానీ, ఆ స్థాయిలో నేను ఏ నవలనయినా రాయగలను. కానీ వాటికి ఆ భాష అవసరం లేదు. అందుకే అవి వేరుగా ఉంటాయి.

ప్ర: ఇదెలా ఉందంటే రచయిత రోజుకో చొక్కాని మార్చినట్టు, ప్రతి పుస్తకానికీ ఒక్కో రకమైన భాష వాడుకోవచ్చు అన్నట్లుంది. భాష రచయిత అస్తిత్వంలో ఒక భాగం కాదా?

కాదు. రచయిత కాదు భాషని నిర్దేశించేది. వస్తువు తనకవసరమైన భాషను శిల్పాన్నీ ఎంచుకుంటుంది. అందుకే In EVIL HOUR లాంటి నా రచనలు సూటిగా పత్రికా విలేఖరి పద్ధతిలో ఉంటాయి. One Hundred Years నవలకి శైలీ, శిల్పం సంపద్వంతంగా ఉండాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే, అది కల్పనాత్మక ఇంద్రజాలిక వాస్తవికతను చిత్రించాలి కనుక – భాష కూడా అలానే ఉండాలి.

ప్ర: Autumn of the Patriarch నవలలో భాష గురించీ?

అదే చెప్తున్నాను. One Hundred Years. నవలకి పూర్తిగా భిన్నమైన భాష, శైలి ఆ పుస్తకానికవసరం. అందుకే అది ఇంకోలాగా రాసాను.

ప్ర: ఆ పుస్తకం మొత్తం ఒక సుదీర్ఘ వచన కవితలా ఉంటుంది. దానిపైన నువ్వు చదివిన కవిత్వ ప్రభావం ఉందా?

కవిత్వ ప్రభావం అంతగా లేదు. సంగీతంలోంచి అది వచ్చింది. నా జీవితం మొత్తంలో విననంత సంగీతం ఆ పుస్తకం రాసేప్పుడు విన్నాను.

ప్ర: ఎవరి సంగీతం?

బెల్ బార్టక్ లాంటి వాళ్లతో కలిపి అరేబియన్ దేశాల్లో వినపడే అనేక పాపులర్ ఆల్బమ్స్, ఆ రెండు భిన్నమైన సంగీత ధోరణులూ కలసి ఒక పేలుడు లాంటి శిల్పం తయారయింది.

ప్ర: ఆ పుస్తకంలోని వ్యంగ్యం, నుడికారం, పదజాలం అక్కడి రోజు వారి వాడుకలోనివన్నావు?

అవును, నా అన్ని పుస్తకాలలోకీ ఆ నవలలోనే ఎక్కువ మౌఖికత ఉంటుంది. కరీబియన్ ప్రజల కథలూ, పాటలూ, భావ ప్రకటనలూ ఉంటాయి. బారాంక్విలా లోని టాక్సీ డ్రైవర్కి మాత్రమే అర్థమయ్యే పదజాలం ఉంటుంది.

ప్ర: ఒకసారి వెనుదిరిగి చూసుకుంటే నీ తొలి రచనలు ఇప్పుడెలా అనిపిస్తాయి?

పిల్లలు పెద్దవాళ్లయి ఇల్లు వదిలి వెళ్లినప్పుడు తండ్రికి కలిగే భావంలా. సుదూర తీరాన అసహాయంగా తిరుగుతూ ఆత్మరక్షణ తెలీని పిల్లల్లా అన్పిస్తాయి.

ప్ర: ఆ తొలి రచనలకీ – నిన్ను ప్రపంచ ప్రసిద్ధ రచయితను చేసిన తర్వాతి పుస్తకాలకీ మధ్య ఏదయినా ఏక సూత్రత ఉందా?

తప్పకుండా ఉంది. దాన్ని ఇంకా భద్రంగా నిలపాలని నాకన్పిస్తుంది.

ప్ర: నీ రచనలలో అన్నిటికన్నా ముఖ్యమయినది ఏది?

సాహిత్య కోణంలోంచి చూస్తే Autumn Of The Patriarch. అది నన్ను మరుగున పడిపోకుండా నిలబెట్టింది.

ప్ర: అది రాసినప్పుడు చాలా సంతృప్తి కలిగిందన్నారు?

అవును. ఎలా రాయాలని ఎప్పుడూ కోరుకుంటానో అలాగే రాసిన పుస్తకం అది. నా స్వంత పశ్చాత్తాపాలూ ఉంటాయి అందులో.

ప్ర: అది రాయటానికి చాలా కాలం పట్టినట్టుంది?

అవును. పదిహేడు సంవత్సరాలు. రెండుసార్లు మొత్తం నవలని తిరగరాశాను. మూడోసారి మళ్లీ రాశాక అచ్చు వేశాను.

ప్ర; అయితే అది నీ అత్యుత్తమ రచన అనుకోవచ్చా?

Chronicles of a Death Foretold రాసేదాకా No One Writes to the Colonel నా ఉత్తమ రచన అనుకునేవాడిని. దాన్ని కూడా తొమ్మిది సార్లు తిరగరాశాను.

ప్ర; అయితే Chronicles నవల మంచి నవల అంటావు? ఎలాగో చెప్పు?

మొదటిసారిగా రచయితగా ఎలా రాయాలనుకున్నానో అలాగే రాసిన నవల అది. అంతకుముందు నా రచనల్లో కథో పాత్రలో రచయిత మీద పెత్తనం చేసి పుస్తకాన్ని వాటి దారిలో లాక్కుపోయేవి. ఆ పుస్తకం దానికి మినహాయింపు.

ప్ర; కథకూ పాత్రలకూ స్వేచ్ఛనివ్వటం ఉత్తమ సాహిత్య లక్షణంగా చెప్తారు కదా పండితులు?

అది ఉత్తమ లక్షణం కాదు. ఆ పుస్తకాన్ని నేననుకున్న పద్ధతిలోనే రాయాల్సిన అవసరం కలిగింది. ఆ కథా వస్తువుకి డిటెక్టివ్ కథా నిర్మాణం మాత్రమే సరిపోతుంది. అది అలాగే రాశాను.

ప్ర: ప్రపంచ సాహిత్య విమర్శకులంతా One Hundred Years Of Solitude నవలని తిరుగులేని ఉత్తమ రచనగా పరిగణిస్తుంటారు. నువ్వుమాత్రం ఎక్కడా దాని గురించి గొప్పగా చెప్పుకోలేదు. అదంటే నీకంతగా ఇష్టం ఉన్నట్లు లేదు.

అవును. ఇష్టంలేదు. అది నా జీవితాన్ని నాశనం చేసింది. అది అచ్చయ్యాక అంతకు ముందటి నా జీవితాన్ని కోల్పోయాను.

ప్ర: ఎలా?

అది తెచ్చిన పేరు ప్రఖ్యాతులు. అవి వచ్చాక వాస్తవికతను గ్రహించే సున్నితత్వం పోతుంది. అధికారం చేజిక్కించుకోవటం వల్ల కూడా అదే జరుగుతుంది. దానికయ్యే ఖర్చు స్వంత జీవితాన్ని పణంగా పెట్టటం. అది అనుభవంలోకి వస్తే కానీ అర్థం కాదు.

ప్ర: ఆ నవలకి దక్కిన బ్రహ్మాండమయిన విజయం న్యాయం కాదంటావు?

అవును. న్యాయం కాదు. దానికన్నాAutumn Of the Patriarch ముఖ్యమయినది. అది అధికారం వల్ల వచ్చే ఏకాంతం గురించినది. శిఖరాగ్రాన నిలబడిన వాడికి మాత్రమే కనబడే బూడిద రంగు మబ్బులూ… శూన్యం…
One Hundred Years నవలలోని వస్తువు అందరి జీవితాల్నీవెంటాడే ఏకాంతం. నా దృష్టిలో అది సాపుగా, సరళంగా, మెరుగులద్ది రాసిన నవల. సంక్లిష్టత లేదు.

ప్ర: ఆ నవలని తిరస్కరిస్తున్నావా?

లేదు, కాని లోకంలో ఉండే చమక్కులూ, అలంకారాలూ అన్నీ కలగలిపి అది రాస్తున్నప్పుడే నాకు తెలుసు.

ప్ర: ఏమని?

అంతకంటే బాగా రాయగలనని. దాన్ని మించి రాయగలనని.

**** (*) ****